రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, April 15, 2019

804 : స్క్రీన్ ప్లే సంగతులు - 2

      

        ఈ కథలో హీరోయిన్ పాత్రకి ఏర్పాటు చేసిన పెళ్లి ఫోబియా కాస్తా కథకుడికి కథతోనే  ఫోబియా అన్నట్టుగా తయారయింది. కథని సరీగ్గా ఆలోచించాలంటే లైటర్ వీన్ ప్రేమ సినిమాలు అలవాటు చేసిన ఒకనాటి వెన్నాడే భయం. పాత్రతో ఆలోచిస్తే కథ వస్తుందా, లేక కథతో ఆలోచిస్తే కథ వస్తుందా...ఎలా ఆలోచించి తీస్తే ఏమవుతుందో ఆ నాలెడ్జిలోకి వెళ్ళాలంటేనే భయంభయం.  పైపైన అలా అలా రాసేసి లైటర్ వీనుగా తీసేస్తే చాలా సుఖం సుఖం. ఇవి రెండ్రోజులు కూడా సరీగ్గా ఆడడం లేదని వారం వారం తెలుస్తూనే వున్నా ఇంకా అలాగే తీస్తూ ఖుషీ ఖుషీ. ట్రైలర్స్ కి వచ్చే యూట్యూబ్ వ్యూస్ లెక్కేసుకుని ఎంతో హేపీ హేపీ. థియేటర్స్ లో పట్టుమని పదిమంది ప్రేక్షకులు లేకున్నా మీట్స్ సక్సెస్ మీట్స్. ఓ పదేళ్ళ క్రితం వరకూ ప్రేక్షకుల్లేక సగానికి సగం థియేటర్లు మూతబడిపోయిన పరిస్థితుల్లోంచి - ఉత్తరాది కార్పొరేట్ కంపెనీల పుణ్యమాని వూరూరా మల్టీప్లెక్సులు వెలుస్తూ, దీటుగా ప్రేక్షకులూ పెరిగిపోయి -  ప్రదర్శనా రంగం భళ్లున తెల్లారినట్టు విస్తరిస్తే -  దీన్నందుకుని లాభపడాలన్న ఆలోచన లేక, అవే అనామక సినిమాలతో అదే కురచ పరిధిలో పడకేసి, లైటర్ వీను అనే సిగార్ లైటర్ తో ఫ్యూచర్ ని ఎంచక్కా తుదముట్టించడం!

         ఇంకో వందేళ్ళ తర్వాత  ఎలాగూ సిగార్ లైటింగ్ దర్శకత్వాల్లో సెట్స్ మీద తగులబడిపోయే స్క్రిప్టు కాగితాలే  సినిమాలుగా మారబోతాయనే కాబోలు - 1919 లో ఏరికోరి దక్షిణదేశపు మొదటి చలనచిత్రంగా  ‘కీచక వధమ్’ నిర్మించారు. ఇప్పుడు 2019 లో వచ్చేసి ఈ కీచక వధమ్ శత వత్సర జ్ఞాపికగా, ‘సూర్యకాంతం’ కూడా శత వ్రక్కలై  వచ్చింది బాక్సాఫీసు వధమ్ గా. 

          కిందటి వ్యాసంలో ప్లాట్ పాయింట్ వన్ వరకు వచ్చాం. అభిషేక్ మళ్ళీ పెళ్లి రికార్డు వేసిన ఫలితంగా సూర్యకాంతం బిక్కచచ్చి కన్పించకుండా వెళ్లి పోయింది. ఆమెకున్న పెళ్లి ఫోబియాకేం చేయాలో అది చేయకుండా అభిషేక్ ఫూలిష్ గా మాట్లాడడంతో ఈ ప్లాట్ పాయింట్ వన్ కి అర్ధం లేకుండా పోయింది. కీచకుడు ఇలాగే పెళ్లి చేసుకొమ్మని వేధిస్తూంటే పంచభర్తృక ద్రౌపది వెళ్లి భీముడికి చెప్తే, గదుచ్చుకుని కీచుమన్పించాడు కీచకుడ్ని భీముడు. ఫోబియాకన్యక సూర్యకాంతంని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్న అసలు అభిషేక్ ని వదిలేసి బాక్సాఫీసునే భస్మీపటలం చేశాడు కథకుడు సిగార్ లైటింగుచ్చుకుని.  

         
తనని పెళ్లి చేసుకొమ్మని వేధిస్తున్న అభిషేక్ నే తిరిగి ప్రేమించి, అతడి ఎంగేజ్ మెంట్ ని చెడగొట్టే ‘అదర్ వుమన్’ గా సూర్యకాంతాన్ని రప్పించి ఇంటర్వెల్లో కథనే వధించాడు. భీముడు గదతో వెళ్ళాడు, సూర్యకాంతం పాప్ కార్న్ తో వచ్చింది. వచ్చి అభిషేక్ కి షాకిచ్చింది. అతడి నోట్లో పాప్ కార్న్ కుక్కి, “రీఫిల్ చేసుకురా, సెకండాఫ్ ఇంకా ఇంటరెస్టింగ్ గా వుంటుంది” అంది. 

          స్క్రీన్ ప్లే అదిరింది... ఇక సెకండాఫ్ సూపర్ ... లాంటి తెరమీద ప్రేక్షకులకి అవసరంలేని సొంత బాకాలూదుకోవడం ఇక్కడా వుంది. సినిమాలోకి (కథలోకి) కథకుడు / దర్శకుడు  వచ్చి కామెంట్ చేయడం చీప్ టేస్టని తెలీదు.  సెకండాఫ్ ఎందుకు ఇంటరెస్టింగ్ గా అన్పించిందో గానీ, ఫస్టాఫ్ మహా ఫ్లాట్ గా వుంది.  చూస్తే సెకండాఫ్ ప్రారంభంలోనే ఇప్పుడేం చేయాలో అర్ధంగావడం లేదని ఇద్దరు నటులు నెత్తిన తెల్లగుడ్డ లేసుకోవడం వుంది.

***
      కథలో ప్రధాన పాత్ర ఎవరన్న స్పష్టత లేకపోవడం చాలా సమస్యలకి దారి తీసింది. అభిషేకా, సూర్యకాంతమా, ఎవరు ప్రధాన పాత్ర ? ఇటీవలి ‘శుభలేఖ+లు’ కూడా ఈ స్పష్టత లేకనే ఫ్లాపయింది. ఇది కూడా హీరో, హీరోయిన్ ఎవరూ ఒక ప్రధాన పాత్రంటూ కాని హోల్ సేల్ ఫ్యామిలీ డ్రామా. హీరోహీరోయిన్లని పాసివ్ పాత్రలుగా మార్చేసి అట్టర్ ఫ్లాపయింది.  ‘సూర్యకాంతం’ కూడా ఒక ప్రధాన పాత్రంటూ లేని కలగూరగంప ట్రయాంగులర్ డ్రామాగా తయారయింది. హీరో హీరోయిన్ల పాసివ్ పాత్రల నసగా మారి అట్టర్ ఫ్లాపయింది. 

          ఒక ప్రధాన పాత్ర - అది ఎదుర్కొనే సమస్య - దానికి పరిష్కారం అనే సూటి గీత కథా పథకం మాత్రమే సినిమా కథవుతుంది. ఈ సూటి గీత హీరో, హీరోయిన్ - ఇద్దరికీ కనబడదు. ప్రేక్షకులకి తెలిసిన హీరోయిన్ గా నిహారిక వుండగా, తెలియని హీరో మీద కథ చేయాలనుకోరు. నిహారిక పాత్రదే కథవ్వాలి. ఆమే ప్రధాన పాత్రవాలి. అప్పుడు ఆమెకున్న  ఫోబియా - దాంతో సంఘర్షణ - పరిష్కారం - ఈ గీత మీద ఆమె కథ వుండాలి. ఇలా వుండదు. హీరోనే ప్రధాన పాత్ర అనుకున్నా, ఫోబియా గల ఆమెతో తనకి  సమస్య- ఆమెతో సంఘర్షణ -  ఫోబియాకి పరిష్కారం - ఈ గీత మీద కథ వుండాలి. ఇలా కూడా వుండదు. అసలు ఫోబియానే ఎత్తి పారేస్తే ఏ గీత మీద ఎవర్ని ప్రధాన పాత్రగా చేసుకుని కథగా వుంటుంది? 

          ఇందుకే ప్లాట్ పాయింట్ వన్ కూడా అర్ధం లేకుండా వుంది. ఆమె మదర్ చనిపోతే,  నీకు అండగా వుంటాను లైఫ్ లాంగ్ అనగానే భయపడి ఆమె జంప్ అయింది. ఇలా ఇదివరకు అన్నప్పుడు కూడా భయపడి జంప్ అయింది. అప్పుడతను ఆమె మదర్ ని కలిస్తే కూతురి ఫోబియా గురించి చెప్పింది. అయినా ఆ ఫోబియా కథేదో నడపకుండా కథకుడు ఇప్పుడు కథతో సంబంధం లేని అదే పెళ్లి యావ పెట్టడంతో ప్లాట్ పాయింట్ వన్ ఫ్లాప్ అయింది. ఒకవేళ ఆమె కన్పించక పోవడమే అతడి సమస్య అనుకున్నా, అలా అతనే ప్రధాన పాత్రనుకున్నా, ఈ సమస్యతో సంఘర్షించిందీ లేదు. గిల్టీ ఫీలయ్యిందీ లేదు. ఆమెని వెతికిందీ లేదు. ఏడాది పాటు కన్పించకుండా పోయినా ఫర్వాలేదనుకుని, వేరే అమ్మాయితో పెళ్ళికి సిద్ధ పడ్డాడు. అంటే ప్రధాన పాత్రగా సమస్యకి సంబంధించి అతడికి గోల్ కూడా లేదు. 

      ఇలా ప్రధాన పాత్ర కాకపోతే ప్రత్యర్ధి పాత్రవాలి. అంటే అతను ఏదైనా చర్యకి పాల్పడి వుండాలి. దానికామె బెదిరిపోయి పారిపోయి వుండాలి. ఇది బయటపడితే అతడికే ప్రమాదంగా వుండాలి. అందుకే ఆమెని వెతక్కుండా తేలుకుట్టిన దొంగలా వుండిపోవాలి. తను పాల్పడిన చర్య బయటపడకుండా చూసుకోవడమే తన గోల్ గా వుండాలి. ఇలా కూడా లేదు. కాబట్టి ప్రత్యర్ధి పాత్ర కూడా కాదు. ప్రధాన పాత్ర కాక, ప్రత్యర్ధి పాత్రా కాక, ఓ పాసివ్ సహాయ పాత్ర అయ్యాడు. 

          ఇక సూర్యకాంతంతో జరిగిన కథ పూజకి చెప్పేసి, ఆమెతో ఎంగేజ్ మెంట్ అనుకుంటున్నప్పుడు,  సూర్యకాంతం వచ్చేస్తుంది. ఇది ఇంటర్వెల్. ఈ సీన్లో అభిషేక్ షాక్ అవుతాడు. పిల్లిలా మారిపోతాడు. బెంబేలెత్తి పోతాడు. ఎందుకో? ఆమెని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడా? ఆమే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆమెదగ్గర ఫోటోలు, చాట్స్, కాల్స్ ఏమైనా వున్నాయా? వుంటే పూజకి చెప్పేశాక ఇక భయమెందుకు?
నీ పాస్ట్ గురించి నేనేం చేయలేను, కానీ నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం నాదే నంటూ పూజా అభయమిచ్చాక  ఇంకా భయమెందుకు? ఏముందనిప్రేక్షకులు ఈ ఇంటర్వెల్ సీనుకి సీట్లకి అతుక్కుపోయి టెన్షన్ అనుభవించాలి. హీరో అలా కిందా మీదై పోతాడెందుకు? ఏముందని ఇంటర్వెల్ కి ఈ బిల్డప్? ఈ మాత్రానికి సెకండాఫ్ ఇంకా ఇంటరెస్టింగ్ గా వుంటుందని సూర్యకాంతం సెలవివ్వడం.

***
       కన్పించకుండా పోయిన ఈ ఏడాది కాలమంతా సూర్యకాంతం ఎక్కడుంది? ఏం చేసి బతికింది? ఫోబియా తగ్గి ఎవర్నైనా ప్రేమించిందా? పెళ్లి చేసుకుందా? అవి విఫలమై ఏమీ ఎరగనట్టు తన దగ్గరికి తిరిగి వచ్చిందా? ఎన్ని పెళ్ళిళ్ళు  లేదా ప్రేమలు ముక్క చెక్కలయ్యాయి? ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? ఏడాది అజ్ఞాతంలో వున్న ఈమె మారిటల్, లీగల్ స్టేటస్సులేమిటి? మెంటల్ కేసులు సహా ఎన్ని పోలీసు కేసులున్నాయి? ఎవర్నైనా చంపి తప్పించుకొచ్చిందా - ఈ సందేహాలు అభిషేక్ కి రావు. మనకొస్తే మన ఖర్మ. పైపైన రాసేసి తీసేసే లైటర్ వీను రాతతీతల బాధితులుగా...

          ఇంతకీ సంవత్సరం పాటు సూర్యకాంతం ఎక్కడికి అదృశ్యమై ఏం చేసిందో అదొక ఆగథా క్రిస్టీ సిండ్రోమా? ప్రఖ్యాత క్రైం రచయిత్రి ఆగథా క్రిస్టీ అదృశ్యమైన ఆ పదకొండు రోజులూ  ఎక్కడుందో ఏం చేసిందో, ఎలా తిరిగి వచ్చిందో ఎప్పటికీ తేలని మిస్టరీ. సూర్యకాంతం అగథా క్రిస్టీ దగ్గరికెళ్ళి కూడబలుక్కుని వచ్చిందా? వన్నియర్ ఆగి వెళ్ళు, అప్పుడు వాడు పెళ్లి చేసుకుంటూ వుంటాడు, వెళ్లి చెడగొట్టు-  అని పిచ్చి సలహా కాంతం కిచ్చిందా క్రిస్టీ? ఇది క్రిస్టీ కాంతం కుట్రా? 

          ఇక సెకండాఫ్ కథనేం చేయాలో అర్ధంగాక పాత్రల నెత్తిన తెల్ల గుడ్డ లేయించాక, పాత మూస ఫార్ములా డ్రామా మొదలు. ఇద్దరు హీరోయిన్లతో హీరో ఒకర్ని దాస్తూ ఇంకొకరితో తంటాలు. ఇంటర్వెల్ కే హీరో సూర్యకాంతాన్ని చూసి భయమూ, ఆ ఇంటర్వెల్లూ ఫాల్స్ అన్పించాక, మళ్ళీ ఇదొకటి. 

       ఇలా వుంటే, తర్వాత సూర్యకాంతం గురించి అభిషేక్ పూజ ముందు ఓపెనై పోయాక, పూజ కూడా  ఫూలిష్ గా ప్రవర్తిస్తుంది. తన కాబోయే భర్త మాజీ ప్రియురాలు సూర్యకాంతాన్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఎందుకు? జెలసీ పుట్టించి నెత్తి మీదికి తెచ్చుకోవడానికా? అయితే తమ ఎంగేజ్ మెంట్ రింగ్ సూర్యకాంతం చేతే సెలెక్ట్ చేయించమని కూడా అభిషేక్ ని కోరుతుంది. ఎందుకు? తనని పరిహసిస్తున్నట్టు ఫీలై సూర్యకాంతం పంతానికి పోవడానికా? ఆమెలో మళ్ళీ అభిషేక్ తో పెళ్లి మీద ఆశలు రేకెత్తించడానికా? నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం నాదేనంటూ అభిషేక్ కి చెప్పుకున్న పూజ,  తన చాప కిందికే నీళ్ళు తెచ్చుకునే పిచ్చి ప్రవర్తన. ఇదీ పాత్ర చిత్రణ. 

          అలా అభిషేక్ పూజకి తొడిగేందుకు పూజ కోరికమేరకు తనే రింగు సెలెక్టు చేసిన సూర్యకాంతం, ఎంగేజ్ మెంట్ సమయంలో తన వేలికే  పెట్టుకుని, తీయరాక  సీన్ క్రియేట్ చేస్తే -  ఈ ఎంగిలి సంబంధం వద్దని పూజమ్మ పేరెంట్స్ వెళ్ళిపోక, ఆ రింగునే కూతురికి తొడిగించి సెలబ్రేట్ చేసుకోవడం. ఉంగరం సెలెక్షన్ పథకం ఇలా కడదేరి, ఎంగిలి ఉంగరంతో మిగిలిన పిచ్చి పూజ - నీ ప్రెజెంట్
, ఫ్యూచర్ మొత్తం నాదేనన్న డైలాగుని బానిస డైలాగుగా ప్రూవ్ చేసుకోవడం.

***
         ‘నీ పాస్ట్ గురించి నేనేం చేయలేను. కానీ నీ ప్రెజెంట్, ఫ్యూచర్ మొత్తం నాదే’ అని డిక్లేర్ చేసుకున్న అమ్మాయి,  ఆ మాజీ ప్రియురాల్ని తన ప్రేమ ఎరీనాలోకి రానిస్తుందా? ఇలా వుంటాయి చెప్పే మాటలు, చేసే పనులు. సినిమాలో కథ వున్నట్టు అన్పించాలంటే పాత్రల మధ్య సంఘర్షణ పుట్టాలి. ఇక్కడ పాత్రలు మూడూ చెట్టపట్టా లేసుకుంటే సంఘర్షణ ఎలా పుడుతుంది. సినిమా ఎలా అవుతుంది. 

          ఈ ఉంగరం ఎపిసోడ్ కంటే  ముందే సూర్యకాంతం అభిషేక్ కి చెప్పేస్తుంది -  ఎంగేజ్ మెంట్ సంగతి తెలిసే తను బ్రేక్ చేయడానికి వచ్చానని. అయినా ఆమెని పూజతో కలుపుతాడు. ఉంగరం షాపింగ్ కి తీసికెళ్తాడు. ఇలా గజిబిజిగా వుంటాయి పాత్రలు, కథనం. సెకండాఫ్ ఏమీ అర్ధం గావడం లేదని నెత్తిన తెల్లగుడ్డ లేసుకోవడం కరెక్టే. 

           
ఇలా ఎంగేజ్ మెంటయిన జంటని సూర్యకాంతం టూర్ పంపుతుంది. తనూ అక్కడికి వెళ్లి డిస్టర్బ్ చేస్తుంది. ట్రూత్ గేమ్ అని ఆడతారు. ఈ ట్రూత్ గేమ్ లో పూజ అడిగిన ప్రశ్నకి తను తిరిగి వచ్చి రెండు సార్లు ప్రపోజ్ చేశాననీ, ఇక్కడి కొచ్చిందే వాళ్ళిద్దరి సంబంధాన్ని బ్రేక్ చేయడానికనీ చెప్పేస్తుంది సూర్యకాంతం. 

          ఎందుకు బ్రేక్ చేయడానికి వచ్చింది సూర్యకాంతం. ఇందులో అభిషేక్ చేసిన తప్పేమిటి? అభిషేక్ ప్రపోజ్ చేస్తే ఏడాది కన్పించకుండా పోయిన తను ఇప్పుడు వచ్చి అభిషేక్ ని ప్రేమిస్తున్నానంటే ఎలా కుదురుతుంది? అసలు తన ఫోబియా ఏమైంది? ట్రీట్మెంట్ తీసుకుని నయం చేసుకుందా? అభిషేక్ మీద ఇంటరెస్ట్ వుంటే ఇన్నాళ్ళూ తనెందుకు కాల్ చేయలేదు? తను ఇక రాదనుకుని అతను  పెళ్లి చేసుకుంటూంటే ఎలా వచ్చి బ్రేక్ చేస్తుంది? అతడి పేరెంట్స్ అమాయకులు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎవతివే నువ్వని తరిమి కొట్టే వాళ్ళు. దీన్ని పాత్ర అనాలా? అసలు సూర్యకాంతం క్యారక్టర్ బయోగ్రఫీ ఏమిటి? 

        ట్రూత్ గేమ్ లో సూర్యకాంతం అలా అన్నాక, పూజ రియాక్ట్ అవకుండా అభిషేక్ కే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది! అభిషేక్ ప్రెజెంట్, ఫ్యూచర్ తనదేనని చెప్పుకున్న తను- ఇదే మాట సూర్యకాంతం కి చెప్పి అమీతుమీకి సిద్ధపడక జారుకుంటుంది. పాత్రలు అవి అన్న మాటలకే ఎక్కడా కట్టుబడవు. ఇక సంఘర్షణ ఎలా పుడుతుంది? ఇంత పేలవంగా ఇక్కడ ప్లాట్ పాయింట్ టూ వుంది. ఈ తప్పుడు ప్లాట్ పాయింట్ టూని సరిదిద్దడమెలా? 

          మొదట్లో సూర్యకాంతం ఫ్లాష్ బ్యాక్ విన్నాక - నీ ప్రెజెంట్, ఫ్యూచర్ నాదేనని పూజా చెప్పి వుండకూడదు. ఆమె ఆప్పుడు అభిషేక్ సిన్సియారిటీనీ, కమిట్ మెంట్ నీ అనుమానించి వుండాలి. అతడి పట్ల అపనమ్మకంతో వుండాలి. అతడే నమ్మకం కల్గించాలి. ఎట్టి పరిస్థితిలో నా ప్రెజెంట్, ఫ్యూచర్ నీదేనని అతను భరోసా ఇచ్చి వుండాలి. ఈ భరోసా ఇప్పుడు కన్పించక పూజ బ్రేకప్ చెప్పుకుని వెళ్ళిపోతే అర్ధముంటుంది. 

          పూజ బ్రేకప్ చెప్పేశాక అభిషేక్ లో అంతర్మథనం. సూర్యకాంతం వైపు మొగ్గు చూపడం. ఆమె పేరెంట్స్ తో తను మాట్లాడతానని వెళ్ళడం. అక్కడ తన పొరపాటు ఒప్పుకుని అభిషేక్, పూజలని కలపడం, ఇంతే. అంతలోనే మనసెందుకు మార్చుకుందో తెలీదు. లైటర్ వీనుగా మార్చుకుంది. ఇక అపూర్వ త్యాగమయిగా ఉత్తర మిచ్చి వెళ్లిపోతే,  అభిషేక్ వెతికి పట్టుకురావడం. ఇంట్లో కలుపుకోవడం. పూజని పెళ్లి చేసుకోవడం. ఆ ఇంట్లోనే  సూర్యకాంతం హేపీగా సెటిలైనట్టు ఎండ్. 

        పాపం, ఎలాటి సమస్యలతో సూర్యకాంతం ప్రేక్షకులకి పరిచయమైందో, అవి పరిష్కారమై జీవితం బాగుపడకుండా అలాగే మిగిలిపోయింది! సొంతిల్లు ఏమైందో. ఆ ఇంట్లో అమ్మమ్మ సూర్యకాంతం పటాలేమయ్యాయో,   అలాటి లెజెండ్ కిలాటి మనవరాలు ఈసురోమని మిగిలింది!

సికిందర్