రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, మే 2023, సోమవారం

1335 : రివ్యూ!


రచన- దర్శకత్వం : ఎం ఎస్ రాజు
నటీనటులు : నరేష్, పవిత్రా లోకేష్, వనితా విజయ్ కుమార్, జయసుధ, శరత్ బాబు, అన్నపూర్ణ, రవివర్మ తదితరులు
సంగీతం : సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం : అరుళ్ దేవ్, ఛాయాగ్రహణం : ఎంఎన్ బాల రెడ్డి
నేపథ్య సంగీతం : అరుల్ దేవ్!స్వరాలు : సురేష్ బొబ్బిలి 
నిర్మాత : నరేష్  
విడుదల : మే 26, 2023
***

టుడు నరేష్, నటి పవిత్రా లోకేష్ ల రిలేషన్ షిప్ వివాదం కొన్ని సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. నరేష్, పవిత్రా లోకేష్, నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతిల మధ్య వివాదం బెంగుళూరు హోటల్ కి చేరి, రచ్చ జరిగి తాత్కాలికంగా ఓ ముగింపుకొచ్చింది. ఇంకా పరిష్కరించుకోవాల్సిన చట్టపరమైన సమస్యలున్నాయి. దీన్ని నరేష్ సినిమాగా నిర్మించాలనుకుని, ప్రముఖ నిర్మాత - దర్శకుడు ఎంఎస్ రాజుతో కలిసి తెరకెక్కించారు. ఈ మధ్య అడల్ట్ సినిమాలు తీస్తున్న ఎంఎస్ రాజు ఈ మిడిలేజి రిలేషన్ షిప్ కథని నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ బయోపిక్ అన్నట్టుగా తన సృజనాత్మక శక్తితో తీర్చి దిద్దారు. ఇలాటి బయోపిక్ తోనే పూర్వం యశ్ చోప్రా హిందీలో ఒక క్లాసిక్ నిచ్చారు. మరి ఎం ఎస్ రాజు ఏమిచ్చారో చూద్దాం...

కథ
ఈ కథ 5 చాప్టర్లుగా వుంటుంది. మొదటి చాప్టర్ The Flirting లో ప్రముఖ సినిమా నటుడుగా వున్న నరేంద్ర (నరేష్) షూటింగులో నటి పార్వతి (పవిత్రా లోకేష్) ని చూసి మనసు పారేసుకుంటాడు. క్రమంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె అయిష్టంగా వుంటుంది.

The Mistake అనే రెండో చాప్టర్లో నరేంద్ర కుటుంబ జీవితం వుంటుంది. నరేంద్రకి మూడో భార్య  సౌమ్యా సేతుపతి (వినితా విజయ్ కుమార్) ఓ కొడుకూ వుంటారు. సౌ మ్యని పెళ్ళి చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితుల దగ్గర్నుంచి ఆమె అసలు రంగు బయటపడే ఘట్టం వరకూ ఈ చాప్టర్ వుంటుంది. కేవలం డబ్బు కోసం పెళ్ళి చేసుకున్న సౌమ్య తో నరేంద్రకి మనశ్శాంతి వుండదు. కొడుకు విషయంలో గొడవ జరిగే సరికి విడాకుల దాకా పోతుంది. 

My Story
అనే మూడో చాప్టర్లో సినిమా రచయిత ఫణీంద్ర (విజయ్ వర్మ) తో సహజీవనం చేస్తున్న పార్వతి, ఆమె ఇద్దరు పిల్లల జీవితం వుంటుంది. ఆస్తి కోసం ఫణీంద్ర ఆమెని వేధిస్తూంటాడు. ఈ వేధింపులు భౌతిక దాడికి దారితీస్తాయి.

Krishna’s Story
అనే నాల్గో చాప్టర్లో నరేంద్ర, పార్వతి ఇంటికెళ్ళి ఫణీంద్రకి బుద్ధి చెప్పి, ఇంట్లోంచి వెళ్ళ గొట్టిస్తాడు. పార్వతిని చేపడతాడు.
        
The Conflict అనే ఐదో చాప్టర్లో నరేంద్ర పార్వతితో కలిసి వుండడంతో భార్య సౌమ్య, ఫణీంద్రతో కలిసి ఓ కుట్రకి ప్లాన్ చేస్తుంది. బెంగుళూరు హోటల్లో పోలీసుల సాయంతో నరేంద్ర ఈ కుట్రని తిప్పికొట్టి, విజయగర్వంతో పార్వతిని తీసుకుని వెళ్ళిపోతాడు.
       
ఇలా అయిదు చాప్టర్లుగా చూపించిన ఈ బయోపిక్ లో
, ఇది వరకే పబ్లిక్ డొమైన్ లో వున్న నరేష్- పవిత్రల రిలేషన్ షిప్ కథని పబ్లిక్ డొమైన్ లో వున్నట్టుగానే చూపించారు-  పబ్లిక్ డొమైన్ లో లేనిది
My Story అనే మూడో చాప్టర్లో ఫణీంద్రతో పవిత్రా లోకేష్ సహజీవన కథే.

ఎలావుంది కథ

1981 లో యశ్ చోప్రా సిల్సిలా కథ తయారు చేసుకున్నప్పుడు అది కల్పిత కథ. అయితే అప్పట్లో జయా బచ్చన్‌ ని  వివాహం చేసుకున్న అమితాబ్ బచ్చన్ కి రేఖ తో  సంబంధం గురించి ఊహాగానాలు పత్రికల్లో మోతెక్కేవి. ఇది తన కథ లాగే వుందనుకున్న చోప్రా, వాళ్ళు ముగ్గుర్నీ నటించడానికి ఒప్పించాడు. దీంతో ఈ సినిమా వాళ్ళు ముగ్గిరి కథే అన్నట్టుగా ప్రచారం జరిగి సూపర్ హిట్టయ్యింది.
       
అయితే పత్రికల్లో వస్తూ వున్న చెత్త గాసిప్స్ కి ఇన్స్పైర్ అవకుండా
, చోప్రా ఈ ట్రయాంగులర్ రిలేషన్ షిప్ కథని మనో విశ్లేషణతో, సున్నిత కథగా మంచి విలువలతో ఆవిష్కరించాడు. కానీ స్వయంగా పబ్లిక్ డోమైన్లో వున్న నరేష్ కి డీసెన్సీ ని ప్రదర్శించడం సినిమాలో సాధ్యం కాలేదు. మూడో భార్యని వెనుక నుంచి తన్నే సీను దగ్గర్నుంచీ, బెంగుళూరు హోటల్ సంఘటనలో చీప్ టేస్టు ప్రదర్శించడం వరకూ దూకుడుగా చిత్రీకరించుకున్నాడు. మొత్తం ఈ బయోపిక్ ని తన వైపు నుంచే చెప్పాడు తప్పితే అవతలి మూడో భార్య వైపు నుంచి విషయమేమిటో మనకి తెలీదు. కాబట్టి ఇది ఏకపక్షంగా చూపించిన బయోపిక్ అయింది. ఈ బయోపిక్ లో నరేష్ పోషించిన నరేంద్ర పాత్ర దక్షత కలిగిన పరిష్కర్తగా వుండాల్సింది వుండదు.
       
ఈ కథని ఎంఎస్ రాజు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుని
, స్టేక్ హోల్డర్స్ ముగ్గుర్నీ సమన్వయం చేసి సమగ్ర కథ చెప్పాల్సింది. సిల్సిలా లోనైతే స్టేక్ హోల్డర్స్ ముగ్గురూ ప్రత్యక్ష్యంగా పాల్గొనడంతో ప్రేక్షకులకి సందేహాలు మిగల్లేదు.

నటనలు- సాంకేతికాలు

తమ బయోపిక్ లో తామే నటించిన నరేష్, పవిత్రలకి నటించే అవసరం రాలేదు, నిజజీవితంలో తమ అనుభవాల్ని తాము జీవించ గలరు కాబట్టి. అయితే ఈ పాత్రల్ని మిడిలేజి రిలేషన్ షిప్ మర్యాదలకి దూరం పోకుండా, సినిమాటిక్ రోమాన్సులు చేయకుండా, సంయమనం పాటించడంతో పాత్రలు నీటుగా కన్పిస్తాయి. నరేష్ పాత్ర మాత్రం తప్పంతా మూడో భార్యదే అన్నట్టు సానుభూతిని సృష్టించుకుని, పవిత్రతో రిలేషన్ షిప్ ని జస్టిఫై చేసినట్టు, లైసెన్సు పొందినట్టు వుంది.

పవిత్ర కూడా తానెంతో మంచి మనసుగల మనిషి అన్నట్టు లుక్కిస్తూ పాత్రకి తగ్గట్టు హూందాగా నటించింది. ఇక మూడో భార్యకి పెట్టాల్సిన అవలక్షణాలన్నీ పెట్టేశారు. పూర్తిగా సినిమాటిక్ విలనే. చివరి చాప్టర్లో వనితా విజయ్ కుమార్ ఈ పాత్రలో చాలా హంగామా చేస్తుంది. హీరో కృష్ణగా శరత్ బాబు
, విజయనిర్మలగా జయసుధ నటించారు.

సాంకేతికంగా నరేష్ మంచి పెట్టుబడి పెట్టారు. చాలా రిచ్ లుక్ వచ్చింది. సంగీతమే ఈ రిచ్ లుక్ తో అంతగా  పోటీ పడలేదు. దర్శకత్వంలో ఈ సారి ఎం ఎస్ రాజు ఓ మెట్టు పైకెక్కారు- అయితే చాప్టర్ల వారీ కథాకథనాల్లో అంతగా బలం లేదు. న్యూస్ రిపోర్టింగ్ చేస్తున్నట్టు వుంది.
—సికిందర్
       

 

 

1334 : రివ్యూ!


 

రచన - దర్శకత్వం : విజయ్
తారాగణం : విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్, పృథ్వీ రాజ్ తదితరులు
సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం : సందీప్ విజయ్
బ్యానర్ : శర్వంత్ రామ్ క్రియేషన్స్, శ్రీ షిర్డీ సాయి బాబా మూవీస్
నిర్మాతలు : రామాంజనేయులు, రాజశేఖర రెడ్డి
విడుదల : మే 27, 2023 (జియో సినిమా)
***

        టీవల విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ పరాజయం తర్వాత, బూ అనే హార్రర్ మూవీ తమిళ- తెలుగు భాషల్లో ఈ రోజు ఓటీటీలో విడుదలయింది. ఓటీటీ రంగంలోకి కొత్తగా ప్రవేశించిన జియో సినిమా దీన్ని ఉచితంగా అందిస్తోంది. విజయ్ అనే దర్శకుడు ఒక రాత్రి జరిగే ఈ హార్రర్ కథని గంటన్నర సినిమాగా తీశాడు. ఇందులో విశ్వక్ సేన్ తోబాటు ఐదుగురు హీరోయిన్లు కన్పిస్తారు. కనువిందు చేయడానికి అందాల హీరోయిన్ల శ్రేణి వుంది. థ్రిల్ చేయడానికి విశ్వక్ సేన్ వున్నాడు. ఇంకేం కావాలి? తారాగణంతోనే ఇంత ఊరిస్తున్న ఈ హార్రర్ తెరపైన ఎలా  వుందో చూద్దాం...

కథ

తల్లి వూరికెళ్ళిన అవకాశాన్ని తీసుకుని రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్స్ ని ఆహ్వానిస్తుంది ఆ రాత్రి హలోవీన్ పార్టీకి. ఆ రోజు అక్టోబర్ 31 హలోవీన్ నైట్ జరుపుకునే సందర్భం. రకుల్ ఇంట్లో అస్థిపంజరాలు, దెయ్యపు ఆకారాలూ అలంకరించి, దెయ్యాల్ని ఆహ్వానిద్దామని చెప్పి ఒక హార్రర్ పుస్తకం తీసి కథలు చెప్పడం మొదలెడుతుంది.  ఆ ఒక్కో దెయ్యం కథ నిజ జీవితంలో వాళ్ళ ముందుకొచ్చేసి బెదరగొడతాయి. అప్పుడు ఒక దెయ్యాన్ని వదిలించుకోవాలంటే ఇంకో దెయ్యం కథ చదవాలి. ఇలా చదువుకుంటూ పోతూంటే  పారానార్మల్ సైంటిస్టు విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఇప్పుడు ఈ కథ కీలకమైనది. ఈ కథ ఏమిటి? దెయ్యాల ఉనికి మీద ప్రయోగాలు చేసే విశ్వక్ సేన్, తను ప్రేమించిన ఒక్కో గర్ల్ ఫ్రెండ్ ని ఎలా కోల్పోతూ వచ్చాడు? చివరికి రకుల్ ప్రీత్ సింగ్ తోనే పెళ్ళి చూపులు జరిగే సరికి, రకుల్ ప్రీత్ సింగ్ ఏం చేసింది? ఈ హార్రర్ ప్రశ్నలకి సమాధానాల కోసం మిగతా సినిమా చూడాలి.

ఎలా వుంది కథ

అమెరికాలో, యూరప్ లో జరుపుకునే హలోవీన్ పండుగ ఇండియాలో అర్ధం లేకుండా కేవలం పిశాచాల మాస్కులేసుకుని భయపెట్టుకునే ఆటగా మార్చేశారు. పాశ్చాత్య దేశాల్లో వేసవి చివర్లో చేతి కందే పంటల్ని దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుకునేందుకు అక్టోబర్ 31న హలోవీన్ పండుగ జరుపుకుంటారు. ఆ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టేందుకే పిశాచాల మాస్కులేసుకుని నృత్యాలు చేస్తారు. దీన్ని రకుల్ ప్రీత్ సింగ్ ఇంకో అడుగు ముందుకేసి దెయ్యాల్ని ఆహ్వానించే ఆటగా మార్చేసింది.
        
అయితే ఆమె పుస్తకంలో చదివే కథలతో ఎపిసోడ్స్ ఆసక్తికరంగానే వున్నాయి. ఇవి భయపెట్టే విధంగా వుండవుగానీ, ఆసక్తి రేకెత్తిస్తాయి. ఉదాహరణకి నివేదా పేతురాజ్ ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు, నీకు వెక్కిళ్ళు వస్తాయా అనడుగుతుంది హార్రర్ ఫేసు గల ముసలవ్వ. రావని చెప్తుంది నివేద. తీరా ఇంట్లో దాహం వేసి నీళ్ళు లేక వెక్కిళ్ళు వస్తాయి. దాంతో దెయ్యం లేచి ఆమె పనిబడుతుంది.
        
ఇలాటి నాల్గు కథల తర్వాత విశ్వక్ సేన్ కథ వస్తుంది. ఇతను పారానార్మల్ సైంటిస్టుగా దెయ్యాలున్నాయా లేదా తేల్చడానికి ఒక కళ్ళు జోడు తయారు చేసి దాంతో ప్రయోగాలు చేస్తూంటాడు. ఇతడి ప్రయోగాలకి గర్ల్ ఫ్రెండ్స్ బలౌతూంటారు. ఇక ఇంకో బకరాగా రకుల్ ప్రీత్ సింగ్ తోనే పెళ్ళి చూపులు జరిగే ట్విస్టుతో ముగింపుకొస్తుంది కథ.
        
ఈ మొత్తం కథలో హార్రర్ దృశ్యాలేం భయపెట్టేవిగా వుండవు. కానీ సస్పెన్స్ తో ఆసక్తికరంగా వుంటాయి. విద్యుల్లేఖా రామన్ కామెడీ పాత్ర భయపడే చేష్టలతో ఇది హార్రర్ సినిమా సుమా అని గుర్తు చేస్తూ పోయారు.

నటనలు-సాంకేతికాలు

రకుల్ ప్రీత్ సింగ్ చదివే నాల్గు కథల తర్వాత ఐదో కథలో ఎంట్రీ ఇస్తాడు విశ్వక్ సేన్. అప్పటికి గంట సమయం గడిచిపోతుంది. అతడి ఎంట్రీ తర్వాత అరగంటే సినిమా వుంటుంది. గంటన్నర సినిమా కావడం ఒకటి, విశ్వక్ సేన్ గంటకి కనిపించడం వొకటి- ఇలా థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు హాహాకారాలు చేస్తారని కాబోలు ఓటీటీలో పడేశారు. అయితే విశ్వక్ సేన్ తన మాస్ యాక్షన్ కి దూరంగా సాఫ్ట్ గా, డీసెంట్ గా నటించాడు. కనిపించేది కాసేపే అయినా అర్ధవంతంగా నటించాడు.

        రకుల్ ప్రీత్ సింగ్ ది ఫన్నీ క్యారక్టర్. ఆమె ఫన్ కోసం పాల్పడే చర్యలు ఫ్రెండ్స్ ని భయపెట్టి చంపుతూంటాయి. పుస్తకంలోని ఒక కథతో దెయ్యంతో హార్రర్ లో ఇరుక్కోవడం, దానికి విరుగుడు ఇంకో కథ చదవడమేనని పుస్తకంలో చెప్పడంతో, ఇంకో కథా చదివి మళ్ళీ ఇరుక్కోవడం, అందులోంచి బయటపడేందుకు పుస్తకంలో చెప్పినట్టు ఇంకో కథా చదవడం... ఇలా ఆ పుస్తకం పన్నిన వలలో చిక్కుకుని గిలగిల కొట్టుకోవడం.
       
కానీ దెయ్యం కథల పుస్తకాలు ఎందుకో తెలుగులో వుండవు
, ఇంగ్లీషులోనే వుంటాయి ఫీల్ కోసం. మిగిలిన పాత్రల్లో నివేదా పేతురాజ్, మేఘా ఆకాష్, మంజీమా మోహన్, రేబా మోనికా జాన్ లు కథలకి న్యాయం చేశారు. విద్యుల్లేఖా రామన్ ఇది హర్రర్ సినిమా అని గుర్తు చేస్తూ వుండడానికి ఒకటే భయపడే కామెడీ చేసింది. పోలీస్ ఇన్స్ పక్టర్ గా వచ్చే పృథ్వీరాజ్ కి ముగింపులో చిన్న ట్విస్టు ఇస్తాడు.
       
ఈ గంటన్నర సినిమా ఆద్యంతం విజువల్ అప్పీల్ తో వుంది. వదలకుండా చూసేలా చేస్తుంది. విశ్వక్ సేన్
, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్లు వున్నప్పుడు ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వున్నాయి. ముఖ్యంగా కెమెరా వర్క్, ఎడిటింగ్, కళా దర్శకత్వం, మేకప్, కాస్ట్యూమ్స్, సీజీ వర్క్ క్వాలిటీతో వున్నాయి.
       
దర్శకుడు విజయ్ రైటింగ్
, మేకింగ్ పాత విలువలు జొరబడకుండా ఆధునిక దృక్పథంతో నిర్వహించడం ఈ హార్రర్ కి ప్లస్ అయింది. 2005 లో ఇదే టైటిల్ తో హాలీవుడ్ నుంచి హలోవీన్ హార్రర్ వచ్చింది. అది అర్ధం పర్ధం లేకుండా చీప్ హార్రర్ గా వుందని రివ్యూలున్నాయి. తెలుగు- తమిళ బూ మీద ఈ మచ్చ పడదని కి చెప్పొచ్చు.
—సికిందర్