రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, February 28, 2015

శివ

కిటికీ లోంచి కొత్త సృష్టి!
శివ’ ఆధారంగా  తెలుగు సినిమా  స్క్రీన్ ప్లే  స్ట్రక్చర్  వ్యాసాల పరంపరలో  భాగంగా  ‘శివ’ గురించి ఈ సింహావలోకనం... 

రిత్రని మార్చేస్తూ మార్గదర్శకంగా నిలవాలంటే ఏం చేయాలి?

     పాతలో నెగెటివ్స్ ని చూసి, కొత్తని పాజిటివ్ గా ఆలోచించాలి. అలనాటి హాలీవుడ్ ఫన్నీ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ సీను ఎలా వుంటే ఇంటరెస్టింగ్ గా మారుతుందో ఇలా చమత్కరిస్తాడు- ‘మామూలుగా పాత్ర తలుపు తీసుకుని లోపలికి  వచ్చిందనుకోండి, అది చప్పగా వుంటుంది ప్రేక్షకులకి. అదే ధబీల్మని కిటికీ దూకేసి వచ్చిందనుకోండి- చప్పున లేచి చూస్తారు ప్రేక్షకులు!’

      సింపుల్ గా ఎంత తేడా తలుపుకీ కిటికీకీ ప్రేక్షకుల రెస్పాన్సు లో!

      సరీగ్గా 1989 కి పూర్వం ఇలాగే ఉండేవి తెలుగు సినిమాలు. బద్ధకంగా తలుపు తీసుకుని వచ్చి అలసటగా కూర్చునేవి. ఈ రొటీన్ ఫార్ములా చూసి చూసి ఇదే కాబోలు సినిమా అంటే అనుకుని అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. అప్పుడు 1989 లో అనుకోకుండా జరిగిందొక సంఘటన. అతను అక్కినేని నాగార్జున, ఇంకో అతను రామ్ గోపాల్ వర్మ. ఇద్దరూ కలిసి అదును చూసుకుని ‘శివ’ అనే సినిమాని దభీమని కిటికీ దూకించారు. అంతే, ఉలిక్కి పడి చూసిన ప్రేక్షకులు థ్రిల్లయి పోయారు. తెలుగు సినిమాలు ఎప్పుడైనా తలుపు తీయడమూ, లోపలికొచ్చి ఎక్కడ ప్రేక్షకులు పారిపోతారో నని గట్టిగా గడియ పెట్టేసుకోవడమే తప్ప, ఇలా డిఫరెంట్ గా డైనమిక్ గా  కిటికీ దూకేసి రావడమేమిటి? ఇంటా వంటా ఇలాంటిది లేదే - అనుకుంటూనే సీట్లకి అతుక్కుపోయి శివాలెత్తి పోయారు. ఇంతకాలమూ అమాయాకంగా తాము చూస్తూ ఉండిపోయిన సినిమాల్ని తల్చుకుని శివ శివా అనుకున్నారు. రాత్రికి రాత్రే నాగార్జునకి టాప్ హీరోగా పట్టం గట్టేశారు, రామ్ గోపాల్ వర్మ ని హాట్ దర్శకుణ్ణి చేసేశారు.


       అలా తెలుగు సినిమా రూపు రేఖల్ని పునర్నిర్వచించింది ‘శివ’. అప్పటికి రెండు స్వర్ణ యుగాలే (1931లో ‘భక్త ప్రహ్లాద’ నుంచీ 1950 లో ‘స్వప్న సుందరి’ వరకూ మొదటి స్వర్ణ యుగం;  1951 లో ‘మల్లీశ్వరి’ నుంచీ 1965 లో  ‘సుమంగళి’  వరకూ రెండో స్వర్ణ యుగం) తెలిసిన తెలుగు సినిమాకి, 1965 తర్వాత నుంచీ ఫక్తు వ్యాపార విలువల్ని జోడించుకుని కళని రెండో తరగతి పౌరురాలిగా మార్చేసుకున్న తెలుగు సినిమాకి- తను ఎటు ప్రయాణిస్తోందో దిశా దిక్కూ లేకుండా ఉన్న తెలుగు సినిమాకి- అప్పుడు 1989 లో గ్లాసుడు చల్లని నీళ్ళతో సేదదీర్చి, అక్కడో గీత గీసి ‘ఇదిగో నేనూ ‘శివ’ ని. ఇక్కడ్నుంచీ  తెలుగు సినిమాలు గీత కటు ‘శివ’ కి ముందు, గీత కిటు ‘శివ’ కి తర్వాతగా వుంటాయి. గీత కటే  నువ్వుండి  పోయి కాలగర్భంలో కలిసిపోతావో, దాటుకుని ఇటొచ్చి కాలంతో పాటూ ముందుకు సాగుతావో ఇక నీ ఇష్టం. వచ్చావా నాతో, గీత దాటించేస్తా. భయపడొద్దు, మాస్ ప్రేక్షకుల మెప్పు కూడా పొంది వచ్చాన్నేను. నాకు పనికొచ్చిన సరంజామా అంతా నీకే ఇచ్చేస్తా. బిల్డప్పులు, బ్యాంగులు, మాస్ డైలాగులు, ఓవరాక్షన్ లు, కామెడీ ట్రాకులూ ఉండక పోవచ్చు నా  సరంజమాలో. నేలకి దిగి వచ్చి నిజవితంతో కరచాలనం చేశా మరి. రా నాతో  చేయి కలిపి, నా విజయ రహస్యమూ జ్ఞానమూ నువ్వూ పంచుకుని తెలుగు సినిమాని కొత్త తావులకి తీసి కెళ్ళడంలో నువ్వూ భాగస్వామివి కా, కమాన్!’ అనేసి వెన్ను తట్టి ప్రోత్సహించింది.

     శివ’ కి ముందు ‘శంకరాభరణం’ వంటి ఆణి ముత్యాలున్నాయి, కాదనలేం. అవి ప్రతిష్టని నిలబెట్టాయి. ‘శివ’ చరిత్ర ని మార్చింది. కొత్తగా వచ్చే దర్శకుల్లో ఆవేశాన్ని రగిల్చింది. రిఫరెన్స్ పాయింట్ గా నిల్చింది. అభినయాలతో, కథా కథనాలతో కొత్త పుంతలు తొక్కుతూ, టెక్నికల్ విలువలకీ ఓ గైడ్ అయింది.   

   టెక్నాలజీ! మనిషి అంతరంగం ఎక్కడో ఊర్ధ్వలోకాల్ని తాకాలని ఉబలాట పడుతూంటుంది. ఈ ఉబాలాటాన్ని తీర్చేది టెక్నాలజీయే. సుదూరంగా వుండే వాటిని పసిగట్టే మానసిక శక్తులు ఆ రోజుల్లో ఋషుల కుండేవి. ఈ రోజుల్లో ఆ మానసిక శక్తుల పాత్ర టెక్నాలజీ వహిస్తూ ఉపగ్రహాల ద్వారా దూరతీరాల సమాచరం మనకందిస్తోంది. స్పిరిచ్యువాలిటీకి అచ్చమైన నకలు టెక్నాలజీ. ఈ టెక్నాలజీ సినిమాలో కలగలిసిపోయినప్పుడు ప్రేక్షకుడెంతో సేద తీర్తాడు. ఆ టెక్నాలజీ తానుంటున్న ప్రదేశపు మట్టి వాసనలతో మిళితమైనప్పుడు ఇంకింత రిలాక్సవుతాడు. అదే పాత  పద్దతుల్లో అదే మూస ఫార్ములా కథకి టెక్నాలజీ హంగులు సమకూర్చుకుని వచ్చి వుంటే  ‘శివ’ కింత సమ్మోహక శక్తి లభించేది కాదేమో. ‘శివ’ అనే యాక్షన్ సినిమా మొదటి సారిగా రియల్ లైఫ్ క్యారక్టర్ లతో, మన ప్రాంతంలో మన ముందే జరుగుతున్నట్టుండే వాస్తవిక సంఘటనలతో, అందునా ఎక్కువ మంది ఫీలయ్యే స్థానిక సమస్య కథాంశంగా వచ్చి ఉండడం వల్లే,  దీని టెక్నాలజీ హంగులైన శబ్ద, ఛాయాగ్రాహక ఫలితాల్ని అంతలా మైమరచి ఆస్వాదించ గల్గారు సగటు ప్రేక్షకులు సైతం.

      స్టడీ కామ్ ఈ విజువల్ ఫలితాల్ని సాధించింది. ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ ని పెంచే ఈ కెమెరాతో గ్యాంగ్ ని తప్పించు కుంటూ పిల్ల నెత్తుకుని నాగార్జున సందు గొందుల్లో పరుగెత్తే దృశ్యాలెంత థ్రిల్లింగ్ గా అన్పించాయో తెలిసిందే. నాల్గేళ్ళుగా  చెన్నైలో వృధాగా పడి ఉంటున్న ఈ  స్టడీ కామ్ ని పట్టుకొచ్చి, దేశంలో మొట్ట మొదటి సారిగా ‘శివ’ కి ఉపయోగించారు. ‘శివ’ విడుదలై ఏడాది తిరిగేసరికల్లా, అర్జెంటుగా ఇలాటి ముప్పయ్యారు కెమెరాలు దేశంలోకి దిగుమతి అయిపోయాయంటే పూర్వరంగంలో  ‘శివ’ సాధించిన గొప్పతనమేమిటో తెలుస్తోంది. 1976 లో గారెట్ బ్రౌన్ అనే నిపుణుడు కనిపెట్టిన ఈ కెమెరా  మోత బరువుంటుంది. ఈ బరువంతా ఆపరేటర్ తన నడుం  మీద మోయాల్సిందే. ఈ క్రమంలో షూట్ చేస్తూ కదుల్తూన్నా, పరిగెడుతూన్నా ఆ కుదుపు లన్నిటినీ  కౌంటర్ బ్యాలెన్స్ చేసుకుని స్టడీగా వుంటుందీ కెమెరా. ‘శివ’ కి దీని బరువు బాధ్యతల్ని ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల రెడ్డి దగ్గర ఆపరేటివ్ కెమరా మాన్ గా పనిచేస్తున్న రసూల్ ఎల్లోర్ ఎత్తుకున్నాడు.

        ఇలాటి గోపాలరెడ్డి విజువల్ విన్యాసాలతో దీపెన్ ఛటర్జీ శబ్ద గ్రాహక ప్రతిభ పోటీ పడింది. ఈ ఆడియో ఎఫెక్టు తెలుగు సినిమాల్లో మొట్ట మొదటి సారిగా  కృత్రిమ శబ్దం ‘డిష్యూం డిష్యూం’ ని పచ్చడి పచ్చడి చేసింది. ముష్టి ఘాతం తొలిసారిగా సహజ శబ్దంతో రక్తపోటు పెంచేసింది. బార్ సీన్ లో బ్రిజ్ గోపాల్ ని హీరో నాగార్జున కొడుతున్నప్పుడు పుట్టే ఆ శబ్ద ప్రకంపనలు ప్రేక్షకుల గుండెల్లో అలజడి రేపాయి. నేపధ్యంలో ఇంకే శబ్దాలు, అరుపులు, మూల్గులు, రీ- రికార్డింగూ విన్పించవు. ఇది శబ్దం లో నిశ్శబ్దం. శబ్దపు పొరల్ని విప్పుకుంటూ పోతూంటే  పోతూంటే భయంకర నిశ్శబ్దమే తేలుతుంది. అది కూడా శబ్దమే. అంతరంగం శోషించుకునే శబ్దం.

      ఇంకో చోట క్లైమాక్స్ లో రఘువరన్ ని కొడుతున్నప్పుడు కూడా ఇదే సౌండ్ టెక్నిక్. కాకపోతే రఘువరన్ రొప్పులు అందులో కలగలిసి వుంటాయి. నిశ్శబ్దం లో శబ్దం ఏమందిస్తుంది నిజానికి? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కి ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు పొందిన మనదేశపు శబ్ద గ్రాహకుడు రసూల్ పోకుట్టి ఆస్కార్ సభలో ఏమని చెప్పాడు? నిశ్శబ్దం తర్వాత నిశ్శబ్దాన్నీ దాటుకుంటూ పోతూంటే, విన్పించేది చిట్ట చివర ఓంకార నాదమే! విశ్వ మానవాళికి ఇలాంటి పవిత్ర మంత్రాక్షరిని అందించిన దేశాన్నుంచీ వచ్చిన వాణ్ణి నేనూ అని చాటాడు. శ్రీశ్రీ ఆనంద మూర్తి దీన్నిలా వివరిస్తాడు : మౌన ముద్రలో మొదట క్రికెట్ ఆడుతున్నట్టు శబ్దాలు విన్పిస్తాయి. తర్వాత ఒక్కో అంచులో గజ్జెల శబ్దం, వేణువూదుతున్న శబ్దం, సముద్ర ఘోష, గణగణ గంటల శబ్దమూ విన్పించి, చిట్ట చివర్న స్థంభింప  జేసేదే ఓంకార నాదం! ఏమీ వుండదు దీనికావల. చెవులు పగిలే నిశ్శబ్దమే ఆవరించుకుని వుంటుంది. ఇప్పుడు ‘శివ’ ని తిలకిస్తున్న ప్రేక్షకోత్తముడి అంతరంగం ఏ శిఖరాలకి వెళ్లి తాకుతుందో సులభంగా ఊహించేసుకో వచ్చు. రుషుల్లేని ఈ కాలంలో టెక్నాలజీయే ఆత్మిక దాహాన్ని తీర్చే రుషి. ఇది గ్రహించక చాలా మంది దర్శకులు టెక్నాలజీని సవ్యంగా వినియోగించుకోలేకో, లేదా ఆ దివ్యౌషధం లాంటి టెక్నాలజీ కి దీటైన స్క్రిప్టులు తయారు చేసుకోలేకో అంతా కాలుష్యపు కాసారాలుగా మార్చేస్తున్నారు సినిమాల్ని.  

        పోతే, ‘శివ’ అంటే తలపండిన సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే నమూనా కూడా! ‘శివ’ ని చూడ్డం, సిడ్ ఫీల్డ్ ని చదవడం ఒకటే. స్క్రీన్ ప్లే పరంగా వియవంతమైన సినిమాల్లో ఉంటున్న ఒక సారూప్యాన్ని పసిగట్టిన  సిడ్ ఫీల్డ్,  దాని ఆధారం గా ఓ స్క్రీన్ ప్లే నమూనాని ఆవిష్కరించి ప్రచారం లోకి తెచ్చాడు. దీని ప్రకారం సినిమా కథల్లో వుండే మూడంకాలూ 1 : 2 : 1 నిష్పత్తిలో వుంటాయి. ‘శివ’ కూడా సరాసరి ఈ నిష్పత్తినే పంచుకుని, మొదటి అంకం 20 సీన్లు, రెండో అంకం 55 సీన్లూ, మూడో అంకం 25 సీన్లు గా స్క్రీన్ ప్లే సాగించుకుంటుంది. 


          ఈ అంకాల్లో ఏమేం జరుగుతాయో శాంపిల్ గా మొదటి అంకాన్ని తీసుకుని చూస్తే – ఇందులో జరిగే కార్యకలాపం లేదా బిజినెస్ ఎలా ఉంటుందంటే- ప్రధాన పాత్రని పరిచయం చేసి, కథ దేనిగురించో చెప్పడం; ఇతర పాత్రలతో ప్రధాన పాత్ర సంబంధాల్ని నిర్వచించడం, ప్రధాన పాత్ర చర్య తీసుకునేందుకు ప్రేరేపిస్తున్న శక్తులేవో చూపడం, ఇదంతా చేసుకొస్తూనే అంకం చివర ఏదైతే పాయింటు లేదా సమస్యని ఏర్పాటు చేస్తామో, దానికి దారి తీసే పరిస్థితుల కల్పనా పూర్తి చేసుకు రావడమూ జరుగుతుంది. ఇక్కడే కథలో మొదటి మలుపు అనేది ఏర్పడి అసలు కథ మొదలౌతుంది. అంటే రెండో అంకం ప్రారంభమౌతుంది.

      ‘శివ’ లో మొదటి అంకం ప్రారంభం లోనే ఓ స్టూడెంట్ ని గూండాలు గాయపరచడం ద్వారా కథ దేనిగురించి అయి వుంటుందో సూచించారు. అప్పుడు ప్రధాన పాత్రగా నాగార్జునని ప్రవేశపెట్టి, అతడి సహవిద్యార్థులుగా అమల, శుభలేఖ సుధాకర్, చిన్నా, విశ్వనాథ్ తదితరులతో పాటు నాగార్జున పాత్రని పరిచయం చేసి, వాళ్ళ సంబంధ బాంధవ్యాలని చూపారు. ఇంటి దగ్గర నాగార్జున అన్నా వదినెల్నీ, వాళ్ళ కూతుర్నీ పరిచయం చేసి, ఇంకా అటు అమల అన్నగా సీఐ పాత్రలో సాయిచంద్ ని చూపించారు.


          మరో వైపు కాలేజీలో జేడీ చక్రవర్తి బ్యాడ్ బ్యాచిని చూపిస్తూ, భవానీ అనే పెద్ద గూండాతో అతడికి సంబంధాలున్నట్టు చెప్పించారు. నాగార్జున వేసుకొచ్చే సైకిలు మీద ఘరానాగా జేడీ ని  కూర్చోబెట్టడం ద్వారా, ఓ బాయ్ ఫ్రెండ్ ని అతడి చేత కొట్టించడం ద్వారా, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనని మెల్లగా చేసుకొచ్చారు.
      కాలేజీలో ఈ పరిస్థితులు ప్లస్ ఇంటి దగ్గర వదినతో ఇబ్బందులూ నాగార్జున చర్యకి పూనుకునేందుకు ప్రేరేపించే శక్తులుగా ఎష్టాబ్లిష్ చేశారు. పెద్ద గూండా భవానీకి మినిస్టర్ అండ ఉందని సాయిచంద్ తో చెప్పించి నాగార్జునకి రిస్కు తీవ్రతని పెంచారు. అప్పుడు ఫైనల్ గా 20 వ సీనుకల్లా, అంటే ఈ మొదటి అంకం ముగింపులో,  జేడీతో అమలకి డ్యాష్ కొట్టించి, ఇక తప్పని సరి పరిస్థితుల్లో నాగార్జున సైకిల్ చైన్ లాగేసి దాంతో  జీడీ మీదికి విజృంభింప జేయడం ద్వారా, కథని పూర్తిగా మలుపు తిప్పేసి రెండో అంకంలో పడేలా చేశారు.



       బ్యూటిఫుల్ క్రియేషన్. మంచి స్క్రీన్ ప్లే కి రిఫరెన్స్ బుక్. హైదరాబాద్ లో గొల్ల రవి (నాగార్జున పాత్ర), విజయవాడలో వంగవీటి రాధా ( రఘువరన్ పాత్ర) లని స్ఫూర్తిగా తీసుకుని, బ్రూస్ లీ నటించిన ‘ఎంటర్ డి డ్రాగన్’ ఆధారంగా కథ తయారుచేసుకున్నట్టు చెప్పొచ్చు వర్మ. కా నీ కథ నడక ‘ఎంటర్ ది డ్రాగన్’ లా వుండదు. ‘అన్ టచబుల్స్’ (1987) అనే హాలీవుడ్ సినిమా కథా నడకని పోలి వుంటుంది. అదే శైలి, సహజత్వం, మూడ్, ఫీల్, తక్కువ మాటలు, ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ . నేపధ్యంలో భవానీ తాలూకు టెన్షన్ వున్న విషయం గురించి సీన్లు వెర్బల్ గా పలకవు. ఏ హడావిడీ  లేని సబ్ టెక్స్ట్ ద్వారా ఆ టెన్షన్ పుడుతుంటుంది. కాకపోతే ఒకటే తేడా- ‘అన్ టచబుల్స్’ లో సీన్ కానరీ -  ‘వాడు కత్తి తీస్తే నువ్వు పిస్తోలు తీస్తావు. వాడు నీ మనుషుల్ని ఆస్పత్రి పాల్జేస్తె, వాడి మనుషుల్ని నువ్వు చంపుకుంటూ పోతావు. నేర ప్రపంచపు ఆనవాయితీయే ఇది, కాదనను. కానీ ఈ లెక్కన వాణ్ణసలు నువ్వెప్పుడు పట్టుకుంటావ్?’ అని నిలదీస్తాడు.  అప్పుడు కెవిన్ కాస్టనర్  ఆ రాబర్ట్ డీ నీరో పాల్పడుతున్న తీవ్ర హింసని ఎదుర్కొంటూనే, అవకాశం చూసుకుని పన్ను ఎగవేత స్కాం లో అతణ్ణి పట్టేసుకుని వెన్ను విరుస్తాడు పూర్తిగా!

     ‘శివ’ లో నాగార్జున రఘువరన్ కి పోటీ మాఫియాగా ఎదిగి, ‘ఇలాంటి వ్యవస్థని నాశనం చేయాలి. భవానీని చంపడం కాదు’ అని స్పష్టం చేసి ఆ రూటులో నరుక్కొస్తాడు 

    
      ‘శివ’ లో నాగార్జున రఘువరన్ కి పోటీ మాఫియాగా ఎదిగి, ‘ఇలాంటి వ్యవస్థని నాశనం చేయాలి. భవానీని చంపడం కాదు’ అని స్పష్టం చేసి ఆ రూటులో నరుక్కొస్తాడు

     క్లాస్ నీ, మాస్ నీ ఆకర్షించేదే నిజమైన కమర్షియల్ సినిమా. ‘శివ’ సహజ పాత్రలతో రియలిస్టిక్ గా వుంటూనే ఎంటర్ టైన్ చేస్తుంది. ‘ద్వారం’  సినిమాలెన్నో అయితే, ‘కిటికీ’ సినిమా ఒక్కటే!

సికిందర్

( జులై 2009, ‘సాక్షి’ కోసం)


రేపు : స్ట్రక్చర్ 4 – సినాప్సిస్