రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, డిసెంబర్ 2017, ఆదివారం

563 : టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు!

       బిగినింగ్ విభాగానికి – ఆ మాటకొస్తే మొత్తం స్క్రీన్ ప్లేలో కథకి -  ప్లాట్ పాయింట్ వన్ (పిపి-1) సీను అనేది  మూలస్థంభం లాంటిదని తెలిసిందే. ఈ మూలస్థంభం సీనుని ఆధారంగా చేసుకునే కథ ఇక్కడ్నించీ  ప్రారంభమవుతుందనీ, కథని ప్రారంభించేందుకు ఈ మూలస్థంభం సీనులో ఒక మలుపు వుంటుందనీ, ఈ మలుపులోనే కథలో చెప్పదల్చు కున్న పాయింటు లేదా సమస్య వ్యక్తమవుతుందనీ, దీన్ని సాధించడమే ప్రధానపాత్ర గోల్ అవుతుందనీ తెలిసిందే. ఇది బిగినింగ్ విభాగం ప్రారంభమైన సుమారు అరగంటకి రావొచ్చు. అరగంటకి కాకుండా మొదటి నిమిషంలోనే వచ్చేస్తే?
         
మొదటి నిమిషంలోనే కథలో పాయింటు, ప్రధాన పాత్ర గోల్ చెప్పేస్తే? ఎలా చెప్తారు? బిగినింగే ప్రారంభించకుండా, పాత్రలేమిటో తెలపకుండా కథెలా ప్రారంభిస్తారు? కనీసం ఓ పదినిమిషాలైనా బిగినింగ్ ని నడుపుతూ పాత్రల్ని పరిచయం చేసి, వాటిని సమస్యలో పడేసే ఘట్టాన్ని  సృష్టిస్తూ,  పిపి-1 ఇచ్చుకునే స్క్రీన్  ప్లేలు వుంటాయేమో గానీ (దొంగాట, చక్కిలిగింత),  ఏకంగా పిపి-1 సీనుతోనే స్క్రీన్ ప్లే ప్రారంభించడమనేది ఎప్పుడోగానీ జరగదు. ‘అర్జున్’ లో జరిగింది. మహేష్ బాబు కత్తి పట్టుకుని కూర్చునే పిపి-1 సీనుతో, దాని తాలూకు ఫైట్ తో. ఇది ముగిశాక, అసలేం జరిగి ఈ ఫైట్ వచ్చిందో తెలిపేందుకు బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది వెనక్కి వెళ్తూ ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో. ఇది గంటా ఇరవై  నిమిషాల దాకా సాగి అప్పుడు ప్రారంభంలో చూపించిన పిపి-1 సీను దగ్గర వచ్చి కలుస్తుంది.

          అంటే పిపి-1 తో స్క్రీన్ ప్లే ప్రారంభించాలంటే బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పక తప్పదన్న మాట. ఇది చాలా నయం. ఎందుకంటే, దీని తర్వాత మిడిల్ విభాగం వుండాల్సిన నిడివితోనే వుండి దాని నిర్వహణ కష్టం కాదు. మిడిల్ బారుగా రెండింతలు పెరిగిపోయి సాగితేనే నిర్వహణ కష్టమై తేలిపోతుంది. 

          ఇలా పిపి -1 తో ప్రారంభించకుండా,  పైన చెప్పుకున్నట్టు ఓ పదినిమిషాల్లో బిగినింగ్ ని ముగించి,  పిపి-1 కొస్తేనే మిడిల్ కష్టమవుతుంది. ‘చక్కిలిగింత’ లో చేసిన  పొరపాటు ఇదే. మొదటి పది నిమిషాల్లోనే  పాయింటు కొచ్చేసి (పిపి-1),  మిడిల్ ప్రారంభిస్తే ఇంటర్వెల్ కల్లా చెప్పాల్సిన కథ పూర్తయిపోయింది.  దీంతో ఫస్టాఫ్ లో మొదలెట్టి ఇలా అవగొట్టిన పిపి-1 కి,  సెకండాఫ్ లో ఇంకేదో పాయింటు జోడించారు.  దీంతో  సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి   మొత్తం కథే గందరగోళమైంది. 

          ఓ గంట నిడివితో నిర్వహణ సుసాధ్యమయ్యే మిడిల్ ని రెండు గంటలు సాగదీసుకుంటే ఇదీ జరుగవచ్చు.  పదినిమిషాల్లో పిపి-1 అనేది హాలీవుడ్ సినిమాలకి, అదీ గంటన్నర సినిమాలకీ  పనికొస్తుంది. ఇప్పుడు హాలీవుడ్  సినిమాలు కూడా రెండు గంటలకి తక్కువ రావడం లేదు. ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’  రెండు గంటల నిడివిగల సినిమాకి,  పిపి-1 పది నిమిషాల్లో  రాదు, మన సినిమాల్లాగే ముప్పావు గంట కొస్తుంది.  

          ఈ తేడా గమనించాలి : స్క్రీన్ ప్లేని పిపి – 1 సీనుతో ప్రారంభిస్తే, దీని కొనసాగింపుగా  చెప్పాల్సింది ఓ అరగంట బిగినింగ్ విభాగమే, అదీ ఫ్లాష్ బ్యాకులో. ఈ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మొదలు పెట్టిన పిపి – 1 దగ్గరికే వచ్చి ముగుస్తుంది. అదే స్క్రీన్ ప్లేని నేరుగా బిగినింగ్ తో ప్రారంభించి, ఓ పది నిమిషాల్లో పిపి – 1 కొచ్చి ముగిస్తే, ఆపైన కొనసాగించాల్సింది  చాలా బారుగా  సాగే రెండు గంటల మిడిల్ ని! మొదటిది సులభం, ఈ రెండోది చాలా కష్టం. 

          పిపి – 1 ఎప్పుడూ స్క్రీన్ ప్లేకి, అందులోని కథకి ముఖచిత్రం లాంటిది. స్క్రీన్ ప్లేలో పిపి – 1 ని ఎప్పుడు ప్రారంభించినా, దాని  ప్రాధాన్యాన్ని ఇలా గుర్తించగల్గి నప్పుడే స్క్రీన్ ప్లే, అందులోని కథా సచిత్రంగా వుంటాయి, లేకపోతే  విచిత్రంగా వుంటాయి. 

      ఐతే మళ్ళీ ఇలా పిపి – 1 తో స్క్రీన్ ప్లేని ప్రారంభించడంలో రెండు రకాలున్నాయి. ఉదాహరణకి పైన చెప్పుకున్న ‘అర్జున్’ నే తీసుకుంటే, ఈ  పిపి – 1 తో ప్రారంభం కత్తి పట్టుకుని కూర్చున్న మహేష్ బాబు తో యాక్షన్ కి సిద్ధమైన పరిస్థితితో  వుంది. దేనికి యాక్షన్, మహేష్ బాబుకేం జరిగింది, మనకి తెలియకుండా వుంది. ఈ సీను కొనసాగి, ఫైటింగ్ జరిగి, ఫ్లాష్ బ్యాక్ మొదలై, ఆ బిగినింగ్ అంతా గంటకి పైగా నడిస్తేగానీ మనకి అర్ధంగాదు - పిపి – 1 దగ్గర ఏర్పడ్డ పరిస్థితి ఏమిటో. అంటే ఇది ముఖచిత్రమే గానీ పూర్తి ముఖచిత్రం కాదు. వివరాలకు లోపలి పేజీల్లో చూడండి అన్నట్టు వుంది. ఇలా ఈ పిపి – 1 తో స్క్రీన్ ప్లే ప్రారంభంలోనే మనకి సమస్యేమిటో తెలీదు, దాంతో మహేష్ బాబు గోల్ ఏమిటో తెలీదు, దీంతో కథేమిటో తెలీదు. కేవలం సస్పెన్స్ ని క్రియేట్ చేయడం కోసం తప్ప మరో ప్రయోజనం దీనికుండదు. ఈ సస్పెన్స్ కూడా విషయం తెలీని సస్పెన్సే. అందుకని ఇది పూర్తి  ముఖచిత్రం అన్పించుకోదు. 

          ఇక రెండో రకం చూద్దాం : పిపి – 1 సీనుతో స్క్రీన్ ప్లే మొదటి నిమిషం లోనే హీరోయిన్ చచ్చిపడి వుండి  కన్పిస్తే?  హీరో ఉద్రేకంగానో, విషాదంగానో ఆమెని చూస్తూంటే? అప్పుడెలా వుంటుంది? పిపి – 1 సీను పరిపూర్ణంగా ముగిసి వుంటుంది. ఇంకా ఈ సీనులో చెప్పడానికి బ్యాలెన్సు ఏమీ లేదు. సమస్య ఇదీ అనీ,  హీరో గోల్ ఇక ఆ చంపిన వాణ్ణి పట్టుకోవడమేననీ,  ఇదీ కథా అనీ, ఈ ఒక్క షాట్ తో  మనకి మొత్తమంతా అర్ధమైపోతోంది. అందువల్ల ఇది సంపూర్ణ ముఖచిత్రం అవుతుంది -  స్క్రీన్ ప్లేకీ, అందులో పాలు పంచుకునే కథకీ.

          సినిమాకి ఓపెనింగ్ ఇమేజి అనేది, లేదా ఓపెనింగ్ టీజర్ అనేది హాలీవుడ్ వాళ్ళు అనుసరిస్తున్న పధ్ధతి. (ఇక్కడ క్లిక్ చేయండి) హీరోయిన్ చచ్చి పడి వుండి కన్పించే దృశ్యమంత బలమైన ఓపెనింగ్ ఇమేజి, లేదా ఓపెనింగ్ టీజర్ ఏముంటుంది? (ఇక్కడ క్లిక్ చేయండి) నిజమే, ముందే హీరోయిన్ ని చంపి చూపిస్తే ఆతర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రోమాంటిక్ సీన్స్ ని ఏం  ఎంజాయ్ చేస్తాం, ఎలాగూ  చచ్చిపోయేదే అని తెలిశాక మనం ఎంజాయ్ చేయలేమనుకోవడం కరక్టే. అందుకని ఈ రకమైన పిపి – 1 తో సినిమా ప్రారంభం బెడిసి కొడుతుందని సందేహం రావడమూ  కరెక్టే. 

          మళ్ళీ ఇక్కడ రెండున్నాయి :  హీరోయిన్ డెడ్ బాడీని మాత్రమే చూపించడం, హీరోయిన్ ని చంపుతున్నప్పుడు చూపించడం.  ఈ రెండోది చూపిస్తే పైన  అనుకున్నట్టు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రోమాన్స్ ని ఎంజాయ్ చేయడం కష్టమే కావచ్చు. మొదటిది చూపిస్తే, కేవలం ఆ డెడ్ బాడీతో అంత జుగుప్సాకర ఫీలింగ్ ఏర్పడదు. 

       ‘ఏక్ విలన్’ (2014)  అనే హిందీలో హీరోయిన్  శ్రద్ధాకపూర్ ని దారుణంగా చంపి బిల్డింగ్ పై నుంచి విసిరేసే బీభత్సం వుంటుంది. ఇది పిపి -1 తో చేసిన స్క్రీన్ ప్లే ప్రారంభం. ఇది పూర్తి ముఖచిత్రమే గానీ,  మరీ గ్రాఫికల్ గా వుండేసరికి-  ఆమెతో ఈ బీభత్సం మనసులో ముద్రేసుకుని,  ఆతర్వాత ఫ్లాష్ బ్యాక్ ఆస్వాదన కష్టమే అవుతుంది. ఇది రాంగ్ ఓపెనింగ్. దీనిగురించే  సందేహపడాలి.

          ఇలాకాక, కేవలం హీరోయిన్ డెడ్  బాడీనే  చూపిస్తూ,  పిపి- 1 తో ప్రారంభమయ్యేదే ‘బ్రిక్’  స్క్రీన్ ప్లే!  ఫీల్ చెడకుండా కథేమిటో ఈ ఒక్క ఓపెనింగ్ ఇమేజితో –పరిపూర్ణ ముఖచిత్రంతో చెప్పేశారు!

         
ఎందుకిలా చూపించాలి, ఇలా చూపిస్తే స్క్రీన్ ప్లేకి ఒనగూడిన ప్రయోజనమేమిటి అనే ప్రశ్నలకి సమాధాణాలు వన్ లైన్ ఆర్డర్ చూసుకుంటూ పోతే దొరుకుతాయి. అయితే టీనేజి నోయర్ కథల్ని ఇలాగే ప్రారంభించాలని లేదు. ఈ కథ ఇలా ప్రారంభించారంతే. బిగినింగ్ ని బట్టి, ఆ బిగినింగ్ కథనానికుండే  బలాబలాల్ని బట్టి ప్రారంభాలుండొచ్చు. అన్నిసార్లూ బిగినింగ్ కథనాలు బలంగానే రావాలని లేదు. రాకపోతే బలవంతంచేసి సీన్లు ఇరికించనే కూడదు. ఇరవై సీన్ల తర్వాత వచ్చే పిపి -1 సీను బిగినింగ్ కథనాన్ని డిసైడ్ చేస్తుంది. దానికనుగుణమైన సీన్లే పడతాయి తప్ప,  అవి బలహీనంగా వున్నాయని వేరే సీన్లు పడవు. ‘బ్రిక్’ లో బిగినింగ్ బలహీనతని జయించడానికే బలమైన పిపి -1 సీను ముఖచిత్రంగా వేసి, విషయం చెప్పేస్తూ  స్క్రీన్ ప్లే ప్రారంభించారని, ఈ క్రింద వన్ లైన్  ఆర్డర్ చూసుకుంటూ పోతే తెలుస్తుంది...

వన్ లైన్ ఆర్డర్ 
         1. సూపర్ మెయిన్ టైటిల్స్. 
          2. టనెల్ దగ్గర కూర్చుని ఎమిలీ శవాన్ని చూస్తూ బ్రెండన్.
          3. రెండు రోజుల క్రితమని టైటిల్ కార్డు.
          4. హై స్కూల్ లాకర్ రూంలో బ్రెండన్ కి చీటీ దొరకడం.
          5. చీటీ ప్రకారం ఫోన్ బూత్ కెళ్ళి ఎమిలీ కాల్ రిసీవ్ చేసుకోవడం, ఆమె తనని కాపాడమని కోరడం; టగ్, పిన్ అని సంకేతపదాలు చెప్పడం.
          6. బ్రెండన్ హై స్కూలో ఫ్రెండ్ బ్రయిన్ ని కలిసి ఎమిలీ ఆచూకీ గురించి అడగడం, తెలీదని బ్రయిన్ అనడం.
          7. తిరిగి లాకర్ తెర్చుకోవడం.
          8. జిమ్ వెనకాల బ్రెండన్ ఎమిలీ ఫోటో చూస్తూ కూర్చోవడం.
          9. స్కూలు విడిచిన విద్యార్థులు వెళ్ళిపోవడం.
          10. స్కూల్ థియేటర్లో బ్రెండన్ కారాని కలిసి ఎమిలీ గురించి అడిగితే  ఆమె చెప్పకపోవడం, డ్రెస్సింగ్ రూంలో బ్రెండన్ కి ఒక ఇన్విటేషన్ దొరకడం.
          11. తన రూంనుంచి బ్రెండన్ లారాకి కాల్ చేసి ఇన్విటేషన్ ప్రకారం పార్టీకి తనొస్తానంటే, ఆమె అడ్రసు చెప్పక పోవడం.
          12. పార్టీ జరిగే ప్లేస్ ని కనిపెట్టి బ్రెండన్ వెళ్లి లారాని పట్టుకోవడం, ఎమిలీ గురించి లారా తెలీదనడం, ఇప్పుడే వస్తానని వెళ్ళిన ఆమెని బ్రెండన్ ఫాలో అవడం.
          13. బయట ఒక నల్లటి ఆకారంతో లారా మాటాడుతోంటే బ్రెండన్ చూడ్డం, లారా తిరిగి వచ్చి డ్రింక్ తాగెయ్యడం.
          14. ఉదయం బ్రెండన్ డోడ్ ని కలిసి ఎమిలీ గురించి అడిగితే అతను కూడా తెలీదనడం. అతడి నేస్తాలు బ్రెండన్ తో తలపడడం, వాళ్ళని చిత్తు చేసి, లంచ్ దగ్గర తనని కలవమని ఎమిలీకి చెప్పమంటూ డోడ్ కి బ్రెండన్ సీరియస్ గా చెప్పడం.
          15. డోడ్ ని బ్రెండన్ ఫాలో అవడం, ఒక కారు దగ్గర ఆమెకి డోడ్ ఒక చీటీ అందించడం, వెళ్ళిపోతున్న ఆ కారువెంట బ్రెండన్ పడడం.
          16. స్కూలు థియేటర్ వరకూ బ్రెండన్ డోడ్ ని ఫాలో అవడం.
          17. స్కూలు వెనకాల లంచ్ చేస్తున్న బ్రెండన్ దగ్గరికి ఎమిలీ రావడం.
          18. ఏదో తొందర పడి నీకలా చెప్పాను, ఇప్పుడు ప్రమాదమేమీలేదు, నువ్వేం వర్రీ అవకని బ్రెండన్ తో ఎమిలీ అనడం, ఇలా డోడ్ చెప్పమన్నాడా అంటే, నువ్విలా ఆలోచిస్తావనే నీకు బ్రేకప్ చెప్పానని ఆమె అనడం, కనీసం టగ్ ఏంటి,  పిన్ ఏంటి చెప్పమంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం, వెళ్ళిపోతూ అడ్రసు బుక్ పడేసుకోవడం.
          19. క్లాస్ రూంలో కూర్చుని బ్రెండన్ అడ్రసు బుక్ చూస్తూంటే, అందులో డోడ్ ఆమెకిచ్చిన చీటీ కన్పించడం, ఆ చీటీమీదున్న సింబల్ కేసే బ్రెండన్ తీక్షణంగా చూడడం.
          20. బ్రయిన్ కి సింబల్ చూపించి బ్రెండన్ అడిగితే, అతను చెప్పకపోవడం, ఎమిలీ ఇక జోక్యం చేసుకోవద్దన్నప్పుడు వూరుకోవడమే బెటరనడం.
          21. ఆ సింబల్ నే చూస్తూ నిద్ర లోకి జారుకున్న బ్రెండన్ కి పీడకల రావడం.
          22. తెల్లారే బ్రెండన్ టనెల్ కేసి పరుగెత్తడం, అక్కడ ఎమిలీ శవాన్ని చూడడం
(pp - 1)

(సశేషం)

సికిందర్