రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, డిసెంబర్ 2016, ఆదివారం

సాంకేతికం

     కాస్ట్యూమ్స్...నటీనటుల కొక అలంకారం, గుర్తింపు. దీన్నే ఆహార్యమన్నారు. పౌరాణిక సినిమాలతో మొదలై ప్రస్తుతం ఫాంటసీల దాకా వచ్చాయి కాస్ట్యూమ్స్ అనేవి.  మధ్యమధ్యలో చారిత్రక, భక్తి, జానపద, సాంఘీక, కౌబాయ్, క్రైం, లవ్ మొదలైన సినిమా పాత్రలకీ ఆయా శైలుల్లో శోభ తెచ్చాయి. ఆహార్యాన్ని అభినయమని కూడా అన్నారు. చతుర్విధాభినయాల్లో అదొకటి. లేకపోతే  నటుడు గొంతెత్తి ఎన్ని పద్యాలు పాడినా, అతడి చేతిలో గద, తల మీద ఓ కిరీటం, కాళ్ళకి కిర్రు చెప్పులూ, ఒంటి మీద పట్టు వస్త్రాలూ మెరవకపోతే ఆ పాత్ర దుర్యో ధనుడని ఎవరూ  అనుకోరు. ఒకడు సిటీ మొత్తాన్నీ అతలాకుతలం చేసేస్తానని ఎన్ని రంకెలేసినా- ఓ చింకి పాత జీన్సు, మాసిన డెనిమ్ షర్టు, మురికి పట్టిన బూట్లు, చేత డొక్కు పిస్తోలూ లేకపోతే,  వాడొక  మాఫియా క్యారక్టర్ అని ఎవరూ నమ్మరు. తగిన డ్రెస్సు లేకపోతే  ఎవరే పాత్ర నటిస్తున్నారో అస్సలు అంతుపట్టదు.

         
డ్రెస్సులే ప్రేక్షకుల్లో చాలా ఫ్యాషనయ్యాయి. మరీ కలర్ సినిమాల్లో ఎన్టీఆర్ వేసుకునే చెమ్కీ కోటు నెవరూ వేసుకోలేదు గానీ, రాజేష్ ఖన్నా పాపులర్ చేసిన చెప్పులేసుకుని మాత్రం బాగా తిరిగారు ఆలిండియా జనం. వాణిశ్రీ చీరకట్టు సరే, అది చూసి బొడ్డు కింద చీర కట్టుకుని తిరిగారు ఆడవాళ్ళు పూర్తి స్వేచ్ఛతో. అయితే ఇప్పుడీ పరిస్థితి తారుమరైందని అంటారు ప్రముఖ కాస్ట్యూమర్ జనకముని. మార్కెట్లోకి వచ్చే కొత్త కొత్త రెడీమేడ్ దుస్తులే స్టార్స్ కిప్పుడు అలంకారాలవుతున్నాయని ఆయనంటారు. స్టార్లు మార్కెట్ కి ఫ్యాషన్లు ఇస్తున్న కాలం పోయి, స్టార్లే మార్కెట్ నుంచి ఫ్యాషన్లు తీసుకుంటున్న ట్రెండ్  నడుస్తోందని అంటారు జనకముని.

          ‘కుదిరితే కప్పు కాఫీ’ కాస్ట్యూమ్స్ చీఫ్ గా ప్రమోటైన జనకముని, మార్కెట్లో  వచ్చే కొత్త డిజైన్లు ప్రజల చేతుల్లో పడకముందే స్టార్లు చేజిక్కించుకుంటున్నారని చెప్పారు. “సరికొత్త ఫారిన్ డిజైన్లు మొదట ముంబాయి కొస్తాయి. తర్వాత బెంగళూరు కొస్తాయి. ఆ తర్వాతే హైదరాబాద్ కొస్తాయి. ఈలోగానే స్టార్లు తెప్పించుకుని సినిమాల్లో వాడేస్తూంటారు” అన్నారు. 

           కాస్ట్యూమర్లు మిషన్ మీద కుడుతూ వున్న కాలంలో వీటిని ఫ్యాషన్ అన్నారు. రెడీ మెడ్ గా మార్కెట్లో కోనేసుకుంటున్న ఈ కొత్త మిలీనియంలో స్టయిల్ స్టేట్ మెంట్ అన్న కొత్త పదం వాడకంలోకి తెచ్చారు. ఈ స్టయిల్ స్టేట్ మెంట్ లో యాటిట్యూడ్ ప్రధానంగా వ్యక్త మవుతూంటుంది. హీరో హీరోయిన్లు ఇప్పుడు పోషిస్తున్నవి డిజైనర్ పాత్రలు. ‘రగడ’ లో అనూష్కా, ‘బిల్లా’ లో ప్రభాస్ ఇందుకు సరపోతారు. అయితే జనకముని అభిప్రాయంలో ఈ ట్రెండ్ కాస్ట్యూమర్లకి అంతగా  మేలు చేయడం లేదు. 

          ఆయన ప్రకారం కాస్ట్యూమ్స్ చీఫ్స్ , వాళ్ళ కింద ఫస్ట్ అసిస్టెంట్స్, అసిస్టెంట్లు, ఇస్త్రీ వాళ్ళు, డ్రెస్ మాన్లూ మొత్తం కలిపి 445 మంది వరకూ ఇప్పుడు ఫీల్డులో వున్నారు. వీరంతా రెడీమేడ్ దుస్తులకి అలవాటు పడ్డ హీరో హీరోయిన్లని మినహాయించి, మిగతా  ప్యాడింగ్ ఆర్టిస్టుల దుస్తులకే పరిమిత మవాల్సి వస్తోంది.

           “పవన్ కళ్యాణ్ కి నేను పర్సనల్ కాస్ట్యూమర్ గా ‘తమ్ముడు’, ‘బద్రి’, ‘ఖుషీ’ సినిమాల వరకూ పనిచేశాను.  ఆయన ఫారిన్ నుంచి బుక్స్  తెప్పించి ఆ డిజైన్లు కుట్టమనే వారు. ‘బద్రి’ లో మేడిన్ ఆంధ్రా సాంగ్ కి నేను తయారు చేసిన కాస్ట్యూమ్ బాగా హిట్టయ్యాయి. ‘ఖుషీ’ తర్వాత ఆయన ఏడాది దాకా సినిమా చెయ్యనని నాకు యాభై  వేలిచ్చి పంపారు. ఆ డబ్బుతో టైలరింగ్ షాపు పెట్టుకుని బిజీ అయ్యాను. ఎవరైనా పిలిస్తే కంపెనీ కాస్ట్యూమర్ గా వెళ్లి పని చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు జనకముని. 

      హీరో హీరోయిన్లకి ప్రత్యేకంగా కాస్ట్యూమర్లు లేకపోతే, వాళ్ళతో కలుపుకుని మొత్తం ఆర్టిస్టు లందరికీ డ్రెస్సులు సమకూర్చే అతన్ని కంపెనీ కాస్ట్యూమర్  అంటారనీ, హీరో హీరోయిన్లకి పర్సనల్  కాస్ట్యూమర్లుంటే అప్పుడు మిగతా ఆర్టిస్టుల డ్రెస్సుల సంగతి చూసేదీ కంపెనీ కాస్ట్యూమరేనని  వివరించారు. అయితే మనీష్ మల్హోత్రా, రోహిత్ బల్, నీతా లుల్లా ల్లాంటి ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్లు సినిమా రంగంలోకి రావడాన్ని మీరెలా  చూస్తారని అడిగినప్పుడు- తెలుగులో అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. పదిహేనేళ్ళ క్రితం మాత్రం తమిళ కాస్ట్యూమర్లతో  పోటీ వుండే దన్నారు. ముప్ఫై  ఏళ్ల క్రితం వరకూ కాస్ట్యూమర్లకి విలువ వుండేదనీ, ఆ తర్వాత నుంచీ సన్నగిల్లిందనీ బాధ పడ్డారు. అప్పట్లో  కాస్ట్యూమర్ ని  కూడా కూర్చో బెట్టుకుని నిర్మాత, దర్శకుడు, రచయిత, మేకప్ మాన్, కళా దర్శకుడూ కథ గురించీ, పాత్రల గురించీ చర్చించి, దుస్తులు నిర్ణయించేవారన్నారు. ఏ దృశ్యానికి ఏ దుస్తులు నప్పుతాయో కాస్ట్యూమర్ చెప్పే వాడనీ, పాటల  విషయంలో కూడా కాస్ట్యూమర్ ని సంప్రదించే వారనీ,  షూటింగ్ కి పది పదిహేను రోజుల ముందే అందరి దుస్తులూ సిద్ధం చేసుకుని పెట్టుకునే వాళ్ళమనీ చెబుతూ పాత రోజుల్ని గుర్తు చేసుకున్నారు  జనకముని.

          విశాఖ పట్నం దగ్గర, చిట్టివలసకి చెందిన ఈయన 1995 లో సినిమా రంగానికొ చ్చారు. ‘కామ్రేడ్’ కి అసిస్టెంట్ గా చేసి, ‘గోకులంలో సీత’ నుంచి ‘తొలిప్రేమ’ వరకూ పవన్ కళ్యాణ్ కి పర్సనల్ అసిస్టెంట్ గా చేసి, ‘బద్రి’ తో పర్సనల్ కాస్ట్యూమర్ అయ్యానరు. మొత్తం కలిపి 18  సినిమాలు చేశారు. 

          వీటిలో చంద్రశేఖర్ యేలేటి తీసిన ‘ప్రయాణం’ కి తనకో వింత అనుభవం ఎదురయిందిట. ఆ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరిగింది. అది మంచు మనోజ్- పాయల్ ల మధ్య ఓ మూడు గంటల సేపు మాత్రం జరిగే కథతో కూడిన సినిమా. అంటే ఆ ఇద్దరూ సినిమా యావత్తూ అదే డ్రెస్ లో వుండాలన్న మాట. ఆ షూటింగ్ జరిగిన 45 రోజూలూ ఆ ఇద్దరి రెండు జతల దుస్తుల్నీ కాపాడుకోవడం కత్తి మీద సామే అయింది జనకమునికి. అవి మాసిపోతే వాషింగ్ చేయవచ్చుగానీ, లైటింగ్ తీవ్రతకి రంగులు వెలసిపోతే మాత్రం అంతే సంగతులు. దర్శకుడు చంద్రశేఖర్ సెలెక్టు చేసుకున్న ఆ డ్రెస్సులు ఎలాంటివంటే మార్కెట్లో ఎక్కడా వాటికి మారు జతల్లేవు. అంటే ‘బేబీస్ డే అవుట్’  లో ఒక చంటి పిల్లాడు షూటింగ్ లో అలసిపోతే,  వాడి కవలని పెట్టి తీసే లాంటి అదృష్టం ఇక్కడ జనకమునికి లేదన్నమాట.

          ఇలాటి వింత అనుభవాలతో భోజ్ పురి, బెంగాలీ సినిమాలకి కూడా పనిచేశారు. తెలుగు కాస్ట్యూమర్స్ యూనియన్ కి 2005-09 మధ్య ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు జనకముని.


-సికిందర్
(2011 మార్చి ఆంధ్రజ్యోతి ‘సినిమాటెక్’ శీర్షిక)