రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

22, మార్చి 2021, సోమవారం

1029 : సందేహాలు -సమాధానాలు

Q : మీ‌ బ్లాగు మొదటి సారి నిన్ననే చూసాను. నాదొక సందేహం. కథ చేస్తున్నపుడు కథలో లోటు పాట్లు అనేవి ఎలా తెలుస్తాయి? వివరించ గలరు. మంచి పుస్తకం సజెస్ట్ చేయగలరు.
మణి కుమార్
A :  రైటర్ అవాలనుకుప్పుడు ముందు రైటింగ్ నేర్చుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టాలి. కథలు తర్వాత ఆలోచించ వచ్చు. సిడ్ ఫీల్డ్ పుస్తకం కొనుక్కున్నానన్నారు. బేసిక్స్ నేర్చుకోవడానికి అదొక్కటి చాలు. జోసఫ్ క్యాంప్ బెల్ భారీ గ్రంథం ఎందుకు కొన్నారు. అది హయ్యర్ స్టడీస్. బేసిక్సే నేర్చుకోకుండా హయ్యర్ స్టడీస్ దేనికి. ఏమర్ధమవుతుందని. ఏది పడితే అది కొనకండి. హాయిగా సిడ్ ఫీల్డ్ పుస్తకం ముందు పెట్టుకుని, 'శివ' సినిమా చూస్తూ స్ట్రక్చర్ ని స్టడీ చేయండి చాలు. ఒక ఆర్నెల్ల పాటు దీని మీదే వుండండి. అప్పుడా తర్వాత  కథలు  రాయడం నేర్చుకోవచ్చు. ఇంకేమీ చదవక్కర్లేదు, ఉన్నమతి పోతుంది. ఆర్ట్ ఫీల్డ్ అలాటిది. నాలెడ్జి ఎక్కువైపోతే ఎవరికీ అర్ధంగాని మేధావులై పోయి ఎవరికీ అర్ధం గాని కథలు చెప్తారు.

Q : సినిమాలకి ఐడియాలు బాగున్నా, సినిమాలు ఎందుకు ఫేయిల్ అవుతూ ఉంటాయి?  కొంచెం వివరించగలరు.
ఏపీజే, అసోసియేట్

A :  ఐడియాలు బావున్నాయని ఎలా తెలుస్తోంది? ఏం చూసి ఐడియా బావుందని అనుకుంటారు? ఏమిటి దాని సైన్సు? ఐడియాకి షీల్డుగా ముగ్గురు సెక్యూరిటీ గార్డు లుంటారు. 1. మార్కెట్ యాస్పెక్ట్, 2. ఆర్గ్యుమెంట్, 3. స్ట్రక్చర్. మార్కెట్ యాస్పెక్ట్ అది వేడి వేడిగా అమ్ముడుబోయే ఐడియాయేనా చూస్తుంది. అమ్ముడుబోయేదైతే దాని పొటెన్షియల్ ఏ స్థాయిలో వున్నదీ చూస్తుంది - లోకలా, గ్లోకలా? నాంది’, మోసగాళ్ళు వంటి ఐడియాలు గ్లోకల్ గా వెళ్లగల ఐడియాలైతే, లోకల్ స్థాయిలో తీసేశారు.

        ఇక ఆర్గ్యుమెంట్. ఇది కథకి సంబంధించి. అనుకున్న ఐడియాలో కథే వుందా, లేక గాథ వుందా చూస్తుంది. గాథ వుంటే సినిమాకి పనికిరాదు. ఐడియాలో ఆర్గ్యుమెంట్ కనిపిస్తే కథకి పనికొస్తుంది.

        చివరిది స్ట్రక్చర్. ఇది ఐడియాలో కన్పిస్తున్న కథకి స్ట్రక్చర్ వుందా చూస్తుంది. అందులో బిగినింగ్ మిడిల్ ఎండ్ విభాగాలు కన్పిస్తున్నాయా చూస్తుంది. ఈ మూడూ నిర్దుష్టంగా వుంటే ఐడియా పనికొచ్చే ఐడియా అవుతుంది. మార్కెట్ యాస్పెక్ట్ + ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ = ఐడియా.      

 Q : రీసెంట్ గా జాతి రత్నాలు సినిమా చూశా. అసలు లాజిక్ లు ఏవీ పట్టించుకోకుండా కేవలం నటులను, వాళ్ళు చేసే కామెడీనీ నమ్ముకుని సినిమా తీశారు. అది పెద్ద హిట్ అయింది. ఇలా ప్రతిసారీ జరుగుతుందా? లేదా లక్ అనుకోవాలా? ఇలా స్ట్రక్చర్ గురించి పట్టించుకోకుండా తీసిన సినిమాలు హిట్ అవుతుంటే, ఇంక స్ట్రక్చర్ అని ఎక్కడైనా మాట్లాడితే వాళ్లు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సినిమా సక్సెస్ వల్ల ఎవరికి నష్టం? ఎవరికి లాభం? కేవలం క్రియేటివ్ గా ఆలోచించి సక్సెస్ కొడితే సరిపోతుందా? ఇక స్ట్రక్చర్ ను పక్కన పెట్టాల్సిందేనా?
రమేష్, అసిస్టెంట్

A : పాయింటేమిటంటే, జాతిరత్నాలు లో కథే లేదు, లేనప్పుడు స్ట్రక్చర్ ప్రసక్తి ఎక్కడొస్తుంది. అందుకని  ఇలా కథే లేకుండా, మైండ్ లెస్ కామెడీగా, స్టాండప్ కమెడియన్ జోకులతో, జాతి రత్నాలు లాగా తీస్తూ వుంటే హిట్టవుతాయా అనడిగితే ఏం చెప్పాలి. సాంప్రదాయేతరంగా ఏది ఎలా హిట్టయిందని అన్పిస్తే, దాన్ని అలా తీయాలన్పిస్తే, తీయడమే. ఆపే వాళ్ళెవరూ లేరు.

        కథే లేని జాతిరత్నాలు లో స్ట్రక్చర్ చర్చ దేనికి? స్ట్రక్చర్ మీకు తెలిస్తే ఎక్కడా వాదన పెట్టుకోక మీ పని మీరు సైలెంట్ గా చేసుకుపోండి. స్ట్రక్చర్ ని పక్కన పెట్టాల్సిందేనా అని డిఫెన్స్ లో పడిపోతే స్ట్రక్చర్ నేర్చుకునే పని పెట్టుకోకండి. ఫ్లాపవుతున్న 90% సినిమాలూ స్ట్రక్చర్ వల్లే ఫ్లాపవుతున్నాయా? ఈ వారం తాజాగా ఫ్లాపయిన నాల్గూ స్ట్రక్చర్ వల్లే ఫ్లాపయ్యాయా? ఫిలిమ్ స్కూల్స్ లో స్ట్రక్చర్ పాఠాలు ఇక అవసరం లేదా? లక్షలకి లక్షలు బైట్స్ తో హాలీవుడ్ నుంచి స్ట్రక్చర్ వ్యాసాలు వెలువడుతూంటాయి. వాళ్ళు అనవసరంగా కష్టపడుతున్నారా? ఏ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీకొడుతున్నారో అవి స్ట్రక్చర్ తో వుండే సినిమాలు కావా? కాబట్టి వాదోపవాదాలు అనవసరం. ఒకటి నిజం. అసిస్టెంట్స్ స్థాయిలో ఇప్పుడు స్ట్రక్చర్ స్పృహ పెరుగుతోంది. వీళ్ళని నిర్మాతలు, హీరోలు ప్రోత్సహించే రోజులొస్తే బావుంటుంది. స్ట్రక్చర్ విశ్వసనీయత గురించి అనవసర సందేహాలు వద్దు.

Q : కరోనా తరువాత ఆడియన్స్ కేవలం కామెడీలు, బలమైన ఎమోషన్స్ మాత్రమే కోరుకుంటున్నారు అనిపిస్తుంది ఈ మధ్య వచ్చిన సినిమాలు చూస్తుంటే. కరోనా తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏమైనా మారింది అంటారా? వీటి గురించి మీ విశ్లేషణ చెప్పండి.
రవి, పి, అసోసియేట్

A : కామెడీలూ ఎమోషన్లూ ఎప్పుడూ వుండేవే గానీ, ఇప్పుడు నానాజాతి సస్పెన్స్ థ్రిల్లర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓటీటీల్లో గ్లోబల్ కంటెంట్ కి ఎక్స్ పోజ్ అవుతున్న యూత్ థియేటర్స్ లో అలాటివి కోరుకుంటున్నారు. వయోలెంట్ అడల్ట్ మూవీస్, రోమాంటిక్ సస్పెన్స్ మూవీస్. మేకర్లు ఈ జానర్స్ ని అర్ధం జేసుకోకుండా ఏవిటేవిటో లేకి సస్పెన్స్ థ్రిల్లర్లు టోకున తీసేస్తున్నారు. కాలంతో కలిసివచ్చిన అవకాశంతో, యూత్ కోరుకుంటున్న కంటెంట్ ని క్వాలిటీతో అందించకుండా, ఆ మధ్య కాలం వరకూ విసుగెత్తించిన రోమాంటిక్ కామెడీలు తీసి పడేసి నట్టు, చీప్ సస్పెన్స్ థ్రిలర్లతో ఆసక్తిని చంపేస్తున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, మేకర్లకి లిమిటెడ్ జానర్లే తెలుసు. ఆ ఒకటి రెండు లిమిటెడ్ జానర్లే ప్రేక్షకులు చూడాలనుకుంటారు. ఎందుకు చూస్తారు, ఓటీటీ చూస్తారు.

Q : ఒక ఐడియా అనుకొని దాన్ని కథగా మలచాలి అనుకున్నప్పుడు అందుకోసం ఏమైనా మినిమం టైం పీరియడ్ పెట్టుకోవాలా? లేక ఐడియా మీద ఎక్కువ రోజులు పని చేయాలా? ఎందుకంటే ఒక్కోసారి ఎన్నిరోజులు ఆలోచించినా కథ రెడీ అవదు. అప్పుడు అరే ఈ ఐడియా మిస్ అవుతున్నామే అనుకుంటాం. ఒక్కోసారి ఐడియా బాగున్నా ఆ సమయానికి మనం కథ చేయలేకపోతాం. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? దీని గురించి వివరించగలరు.
వీడియార్, అసోసియేట్

A : పైవొక ప్రశ్నకి చెప్పిన విధంగా, ఐడియా నిర్దుష్టంగా కుదిరే వరకూ ఎన్ని రోజులైతే అన్ని రోజులు కుస్తీ పట్టాల్సిందే. ఐడియాగా కుదరనిది కథగా కుదరదు. బిందువుగా తెలియనిది సింధువుగా తెలియదు. ఎన్ని రోజులాలోచించినా కథ రెడీ అవడం లేదంటే ముందుగా ఐడియాని ఆలోచించక పోవడం వల్లే. ఐడియా ఆధారంగా బిగినింగ్ మిడిల్ ఎండ్ లతో సుస్పష్టమైన 20 పేజీల ( రైటింగ్ లో 50 పేజీలు) సినాప్సిస్ సిధ్ధం చేసుకోక పోవడం వల్లే. చేసే పని సిస్టమాటికల్ గా చేస్తే అయోమయం వుండదు.

Q : విడుదల అయిన 10 రోజుల్లోపే ఓటీటీ లోకి వచ్చిన గాలి సంపత్ అనే సినిమా చూశాను.  అసలు జానర్ మర్యాదను మంట కలిపి చాలా నిర్లక్ష్యంగా చేసిన స్క్రిప్టు అది అనిపించింది సినిమా చూస్తే. మీకు కుదిరితే అన్ని జానర్ మర్యాదల గురించి మా కోసం ఒక పిడిఎఫ్ ఫైల్ పెట్టగలరు. ఇప్పటికే పెట్టి ఉన్నట్లు అయితే మరొకసారి పోస్ట్ చేయగలరు.
సచిన్, జి, అసిస్టెంట్

A : ఆల్రెడీ ఒక పోస్టు పెట్టాం. ఇప్పుడు కుదిరేలా లేదు. సెర్చి బాక్స్ లో జానర్ మర్యాదలు అని తెలుగులో కొడితే వ్యాసాలు కనపడతాయి. అవి తీసుకోండి.

(కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. అవి వచ్చే వారం)

సికిందర్