రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, January 26, 2023

1294 : రివ్యూ!


 

దర్శకత్వం : మహేష్ సూరపనేని
తారాగణం : సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ నివాస్, మౌనికా రెడ్డి, చిత్రా శుక్లా, మంజుల ఘట్టమనేని, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, సంజయ్ స్వరూప్ తదితరులు
కథ, కథనం : బాబీ- సంజయ్, సంగీతం : జిబ్రాన్, ఛాయాగ్రహణం : అరుళ్ విన్సెంట్
బ్యానర్ : భవ్య క్రియేషన్ ప్రొడక్షన్
నిర్మాత : వి ఆనంద ప్రసాద్
విడుదల : జనవరి 26, 2023
***

        నైట్రో స్టార్ సుధీర్ బాబు సరైన సినిమాలు నటించడం లేదనుకుంటే నటించే కొత్త సినిమాలు కూడా సరైన విధంగా ఎంపిక చేసుకోవడం లేదు. తేడా ఎక్కడుందో సీరియస్ గా పరిశీలించుకోకపోతే ఎంపికలు ఎదురు తిరుగుతూనే వుంటాయి. అలాటి మరో ఎంపిక హంట్. ఏదో భాషలో హిట్టయ్యిందంటే ఆ హీరో చేసే సినిమాలు అలాగే వుంటాయి. సుధీర్ బాబు అభిమానులు హంట్ ఎంపికని జీర్ణించుకోలేరు. వికారం కల్గించే క్యారక్టర్ తో మూడాఫ్ అయిపోయి బయటికొస్తారు. హంట్ విషయంలో తను చేసిన ఖరీదైన పొరపాటు ఇక ముందు చేయకుండా జాగ్రత్త పడితే బావుంటుంది.

    కొత్త దర్శకుడు మహేష్ సూరపనేని వెళ్ళి వెళ్ళి ఇలాటి రీమేక్ తో తన కెరీర్ ని ప్రారంభించాలనుకోవడం కూడా అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. దీనికి చేకూర్చిన కళాత్మక విలువలేమిటో చూద్దాం...

కథ

పోలీస్ కమీషనర్ మోహన్ భార్గవ (శ్రీకాంత్), ఏసీపీ అర్జున్ ప్రసాద్ (సుధీర్ బాబు), మరో ఏసీపీ ఆర్యన్ దేవ్ (భరత్ నివాస్) ముగ్గురూ ప్రాణ స్నేహితులు. ఆర్యన్ దేవ్ అర్జున్ ప్రసాద్ తో కలిసి ముంబాయిలో ఒక టెర్రర్ ఆపరేషన్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలకి గ్యాలంట్రీ అవార్డు వస్తుంది. ఆ అవార్డు తీసుకుంటున్నప్పుడు ఒక షార్ప్ షూటర్ కాల్చి చంపుతాడు. దీంతో డిజిపి మోహన్ భార్గవ నేతృత్వంలో అర్జున్ ప్రసాద్ కి ఈ హత్య కేసు అప్పగిస్తాడు. అర్జున్ ప్రసాద్ కేసు దర్యాప్తు చేసి హంతకుడెవరో మోహన్ భార్గవకి చెప్పబోతూ యాక్సిడెంట్ కి గురై జ్ఞాపక శక్తి కోల్పోతాడు. కేసు గురించి ఏదీ గుర్తుండదు. హంతకుడు కూడా గుర్తుండడు. దీంతో మళ్ళీ కేసు పరిశోధించాల్సి వస్తుంది. ఇప్పుడు తిరిగి చేస్తున్న పరిశోధనలో ఏఏ విషయాలు బయటపడ్డాయి? తనకి గుర్తు లేని ఆ రహస్యమేమిటి? అప్పుడు షాకింగ్ గా ఆ హంతకుడెరు? ... అన్నవి మిగతా కథలో తెలుస్తాయి.

ఎలావుంది కథ

సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కథ. కథలో దర్యాప్తు అధికారి జ్ఞాపక శక్తి కోల్పోవడం, మళ్ళీ కేసు దర్యాప్తు చేయాల్సి రావడం వంటి  రెండు పాయింట్లు కొత్తగా వున్నాయి. అయితే దీనికి చేసిన కథనం సినిమాకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ కథనమైంది. అలాగే ఎండ్ వరకూ కథ లేని కథనాన్ని లాగి లాగి రివీల్ చేసిన హంతకుడి పాత్రని తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా సుధీర్ బాబు ఫ్యాన్స్ జీర్ణించుకునే స్థితిలో వుండరు. అంత వికారం కల్గించే పాత్ర. యాంటీ హీరో పాత్రలు తెలుగులో సక్సెస్ కావని కాదు, ఇలావుంటే కావు.
        
పాత్ర విషయమిలా వుంటే. ఇక కథనం కథేమిటో తెలియకుండా దర్యాప్తు పేరుతో ఉపోద్ఘాతం సాగుతూ వుంటుంది. ఎండ్ సస్పెన్స్ కథాలక్షణమిదే. దర్యాప్తు దర్యాప్తు దర్యాప్తు-ఫస్టాఫ్ దర్యాప్తు- సెకండాఫూ ఇంకా దర్యాప్తు కొనసాగి సాగి, మొనాటనీతో విసిగించి, చివరి పదినిమిషాల్లో హంతకుడెవరో తేలుస్తాడు. ఇప్పుడు గానీ అసలు కథేమిటో, హత్యకి కారణమేంటో తెలియదు. ఇది తెలుసుకోవడానికి సినిమా చివరివరకూ వేచి వేచి వుండాలి. ఇలా ఎండ్ సస్పెన్స్ కథనంతో  సినిమాలు పదేపదే బెడిసికొడుతున్నాయని ఎప్పటికీ గ్రహించకపోతే ఎవరేం చేస్తారు.
        
ఎండ్ సస్పెన్స్ తో సినిమాలకి ఇంకో ప్రమాదమేమిటంటే, చివరి దాకా దాచిన పెట్టిన సస్పెన్సు ని సినిమా చూసిన ప్రేక్షకుడు బయటికొచ్చి, ఒరే హంతకుడు వాడేరా అని చెప్పేస్తే నెక్స్ట్ షో ప్రేక్షకులు చూడ్డానికేమీ వుండదు. ఎండ్ సస్పెన్స్ సినిమాల షెల్ఫ్ లైఫ్ ఫస్ట్ డే ఫస్ట్ షో వరకే. ఇలా వుంది ముంబాయి పోలీస్ (2013) మలయాళం రీమేక్ వ్యవహారం.

నటనలు –సాంకేతికాలు

నైట్రో స్టార్ సుధీర్ బాబు పోలీస్ క్యారక్టర్ లో చూడ్డానికి పర్ఫెక్టుగా వున్నాడు. మాస్ పోలీస్ ఓవరాక్షన్ లేకుండా, అలాటి డైలాగుల్లేకుండా నీటుగా పాత్ర పోషణ చేశాడు. ఫోరెన్సిక్ సైన్స్ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాడు. అయితే బుల్లెట్ పై తొడుగు క్యాట్రిడ్జ్ ద్వారా అదే తుపాకీయో తెలియదు. క్యాట్రిడ్జ్ లోపలినుంచి బయటికి దూసుకుపోయే బుల్లెట్ మీద గన్ బ్యారెల్ గ్రూవ్స్ వల్ల స్ట్రయేషన్స్ ఏర్పడతాయి. ఈ స్ట్రయేషన్స్ ఆధారంగా గన్ ని ఐడెంటి ఫై చేస్తారు.
        
జ్ఞాపక శక్తి కోల్పోయిన పాత్రలో నటన స్ట్రగుల్ లేకుండా సాదాసీదాగా వుంది. తను మినీ గజినీ లాంటి వాడు. ఆ సంఘర్షణ, భావోద్వేగాలు మాత్రం లేవు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. హీరోయిన్ లేకపోవడం లోటుగా లేదు. దీన్ని అర్ధం జేసుకుంటారు ప్రేక్షకులు. కానీ పాత్రలో వికారాన్ని మాత్రం భరించలేరు.
        
పోలీస్ కమీషనర్ గా శ్రీకాంత్ డీసెంట్ గా నటించాడు. ముగ్గురు పోలీసు మిత్రుల బాండింగ్ కూడా బావుంది. బాగా వుండాల్సింది తమ ముగ్గురితో కథనమే. మరో ఏసీపీగా భరత్ నివాస్ కూడా బాగా నటించాడు. సుధీర్ బాబు దర్యాప్తు టీములో మౌనికా రెడ్డి రెబల్ క్యారెక్టర్. మంజుల ఘట్టమనేని సైకియాట్రిస్టు పాత్రవేస్తే, చిత్రా శుక్లా భరత్ నివాస్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర వేసింది.
        
భవ్య క్రియేషన్స్ ప్రొడక్షన్ కి బాగానే ఖర్చు పెట్టారు. జిబ్రాన్ మాత్రం సంగీతం నిర్వహించడానికి బద్ధకించినట్టు వుంది. సినిమా చూస్తూంటే ఎవరికైనా బద్ధకంతో ఆవలింతలే వస్తాయి. ఈ సినిమాకి రేటింగ్ 1.5, అంటే చిరంజీవి మాటల్లో 1.5 మిలియన్ డాలర్లు.
—సికిందర్