రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, అక్టోబర్ 2018, మంగళవారం

700 : స్క్రీన్ ప్లే అప్డేట్స్


       టెర్రీ రోసో హాలీవుడ్ లో నెంబర్ టూ స్క్రీన్ రైటర్. అలాడిన్, ష్రెక్, మెన్ ఇన్ బ్లాక్, పైరేట్స్ ఆఫ్ ది కెరీబీన్ సిరీస్ వంటి అనేక బాక్సాఫీసు హిట్ సినిమాలు రాశారు. ప్రస్తుతం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నిర్మాణంలో వుంది. తన అనుభవంతో స్క్రీన్ ప్లే రచనలో భావి రచయితలకి ఉపయోగపడాలన్నఉద్దేశంతో ఎంత బిజీగా వున్నా ఆయన అనేక ఇంటర్వ్యూలివ్వడమే గాక, స్క్రీన్ ప్లే వ్యాసాలూ రాస్తూంటారు. రచనాపరమైన అన్ని సందేహాలు తీరుస్తూ, కొత్త రచయితలు అవకాశాలు పొందడానికి చేయూత కూడా అందిస్తూంటారు. అయితే ఫలానా సినిమా కంపెనీలో మా బంధువు వున్నాడనో, స్వయంగా సినిమా తీసుకోవడానికి డబ్బులుంటేనో, ఎవరికీ అర్ధంగాని కళాఖండాలు రాస్తేనో తన దగ్గరకి రావద్దంటారు. చూడగానే నిర్మాత రెండు చేతులతో లాగేసుకునే ష్యూర్ హిట్ కమర్షియల్ స్క్రీన్ ప్లేలు రాస్తేనే తన పూర్తి సహాయ సహకారాలుంటాయంటారు. ఈ సౌమనస్యంతో ఆయన రాసిన ఎన్నో వ్యాసాల్లో సీన్ ఎలా రాయాలనే వ్యాసం వొకటి. నేర్చుకోవాలన్న ఆసక్తిగల రచయితల కోసం ఇక్కడ అందిస్తున్నాం.

          పాత్రకి స్పష్టమైన సిట్యుయేషన్ లేకుండా సీన్ రాసేందుకు మీకు అనుమతిలేదు. కారులో వూరికే పిచ్చాపాటీ వేసుకుంటూ పోయే సీను రాయడానికి కూడా మీకు పర్మిషన్ లేదు. వాళ్ళలో ఒకరు సర్జరీ కోసమో, విమానాన్ని క్యాచ్ చేయడంకోసమో వెళ్తూండాల్సిందే. లేదా వాళ్ళ వెనకాల సీటులో హంతకుడు దాక్కుని కూర్చుని వుండాల్సిందే. సిట్యుయేషన్లు కథకి సంబంధించినవై వుంటే బెస్ట్. ఇవేవీ కుదరకపోతే కారు టైరు పంక్చర్ అయ్యేట్టయినా  చూడాలి. 

        ముందుగా ఇంటరెస్ట్ క్రియేట్ చేయాలి. ఇది స్క్రీన్ రైటర్ గా మీ ప్రథమ కర్తవ్యం. ఇంటరెస్ట్ ని క్రియేట్ చేయడానికి సాధనం సిట్యుయేషన్. సిట్యుయేషన్లు పరిస్థితుల నుంచి పుడతాయి. లేదా బలమైన పాత్ర ఫీలయ్యే అవసరం లోంచి పుడతాయి. లేదా రెండూ. మొత్తం స్క్రీన్ ప్లేని కేవలం సిట్యుయేషన్ ఆధారిత సీన్లతో రాయడం కూడా చేయవచ్చు. సిట్యుయేషన్స్ క్రియేట్ చేయడానికి మొదటి మార్గం పరిస్థితి. రెండో మార్గం బలమైన పాత్ర ఫీలయ్యే అవసరం. ఇవిలా వుంటాయి : పరిస్థితులు చుట్టూ వున్న బయటి ప్రపంచంలోంచి పుట్టుకు వచ్చి పాత్ర మీద ప్రభావం చూపిస్తాయి. ఇది మొదటి మార్గం విషయంలో. రెండో మార్గం విషయంలో,  పాత్ర ఫీలయ్యే అవసరం పాత్రలోంచి వచ్చి చుట్టూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది.  

          ఎగ్జాంపుల్ 1 : అతను కూతురితో ఏర్ పోర్టుకెళ్ళి టికెట్లు కొంటున్నాడు. భార్య చనిపోవడంతో కొత్త జీవితం ప్రారంభించడానికి కూతురితో దేశం విడిచి వెళ్ళిపోతున్నాడు...

          ఈ పాత్రల్ని సిట్యుయేషన్ లో పెట్టాలంటే, పరిస్థితుల్ని మార్చెయ్యండి. ఆ బాలిక తల్లి మరణించ లేదనుకోండి. ఆ బాలిక గురించి కోర్టులో కస్టడీ కేసు వుందనుకోండి. అతను కోర్టు కళ్ళు గప్పి బాలికని దేశం దాటించేస్తున్నాడు. పోలీసులు బయల్దేరి వస్తున్నారు. అతడి క్రెడిట్ కార్డు అప్పుడే రిజెక్ట్ అయ్యింది. టికెట్లు తీసుకోవడానికి డబ్బెక్కడ తేవాలో అర్ధం గావడం లేదు. బాలికకి తాము ఎక్కడికి,  ఎందుకు పోతున్నామో తెలీక ప్రశ్నలడుగుతోంది...

          ఎగ్జాంపుల్ 2 : అతనూ ఆమే ఓ పార్టీ కెళ్ళడానికి తయారవుతున్నారు. అతడి మాజీ భార్య ఆ పార్టీ ఇస్తోంది. ఆమెతో ఈమె అభద్రత ఫీలవుతోంది. నీకింకా ఆమె అంటే ఇష్టమేనా అని అతణ్ణి అడిగితే, లేదన్నాడు...

          ఇది రాయదగ్గ సీనే. కాకపోతే వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే సిట్యుయేషన్ నామమాత్రంగా వుంది (వివరణల గురించి పచ్చి నిజం తెలుసుకోండి : సినిమాలకి వివరణలు అవసరం లేదు. లేదు లేదు, ఆడియెన్స్ కి ఇది తెలీకపోతే ఎలా, అది తెలీకపోతే ఎలా, మరేదో తెలీకపోతే ఎలా ... అనొద్దు. ఇదంతా పచ్చి అబద్ధం. ఆడియెన్స్ కి  తెలియాల్సిన అవసరంలేదు. ఆడియెన్స్ ఆశ్చర్యచకితులవడాని కిష్టపడతారు). నామమాత్రంగా వున్న ఈ సీనులో ఆశ్చర్యమే ఇంటరెస్ట్ ని క్రియేట్ చేస్తుంది కాబట్టి, వివరణలు ఇచ్చుకునే కంటే సిట్యుయేషన్ రీత్యా సీను ఆ లోచించండి. 

          పై సీనులో అతన్నీ ఆమెనీ రోడ్డుపక్కన ఆపెయ్యండి. అప్పుడు పంక్చరైన టైరు మార్చుకుంటూ, ఆర్గ్యూ చేసుకుంటూ వుంటారు. ఆ మాజీ భార్య ఇస్తున్న పార్టీకి వాళ్ళు కలిసి వెళ్ళే పరిస్థితి లేనట్టే వుండాలి. అతను మాజీ భార్య దగ్గర డబ్బు బదులు తీసుకోవడం తప్పనిసరి కాబట్టి ఆమెని రమ్మని వొత్తిడి చేస్తూంటాడు. ఆమె అనుమానిస్తూంటుంది, అక్కడికెళ్తే ఆమెకి దగ్గరై పోతాడేమోనని. తాము డబ్బవసరంలో వున్నది నిజమే. ఆయినా వెళ్ళడానికి మనస్కరించకుంటే, ఆమెని ఇక్కడే వదిలేసి వెళ్లి పోతానంటాడు. ఇటుగా వస్తున్న వ్యాను ఆపి ఎక్కేసి వెళ్ళిపోతాడు. ఆమె కోపంతో రగిలిపోతుంది...

          ఇప్పుడీ సిట్యుయేషన్ చోదిత రైటింగ్ వెర్షన్ లో, ఆడియెన్స్ ని కథలో ఇన్వాల్వ్ అయ్యేట్టు చేసేందుకు వీలవుతోంది. ఎందుకంటే, ఈ సీనులో ఆడియెన్స్ కి అనేక ప్రశ్నలు తలెత్తుతూంటాయి. టైములోగా టైరు మార్చడం అవుతుందా? అతనుంటాడా, ఆమెని వదిలేసి వెళ్లి పోతాడా? వాళ్లకి డబ్బు దేనికవసరం? ఆ డబ్బు దొరుకుతుందా? అతను మాజీ భార్యని చూస్తే మళ్ళీ ప్రేమలో పడిపోతాడా? అసలీ వ్యాను డ్రైవర్ మంచోడేనా? తీసికెళ్ళి నిలువు దోపిడీ చేయడు కదా?...

          ఇప్పుడర్ధమై వుండొచ్చు మీకు. మంచి సిట్యుయేషన్ ఆధారిత సీను రాయడమంటే ఆడియెన్స్ ని వూహాగానాలతో ఉక్కిరిబిక్కిరి చేయడమే. ఫ్యూచర్ ఈవెంట్స్ పట్ల స్పెక్యులేషన్ కల్పించడమే. సిట్యుయేషన్ల సెటప్ ఆ తర్వాత మీరు ఆడియెన్స్ వూహాగానాల్ని ఉల్టాపల్టా చేయడానికి ఉపయోగపడ్తుంది. కాబట్టి ప్రతీ సింగిల్ సీనుకీ సిట్యుయేషన్ అవసరం. ఇందులో ఇంకెలాటి మినహాయింపులూ వెతకొద్దు.  

        వివరణ లిచ్చుకోవడానికి మీకు మీరు ఎలాటి సినిమాటిక్ లిబర్టీ తీసుకోకండి. పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ సీన్లు రాయాలంటూ మీకు మీరే ఎలాటి అనుమతులూ జారీ చేసుకోకండి. కేవలం పాత్రల్ని ఎస్టాబ్లిష్ చేసేందుకే రాసే సీన్లకి స్క్రీన్ ప్లేలో చోటు లేదు. పాత్రలేమిటో సిట్యుయేషన్లే తెలుపుతూండాలి. మీరు కథనం గురించి కూడా వర్రీ అవనవసరం లేదు. అప్పుడు వివరణల ట్రాప్ లో చిక్కుకుంటారు. మీకు అవసరమున్నవల్లా, సంఘటనల క్రమం. సిట్యుయేషన్లతో కూడిన సంఘటనల క్రమం. ఇదే కథనాన్ని మీ కందిస్తుంది. 

          ఇందులో వున్న బ్యూటీ ఏమిటంటే, పాత్రకేం కావాలో స్పష్టంగా వున్నప్పుడు అదే సిట్యుయేషన్ అవుతుంది. బలమైన పాత్రకుండే అవసరం సిట్యుయేషన్ ని క్రియేట్ చేస్తుంది. దాంతో ఇంటరెస్ట్ పుడుతుంది. సిట్యుయేషన్లు పాత్రల్ని సృష్టిస్తాయి. అవసరం కోసమో, పరిస్థుతుల వల్లనో. లేదా రెండిటి వల్లనో. 

          ‘జూనో’ లో హీరోయిన్ ని చూడండి : గర్భవతైంది. గర్భవతవడమే సిట్యుయేషన్. పరిస్థితులు క్రియేట్ చేసిన సిట్యుయేషన్. తద్వారా గాఢంగా ఆమెకి పుట్టిన కోరిక, అవసరం : బిడ్డని దత్తత తీసుకునే కేంద్రం కోసం. ఇదే ఆమె ఏమిటో నిర్వచించేస్తోంది. బోనస్ ఏమిటంటే, ఈ బలమైన పాత్ర కోరిక, అవసరం వాటికవే కొత్త సిట్యుయేషన్ కి దారి తీయిస్తాయి - ఆమె కడుపులో బిడ్డకి భావి తండ్రిని పరిచయం చేస్తూ. ఇది అదనపు బ్యూటీ. గాఢమైన పాత్ర కోరిక, ఆవసరం, భద్రతగల సిట్యుయేషన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ సిట్యుయేషన్స్  సందిగ్ధంలో కూడా పడెయ్యొచ్చు.  

          ‘లిటిల్ మిస్ సన్ షైన్’ లో చూడండి : ఈమెకి డాన్స్ పోటీల్లో పాల్గొనాలని చాలా బలమైన కోరిక. దీంతో కుటుంబానికి కుటుంబం గమ్మత్తయిన, తీపీ చేదు సిట్యుయేషన్ల బారిన పడతారు. పైలట్ కావాలన్న కోరికతో వున్న ఆమె అన్న కూడా సైలెంట్ అయిపోతాడు...

       సిట్యుయేషన్ లో సంక్షోభం వుండి తీరాలనేం లేదు. ఎందుకంటే కొన్ని సినిమాటిక్ సిట్యుయేషన్స్ సంక్షోభం లేకపోయినా, నామమాత్రంగా వున్నా చెల్లిపోతాయి. ఉదాహరణకి ఇది చూడండి : ఒక అందమైన అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్స్ తో కాఫీబార్ లో కూర్చుని వుంది. ఒక అందగాడు కాస్త దూరంలో కూర్చుని వున్నాడు. చిర్నవ్వు నవ్వాడు. ఆమే నవ్వింది. ఆమె రెస్పాండ్ అయినందుకు ఆనందించాడు. ఇక ఆమెని మీటవ్వాలన్న కోరిక పుట్టింది. పక్కనున్న మొక్క నుంచి ఒక గులాబీ పీకి ఆమె టేబుల్ మీద పడేస్తూ వెళ్ళిపోయాడు. ఆమె తీసుకుని వాసన చూసింది. అతను వెళ్లిపోయిన టేబుల్ పైన కీస్ కన్పించాయి. ఆ కీస్ నందుకుని బయటికి పరుగెత్తింది. బయట అతనామె కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏకాంతంలో దొరకడంతో ఆమెకి హలో చెప్పి, చాటుకి లాగి కిస్ చేశాడు...

          ఇది రొడ్డ కొట్టుడు బాయ్ మీట్స్ గర్ల్ సీనే. క్యూట్ మీట్ ఫ్లర్టింగ్ సీను. ఇది చెల్లిపోతుంది. సిట్యుయేషన్ ఏమిటంటే, ఒకతను ఒకామెని చూస్తాడు, ఆమెని కలవాలనుకుంటాడు, క్యూట్ గా ఆమెని ఏకాంతంలో కలుసుకునే మార్గం ఆలోచిస్తాడు. ఇంతే. దీంతో మీలో అలజడి రేగవచ్చు. ఇందులో సంక్షోభం ఏదీ? సోసైటీయా? ఆమె బిడియమా? గర్ల్ ఫ్రెండ్స్ ని వదిలి ఆమె వెళ్లి పోవడమా? అతనూ ఆమే ఇంకా పరిచయస్థులే కాకపోవడమా? ... ఏమైనా కానీ సిట్యుయేషనే రచయిత కనుగొనాల్సిన అవసరమైన ముడి పదార్ధం. సంక్షోభం దానికదే వుంటుంది. సంక్షోభం సులభం, సిట్యుయేషనే కష్టం.
***