రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, July 10, 2024

1446 : స్క్రీన్ ప్లే సంగతులు!

 

టీటీల్ని డీల్ చేయాలంటే రోమాంటిక్ కామెడీలకి చుక్కెదురవుతూండడంతో ఓటీటీలు డిమాండ్ చేస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ల జోరు పెరిగింది. దీంతో ఇటీవలి కాలంలో వారం వారం రోమాంటిక్ కామెడీల తాకిడి తగ్గి, సస్పెన్స్ థ్రిల్లర్ల ఉత్పత్తి వూపందుకుంది. అయితే ఇవి ఏ ఓటీటీల్ని టార్గెట్ గా చేసుకుని వస్తున్నాయో, ఆ ఓటీటీల లైబ్రరీల్లోకి చేరే ముందే థియేటర్లలో గల్లంతవుతున్నాయి. సస్పెన్స్ అంటే ఏమిటో తెలీదు, థ్రిల్ అంటే ఏమిటో తెలీదు, కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటో తెలీదు, లాజిక్ తో పనే లేదు. అపర హిచ్ కాకులం అనుకుని చుట్టి పారేయడమే. ఈ రకంగా మార్కెట్లోకి చాలా స్క్రాప్ డంప్ అవుతోంది. ఇలాంటప్పుడు ఒక మహారాజా అనే తమిళ క్రాఫ్ట్ విడుదలైంది. క్రాఫ్ట్ ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ కి ఆత్మ క్రాఫ్టే. క్రాఫ్ట్ అంటే శిల్పం. కథని నడిపించే తీరు. కథ వొక శిల అయితే దాన్ని ఉత్కంఠభరితంగా చెక్కడం శిల్పం లేదా క్రాఫ్ట్. అందుకని క్రాఫ్ట్ లేని సస్పెన్స్ థ్రిల్లర్ కాకి రెట్టతో సమానం. కథని దాచిపెడుతూ విప్పుతూ పోవడమే సస్పెన్స్ థ్రిల్లర్ కథనమైతే, ఇక్కడ ప్రధానపాత్ర వహించేదే క్రాఫ్ట్. ఈ క్రాఫ్ట్ తోనే  మహారాజా అనే సస్పెన్స్ థ్రిల్లర్ ని నిలబెట్టేందుకు ప్రయత్నించాడు దర్శకుడు నిథిలన్ సామినాథన్.


హారాజా భారీగా మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో కూర్చిన స్క్రీన్ ప్లే. ఈ కూర్పులో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులు ఒకే కాలానికి చెందినవి కావు. వివిధ కాలాలకి చెందినవి. అంటే మల్టీపుల్ టైమ్ లైన్ ఫ్లాష్ బ్యాకులు. దీన్ని స్క్రిప్టు చేయాలంటే, ముందు కథని స్ట్రెయిట్ నేరేషన్ గా కార్డుల మీద లైన్ ఆర్డర్ వేసుకుని, తర్వాత సస్పెన్సు నిమిత్తం ఏ కార్డులో సీను ఎక్కడ వుండొచ్చో అక్కడ జంబ్లింగ్ చేసుకు పోవడమే. అలా జంబ్లింగ్ చేసిన లైన్ ఆర్డర్ తోనే నాన్ లీనియర్ నేరేషన్ గా స్క్రీన్ ప్లే వస్తుంది.

అయితే ఇలాటి స్క్రీన్ ప్లేలో స్ట్రక్చర్ ని వెతుక్కోవడం పెద్ద పనే. స్ట్రక్చర్ అనేది ఫ్లాష్ బ్యాకుల్లో కాక, రియల్ టైమ్ యాక్షన్ కథతో వుంటుంది. రియల్ టైం యాక్షన్ కథలో బిగినింగ్, మిడిల్, ఎండ్ లని విభజించే ప్లాట్ పాయింట్లు వుంటే, అప్పుడు ఫ్లాష్ బ్యాకులు ఏ ప్లాట్ పాయింటు పరిధిలోకి ఏవి వచ్చాయో తెలుస్తుంది.  ఇలాగాక స్ట్రెయిట్ నేరేషన్ కథలో స్ట్రక్చర్ నేరుగా కనిపిస్తుంది. అది ఫ్లాష్ బ్యాకులతో నాన్ లీనియర్ గా వున్నప్పుడు కనిపించదు. పోస్ట్ మార్టం చేసుకోవాల్సిందే.     

స్ట్రక్చర్ ని అలా వుంచి, మహారాజా లో ఈ టైమ్ లైన్లు ఎక్కువై పోవడం వల్ల కన్ఫ్యూజన్ ఏర్పడింది. ముఖ్యంగా సెకండాఫ్ లో. టైమ్ లైన్లకి డేట్ స్టాంప్ లేకపోవడంతో ఫ్లాష్ బ్యాక్స్ ని గుర్తుపట్టడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు మొదట ఈ కథ స్ట్రెయిట్ నేరేషన్ లో ఎలా వుందో తెలుసుకుని, నాన్ లీనియర్ విశ్లేషణ చేద్దాం.

1. స్ట్రెయిట్ నేరేషన్ కథ

2009 లో మహారాజా (విజయ్ సేతుపతి) వృత్తిరీత్యా క్షౌరకుడు. అతడికి భార్య సెల్వి (దివ్యభారతి) తో బాటు రెండేళ్ళ కూతురు జ్యోతి వుంటారు. ఇంకో వైపు సెల్వం (అనురాగ్ కశ్యప్), శబరి (వినోద్ సాగర్) దోపిడీ ముఠాగా ళ్ళ మీద దాడులు చేయడం, దోచుకున్న తర్వాత ఇంట్లో ఆడవాళ్ళ మీద అత్యాచారం చేసి చంపడం చేస్తూంటారు. ఒక రోజు శబరి సెల్వంకి ఫోన్ చేసి, తమ నేరాల గురించి పేర్లు వెల్లడించకుండా దినపత్రికలో వచ్చిందని హెచ్చరిస్తాడు. అప్పుడు సెల్వం గడ్డం ట్రిమ్ కోసం మహారాజా సెలూన్‌లోనే వుంటాడు. మహారాజా ఆ ఫోన్ సంభాషణ వింటాడు. సెల్వం అనుమానంగా చూస్తాడు. గడ్డం ట్రిమ్ చేయించుకుని వెళ్తూ తన రెండేళ్ళ కూతురు అమ్ము (బేబీ షైనిక) కి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న లాకెట్ సెలూన్ లో మర్చిపోతాడు. మహారాజా ఆ లాకెట్ ని ఇచ్చేయడానికి సెల్వం ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పోలీసులు సెల్వంని, శబరిని అరెస్టు చేయడానికి వచ్చేసి వుంటారు. ఆ ఘర్షణలో పోలీసులు శబరిని కాల్చివేసి, సెల్వంని అరెస్టు చేసి తీసికెళ్తారు. సెల్వం నేరాల గురించి తెలియని భార్య కోకిల (అభిరామి) అతడ్ని అసహ్యించుకుని, తాము చచ్చిపోయినా చూడ్డానికి రావద్దని చెప్పేస్తుంది. 

తర్వాత మహారాజా భార్యని
, కూతుర్నీ తీసుకుని, ఆ లాకెట్ ఇచ్చేయడానికి కోకిల ఇంటికి వెళ్తాడు. ఆ
ఇంట్లోకి ఒక ట్రక్కు దూసుకెళ్ళడంతో భార్యతో బాటు కోకిల, ఆమె కూతురూ చనిపోతారు. మహారాజా కూతురు జ్యోతి మాత్రం ప్రమాదం లోంచి బయటపడుతుంది. పడిపోతున్న ఇంటి అటక మీంచి ఒక మెటల్ డస్ట్ బిన్ తలకిందులుగా పడడంతో అందులో ప్రాణాలు దక్కించుకుంటుంది. తర్వాత జ్యోతి పెద్దయ్యాక  (సచనా నమిదాస్)  ఆ చెత్తబుట్టకి  ప్రేమతో లక్ష్మి అని పేరు పెడతారు.

2. 2023 కి వస్తే...
ఇప్పుడు పల్లికరనైలో సొంతింట్లో నివసిస్తూంటాడు బార్బర్ మహారాజా. ఎదిగిన కూతురు జ్యోతి స్కూల్లో స్పోర్ట్స్ లో చురుగ్గా వుంటుంది. ఒక రోజు స్పోర్ట్స్ టీచర్ ఆసిఫా (మమతా మోహన్ దాస్) తో కలిసి కోయంబత్తూరులో స్పోర్ట్స్ క్యాంప్ కి బస్సులో బయల్దేరుతుంది.

తర్వాత ఒక రాత్రి తనని 14 ఏళ్ళ క్రితం జైలుకి పంపాడని అపార్ధం జేసుకున్న సెల్వం ఇప్పుడు జైలు నుంచి తిరిగివచ్చి మహారాజాని చంపడానికి అనుచరులు ధన  (మణికందన్), నల్ల శివం (సింగం పులి) లతో మహారాజా ఇంటికొస్తాడు. మహారాజా ఇంట్లో వుండడు. అప్పుడే కూతురు జ్యోతి  కోయంబత్తూరు నుంచి తిరిగి వస్తుంది.  వాళ్ళు జ్యోతి మీద శారీరకంగా దాడి చేసి కొట్టడంతో  అపస్మారక స్థితిలో కెళ్ళిపోతుంది. నల్లశివం ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేస్తాడు. ముగ్గురూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు.

మహారాజా ఇంటికి చేరుకోగానే జ్యోతిని ఆ స్థితిలో చూసి, ఆసుపత్రికి తీసుకువెళతాడు. దీనికి కారణమైన వాడ్ని తనకి చూపించమని ఆమె తండ్రిని అభ్యర్థిస్తుంది. జ్యోతిని ఆసుపత్రిలో చేర్చిన తర్వాత, మహారాజా ఇంటికి తిరిగి వస్తాడు. చాలా వేదనతో తనని తాను కొట్టుకుని పడిపోతాడు. మేల్కొన్నాక,  అక్కడపడున్న స్థానిక కౌన్సిలర్  కారు నంబర్‌తో కూడిన టోల్ ప్లాజా రసీదుని చూస్తాడు.

సెల్వం అనుచరుడు ధన కారు సర్వీసింగ్ లో పనిచేస్తూంటాడు. అక్కడికి కౌన్సిలర్ కరుణాకరన్ (కళ్యాణ్) వచ్చి  తన కారు లోంచి సన్ గ్లాసెస్ దొంగిలించాడనే ఆరోపణతో ధనని కొట్టి, గ్లాసెస్ తెచ్చివ్వాలని బెదిరిస్తాడు. తర్వాత ధన ఒక బార్‌ కెళ్ళి అక్కడున్న కరుణాకరన్ ని కొట్టి ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది ఇక్కడున్న మహారాజా గమనిస్తాడు. అక్కడ్నుంచి వెళ్ళిపోతున్న ధనని అనుసరిస్తాడు. ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. తన ఇంటికొచ్చిన సహచరులు ఇంకెవరని మహారాజా అడుగుతాడు. వాళ్ళలో ఒకడు  పోలీస్ స్టేషన్‌లోనే వున్నాడని ధన చెప్పడంతో అతడ్ని చంపేస్తాడు.

మహారాజా ఉదయం పోలీస్ స్టేషన్ కెళ్ళి తన ఇంట్లో లక్ష్మిని దొంగలెత్తుకుపోయారని కంప్లెయింట్ ఇస్తాడు. దొంగల ముఠా తన మీద దాడి చేసి లక్ష్మిని తీసుకెళ్ళి పోయారని మొత్తం సంఘటనని వివరిస్తాడు. తన లక్ష్మిని వెతికిపెట్టమని కోరుతాడు. చెత్త బుట్టని వెతకడమేమిటని పోలీసులు తిట్టి వెళ్ళ గొడతారు. మహారాజా వూరుకోడు. ఐదు లక్షలు ఆఫర్ చేసేసరికి, ఆశ పుట్టి పోలీసులు చెత్త బుట్ట వెతకడానికి ఒప్పుకుంటారు. చెత్త బుట్టని వెతకడంలో పాత నేరస్థుడు, సెల్వం అనుచరుడు నల్లశివం (సింగం పులి) పోలీసులకి తోడవుతాడు.

ఇన్స్ పెక్టర్ వరదరాజన్ (నటరాజ సుబ్రహ్మణ్యం) అధ్వర్యంలో పోలీసులు చెత్తబుట్టని గాలించే పనిలో వుంటారు. నల్లశివం సహాయంగా వుంటాడు. గాలింపు ఫలించక లక్ష్మి ని పోలిన చెత్తబుట్టని తయారు చేయిస్తారు. దీన్ని దొంగిలించిన దొంగగా నటించమని కొందరు దొంగల్ని అడుగుతారు. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇన్స్ పెక్టర్ వరదరాజన్ ఆఫర్ చేసిన 50 వేలకి నల్లశివం దొంగలా నటించడానికి ఒప్పుకుంటాడు.

నల్లశివం తదనుగుణంగా నటించడానికి మొత్తం సంఘటననని మరోసారి వివరించమని ఇన్స్ పెక్టర్ వరదరాజన్ స్పీకర్ ఫోన్‌లో మహారాజానీ కోరతాడు. మహారాజా సంఘటనని అదే పద్ధతిలో వివరిస్తాడు. ఇది నల్లశివంకి వినిపించి, ఇన్‌స్పెక్టర్ వరదరాజన్, అతడి బృందం మర్నాడుదయం చెత్త బుట్ట తిరిగి ఇవ్వడానికి నల్లశివంతో మహారాజా ఇంటికి చేరుకుంటారు. మహారాజా ముందు నల్లశివం తానెలా చెత్తబుట్టని దొంగిలించాడో నటించి చూపిస్తాడు. ఇప్పుడు మహారాజాకి నల్లశివం ఎవరో, ఏం చేశాడో అర్ధమైపోతుంది.  

ఇక వీడికి ఏ శిక్ష వేస్తాడో వేసెయ్యమని మహారాజాకి చెప్పేసి బృందంతో బయటికెళ్ళి పోతాడు ఇన్స్ పెక్టర్ వరదరాజన్. అతను ధన మృతిపై దర్యాప్తు చేస్తూంటే నల్లశివం ధనకి ఫోన్ చేసినట్టు తెలిసింది. తర్వాత మహారాజా కూతురు జ్యోతి గురించి డాక్టర్  సమాచారమివ్వడంతో, విషయం పూర్తిగా అర్ధమైపోయి- నల్లశివం ని మహారాజా దగ్గరికి తీసికెళ్ళేలా ప్లాన్ చేశాడు ఇన్స్ పెక్టర్ వరదరాజన్.

మహారాజా నల్లశివంని చంపేస్తాడు. ఇక మూడో వాడ్ని కనిపెట్టి,మూడో వాడు సెల్వం పనిచేసే నిర్మాణ స్థలం దగ్గరికి చేరుకుంటాడు మహారాజా. ఇద్దరూ కొట్టుకుంటారు. ఇప్పుడు గాయపడి కదలలేని స్థితిలో వున్న సెల్వం దగ్గరికి జ్యోతిని తీసుకొస్తుంది ఆసిఫా. జ్యోతి సెల్వంని తనని ఇలా చేసినందుకు అనాల్సిన మాటలు అని, నువ్వొచ్చింది వీటికోసమేగా అని నగలున్న బ్యాగుని అతడి మీదికి విసిరి వెళ్ళిపోతుంది. సెల్వంకి చిన్నప్పుడు కూతురు అమ్ము పుట్టినరోజున అమ్ము కోసం కొన్న లాకెట్ ఆ నగల్లో వుండడంతో షాక్ అవుతాడు. ఈ జ్యోతి తన అమ్ము అని తెలుసుకుని బావురుమంటాడు. చేసిన పాపానికి పై నుంచి దూకి చచ్చి పోతాడు.

అసలు జరిగిందేమిటంటే, ఆ నాడు సెల్వం అరెస్టు తర్వాత, లాకెట్ ని  తిరిగి ఇవ్వడానికి మహారాజా, భార్య సెల్వి,కూతురు జ్యూతిలతో సెల్వం భార్య కోకిల కొత్త ఇంటికి వెళ్లినప్పుడు జరిగిన ట్రక్కు ప్రమాదంలో, అమ్ము తప్ప సెల్వి, జ్యోతి, కోకిల చనిపోయారు. మహారాజా అమ్ముని  దత్తత తీసుకుని తన సొంత కూతురు జ్యోతిలా పెంచాడు. ఆ జ్యోతి మీద సెల్వం అత్యాచారానికి ఒడిగట్టాడు.

స్ట్రక్కఃర్ లో ఏది ఎక్కడ?

ఇదీ స్ట్రెయిట్ నేరేషన్ కథ. ఇందులో జ్యోతి మీద అత్యాచారం జరిగే వరకూ బిగినింగ్ విభాగం, అదే ప్లాట్ పాయింట్ వన్ ఘట్టం. తర్వాత లక్ష్మిని వెతికి పెట్టమని మహారాజా పోలీస్ స్టేషన్ కెళ్ళడంతో మిడిల్ 1 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మహారాజా ధన ని చంపడంతో మిడిల్ 1 ముగిసి ఇంటర్వెల్ వస్తుంది. తర్వాత ఇన్స్ పెక్టర్ వరదరాజన్ కేసు తాలూకు సంఘటనని మహారాజా చేత  చెప్పించి స్పీకర్ ఫోనులో నల్లశివంకి వినిపించడం దగ్గర మిడిల్ 2 ముగిసి, ప్లాట్ పాయింట్ 2 వస్తుంది. ఆ తర్వాత జరిగేదంతా ఎండ్ విభాగం.

అయితే ఈ స్ట్రెయిట్ నేరేషన్ స్క్రీన్ ప్లేని, నాన్ లీనియర్ మల్టీపుల్ టైమ్ లైన్ స్క్రీన్ ప్లేగా మార్చడంలో జరిగినవి తెలియక చేసిన పొరపాట్లా, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన కన్వీనియెంట్ రైటింగా? అయినా గందరగోళం ఎందుకైంది? ఇవీ అసలు తెలుసుకోవాల్సిన విషయాలు.

(రేపు మూడవ భాగం)
—సికిందర్