రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 24, 2018

‘610 : 'పాలపిట్ట’ జనవరి సంచిక ఆర్టికల్


         1975 - ‘దీవార్’ అతడి కళా జీవితానికి నిర్వచనమిచ్చింది. కళ కన్నతల్లే. దాంతో వ్యాపారం చేస్తే సరస్వతి కాలేపోవచ్చునేమో గానీ లక్ష్మి కాకుండాపోదు. ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ ‘నా దగ్గర బంగళాలున్నాయి, కార్లున్నాయి, నీ దగ్గరేముంది?’ అన్నప్పుడు, ‘మేరే పాస్ మా హై’  అని శశికపూర్ పలికిన అజరామరమైన డైలాగుకి ఇప్పటికీ చప్పట్లు పడతాయి. ఆ ‘మా’ కేవలం భౌతికంగా కన్పించే అమ్మేనా? అమ్మలాంటి కళ కాదా? నీ దగ్గర కమర్షియల్ సినిమాలతో లక్ష్మి వుంటే, నా దగ్గర కళాత్మక సినిమాలతో సరస్వతి లాంటి అమ్మ కూడా వుందని చెప్పడం కాదా? ఒకవైపు కళాత్మక సినిమాలతో తను చేస్తున్న సేవని అలా క్లెయిమ్ చేసుకుంటున్నట్టే కన్పిస్తాడు శశికపూర్ ఆ క్లాసిక్ దృశ్యంలో.
          ళాత్మక సినిమాలేకాదు, నాటకరంగం కూడా. ఏకకాలంలో కళాత్మక వ్యాపారాత్మక సినిమాలతోబాటు నాటకరంగాన్నీ చిత్తశుద్ధితో పోషించిన త్రివిధ దళాధిపతి అతను. బాలీవుడ్ లో ఉద్భవించిన మొట్ట మొదటి క్రాసోవర్ స్టార్ తనే. ఆర్టు సినిమాలకి కాలం చెల్లాక, వాటికి  కొత్త జవసత్వాలు చేకూర్చడానికి, శ్యాం బెనెగళ్  మొట్టమొదటి సారిగా కరిష్మా కపూర్, మనోజ్ బాజ్ బాయ్, అమ్రిష్ పురి లవంటి బాలీవుడ్ స్టార్స్ తో రాజీపడి, 2001లో ‘జుబేదా’ తీశారు. అలా  బాలీవుడ్ స్టార్స్ క్రాసోవర్ చేసి ఆర్ట్ సినిమాల్లో నటించే ఒరవడి ప్రారంభమయ్యింది. కానీ దీనికంటే దశాబ్దాల నాడే శశి కపూర్ తొలి క్రాసోవర్ స్టార్ గా ప్రయోగాత్మక కళా జీవితానికి నాంది పలికాడు. అందులో ఒకటి శ్యాం బెనెగళ్  తీసిన జునూన్ (1978) కూడా వుంది. ఒకవైపు రోమాంటిక్ హీరోగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే, తనలోని నిజమైన కళాకారుణ్ణి చాటుకునేందుకు వచ్చిన ఏ అవకాశాన్నీ ఆర్ట్ సినిమాలతో వదులుకోలేదు.  సర్వసాధారణంగా ఏ భాషా స్టార్లు అయినా తమ వైభవం తరిగిపోయాకే, ఇతర తావుల కేసి చూస్తారు. 

      కానీ శశికపూర్ అలా విశ్రాంత నటుడయ్యాకే కళాత్మక సినిమాలవైపు రాలేదు. రో మాంటిక్ స్టార్ గా, డాషింగ్ హీరోగా విస్తృత ప్రేక్షక లోకాన్ని అలరిస్తూనే, ‘ఉత్సవ్’ (1984), లాంటి  ఆర్ట్ సినిమాలో విలన్ గా, ‘విజేత’ (1984) అనే కళాత్మకంలో వయసు మళ్ళిన తండ్రిగా ... అలా అలా ఎన్నో కమర్షియలేతర పాత్రలు పోషించుకుంటూ పోయాడు. చాలామంది స్టార్లకి లాగే తనకి ఇమేజి అన్న భయమే లేదు. చలనచిత్రాల్లో నటుడిగా పాదం మోపడమే బాలనటుడిగా అన్నగారు విఖ్యాత రాజ్ కపూర్ పాత్రలకి చిన్ననాటి వెర్షన్స్  నటిస్తూ, ‘ఆగ్’ (1948), ‘సంగం’ (1950), ‘ఆవారా’ (1951) లతో వెండితెర వేల్పు అవడానికి శ్రీకారం చుట్టాడు. హీరోగా నటించిన మొదటి చలనచిత్రం చూస్తే  అది వినోదాత్మకం ఏమీ కాదు. 1961 లో యశ్ చోప్రా నిర్మించిన ‘ధర్మపుత్ర’ హీరోగా  శశి మొదటి చలనచిత్రమైతే, అది దేశ విభజనకి సంబంధించిన  విషమ  సమస్యతో కూడుకున్నది. ముస్లిములకు పుట్టి, హిందూ కరుడుగట్టిన స్నేహితులతో కలిసి పెరిగి, కాషాయదళంలో చేరే సంచలనాత్మక పాత్ర పోషించాడు. 

          ఆ వెంటనే బిమల్ రాయ్ దర్శకత్వంలో ‘ప్రేమ్ పత్ర’ (1962) లో రోమాంటిక్ హీరోగా నటించాడు గ్లామర్ హీరోయిన్ సాధనతో కలిసి.  దీని వెంటనే జేమ్స్ ఐవరీ దర్శకత్వంలో ఇస్మాయిల్ మర్చంట్  నిర్మించిన ‘హౌస్ హోల్డర్’ అనే ఇంగ్లీషు చిత్రంలో నటించేశాడు. దీన్నిబట్టి ఏమనుకోవాలి? 1961 లో ‘ధర్మపుత్ర’ తో సీరియస్ హీరోగా ప్రారంభమై, 1962 లో ‘ప్రేమ్ పత్ర’ తో రోమాంటిక్ హీరోగా, మళ్ళీ 1962 లోనే ‘హౌస్ హోల్డర్’ ఇంగ్లీషుతో వివాహితుడైన టీచర్ గా వాస్తవిక పాత్రగా వెంటవెంటనే దశ, దిశా మార్చుకుంటూ ప్రస్థానం సాగించే నటుడింకెవరైనా వున్నారా? 


       నాటకాలు, కళాత్మక వ్యాపారాత్మక సినిమాలే గాక, హిందీ చలనచిత్ర రంగం నుంచి  తొలి అంతర్జాతీయ నటుడిగానూ గుర్తింపు పొందిన ఘనత సాధించాడు. ‘హౌస్ హోల్డర్’ తర్వాత ‘షేక్స్ పియర్ వాలా’ (1965), ‘ప్రెట్టీ పాలీ’ (1967), ‘బాంబే టాకీ’ (1970), ‘సిద్ధార్థ’ (1972), ‘హీట్ అండ్ డస్ట్’ (1982), ‘సాలీ అండ్ రోజ్  గెట్ లేయిడ్’ (1986), ‘ది డిసీవర్స్’ (1988), ‘సైడ్ స్ట్రీట్స్’ (1996) మొదలైన ఎనిమిది అంతర్జాతీయ సినిమాల్లో నటిస్తూ తన ఎల్లలు చాటుకున్నాడు. 

          సినిమాల్లో బాల నటుడిగా ప్రవేశానికి ముందే నాటక రంగంలో అనుభవం సంపాదించాడు. తండ్రి, నట దిగ్గజం పృథ్వీరాజ్ కపూర్ స్థాపించిన రంగస్థల నాటక కంపెనీ, ‘పృథ్వీ థియేటర్స్’ వేసే నాటకాల్లో చిన్నప్పుడే వేషాలు వేసేవాడు. ఆ నాటక కంపెనీనే తనతో పాటు సమానంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. నాటక సంస్థలు ఇంకా పాత  అంబాసిడర్, ఫియెట్ కార్లలాగే ఎందుకుండాలని ప్రశ్నించేవాడు. ఇక పృథ్వీ థియేటర్ ని మెర్సిడెస్, షెవర్లెట్ ల వంటి ఆధునిక కార్ల లాగా ఆధునీకీకరణ చేస్తూ, అత్యాధునిక సౌకర్యాలతో అమోఘంగా తీర్చిదిద్దాడు. 



      పెద్దన్న రాజ్ కపూర్ భారతీయ సినిమాకి ఒక దిక్సూచిలా ప్రఖ్యాతుడయ్యాడు. చిన్నన్న షమ్మీ కపూర్ ఫక్తు రోమాంటిక్ సినిమాలకి చిరునామాగా పాపులర్ అయ్యాడు. తను రోమాంటిక్ తో బాటు రియలిస్టిక్ సినిమాలకి పెట్టింది పేరయ్యాడు. అప్పటికి దిలీప్ కుమార్, దేవానంద్, అశోక్ కుమార్ లవంటి హేమాహీమీలు హిందీ సినిమాలని ఏలుతున్నారు. వాళ్ళతో సమానంగా తనూ ప్రేక్షక హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. శశికపూర్ రోమాంటిక్ సినిమాలు, ఆర్ట్ సినిమాలు, అంతర్జాతీయ సినిమాలు, మరోవైపు నాటకాలూ చేస్తూ  సోలోగా కొనసాగుతున్న కాలంలో కూడా,  తోటి స్టార్లతో కలిసి నటించడానికి వెనుకాడలేదు. అమితాబ్ బచ్చన్ తో, నసీరుద్దీన్ షాతో కలిసి నటించిన సినిమాల్లో తను సెకెండ్ హీరోయేనన్న నిమ్న భావానికి కూడా లోను కాలేదు. 

          అమితాబ్ తో దీవార్, త్రిశూల్, కభీ కభీ, సిల్సిలా, నమక్ హలాల్, దో ఔర్ దో పాంచ్,  కాలా పత్తర్, షాన్  వంటి సూపర్ హిట్స్ లో నటించాడు. ఇక సోలోగా నటించిన జబ్ జబ్  ఫూల్ ఖిలే, కన్యాదాన్, ప్యార్ కా మౌసమ్, హసీనా మాన్ జాయేగీ, అభినేత్రి, సుహానా సఫర్, ఆ గలే  లగ్ జా, షర్మిలీ, రోటీ కపడా ఔర్ మకాన్, ఫకీరా, చోర్ మచాయే షోర్... ఒకటేమిటి ఎన్నో కలర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్లు. రోమాంటిక్ హీరోగా సూపర్ హిట్లు. 



       ఇంకెన్నో  సూపర్ హిట్ పాటలు : చలే థే సాథ్  మిల్ కే  (హసీనా మాన్ జాయేగీ), పర్దేశీయో సే నా అఖియా మిలానా (జబ్ జబ్  ఫూల్ ఖిలే), లిఖే జో ఖత్ తుజే (కన్యాదాన్), నిసుల్తానా రే ప్యార్ కా మౌసమ్ ఆయా (ప్యార్ కా మౌసమ్), సరిగమప (అభినేత్రి), ఖిల్ తే హై గుల్ యహా (షర్మిలీ), తేరా ముజ్ సే హై పెహ్లే కా నాతా కోయీ (ఆ గలే  లగ్ జా ), లే జాయేంగే లే జాయేంగే దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే (చోర్ మచాయే షోర్), ఎక్ రాస్తా హై జిందగీ (కాలా పత్తర్) ...ఇలా కొన్నివందల ఎవర్ గ్రీన్ పాటలుంటాయి.

          శశి కపూర్ నటించిన ‘ఆ గలే  లగ్ జా’ (1973)  తెలుగులో శోభన్ బాబు - మంజుల తో ‘మంచి మనషులు’  గానూ, ‘చోర్ మచాయే షోర్’ (1974) కృష్ణ - మంజుల -మోహన్ బాబులతో ‘భలే దొంగలు’ గానూ రీమేక్ అయ్యాయి. శశి కపూర్ నటించిన కమర్షియల్, ఆర్ట్, అంతర్జాతీయ సినిమాలన్నీ కలిపి 160 వరకూ వుంటాయి. తీసిన ఆరు ఆర్ట్ సినిమాలకి తనే నిర్మాత. ఒక దానికి దర్శకుడు. అవన్నీ నష్టాల పాలు జేశాయి. కానీ పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాయి. 


        శశికపూర్ ఇమేజి లేని నటుడైనప్పటికీ  కమర్షియల్ సినిమా కొచ్చేసరికి రోమాంటిక్ హీరో ఇమేజికే బందీ అయ్యాడు. కారణం తను యాక్షన్ హీరో గా చేస్తే ప్రేక్షకులు భరించలేక పోయారు. కనీసం మాస్ హీరోగానూ తను రాణించలేడు. అందుకే తను నటించే మల్టీ స్టారర్స్ లో అమితాబ్ వంటి  స్టార్లు మాస్ పాత్రలేస్తే, తను క్లాస్ పాత్రలేసేవాడు. అప్పట్లో బాలీవుడ్ లో ఇద్దరు చాక్లెట్ బాయ్స్ వుండేవాళ్ళు. మొదటి చాక్లెట్ బాయ్ జాయ్  ముఖర్జీ అయితే, రెండో చాక్లెట్ బాయ్ శశి కపూర్.  కమర్షియల్ సినిమాల్లో ఈ ఇమేజి చట్రంలో బందీ అయిపోయాడు. ప్రేక్షకులు ఇలాగే తనని గుర్తుపెట్టుకున్నారు. కమర్షియలేతర సినిమాల్లో తన లోని అసలు నటుణ్ణి ప్రదర్శించాడు. నటనలో మెళకువలు చిన్నప్పుడు తండ్రి పృథ్వీ రాజ్ కపూర్ నుంచి నేర్చుకున్నవే. నువ్వేమీ యువరాజువనుకోకు, సగటు కుర్రాడివి అనుకుని యూనిట్ సభ్యులతో కలిసిపో అని తండ్రి అన్నప్పుడు – ఆ చిన్నప్పట్నించీ అలవాటయిన పనే, తను స్టార్ అయ్యాకా కూడా చేస్తూపోయాడు. తన హోదా పక్కన పెట్టి సెట్ లో కింది స్థాయి యూనిట్ సభ్యులతో కలిసి కూర్చుని మాట్లాడడం, చాయ్ లు తాగడం వంటి దృశ్యాలు నిత్యం కన్పించేవి. తండ్రి నడిపిన నాటక కంపెనీ ఒక వూళ్ళో వున్నది కాదు. అది వూరూరా తిరిగే టూరింగ్ నాటక కంపెనీ. దీంతో చిన్నప్పుడే మనసు విశాలమైంది శశికి. తండ్రి కంపెనీయే గాక,   బ్రిటిష్ నటుడు జెఫ్రీ కెండాల్ నడిపే షేక్స్ పియరియానా అనే నాటక కంపెనీలో నటించేవాడు శశి. జెఫ్రీ కుమార్తె జెన్నిఫర్ తో ఆ పరిచయమే ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది.  
          శశి తనకి నటన  నేర్పిన చిన్ననాటి పృథ్వీ థియేటర్ ని కాలగర్భంలో కలిసిపోనీయలేదు. 1960 లో మూతబడ్డ కంపెనీని జెన్నిఫర్ తోడ్పాటుతో ముంబాయి లోని జుహూ ప్రాంతంలో పునరుద్ధరించాడు. ఇది దేశవ్యాప్తంగా నాటక రంగంలో ఎందరో నటులకి వేదిక అయింది, శిక్షణా తరగతి అయింది. 1984 లో జెన్నిఫర్ మరణంతో శశి జీవితమే మారిపోయింది. అతను తిరిగి మనిషే కాలేక పోయాడని అంటారు సన్నిహితులు. విపరీతంగా వోడ్కా సేవించేవాడని, కాలక్రమంలో అదే ఆరోగ్యాన్ని దెబ్బతీసిందనీ అంటారు. జెన్నిఫర్ జ్ఞాపకాలు అతణ్ణి రేయింబవళ్ళూ వెంటాడేవి.


     అయితే సినిమాల్లో నటించడం తగ్గించినా, క్రమం తప్పకుండా పృథ్వీ థియేటర్ కెళ్ళి యువ టాలెంట్ ని ప్రోత్సహించేవాడు. ఆఖరికి చక్రాల కుర్చీకి పరిమితమయిన ముదిమి వయసులో 2015లో, అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు నందుకున్నపుడు పలకడానికి నోరు కూడా లేదు. కపూర్ కుటుంబంలో ఈ అవార్డు ముగ్గురికి వరించింది- తండ్రి పృథ్వీ రాజ్ కి, అన్న రాజ్ కపూర్ కి, తనకీ. ఇలా మూడు దాదా ఫాల్కే అవార్డు లందుకున్న మరో సినీ కుటుంబం లేదు.
         
         శశి రోమాంటిక్ స్టార్ గా వెలిగిన కాలంలోనే రాజేంద్ర కుమార్, రాజ్ కుమార్, సునీల్ దత్, దేవానంద్, ధర్మేంద్ర, షమ్మీ కపూర్, జితేంద్ర వంటి పాపులర్ స్టార్స్ తో బాటు రాజేష్ ఖన్నా కూడా వుండేవాడు. కానీ ఓ ఆరు సినిమాల్లో నటిస్తూ వచ్చిన రాజేష్ ఖన్నా పెద్దగా పాపులర్ కాలేక
పోయినా, 1969 లో ‘ఆరాధన’ తో తిరుగు లేని సూపర్ స్టార్ అయిపోయాడు. రాజేష్ ఖన్నా తర్వాత 1975 లో ‘దీవార్’ తో అమితాబ్ బచ్చన్ తిరుగు లేని సూపర్ స్టార్ అయ్యాడు. అమితాబ్ తర్వాత ఒకరొకరే ఖాన్లు సూపర్ స్టార్లు అవుతూ పోయారు. కానీ ఇందరు సూపర్ స్టార్లని చూస్తూ వున్న శశి కపూర్ తనధోరణిలో తను మల్టీ స్టారర్స్  లో  సైతం నటిస్తూ పోయాడే తప్ప కనుమరుగై పోలేదు. 



        తన కళ్ళ ముందే అన్న రాజ్ కపూర్  కుమారులు రణధీర్ కపూర్,  రిషీ కపూర్, రాజీవ్ కపూర్  లు హీరోలయ్యారు. రాజీవ్ కపూర్  వెంటనే కనుమరుగైపోయాడు. రణధీర్ కపూర్ ఎక్కువకాలం నిలదొక్కుకో లేకపోయాడు. కానీ రిషీ కపూర్ యంగ్ స్టార్ గా ఒక తరం యువతని ఉర్రూతలూగించాడు. తర్వాత పెద్ద తరహా పాత్రలకి ఎదిగాడు. ఇప్పటికీ నటిస్తున్నాడు. తండ్రి రాజ్ కపూర్ ‘మేరా నామ్  జోకర్’ తీసి కోలుకోలేనంత  నష్టపోయి- చిన్న కుమారుడు రిషితో ‘బాబీ’ తీశాక మళ్ళీ కోలుకున్నాడు. కష్టాల్లో వున్న  అన్నని ఆదుకునే ఉద్దేశంతో శశి కపూర్ తనే ‘బాబీ’ ని విడుదల చేశాడు. అయితే అన్న కష్టాలు తనకి చుట్టుకున్నాయి. ‘బాబీ’ కనకవర్షం కురిపించినా తనకేమీ రాలేదు!

          ఇక నటనకి వారసత్వంగా తన పిల్లల్ని అందించలేకపోయానన్న తీరని వెలితి శశిని వెంటాడేది. కునాల్, కరణ్,  సంజనా కపూర్ లు ముగ్గురూ తండ్రి వారసత్వాన్ని ముందుకు తీసికెళ్ళాలేక,  నటనని విరమించుకుని వేరే రంగాల్లోకి వెళ్ళిపోయారు. బాలీవుడ్ లో వారసులుగా మిగిలింది అన్న రాజ్ కపూర్ మనవలైన కరీనా కపూర్ (రణధీర్ కపూర్ కుమార్తె), రణబీర్ కపూర్ ( రిషికపూర్ కుమారుడు)లు.  రణధీర్ పెద్ద కుమార్తె కరీనా కపూర్ స్టార్ గా ఓ ఊపు వూపింది.


       మాలాసిన్హా, మీనా కుమారి, షర్మిలా టాగూర్, ఆశా పరేఖ్, సాధన, హేమమాలిని, రేఖ, రాఖీ, వహీదా రెహమాన్, షబానా అజ్మీ, ముంతాజ్, జీనత్ అమన్, నఫీసా అలీ, నీతూ సింగ్, సుప్రియా పాఠక్ ల వంటి కలర్ఫుల్ హీరోయిన్లతో కళా, వ్యాపార సినిమాలు  రెండిట్లో నిండు చంద్రుడులా ప్రకాశించిన శశికపూర్ ని అమరుణ్ణి చేయాలంటే,  నేటి నటులెవరైనా ఆయన అనుసరించిన విభిన్న మార్గాల్లో నడవాల్సిందే. అలా నడిచినప్పుడు,   ‘ఏముంది? ఏముంది  నీదగ్గర?’ అని ఎవరైనా టాలెంట్ ని  ప్రశ్నిస్తే, ‘శశి కపూర్ వున్నాడు నా  దగ్గర!’  అని సగర్వంగా చెప్పుకోవచ్చు!  

సికిందర్ 





కథ రాయాలంటే ఇన్ పుట్ అవసరం, ఇన్ పుట్ లేక 
మూసకి బానిసలవుతున్నారు...


\