రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, నవంబర్ 2016, శుక్రవారం

రివ్యూ

దర్శకత్వం: మల్లిక్‌రామ్‌
తారాగణం : సుమంత్, పల్లవీ  సుభాష్, తనికెళ్ల భరణి, సుమన్ శెట్టి, శ్రీలక్ష్మి తదితరులు
కథ : జుహీ స్క్రీన్ ప్లే- మాటలు : డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌, సంగీతం : శ్రీర‌ణ్ పాకాల‌ఛాయాగ్రహణం : షానియల్ డియో
బ్యానర్: ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్
నిర్మాతలు: వై.సుప్రియ, జాన్‌ సుధీర్‌ పూదోట
విడుదల : 4 నవంబర్, 2016
***
      హీరోగా నిలదొక్కుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసి కొంత కాలం విరామం తీసుకున్న సుమంత్ ఇప్పుడు రొటీన్ ఫార్ములాకి దూరంగా ఓ క్రాసోవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. హిందీ నుంచి తెలుగులోకి రీమేక్ చేస్తున్న క్రాసోవర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకి నచ్చడం అంతంత మాత్రంగానే జరుగుతున్న సమయంలో సుమంత్ చేసింది ధైర్యమే. పైగా ఇందులో విషయంకూడా కొత్తది- అభ్యుదయకరమైనది-తెర మీద ప్రేక్షకులకి పరిచయం లేనిదీ. ఈ కొత్త తోనే కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ రీమేక్ ని తెలుగులో ఎంతవరకు నిలబెట్టాడో ఈ కింద చూద్దాం...

కథ :
     షరామామూలుగా నిరుద్యోగిగా నేస్తాలతో తిరిగే యూత్ విక్కీ అలియాస్ విక్రం(సుమంత్). తల్లి స్వీటీ (శ్రీలక్ష్మి)  ఒక బ్యూటీ పార్లర్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తూంటుంది. సైనికుడైన ఆమె భర్త కార్గిల్ యుద్ధంలో పోయాడు. తనవి సాంప్రదాయ భావాలు- తన అత్తగారివి ఆధునిక భావాలు. ఇద్దరూ  తెలుగింగ్లీషు మాట్లాడుకుంటూ  ఫ్రెండ్స్ లా వుంటారు. షరామామూలుగా సంపాదన లేని విక్కీకి తల్లి చీవాట్లు తప్పవు. ఇలాటి విక్కీ ఆంజనేయులు అనే ఒక డాక్టర్ దృష్టిలో పడతాడు. డాక్టర్ ఆంజనేయులు (తనికెళ్ళ భరణి) ఒక సంతాన సాఫల్య కేంద్రాన్ని నడుపుతూంటాడు. ఓ అసిస్టెంట్ (సుమన్ శెట్టి)  తోడు వుంటాడు. ఈ కేంద్రంలో ఇతను పిల్లలు లేని వాళ్ళకి స్పెర్మ్  సేకరించి పిల్లలు పుట్టేలా చేస్తూంటాడు. ఈ మధ్య ఇలాటి కేసులు ఫెయిలవుతూండడంతో, మంచి పుష్టిగల స్పెర్మ్ డోనర్ కోసం వేటలో వున్నప్పుడు విక్కీ దృష్టిలో పడతాడు. ఇతడి చరిత్ర తెలుసుకుంటే ఇతడి తాతలు డజను మందికి పైగా పిల్లల్ని కన్న వాళ్ళు. దీంతో  ఇతను తనకి పనికొస్తాడని ఒప్పించే ప్రయత్నాలు మొదలుపెడతాడు. 

        పెద్దగా జనరల్ నాలెడ్జి లేని విక్కీకి ఈ కాన్సెప్ట్ ఏమిటో అర్ధంగాదు, పైగా అసహ్యించు కోవడం మొదలెడతాడు. చచ్చీ చెడీ ఇతడికి అర్ధమయ్యేలా చేసి, తిరిగి తన బిజినెస్ నిలబెట్టుకుంటాడు డాక్టర్ ఆంజనేయులు. విక్కీ చేస్తున్న వీర్యదానానికి భారీగా డబ్బులు కూడా అందుతూంటాయి. దీంతో ఇంట్లో ఆర్ధిక పరిస్థితి కూడా మెరుగుపడి కొడుకు ప్రయోజకుడయ్యాడని పెళ్లి సంబంధాలు చూస్తూంటుంది తల్లి. విక్కీ ఆసిమా రాయ్ (పల్లవీ సుభాష్) అనే బ్యాంకు ఉద్యోగిని  ప్రేమలో పడతాడు. ఈమెకి పెళ్లయి విడాకులు తీసుకుందని తెలిసినా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. పెళ్లి తర్వాత ఈమె పిల్లలు పుట్టని వ్యంధురాలని తెలుస్తుంది. మరోవైపు బిజినెస్ పేరుతో విక్కీ చేస్తున్న అసలు వృత్తి  ఈమెకి తెలిసిపోతుంది. దీంతో అతణ్ణి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితిని విక్కీ ఎలా చక్కదిద్దుకున్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ
       ప్రేక్షకులకి కొత్త కాన్సెప్ట్ ని పరిచయం చేసే క్రాసోవర్ కథ. హిందీలో ‘విక్కీ డోనర్’ పేరుతో  సుజీత్ సర్కార్ దర్శకత్వంలో 2012 లో విడుదలయ్యింది. సుజీత్ సర్కార్ ఇటీవలే ‘పింక్’ నిర్మాతగా సంచలనం సృష్టించాడు. ‘విక్కీ డోనర్’ ప్రేక్షకుల ప్రశంసలూ ప్రభుత్వాల అవార్డులూ అందుకుంది. ‘విక్కీడోనర్’ కి వరల్డ్ మూవీ( కెనడా) ‘స్టార్ బక్’ (2011) ఆధారం. ‘స్టార్ బక్’ కి 2013లో ‘డెలివరీ మాన్’ హాలీవుడ్ రీమేక్. మరో ఫ్రెంచి మూవీ ‘ఫోంజీ’ (2013) కూడా రీమేక్. ఇలా ఒక ఐడియాని పంచుకుని వెనువెంటనే ఇన్ని పిల్లలు పుట్టాయన్న మాట తెలుగు సహా. 

          ఇది ఫ్యామిలీ డ్రామా జానర్. వీర్య దానం చేస్తూ ఎందరి జీవితాల్లోనో  వెలుగులు నింపుతున్న తనకే పిల్లలు పుట్టని పరిస్థితి ఎదురయితే? అన్న పాయింటుతో ఈ కథని అల్లారు. హిందీలోనే  అర్ధంలేని పాత్రచిత్రణతో సిల్లీ డ్రామాగా వున్న  దీన్ని- అలాగే తెలుగులో రిమేక్ చేసేశారు. పైన చెప్పుకున్న హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలు ఒరిజినల్ కెనడా సినిమాకి సొంతకవిత్వాలు చెప్పకుండా విధేయంగా వుంటే- హిందీ, దాంతో బాటు తెలుగూ సొంతకవిత్వాలు చేసుకుని అవిధేయతతో హాస్యాస్పదంగా, కథా ప్రయోజనం నెరవేర్చకుండా నిర్వీర్యంగా వున్నాయి. 

ఎవరెలా చేశారు
     సుమంత్ ఈ సినిమాకోసం బాగానే కష్టపడ్డాడు. ప్రేక్షకుల దృష్టినాకర్షించే కృషితో పాత్రని నిలబెట్టుకుంటూ పోయాడు. సుమంత్ కీ పాత్ర- ఒక గ్లామర్ హీరోయిన్ వేశ్యపాత్ర వేయడంతో సమానం. ఇంతవరకూ ఏ హీరో వేయని ఈ పాత్ర కాల్పనిక పాత్ర కాదు- సమాజంలో ఇలాటి వాళ్ళు ఉంటున్నదే. ఇదేం చట్టవ్యతిరేక పాత్ర కూడా కాదు. అయితే తెలుగులో ఈ కొత్త పాత్ర జనసామాన్యానికి ఇంకా బాగా భావోద్వేగ పూరితంగా పరిచయమవాలంటే, అతడి ‘దానానికి’  సరిపడా ఇరుపార్శ్వాల కథా నిర్వహణ కూడా జరిగి వుండాలి. కనీసం పిల్లల కోసం తపిస్తున్న ఒకజంటని కూడా ఇంకోవైపు కథలో ప్రధానభాగంగా చేసి, సుమంత్ పాత్రవల్ల వాళ్ళ ఇంట్లో పూసే సంతోషాల్ని ప్రత్యక్షంగా చూపించివుంటే- సుమంత్ పాత్ర కెరీర్ ఔన్నత్యం, ఉదాత్తత జనసామాన్యాన్ని బాగా కదిలించేదిగా వుండేది. ఇలాటి జంటల్ని డాక్టర్ దగ్గర కామెడీగా చూపించడంతో, ద్వంద్వార్ధాలు పలికించడంతో  సరిపెట్టేశారు. అదే డాక్టర్ తను చేపట్టిన ఈ వృత్తి ఏంతో ఉదాత్తమైనదని అంటాడు. డాక్టర్ కి ఉదాత్తమైన కాన్సెప్ట్ ని దర్శకుడు పరిహాసం చేసి ఎలా చూపిస్తాడు?  

        సుమంత్ కి డాక్టర్ గా వేసిన తనికెళ్ళ తో కామిక్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాగే కుటుంబంలో భార్యతో రేగే పొరపొచ్చాల్లో నలిగిపోయే సన్నివేశాలు కూడా అతడిలో నటుణ్ణి బయటపెట్టాయి. ఇక తనికెళ్ళ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. ఆయన నటించిన ప్రతీ సన్నివేశమూ నవ్వించేదే. ఆయన వెంట సుమన్ శెట్టీ డిటో. హీరోయిన్ పల్లవీ సుభాష్ ది హూందాతనం గల పాత్ర. ఈ పాత్ర పోషణలో సాధ్యమైనంత మెచ్యూరిటీ ప్రదర్శించింది. ఐతే సెకండాఫ్ లో పాత్రచిత్రణే తప్పు. ఇక సీనియర్ హాస్యనటి శ్రీలక్ష్మి చాలాకాలం తర్వాత తెర మీద కన్పించారు హాస్యోక్తులతో మధ్యతరగతి జీవితాన్ని ప్రదర్శిస్తూ.

        పాటలు మాంటేజెస్ గా వచ్చేవే. ఒక విషాద గీతం వుంది. ఛాయాగ్రహణం, కళాదర్శకత్వం అంతంత మాత్రమే. కొత్త దర్శకుడు మల్లిక్ రామ్ పాతస్కూలు చిత్రీకరణ చేశాడు ఈ ఆధునిక కాన్సెప్ట్ తో. సినిమా ప్రారంభమే పాతసినిమా చూస్తున్నట్టు- పేలవమైన క్లినిక్ సెట్, కళాదర్శకత్వాలతో, లౌడ్ కామెడీతో ఉస్సూరన్పిస్తుంది. పోనుపోనూ మెరుగుపడ్డా అదీ  పూర్తి  స్థాయిలో కాదు. అలాగే అత్యధిక భాగం కామెడీగా వచ్చే సన్నివేశాలకి తగ్గ పంచ్ కూడా కుదరలేదు. మాటలు ద్వంద్వార్థాలతో కూడుకుని  కాన్సెప్ట్ లైసెన్స్ ఇచ్చేస్తోంది కదాని యధేచ్చగా ప్రవహించాయి.

చివరికేమిటి 
 వీర్య దానం చేస్తూ ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపుతున్న తనకే పిల్లలు పుట్టని పరిస్థితి ఎదురైతే ఎలాటి వుంటుంది- అన్న పాయింటు ముందుగా చెప్పుకోవాలంటే సమం జసమైనదేమీ కాదు. ఎందుకు కాదో తర్వాత చెప్పుకుందాం. సమంజసం కాని ఈ పాయింటు కూడా పాలన కొచ్చేసరికి చీలిపోయింది. వేరు కుంపటి పెట్టింది. ఇది హీరోయిన్ పాత్రపరంగా జరిగింది. ఒకసారి విడాకులై జీవితంపట్ల మెచ్యూరిటీతో వున్న హీరోయిన్ పాత్ర అంత సిల్లీగా ఎలా ప్రవర్తిస్తుంది. తనకి విడాకులయ్యాయి. అయినా హీరో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతలో తనకి పిల్లలు పుట్టరని తెలిసింది. దీన్నీ కూడా హీరో భరించి తనని ఓదార్చాడు. మరంతలో అతను వీర్యదానాలు చేస్తున్నాడని తెలిసి అసహ్యించుకుని తూలనాడి వెళ్లి పోవడమేమిటి? తనని రెండో పెళ్లి చేసుకోవడమే గాక, పిల్లలు పుట్టరని తెలిశాక కూడా అడ్జస్ట్ అయిపోయిన అతణ్ణి అనే హక్కు ఆమెకెక్కడ వుంది. ఈ లాజిక్ మనల్ని వేధిస్తూనే వుంటుంది- సెకండాఫ్ ఇలా పుట్టే ఈ బరువైన డ్రామాతో చివరిదాకా చూశాక, అప్పుడామె తండ్రి ఇదే లాజిక్ లేవనెత్తి ఆమె కళ్ళు తెరిపిస్తాడు. ఈ మాత్రం ఆమెకి ముందు తెలీదా? సెకండాఫ్ ఇంత డ్రామా సృష్టించడం కోసం ఇలా హీరోయిన్ పాత్రని కిల్ చేసి చివరికి ఆమెకే నీతి బోధించడంతో ఈ ఫ్యామిలీ కథ అల్లరై పోయింది. ఫ్యామిలీ కథల్లో ఎప్పుడైనా సంబంధబాంధవ్యాల్లో లాజిక్ ని ఎగేయ కూడదని ఇదివరకు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇవి ప్రతినిత్యం ప్రేక్షకులకి వాళ్ళ కుటుంబాల్లో ప్రత్యక్షంగా అనుభవం లోకొస్తూనే వుంటాయి. 

        పైగా అతను డబ్బులు తీసుకుని వీర్యదానాలు చేయడాన్ని అదేదో డబ్బుకోసం వొళ్ళు అమ్ముకున్నంత అసహ్యంతో మాటలంటుంది.  ఈపని మెడికల్లీ లీగల్లీ రైటేనని బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ అయిన ఈమెకి తెలీదా? 

        లోపం చూపిస్తే పాత్రకి ఒకే లోపం చూపించాలన్న పాత్రచిత్రణ సూత్రాన్ని కూడా మరిచారు. హీరోయిన్ పాత్రకి విడాకులవడం ఒకలోపం, పులిమీద పుట్రలా పిల్లలు పుట్టే అవకాశం లేదనడం మళ్ళీ మరొకటీ! సిల్లీ కదూ? ఆడవాళ్లంటే బాగా కడువుమండి వున్నవాడెవడో రాసే రాతలివి ( ఐతే హిందీ ‘విక్కీ డోనర్’ కథ మాటలు స్క్రీన్ ప్లే రాసింది జుహీ చతుర్వేది అనే రచయిత్రి- పది సార్లు పాలిషింగ్ జరిగిందట స్క్రిప్టుకి. స్త్రీ పాత్ర చిత్రణలు సినిమాల్లో రచయిత్రులు చేపడితే ఎంత కంగాళీ చేసిపెడతారో చాలా చాలా ఉదాహరణ లున్నాయి- అదే ఇదీ - దీనికి తెలుగు అనుసరణా ఇదే). ఇంకా నయం, చివరికి ఆమెని విధవని కూడా చేస్తే ఎలావుంటుందని ఆలోచించలేదు.

      విడాకుల వల్ల ఈ కథకి ఒరిగిందేమిటో అర్ధం గాదు. ఆనాడు పెళ్లి చేసుకున్నవాడు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని శోభనం రాత్రే ప్లేటు ఫిరాయించాడని చెప్పారు. మంచి పనిచేశాడు- లేకపోతే  వాడికి ఈమెతో పిల్లలు పుట్టే వాళ్ళా? ఈ వ్యవహారం హీరోయిన్ పాత్రనే ఖూనీ చేసేలా లేదా? ఈమెమీద సానుభూతి పుడుతుందా- సరేలేమ్మా నోర్మూసుకో అన్నట్టుంటుందా?

        ఒకే ఒక్క పిల్లలు పుట్టని లోపం అనేదాన్ని పెట్టుకున్నా ఈ కథ సమంజసంగా వుండే అవకాశం లేదు. ఒక వీర్య దాత కుటుంబంలో వచ్చే సమస్యలు చూపించాలంటే ఆ కుటుంబంలో అరుదైన పరిస్థితి వుండకూడదు- పిల్లలు పుట్టని కుటుంబాలు అరుదుగా వుంటాయి. వీర్య దాత లెవరైనా వుంటే వాళ్ళందరి కుటుంబాల్లో ఇదే  అరుదైన పరిస్థితి వుండదు. వీర్యదానం అనే ఒక కొత్త ట్రెండ్ ని చూపించాలనుకున్నప్పుడు ఆ వీర్యదాతల ఇంట్లో అరుదైన పరిస్థితితో ముడి పెట్టి కథ చెప్పకూడదు. అరుదైన పరిస్థితి ఇంట్లో పిల్లలు పుట్టకపోవడం. సామాన్య పరిస్థితి భార్య భర్తల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొనడం. ఎక్కువగా జరిగే అవకాశమున్నది ఇదే. ఈ రెండో దాన్ని చూపించి దీన్ని పరిష్కరించాలి. ఇలాటి వీర్యదాతలు ఇంట్లోభార్యలతో ఈ సమస్యని ఎలా టాకిల్ చేయాలో చూపించాలి. అప్పుడే కథా ప్రయోజనమూ నెరవేరుతుంది. ఇలాకాక మొదటిదే  చూపిస్తే ‘మీరు వీర్య దానాలు చేస్తే మీకే పిల్లలు పుట్టని పాపం చుట్టుకుంటుంది జాగ్రత్త’ అన్నవ్యతిరేకార్ధం తీసినట్టుంటుంది కాన్సెప్ట్ కి. కాన్సెప్ట్ ఇంత పవిత్రమైనదని చెప్తూ దాన్నే దెబ్బ తీసే అసమంజస కథ తయారు చేసి జనం మీద రుద్దితే ఎలా- ‘ఇజం’ లో రుద్దినట్టు? ‘ఇజం’ లో జర్నలిజం వృత్తి ఎంత గొప్పదో చూపిస్తూనే- ఇంకోవైపు ఒక జర్నలిస్టు ఆత్మహత్యని చూపించి, కడుపులు నింపని జర్నలిజమంటూ అతడి తల్లి చేత శాపనార్ధాలు పెట్టించడం ఇలాటిదే.

        ఇక హీరో పాత్రవైపు కూడా తప్పులున్నాయి. తనకి విడకులైనట్టు పెళ్ళికి ముందే నిజాయితీగా హీరోయిన్ చెప్పేస్తుంది. అలాంటప్పుడు హీరో కూడా అంతే  నిజాయితీగా తను  వీర్యదానాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నట్టూ, పెళ్ళయితే మానేస్తాననీ ఆమెకి ముందే ఎందుకు చెప్పడు? ఆమెని రెండో పెళ్లి చేసుకోవడం గొప్పే, ఆమె వ్యంధురాలనీ తెలిసీ ఓకే అనుకోవడం గొప్పే- కానీ తన వీర్యదానాన్ని ఆమె నుంచి దాచడం వల్ల ఈ గొప్పలన్నీ చిప్పలై పోయాయి కదా? 

        రెండోది- పెళ్ళికాకుండా వీర్యదానాలు చేస్తున్నప్పుడు తను ఇంకో అమ్మాయివైపు కన్నెత్తి చూడాలంటే మొట్టమొదట అడ్డుపడేది అంతరాత్మే. ముందు తన ఆ కొత్త జీవితాన్ని పునర్నిర్వచించుకుని అమ్మాయిల వైపు చూడాల్సి వుంటుంది. ఓపెన్ గా రిలేషన్ షిప్ లోకి వెళ్ళాల్సి వుంటుంది. ఇలా చిత్రీకరణ వుండనప్పుడు ఇలాటి సినిమా తీస్తూ ఏం చెప్తున్నారో ఎవరికీ అర్ధంగాదు.

        మూడోది, చట్టబద్ధంగానే మీరు స్పెర్మ్ డోనర్ అయినా మీ భార్యతో మీకెదురయ్యే సమస్యల్ని మీరు పరిష్కరించుకోలేరు జాగ్రత్త- మరొకరు వచ్చి మిమ్మల్ని ఒడ్డున పడేయాల్సి వస్తుంది- అని ఈ పవిత్రమైన కాన్సెప్ట్ నుంచి ఇలా డోనర్ అవ్వాలనుకునే వాళ్ళని దూరంగా తరిమికొట్టే ముగింపూ మెసేజీ ఇస్తున్నట్టుందీ సినిమా!!  అంటే,  పిల్లల్లేని వాళ్ళూ మీరిక సంతాన సాఫల్య కేంద్రాల మీద ఆశలు పెట్టుకోకండీ అన్నట్టన్న మాట!

        ముక్కచెక్కలైన సంసారాన్ని హీరో అనేవాడు సరిదిద్దుకోలేక చేతులెత్తేస్తే,  డాక్టర్ పాత్ర పూనుకుని అన్నీ సరిదిద్ది సుఖాంతం చేసిపెడతాడు! ఒక్క ముక్కలో చెప్పాలంటే,  ఈ సంసారపు  కథ చెప్పడానికి  ఎంపిక చేసుకోవాల్సింది స్పెర్మ్ డోనర్ డొమైన్ ని కాదు, ఇంకేదైనా ఫార్ములా సెటప్ సరిపోతుంది. 

        పైన చెప్పుకున్న ఒరిజినల్ కెనడా సినిమా, హాలీవుడ్, ఫ్రెంచ్ రీమేకులు రెండిట్లో  వీర్యదాత ఐడెంటిటీ, అలాగే చట్టపరంగా, సెంటిమెంటల్ గా దీంతో వచ్చే సమస్యలూ తీసుకుని కథ చేసుకున్నారే  తప్ప- పొసగని సిల్లీ ఫ్యామిలీ కథ చేయలేదు. ఈ డ్రామాలో  హీరోకి గర్ల్ ఫ్రెండ్ తో పిల్ల కూడా పుడుతుంది.


-సికిందర్
http://www.cinemabazaar.in