రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, September 3, 2018

679 : రివ్యూ


దర్శకత్వం : అమర్ కౌషిక్
తారాగణం : రాజ్ కుమార్ రావ్, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠీ, అపరాశక్తి ఖరానా, విజయ్ రాజ్ తదితరులు
రచన : రాజ్ - డీకే, మాటలు : సుమిత్ అరోరా
సంగీతం : సచిన్ జిగర్,  ఛాయాగ్రహణం : అమలేందు చౌదరి
బ్యానర్ : మాడక్ ఫిలిమ్స్, డి 2 ఆర్ ఫిలిమ్స్
నిర్మాతలు : దినేష్ విజన్, రాజ్ –డీకే
విడుదల : ఆగస్టు 31, 2018
***
         
హిందీలో హార్రర్ కామెడీ. దానికో సామాజిక ప్రయోజనం. వెరైటీ సినిమాల రాజ్ కుమార్ రావ్ హీరో. ఈ హార్రర్ కామెడీలో దెయ్యం మామూలు దెయ్యం కాదు, ఫెమినిస్టు దెయ్యం. పురుషాధిక్యతా భావజాలం మీద సెటైర్. ఇవాళ్ళ ఆడవాళ్ళు బయట తిరిగితే మగవాళ్ళతో చెప్పుకోలేని రకరకాల ప్రమాదాలు ఎదురవు తున్నాయి. అవే చెప్పుకోలేని ప్రమాదాలు మగాళ్ళకి ఎదురై, మగాళ్ళని భద్రంగా ఇంట్లో దాచి పెట్టి, ఆడవాళ్ళు బయట తిరిగే రోజులొస్తే? మగవాడు ఆడవాళ్ళకి తనేం చేస్తాడో అది అనుభవించాల్సిందే. ఫెమినిస్టు దెయ్యం పరిహాసమిదే. 

         
గ్రామాల్లో ఒక మూఢ నమ్మకంతో దెయ్యాన్ని వదిలించుకోవాలని ‘ఓ స్త్రీ రేపురా’ అని తలుపుల మీద రాస్తూంటారు. ఈ మూఢ నమ్మకానికి ఫెమినిజాన్ని జోడించి, హార్రర్ కామెడీ తీస్తే ఎలా వుంటుందనే దానికి తెర రూపమే ‘స్త్రీ’. 

          చండేరీ అనే వూళ్ళో ఏడాదికోసారి ఓ పండుగ జరుగుతుంది. ఆ పండగ జరిగే నాల్గురోజులూ ఓ ఆడ దెయ్యం మగవాళ్ళని అపహరించి అపాయం తలపెడుతోందని గ్రామస్థులు భయపడి పోతూంటారు. తీసికెళ్ళిన మగాళ్ళని దెయ్యం ఏం చేస్తుందనేది తర్వాత, ముందు తీసికెళ్ళిన చోట మాత్రం వాళ్ళ వొంటిమీది బట్టలన్నీ పడివుంటాయి. ఈ దెయ్యానికి ‘స్త్రీ’ అని పేరు పెట్టి, ‘ఓ స్త్రీ కల్ ఆనా’ అని గోడల మీద రాసి, ఆ నాల్గు రోజులూ  బిక్కుబిక్కుమంటున్నతమ భర్తల్నీ కొడుకుల్నీ రాత్రిళ్ళు బయటికెళ్ళకుండా ఇంట్లో పెట్టుకుని ఆడవాళ్ళు భద్రంగా కాపాడుకుంటారు. 

          వూళ్ళో  విక్కీ (రాజ్ కుమార్ రావ్) అనే చలాకీ టైలర్ వుంటాడు. కుట్టమని బట్టలు తెచ్చే ఆడవాళ్ళ మీద ఓ చూపేసి కొలతలు చెప్పేస్తాడు. ఇతను కొత్తగా వచ్చిన ఒకమ్మాయి (శ్రద్ధా కపూర్) కి బట్టలు కుట్టి పెట్టి ప్రేమలో పడతాడు. ఆమె తనకే కన్పించి మిత్రులకి (అపరాశక్తి ఖురానా, అభిషేక్ బెనర్జీ) కన్పించకపోవడంతో వాళ్ళు భయపడి హెచ్చరిస్తారు ఆమె ‘స్త్రీ’ అని. ఇది నమ్మకుండా ప్రేమిస్తూనేవుంటాడు విక్కీ. ఇక పండగ సంరభంలో ‘స్త్రీ’ అలజడి సృష్టించడం మొదలెడుతుంది. ఈ ‘స్త్రీ’ విక్కీ ప్రేమిస్తున్న పేరులేని అమ్మాయేనా, లేక  వేరా అనేది అర్ధంగాదు. ఈ మిస్టరీని ఛేదించడానికి పుస్తకాల షాపు యజమాని రుద్ర (పంకజ్ త్రిపాఠీ) పూనుకుంటాడు. ఆమె విక్కీ ప్రేమిస్తున్న ‘స్త్రీ’ యే అయితే విక్కీతో ఎందుకు బాగుంటోంది? ఏమిటి విక్కీకున్న స్పెషాలిటీ? ఫెమినిస్టు దెయ్యం ఇతన్నెలా ప్రేమిస్తోంది? ఇవీ తేలాల్సిన సందేహాలు. 

     ఈ ఫెమినిస్టు దెయ్యం కామెడీలో హార్రర్ సీన్లు చాలా ఫ్రెష్ గా, ఫన్నీగా వుంటాయి. ఫన్ డైలాగులు పొట్ట చెక్కలయ్యేలా చేస్తాయి (అంబానీ కొడుకుని దెయ్యంతో చూశావా?,  నువ్వేమైనా కా, భక్తుడివి మాత్రం కాకు; ఫస్ట్ టైం లవ్ లో పడ్డా, సెకెండ్ టైం ఎందులో పడ్డానో). నైట్ వాచ్ మన్ చీర కట్టుకుని రక్షణ కల్పించుకునే సీను చాలా ఫన్.  

        అయితే సెండాఫ్ ఒక దశ కొచ్చేటప్పటికి ఈ కామెడీ ఫన్ని కోల్పోతుంది. ఫన్ని కోల్పోయాక అకస్మాత్తుగా హార్రర్ కామెడీ కాస్తా, స్త్రీ స్వేచ్ఛ గురించిన సోషల్ డ్రామాగా మారిపోతుంది.  చివరి పదిహేను నిమిషాలూ సందేశాలివ్వడంతో సరిపోతుంది. పూర్తి నిడివి హార్రర్ కామెడీగా ఎంటర్ టైన్ చేస్తూనే, ఈ సందేశాలు అంతర్లీనంగా వుంటే సరిపోయేది. 

          రాజ్ కుమార్ రావ్ ఈ కామిక్ షోకి ఒక ఎస్సెట్. ఏ పాత్ర నటించినా అందులో ఒదిగిపోయి ఆ పాత్రే తనై పోతాడు. ఈ టైలర్ – కం- లవర్ పాత్రలో, ఇద్దరు మిత్రులతో కలిసి కొత్త ఫన్నీ సీన్స్ ని క్రియేట్ చేస్తూంటాడు. పేరు లేని పాత్రలో శ్రద్ధా కపూర్ సౌమ్యంగా కన్పిస్తూ, ఈమె దెయ్యమేనా అన్న సస్పెన్స్ లో పడేస్తూంటుంది. ‘గోల్ మాల్ -4’ లోనూ హీరో దెయ్యమని తెలీక దెయ్యంతోనే  ప్రేమలో పడతాడు. అది కేవలం హర్రర్ కామెడీ వరకే. ఇది సోషియో హర్రర్ కామెడీ. అదేపనిగా ఉత్త కాలక్షేపపు హార్రర్ కామెడీలు వస్తూ ప్రేక్షకాదరణ కోల్పోతున్న పరిస్థితుల్లో – ఒక మూఢనమ్మకానికి ఇంకో సామాజిక సమస్య జోడించి ప్రయోగం చేయడం మెచ్చదగిందే.  

సికిందర్