రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Wednesday, October 18, 2017

533 : రివ్యూ

రచన –దర్శకత్వం : అనిల్ రావిపూడి
తారాగణం:  వితేజ, మెహరీన్, ప్రకాష్ రాజ్, రాధిక, వివన్ బాట్నే, రాజేంద్రప్రసాద్, సంపత్రాజ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి తదితరులు.
సంగీతం
: సాయికార్తీక్ , ఛాయాగ్రణంః మోహకృష్ణ
నిర్మాణ
సంస్థ:  శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్
నిర్మాత :
 శిరీష్, ర్పణః దిల్రాజు
విడుదల
: అక్టోబర్ 18, 2017
***
      
మాస్ మహారాజా రవితేజ రెండేళ్ళు బ్రేక్ తీసుకుని, ఇక అంధుడిగా ప్రయోగం చేస్తే బెటరనుకుని దీపావళికి విచ్చేశారు. కుటుంబ  సినిమాలు తీసే దిల్ రాజు ఈసారి రవితేజతో మాస్ తీస్తూ తనుకూడా ఓ ప్రయోగం చేశారు. రెండు సినిమాల అనుభవమున్న దర్శకుడు అనిల్  రావిపూడి, ఇంకోసారి పూర్వ దర్శకుల ప్రెజెంటేషన్ మీద ఆధారపడి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఈ ముగ్గురు ప్రముఖుల ప్రయత్నం చివరికి ఆశించిన  ఫలితాల్ని చ్చిందా లేదా  చూద్దాం...

కథ 
      ఒక పోలీసు అధికారి (ప్రకాష్ రాజ్),  దేవరాజ్ (వివన్ బాట్నే)  అనే ఓ గూండా నాయకుడి తమ్ముణ్ణి  ఎన్ కౌంటర్ చేస్తాడు. దీంతో దేవరాజ్ ఆ పోలీసు అధికారిని చంపేసి  అతడి కూతురు లక్కీ (మెహరీన్) ని కూడా చంపాలని వెంటపడతాడు. ఆమె డార్జిలింగ్ పారిపోతుంది. పోలీసు ఐజీ (సంపత్) ముగ్గురు పోలీసుల్నిచ్చి ఆమెకి రక్షణ ఏర్పాట్లు చేస్తాడు. అనంత లక్ష్మి (రాధిక) అనే కానిస్టేబుల్ కి రాజా (రవితేజ) అనే కొడుకు వుంటాడు. ఇతను అంధుడు. ఇతణ్ణి  పోలీసుద్యోగంలో చేర్పించాలని పోరాటాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుందామె.  లక్కీ రక్షణకి సంబంధించిన సీక్రెట్ ఆపరేషన్లో రాజా కూడా వుండేలా చూస్తుంది. రాజా డార్జిలింగ్ వెళ్లి లక్కీకి రక్షణగా వుంటాడు. ఈమెని  కనిపెట్టి వచ్చి దాడులు చేస్తూంటాడు దేవరాజ్. ఆ దాడుల్ని తిప్పికొడుతూ లక్కీని కాపాడుతూంటాడు రాజా...

ఎలావుంది కథ 
      దిల్ రాజు క్వాలిటీ ఏకోశానా కన్పించని  విషయంలేని - టెంప్లెట్ కథ. కుటుంబ కథల్లో అయితే ఆయన ఇన్వాల్వ్ అయి తన మార్క్ వుండేలా చూసుకుంటా రేమో గానీ, తనకి అలవాటులేని మాస్ కథకి చేతులు కట్టుకుని దూరంగా వుండిపోతారు. కనీసం రవితేజని ప్రయోగాత్మకంగా అంధుడి పాత్రలో చూపిస్తున్నప్పుడైనా కథలో కాస్త కొత్తదనం వుండా లన్న ఆలోచన చేయలేదు. విషయంలేని అరిగిపోయిన పాత మూస కథకీ, కొత్త తరహా పాత్రకీ బలవంతపు పెళ్లి చేశారు. సినిమాలో చూపించిన నల్గురు పెళ్ళాల్ని నల్గురు మొగుళ్ళు పదేపదే చాచి లెంపకాయలు కొట్టినట్టు -  రవితేజ పాత్రా కథా ఎడాపెడా  లెంపకాయలు కొట్టేసుకున్నాయి.

ఎవరెలా చేశారు
      రవితేజ పాత్ర చూస్తే ‘బర్ఫీ’ లో మూగవాడిగా రణబీర్ కపూర్ హీరోయిన్ ని కిడ్నాప్ చేసి  చేసే సూపర్ కామెడీ గుర్తుకొస్తుంది. అది కొత్త పుంతలు తొక్కే క్రియేటివ్ కామెడీ. రవితేజ పాత్రకి ఎప్పుడూ కమర్షియల్ హీరోల పాత్రలకుండే అదే  రొటీన్, టెంప్లెట్ మూస కామెడీయే పెట్టారు తప్ప, అంధపాత్రకి క్రియేటివ్ గా ఆలోచించలేదు. ఆఫ్ కోర్స్, టాలీవుడ్ ప్రమాణాలిలాగే వుంటాయి. రవితేజ చేసే అదే తన బ్రాండ్  కామెడికీ, డైలాగులకీ కింది తరగతుల ప్రేక్షకులు మాత్రం సంతృప్తి చెంది అడుగడుగునా కేరింతలు కొట్టారు. రవితేజ అంధుడిగా గొప్పగా నటించలేదని కాదు, ఆయన చాలా కష్టపడి నటించాడు. కథే ఆయనకి సహకరించలేదు. ఏ దృశ్యానికా దృశ్యం కామెడీ మీద -  అది కూడా సిల్లీ కామెడీ మీద పెట్టిన శ్రద్ధ కథ మీద పెట్టలేదు. సినిమా సాంతం లెక్కలేనన్ని పాత్రల డైలాగుల మోతతో లౌడ్ గా వుండడం వల్ల- రవితేజ అంధ పాత్రతో పోరాటదృశ్యాలు కూడా ఆ వెల్లువలో నిలబడకుండా కొట్టుకు పోయాయి. విషయం లేని ఈ కథలో అంధపాత్రతో ఆయన గుర్తుండిపోయేలా చేయడానికి మిగిలిందొక్కట్టే - పోరాట దృశ్యాలు. అంధత్వంతో వీటికి వుండాల్సిన ఫీల్ ని కూడా  మిగతా లౌడ్ దృశ్యాలు మింగెయ్యడంతో ఇవి ఏ ప్రత్యేకతనీ  చాటుకోలేకపోయాయి. 

          హీరోయిన్ తో ఎప్పుడో చివర్లో తప్ప రోమాన్సులోకి రాదు రవితేజ పాత్ర. హీరోయిన్ ది చాలావరకూ తండ్రిని కోల్పోయిన బాధతో వుండే పాత్ర కావడంవల్ల రోమాన్సు కుదరలేదు. ‘కటీ పతంగ్’ లో ఆశా పరేఖ్ విడోగా ఎంత విషాద పాత్రయినా,  ఒక కవిహృదయుడైన రోమియోగా  రాజేష్ ఖన్నా  ఆమెని నవ్వించకుండా వదలడు. రవితేజ పాత్రకి ఈ రోమాంటిక్ యాంగిల్ కొరవడ్డం పెద్ద లోపం. 

          హీరోయిన్ మెహరీన్ నటించడానికి పాత్రే సరిగ్గా లేదు. హీరోచాటు పాత్రగా వుండిపోయింది. హీరో ఆమెకేవో ఆశయాలు గుర్తుచేసినట్టు చూపించారు.  ఆ ఆశయాలు అసలేమిటో, వాటితో  ఆమె ఏం చేసిందో చూపించిన పాపాన పోలేదు. ఆమెవి లాలిత్యం పలికే ముఖకవళికలు కావు. గత మూవీ ‘మహానుభావుడు’ లోలాగే పైపై నటనతో సరిపెట్టేసింది.  ఇంకో హీరోయిన్ రాశీఖన్నా ఓ పాటలో కన్పిస్తుంది- కానీ ఎందుకో ప్రేక్షకులు సైలెంట్ గా వుండిపోయారు ఆ ఒక్క పాటలో మెరిసిన ఆమెని చూసి. మిగిలిన పాత్రధారుల సంగతేమోగానీ, రవితేజ తల్లిగా  రాధిక హాస్య పాత్ర బాగా ఎంటర్ టైన్ చేస్తుంది. పోలీస్ స్టేషన్ లో గుండె నొప్పి నటిస్తూ ఆమె చూపించే హొయలు ఏ కమెడియన్ కీ తీసిపోవు. చివర్లో విలన్ మీద కొట్టే  డైలాగులు కూడా దంచి కొట్టి వదుల్తుంది. ఈనాటి హీరోయిన్లు నేర్చుకోవాల్సింది చాలా వుంది సీనియర్లని చూసి. 

          విలన్ గా వివన్ బాట్నే ఇతర పరభాషా విలన్ పాత్ర ధారుల చట్రంలోనే ఏ ప్రత్యేకతా లేకుండా రొటీన్ గా అదే మూసలో- అదే వేష భాషల్లో కన్పిస్తాడు. ఇక ప్రకాష్ రాజ్,
రాజేంద్రప్రసాద్, సంపత్రాజ్, శ్రీనివాసరెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పోసానీ మొదలయిన వాళ్ళంతా వాళ్ళ మూసలోనే కన్పిస్తారు.

          ఓ రెండు పాటలకి తప్ప మిగతావాటికి ప్రేక్షకులు గమ్మున వుండిపోయారు. ఆ రెండు పాటలకి మాత్రం  మాస్ మహనీయులు వూగిపోయారు. మల్టీ ప్లెక్సుల్లో వూగడానికి ఇలాటి మహనీయులు వుండరు. ఛాయాగ్రహణం ఏవరేజిగా కన్పించడానికి కారణం దృశ్యాలు, దర్శకత్వం రొడ్దకొట్టుడుగా వుండడం. ఎడిటింగ్ లో కూడా ఏదైనా చూపించడానికి దర్శకత్వ విలువలు సహకరిస్తేగా. మూడు సార్లు క్లయిమాక్స్ వస్తే ఎడిటర్ ఏం చేయగలడు. ఒకటి చాలని మిగతా రెండూ లేపేస్తే,  నిడివి చాలక సెన్సార్ వాళ్ళు పొమ్మంటారు. ఇంకోసారి దిల్ రాజు మాస్ సినిమాలతో పెట్టుకోకుండా వుంటే మంచిది.

చివరికేమిటి 
    పటాస్ , సుప్రీమ్  అనే సినిమాలతో కొత్త దర్శకుడైన అనిల్ రావిపూడి తన కొత్తదన
మేంటో చూపించకుండా,  పూర్తిగా పాత దర్శకుల మేకింగ్ మీద ఆధారపడుతున్నాడు. వాళ్ళ కాలంలో తీసిన సినిమాలు వాళ్ళు తీసినట్టుగానే తీసి రెండు సార్లు సక్సెస్ అవగల్గాడేమోగానీ, ఇది ఎల్లకాలం పనిచెయ్యదు. ఇలాటి లౌడ్ సినిమాలతో తనకి తానే హాని చేసుకుంటాడు. వచ్చిన సినిమాల్లోని కథలు,  సీన్లు, డైలాగులు సమస్తం టెంప్లెట్ గా పెట్టుకుని తీయడానికి నవదర్శకులే  అవసరం లేదు. నవదర్శకులు వచ్చే నవదర్శకులకి స్ఫూర్తి నివ్వకపోతే అంతా కలిసి పరమ చాదస్తులుగా కన్పిస్తారు. అనిల్ రావిపూడి లాంటి టాలెంట్ తో చిన్నచిన్న సినిమాలతో స్ట్రగుల్ చేస్తున్న నవదర్శలుకు చాలామందే వున్నారు. వాళ్లకి స్టార్ లతో ఛాన్సు రావడం లేదు, వాళ్ళ టాలెంట్ గల తనకి వస్తున్నాయి, అంతే తేడా. 

          కొత్త కథలు చేయలేకపోతే,  అనిల్ రావిపూడి ఒకసారి రోహిత్ శెట్టిని చూస్తే సరిపోతుంది. రోహిత్ శెట్టి పాత కథల్నే కొత్తగా,  ట్రెండీ గా, యూత్ ఫ్రెండ్లీగా తీసి మినిమం వంద కోట్లు ప్రేక్షకుల జేబులు కొట్టేసి వెళ్ళిపోతాడు. అంధుడి పాత్రతో అదే అరిగిపోయిన కథలో అదే హీరోయిజం, అదే కామెడీ, పాటలు, హీరోయిన్ కి ప్రాబ్లం, విలన్ ఎంట్రీ తర్వాత ఇంటర్వెల్ లాంటి టెంప్లెట్ తో,  రెండేళ్ళ తర్వాత రవితేజ సినిమాకి కొత్తదనం వచ్చేస్తుందా? 

          ఇక సెకండాఫ్ లో కూడా చెప్పడానికి విషయమే లేక, రవితేజనీ హీరోయిన్ నీ ఆమె బాబాయిల ఇంటికి చేర్చి శ్రీనువైట్ల టెంప్లెట్ పెట్టుకో లేదా? ఉన్న కథేదో దాన్ని దారి మళ్ళించి ఇంకో పాత సినిమా చూపించలేదా? ఆ బాబాయిలు  పెళ్ళాల్నికొట్టే కామెడీ, వాళ్ళని రవితేజ రిపేరు చేసే సీన్లు ఏనాటివి? అర్ధరాత్రి  నిద్రపోతున్న రవితేజ మీద బాబాయిలు కామెడీగా దాడి చేసే సీను,  ఏ ‘పరమానందయ్య శిష్యుల కథ’ కాలం నాటిది! దీనికి ప్రేక్షకులు నవ్వారా? 

          విలన్ ఎన్ని సార్లు వచ్చి తన్నులు తినిపోతాడు? అన్నిసార్లు క్లయిమాక్సే గా?  శ్రీను వైట్ల టెంప్లెట్ ఒకటి, విలన్ తో మూడుసార్లు క్లయిమాక్సులూ పెట్టేస్తే సెకండాఫ్ అయిపో
తుందా? ఇంత సులభంగానా?  సినిమా అంటే ఇంతేనా? దర్శకుడేం కష్టపడనవసరం లేకుండా, రవితేజ లాంటి స్టార్ల  భుజాల మీదేసేస్తే,  వాళ్ల పాపులారిటీ కొద్దీ వాళ్ళే చచ్చీ చెడీ నటించి ఒడ్డుకు చేర్చేస్తారా? రేపు కూడా రావిపూడి స్టార్ల మీద ఇదే ‘టాలీవుడ్ మూవీస్ మేడీజీ’ మంత్రం ప్రయోగిస్తూ  పోతాడా?

సికిందర్
www.cinemabazaar.in
(ps : ఈ సినిమాలో కూడా కొత్తగా
తెలుసుకోవడాని కేమీ లేదు గనుక
దీనికి 'స్క్రీన్ ప్లే సంగతులు' వుండదు.

టెంప్లెట్ మూవీస్ కి విశ్లేషణ
అవసరం లేదు)