రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, March 12, 2023

1311 : రివ్యూ!


 రచన- దర్శకత్వం : లవ్ రంజన్

తారాగణం : రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్, అనుభవ్ సింగ్ బస్సీ, డింపుల్  కపాడియా, బోనీ  కపూర్ తదితరులు
సంగీతం : ప్రీతమ్, ఛాయాగ్రహణం : ఎస్ కె రవిచంద్రన్

బ్యానర్స్ : లవ్ రంజన్ ఫిలిమ్స్, టీ సిరీస్ ఫిలిమ్స్
నిర్మాతలు : లవ్ రంజన్, అంకుర్ గార్గ్, భూషణ్ కుమార్, కృషన్ కుమార్,
విడుదల : మార్చి 8, 2023
***

        ణబీర్ కపూర్ ఒక రోమాంటిక్ కామెడీ (?) టైటిల్ తో శ్రద్ధాకపూర్ తో కలిసి నటిస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2013 లో యే జవానీ హై దీవానీ తర్వాత 2022 లో బ్రహ్మాస్త్ర తప్ప వరుసగా 11 ఫ్లాపులెదుర్కొన్న రణబీర్, ఈసారి చిన్న సినిమాల దర్శకుడితో ప్రయత్నించాడు. ప్యార్ కా పంచనామా దర్శకుడు లవ్ రంజన్ ఈసారి స్టార్స్ తో సినిమా తీసే హోదా పొంది తన మార్కెట్ ని విస్తరింప జేసుకోవాలనుకున్నాడు. సాహో తో తెలుగులో పరిచయమైన శ్రద్ధాకపూర్ హిందీలో చిన్న హీరోలతో ప్రయాణం చాలించి పెద్ద హీరోతో నటించే అవకాశం పొందింది. ఇలా పెద్ద హీరో చిన్నవాళ్ళతో, చిన్నవాళ్ళు పెద్ద హీరోతో కాంబినేషన్లు మార్చుకుని లబ్ది పొందాలని తూ ఝూటీ మై మక్కార్ని బాక్సాఫీసుకి అందించారు. ఈ టైటిల్ తో ఆమె ఎంత అబద్ధాల కోరు- అతనెంత జిత్తులమారి అనేది తెలుసుకునే ఆసక్తి ప్రేక్షకులకుంటే, తేలిందేమిటో చూద్దాం...  

కథ

ఢిల్లీలో మిక్కీ (రణబీర్ కపూర్) బాగా డబ్బున్న రమేష్ అరోరా (బోనీ కపూర్) కొడుకు. తల్లి, చెల్లెలు, బావ, చెల్లెలి కూతురు, నానమ్మ అనే కుటుంబ బృందం వుంటుంది. ఇంకో మను (అనుభవ్ సింగ్ బస్సీ) అనే ఫ్రెండ్ వుంటాడు. మనుతో కలిసి మిక్కీ, విడిపోవాలనుకుంటున్న జంటలకి బ్రేకప్ గురుగా సేవ లందిస్తూంటాడు. ఒక రోజు మనుకి కించి (మోనికా చౌదరి) తో పెళ్ళి కుదిరి బ్యాచిలర్ పార్టీకి స్పెయిన్ వెళ్తారు. వెంట మిక్కీ పోతాడు. అక్కడ కించి ఫ్రెండ్ టిన్నీ (శ్రద్దా కపూర్) కలుస్తుంది. చూడగానే టిన్నీని ప్రేమిస్తాడు మిక్కీ. కొన్ని ప్రయత్నాల తర్వాత టిన్నీ ప్రేమలో పడుతుంది. ఢిల్లీకి తిరిగి వచ్చాక టిన్నీని కుటుంబానికి పరిచయం చేస్తాడు మిక్కీ. అందరూ టిన్నీతో మిక్కీ పెళ్ళికి అంగీకరిస్తారు. కానీ టిన్నీకి కుటుంబంతో కలిసి వుండడానికిష్టముండదు. వేరు కాపురం పెట్టాలని వుంటుంది. మిక్కీ కుటుంబాన్ని వదిలి వుండలేడు. దీంతో ఇద్దరికీ కుదరక విడిపోతారు. ఇదీ కథ.

ఎలావుంది కథ

ఇది టైటిల్ కి తగ్గట్టు రోమాంటిక్ కామెడీ కాదు, రోటీన్ పాత ఫార్ములా ప్రేమ డ్రామా. ఏడ్పులతో విషాద డ్రామా అదనపు దరువు. ఆమె అబద్ధాలకోరూ కాదు, అతను జిత్తులమారీ కాదు. పాత్రలకి, పాత్ర చిత్రణలకి అర్ధం పర్ధం లేదు. రాడికల్ ప్రేమలతో కొన్ని చిన్న సినిమాలు తీసిన దర్శకుడు, స్టార్ సినిమాకొచ్చేసరికి మూస ప్రేమకి పాల్పడ్డాడు. వేరు కాపురం పెట్టాలన్న అరిగిపోయిన పాసివ్ పాయింటుతో ఈ చాదస్తపు కథ చేశాడు. ఇద్దరూ పాసివ్ క్యారక్టర్లే. వీళ్ళ గొడవకి పెద్దలు కల్పించుకుని పరిష్కరిస్తే తప్ప ప్రేమ ఫలించి ఒడ్డున పడని పాపాయిలు. ఇలా ఈ జానర్ లక్షణాలతో ఈ విషాద కథ వీణ సినిమా అయింది, టైటిల్ కి తగ్గట్టు ఈ కాలపు హుషారైన గిటార్ సినిమా కాలేదు. వీణలు వాయించుకునే చాదస్తపు డైరెక్టర్లు ఇంకా మిగిలుండడం మన అదృష్టం. కనీసం చేస్తున్నది కథ కాదు, గాథ అని తెలుసుకోక పోవడం భావి జన్మలకి సరిపడా పుణ్యం. లవ్ రంజనం అమృతాంజనం.

నటనలు- సాంకేతికాలు

జిత్తులమారి మిక్కీ- అబద్ధాలకోరు టిన్నీ పాత్రలు అద్భుతంగా వున్నాయి. ఈ పాత్రల్లో రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ లు ఒదిగిపోయారు, రాణించారు, మెరిశారు, ఆకట్టుకున్నారు, పాత్రల పరిధి మేరకు నటించారు, నవ్వులు పూయించారు... ఈ చాదస్తపు విశ్లేషణలున్నంత కాలం సినిమాలిలాగే వుంటాయి.
        
యాక్టివ్ గా వుండాల్సిన పాత్రలు పాసివ్ గా వుంటే చూడడానికి, ఎంజాయ్ చేయడానికి నటనలేముంటాయి. పాసివ్ గా తాను పాత్రని మెరిపించే సంఘనలేం సృష్టిస్తాడు (What is character but the determination of incident? What is incident but the illustration of character? —Henry James).
            
అసలు రణబీర్ బ్రేకప్ గురూగానే యాక్టివ్ గా లేడు. బ్రేకప్ గురూగా  విడిపోవాలనుకుంటున్న జంటల్ని విడదీయడమే చేస్తే యాక్టివ్ క్యారక్టరెలా అవుతాడు. ఏదో ట్రిక్ చేసి కలిపేస్తూంటే యాక్టివ్ క్యారక్టరవుతాడు. అశాంతి వున్న చోట శాంతిని నెలకొల్పుతూంటే పాత్రగా మెరుపులు మెరిపిస్తాడు. కలర్ఫుల్ క్యారక్టర్ అన్పించుకుంటాడు. విడిపోవాలనుకుంటున్న జంటల్ని విడదీయడమే చేయడం నిద్రపుచ్చే కథనం. దొంగ దొరగా, దొర దొంగగా వుంటే డైనమిక్స్. బ్రేకప్ గురు జంటల్ని కలిపితే (యాక్టివ్) కథ, లవ్ గురు జంటల్ని విడదీస్తే (యాక్టివ్) కథ. కథ ఆలోచిస్తే కథ రాదు, కథనం ఆలోచిస్తే కథ వస్తుంది.
        
ఈ బ్రేకప్ గురూకో ట్విస్టుంది. శ్రద్దా రణబీర్ కుటుంబాన్ని చూశాక, ఈ కుటుంబంలో స్వేచ్ఛ వుండదని, ఈ పెళ్ళిని కాదనుకుని, ఈ విషయం రణబీర్ కి చెప్పలేక బ్రేకప్ గురూని ఆశ్రయిస్తుంది. ఫోన్లో రణబీరే బ్రేకప్ గురూ అని తెలీక, రణబీర్ తో తనకి బ్రేకప్ చేయమని కోరుతుంది.
        
ఇది రణబీర్ కి షాక్. దీంతో ఫోన్లోనే ఆమెకి ఫెయిలయ్యే చిట్కాలు చెప్తాడు. ఇద్దరి జాతకాలు చూడమంటాడు, కలవక పోతే పెళ్ళి క్యాన్సిల్ చేసుకోమంటాడు. ఆ జాతకాలు కలవడంతో ఆమె డిసప్పాయింటవుతుంది. జెలసీ టెస్ట్ పెట్టమంటాడు. శ్రద్ధా ఒక ఫ్రెండ్ తో రణబీర్ ని రెచ్చగొట్టేలా డాన్స్ చేస్తుంది. అతను పట్టించుకోక పోవడంతో ఈ చిట్కా కూడా ఫెయిలవుతుంది. ఇంకో చిట్కా చెప్తాడు- విశ్వాస పరీక్ష. శ్రద్ధా ఒకమ్మాయిని రణబీర్ మీదికి ప్రయోగించి చూస్తుంది. రణబీర్ ఆ అమ్మాయికి లొంగడు. ఈ బ్రేకప్ ప్రయత్నం కూడా ఫెయిలవుతుంది.
        
క్రియేటివిటీ ఏమాత్రం లేని ఈ మూస చిట్కాలతో రణబీర్ మరింత పాసివ్ అయిపోయాడు. మొదట బ్రేకప్ గురూగా జంటల్ని కలుపుతూ యాక్టివ్ గా వుండి వుంటే, తనకే శ్రద్ధా బ్రేకప్ చెప్పే ట్విస్టు ఎదురైతే, ఇప్పుడు నిజంగానే బ్రేకప్ గురూగా మారి వుంటే క్యారక్టరైజేషన్ అవుతుంది. పాజిటివ్ నుంచి నెగెటివ్ గా మారే క్యారక్టర్ ఆర్క్. ఛేంజోవర్, డైనమిక్స్, షేడ్ వగైరా వగైరా. దీంతో రోమాంటిక్ సస్పెన్స్, థ్రిల్, టెన్షన్ వగైరా. కథనానికి రీఫ్రెష్ బటన్ నొక్కినట్టు తాజాదనం, నెక్స్ట్ లెవెల్. ఇది జరగలేదు.
        
నిజమైన బ్రేకప్ చిట్కాలతో ఆమెకి భరించలేని టార్చర్ పెడుతూంటే ఇందులోంచి పుట్టే కథకి విలువలుంటాయి, మోరల్ లెసన్ వుంటుంది, మెసేజ్ వుంటుంది. ఇదంతా సీరియస్ రోమాంటిక్ డ్రామా పాలబడకుండా, రోమాంటిక్ కామెడీకి తగ్గ ఫన్నీ సిట్యుయేషన్స్ తో వుంటేనే. కానీ రణబీర్ పాసివ్ నెస్ తో ఆమె బ్రేకప్ చేసుకుని  తన గ్రిప్ లోంచి వెళ్ళి పోవడంతో, పెద్దల చేతిలో పడిపోయింది కథ- కాదు గాథ.
        
శ్రద్ధా పాత్రకీ అర్ధం లేదు. తల్లిదండ్రులతో కుటుంబంలోనే వుంటున్న తను, రణబీర్ తల్లిదండ్రులతో కుటుంబంలో వుండలేననడం కథకి సృష్టించిన కాన్ఫ్లిక్ట్ కాని కాన్ఫ్లిక్ట్. అలాంటప్పుడు ఆమె మొదట్నుంచీ ఇండిపెండెంట్ గర్ల్ గానే వుండాలి. తను ఇండిపెండెంట్ గర్ల్ కాబట్టి ఫ్యామిలీలో ఇమడలేనంటే అది పాత్ర అవచ్చు. కాన్ఫ్లిక్ట్ అవచ్చు. అయినా ఈ రోజుల్లో ఇదేం కాన్లిక్ట్ కి దారితీయదు. కెరీర్ ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం సహజం. రణబీర్ పాత్ర లాంటి వాళ్ళు నాన్న, అమ్మ, నానమ్మ, చెల్లెలు, ఇల్లరికపు బావ, చెల్లెలి పిల్లాపీచూ, పెంపుడు కుక్క, పిల్లి, ఎలుక, బీరువా, పట్టె మంచం, మర చెంబూ సమేత కుటుంబ బృందంతో కలిసి వుంటేనే - అతనన్నట్టు ప్రేమ కాదు- కుటుంబానికి దూరంగా వుంటూ కూడా ఎంత కనిపెట్టుకుని వుంటున్నామన్నది ప్రేమ. ప్రేమల్ని దూరాలు నిర్ణయిస్తాయి.
        
ఇలాటి చాదస్తపు పాత్రలతో యువ ప్రేక్షకుల్ని ఇంకా పాతాళంలోకి తోసేస్తున్నారు. ఇలా శ్రద్ధా రణబీర్ తో విడిపోయాక ఎందుకో ఒకటే ఏడుస్తూ వుంటుంది. సెకండాఫ్ ఏడ్పే ఏడ్పు. దీనికి ఒక పూర్తి విషాద గీతం కూడా. ఏడ్చి ఏడ్చి లండన్ వెళ్ళిపోతానంటుంది. మనకి హాయి అనిపిస్తుంది. ఈమె లండన్ కాదు, లఖిం పూర్ వెళ్ళిపోయినా ఏడ్పుల బాధ  తప్పుతుంది.
        
ఇతర పాత్రల్లో డింపుల్ కపాడియా (రణబీర్ తల్లి), జతీందర్ కౌర్ (నానమ్మ), హస్లీన్ కౌర్ (చెల్లెలు), ఇనాయత్ వర్మ (చెల్లెలి కూతురు)ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళతో శ్రద్ధా కపూర్ ని భయపెట్టిస్తే ఎలా ... బోనీ కపూర్ (తండ్రి), అంబర్ రాణా (బావ) అందరూ బ్యాక్ గ్రౌండ్ లో పండుగలు పబ్బాలు చేసుకుంటూ వుంటారు. రణబీర్ బ్రేకప్ న్యూస్ వీళ్ళకి క్లయిమాక్స్ లో తెలుస్తుంది.
        
కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్, సెటింగ్స్ రోమాంటిక్ కామెడీ జానర్ కి తగ్గట్టు పింక్ టింట్ తో కలర్ఫుల్ గా వున్నాయి. కానీ ఇది శాడ్ మూడ్ రోమాంటిక్ డ్రామా. దీనికి రోమాంటిక్ కామెడీ విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ మ్యాచ్ కాలేదు. అసలేం తీస్తున్నారో తెలిస్తేగా. ప్రీతమ్ ఆరు పాటలు సినిమా నిడివి పెరగడానికే పనికొచ్చాయి. నిడివి రెండు గంటల 36 నిమిషాలు.

చివరికేమిటి

ప్రేమికుల మధ్య కాలం చెల్లిన సమస్యతో కథ ఎలా వుందో, దాని కథనమూ అలా వుంది. స్క్రీన్ ప్లే, దానికో స్ట్రక్చర్ అన్న ధ్యాసే లేదు. ఎలా పడితే అలా చేసుకుపోతూ వుంటే ఎక్కడో సెకండాఫ్ లో గంటా 40 వ నిమిషంలో కాన్ఫ్లిక్ట్ తగిలింది వాళ్ళకి!
        
అంత వరకూ ఫస్టాఫ్ లో కథే ప్రారంభం కాక, రణబీర్ బ్రేకప్ గురూ సీన్లు, కుటుంబ సీన్లు, మధ్యలో ఫ్రెండ్ ఎంగేజ్ మెంట్ సీన్లూ సాగి, 40 నిమిషాల తర్వాత స్పెయిన్ బ్యాచిలర్ పార్టీలో శ్రద్ధా ఎంట్రీతో అప్పుడు రణబీర్ లవ్ ట్రాక్. ఈ లవ్ ట్రాక్ చాలా నిస్తేజంగా, ఔట్ డేటెడ్ గా వుంటుంది. ప్రేమలో పడ్డాక ఇంట్లో పరిచయాలు, పెళ్ళికి ఓకే అనడం జారిగాక, ఇప్పుడు శ్రద్ధాకి వేరు కాపురం పెట్టాలన్పిస్తుంది. ఇలాటి మైండ్ సెట్ వుంటే, ముందే అతడి కుటుంబం గురించి తెలుసుకుని స్పష్టం చేయాలిగా. వూరికే ప్రేమలో పడిపోతుందా.
        
ఇప్పుడైనా విషయం చెప్పదు. బ్రేకప్ చేసుకోవాలని బ్రేకప్ గురూ రణబీరే అని తెలీక రణబీర్నే ఫోన్లో సంప్రదిస్తుంది. అయినా ఫోన్లో అతడి గొంతు గుర్తు పట్టదు. తను బయటపడకుండా ఆమెతో గేమ్ ఆడాలనుకున్న అతడికీ గొంతు మార్చాలన్న ఆలోచన రాదు. ఇంత శ్రద్ధగా స్క్రిప్టు చేసుకున్నారు.
        
ఇక పైన చెప్పుకున్నట్టు ఈ బ్రేకప్ చిట్కాలు సెకండాఫ్ లో బోరుగా సాగేక, బ్రేకప్ గురూ రణబీరే అని ఆమెకి తెలుస్తుంది. అప్పుడు బ్రేకప్ చేసుకోవడానికి కారణం ఏమిటని అడుగుతాడు. తను బ్రేకప్ గురూయే అయితే కారణం ముందే అడగాలి. అడిగి వుంటే ఆమె సపరేట్ కాపురం సంగతితో అప్పుడే ఇద్దరూ విడిపోయి, ఇంటర్వెల్లో కాన్ఫ్లిక్ట్ ఏర్పడి ఓ స్ట్రక్చర్ వుండేది. కథేమిటో అర్ధమయ్యేది.
        
కానీ లాజిక్ లేకుండా సెకండాఫ్ లో వరకూ గేమ్ ని సాగదీశాడు. సెకండాఫ్ లో గంటా 40 వ నిమిషంలో ఇప్పుడు కారణం అడిగి, తనకి కుటుంబమే ప్రాణమని, వేరు కాపురం కుదరదని దూరమయ్యాడు. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. ఇది కాన్ఫ్లిక్ట్ కూడా కాదు, సిల్లీ కారణంతో. అంటే ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే, కథేమిటో ఇప్పుడు అర్ధమవుతోంది. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే, ఫస్ట్ యాక్ట్ ఇక్కడిదాకా సాగిందంటే,  మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతోంది. ఇప్పుడు స్వల్ప కారణానికి కాన్ఫ్లిక్ట్ ఏర్పడిందంటే, కథ గాక గాథ కూడా అవుతోంది.
        
శ్రద్ధా ఏడ్పుల మధ్యే కొన్ని చైల్డిష్ సీన్లు. కుటుంబంలో వున్న పండుగలు పబ్బాలు చాలనట్టు, రణబీర్, ఫ్రెండ్ మగాళ్ళిద్దరూ దీపాలు వెలిగించింది పాటలు పాడింది చాలనట్టు, (పండుగ పాటలు రెండు సార్లు వుంటాయి), ఆ ఫ్రెండ్ కి కొడుకు పుట్టి బారసాల సీనొకటి! ఈ బారసాల సీన్లో శ్రద్ధా కాలికి గాయం అయ్యేసరికి, రణబీర్ కుటుంబమంతా ట్రీట్ మెంట్ చేసేసరికి - శ్రద్ధాకి కుటుంబం విలువ తెలిసిరావడం!
        
అయినా కూడా ఆమె లండన్లో జాబ్ కే వెళ్ళి పోతూంటే ఏమీ చేయలేక ఇంటికొచ్చిన రణబీర్ ని కుటుంబం అడిగి తెలుసుకుని, దీన్ని మేం సాల్వ్ చేస్తామని పొలోమని కారెక్కి ఏర్ పోర్టుకి బయల్దేరడం. ఏర్ పోర్ట్ లో, రైల్వే స్టేషన్లో ముగిసే ప్రేమ సినిమాలెన్ని చూడలేదు. మనం ఇక్కడితో వదిలేసి నార్త్ పోల్ కి వెళ్ళిపోతే, ఇలాటి లవ్ రంజనాలు అంజనం వేసుకుని ప్రేక్షకుల్ని వెతుక్కుంటాయి.
—సికిందర్