రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జూన్ 2018, శుక్రవారం

656 : స్క్రీన్ ప్లే సంగతులు -7


    (జరిగిన కథ : భూత్ బంగ్లా లోంచి వచ్చిన జూహీ, జూన్ హాలు వర్షంలో తడుస్తూ పొలాల మధ్య వున్న మంచె మీద తల దాచుకుంటారు. వర్షం తగ్గాక తిరిగి జూహీని మోసుకుంటూ బయల్దేరతాడు జూన్ హా చీకట్లు ముసురుకుంటోండగా...)
        సీన్ :   చీకట్లు ముసురుకుంటున్న వైడ్ యాంగిల్లో తిరిగి ఆమెని మోస్తూ వుంటాడు. ఆకాశం నిండా తారలు వెలుస్తాయి. బరువుగా వున్నానా – అంటుంది. లేదంటాడు. బాగా తింటాను, అందుకని బరువుగానే వుంటానంటుంది. ఫర్వాలేదంటాడు. నిన్నెంత దూరమైనా మోస్తానంటాడు. అబద్ధం చెప్తున్నావంటుంది. లేదంటాడు. అవునంటుంది. లేదంటాడు.

పాయింట్ :  
      ఈ సీన్లో, గత సీన్లో ఆమెని మోస్తున్నప్పుడు ఎక్కడా క్లోజప్స్ తీయలేదు లైంగికంగా రెచ్చగొడుతూ. ఆమె మోస్తున్నప్పుడు అతను ఏ భావోద్రేకాలకీ లోను కాడు. అవన్నీ ప్రేక్షకుల మనసులో ఇంకో ఆలోచన కలగనివ్వని మ్యాటరాఫ్ ఫ్యాక్ట్ లాంగ్ షాట్సే. ఈ సీనులో ఇంకొక్క పాయింటుతో కొనసాగించాడు జూన్ హా పాత్రచిత్రణని. వెనుక సీన్లో జూహీని ఇంటికి భద్రంగా చేరవేస్తానని పరోక్షంగా హామీ ఇస్తున్నట్టు మాట్లాడేక, ఇప్పుడెంత దూరమైనా మోస్తానంటున్నాడు సింబాలిక్ గా. ఆమె నమ్మనంటోంది. ఈ మాటలతో కథకి సస్పెన్స్ కూడా ఏర్పడుతోంది. ఈ ప్రేమకథలో కష్టాలెదురైతే అతడామెతో కొనసాగుతాడా  లేదా అని. ఆమె కాలు బెణికి పడిపోవడం అనే సంఘటనని ఈ పాత్ర చిత్రణకి వాడుకున్నాడు దర్శకుడు. అదే సమయంలో కథని సస్పెన్సు తో ఫోర్ షాడోయింగ్ చేస్తున్నాడు. బరువు మోస్తాడా లేదా అని డైలాగులు వూరికే లేవు. ఇవి పాత్ర మనస్తత్వంతో బాటు, ఈ ప్రేమ కథలో ఏదో తెలియని సస్పెన్సు ని పోషిస్తున్నాయి – కష్టాల్ని తట్టుకుని ఆమెతోనే వుంటాడా  అని. 

సీన్ : చీకట్లో చిన్న కొలనులా  వుంటుంది. చెక్క వంతెన దాటతాడు ఆమెని మోస్తూనే చీకట్లో. చుట్టూ మిణుగురు పురుగులు ఇందాకటి ఆకాశంలో తారల్లా మెరుస్తూంటాయి. చకితురాలై చూస్తూంటుంది. ఆమెని కూర్చోబెట్టి మిణుగురు పురుగుల్ని పట్టడానికి దిగుతాడు. కాస్త కష్టపడి ఒకదాన్ని పట్టుకుంటాడు. తెచ్చి ఆమె గుప్పెట్లో పోస్తాడు. గుప్పెట్లో పొదువుకుని మురిసిపోతుంది దాన్నే చూస్తూ. 

పాయింట్ :    వెనక సీను ముగింపులో ఆకాశంలో తారల్ని చూపీంచింతర్వాత, ఈ సీనులో మిణుగురు పురుగులు చూపిస్తున్నాడు. మ్యాచింగ్ సీన్ ట్రాన్సిషన్స్. శ్రమకోర్చి భావుకతని ప్రదర్శిస్తున్నాడు. ఇది ఉత్త భావుకతేనా, ఇంకేదైనా కాన్సెప్ట్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ చేస్తున్నాడా? వాటర్ కాన్సెప్ట్ ని బ్యాక్ గ్రౌండ్ లో వాడుకుంటున్నాడని వెనక సీన్లలో చెప్పుకున్నాం. ఇప్పుడు పంచభూతాల్లో రెండో ఎలిమెంట్ అయిన వెలుగు (నిప్పు) ని వాడుకుంటున్నాడు. తారలూ, మిణుగురు పురుగులు ఇందుకే.  తారలకి డ్రీమ్ డిక్షనరీ మీనింగు సాఫల్యత. ఒక విజయం సాధించడం. వెనుక సీనువరకూ చూసుకుంటే వీళ్ళిద్దరూ ప్రేమ సఫలమయ్యే దిశగానే పయనిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సీనులో ఏం చూపించాలి? ప్రేమ సఫలమయ్యాక సంయోగమేగా? అదేగా ప్రేమకి గమ్యం? అదే ఇక్కడ మిణుగురు పురుగుల రూపంలో చూపిస్తున్నాడు. మిణుగురు పురుగుల డ్రీమ్ డిక్షనరీ మీనింగు సంయోగమే. జంటని ఆహ్వానించే సంయోగ సంకేతంగానే మిణుగురు పురుగులు వెలుగుల్ని విరజిమ్ముతాయి. అదే జరుగుతోందిక్కడ పాత్రలకి కూడా. ఒక మిణుగురు పురుగుని పట్టి ఆమెకివ్వడం ద్వారా సింబాలిక్ గా వున్న ఇద్దరి ప్రేమా సంగమ తీరానికి చేరినట్టయింది.

సీన్ :  
     ఒడ్డున కాగడాలతో ఓపెనవుతుంది. చీకట్లో పడవలో అవతలి ఒడ్డుకి సాగిపోతూంటారిద్దరూ. ఒడ్డున కాగడాలు పట్టుకున్న మనుషులుంటారు. ఆమె మిణుగురు పురుగు కాస్త పట్టుకోమని అతడి కిస్తుంది. తన మెళ్ళో గొలుసు తీస్తుంది. అప్పుడామె – నాకు మిణుగురు పురుగిచ్చావ్, నన్ను మోసుకుంటూ వచ్చావ్, బదులుగా నీకు నేను ఇంతకంటే ఇవ్వలేనని అంటుంది. ఆ గొలుసు అతడి మెడలో వేస్తుంది. పడవ వొడ్డుకి చేరుతుంది. అక్కడున్న మనుషులు ఆమెని అందుకుంటారు. ఒకడు ఆమెని వీపు కెత్తుకుని పోతూంటాడు. ఆమె తాత గారు జూన్ హా ముందుకొచ్చి నిలబడతాడు. చాచి లెంపకాయ కొడతాడు.

పాయింట్ :  వీళ్ళు వచ్చిన పడవ ఎప్పుడో కొట్టుకు పోయుంటుంది – తాతగారి మనిషి ఇటు పడవేసుకొచ్చి ఎక్కించుకున్నాడని ఈ సీనులో అర్ధమౌతోంది. సీను ఓపెనింగ్ కాగాడాల వెలుగుతో వుంటుంది. ఇటు చూస్తే వీళ్లిద్దరూ కూర్చుని కనిపిస్తారు. కాగడాల వెలుగులో నిదానంగా సాగిపోతున్నట్టు. కానీ పడవ ఫ్రేములో వుండదు. అటు ఒడ్డున కాగడాలు పట్టుకున్న మనుషులు ఓపెనయ్యాక, అప్పుడు ఇటు పడవ ఫ్రేములో కనిపిస్తుంది. ఇంకెవడో తెడ్డు వేస్తున్న వాడు కూడా ఓపెనవుతాడు. అప్పుడు ఇది అవతల్నుంచి వచ్చిన వేరే పడవని మనకి అర్ధమవుతుంది.



          చాలావరకూ ఏం చేస్తూంటారంటే,  సీను ప్రత్యంగుళం ఏమిటా అని ప్రేక్షకుల పరిశీలనకి పెట్టకుండా మొత్తమంతా ఒకేసారి విప్పి చూపించేస్తారు. సీను ఓపెన్ చేయడం చేయడం ఒకేసారి మొత్తమంతా చూపించేశాక, ఇక ప్రేక్షకులు ఫాలో అయ్యేదేముంటుంది. ఓ రెండు కోట్ల సినిమాకి ఒక సీను విలువ మూడు లక్షలు చేస్తుందనుకుంటే, ఆ మూడు లక్షలకి సరిపడా కంటెంట్ తో సీను నిలబడకపోతే, ప్రేక్షకుల్లోకి చొచ్చుకు పోకపోతే, ఆ మూడు లక్షలూ దండగే. మొత్తం కథా ప్రపంచంలో భాగమైన సీను లోతుపాతులు తెలుసుకోక చుట్టేయడమే. 

          ఈ సీను డైరెక్టుగా మొత్తం ఒకేసారి చూపించేస్తూ ఇలా తీస్తే ఎలా వుందేది – అవతలి వొడ్డున కాగడాలు కన్పించాయి. ఇటు వేరే వ్యక్తి తెడ్డు వేస్తున్న పడవలో హీరోహీరోయిన్లు పోతున్నారు. అటు వొడ్డున హీరోయిన్ తాత గుర్రుగా చూస్తున్నాడు. ఆమె అతడికి గొలుసు కట్టింది. తాత మండిపడ్డాడు లేదా రగిలిపోయాడు. పడవ వొడ్డుకి చేరింది. తాత  అనుచరులు హీరోయిన్ ని దురుసుగా లాగి ఎత్తుకున్నాటు. తాతవచ్చి హీరో ని కొట్టాడు...ఇలా వుంటే ఎలా వుండేది?

          ప్రేక్షకులు అంచెలంచెలుగా ఫాలో అవడానికేం లేదు. అన్నీ ఒకేసారి కనిపించేస్తున్నాయి. కొసరి కొసరి వడ్డన లేదు. అన్నీ కలిపి ముద్ద పడేసినట్టుంటుంది. లేదా పిండా కూడు పెట్టినట్టుంది. కాకులు కూడా ఇంట్రెస్టు చూపించవు. సీను రుచికరంగా లేదు. ప్రేక్షకులు దృశ్యాత్మక అనుభవం కోసం కూడా సినిమాల కొస్తారు. కెమెరా అంటే దిష్టిబొమ్మ కాదు. మేకర్  తానొక్కడే రాసిన కథొక్కటే చెప్పలేడు. కెమెరా కూడా ఇన్వాల్వ్ అయి విజువల్ గా చెప్తుంది. దానికా అవకాశమివ్వకపోతే  పగదీర్చుకుని పరమ పిండాకూడు చేస్తుంది సీనుని. 

          ఇక్కడ ఇంత చిన్న సీనులో ప్రేక్షకుల్ని ఇన్వాల్వ్ చేయడానికేం చేశాడంటే, ముందు దూరంగా కాగడాలతో ఓపెన్ చేశాడు. కాగడాలెందుకు? వెనక రెండు సీన్లలో తారలతో, మిణుగురు పురుగులతో ఓపెన్ చేశాడు కాబట్టి. పంచభూతాల్లో నీటికి తోడు  నిప్పుని కూడా వాడుకుంటున్నట్టుగా  - ఆ తారల్నీ, మిణుగురు పురుగుల్నీ చూపిస్తున్నట్టే  - ఇక్కడ కాగ డాలనే నిప్పుతో ఓపెన్ చేశాడు. ఇలా ప్రతీ సీనులో ముందుగా ఈ థీమాటిక్ కంటిన్యుటీని ఎస్టాబ్లిష్ చేసి, అప్పుడు విషయం లోకొస్తున్నాడు. 

          తారలూ మిణుగురు పురుగులూ లా కాకుండా, ఈ కాగడాలు డైరెక్టుగా నిప్పే. నిప్పుని చూపించేస్తున్నాడు. అంటే వీళ్ళ సాంగత్యం ఇక నిప్పులో పడిందన్నమాట. పగలు పడవెక్కి బయల్దేరినప్పుడు నది నీటితో ప్రారంభమై, ఆపైన వర్షపు నీటితో వాటర్ ఎలిమెంట్ కొనసాగింది. అక్కడ్నించీ అంచెలంచెలుగా తారలతో, మినుగురు పురుగులతో సాగి, ఇప్పుడు ఏకంగా కాగడాలతో  డైరెక్టు నిప్పనే ఇంకో ఎలిమెంట్ కి చేరింది పరిస్థితి. 

          కానీ వీళ్ళని కలిపిన నీటికి నిప్పుతో ప్రమాదముంటుందా? వుండదు. నిప్పునే నీరు ఆర్పేస్తుంది. కనుక  వీళ్ళకిప్పుడు ఎదురైన ఆపదని అధిగమించి మళ్ళీ కలుసుకుంటారన్న మాట. 

          కాగడాలు చూపించగానే పరిస్థితి  ఉద్రిక్తంగా తయారైందని తెలిసిపోతుంది. వెంటనే సీను ఆసక్తి కల్గిస్తుంది. ఇటు చూస్తే,  వీళ్ళిద్దరూ కూర్చుని తేలిపోతున్నట్టూ వుంటారు. ఎక్కడ దేనిమీద తెలిపోతున్నారో వూహకందక ఇన్వాల్వ్ అయి పరిశీలనాత్మకంగా, పట్టి పట్టి చూస్తూంటాం. చూస్తే  తేలిపోతున్నట్టే వుండరు. ఇంకా కొలను దగ్గర చెక్క వంతెన మీదే కూర్చున్నట్టుంటారు. 

        ఇప్పుడు  వొడ్డున కాగడాలు పట్టుకున్న మనుషులు ఓపెనవుతారు. వెంటనే ఇటు ఓపెన్ చేస్తూ షాట్ వేస్తే, అప్పుడు వీళ్ళిద్దరూ పడవలో వున్నార్రా బాబూ అని అర్ధమవుతుంది. తదేక ధ్యానంతో ఇన్వాల్వ్ అయి చూసే సగటు ప్రేక్షకుడు, వార్నీ అనుకుని నోటి మీద వేలేసుకుంటాడేమో. వీళ్ళిలా పడవలో పోతున్నారంటే,  పగలు కొట్టుకు పోయిన పడవ మళ్ళీ దొరికిందేమో అనుకుంటాం. చీకట్లో ఎలా దొరికిందబ్బా అని కూడా అనుకుంటాం - జూన్ హా పడవ నడుపుతున్నట్టు లేడే? ఎటు వెళ్తోంది పడవ వదిలేసి ఇలా కూర్చుంటే ఇంత రాత్రి?

          అప్పుడు ఆ వెనకాల తెడ్డు వేస్తున్న మనిషి ఒపెనవుతాడు. వార్నీ అని మళ్ళీ అనుకుని, కిందపడి గిలగిల కొట్టుకోవచ్చు నేల టికెట్ చూపరి. కెమెరా ఇలా టీజ్ చేస్తోంది. కెమెరా టీజ్ చేయకపోతే, సినిమా ఒక్కదానికే వరించిన అంత సువిశాలమైన వెండితెరకి ఆ ఛాయాగ్రహణం వేస్టు.

          నిజానికి స్క్రీన్ ప్లేలో వన్ లైన్ ఆర్డర్ తర్వాత రాసే ట్రీట్ మెంట్ పైవిధంగా సకల విశేషాలూ కలుపుకుని వివరణాత్మకంగా వుండాలి. ఇలా ఎవరు రాస్తున్నారు? ఎవరు రాయనిస్తున్నారు? ఎలాగో రాసినా ఎవరు తీస్తున్నారు? విజువల్ కథనాన్నిమిళితం చేయకుండా, డైలాగుల క్రియేటర్ గా, ఉత్తుత్తి కెమెరా యాంగిల్స్ ల రీక్రియేటర్ గా అన్పించుకోవడమేనా దర్శకత్వమంటే?

          ఒక హాలీవుడ్ వెబ్సైట్లో ఇలా చెప్పారు – స్క్రిప్టు రాతపని త్రికోణమని. అంటే కథకుడు – కథ – ప్రేక్షకుడు బంధంగా వుంటుందని. దీన్ని చతుర్భుజంగా  మార్చాలేమో....కథకుడు – కథ – కెమెరా - ప్రేక్షకుడూ అని! 

     అలా పడవలో సాగిపోతున్నప్పుడు -  నువ్వింత చేశావు, నీకింతకంటే ఇవ్వలేనని తన గొలుసు తీసి అతడి మెడలో వేస్తుందామె. భూత్ బంగ్లాకి బయల్దేరినప్పట్నుంచీ,  ఇప్పటివరకూ వీళ్ళతో గొలుసుకట్టు కథనం ఇలా గొలుసు కట్టడంతో సుఖాంత మైంది. ఏఎ సుఖాంతానికి ట్విస్టు వొడ్డు చేరాకా...

       వొడ్డుకి చేరాక  అక్కడ ఎదురుచూస్తున్న హీరోయిన్ తాత అనుచరుల ఉద్రేకాలుండవు, మాటలుండవు. ఎందుకుండవు? ఉద్రిక్తతని కాగడాల మంటలే చెప్తున్నాయి. ఇంకా మనుషులు రగిలిపోయి రంకేలేయడం వుండదు. వుంటే కాగడాలనే సింబాలిజానికి అర్ధమే వుండదు. సింబాలిజమున్నాక  మళ్ళీ రియాక్షన్స్ దేనికి? సింబాలిజమే రియాక్షన్. 

          కాలు బెణికిన జూహీని మనిషి ఎత్తుకుని పోతూంటాడు. ఇతర మనుషులు అనుసరిస్తారు. అప్పుడు తాత ఫ్రేములోకొస్తాడు. జూన్ హాని తీక్షణంగా చూసి చూసి, చాచి  లెంపకాయ కొడతాడు. తాతని ఇంతవరకూ ఓపెన్ చేయలేదు. చేస్తే ఒక ఎజెండాతో చేసుకొస్తున్న విజువల్ కథనం దెబ్బతింటుంది. అందుకని మొత్తం ఈ ఎపిసోడ్ అంతటికీ జడ్జిమెంటుగా చిట్టచివర్నే తాతని చూపించి,  కొట్టేలా చేశాడు.

సీన్ :  కొన్ని వాహనాలు సాగిపోతూంటాయి...జూహీకి వొంట్లో బాగోక సియోల్ నగరానికి తీసి కెళ్ళినట్టు జూన్ హా వాయిసోవర్ వస్తూంటే ఈ ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది.


సికిందర్

           




655 : విజ్ఞప్తి

   మరోసారి విజ్ఞప్తి 
               మీ సినిమా కథలు, స్క్రీన్ ప్లేలు మీరు స్వయంగా తయారు చేసుకోవడానికి అవసరమైన విషయ పరిజ్ఞానమంతా బ్లాగులో పొందుపర్చాం, ఇంకా పొందుపరుస్తూ వుంటాం. ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’ పేర కూడా పూర్తి మెటీరియల్ బ్లాగులో డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇటీవల అవకాశం కల్పించాం. వీటిని అవగాహన చేసుకుంటే మీ స్క్రిప్టులు మీరే స్వయంగా రూపొందించుకోవచ్చు. ఇది మీకు అందిస్తున్న ఉచిత సదుపాయం. ఇలాకాక మా సాయం తీసుకుని మీ స్క్రిప్టులకి రూపకల్పన చేసుకోవాలనుకుంటే మాత్రం ఉచిత సదుపాయం కల్పించడం అసాధ్యమవుతోందని తెలుపడానికి విచారిస్తున్నాం. దీనికి సమయం కేటాయించే పరిస్థితులు కూడా ఇక లేవు. మహా అంటే మీ కథ విని దాని బాగోగులు చెప్పగలం. సరిదిద్దాలంటే సుదీర్ఘ ప్రక్రియని డిమాండ్ చేస్తుంది. ఇది ఉచితంగా సాధ్యం కాదు. ఒకవేళ పరిశీలనకి మీ ట్రీట్ మెంట్ ని గానీ, డైలాగ్ వెర్షన్ ని గానీ పంపదలిస్తే, ఇది కూడా ఉచితంగా సాధ్యంకాదు. ఇవి చదవాలంటే సమయమూ శ్రమా అవసరపడతాయి. 

          ఇక్కడొక ముఖ్య విషయం గమనించాలి. మీరు అప్పటికే మీ కథని నిర్మాతలకో, హీరో లకో విన్పించి, ఓకే చేయించుకుని వుంటే ఇక మమ్మల్ని సంప్రదించనవసరం లేదు. అందులో మార్పు చేర్పులు చేయాల్సి వస్తే, ఆ సవరణలతో మళ్ళీ మీరు కొత్త కథ చెప్పి ఒప్పించుకోలేకపోవచ్చు. ముందొకలా చెప్పి, ఇప్పుడొకలా చెప్తున్నారని మీకిచ్చిన అవకాశాన్ని రద్దు చేయవచ్చు. కనుక మీరెలా ఓకే చేయించుకున్నారో అలాగే  ముందుకు సాగిపోండి. నిజంగా మీ కథ పట్ల అనుమానాలుంటే, వాటిని నివృత్తి చేసుకున్న తర్వాతే అవతల విన్పించాలని మీకన్పిస్తే, అప్పుడు మాత్రమే మమ్మల్ని సంప్రదించండి. 

          ఇకపోతే, ముందుగా మీరే స్కూలో నిర్ణయించుకోండి. మీరు స్ట్రక్చర్ లేని క్రియేటివ్ స్కూలైతే ఇక దేనికీ మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. మీరు ఒట్టి క్రియేటివ్ స్కూలునే నమ్మేవారైతే, మీకు స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ స్కూలు అస్సలు నచ్చదు. అర్ధం కాదు కూడా. ‘శివ’ ని కూడా శాస్త్రీయంగా అర్ధం చేసుకోలేరు. కనుక మీ సొంత క్రియేటివిటీతో క్రియేటివ్ స్కూలులో రొటీన్ గా సాగిపోండి. మీరు ఈ బ్లాగుని సందర్శించి, ఇందులోని విషయాలు తెలుసుకోవాలనుకోవడం కూడా వృధా అని గమనించండి. 

          మీరు స్ట్రక్చర్ సహిత క్రియేటివ్ స్కూలు కోరుకుంటేనే మమ్మల్ని సంప్రదించండి. వీటిలో కూడా కాలం చెల్లిన పాత మూస కథలతో కలవకండి. వీటిలో కూడా డైలాగ్ వెర్షన్ వరకూ మొత్తం రాసుకుని కలవకండి. డైలాగ్ వెర్షన్ కూడా రాసుకుని మీరు ఫైనల్ అయ్యారంటే, స్ట్రక్చర్ లో ఏది మార్చాలన్నామీకు మనసొప్పదు. మీరు రాసుకున్న డైలాగ్ వెర్షన్ ని మీరు బాగా ప్రేమిస్తారు కూడా. మీ కథేమిటో మీరే చెప్పలేనంత గందరగోళంగా డైలాగ్ వెర్షన్ వున్నా కూడా దాన్ని మార్చుకోలేనంత గాఢంగా మీరు దాన్నే ప్రేమిస్తారు. అసలు కథే ఎక్కడా ఓకే కాకుండా అప్పుడే డైలాగ్ వెర్షన్ రాసుకోవడం మీకెన్నో విధాలా అడ్డంకుల్ని సృష్టిస్తుందని గుర్తించండి. 

          ఈ పై విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని పరస్పరం సంహకరించుకుంటే  సత్ఫలితాలు వస్తాయని నమ్ముదాం.

సికిందర్