రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, March 18, 2021

1027 : సాంకేతికం

     కొన్ని సినిమాల్లో ఓ షాట్ స్ట్రెస్ బస్టర్ లా వెంటపడుతుంది. ఆ షాట్ ని గుర్తు చేసుకుంటే మానసిక వొత్తిళ్ళు దూరమైపోయేంత బలం వాటికుంటుంది. సినిమా మొత్తం మీద ఆ షాటే గుర్తుండిపోతుంది. ఆఫ్ కోర్స్, ఇది చూసే వాళ్ళ దృష్టిని బట్టి వుంటుంది. సినిమా కథలు, స్క్రీన్ ప్లే వెతలూ లోకమైపోయిన వాళ్ళకి షాట్స్ మీద క్రియేటివ్ దృష్టి ఎక్కువ వుంటుంది. ఎందుకంటే సినిమా కథలంటేనే, స్క్రీన్ ప్లేలంటేనే షాట్స్ తో విజువల్ గా ఆలోచించడం. సినిమా కథ ఆలోచించడమంటే మేస్త్రీలా కథలో పడి తిరుగుతూ విజువల్ గా ఆలోచించడమే, మహర్షిలా వ్యాసం రాయడానికి కూర్చుని ఆలోచించినట్టు కాదు. విజువల్ సెన్స్ తో సినిమాలు చూసినప్పుడు ఎక్కడ బడ్జెట్ వృధా అవుతోంది, ఎక్కడ ఆదా అవుతోందీ తెలుస్తుంది. సినిమాలకి స్టోరీ రైటింగ్ కాదు, స్టోరీ మేకింగ్ కావాలి. స్టోరీ రైటింగ్ సీన్లు చూస్తుంది, స్టోరీ మేకింగ్ షాట్లు చూస్తుంది. స్టోరీ రైటింగ్ ఒక విషయాన్ని మూడు సీన్లలో చెప్పి బడ్జెట్ ని వృధా చేస్తుంది. స్టోరీ మేకింగ్ మూడు సీన్లతో చెప్పే విషయాన్ని ఒక్క షాట్ తో చెప్పి బడ్జెట్ ని ఆదా చేస్తుంది. దర్శకత్వ మంటే సెట్స్ లో చేసేది కాదు, హిచ్ కాక్ లా పేపర్ మీద చేసేది. హిచ్ కాక్ కి రచయితలతో అంత ఓపికుండేది. వాళ్ళతో కలిసి పేపర్ మీదే పడుండే వాడు. బాలీవుడ్ లో అంత ఓపిక ఇప్పుడూ వుంది. రచయితల తోడ్పాటు లేకుండా షూటింగ్ స్క్రిప్టే పూర్తి చెయ్యరు. ఇందాకా తాజాగా సెల్ టెక్స్ లో హై ఫైగా వున్న ఒక డైలాగ్ వెర్షన్ తో పూర్తయిన స్క్రిప్టుని చూస్తూంటే, అందులో దర్శకత్వం కనిపించడం లేదు. ఒక చోట ఏక బిగిన అరగంట స్క్రీన్ స్పేస్ వృధా అయ్యే సీన్ల పరంపర వుంది. అరగంట స్క్రీన్ స్పేస్ అంటే బడ్జెట్ లో పావు వంతు. రెండు కోట్ల బడ్జెట్ అనుకుంటే అందులో 50 లక్షలు అనాలోచిత సీన్లతో వృధా వృధా. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బతకడానికే ఇది, సినిమా కాదు. స్టోరీ రైటింగ్ ఫలితం ఇలా వుంటుంది.

        రే, వెంటాడే షాట్స్ రెండు రకాలు : నటనా పరమైనవి, రచనా పరమైనవి. నటనా పరమైనవి ఆర్టిస్టులు చూసుకుంటారు వాళ్ళ భావోద్వేగాల క్లోజప్స్ తో. ఇవి కూడా వెంటాడ వచ్చు. అయితే ఇవి ఆ సీనుతో మాత్రమే సంబంధంతో వుంటాయి. సీను మారిందంటే భావోద్వేగాలు మారతాయి. ఇవి కత్తిరింపులకి గురయినా కథకి నష్టముండదు. ఈయనకి/ ఈవిడకి అంత ఇంపార్టెన్స్ ఎందుకయ్యా, ఆ షాట్ ని కత్తిరించి పారేయ్ - అని ఎడిటింగ్ లో లేపెయ్యొచ్చు. ఆయన/ఆవిడ ఆ షాట్ ఇచ్చి మేఘాలలో నడుచుకుంటూ ఇంటికెళ్ళి పోయాక, తీరా సినిమాలో చూసుకుంటే, బ్లాంక్ గా కన్పించి నేలమీద రాలిపడడమే.

        రచనా పరమైన షాట్స్ ఇలా కాదు, ఇవి కథకి సంబంధించి వుంటాయి. ముందు జరిగిన కథని దృష్టిలో పెట్టుకుని తర్వాత జరగబోయే కథ చెప్తాయి ఆ ఒక్క షాట్ తో. వీటిని కత్తిరించలేరు బామియాన్ తాలిబన్లయితే తప్ప. ఇలాటి రెండు షాట్స్ ఈ మధ్య బాగా పిచ్చెత్తించి నిద్ర పట్టకుండా చేశాయి. ఏమిటీ షాట్స్? వీటిగురించి పిచ్చెత్తి ఎందుకు రాయాల్సి వచ్చిందిప్పుడు పనులాపుకుని తీరిగ్గా? స్టోరీ మేకింగ్ కి ఇవి అందిస్తున్న మైండ్ బ్లాస్టింగ్ టెక్నిక్సే కారణం. ఇలా చేయాలీ స్టోరీ మేకింగ్ అనీ చెబుతూ... ఇటీవల ఓటీటీలో విడుదలైన హాలాహల్ లోని ఒక షాట్, స్క్రీన్ ప్లే సంగతులు రాసిన దే ర్ విల్ బి బ్లడ్ లోని ఇంకో షాట్.

***
       1. పక్క షాట్ చూడండి. దేర్ విల్ బి బ్లడ్ ఎండ్ విభాగంలో చర్చి సీన్. ఈ సీన్లో డానీ ప్రాయశ్చిత్తం చేసుకుని మతంలో చేరాక, భక్తుల అభినందనలు అందుకుంటున్నప్పుడు, మేరీ వచ్చి ఆలింగనం చేసుకుంటుంది. కొద్ది సెకన్ల పాటే వుండే ఈ షాట్ చెప్పకనే కథ చెప్పేస్తుంది. ఈ షాట్ కి పూర్వ కథలో ప్రార్ధన చేయక తండ్రి చేత దెబ్బలు తింటూ వుంటుంది మేరీ. ఆమెకి నాస్తికుడైన డానీ అండగా వుంటాడు.  తను నాస్తికుడైతే ఆమె కాబోయే నాస్తికురాలని. కొడుకుని దృష్టిలో పెట్టుకుని ఆమెని ఫ్యామిలీగా కూడా ప్రకటించాడు. నాస్తికుడుతో నాస్తికురాలి అనుబంధం ఇక్కడుంది.

        ఈ నేపథ్యంలో ఈ షాట్ ఇప్పుడు చెప్పే కథేమిటంటే- నిశ్శబ్దంగా బేబీ మేరీ ఆలింగనం చేసుకోవడంలో, ఫ్యామిలీలో నీతో పాటే నేనూ అన్న అర్ధమిస్తోంది. అతను మారాడు, తానూ మారింది. ఆడియెన్స్ కి ఇక రిలీఫ్. తానూ మతాన్ని స్వీకరిస్తూ హామీ ఇస్తోంది. ఆడియెన్స్ కి ఆమె మీద నమ్మకం. అప్పుడేమంది తను? చర్చికి బాకీ వున్న 5000 అతను ఇస్తాననడం అతడి గొప్ప మనసు అంది. అతనేమన్నాడు? ఎప్పట్నుంచో ఇవ్వాల్సిన బాకీ అన్నాడు. ఈ సిన్సియారిటీతో ఆడియెన్స్ కి హమ్మయ్యా అని అతడిపట్ల పూర్తి పాజిటివ్ ఫీల్. ఇంతే, దీంతో షాట్ ముగుస్తుంది. ఈ షాట్ కి బిజిఎం వుండదు. వుంటే చెడుతుంది.

        ఇంత క్లుప్తంగా వున్న ఈ షాట్ లో బాకీ గురించిన రెండు మాటలే పని గట్టుకుని ఇంకెందుకున్నాయి? డానీ డానీయే. చచ్చినా మారడు. చర్చికి మాటిచ్చి రేపు బాకీ ఎగ్గొట్టక వుంటాడా? రేపు బాకీ ఎగ్గొడితే ఆడియెన్స్ కి ఈ మాటలే గుర్తుకు రావాలంటే, ఈ మాటలు చెదిరిపోయే ఇంకే మాటలూ ఇక్కడ వుండకూడదు. చాలా డిస్టర్బింగ్ షాట్ ఇది. మేరీ అతడ్ని నమ్మేసి మతంలోకి వచ్చింది. రేపు పెళ్ళయాక తెలుస్తుంది అతడ్ని నమ్మడం ఎంత మోసమో. ఇక్కడ చర్చి సాక్షిగా కొడుకుని స్వీకరించిన ఇతనే, రేపు కొడుక్కుని బాస్టర్డ్ అని వెళ్లగొట్టేసినప్పుడు, కోడలిగా తను అవమానకర పొజిషన్లో పడ్డప్పుడు గానీ అర్ధం గాదు. అయితే ఈ షాట్ లో మేరీ ఫేస్ ఎందుకు చూపించలేదు? ఎందుకంటే దీని తర్వాత ఆమె కథలో కన్పించదని. ఇలా ముందు జరగబోయే వాటికి మందుగుండు అంతా ఈ ఒక్క షాట్ లోనే జొప్పించి వుంది... ఇదీ స్టోరీ మేకింగ్.

***
        2. దీన్ని స్టోరీ రైటింగ్ చేస్తే - చర్చిలో డానీ మతంలో చేరిన సీన్ నెంబర్ వన్ తర్వాత, సీన్ నెంబర్ టూ - డానీ ఇంటికెళ్తాడు. మేరీ పరిగెట్టుకుంటూ వస్తుంది - అంకుల్ అంకుల్ అంకుల్ అని పట్టి వూపేస్తుంది. ఏంటమ్మా ఏంటంత సంతోషం? ప్రభువు చల్లని చేయి తాకిన గొర్రెపిల్లలా చెంగు చెంగు మంటున్నావు?’ - డానీ. నువ్వు చర్చి కెళ్ళావు కదూ? నేనూ చర్చికి వెళ్తా, చర్చికెళ్తా, ప్రార్ధన చేస్తా. నువ్వెలా చేస్తే అలా చేస్తా. సేమ్ టు సేమ్ అంకుల్ - మేరీ. నా బంగారు తల్లి కదే. బుజ్జి తల్లి కదే. ఎంత ఎదిగావమ్మా నువ్వూ - డానీ. నన్ను చర్చికి తీసికెళ్ళాలి. తీసికెళ్ళాలీ తీసికెళ్ళాలీ.. మేరీ. సీన్ నెంబర్ త్రీ- చర్చికి వెళ్తారు. కలిసి ప్రార్ధన చేస్తారు. అంకుల్ ఇప్పుడెంతో బావుంది. నేను నీతోటే వుంటా నంకుల్, ప్రామీస్ అంకుల్ ప్రామీస్ - మేరీ. నేనెప్పుడు కాదన్నానమ్మా నా మేరమ్మ  తల్లమ్మ తల్లీ, పద ఐస్ క్రీమ్ తిందాం - డానీ. ఈ సీన్లకి పులకింఛిపోయే బిజిఎం కూడా వస్తూంటుంది. ఇలా వుంటుంది... అప్పుడెప్పుడో పాత రాతి యుగపు నాటి నరహంతక సుత్తి కాక ఏమిటిది మూడేసి సీన్లతో? ముందు వెనుక కథతో సంబంధం లేకుండా బడ్జెట్ ని తేరగా ఆరగిస్తూ?

***
     3. ఇక హాలా హల్ ముగింపులోషాట్. క్లయిమాక్స్ లో సచిన్ ఖెడేకర్ కి కౌన్సెలింగ్ చేస్తున్న పద్ధతిలో విలన్ వివరిస్తాడు చాలా స్మూత్ గా మంచి చెడ్డలు. అనవసరంగా మాతో పెట్టుకోక మంచిగా బ్రతక మంటాడు. సీన్ కట్ అవుతుంది. రోహతక్ లో ఆందోళనలో వున్న సచిన్ భార్యా కూతురు, అతణ్ణి వచ్చెయ్యమని అంతకి ముందే కోరి వుంటారు. ఇప్పుడు ఈ షాట్ లో టేబుల్ ముందు కూర్చుని కూతురు స్టడీ చేస్తూంటుంది.  తలెత్తి తలుపు వైపు చూస్తుంది. ఆమె మొహం ఒక్కసారి ప్రసన్నమవుతుంది. షాట్ కట్ అయిపోతుంది. దీనికి బిజిఎం వుండదు. బిజిఎంవుంటే ఫీల్ వుండదు. దీనితర్వాత సీనుండదు.

        ఆమె తలుపు వైపు అలా ఏం చూసి ప్రసన్నమై వుంటుంది? సచిన్ వచ్చేసి వుంటాడు. ఇలా సచిన్ ని చూపించకుండానే ఆ అర్ధంలో షాట్ తీశాడు క్రాఫ్ట్ తెలిసిన దర్శకుడు. ఇది కథ చెప్పే మర్చిపోలేని బ్యూటీఫుల్ షాట్. ఈ షాట్ తర్వాత ఇక సీనుండదు. విలన్ తో ఓడిపోయి ఇంటికొచ్చిన సచిన్ మొహం చూడాలన్న తహతహని  ఆడియెన్స్ కి అలాగే మిగిల్చేస్తాడు దర్శకుడు. అర్ధోక్తిలో షాటుని ఆపితే ఎంత బలంగా వెంటాడుతూ వుంటుందో చెప్పనవసరం లేదు. ఇది స్టోరీ మేకింగ్.

***
        4. ఈ ఒక్క షాటునే ముగింపుతో స్టోరీ రైటింగ్ చేస్తే ఎలా వుంటుంది? ఆమె తలుపు వైపు చూసి ప్రసన్నమయేసరికి, తలుపు దగ్గర సచిన్ ని భయంకరంగా చూపించేస్తూ సెంటిమెంటల్ సీను రాసుకుంటూ రాసుకుంటూ పోతారు. పెన్నులన్నీ అయిపోయి పరిగెడతారు. అసలలా సచిన్ ని చూపిస్తే చాలు నాశనం చేయడానికి. అప్పుడు సచిన్ కాల్షీటు కావాలి, మేకప్, కాస్ట్యూమ్స్ ఖర్చులు కావాలి, ఇంకా... అద్దె భవనపు ఖర్చు, యూనిట్ ఖర్చు, ఎడిటింగ్ ఖర్చు, డబ్బింగ్, బిజిఎం ఖర్చు, డీఐ ఖర్చూ.. ఇంకా థియేటర్లకి కరెంటు ఖర్చు, ప్రేక్షకులకి టైమ్ వేస్టూ. ఈయనేంటీ అర్ధమైపోయిన దాన్ని ఇంకా చూపిస్తాడూ - అని లేచెళ్ళి పోవడం....

***

        5. ఈ కింది వీడియో చూడండి. 2010 ప్రాంతంలో ప్రచారంలో వున్న, పాపులరైన  ధూమపాన హెచ్చరిక యాడ్ ఫిలిమ్. ప్రారంభం చూడండి. టేబుల్ ముందు కూర్చుని బొమ్మలేసుకుంటూ వుంటుంది అమ్మాయి. సడెన్ గా తలతిప్పి చూస్తుంది. సిగరెట్ తాగుతూ గుమ్మం లోంచి లోపలికొస్తూ కనిపిస్తాడు తండ్రి. చిరునవ్వుతో చూస్తాడు. తానూ ఆప్యాయంగా చిరునవ్వుతో చూస్తుంది...



        ఈ షాట్స్ ఫిమేల్ టచ్ తో వుండడం వల్ల గుర్తుండి పోతున్నాయా? ఆలోచించాల్సిన విషయం. పై మూడు షాట్స్ లో ఫిమేల్ క్యారెక్టర్సే వున్నాయి. హాలా హల్ షాట్ చూస్తూంటే ఈ యాడ్ ఫిలిమ్ లో షాట్ గుర్తుకొచ్చింది. ఎంత యాక్షన్, వయోలెంట్ మూవీస్ లోనైనా, ఒకటి రెండు కథతో, పాత్రచిత్రణతో కూడిన ఇలాటి ట్రాడిషనల్ ఆడతనపు షాట్స్ వుంటే, లైఫ్ వుంటుందని చెప్పొచ్చు. బ్యూటీ వస్తుంది.

సికిందర్