రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, September 25, 2026

1442 : రివ్యూ!

 

    
    మరోసారి నాని – శ్రీకాంత్ ల కాంబినేషన్ లో ‘ది ప్యారడైజ్’  అత్యంత చర్చనీయాంశ తెలుగు యాక్షన్-డ్రామాగా  విడుదలైంది. ‘దసరా' (2023) ఘనవిజయం తర్వాత నేచురల్ స్టార్  నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మళ్లీ కలిసి పనిచేయడంతో, ఈ మూవీపై  భారీ అంచనాలు,  ప్రీ-రీ రిలీజ్ హైప్ వగైరా ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలని, హైప్ నీ అందుకునేలా మూవీ వుందా? దీని రిజల్ట్ ఏమిటి? ఈ వివరాలు కింద రివ్యూలో చూద్దాం...

కథేమిటి?
1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో ఈ కథ సవారీ అనే అణగారిన తెగకి చెందిన ప్రజలు తమకు పౌరులుగా ప్రభుత్వ గుర్తింపు కోసం, తమ ఆత్మ గౌరవం కోసం, మనుగడ కోసం చేసే పోరాటాన్నీ తెలియజేస్తుంది.  తమని అణిచివేసి ప్రైవేటు పాలన సాగిస్తున్నశిఖంజా మాలిక్ (మోహన్ బాబు) అనే భూస్వామి ఉక్కు హస్తాల నుంచి విముక్తి కోసం పోరాడేందుకు జడల్ (నాని) సిద్ధమవుతాడు. చిన్నప్పుడు ఇతను బిర్యానీ దొంగిలించి తిన్నాడని దారుణంగా అవమానించి, అక్రమసంతానంగా ముద్ర వేసి, 14 ఏళ్ళు జైలు పాలు చేసిన మాలిక్ మీద పగదీర్చుకునేందుకు విడుదలై వస్తాడు. అతడికి ఇంకో ద్వేషం వుంటుంది. కన్న తల్లి సమ్మక్క (మమతా కులకర్ణి) వేశ్య అని నమ్ముతాడు. మరో వైపు తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి బి గ్రేడ్ అడల్ట్ సినిమాల్లో  నటించిన సుబ్బు (కయాడు లోహార్) అనే అమ్మాయిని ప్రేమించి, ఆమె గతం తెలుసుకుని వదిలేస్తాడు. ఇంకో వైపు మాలిక్ కొడుకు విక్రం మాలిక్ (రాఘవ్ జుయల్ ) కూడా జడల్ చిన్నప్పుడు అన్యాయం చేసిన వాడే. ఈనేపథ్యంలో తల్లిపై ద్వేషాన్ని, సుబ్బు మీద అసహ్యాన్ని, శికంజా మాలిక్, విక్రం మాలిక్ లపై పగనీ ఎలా తీర్చుకున్నాడనేది  మిగతా కథ.

ఎవరెలా చేశారు?
శారీరకంగా ఎంతో కష్టపడి, పూర్తి అంకితభావంతో చేసిన నటనతో నాని సినిమాని తన భుజాలపై మోసే ప్రయత్నం చేశాడు. నేచురల్ స్టార్ కాస్తా యాక్షన్ స్టార్ గా ‘దసరా’ తర్వాత మరోసారి ప్రయత్నించడం సాహసమే అయింది. స్టార్ అన్నాక కథా కథనాలని కూడా భుజాలపై మోయాలి. ఇక్కడే వచ్చింది సమస్యంతా. మోయడానికి కథే లేదు, కథనమే లేదు. లేని విషయంతో యాక్షన్ స్టార్ గా ఓవరాక్షన్ తప్ప. మితిమీరిన వైలెన్స్, చెవులు పగిలే బిజిఎం వుంటే చాలు సినిమాని మోసెయొచ్చు అనుకోవడం ఖరీదైన పొరపాటుగా తేలింది.

హీరోయిన్ తో లైట్ రోమాన్స్, ఓ రెండు సాంగ్స్ లో డాన్స్ ఓకే, కానీ పాత్ర విషయంలోనే ఆ పవర్ లేదు. సెకండాఫ్ లోనైతే ఏ పవరూ లేక ఎటెటు వెళ్ళిపోయాడో తెలీదు. అసలు ఇంటర్వెల్ లోనే ముగిసిపోయిన కథని అలా ముగించి శుభం వేసేస్తే పోయేదానికి అనవసరంగా సెకండాఫ్ ని  పట్టుకుని లాక్కుంటూ పోయాడు. ఈ లాగుడు పోటీ ఒలింపిక్స్ లో పనిచేస్తుంది గానీ, బాక్సాఫీసులో సాగదీసిన రబ్బరు లా ఎదురు తన్నుతుంది! ఈ ఖరీదైన, పానిండియా లెవెల్ రబ్బరు బ్యాండ్ సినిమా, అతడి కెరీర్ లో ఓ పెద్ద బ్యాడ్ లక్ గా నమోదవక తప్పదు!

సెకండాఫ్ లో మిగతా నటీనటులందరూ కథా కథనాలు సహకరించని బాదితులే. మోహన్ బాబు అయితే మరీ విలనీ చాలించుకుని కూర్చున్నారు. సరైన పాత్ర లేక మోహన్ బాబు అలా కూర్చుంటే నాని మాత్రం అయన మీద పోరాటం ఎలా చేయగలడు. కనుక పాసివ్- రియాక్టివ్ క్యారక్టర్ గా మారిపోయి ఏకపాత్రాభినయం చేశాడు.

హీరోయిన్ కయాదు లోహర్ మంచి ఎక్స్ ప్రెషన్స్ వున్న నటి. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ వుంది. అయితే ఈమెని కూడా పాత్ర చిత్రణ దెబ్బ కొట్టింది. తండ్రి చేసిన అప్పుల్ని తీర్చడానికి బీ గ్రేడ్ అడల్ట్ మూవీస్ లో నటించిన తను, ఆ అప్పు తీర్చే బాధ్యత పూర్తయ్యాక ప్రాణాలు తీసుకుని పైలోకాల్లో తండ్రిని చేరుకోవాలని ప్రయత్నిస్తుంది. ఇలా చేస్తే ఆ తండ్రి అప్పు తీర్చడానికి ఆమె చేసిన పనికి గర్విస్తాడనుకుందా, అమాయకురాలు కాకపోతే?

నాని తల్లి పాత్రలో మమతా కులకర్ణి ఎక్సెలెంట్ గా కుదిరింది. మంచి పాత్ర, బలమైన నటన. ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆమె పాత్రకే పరాకాష్ట. అయితే ఇక్కడా  ఇంకో తేడా వుంది. చిన్నప్పుడు కొడుకు జడల్ ఆమెని వేశ్యగా నమ్మి ద్వేషించడం. ఎవడో ఒక దుర్మార్గుడు ఆమెని వేశ్య అంటే, మా అమ్మని అలా అంటావాని ఎదురుతిరిగి కొట్టక, వాడి మాటలు నమ్మేసి తల్లిని ద్వేషించడం సిల్లీగా వుంది. దీని మీదే మదర్ సెంటి మెంటు ఆధారపడి వుంటుంది. అర్ధం లేని పాయింటుతో మదర్ సెంటిమెంటు. ఇది వర్కౌట్ కాలేదు. ఇక విక్రం శికంజాగా రాఘవ్ జుయల్ బాగానే నటించాడు ఫస్టాఫ్ వరకూ  వుండే చిన్న విలన్ పాత్రలో.

ఇదంతా అలా వుంచి అసలు కెసిఆర్ పాత్రలో నటించిన ప్రియదర్శి ఒక ఆకర్షణ ఈ సినిమాకి. అలాగే సవారీ తెగ పాత్రలో సంపూర్ణేష్ బాబు కనిపిస్తాడు.

సాంకేతికాల సంగతేమిటి?
ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్ల రూపొందించిన బస్తీ, నగరపు సెట్లు ప్రామాణికంగా, సహజసిద్ధంగా వున్నాయి- కథా ప్రపంచాన్ని ప్రతిబింబిస్తూ. దీనికి సీహెచ్ సాయి కెమెరా పనితనం విజువల్ వండర్స్ కి కేరాఫ్ అడ్రసుగా వుంది. కథ ప్రకారం డార్క్ మూవీ కాబట్టి ఆ మూడ్ ని  క్రియేట్ చేయడం లో సక్సెస్ అయ్యాడు.

రామ్-లక్ష్మణ్, రియల్ సతీష్ ల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు చాలా వైలెంట్ గా వున్నాయి. తలలు ఎగిరిపోవడం, రక్తాలు పారడం వంటి అతి బీభత్స భయానక దృశ్యాలు అడుగడుగునా దర్శన మిస్తాయి.

ఇక అనిరుధ్ రవిచందర్ తన సంగీతంతో  లేని కథని పైకి లేపేందుకు చేయాల్సిన కృషినంతా   చేశాడు. ఫలితం సున్నా.

కథా కథనాల సంగతి?
గుర్తింపు కోసం అణగారిన వర్గాల పోరాటం, ప్రతీకారం, రాజకీయాలు, మదర్ సెంటిమెంట్ వంటి అనేక అంశాలని  ఒకే కథలో కుదించడానికి ప్రయత్నించడం వల్ల ఈ స్క్రీన్ ప్లే అనేది గందరగోళంగా మారింది. కథని సెటప్ చేస్తూ ఫస్టాఫ్ కూర్చోబెట్టే విధంగా వున్నప్పటికీ, ఈ సెటప్ లో అనేక పాయింట్లు చెప్పుకుంటూ పోవడంతో, ఏ పాయింటు మీద కాన్ఫ్లిక్ట్ పుడుతుందో అంతుచిక్కకుండా పోయింది. బిగ్ ఈవెంట్ సీన్లతో హంగామా ఆర్భాటం చేసుకుపోవడంతో స్ట్రక్చర్ కి అందకుండా పోయింది కథ.

చివరికి 40 వ నిమిషంలో జైలు నుంచి తిరిగి వచ్చిన జడల్, విక్రం శికంజాని  టార్గెట్ చేస్తూ పాత పగ తీర్చుకోవడానికి పోరాటం ప్రారంభిస్తూ అతడితో చాలెంజి చేసినప్పుడు, ప్లాట్ పాయింట్ వన్ వచ్చిందనుకుంటే, ఇది కాస్తా జడల్ మదర్ ఫ్లాష్ బ్యాక్ చెప్పి, జడల్ అపార్దాన్ని తొలగించాక, ఆ తర్వాత విక్రం శికంజా బారినుంచి ఆమెని కాపాడాక, రెండు జరిగాయి : ఏదైతే సోకాల్డ్ మదర్ సెంటిమెంట్ అనే ఎమోషనల్ హై వుందో అది ముగిసిపోవడం, విక్ర్రం శికంజాని చంపడంతో కథ కూడా ముగిసిపోవడం!

దీనితర్వాత ఇంటర్వెల్లోనే జడల్, శికంజా మాలిక్ మీద దండెత్తినప్పుడు, తమ తెగ గుర్తింపు కోసం పోరాటం ప్రారంభిస్తానని చాలెంజి చేస్తాడు. దీంతో రెండు ప్రశ్నలు: ఇంకా చాలెంజి దేనికి, ఆ ఊపులో మాలిక్ ని కాల్చి చంపేసి కథ ముగించెయ్యక?  రెండోది, తన కొడుకుని చంపిన జడల్ చాలెంజికి మాలిక్ దిక్కులు చూడడం దేనికి, జడల్ మదర్ ని చంపేసి కొత్త సమస్య సృష్టించక?

ఈ కథ సెకండాఫ్ కి మిగిలి వుండాలంటే, ఇంటర్వెల్లో జడల్ మదర్ అతడి అపార్ధాన్ని తొలగిస్తూ ఫ్లాష్ బ్యాక్ చెప్పకూడదు. మదర్ మీద అతడి ద్వేషం కొనసాగాలి. ఈ నేపధ్యంలో మాలిక్ తన కొడుకుని చంపిన జడల్ మదర్ ని చంపేస్తే, సెకండాఫ్ కథకి జడల్ ఎదుట బిగ్ ఎమోషనల్ చాలెంజి ఏర్పడేది. ఏమిటా బిగ్ ఎమోషనల్ చాలెంజి? తను వేశ్య అని నమ్మి ద్వేషిస్తున్న మదర్ ని మాలిక్ చంపేసినందుకు సంతోషించాలా, ఏడ్వాలా? కనీసం ఈ ఎమోషనల్ కంటిన్యూటీ అయినా కాపాడేది సెకండాఫ్ ణి.

ఇదీ సెకండాఫ్ కి కథయినప్పుడు, సెకండాఫ్ సేఫ్ అయ్యేది. కానీ ఇంటర్వెల్లోనే కథ ముగిసిపోయేట్టు చేశాక, నడపడానికి కథ లేక ఏమేమో చేసుకుంటూ పోయాడు దర్శకుడు. ఇందులో మోహన్ బాబు క్యారక్టర్ పూర్తిగా డమ్మీ. కథ లేక, భావోద్వేగాలు లేక, మితిమీరిన రక్తపాతం, హింసాత్మక యాక్షన్ సీన్లు- కథకి కాక, చేతిలో పడ్డ బిగ్ బడ్జెట్ కి న్యాయం చేయాలన్నట్టు సాగింది ధోరణి. ఇంకెన్ని జడలు పెంచుకున్నా జడంగా వున్న కథకి జరంత జోష్ కూడా వచ్చే మోఖా లేదు!

-సికిందర్

 


Monday, August 31, 2026

1442 :


 (ఈ వ్యాసంలో ఒక్క ఇంగ్లీషు పదమూ ఉపయోగించకూడదనుకుంటూ రాస్తే, 'ఫోర్ షాడోవింగ్' అనే పదం విషయంలో రాజీ తప్పలేదు)

యలమంచిలి సాయిబాబు నిర్మాణ సారథ్యంలో బాపూ రమణల సరికొత్త రామాయణ అభివ్యక్తి 'లవకుశ' పునర్నిర్మాణమే అయినప్పటికీ, 'శ్రీరామరాజ్యం'గా నామకరణం చేశారు. లవకుశల కథాంశానికి ఈ విధంగా నామకరణం చేయడంతో రామరాజ్యమంటే, అందులోనూ గాంధీజీ కలలుగన్న రామరాజ్యమంటూ తరచూ వింటున్న ఒక భావన ఏదైతే వుందో అదంటే ఇలా కష్టాలూ కన్నీళ్ళతో నిండి వుంటుందా అని ఈతరం ప్రేక్షకులు భావించుకునే అవకాశముంది. ఇదే ఉత్తరకాండ గాధని తీసుకుని రామానంద్ సాగర్ బుల్లితెరకెక్కించినప్పుడు అపోహలకి అవకాశమివ్వకుండా, స్పష్టంగా 'లవకుశ'గానే నామకరణం చేశారు. బాలల పేర్లతో సినిమాలకిది కాలం కాదన్న అభిప్రాయంతోనేమో, మకుటాన్ని 'శ్రీరామరాజ్యం'గా మార్చి, నందమూరి బాలకృష్ణ హోదాకి తగ్గట్టుగా అలంకరించి వుండొచ్చు.

ఈ కాలపు పౌరాణికాలకి ఆధునిక సాంకేతిక హంగులు తోడైతే తిరిగి ఇవి కూడా చిరస్థాయిగా నిలిచిపోవచ్చు. సాంకేతికంగా ఈ ఔన్నత్యాన్ని సాధించ గలిగిందీ సినిమా. దీని వెనుక సాంప్రదాయ కళలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ రెండిటి మేలు కలయిక వుంది. నేటి సాంకేతిక హంగుల మాయాజాలాలతో దృశ్య శబ్ద కాలుష్య కాసారాలుగా మారిన వాణిజ్య సినిమాల విధ్వంసానికి దూరంగా ఒక కన్నుల పండువైన వీనుల విందైన దృశ్యకావ్యం తెలుగు తెరకెక్కడం మొత్తం దేశానికే గర్వకారణం.

 

కమాల్ అమ్రోహీ  'పాకీజా' తీశాడు, కె.వి.రెడ్డి 'మాయాబజార్' తీశాడు. బాపూరమణలు తమ అంతిమ విన్యాసంగా 'శ్రీరామరాజ్యం' అందించారు. రామాయణంలో తలపండిన వీరిద్దరూ దాని విలువని న్యూనత పరుస్తారని ఎవరూ అనుకోనవసరం లేదు. ఖండాంతరాల్లో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో ఈ రామాయణాన్ని సమాదరించడమే నిదర్శనం. ఒక దర్శకుడి దృశ్య సృష్టి, మరో రచయిత కలం పుష్టి కలిసి తదాత్మ్యం చెంది ఓ అపురూప కళాఖండం అవతరించిన సందర్భమిది. నూట ఎనభై నిమిషాల కాలమే తెలియని కథా సాగరంలో ముంచెత్తిన అనుభవమిది... ఈ ముగ్గురూ ప్రధాన ఆకర్షణగా, కాలంకాని కాలంలో నింపాదిగా ఏతెంచి, నిలకడగా తన దర్పాన్ని ప్రదర్శించుకుంటున్న లవకుశ 'శ్రీరామరాజ్యం'.

అంతరాత్మని నొక్కివేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించ వచ్చనుకుంటే లవకుశల చేతిలో దెబ్బతిన్న శ్రీరాముడి పరిస్థితే ఎదురవుతుంది. ఉత్తరకాండ మానవుడి మానసికలోకపు వ్యవహార సరళి అనుకోకపోతే, రాముడు పదివేల సంవత్సరాలు పాలించాడనేది తర్కానికి అందదు. పదివేల సంవత్సరాలు పాలించడమంటే, మనిషి తన శరీరంలోని పదివేల నాడుల్ని పాలించుకోవడమన్నమాట. ఆ మానసికలోకంలో శ్రీరాముడు పనిగట్టుకుని అంతచ్చేతనాన్ని సంక్షుభితం చేసుకున్నాడు. అంతచ్చేతనంలో నగ్న సత్యాలు పొంచి వుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మనసంగీకరించదు. అరణ్యంలాంటి అంతచ్చేతనంలో మనస్సనే రాముడు సీత అనే ఓ నగ్నసత్యాన్నీ, దాని మరో రెండు అంకురాల్నీ నెట్టివేసి వాటికి సమాధానం చెప్పుకోలేక తీవ్ర మానసిక సంఘర్షణనెదుర్కొన్నాడు.

 

చివరికి అశ్వమేథయాగమనే తన మనోరథాన్ని ఆ సంక్షుభిత అంతచ్చేతనంలోకి వదిలి శాంతి ప్రయత్నాలు ప్రారంభించాడు. అక్కడి నగ్న సత్యాలతో తలపడి ఒడంబడిక చేసుకున్నాడు. అంతచ్చేతనం లేదా అంతరంగం ఎంత శక్తివంతమైందో అవగాహన చేసుకుని, దానితో చెలగాటపు  ఫలితాలేమిటో కూడా తెలుసుకుని ప్రశాంత చిత్తుడయ్యాడు. స్థూలంగా ఈ మానసిక ప్రపంచాన్ని ఆవిష్కరించే ఉత్తరకాండ, అచ్చుగుద్దినట్టు 'లవకుశ'లో ఆవిష్కారమైంది. మనస్సుకి  ప్రతీక అయిన శ్రీరాముడు, లోపలి మనస్సుకి  ప్రతీకలైన లవకుశల మధ్య సంఘర్షణని పోరాటాన్నీ కేంద్ర బిందువుగా చేసి, అంటే ఈ అద్భుత రసాన్ని ప్రధానంగా చేసి, మిగతా కరుణ రసాన్నంతా అనుబంధంగా నడపడం వల్ల 'లవకుశ' ఒక ఉద్విగ్నభరిత వినోదానికి అవకాశమిచ్చింది.

 

నవీన కాలపు భాష్యం :

'శ్రీరామరాజ్యం' కరుణ రసమే జీవధారగా ఆద్యంతం సాగి, ఇది బాపూరమణల ముద్రతో నవీనకాల భాష్యం అన్నట్టుగా కన్పిస్తుంది. ఇందులో శ్రీరాముడు (బాలకృష్ణ) రావణ సంహారం ముగించి, సీతతో, మిగతా బంధు, వానరదండు సమేతంగా అయోధ్యకి తిరిగి వస్తాడు. కుల గురువు వశిష్ట మహర్షి సమక్షంలో, తన ముగ్గురు తల్లుల ఆశీర్వాదంతో పట్టాభిషిక్తుడవుతాడు. చల్లగా రాజ్యపాలన చేస్తూంటాడు. సీత గర్భందాల్చిందని తెలుస్తుంది. ఇంతలో తన రాజ్యంపై ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో భద్ర అనే వేగు ద్వారా చాకలితిప్పడు (బ్రహ్మానందం) అభిభాష్యాన్ని విని ఖిన్నుడవుతాడు. భార్యని అనుమానించిన తిప్పడు, ఏడాదిపాటు పరపురుషుడితో గడిపిన భార్యని వెర్రిబాగులవాడిలా ఏలుకుంటున్న శ్రీరామచంద్రుడ్ని కాలేనని కూయడం రాముడి కళ్ళు తెరిపిస్తుంది.

 

దీంతో రాజుకు రాజ్యమే తప్ప వ్యక్తిగత ప్రాధాన్యాలుండకూడదన్న ఒకే ఒక్క నియమంతో సీతని త్యజించడానికి సిద్ధపడతాడు. లక్ష్మణుడిని (శ్రీకాంత్) ఇచ్చి సీతని అడవుల్లో వాల్మీకి ఆశ్రమానికి పంపేస్తాడు. భర్త ఆంతర్యం ముందు తెలీక, తర్వాత తెలిసి కుమిలిపోయిన సీత లవకుశలకి జన్మనిస్తుంది. ఈ ఇద్దరూ పెరిగి వాల్మీకి (అక్కినేని నాగేశ్వరరావు) శిష్యులవుతారు. రాముడు గురించి ముందు చదువుకుని ఆరాధించి, తర్వాత కళ్ళారా చూసి విభేదించి (చదివి తెలుసుకోవడం వేరు, చూసి తెలుసుకోవడం వేరు అన్న స్వర్గీయ ముళ్ళపూడి చమత్కారంతో) ద్వేషిస్తారు. ఇక రాముడికి వీళ్ళిద్దరే తన సంతానమని ఎలా తెలిసింది? సీతతో పునఃసమాగమమెలా జరిగింది? వీటి గురించి ఎలాంటి సంఘర్షణనెదుర్కొన్నాడు మొదలైనవి తర్వాతి వృత్తాంతం.

లవకుశ కథనం, బాపూరమణల భాష్యం :

శ్రీరామరాజ్యాన్ని 'లవకుశ'తో పోల్చడం కాదు, పునర్నిర్మాణంలో తలపండిన బాపూరమణలు తేడా ఎలా కనబర్చారో తెలుసుకునే ప్రయత్నమే ఇది. అసలు పురాణం జోలికి పోకుండా దాని రెండు వెండితెర రూపాల తులనాత్మక పరిశీలనే ఇది. ఎందుకంటే ఇది ఇతర సమకాలీన సినిమా కథా కథనాల తయారీలో దిక్సూచిగా వుండొచ్చు. రససిద్ధికి దేని ప్రాధాన్యమెంతో తెలియడం అత్యవసరం. రససిద్ధి లేని చలన చిత్రం నిస్సారమే.

'లవకుశ'లో అంక విభజన స్పష్టాతి స్పష్టంగా జరిగి ఆయా అంకాల్లో నిర్వహించవలసిన కథా కార్యకలాపాలు సూత్రాలకి లోబడి వుంటాయి. రాముడికి సీత మీద అపవాదు తెలిసే మలుపు తిరిగే ఘట్టంతో మొదటి అంకం సరిగ్గా నలభై నిమిషాలకి పూర్తవుతుంది. ఇక్కడి నుంచి సుదీర్ఘంగా సాగే రెండో అంకంలో రాముడి మానసిక సంఘర్షణ, అతని ప్రత్యర్థులైన లవకుశల అవతరణ, సమరానికి వారి శిక్షణ, రెండో వైపు బేలతనం మానమంటూ రాముడికి పితృపితామహుల ఉద్బోధ, సీత పట్ల తన నీతికి మొదటి ప్రక్రియగా రాజ్యంలో కరువు కాటకాలు, లవకుశల అయోధ్యా ప్రవేశం, రాముడితో తొలిసారి ముఖాముఖి విభేదం-విద్వేషం, రాజ్య సంక్షేమం కోసం రాముడి అశ్వమేధయాగం, ఆ యాగాశ్వం కాస్తా లవకుశల ఇలాకాలోకి ప్రవేశించడంతో రెండో అంకం ముగిసి పతాక సన్నివేశానికి దారితీసే మూడో అంకం ప్రారంభమవుతుంది. ఇక్కడ రాముడి సైన్యంతో, లక్ష్మణుడితో, స్వయంగా రాముడితో లవకుశలు ఎదిరించి సమరం సాగించడం, తదనంతర పరిణామాలతో నిజాలనెరిగి, శోకతప్త సీత సహా లవకుశలతో రాముడు ఏకమై సుఖాంతమవుతుంది.

సమస్యా పరిష్కారానికి రాముడు లవకుశల మధ్య క్రియ-ప్రతిక్రియల అప్రతిహత కథనమే ఈ సినిమాకి వెన్నెముకగా నిలిచింది. ఇక ఇటు రాముడి శోకం, సీత దుఃఖానికి సంబంధించిన కరుణ రస ప్రక్రియ వున్నా - దానికి రెండో ప్రాధాన్యమే. దీన్ని కూడా నీరుగార్చి సినిమాని జనరంజకంగా రూపొందించేందుకు రేలంగి - గిరిజ, రమణారెడ్డి - సూర్యకాంతంలతో హాస్య ప్రహసనం, పాటలూ పెట్టారు. భక్తిరసం ఉప్పొంగేలా లవకుశల గానాన్ని చేర్చారు. ఈ రెండు పాత్రల పోషణ అత్యంత చురుకుగా, చిచ్చరపిడుగులకి సజీవ సాక్ష్యాలు అన్నట్టుగా జరిగింది. మొత్తంగా చూస్తే, కథ ఏ రూపంలో చెబుతున్నా, అందులో అంతఃచేతన చేతనావస్థల చెలగాటమే ప్రధానమన్న సార్వజనీన సూత్రానికి న్యాయం చేసిన సినిమాగా 'లవకుశ' కనిపిస్తుంది.

 

ఈ సూత్రం 'శ్రీరామరాజ్యం'లో లేదని కాదు. కాకపోతే బాపూరమణల భాష్యానికి లోబడి అద్భుత రసాన్ని కరుణరసం అధిగమించడం వల్ల సూత్రం సన్నగిల్లి హృదయాలు బరువెక్కే విషాద గాధగా తెరకెక్కింది. ఉత్తరకాండకి అనుసరణగా తీసిన 'ముత్యాల ముగ్గు'లో పిల్లల పాత్రలతో అద్భుతరసమే ప్రధాన పాత్ర వహించి ఆ సినిమా జనరంజకంగా తయారయ్యింది. అలాంటి అక్కడి లవకుశలు ఇక్కడ అంత కుశలంగా వుండలేక  పోయారు.

 

ఈ సినిమా మొదటి అంకం ముప్పై నిమిషాలకే పూర్తవుతుంది. మొదటి అంకం ముగింపు అంటే సమస్యని ఏర్పాటు చేయడమే. ఈ సమస్యా స్థాపన పటిష్టత ఈ అంకం కథా వ్యాపారంలో ఒక పాత్ర చిత్రణా లోపం వల్ల బీటలు వారింది (క్రింది పట్టిక చూడండి). ఎప్పుడైతే కథా నిర్మాణంలో సమస్యా స్థాపన అనే మొదటి మూలస్తంభం బలంగా వుండదో, అప్పుడు మూడవ అంకంలో పతాక సన్నివేశాల స్తంభం కూడా బలహీనపడుతుంది. ఈ సినిమా ముగింపు బలహీనంగానూ, ఆకస్మికంగానూ ఉండడానికి కారణమిదే.

ఈ సినిమా దృశ్య క్రమం మాతృకని తు.చ. తప్పకుండా అనుసరించే వుంటుంది. కాకపోతే ఆయా సన్నివేశాల్లో మాతృకలోని భావార్థాన్ని ఏ కారణం చేతో స్వీకరించకపోవడం వలన కథనం వ్యతిరేక అర్థాలకు దారితీసిన వైనాలూ లేకపోలేదు.

క్రమ సంఖ్య

లవకుశ

శ్రీరామరాజ్యం

1

జనకుడితో సీత: 'రాముడితో అడవుల్లో అనేక కష్టాలు పడ్డాను, ఇక వీడి వుండలేను' అంటుంది. ఇది పాత్రకి బలమైన నేపథ్యాన్ని ఏర్పాటు చేసేందుకు, పాత్ర మనస్తత్వం తెలిసేందుకు వేసిన పాచిక.

జనకుడి చెవిలో సీత గుసగుసలాడుతుంది, ఏం చెప్పిందో తెలీదు. పాత్ర అర్థం కాదు.

2

తల్లివి కాబోతున్నందుకు ఏ కోరికైనా కోరుకో తీరుస్తానంటాడు రాముడు - గోడమీద ప్రకృతి చిత్రపటం చూపిస్తూ వాల్మీకి ఆశ్రమంలో గడుపుతానని ముచ్చట పడుతుంది సీత. పద్నాలుగేళ్ళు అడవుల పాలయ్యాం, మళ్ళీ అక్కడికెందుకు? అని మందలించి, సరేనంటాడు రాముడు.

చిత్రపటం ఏమీ వుండదు. ఆమె వాచ్యంగా చెప్పిన దానిని అభ్యంతర పెట్టకుండా వెంటనే ఆమోదిస్తాడు. రెండు పాత్రల్లోనూ సాంద్రత లోపించింది.

3

ఆశ్రమానికి వెళ్ళడంలోని బాధని దాసీలతో పంచుకుని తన మనస్సేమిటో తెలియజేస్తుంది సీత.

ఈ దృశ్యం లేదు. మరోసారి సీత మనోభావాలకి అడ్డుకట్ట.

4

నిద్రలో రాముడ్ని వీడి వెళ్ళలేనని సీత కలవరింత. విడిపోతే ఆమె వేదన ఎంత దయనీయంగా వుండగలదో తెలిపే చిత్రణ. పైగా ఆమెపై బహిష్కార వేటు వేసే సమయంలో రాముడి సంఘర్షణకి వీలిచ్చే ఎరుక. ఆమె కలవరిస్తున్నప్పుడు రాముడు ఆమె సమక్షంలోనే వుంటాడు.

ఈ దృశ్యం కూడా లేదు.

5

రాముడు పీడకల కంటాడు. అందులో సీతని పిలుస్తాడు. నాకీ రాజ్యం వద్దని సింహాసనాన్ని తోసేస్తాడు. దాని కింద ఆమె పడుతుంది. లాగడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇది ఫోర్ షాడోవింగ్ దృశ్యం. ముందు జరుగబోయే పరిణామం. ఆమె రాజ్యాధికారం అనే నిర్ణయం క్రింద నలిగిపోక తప్పదన్న మాట. రాముడు రాజ్యం కోసం ఆమెని త్యజించబోతున్నాడన్న మాట.

ఈ సన్నివేశం లేదు.

6

ఆమె మీద అపవాదు రాగానే ఆమెను కాపాడుకోవాలని తపన పడతాడు. ఆమెతో తను కూడా వెళ్ళిపోతానని సంఘర్షిస్తాడు. తమ్ముళ్ళు వారిస్తారు.

సీతని కాపాడుకోవాలన్న తపనగానీ, ఆమెతో పాటే వెళ్ళిపోతానన్న మాటగానీ వుండదు. పాత్ర భావాత్మక నేపథ్యానికి కోతపెట్టడం వల్ల (2, 4, 5 సన్నివేశాల్లో కూడా లుప్తం చేయడం వల్ల) తన రాజ్యాధికారానికి తమ్ముళ్ళ చేత ఔననిపించడానికే దొంగనాటకమాడుతున్నట్టు ఈ సన్నివేశం కనిపిస్తుంది. మొదటి అంకం ముగింపులో ఇదీ సమస్యా ఏర్పాటు సన్నివేశం! ఈ అంకంలో జరిగే వ్యాపారం పాత్రల పరిచయం, కథావస్తువు ఏర్పాటు, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్యాస్థాపన అనే నాలుగులో ఏ ఒకటి పేలవంగా వున్నా మొత్తానికే ప్రమాదం.

7

అడవికి తన భర్త పంపిన అసలు కారణం తెలుసుకున్న సీత కళ్ళు తిరిగి పడిపోతుంది. కొద్ది క్షణాల్లో తనే లేస్తుంది.

సీత పడిపోయాక లక్ష్మణుడు పంచభూతాలని పిలుస్తాడు. ఆమె కళ్ళు తెరుస్తుంది. కానీ సీత తనే ప్రకృతి కదా?

8

రాముడు చేసిన పనికి ప్రతీకారంగా తన తల్లి రాజ్యాన్ని అల్లకల్లోలం చేసినట్టు కలగంటుంది సీత. అలా చేయవద్దని ప్రాధేయపడుతుంది.

కలగనదు. దీంతో ఆమె తల్లి ప్రతీకార తీవ్రత ఏ స్థాయిలో వుంటుందో అదృశ్యంగా వుండిపోతుంది. దృశ్యం పడి వుంటే ప్రేక్షకులపై దాని ప్రభావం వేరు.

9

రాముడు అశ్వమేథయాగం చేస్తున్నాడని తెలిసి సీత ఒక ఋషితో ఇంకో సహచరితో అనుమాన నివృత్తి చేసుకుంటుంది. బ్రహ్మచారి, భార్యాహీనుడు యజ్ఞయాగాల పేరైనా ఎత్తవద్దని వారంటారు. అంతే దాంతో ఆమె భర్త రెండో పెళ్ళి చేసుకుని యాగం చేస్తున్నట్టు వూహించుకుని కలవరపడుతుంది. లోలోన కుమిలిపోతుంది.

సహచరి తనే రెండో పెళ్ళి చేసుకుని యాగం చేయవచ్చని అంటుంది. సీతకి ఆ మాత్రం వూహ రాదు. సహచరి మాటలకి ఆమె అతిగా స్పందించి అతిగా ప్రవర్తిస్తుంది. అయితే గతంలో 'ఆయన రాజు అయితే నేను రాణికానా, నాకు బాధ్యత వుండదా, వంశానికి నేనెలా కళంకం తెస్తాను' అని మాట్లాడింది. మరి ఇప్పుడు భర్తమీద తండ్రికి అనుమానాలు కలిగినట్టే, తన మీద అతడికి కలగడం సహజమేనని ఎందుకాలోచించదు? ఎందుకు అతిగా స్పందించి దిగజారాలి?

 

సాంకేతికంగా అద్భుతమైన రాజ ప్రాసాదాల సెట్, అడవీ ఆశ్రమాల సెట్స్ వేసిన కళా దర్శకుడు రవీందర్, ఆదిల్ అదిలీ, నయాం అఖ్తర్ మైకేల్ క్లీట్ బృందం సమకూర్చిన సమున్నత దృశ్య ఫలితాలూ, జె. జె. కృష్ణారావు పదునైన కూర్పు, పి. ఆర్. కె. రాజు అచ్చెరువొందే అంతర్జాతీయ స్థాయి ఛాయాగ్రహణమూ తదితర విశేషాలతో బాపూరమణల చివరి ప్రయత్నంగా (?) మిగిలిపోతుందిది.

ఇళయరాజా సంగీతం ఇంకో ప్రత్యేకాకర్షణ. అయితే సీమంతం పాట, మరో లవకుశుల పాట మాత్రమే మిగిలిన వాటితో పైస్థాయిలో వున్నాయి. అన్ని పాటలకీ జొన్నవిత్తుల సాహిత్యం గొప్పగా లేకపోయినా ఫర్వాలేదు. అయితే వాల్మీకి పాత్రలో అక్కినేని ఉచ్చారణ అంత అరిచినట్టుగా వుండనవసరంలేదు. మొదటి అరగంటసేపూ బాలకృష్ణ కంఠంలోనూ భావోద్వేగాల గాఢత కనిపించదు. హృదయాన్ని తాకే ఒక మంచి భావోద్వేగ సహిత ఉచ్ఛారణ కోసం పరితపిస్తున్నప్పుడు సీమంతం పాటకి ముందు కౌసల్య పాత్రధారి కె.ఆర్. విజయ హృదయాల్ని పిండే ముఖభావాలలో వెళ్ళబోసుకునే వేదన కాస్సేపు గుండెల్ని పిండేస్తుంది (ఈ డబ్బింగ్ ఆర్టిస్టు పేరు కోసం విఫలయత్నం చేశాం).

తర్వాత ప్రజలు అలమటిస్తూ వచ్చి వెళ్ళబోసుకునే బాధ సాంద్రత నిండిన మాటలతో మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సీత పాత్రధారి నయనతారకి గాత్రదానం చేసిన గాయని సునీతని ప్రత్యేకంగా అభినందించాలి. అయితే ఆమె గాత్రధారణ మాత్రమే పండి, నయనతార నటన అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. పాపం సునీత ఆ ఎత్తున ఏడ్చి రక్తికట్టిస్తే, ఆ ఏడ్పులోనించి తలెత్తి చూసే నయనతారకి కన్నీళ్ళే వుండవు. ఆమెది ప్రశ్నార్థకం పలికే ముఖారవిందం. 'సింహా' లో గృహిణిగా బాలకృష్ణకి జోడీగా బాగా కుదిరిందని ఇందులో తీసుకున్నారేమోగానీ, సాంఘికాల్లో గృహిణి, పౌరాణికాల్లో సీతగా రాణించాలని లేదు. సీత పాత్ర పోషించడానికి నయనతార అర్హురాలు కాదని మొదట్లోనే బాల్ థాకరే ఎందుకు నోరు చేసుకున్నాడో గానీ అతనే కరెక్ట్ అనిపిస్తుంది.

-సికిందర్
దర్శకులం డాట్ కాం
17.11.2011