రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, June 17, 2016

షార్ట్ రివ్యూ...





స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం : మోహనకృష్ణ ఇంద్రగంటి

తారాగణం : నాని, సురభి, నివేద థామస్, శ్రీనివాస్ అవసరాల, రోహిణి, ‘వెన్నెలకిశోర్, తనికెళ్ళభరణి, ‘సత్యంరాజేష్ తదితరులు
కథ : డేవిడ్ నాథన్, సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : పి.జి.విందా
బ్యానర్ : శ్రీదేవి మూవీస్, నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
విడుదల :  17 జూన్, 2016
                       ***
            ఎనిమిదేళ్ళ క్రితం ‘అష్టాచమ్మ’ లో నానిని పరిచయంచేసిన మోహనకృష్ణ ఇంద్రగంటి తిరిగి నానితో ‘జంటిల్ మన్’ అనే రోమాంటిక్ సస్పన్స్ జానర్ ని టచ్ చేయడం ఇద్దరికీ కొత్తే. ‘చిన్నోడు –పెద్దోడు’,  ‘ఆదిత్య -369’,  ‘వంశానికొక్కడు’, ‘మిత్రుడు’ వంటి సినిమాలు నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఎనిమిదేళ్ళ తర్వాత  ఈ రోమాంటిక్ కి సస్పెన్స్ ని నిర్మించడం తనకీ కొత్త జానరే.  ఖచ్చితంగా ఇలాటి స్క్రిప్టులు తెలుగు రచయితలూ దర్శకుల నుంచి రావు కాబట్టి ఇది డేవిడ్ నాథన్ అనే తమిళ రచయిత  అందించిన స్క్రిప్టు. ఇక చాలా కాలానికి సంగీత దర్శకుడు మణిశర్మ కూడా తన స్వరాలు విన్పించడానికి ముందుకురావడం ఈ సినిమా ఇంకో ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలు పెరుకే వున్నాయా, లేకపోతే సినిమా సక్సెస్ అవడానికి ఏమైనా పనికొచ్చాయా ఓసారి చూద్దాం...

కథ 
      కేథీ అలియాస్ కేథరిన్ (నివేదా థామస్), ఐశ్వర్య (సురభి) లు ఫ్లయిట్ లో హైదరాబాద్ వస్తూ పరిచయమవుతారు. ఇద్దరూ ఒకరి బాయ్ ఫ్రెండ్ గురించి ఒకరు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. ముందుగా కేథీ చెప్తుంది తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్  (నాని) గురించి. మొదటి చూపులోనే తన వెంట పడ్డం ప్రారంభించిన గౌతమ్ ప్రేమలో తనూ పడుతుంది. అయితే తనకో పెళ్లి చేసుకోమని వేధించే మేనమామ వుంటాడు. ఇతను  గౌతమ్ మీద కక్షగడతాడు. ఇక కేథీ గౌతమ్ లు గాఢంగా  ప్రేమించుకున్తున్నాక,  కంపెనీ పనిమీద కేథీ లండన్ వెళ్ళాల్సి  వస్తుంది. నెలరోజుల తర్వాత ఇప్పుడు  తిరిగి వస్తోంది- ఇక గౌతమ్ తో తన భావిజీవితం గురించి కలలుగంటోంది... 

        ఐశ్వర్య  తన బాయ్ గ్రెండ్ జై (నాని ద్విపాత్రాభినయం) గురించి చెప్పుకొస్తూ, అతనో పెద్ద కంపనీకి అధిపతి అనీ, తన తండ్రి అతడితో సంబంధం కుదిర్చాడనీ, దీన్ని పురస్కరించుకుని తామిద్దరూ కొడైకెనాల్ వెళ్లి సరదాగా గడిపి వచ్చామనీ, ఇక ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాక ఎంగేజ్ మెంట్ చేసుకుంటామనీ అంటుంది... 

        ఇద్దరూ ఏర్ పోర్టులో దిగేసరికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన గౌతమ్ ని సంతోషంతో చూస్తుంది కేథీ. కానీ గౌతమ్ ఆమె ని గుర్తు పట్టనట్టు ఐశ్వర్యని పలకరిస్తాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా కలుసుకుంటారు. అసలేం జరిగిందో తెలుసుకోవడానికి కేథీ గౌతమ్ ఇంటి కెళ్తుంది.  గౌతమ్ తల్లి రోహిణి గౌతమ్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తుంది. కేథీ షాక్ అవుతుంది. అయితే తను ఐశ్వర్యతో చోసింది గౌతమ్ ని కాదనీ, అతను గౌతమ్ లాగే  జైయేననీ అర్ధం జేసుకుంటుంది. ఇంతలో ఒక రిపోర్టర్ వచ్చి గౌతమ్ ని జై చంపి వుంటాడని అనుమానం వెలిబుచ్చుతుంది. అసలు గౌతమ్ ఎలా చనిపోయాడో జై ని కేంద్రబిందువుగా  చేసుకుని ఇద్దరూ పరిశోధించడం ప్రారంభిస్తారు.

        గౌతమ్ ని జై చంపి వుంటే ఎందుకుచంపాడు, వంశీ అనే వాడి బ్లాక్ మెయిల్ కి లొంగి జై ఎందుకు డబ్బు సమర్పించుకుంటున్నాడు. మధ్యలో కేథీ మేనమామ పాత్రేంటి...అన్నవి ఈ పరిశోధనలో బయటపడతాయి...

ఎలావుంది కథ 
       ఫస్టాఫ్ రెండు సరదా ప్రేమ కథలు, సెకండాఫ్ సీరియస్ సస్పెన్స్ కథా వున్న రో మాంటిక్ సస్పెన్స్ ఇది. అయితే సెకండాఫ్ లో పూర్తిగా రోమాంటిక్ అప్పీల్ ని మిస్సవడంతో పేరుకే రోమాంటిక్ సస్పెన్స్ అనేట్టుంది. జై చేసిన హత్యని బయటపెట్టే దృష్టితో జరిగే సంఘటనలతో రోమాంటిక్ ఫీల్, వినోదం పాలు పూర్తిగా మృగ్యమయ్యాయి. 2002 లో అబ్బాస్ మస్తాన్ లు  అభయ్ డియోల్- అమీషా పటేల్- అక్షయ్ ఖన్నా లతో తీసిన రోమాంటిక్ థ్రిల్లర్  ‘హమ్ రాజ్’ కావలసినంత థ్రిల్  తోబాటు,  పెళ్ళయిన స్త్రీ సంసారం ప్రమాదంలో పడే బలమైన ఫ్యామిలీ ఎలిమెంట్ వుంది. దీన్ని ‘పర్ ఫెక్ట్ మర్డర్’ (1998) అనే హాలీవుడ్ హిట్  నుంచి కాపీ కొట్టారు. ఈ ‘పర్ ఫెక్ట్ మర్డర్’  కూడా 1954 లో ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ తీసిన ‘డయల్ ఎమ్ ఫర్ మర్డర్’ కి రీమేక్.  అంటే ప్పట్లో హిచ్ కాక్ తన సస్పెన్స్ లో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితం చేసిన మాస్టర్ అన్నమాట.

        రోమాంటిక్ సస్పెన్స్ అన్నాక జై ని కేథీ అనుమానించి పరిశోధిస్తే అతను  తన బాయ్  ఫ్రెండ్ కాదు కాబట్టి అది రివెంజి డ్రామా అవుతుంది. జై ని అతడి గర్ల్ ఫ్రెండ్ ఐశ్వర్యే అనుమానించి పరిశోదిస్తూంటే అప్పుడు అది అచ్చమైన బాయ్ ఫ్రెండ్- గర్ల్ ఫ్రెండ్ ల మద్య రోమాంటిక్ సస్పెన్స్ అన్పించుకుని ఎక్కువ బాక్సాఫీసు అప్పీలుకి దోహదం చేస్తుంది. అమితాబ్ బచ్చన్ ‘డాన్’ లో అమితాబే తన అన్నని చంపిన డాన్ అనుకుని  జీనత్ అమన్ పగబట్టడం, అమితాబ్ ఆమెని రోమాంటిక్ యాంగిల్లో చూడ్డం...ఇందులో అమితాబ్ అమాయకుడని ప్రేక్షులకి తెలుసు కాబట్టి ఆ రివెంజి డ్రామా పండింది.  కానీ ఇప్పుడున్న నాని రెండో పాత్ర హంతకుడే అన్న అనుమానం కల్గిస్తూ కథ నడిపించడంతో, ఇది ఎలాటి రోమాంటిక్ యాంగిల్ కూడా లేని రివెంజి డ్రామాగా – ఒక డ్రై మూవీగా  తయారయ్యింది. 

ఎవరెలా చేశారు
       రెండు పాత్రల్లో నాని మెప్పిస్తాడు, అయితే రెండో పాత్రతో బాటు సెకండాఫ్ అంతా  సీరియస్ అయిపోవడంతో ఆ మూడ్ లో నటనకి మాస్ అప్పీల్ సమస్య తలెత్తుతుంది. సెకండాఫ్ లో  తనతో ఎలాటి కమర్షియల్ ఎలిమెంట్సూ  కూడా లేకపోవడం పెద్ద లోపం. ఫస్టాఫ్ లో ఇద్దరు హీరోయిన్లతో వేర్వేరు లవ్ ట్రాక్స్ లో అతను  పాల్పడే చేష్టలు కొత్తగానే వుంటూ ప్రేక్షకుల మెప్పు పొందుతాయి. సెకండాఫ్ కొచ్చేసరికి నాని నుంచి ఇంకెలాటి  ఎంటర్ టైన్ మెంట్ నీ ఆశించే పరిస్థితి లేదు. ఇదంతా ఫస్ట్ హీరోయిన్ రివెంజి డ్రామా కావడం వల్ల వచ్చిన సమస్య.  పాత కాలంలో సినిమాలు చూసి ప్రేక్షకులు- ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్   స్టోరీ అనేవాళ్ళు. ఫస్టాఫ్ లో కామెడీ నంతా ఎంజాయ్ చేసి, ఇక సెకండాఫ్ లో ప్రారంభమయ్యే ఎంతటి సీరియెస్ కథనైనా ఇన్వాల్వ్ అయిపోయి చూసేవాళ్ళు. ఈ రోజుల్లో ఈ పరిస్థితి వుందా? ఇప్పుడు సినిమా సాంతం ఎంటర్ టైన్ మెంటే కావాలి!

        ఫస్ట్ హీరోయిన్ నివేదా  థామస్ ఫస్ట్ క్లాస్ గా వుంది. భావప్రకటనా సామర్ధ్యం పుష్కలంగా వుంది. అదే సెకండ్ హీరోయిన్ తో లేదు. రిపోర్టర్ గా నటించిన శ్రీముఖి ఇన్వెస్టిగేషన్ తక్కువగానూ, సమాచార మివ్వడం ఎక్కువగానూ వుంది. ఇక ఆఫీస్ కామెడీతో వెన్నెల కిషోర్- సత్యం రాజేష్ లు కొన్ని కొన్నిచోట్ల బాగానే నవ్విస్తారు. శ్రీనివాస్ అవసరాల విలన్ పాత్రలో ప్రశ్నార్ధకంగా ఉంటాడు. 

        సినిమాకి విందా ఛాయాగ్రహణం ఒకరకంగా వున్నా, మణిశర్మ సంగీతం మాత్రం హైలైట్ అనే చెప్పాలి. నేపధ్య సంగీతంతో బాటు,  ఫస్టాఫ్ లో వచ్చే రెండో పాట డ్రమ్ బీట్స్ తో  బాగా ఇంప్రెస్ చేస్తుంది. రవీందర్ కళాదర్శకత్వం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఓ మోస్తరుగా వున్నాయి. 

చివరికేమిటి 
      లైటర్ వీన్ కథల దర్శకుడు క్రితం సినిమా ‘బందిపోటు’ అనే మాస్ కమర్షియల్ దగ్గర చేతులెత్తేసినట్టే ఇప్పుడు సస్పన్స్ బిజినెస్ తో తికమక పడిపోయారు. ఈ సినిమాలో నటీనటుల నుంచి నటనల్ని రాబట్టుకోవడం, షాట్స్ తీయడం వగైరా వరకూ తను ఓకే. కానీ ఈ రోమాంటిక్ సస్పన్స్ కథ- దీని స్క్రీన్ ప్లేల  విషయంలో మాత్రం రాణించలేకపోయారు. సస్పెన్స్ అంతా  చివర్లో ఓపెన్ చేసి ఫ్లాష్ బ్యాక్ గా చెప్పుకు వచ్చే ఎండ్ సస్పెన్స్ విధానం ప్రింట్ మీడియాకే తప్ప,  సినిమా అనే విజువల్ మీడియాకి ఇక పనికి రాదని, ముప్పై ఏళ్ల క్రితమే హాలీవుడ్ తేల్చేసుకుని ఇక దాని జోలికి వెళ్ళడం లేదు. 

        మొన్నే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ అనే భారీ బడ్జెట్  సినిమా ఎండ్ సస్పెన్స్ కథతో వచ్చి ఏమైందో  తెలిసిందే. తెలుగు సినిమాల ప్రధాన  జాడ్యాలు మూడు- పాసివ్ హీరో పాత్ర, సెకండాఫ్ సిండ్రోమ్, ఎండ్ సస్పెన్స్- ఈ మూడూ పదేపదే రిపీటవుతూనే వున్నాయి- ఇలాగే తీస్తూ వుంటారు. ఇంద్రగంటి స్క్రీన్ ప్లేలో ఈ ఎండ్ సస్పెన్స్ లో కూడా అసలా జరిగిన మూల సంఘటన ఏమిటీ అన్నది చూపించే సరికి అదికూడా బలహీనంగా తేలిపోయింది. మొత్తం సస్పెన్స్ బిజినెస్ కి మూలమైన సంఘటనే  బలహీనంగా వున్నప్పుడు ఇక కథ బలంగా ఎలావస్తుంది. పైగా సెకండాఫ్ నిడివి కూడా బాగా పెరిగిపోయింది. ఇక చివరికొస్తే, ఫ్లాష్ బ్యాక్ లో చెప్పిన ప్రకారమైతే  హీరో  అరెస్టయి తన నిజాయితీ నిరూపించుకోవాలి. అప్పుడే జంటిల్ మన్ అని అన్పించుకో గలడు. అంతకాలం చట్టాన్ని ఏమార్చి,  పోలీసుల్ని తప్పుదోవపట్టించే సాక్ష్యాధారాలు సృష్టించి ఈ సస్పెన్స్ అంతా నడిపించాడు. ఆ పోలీసులు ఏమయ్యారు? అటూ ఇటూ కుటుంబ సభ్యులందరూ హీరో చేసింది గొప్ప అని మెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సరిపోయిందా? హీరో తల్లికూడా హీరోకి సహకరించింది కదా, ఆమెకూడా చట్టానికి లొంగి పోవాల్సిందే. 

        ఇది సమగ్రమమైన కథా చిత్రమన్పించుకోదు. ఇలాటి కథకి పరిపూర్ణమైన ముగింపు నివ్వడం సాధ్యంకాదు. ఇస్తే హీరో అతడి తల్లీ ముందు జైల్లో వుండాల్సిన ఖర్మ పడుతుంది.

-సికిందర్
http://www.cinemabazaar.in