రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!






రచన - దర్శకత్వం : హను రాఘవపూడి
తారాగణం : నాని, మెహరీన్ కౌర్ పీర్జదా, సత్యం రాజేష్, పృథ్వీ, సంపత్ రాజ్, మహదేవన్, మురళీ శర్మ,
సంగీతం : విశాల్ చంద్ర శేఖర్, ఛాయాగ్రహణం :
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : రాం ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర
విడుదల : 12 ఫిబ్రవరి, 2016
           ***



      సక్సెస్ ఫుల్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న ‘నేచురల్ స్టార్’ నాని ఇంకో వెరైటీ పాత్రతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సొంత విజువల్ సెన్స్ గల  ‘అందాల రాక్షసుడు’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో నాని నమ్మి చేసిన, టైటిల్ ప్రకారం రొమాంటిక్ కామెడీ లా కన్పిస్తున్నఈ సరికొత్త ప్రయత్నంలో నానితో బాటు దర్శకుడు, దీన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాతలు ముగ్గురూ- ఏ అవగాహనతో దీన్ని రూపొందించి, ఏమేరకు సఫలమయ్యారనేది ఈ కింద చూద్దాం. 

కథ
    అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కృష్ణ (నాని) బోరు బావులు వేసే కార్మికుడుగా ఉంటాడు. అదే వూళ్ళో చిన్నప్పటి నుంచీ మహాలక్ష్మి మెహరీన్) ని ప్రేమిస్తూంటాడు. మహాలక్ష్మి కూడా అతన్ని ప్రేమిస్తుంది గానీ ఇది బయట పెట్టుకోకుండా పైకి పోట్లాడు కుంటున్నట్టు నటిస్తూంతారు. మహాలక్ష్మి ఫ్యాక్షన్ లీడర్ రాజన్న ( మహాదేవన్) కూతురు. ఆమెకో అన్న రామరాజు ( రామకృష్ణ) ఉంటాడు. ఇతడంటే కృష్ణకి చచ్చే భయం. సహజంగానే పిరికివాడయిన కృష్ణకి తను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నట్టు రామరాజుకి చెప్పే ధైర్యం చాలదు. తనకి  పెళ్లి ప్రయత్నాలు చేయకుండా డిగ్రీ పదేపదే  ఫెయిలవుతూ వుంటుంది మహాలక్ష్మి.

    ఇలా వుండగా అప్పిరెడ్డి అనే  రాజన్న ప్రత్యర్ధి వర్గం గ్యాంగ్ రాజన్న  ఇంటిమీద పడి మారణహోమం సృష్టిస్తారు. రామరాజు  అన్న ఎసిపి (సంపత్ రాజ్) పిల్లలు ముగ్గురూ పండగ  సెలవులకి వచ్చి ఇక్కడే వుంటారు. వీళ్ళని ని కాపాడేందుకు తీసుకుని హైదరాబాద్ పారిపొమ్మంటాడు కృష్ణతో రామరాజు. ఈ పని చేస్తే చెల్లెల్నిచ్చి  పెళ్లి చేస్తానంటాడు. తన ప్రేమ సమస్యకి ఇలా పరిష్కారం లభించడంతో కృష్ణ ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ దారి పడతాడు. అదే సమయంలో హైదరాబాద్ వచ్చిన దుబాయ్ డాన్  డేవిడ్ భాయ్ ( మురళీ శర్మ) మనుషులు ఎసిపి మీద పగబట్టి అతడి పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తూ కృష్ణ వెంట పడతారు. ఈ గ్యాంగ్ బారి నుంచి కృష్ణ పిల్లల్ని కాపాడి ఎలా మహాలక్ష్మి తో పెళ్ళికి రూటు క్లియర్ చేసుకున్నాడన్నది ఇక్కడ్నించీ సాగే మిగతా కథ.

ఎవరెలా చేశారు
    నాని ఇందులో ఫక్తు పాసివ్ పాత్ర పోషించాడు. పిరికితనం అనే లక్షణంతో పాసివ్ గానే చివరంటా కొనసాగుతాడు. ఇక్కడ రెండున్నాయి : కథ మొత్తమ్మీద హీరో పాసివ్ పాత్ర గా వుంటే సినిమా ఫ్లాప్ అవడం ఖాయం. కథలో సగం మేరకు పాసివ్ గా వుండి, అప్పుడు సమస్యలో ఇరుక్కున్నాక  లక్ష్యం ఏర్పడినప్పుడు, యాక్టివ్ గా మారితే ఫ్లాపయ్యే ముప్పు తప్పుతుంది. నాని పాత్ర కి పాసివ్ నెస్ అనేది పిరికితనం అనే క్యారక్టరైజేషన్ వల్ల ఏర్పడడంతో, ఫస్టాఫ్ వరకూ దీన్ని కొనసాగించి వుండాలి. ఆపైన యాక్టివ్ గా మారిపోతే పాత్రతో బాటు కథనం కూడా ఎలివేట్ అయ్యే అవకాశం వుండేది.

       పిల్లల కోసం ఎవరు ఎందుకు వెంటబడుతున్నారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, విలన్లు దాడి  చేసినప్పుడల్లా ఎదురు దాడి జరిపి పారిపోవడం యాక్టివ్ హీరోయిజం అనిపించుకోదు. అది రియాక్టివ్ హీరోయిజం  అవుతుంది. దాడి చేస్తున్న దెవరు, అసలు తనెలాటి సమస్యలో ఇరుక్కున్నాడూ తెలుసుకునే ప్రయత్నం చేసివుంటే పక్కా యాక్టివ్ క్యారక్టర్ అయ్యేవాడు.  లేదూ పిరికి వాడుగా పాసివ్ గానే  కొనసాగాలని నిర్ణయిం చుకునివుంటే,  ఆ పిరికితనం అనే క్యారక్టరైజేషన్ ని క్రమం తప్పకుండా  ఎలివేట్ చేస్తూ, ఆ చేష్టలతో విలన్లతో కామిక్ సీన్స్ పండించి వుండాలి. అప్పుడు సినిమా ఎంటర్ టైన్మెంట్ వేల్యూ పెరిగేది. క్యారక్టరైజేషన్ ని పక్కన బెట్టడంతో, హీరో- విలన్లూ- పోలీసులూ అందరూ వయొలెంట్ యాక్షన్ కిందికి మార్చేశారు  మొత్తం సినిమాని. కానీ స్వాభావికంగా ఈ కథ పిల్లల పాత్రలతో వయొలెంట్ యాక్షన్ జానర్ కాదు. సాఫ్ట్ యాక్షన్ కామెడీగా సరదాసరదాగా ఉండాల్సిన జానర్. ఈ గల్లంతయిన జానర్ లో పాత్ర చిత్రణ విఫలమైన నాని ఇబ్బందికరంగా కన్పిస్తాడు. నటన వరకూ తను ఓకే, కానీ పాత్రతో కలిపి చూస్తే ఇబ్బందికరమే. 

    ఇక హీరోయిన్ మెహరీన్ పాత్ర  సోసోగా సాగేదే. టార్గెట్ పిల్లలే అయినప్పుడు సింహభాగం సీన్లు హీరోకి ఆ పిల్లలతోనే సరిపోయాయి. ఇతర  పాత్రలన్నీ ఫ్యాక్షన్, మాఫియా, పోలీసు పాత్రలు కావడం- వీటిలో కొన్నయినా యాక్షన్ కామెడీకి తగ్గట్టు ఫన్నీగా లేకపోవడంతో,  సినిమా రన్ హార్డ్ కోర్ యాక్షన్ గానే సాగుతుంది. దర్శకుడి దృష్టిలో కామెడీ అంటే మాటి మాటికీ లెంపకాయలు కొట్టుకోవడమే అన్నట్టుంది. ఒక దశ కొచ్చేసరికి ఈ లెంపకయాల మోతలతో కామెడీ భరించలేని స్థితి కొచ్చింది. కామెడీకి కూడా వయొలెన్సే ఆధారమయ్యిందని దర్శకుడు గమనించినట్టు లేదు.

    దర్శకుడికి మంచి విజువల్ సెన్స్ వుంది. మేకింగ్ పరంగా తనదైన ముద్ర కూడా వుంది. ఈ క్రియేటివిటీని  జానర్ మర్యాదని కాపాడుతూ పాత్రలకి, కథా కథనాలకి కూడా వర్తింప జేసివుంటే ఇంకా చాలా బావుండేది.

    తెలిసో తెలీకో వయొలెంట్ గా మారిపోయిన మూవీకి నేపధ్య సంగీతం కూడా అంతే  హార్డ్ కోర్ గా వుంది. పాటలు ఓ మాదిరిగా వుంటే, కెమెరా వర్క్ ఒక్కటే దాని పని అది ప్రతిభావంతంగా చేసుకుపోయింది, దర్శకుడి విజువల్ సెన్స్ పుణ్యాన.

చివరికేమిటి?
    స్వామి రారా, భలేమంచిరోజు, ఎక్స్ ప్రెస్ రాజా ల కోవలో ఇది కూడా మరో రోడ్ మూవీ తప్ప మరేం కాదు. కాకపోతే పై మూడింటిలో వున్న ఫన్ ని ఇక్కడ మిస్ అయింది. గత సంవత్సరం బేషరతుగా హిట్టయిన సినిమాల్ని గమనిస్తే, అవన్నీ జానర్ మర్యాదని కలుషితం చేయకుండా నిగ్రహం పాటించడం వల్లే హిట్టయ్యాయని తెలుస్తుంది.  అన్ కాన్షస్ గానే ప్రేక్షకులు జానర్ మర్యాద వుంటే సినిమాల్ని అక్కున జేర్చుకుంటున్నారు. దర్శకుడు హను రాఘవ పూడి భవిష్యత్తులో ఇది గుర్తు పెట్టుకోవడం మంచిదేమో!


-సికిందర్   
filmyfreak.com