రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, March 10, 2022

1145 : రివ్యూ !


రచన- దర్శకత్వం : పాండి రాజ్
తారాగణం ; సూర్య, ప్రియాంకా అరుళ్ మోహన్, వినయ్ రాయ్
, సత్యరాజ్, రాజ్ కిరణ్
సంగీతం: డి ఈమాన్
, ఛాయాగ్రహణం : ఆర్ రత్నవేలు
బ్యానర్ : సాన్ పిక్చర్స్
నిర్మాత : కళానిధి మారన్
విడుదల : మార్చి 10
, 2022
***

            టీటీలో రెండు వరుస హిట్లతో తిరిగి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న సూర్య, దాదాపు మూడేళ్ళ తర్వాత థియేటర్స్ కి తిరిగొచ్చాడు. లాక్ డౌన్ లో సురారై పోట్రు’, జైభీమ్ లతో ఓటీటీలో ఘన విజయం సాధించాక, ఈవారం థియేటర్ విడుదలగా ఈటీ (ఎవరికీ తలవంచడు) ని ప్రేక్షకులకి అందించాడు. దీనికి పాండిరాజ్ దర్శకుడు. ఫిబ్రవరి 25 న భీమ్లానాయక్ విడుదలకి ముందు రోజు తెలుగులో వలిమై విడుదలై ఫ్లాపయింది. తమిళంలో ఈ పోటీ లేకపోవడంతో హిట్టయ్యింది. తిరిగి ఇప్పుడు మార్చి 11 న రాధేశ్యామ్ విడుదలకి ముందు రోజు ఈటీ తెలుగు విడుదల కావడం వలిమై ఫలితాన్నేచవి చూస్తుందా? ఎందుకంటే దాదాపు శూన్యంగా వున్న అడ్వాన్సు బుకింగ్స్ చూస్తేనే తెలుస్తోంది. ఒక్క తమిళంలో రిలీజ్ చేసి వుంటే సమస్య వుండేది కాదు. పైగా హిందీ సహా ఇంకా ఇతర భాషల్లో పానిండియా రిలీజ్ చేసి ‘రాధేశ్యామ్’ మేనియా ముందు సవాలుగా నిలిచారు. ఇంతా చేస్తే సినిమాలో ఏమైనా విషయముందా? ఈ విషయం చూద్దాం...

కథ

కృష్ణమోహన్ (సూర్య) ఓ లాయర్. చిన్నప్పుడే అక్కని కోల్పోవడంతో ప్రతీ అమ్మాయినీ సొంత చెల్లెలిగా చూసుకుంటాడు (మరి హీరోయిన్ తో ఎందుకు ప్రేమలో పడ్డాడో?). ఆ చెల్లెళ్ళ సంక్షేమమే తన ధ్యేయంగా జీవిస్తూంటాడు. పక్కన ఇంకో ఊరు వుంటుంది. ఈ వూరుకీ, కృష్ణమోహన్ వాళ్ళ వూరికీ పడదు. ఈ పరిస్థితుల్లో ఆ వూరి అమ్మాయి ఆధీర (ప్రియాంకా అరుళ్ మోహన్) నే ప్రేమిస్తాడు. ఈ ప్రేమ సాగుతూ సాగుతూ వుండగా, వూళ్ళో అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలెడతారు. దీంతో కృష్ణమోహన్ దీని మీద దృష్టి పెడతాడు. అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుం
టున్నారు? దీని వెనుక ఎవరున్నారు? ఈ రహస్యం తెలుసుకుని నేరస్థుల్ని శిక్షించడానికి పూనుకుంటాడు.

ఎలావుంది కథ

ఆడవాళ్ళు తమ మీద అఘాయిత్యం జరిగితే సిగ్గుపడాల్సిన అవసరం లేదనీ, సిగ్గు పడాల్సిది అఘాయిత్యాలకి పాల్పడే మగాళ్ళేనని చెప్పే కథ. ఈ రోజుల్లో చాలా అవసరమైన కథ. ఇంతవరకే ఈ స్టోరీలైన్ అందం చందం. కథా కథనాలకి ఈ స్టోరీ లైన్ తో సంబంధం వుండదు. తమిళ స్టార్ సూర్య ఈ స్టోరీ లైన్ వినే సింగిల్ సిట్టింగ్ లో, నాకు ఇలాటి కథే కావాలని ఓకే చేసిన కథ. ఇది గర్వకారణంగా దర్శకుడు చెప్పుకునే విషయం. టూ స్టార్ రేటింగ్ కథని ఓకే చేయడానికి సింగిల్ సిట్టింగ్ చాలు. పానిండియా రిలీజ్ కి టూ స్టార్ రేటింగ్ సినిమా చాలు.

        ప్రేమ పేరుతో అమ్మాయిల్ని లొంగ దీసుకుని, అసభ్య వీడియోలు తీసే మగాళ్ళ భరతం పట్టే కథ. అలాటి మగాళ్ళని సిగ్గుపడేలా చేయాలనుకున్న కథ. అర్ధం లేని దృశ్యాలతో, బరువైన తమిళ సెంటిమెంట్లతో, అవసరం లేని హీరోయిజపు యాక్షన్ సీన్లతో, ముగింపుకి కూడా రాలేక సాగుతూ సాగుతూ సహన పరీక్ష పెట్టి- ప్రేక్షకుల్ని శిక్షించే వ్యధగా మారింది. రాకరాక ఇలాటి సినిమాతో సూర్య థియేటర్ కి రాకుండా ఓటీటీలో రిలీజ్ చేసి వుంటే సరిపోయేది.

నటనలు - సాంకేతికాలు

జైభీమ్ లోలాగా మరో లాయర్ పాత్ర సూర్య పోషించాడు. కానీ ఫస్టాఫ్ విషయం లేక, ఫ్యామిలీ సీరియల్ చూస్తున్నట్టు, లేడీస్ సెంటిమెంట్లతో లేడీస్ కి దగ్గరవాలని ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు ఒక్కటీ మాస్ కి కూడా బావుండవు. ఫ్యాన్స్ కి బోరుకొడతాయి. పాత సినిమాల్లోని రొటీన్ అరిగిపోయిన ప్రేమలు, అనుబంధాలు, చెల్లెలి సెంటిమెంట్లు... హీరోయిన్ తో పాత రెగ్యులర్ రోమాన్స్. సాంగ్స్. ఇంటర్వెల్ ముందువరకూ కథలోకి వెళ్ళడు. ఇంటర్వెల్ ముందు అమ్మాయిల ఆత్మహత్యలతో పాయింటు కొస్తాడు సూర్య.

        సెకండాఫ్ పూర్తిగా వరస మారిపోతుంది పాత్ర. యాక్షన్లోకి దిగిపోయి  దుర్మార్గుల్ని కొడతాడు. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ వేరే కథ అన్నట్టు క్యారక్టర్ ఎటెటో వెళ్ళి, కోర్టులో ప డతాడు జైభీమ్ లో లాయర్ లాగా. ఇక స్త్రీలతో అన్యాయాల గురించి కోర్టు సీన్లు. జైభీమ్ తర్వాత  ఇదే లాయర్ పాత్ర, ఇదే స్త్రీలతో అన్యాయం గురించి, ఇదే లాయర్ పాత్ర నటిస్తున్నాడని అన్పించలేదేమో!

        ఇక అర్ధం లేకుండా క్లయిమాక్స్ యాక్షన్ సీన్లు లాగి లాగి ఇరవై నిమిషాల పైగా బీభత్సం సృష్టిస్తాడు. సూర్య నటించిన చాలా మైండ్ లెస్ మూవీ ఇది. మొహంలో అద్భుతం గా, ఎంత ఎమోషన్స్ పలికించి ఏం లాభం- కథలో ఎమోషన్లు లేకపోతే. ఎవరికీ తలవంచడు అని తన గురించి చెప్పుకోవడం గాక, ఎవరికీ తలవంచకు అని అమ్మాయిలకి సూటి మెసేజ్ ఇవ్వలేకపోవడం దగ్గరే కథకేం న్యాయం చేశాడో తెలుస్తోంది. సూర్య చేసిన సాంగ్స్ కోసం, యాక్షన్ సీన్స్ కోసం ఫ్యాన్స్  కి పరిమతమయ్యే మూవీ.

        సూర్య సాంగ్స్ కోసం, ఫైట్స్ కోసం ఈ సినిమా చేస్తే, హీరోయిన్ ప్రియాంక గ్లామర్ ప్రదర్శన కోసం, సూర్యతో రోమాన్స్ కోసం సినిమా చేసింది. సత్యరాజ్ సూర్య తండ్రి. విలన్ వినయ్ రాయ్ మూస ఫార్ములా మినిస్టర్ కొడుకు. ఇక ప్రొడక్షన్ విలువలు రిచ్ గానే వుంటాయి స్టార్ సినిమాకి. రత్నవేలు కెమెరా, ఈమాన్ సంగీతం కూడా బాగానే వుంటాయి. బాగా వుండనిది షరా మామూలుగా కథొక్కటే.   

        దర్శకుడు పాండిరాజ్ పాత మూస కథనం, అనుకున్న కథకీ చూపించిన వరసకీ పొంతన లేకపోవడం, ఫ్యామిలీ సెంటి మెంట్లూ అంటూ చీటికీ మాటికీ అడ్డుపడడం- ఆడవాళ్ళూ మీకు జోహార్లు భరించిన తర్వాత, ఎవరికీ తలవంచడు కి తల వంచుకుని వెళ్ళవచ్చు వెళ్ళాలనుకుంటే.

—సికిందర్