రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, జూన్ 2021, సోమవారం

1047 : సందేహాలు - సమాధానాలు


Q : మాములుగా ఎలాంటి థ్రిల్లర్ సినిమాలలో అయినా హీరో పోలీసుగా, లేదా బాగా తెలివి గల వాడుగా ఉంటాడు. సో హీరో తన తెలివితో కేసు సాల్వ్ చేస్తాడు. ఇక మరొక వైపు విలన్ కూడా సైకో కిల్లర్ లేదా బాగా కన్నింగ్. పూర్తి విలన్ లక్షణాలతో ఉంటాడు. అలాగే చాలాసార్లు విలన్ ఒక మానసిక రుగ్మతతో కూడా క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అసలు ఇలా కాకుండా హీరో ఒక మాములు తెలివి తేటలున్న సాధారణ యువకుడై, అలాగే క్రైం చేసిన విలన్ కూడా తెలివి తేటల్లేని సాధారణ యువకుడై వుంటే, వీళ్ళ ఇద్దరి పాత్రలతో క్రైం థ్రిల్లర్స్ చేయలేమా?  అసలు థ్రిల్లర్స్ లేదా ఇన్వెస్టిగేషన్ కథలకి కచ్చితంగా హై పాయింట్ కథలే ఉండాలా? స్లో బర్నింగ్ లాంటి కథలు చేసుకోలేమా? వివరంగా చెప్పండి.

కె. రాజేష్, అసోసియేట్

A : చేసుకోవచ్చు. ఇప్పుడున్న ట్రెండ్ లో ఏమైనా చేసుకోవచ్చు. బెంగాలీలు మలయాళీలూ ఎప్పట్నించో చేస్తున్నారు. ఇప్పుడైనా వాళ్ళ బాట పట్టడం నేర్చుకోవాలి. వీటితో బాటు ఫిలిం నోయర్ సినిమాలున్నాయి. మన దేశంలో క్రైం సినిమాలతో బెంగాలీలు ఎక్కువ ముందున్నారు. అది ఇంటింటా సత్యజిత్ రే వేసిన బాట. మనం మలయాళం తప్ప బెంగాలీ సినిమాలసలే చూడంగా. మమతా బెనర్జీ తొడపాశం పెట్టినా చూడం. ఇలా ఒకలాటి మూసలో బతుకుతూ మూస కాని సినిమాలెలా తీస్తాం. జానర్ స్టడీ లేకుండా సరైన కథలు ఆలోచించలేరు. అపర మేధావి హీరో, అపార తెలివున్న విలన్ - లాంటి పాత్రలతో సినిమా చరిత్ర సమస్తం నిండిపోయింది. ఇవి కృత్రిమ ఫార్ముల్లా కథలు. వాస్తవంలో జరగని పలాయనవాద మూస కథలు. చూసి చూసి విసుగెత్తి వుంటుంది ప్రేక్షకులకి.

        మూసకీ వాస్తవికతకీ తేడా పసిగట్టక పోతే చిన్న సినిమాకిప్పుడు బ్రతుకు లేదు. చిన్న సినిమాలకిక మూస కథల మోజు మనసులోంచి తీసేయాలి. మూసకీ వాస్తవికతకీ జానర్ తేడాలు స్పష్టంగా తెలుసుకున్న నాడే చిన్న సినిమాలకి కొత్త జీవితం లభిస్తుంది. అంతవరకూ ఇంకా చావుబ్రతుకుల సమస్యే. ఆలోచనల్లో ఈ మార్పు నిర్మాతల్లో కూడా రావాలి, నాల్గు డబ్బులు కళ్ళ జూడాలనుకుంటే. నిర్మాతలు పాత కాలంలోనే వుండడంతో ఈ సంవత్సర కాలంగా కనీసం మనకు తెలిసి ఇలాటి పది స్క్రిప్టులు అలా పడి వున్నాయి. వాటిని మూసలోకి మార్చమంటారు. మార్చడానికి యంగ్ మేకర్లు సిద్ధంగా లేరు. ఒక యంగ్ మేకర్ అవకాశాల కోసం దారుణ మసాలా కథగా మార్చేస్తే, మందలించి మాన్పించాం.  

        కనుక వాస్తవిక, రియలిస్టిక్ కథలతో  ప్రేక్షకులతో ఏ పేచీ లేదు, నిర్మాతల అభిరుచులతోనే పేచీ. సినిమా అనేది నిర్మాతల కోసమా ప్రేక్షకుల మార్కెట్ కోసమా  తేల్చుకుంటే గానీ ఈ చిక్కు విడిపోదుప్రేక్షకులు పగటి వేషగాళ్ళు కాదు.

        పగలంతా పడ్డ కష్టం మర్చిపోవడానికి ప్రేక్షకులు పలాయన వాద ఫార్ములా సినిమాలు చూశారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనల్లో మార్పు వచ్చింది. ప్రస్తుత మహమ్మారి సృష్టించిన ఆర్ధికారోగ్య విలయంతో ప్రజలు అంతర్ముఖీనంగా మారుతున్నారు. జీవితం ఏమిటీ అని ప్రశ్నించుకుంటున్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా. న్యూయార్క్ టైమ్స్ లో ఎనిమిదేళ్ళ బాలిక తన వేదన రాసుకొచ్చింది. కేరళ నుంచి పదేళ్ళ బాలిక సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ప్రతీ వొక్కళ్ళూ అంతర్ముఖీనులవుతున్నారు. ఇంత కాలం బాహ్యంగా జీవించారు. ఇప్పుడు అంతరంగంలోకి చూసుకుంటున్నారు. సబ్ కాన్షస్ మైండ్ తో కనెక్ట్ అయి ఆలోచనాత్మకంగా మారుతున్నారు. త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో మిడిల్ అంటే సబ్ కాన్షస్ మైండే. ఇంతకాలం మిడిల్ తో పలాయనవాద సినిమాలు ఎంజాయ్ చేశాం. ఇప్పుడు దాని మౌలిక స్వరూపం ఆలోచనాత్మక సినిమాలతో ప్రజల తృష్ణ తీర్చడం అవసరం.

        చుట్టూ జీవితంలో కన్పించే మనుషుల్ని తెర మీద చూడాలనుకుంటున్నారు సహజ చిత్రీకరణలతో. తెలివి లేని హీరో, అంతే తెలివిలేని విలన్ నిజ జీవితపు పాత్రలు. పోలీసులు, గూఢచారులు వంటి వాళ్ళకున్న తెలివి తేటలు సామాన్యులకుండవు. అలాటి ఒక తెలివి లేని సామాన్య హీరో, అసలు తెలివంటూ లేని విలన్ లాంటి ఐడియాలతో కచ్ఛితంగా చిన్న సినిమా కథలు చేసుకోవచ్చు. కాకపోతే రియలిస్టిక్ అని అడ్డగోలుగా చేసుకోకుండా స్ట్రక్చర్లో చేసుకోవాలి. రియలిస్టిక్ కి సహజ కథ ఎంత ముఖ్యమో, సహజ పాత్ర చిత్రణలు అంతే ముఖ్యం. ముందు జానర్ స్టడీ, రీసెర్చి  చాలా అవసరం.

Q : సాధారణంగా లవ్ స్టొరీ లలో హీరో హీరోయిన్ పాత్రలకు పెద్దగా గోల్స్ ఉండవు. కేవలం ఎదుటి వారి ప్రేమను గెలుచు కోవడమే వాళ్ళ గోల్ గా ఉంటుంది. అలా కాకుండా ఈ ఫార్మాట్ ను బ్రేక్ చేస్తూ లవ్ లను కొత్తగా ఎలా చేసుకోవాలి?
ఎస్. వినుకొండ, అసోసియేట్

A :  యువతీ యువకుల మనస్తత్వాల్ని తెలుసుకోవాలి. ఒకరు ప్రేమంటే ఆర్ధిక
సమానత్వమంటే, ఇంకొకరు అవసరాలంటారు. ఇలా చాలా నిర్వచనాలుంటాయి. రాడికల్ ప్రేమలు చాలా వున్నాయి బయట.  వాటిని ప్రతిబింబింప జేసే కథలే నమ్మదగ్గ నిజమైన ప్రేమ కథలవుతాయి. యువతరం కనెక్ట్ అయ్యే కథలవుతాయి. కానీ ఏం జరుగుతోంది- అయితే అపార్ధాలతో విడిపోయే, కాకపోతే ప్రేమని వెల్లడించలేక పోయే - ఈ రెండే టెంప్లెట్స్ లో పెట్టి గత రెండు దశాబ్దాలుగా ప్రేమ సినిమాల పేరుతో కాకమ్మ కథలు అమ్మ జూస్తున్నారు. ఇప్పుడు మారాలంటే మారుతారా. మారరుగాక మారారు. ఫెయిల్డ్ ఫార్ములాగా తమకు తెలిసిన ఈ లొట్టపీసు చాక్ పీస్ ప్రేమలే తీస్తూంటారు.  

        ప్రేమల గుట్టుని ఎప్పుడో 1952 లో ప్రసిద్ధ హిందీ రచయిత, ధరమ్ వీర్ భారతి విప్పి చెప్పాడు. శరత్ దేవదాసు కథ డొల్ల తనాన్ని కూడా స్పష్టం చేసే విధంగా నవల రాశాడు. దేవదాసు కథ సామాజికార్ధిక మూలాల్లోంచి ఉద్భవించకపోవడం వల్ల ఆ కాలానికి అది సరి తూగలేదని తేలుస్తాడు. దేవదాసులాగా పునాదిలేని ఉత్త ప్రేమలని గాక, సామాజికార్ధిక కారణాలు కలగలిసిన ప్రేమల్ని ఆయన స్థాపిస్తాడు. సాహసం, పరిపక్వత లేని ప్రేమలు విఫలమవుతాయని చెప్తాడు. ప్రేమలు కావాలన్నా, పోవాలన్నా సామాజికార్ధిక శక్తుల పైనే ఆధారపడి వుంటుందని విశ్లేషణ చేస్తాడు.

    ఆ నవల పేరు  సూరజ్ కా సాత్వా ఘోడా (సూర్యుడి సప్తాశ్వాల్లో ఏడో గుర్రం). దీన్ని 1992 లో శ్యామ్ బెనెగల్ ఇదే పేరుతో అద్భుతంగా తెరకెక్కించారు. 46 ప్రచురణలు పొంది ఇప్పటికీ విపరీతంగా అమ్ముడుపోతున్న నవల. 1999 లో ఇంగ్లీషు అనువాదం విడుదలైంది. యూట్యూబ్ లో నవలా పరిచయం ఇంకా పెడుతున్నారు. లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వుంటున్నాయి యువతరం ప్రేక్షకులతో. సినిమా తప్పక చూసి, వీలైతే నవల కూడా చదివి ప్రేమల వాస్తవ రూపం పట్ల అవగాహన పెంచుకుంటే మంచి కథలు చేసుకోవచ్చు.

Q : క్యారక్టర్ ఆర్క్ అంటారు. అంటే ఏమిటి? దాన్నెలా చూడాలి?
పవన్, అసోసియేట్

A :  తెలుగులో చెప్పాలంటే పాత్రోచిత చాపం. అంటే కథలో పాత్ర ప్రయాణంలో ఏర్పడే ఉత్థాన పతనాల గ్రాఫ్. పాత్ర ప్రయాణమంటే విలన్ని పిడి గుద్దులు నాల్గు సిక్స్ ప్యాక్ తో గుద్ది భౌతికంగా ఎదగడం కాదు. మానసిక ఎదుగుదల జరిగే ప్రయాణం. కథా ప్రయాణంలో మానసికంగా ఏం తెలుసుకున్నాడు, ఏం అనుభవించాడు, ఏం సంఘర్షించాడు వంటి ఎలిమెంట్స్ తో కూడిన జర్నీ. చివరికొచ్చేసి ఏం పొందాడు, లేదా కోల్పోయాడనేది ముగింపు. క్యారక్టర్ ఆర్క్స్ మూడు రకాలుగా వుంటాయి కథని బట్టి. మానసిక పరివర్తన, ఎదుగుదల, పతనం.  

సికిందర్