‘అవకాశాల స్ట్రక్చర్ అరచేతిలోనే’ ఆర్టికల్స్ పరంపరకి బ్లాగులో స్పందన బాగానే లభిస్తోంది. అందరికీ ధన్యవాదాలు. ఒక బాగా తెలిసిన దర్శకుడు ఈ ఆర్టికల్స్ చదువుతూ తన పరిస్థితి చూసుకుని చాలా ఆందోళన చెందుతున్నారు. ఆయనకి ఎంత ప్రయత్నించినా అవకాశాలు రావడం లేదు. దీంతో ఆందోళన పెరిగిపోయి -ఈ ఆర్టికల్స్ ని స్టడీ చేసి ఎలాగైనా సాధించాలన్నఆదుర్దాతో ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే అసలుకే ఎసరొచ్చే పని జరిగిపోతోంది. ఆందోళన ఆదుర్దా వంటి నెగెటివ్ ఫీలింగ్స్ కి అవకాశాల స్ట్రక్చర్ నిఘంటువులో చోటు లేదు. అనుకున్నది వెంటనే జరిగిపోవాలని తొందరపెడితే అసలుకే పని చేయదు ఎల్ ఓ ఏ. పై పైన రాసేసి పైపైన సినిమాలు తీసేస్తున్నట్టు చేస్తే ఎల్ ఓ ఏ కూడా ఫ్లాపవుతుంది.
ఈ సైన్స్ పనిచేయాలంటే దీంట్లో రక్తమాంసాల్ని తెలుసుకోవాలి. ఈ సైన్స్ పని చేయాలంటే మానసికంగా సిద్ధమైతే చాలదు, శరీరం కూడా సిద్ధం కావాలి. మానసికంగా సిద్ధమయ్యాం కదా, ఇక త్వరగా జరిగిపోవాలని ఆందోళనా ఆదుర్దాలు పెంచుకుంటే - ఈ ఆందోళన, ఆదుర్దా అనే నెగెటివ్ ఫీలింగ్స్ శరీరంలో అణువణువునా చేరిపోయి - థర్డ్ బ్రెయిన్ అయిన గుండె మొరాయించేలా చేస్తాయి. గుండె అనుమతించని ఫీలింగ్స్ విద్యుదయస్కాంత క్షేత్రాన్నిసృష్టించవు. విశ్వంలో కలవవు. కేవలం మనసులోంచి వెలువడే విద్యుత్ క్షేత్రంతో నేలబారు వైబ్రేషన్స్ గా వుండి పోతా యి నెగెటివ్ ఫీలింగ్స్. అలా వుండి పోయి వూరుకోవు- నెగెటివ్ పరిస్థితుల్నే ఆకర్షిస్తాయి. ఇది కూడా లా ఆఫ్ ఎట్రాక్షనే. నెగెటివ్ కి నెగెటివ్, పాజిటివ్ కి పాజిటివ్ ఆకర్షించడం లా ఆఫ్ ఎట్రాక్షన్ పనే. కాబట్టి నెగెటివ్ ఫీలింగ్స్ తో జాగ్రత్తగా వుండాలి.
ఒక అసిస్టెంట్ కి నిర్మాత అప్పాయింట్ మెంట్ లభిస్తే వెళ్ళాడు కథ చెప్పడానికి. కథంతా విన్న నిర్మాత తలూపాడు. ఇక ఆ ప్రాసెస్ దాదాపు ఓకే అవుతున్నప్పుడు నిర్మాత ఆగిపోయి- కాస్త టైం తీసుకుంటానన్నాడు. అంతే, మళ్ళీ ఆయన్నుంచి కాల్ రాలేదు. కాల్స్ చేస్తే రెస్పాన్స్ లేదు. అవుతున్న పని కాకుండా పోయిందే అని బెంగ పెట్టుకున్నాడు అసిస్టెంట్. అసలు జరిగిందేమిటంటే, ఆ నిర్మాత దగ్గరికి వెళ్ళే ముందు బయట ఒకరితో కొట్లాట పెట్టుకుని ఆ కోపంతో వెళ్ళాడు. శరీరంలో నెగెటివ్ ఫీలింగ్స్ నింపుకుని, కార్టిసాల్ హార్మోను విడుదల చేసుకుంటూ వెళ్తే గుండె ఎందుకు సహకరిస్తుంది? ఆ నెగెటివ్ వైబ్రేషన్స్ నిర్మాత బ్రెయిన్ ని నెగెటివ్ గానే ఫీలయ్యేట్టు చేసి వుంటాయి- అసిస్టెంట్ అవకాశం కాస్తా చేజారిపోయింది. అదన్న మాట సంగతి, ఇంత సంక్లిష్టంగా వుంటుంది వెధవ జీవితం!
పురాతనంగా ఒక అసోసియేట్ అనుభవం- కొన్నేళ్ళ క్రితమే ఎల్ ఓ ఏ పాటిస్తున్నాడు. విదేశం నుంచి ఒక అవకాశం రానే వచ్చింది. అది కాస్తా ఎందుకో తెలియకుండా- ఆకాశ వీధిలో అందాల జాబిలీ అని పాడుకుంటూ మబ్బుల చాటు కెళ్ళిపోయి మళ్ళీ కనిపించలేదు. పైపైన పాటించే ఎల్ ఓ ఏ నిలబడదు. రక్త మంసాల్ని కూడా ఎలా ట్రీట్ చేస్తున్నామో తెలుసుకోవాలి. ఇదలా వుంచితే, ఎట్టి పరిస్థితిలో విశ్వం పట్ల అపార విశ్వాసం అవసరం. విశ్వాన్ని నమ్మి ఎల్ ఓ ఏ పాటిస్తే ఇంకెలాటి ఆందోళనా ఆదుర్దా వుండవు, తొందరపాటు తనం వుండదు. కొండంత విశ్వాసంతో ఎల్ ఓ ఏ పాటిస్తూ నింపాదిగా, నిలకడగా, ప్రశాంత జీవనం గడుపుతూంటే అన్నీ జరిగిపోతాయి. ఇంకోటేమిటంటే విశ్వం కోరుకున్నది ఇవ్వదు. ఆ మాట కొస్తే దేవుడు కూడా కోరుకున్నది ఇవ్వడు. ఫీలయ్యింది ఇస్తుంది విశ్వం. దర్శకుడు అవాలంటే ఆల్రెడీ దర్శకుడైనట్టు ఫీలవ్వాలి, దర్శకుడు అవ్వాలని కోరుకోవడం కాదు. కోరుకోవడం కొరతని సూచిస్తుంది. అంటే ఎల్ ఓ ఏ ప్రకారం కొరతనే తెచ్చి పెడుతూంటుంది. అదే దర్శకుడు అయిపోయినట్టు ఫీలయితే -ఈ ఫీలింగునే నరనరాన నింపుకుని జీవిస్తే- ఇతను దర్శకుడని ఫీలవుతున్నాడని, మరిన్ని మరిన్ని అవకాశాల్ని వెతికి అందిస్తుంది విశ్వం!
దర్శకత్వ అవకాశాల కోసం ఎల్ ఓ ఏలో భాగంగా యోగ్యత (క్వాలిఫికేషన్) గురించి, లక్ష్యం ఏర్పాటు (గోల్ సెట్టింగ్) గురించీ గత వ్యాసాల్లో తెలుసుకున్నాక, ఇప్పుడు విశ్వాసం ఎలా పని చేస్తుందో, ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్), కార్యాచరణ (యాక్షన్) లేమిటో తెలుసుకుందాం.
విశ్వాసం ఎలా పని చేస్తుంది?
మొత్తం ఎల్ ఏ ఓ కాన్సెప్ట్ కి ఆధారం విశ్వాసం. దేని గురించయితే గోల్ ని ఏర్పాటు చే సుకున్నామో అది జరుగుతుందని కాదు, జరిగిపోయినట్టే ఫీలవకపోతే పని చేయదు. జరుగుతుంది అనుకోవడం భవిష్యత్కాలానికి సంబంధించిన సంగతి. భవిష్యత్తులో జరుగుతుంది లేదా జరగాలని కోరుకోవడంగా ఇది వుంటుంది. అప్పుడు మన సబ్ కాన్షస్ మైండ్ భవిష్యత్తులో జరగాలట, ఇప్పుడు కాదట అని మిన్నకుంటుంది. కాలాలు మనం ఫీలవుతున్నాం సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల. సూర్యుడి చుట్టూ తిరుగుతూ సమయాల్ని గడియారాలు అమ్ముకోవడానికి గడియారాల కంపెనీలు కనిపెట్టాయని కార్ల్ మార్క్స్ చెప్పాడు. కానీ విశ్వానికి నిన్న (భూత కాలం), రేపు (భవిష్యత్ కాలం) లేవు. నేడు (వర్తమానం) మాత్రమే వుంది. ఆ నేడు స్తంభించి వుంటుంది ఎటూ కదలకుండా. కాబట్టి ఇది జరుగుతుంది, జరగాలి అన్న విన్నపాలు విశ్వం తీసుకోదు. జరిగిపోయినట్టు -జరిగిపోయిందని ఫీలవుతున్నట్టు తెలపాలి. నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని అన్న ఫీలింగ్స్ పంపాలి.ఇక్కడొక పేచీ వస్తుంది- మన కాన్షస్ మైండ్ దాంతో వుండే ఇగో, లాజికల్ గా వుంటాయి. సబ్ కాన్షస్ మైండ్ లాజిక్కులు పట్టించుకోకుండా ఎమోషనల్ గా వుంటుంది. పంచేంద్రియాలతో బయటి సమాచారాన్ని సేకరించే కాన్షస్ మైండ్, ఇగో- ఇవి ఏం చేస్తాయంటే- నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని అని ఫీలయితే - నువ్వు దర్శకుడివా, ఆల్రెడీ దర్శకుడివై పోయావా, ఏదీ ఎప్పుడయ్యావ్ -నువ్వింకా అసిస్టెంటు మాత్రుడివే, వాస్తవం తెలుసుకో - అని పకపకా నవ్వి, ఈ సజెషన్ సబ్ కాన్షస్ మైండ్ తీసుకోకుండా అడ్డు పడతాయి.
కాన్షస్ మైండ్, ఇగో రెండూ సబ్ కాన్షస్ మైండ్ కి ద్వారపాలకులు. వీటి అనుమతి లేనిది ఏ విషయమూ సబ్ కాన్షస్ లోకి వెళ్ళదు. అప్పుడు రెండే వుంటాయి- భాష మార్చాలి- నేను దర్శకుడ్ని అవుతున్నాను అనాలి. దీన్ని లాజికల్ గానే తీసుకుంటాయి ద్వారపాలకులు. దర్శకుడు అవుతున్నాడట, ప్రయత్నాలు చేసుకుంటున్నాడు వదిలేయ్- అని లాజిక్ ఫీలై ద్వారాలు తెరిచేస్తాయి. దర్శకుడ్ని అవుతున్నాను అనేది వర్తమాన కాలపు సజేషనే కాబట్టి విశ్వం కూడా అభ్యంతరం చెప్పదు.
లేదా రాత్రి నిద్రపోయేముందు పంచేంద్రియాలతో పాటే ద్వారపాలకులు అలసిపోయి పడుకుంటాయి- అప్పుడు సబ్ కాన్షస్ మైండ్ ఒక్కటే అవిరామంగా జీవితాంతం మేల్కొని వుంటుంది కాబట్టి - .నిద్రపోతూ నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని అనుకుంటే ఈజీగా సబ్ కాన్షస్ లోకి వెళ్ళిపోతుంది. అలాగే తెల్లారి కళ్ళు తెరవగానే మళ్ళీ అనుకోవాలి. అప్పటికింకా ద్వారపాలకులు డ్యూటీ ఎక్కవు. పంచేంద్రియాలు నిద్రమత్తు వదిలించుకుంటే తప్ప ఇవి డ్యూటీ ఎక్కవు.
ఈ ద్వారపాలకులు ఎప్పుడైనా అడ్డుపడకుండా వుండే రోజు కూడా వస్తుంది. మనం ఇచ్చే సజెషన్స్ సబ్ కాన్షస్ లో సింక్ అవ్వాలంటే 21 రోజులు సజెషన్స్ ఇవ్వాలి. పైన చెప్పుకున్నట్టు పగటి పూట -’నేను దర్శకుడ్ని అవుతున్నాను’ అనో, లేదా రాత్రి నిద్రపోతూ, మళ్ళీ తెల్లారి నిద్ర లేవగానే- ‘నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని’ అనో ద్వార పాలకులకి చిక్కకుండా 21 రోజులు సబ్ కాన్షస్ కి సజెషన్ ఇస్తే- అది సింక్ అయి- దాని మీద సబ్ కాన్షస్ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇంకా తర్వాత ‘నేను దర్శకుడ్ని, ఆల్రెడీ దర్శకుడ్ని’ అని ఏ వేళప్పుడు ఎన్ని సార్లు అనుకున్నా ద్వార పాలకులు ఏం పీకలేవు!
అనుకున్న గోల్ ఎల్ ఓ ఏ ద్వారా నిజమవుతుందన్న నమ్మకం సడలి, మొత్తానికే విరమించుకోవడానికి కారణం - సజెషన్స్ ఇచ్చినప్పుడు కాన్షస్, ఇగో అనే ద్వారపాలకుల దగ్గర ఆగిపోవడం వల్లే. వీటిని దాటాలని తెలియక పోవడం వల్లే. దాటితే తప్ప గోల్ పట్ల విశ్వాసం కలగదు. కనుక పై ప్రాసెస్ ని ముందు విధిగా ఫాలో అవ్వాలి.
అనుమానం, అవిశ్వాసం అన్నవి నెగెటివ్ ఫీలింగులు. అంటే లో- ఫ్రీక్వెన్సీ ని కలిగివుంటాయి. ఎల్ ఓ ఏ పని చేయాలంటే హై-ఫ్రీక్వెన్సీ పాజిటివ్ ఫీలింగ్స్ అందించాలి. ఎల్ ఓ ఏ ఈజీగా ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే- ఏదైతే గోల్ వుందో, ఆ గోల్ ఏ ఫ్రీక్వెన్సీతో నైతే వుంటుందో, ఆ ఫ్రీక్వెన్సీతో పాజిటివ్ ఫీలింగుల ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఫలితం అరచేతి కొచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ ల మ్యాచింగే, ఇంకేమీ లేదు. దర్శకత్వం అన్నది ఎంత హై -ఫ్రీక్వెన్సీయో చెప్పనవసరం లేదు. దాన్నందుకోవాలంటే ఆ రేంజిలో ఫీలవ్వకపోతే దర్శకత్వం మీద ఆశలెందుకు?
విశ్వాసానికి అడ్డంకుల్ని క్లియర్ చేసుకున్నాక, గోల్ కోసం సాగించే ప్రయత్నాల్లో అవరోధాలొస్తే మళ్ళీ కృంగి పోకూడదు. ఒకటి రెండు అవరోధాల కంటే రావు. ఈ అవరోధాలు ఎందుకొస్తాయంటే, మనవాడు ఎంత బలంగా కమిటై వున్నాడని విశ్వం పరీక్షించడానికి. దీనికి విశ్వానికి థాంక్స్ చెప్పి ముందుకు సాగాలే తప్ప ఆగిపోకూడదు. విశ్వాన్ని నమ్మి భారమంతా విశ్వం మీద వేసేయాలి. ఎలాజరుగుతుంది, అవకాశాలు ఎలా వస్తాయి అన్నవి మన పని కాదు. అది విశ్వం చూసుకుంటుంది. అవుతుందా లేదా అన్న ఆందోళనా త్వరగా అవ్వాలన్న ఆదుర్దా పనికి రావు.
నేలలో బీజం నాటాక మొలకెత్తడానికి దాని సమయం అది తీసుకుంటుంది. మాటి మాటికీ తవ్వి చూస్తూంటే మొలకెత్తుతుందా? మొలకెత్తుతుందన్ననమ్మకంతో నీరు పోస్తూంటే అదే మొలకెత్తుతుంది. ఆ నీరు పోయడమే ప్రతిజ్ఞ (అఫర్మేషన్స్), దృశ్యీకరణ (విజువలైజేషన్), కార్యాచరణ (యాక్షన్) వంటి మూడు కార్యకలాపాలు ఎల్ ఓ ఏ లో. వీటి గురించి రేపు!
-సికిందర్

.jpg)