రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, May 5, 2023

1323 : రివ్యూ!

 

రచన -దర్శకత్వం : విజయ్ కనకమేడల
తారాగణం: అల్లరి నరేష్ , మిర్నా మీనన్, ఇంద్రజ, బేబీ ఊహా రెడ్డి, శత్రు, శరత్ తదితరులు  
కథ: టూమ్ వెంకట్, మాటలు : అబ్బూరి రవి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, ఛాయాగ్రహణం : సిద్ధార్థ్ జె
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
విడుదల : మే 5, 2023
***

            2021 లో హీరో అల్లరి నరేష్ తో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల అందించిన నాంది విజయం సాధించింది. అది పోలీసు వ్యవస్థకి బలైన సామాన్యుడి కథ.  ఆ తర్వాత 2022 లోఅల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అనే సామాజికంలో నటిస్తే విజయం సాధించలేదు. తిరిగి ఇప్పుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం నటించాడు. మరి కామెడీ సినిమాలు మానుకుని, సామాజిక సమస్యలతో కూడిన  వాస్తవిక సినిమాల్లో నటించడం మొదలెట్టిన అల్లరి నరేష్, ఈ మూడో ప్రయత్నంతో ఎలాటి ఫలితాన్ని సాధించాడు? ఇందులో పోషించిన పాత్రేమిటి? విషయమేమిటి?... ఇవి తెలుసుకుందాం.

కథ   

సీఐ శివకుమార్ (అల్లరి నరేష్) కి భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురు లక్కీ (బేబీ ఊహా రెడ్డి) వుంటారు. సీఐగా అతను డ్యూటీకి కట్టుబడి వుండడంతో భార్యతో సమస్యలు వస్తాయి. ఒక గర్ల్స్ హాస్టల్లో దుష్ట మూక పాల్పడుతున్న అరా చకాల్ని ఎదుర్కోవడంతో, ఆ మూక శివకుమార్ భార్యని అవమానిస్తారు. శివకుమార్ వెళ్ళి ఆ మూకని కాల్చి పారేసి హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఇంతలో భార్యా  కూతురూ కనపడకుండా పోతారు. వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది మిస్సింగ్ కేసులు నమోదవుతాయి. ఈ కిడ్నాపర్స్ ఎవరు? ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? శివకుమార్ భార్యా కూతురూ కిడ్నాపై ఎక్కడున్నారు? ఇవీ శివ కుమార్ ముందున్న సమస్యలు. ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ

ఇది సామాజిక కథయితే కాదు, కృత్రిమ పోలీస్ యాక్షన్ కథ. పైగా దీంతో భావోద్వేగాలు కరువైన పరిస్థితి ఏర్పడింది. భావోద్వేగాల  కెమిస్ట్రీ భార్యా కూతుళ్ళతో లేదు, వందల సంఖ్యలో మాయమవుతున్న మనుషులతోనూ లేదు. చెప్తే భార్యా కూతుళ్ళ అదృశ్య కథయినా చెప్పాల్సింది, లేదా మిగతా మనుషుల మిస్సింగ్ కేసుల కథైనా చెప్పాల్సింది. ఫస్టాఫ్ భార్యాకూతుళ్ళ అదృశ్య కథగా నడిపి, సెకండాఫ్ మిస్సింగ్ మనుషుల కథ నడిపే సరికి రెండు కథల్లాగా తయారైంది. ఇక సెకండాఫ్ లో ఎక్కడో ముగింపులో వరకూ భార్యకీ కూతురికీ స్క్రీన్ స్పేస్ దక్కకుండా పోయింది. వాళ్ళు కనిపించక పోవడంతో వెలితి ఏర్పడింది.
        
ఇంతా చేసి ఈ కిడ్నాపులు ఎందుకో చివర్లో రివీల్ చేస్తే తెలిసే విషయం రొటీన్ అరిగిపోయిన మెడికల్ మాఫియా విషయం. దీంతో మొత్తం కథ కృత్రిమంగా తయారయ్యింది. ఇటీవలే సమంతా నటించిన యశోద లో ఒక మెడికల్ మాఫియాని చూశాం, ఇంతలో ఇప్పుడు అల్లరి నరేష్ తో ఇంకో మెడికల్ మాఫియా. రెండిటి ఫలితం డిటో.

నటనలు- సాంకేతికాలు

    అల్లరి నరేష్ పోలీసు పాత్ర వరకూ నటన ఓకే. మరీ ఓవర్ యాక్షన్ చేయకుండా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కొత్తగా ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు కూడా రిచ్ గా వుండడంతో కొన్ని టెక్నికల్ అంశాలు నటనని ఎలివేట్ చేశాయి. అతను చట్టాన్ని  చేతుల్లోకి తీసుకునే ఎమోషనల్ పోలీసు. దీనికి తగ్గ మానసిక సంఘర్షణ మాత్రం కథలో లేక పైపై యాక్షన్ హీరోగా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు.
        
హీరోయిన్ మిర్నా మీనన్ ది భార్యగా విచిత్ర పాత్ర. ప్రేమించిన పోలీసుకోసం పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చేసిన తను భార్యగా సాధింపులు మొదలెట్టడానికి తగిన పరిస్థితి కనిపించదు. పోలీసు భార్యగా జీవితం ఎలా వుంటుందో తెలియకుండానే చేసుకుందా. కథ కోసం ఆమె పాత్రని నెగెటివ్ గా మార్చేశారు. అసలు మొదట ప్రేమ, పెళ్ళీ, సంసారం కూడా పొడిపొడిగా చూపించి వదిలేశారు. కిడ్నాప్ కాబోయే హీరోయిన్ని పాజిటివ్ గా చూపించినప్పుడే ఎమోషనల్ కెమిస్ట్రీతో సానుభూతి ఫీలవగల్గుతాం. కాబిల్ లో సంజయ్ గుప్తా హీరోయిన్ యామీ గుప్తాని ఎంత పాజిటివ్ గా చూపించి తర్వాత సానుభూతిని రాబడతాడు.  మిర్నా గ్లామర్ కి, నటనకీ ఫర్వాలేదు. ఇక కూతురి పాత్రలో బేబీ ఊహా రెడ్డి చైల్డ్ సెంటి మెంటు సీన్లు ఏ పాత సినిమాల్లోంచి ఎత్తుకొచ్చారో తెలీదు. ఈ కాలపు పిల్లలు మాత్రం ఇలా వుండరు.
        
డాక్టర్ గా ఇంద్రజ నటించింది. ఫర్వాలేదు. ఈ కథలో విలన్ అనేవాడు మెడికల్ మాఫియాగా చివర్లో తప్ప కనపడడు. కాబట్టి అతడి గురించి అనవసరం. పైన చెప్పుకున్నట్టు నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ముఖ్యంగా బ్రహ్మ కడలి కళా దర్శకత్వం, కలర్స్ వాడిన విధానం, సెట్స్, లొకేషన్స్ అన్నీ టెక్నికల్ గా ఒక హోదాని సమకూర్చి పెట్టాయి. సిద్ధార్థ్ జాదవ్ ఛాయాగ్రహణం టాప్ క్లాస్. ఛోటా కే ప్రసాద్ ఎడిటింగ్ కూడా. శ్రీచరణ్ పాకాల పాటలేం కుదరకపోయినా, నేపథ్యసంగీతం ఫర్వాలేదు.
        
దీనికి టూమ్ వెంకట్ కథ అందిస్తే, అబ్బూరి రవి రాసిన మాటలు కొన్ని చోట్ల ఆలోచింపజేస్తాయి. అయితే ఈ సినిమాలో యాక్షన్ ఎక్కువ వుండడంతో మాటల వాడకం తగ్గింది. ఇక విజయ్ కనకమేడల దర్శకత్వం నాంది కంటే ఉన్నతంగా వుంది. విషయం మాత్రం అంతగా లేదు.

చివరికేమిటి

ఈసారి నరేష్ తను నటిస్తున్న సామాజికం చాలనట్టు కుటుంబాన్నీ భుజానేసుకున్నాడు. ఈ రెండు పడవల ప్రయాణంలో ఎటు వైపూ ఎమోషన్లు సాధ్యంగాక చేరాల్సిన తీరానికి చేరలేదు. సెకండాఫ్ లో అదృశ్యమైన కుటుంబాన్ని పక్కనపెట్టి సామాజికాన్ని(సమాజంలో మిస్సింగ్ కేసులు) ఎత్తుకోవడంతో ఏకసూత్రత దెబ్బతిని ఎసరు వచ్చింది. స్క్రీన్ ప్లేకి ఒక స్ట్రక్చర్ లేదు, హీరోకి ఒక గోల్ లేదు, కథకి విలన్ లేడు. ఇంతకంటే ఏం కావాలి సినిమా అనారోగ్యానికి.
        
ఫస్టాఫ్ ఎత్తుకున్న కుటుంబ అదృశ్య కథని వదిలేసి, సెకండాఫ్ సామాజికాన్ని ఎత్తుకోవడంతో సినిమా సెకండాఫ్ సిండ్రోమ్ అనే సుడి గుండంలో కూడా పడింది. తను దుష్ట మూకని కాల్చి చంపడంతో నాల్గు హత్య కేసులు నమోదై, మానసికారోగ్య కారణాలతో కోర్టు హౌస్ అరెస్టులో వుంచమన్నప్పుడు- హౌస్ అరెస్టులో వుండిపోయి, కుటుంబాన్నే మర్చిపోతాడు. ఇతర మిస్సింగ్ కేసులు పట్టించుకుంటాడు. అతను ప్రశ్నించి వుంటే ఈ రెండు కథలూ ఒక కథగా అయ్యేవి.
        
ఎలాగూ హౌస్ అరెస్టులోంచి పారిపోయినప్పుడు- నేను దుష్ట మూకని ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోకుండా మర్డర్ కేసులు పెడితే- నేను నా కుటుంబం ఎక్కడుందో వెతుక్కోవడానికే పారిపోతా. మిగతా మిస్సింగ్ కేసుల గొడవ నాకెందుకు- అది మీ డిపార్ట్ మెంట్ గొడవ అని పూర్తిగా అతను కుటుంబం కోసం సంఘర్షించి వుంటే ఎమోషనల్ కెమిస్ట్రీ వుండేది. చివర్లో ఎక్కడో సామాజిక బాధ్యత కూడా గుర్తుచేసుకుని, ఇతర బాధితులకి  విముక్తి కలిగించి వుంటే, సినిమా అంతా ఒకే కుటుంబ పర భావోద్వేగాలతో, ఒకే కథలా వుండేది.

—సికిందర్