రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, January 13, 2020

908 : రివ్యూ


        (ఈ రివ్యూ రెగ్యులర్ రివ్యూగా ఇవ్వడం లేదు. అంటే హీరో హీరోయిన్లు ఎలా నటించారు, కామెడీ ఎలా వుంది, ఫైట్లు ఎలా వున్నాయి, సంగీతమెలా వుంది, సాంకేతిక విలువలెలా వున్నాయి, దర్శకుడి పనితనమెలా వుందీ  మొదలైన ఉపరితల సంగతులు కాకుండా, వీటి మూలంలో కథా కథనాలెలా వున్నాయి, పాత్ర చిత్రణలు ఎలా వున్నాయన్న సంక్షిప్త సమాచారం మాత్రమే ఈ రివ్యూలో చూడొచ్చు)
       ముంబాయి పోలీస్ కమీషనర్ ఆదిత్యా అరుణా చలం (రజనీ కాంత్) నగరంలో అసాంఘిక శక్తుల్ని ఇష్టారాజ్యంగా ఎన్ కౌంటర్ చేసేస్తూంటాడు. మానవ హక్కుల కమిషన్ అతడి మీద చర్యకి పూనుకుంటుంది. ఈ సందర్భంగా అతను మానసికంగా సరిగాలేడని, అతడి గతం కారణమని తెలుస్తుంది. గతంలో అతడికో కూతురు వల్లి (నివేదా థామస్). ఈమె  రెండేళ్లప్పుడే భార్య చనిపోతే ఏ లోటూ రాకుండా పెంచాడు. ఇప్పుడా వల్లికి తండ్రి పెళ్లి చేసుకుంటే మంచిదని అన్పిస్తుంది. ఒకచోట లిల్లీ (నయన తార) ని చూసి ఈమే తగిన జోడీ అనుకుని తండ్రిని ప్రోత్సహిస్తుంది. తండ్రి ఆదిత్య వచ్చీరాని ప్రేమ సంభాషణలతో వల్లితో పాట్లు పడుతూంటాడు.

        ఇలా వుంటే, ముంబాయి కుర్రకారుని కబళిస్తున్న డ్రగ్స్ జాడ్యం మీద ఆదిత్య దృష్టి పడుతుంది. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ కూతుర్ని డ్రగ్ మాఫియాలు అపహరిస్తారు. ఈ కేసు తీసుకున్న ఆదిత్య మాఫియా రింగ్ ని ఛేదిస్తాడు. మాఫియాలు డ్రగ్స్ సరఫరాయే కాకుండా అమ్మాయిల అక్రమ రవాణాకి కూడా పాల్పడుతూంటారు. వాళ్ళకి విముక్తి కల్గిస్తాడు. మాఫియా లీడర్ అజయ్ మల్హోత్రా (ప్రతీక్ బబ్బర్) ని పట్టుకుని జైల్లో వేస్తాడు. ఇతను పారిశ్రామిక వేత్త విజయ్ మల్హోత్రా (నవాబ్ షా) కొడుకు. తర్వాత ఆదిత్య జైల్లో వున్న అజయ్ కోసం వెళ్ళినప్పుడు అతను అజయ్ కాదనీ, డూప్లికేట్ అనీ, అసలు అజయ్ థాయిలాండ్ పారిపోయాడనీ తెలుసుకుని షాక్ అవుతాడు. థాయిలాండ్ అధికారులతో మాట్లాడి అసలు అజయ్ ని వెనక్కి రప్పిస్తాడు. ఈలోగా  జైల్లో వున్న డూప్లికేట్ ని చంపేసి అజయ్ చావుని డిక్లేర్ చేసి అజయ్ ని ఇబ్బందుల్లో పడేస్తాడు. ఐతే అజయ్ కూడా ఇంకో సంఘటనలో చనిపోతాడు. అప్పుడు అజయ్ తన కొడుకు కాదని విజయ్ మల్హోత్రా అనుచరులకి అసలు సంగతి చెప్తాడు. అజయ్, హరి చోప్రా (సునీల్ శెట్టి) అనే అంతర్జాతీయ డ్రగ్ మాఫియా కొడుకు.
        కొడుకు చనిపోయాడని తెలుసుకుని హరి చోప్రా రహస్యంగా ఇండియా వచ్చి, తన కొడుకు చావుకి విజయ్ మల్హోత్రాని బాధ్యుడ్ని చేసి చంపేస్తాడు. పూర్వం ముప్పై ఏళ్ల క్రితం హరి చోప్రా ముంబాయిలో పోలీస్ స్టేషన్ ని తగులబెట్టి, చాలా మంది పోలీసుల్ని ఆహుతి చేసి పారిపోయాడు. పారిపోతూ చిన్న పిల్లాడిగా వున్న కొడుకుని విజయ్ మల్హోత్రాకి అప్పగించాడు. మల్హోత్రా సంరక్షణలో వున్న కొడుకు ఇప్పుడు చనిపోవడంతో, మల్హోత్రాని చంపి పగ దీర్చుకున్నాడు చోప్రా.
        అంతేగాక కొడుకు చావుకి కారకుడైన కమీషనర్ ఆదిత్యా మీద కూడా పగదీర్చుకోవాలని యాక్సిడెంట్ జరిపిస్తాడు చోప్రా. ఆదిత్య గాయపడతాడు. మెదడులో రక్తస్రావంతో కూతురు వల్లి చనిపోతుంది. దీనికి కారకుడు విజయ్ మల్హోత్రాయేనని అతణ్ణి చంపడానికి పోతే అతను చనిపోయాడని తెలుసుకున్న ఆదిత్య పిచ్చెత్తి పోతాడు. మరి వల్లిని చంపిందెవరు? ఇది తెలీక కన్పించిన క్రిమినల్స్ నల్లా కాల్చి చంపడం మొదలెట్టాడు. ఇదీ గతం.
        ఇప్పుడు చనిపోయిన వల్లి ఫోన్లో వున్న సమాచారంతో హంతకుడి వివరాలు తెలుసుకుని వేట మొదలెడతాడు ఆదిత్య. చివరికి అతణ్ణి పట్టుకుని చంపి పగదీర్చుకుంటాడు. ఈ క్రమంలో దొరక్కుండా చోప్రా వేసిన కొన్ని ఎత్తుల్ని చిత్తు చేస్తాడు.
ఇద్దరు విలన్లతో ఆపద

       
సూపర్ స్టార్ రజనీ కాంత్ కోసం దర్శకుడు మురుగ దాస్ చేసిన రొటీన్ కథే. ఈ కథతో వచ్చిన ప్రధాన సమస్యేమిటంటే ఇద్దరు విలన్లు వుండడం. ఇద్దరు విలన్లతో కథలు నిలబడవని కాదు, ఇద్దరూ ఒకటవ కృష్ణుడు, రెండో కృష్ణుడు బాపతుగా ఒకరు పోయాక ఇంకొకరు  వస్తేనే సమస్యంతా. ఇద్దరూ ఒకే గోల్ తో ఒకే సమయంలో ఒకే గ్యాంగ్ గా, సిండికేట్ గా ఆపరేట్ చేస్తే సమస్య రాదు. వాళ్ళు ఉమ్మడి శత్రువులుగా ఒకే టార్గెట్ గా హీరోకి వుంటారు కాబట్టి. ఇలాకాక హీరోని ఒక ఇబ్బంది పెట్టి ఒక విలన్ హీరో ప్రమేయం లేకుండానే చనిపోయి, హీరోని ఇంకో ఇబ్బంది పెడుతూ రెండో విలన్ వస్తే, ఈ విడివిడి రాకలు విడివిడి కథలవుతాయి- మొదటి కథ హీరో ముగించని కథవుతుంది, మొదటి విలన్ తన ప్రమేయం లేకుండా చనిపోయాడు కాబట్టి. అంటే ఒక కథ ముగిసి ఇంకో కథ మొదలవడం. అంటే స్టాప్ అండ్ స్టార్ట్ బాపతు డాక్యుమెంటరీ కథనం, లేదా ఎపిసోడిక్ కథనాలవుతాయి. దీంతో ఎడతెగని ఒకే ధారగా ప్రవహించాల్సిన ఒకే కథ, మధ్యలో ఒక పాయగా విడిపోయి వీగిపోవడమన్న మాట. దీన్ని మల్టిపుల్ విలన్ సిండ్రోం అంటారు.
        ‘సాహో’ లో లెక్కలేనంత మంది విలన్లు. వాళ్ళ లెక్కలేనన్ని విలనిజాలు. ఇలాకాక వాళ్ళందరూ ఒకే కథతో, ఒకే ఎజెండాగా వుండి వుంటే మూకుమ్మడిగా, లేదా వరుసబెట్టి వాళ్ళని ఊచకోత కోసే బలమైన కథతో హీరో రక్తి కట్టించ గల్గే వాడు. హాలీవుడ్ ఫాంటసీ -సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మల్టిపుల్ విలన్స్ వుంటారు. ఇవి ఎక్కువగా కామిక్ బుక్స్ సిరీస్ ఆధారంగా తీసినవై వుంటాయి. ఈ మల్టిపుల్ విలన్స్ ఒక సిండికేట్ గా ఏర్పడి వుంటారు. లేదా ఒక మెయిన్ విలన్ వుంటూ మిగిలిన వాళ్ళు ఆ విలన్ కి ఏజెంట్లుగా వుంటారు. వీళ్ళందరికీ హీరోతో ఒకే సమస్యతో సంబంధం / పోరాటం వుంటుంది.
        ‘అలీటా’ (2019) లో చూడనే చూశాం: ఇందులో చీఫ్ విలన్ గా నోవా పైలోకాల్లో వుంటాడు. భూమ్మీద అతడి ఏజెంటుగా వెక్టర్ వుంటాడు. ఇతడి కింద హంటర్ వారియర్స్ అనే గ్రూపు వుంటుంది. వెక్టర్ ముఖ్య ఏజెంటుగా జపాన్ వుంటాడు. ఇంకా వెక్టర్ అనుచరుడుగా సైబోర్గ్ అనే రాక్షసుడు వుంటాడు. వీళ్ళంతా భూమ్మీద పాపుల్ని ఏరేస్తూంటారు. ఎవరైనా పైలోకాలని దర్శించాలంటే మోటార్ బాల్ అనే మృత్యుక్రీడ గెలవాల్సి వుంటుంది. స్వర్గతుల్యమైన పై లోకాలకి ఎవరూ రాకుండా అడ్డుకునేందుకే నోవా చేసిన ఏర్పాట్లు ఇవి. ఇప్పుడు అలీటా ఈ అడ్డంకుల్ని దాటుకుని అక్కడికెలా చేరుకుందనేదే కథ.
        ఈ కథలో నోవాకి ఏదో తేడా వచ్చి వెక్టర్ ని చంపేస్తే కథెలా వుండేది? అలీటా అనే యాక్షన్ హీరోయిన్ కథ తెగిపోయేది. తను చేయాల్సిన పని ఇంకొకరు చేస్తే అలీటా పాత్రకూడా పాసివ్ అయ్యేది. రజనీకాంత్  పాత్రతో ఇదే జరిగింది. రజనీకాంత్ పోషించిన కమీషనర్ ఆదిత్య పాత్ర ఎదుర్కొంటున్న విజయ్ మల్హోత్రా అనే విలన్ పాత్రని, రవి చోప్రా అనే ఇంకో విలన్ పాత్ర మధ్యలో వచ్చి చంపేయడంతో, ఆదిత్య ఆటలో అరటి పండు అయిపోయాడు. మల్హోత్రాని ఆదిత్యానే చోప్రాకి చెప్పిమరీ  చంపేసి వుంటే, హీరోయిజం పెరిగి- ఈ ఇంటర్వెల్ సెకండాఫ్ ని నిలబెట్టేది ఇక చోప్రాని చంపే కొనసాగింపు కథతో.
        ఇంటర్వెల్లో ఏం చేస్తున్నామన్నదే చాలా ముఖ్యం. ఇంటర్వెల్లో కథని తెగ్గ్గొడుతున్నా మేమో చూసుకోకపోతే సినిమాని చేతులారా నరికి పోగులు పెట్టుకోవడమే. ఇంటర్వెల్ ప్రమదాలెలా వుంటాయో, ఎన్నుంటాయో ఈ బ్లాగులోనే ఇలాటి సందర్భాలు వచ్చినప్పుడల్లా చెప్పుకుంటూనే వున్నాం. సెకండాఫ్ సిండ్రోం, మిడిల్ మటాష్, నిట్టని లువునా స్క్రీన్ ప్లే ఫ్రాక్చర్ మొదలైనవి.
        సినిమాలో ఆదిత్య, మల్హోత్రా, చోప్రా పాత్రల బలాబలాల సమీకరణ ఎలా వుందో చెప్పుకుంటే, ఆదిత్య డ్రగ్ దందా మూలాలు వెతుకుతున్నప్పుడు విలన్ గా మల్హోత్రా తెరపైకొచ్చాడు. అతడి కొడుకు అజయ్ దొరికాడు. వాణ్ణి చంపేసి మల్హోత్రాకి షాకిచ్చాడు. ఇప్పుడు చోప్రా అనే ఆదిత్యకి తెలియని కొత్త విలన్ వచ్చి మల్హోత్రాని చంపేశాడు. తర్వాత ఆదిత్య మీద హత్యా ప్రయత్నం చేస్తే ఆదిత్య కూతురు చనిపోయింది. దీంతో దీనికి కారకుడు మల్హోత్రాయే అనుకుని ఆదిత్య చంపడానికెళ్ళి అప్పటికే చచ్చాడని తెలుసుకున్నాడు. ఎవరు చంపారో తెలీక పిచ్చెత్తిపోయి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాడు...
        బలాబలాల సమీకరణ ఆదిత్య - మల్హోత్రాల మధ్యనే  వున్నట్టు ప్రేక్షకులు నమ్మేట్టు చేశారు. ఈ సమీకరణలో మల్హోత్రాని కొత్త సమీకరణ ప్రారంభిస్తూ కొత్త విలన్ చోప్రా చంపేయడంతో, ఈ కొత్త సమీకరణ ప్రేక్షకులకి మాత్రమే తెలుస్తోంది, కొత్త విలనెవరో తెలీని ఆదిత్యకి కాదు. దీంతో ఈ సమీకరణలో క్రియాత్మక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యమెలాంటి
దంటే, ఫస్టాఫ్ లో ఇంకా విలన్ మల్హోత్రా ఎంట్రీ ఇచ్చే వరకూ వుండే శూన్యం లాంటింది. ఫస్టాఫ్ లో విలన్ ప్రవేశించేవరకూ శూన్యమే వుంటుంది, ఇది సహజం.
        ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ లో కూడా శూన్యమే ఏర్పడిందంటే ఇది అసహజం. బాక్సాఫీసుకి అసహనం. ఫస్టాఫ్ లో హీరోకి విలన్ ని ఎటాచ్ చేయడానికి ఎలా ఎంత సేపూ కథనం చేసి శూన్యాన్ని భర్తీ చేశామో, సెకండాఫ్ లో హీరోకి కొత్త విలన్ని ఎటాచ్ చేయడానికీ అలా అంత సేపూ కథనం చేయాలన్న మాట. అంటే ఫస్టాఫ్ లో బిగినింగ్ విభాగపు కథనమే మళ్ళీ సెకండాఫ్ లో కూడా ఇలా బిగినింగ్ విభాగపు కథనమే అవుతుందన్న మాట. అంటే మొదటి విలన్ తో మిడిల్లో పడ్డ కథ తెగిపోయి, లేదా ఆగిపోయి, మళ్ళీ వెనక్కి వచ్చి, కొత్త విలన్ తో మళ్ళీ బిగినింగే చెప్పుకునే అగత్యానికి దారి తీయడమన్న మాట. అంటే కథకుడు స్ట్రక్చర్ జ్ఞానం లేకుండా ఎంత సేపూ ఫస్టాఫ్ తర్వాత ఫస్టాఫే  రాసుకుంటూ కూర్చుంటున్నాడన్న మాట. ఇలాటి కథకుణ్ణి ఏమనాలి? మూడో విలన్ అనాలా?
        ఇలా స్క్రీన్ ప్లేల్లో కొత్త కొత్త వింత సమస్యలు తెచ్చి పెడితే వీటిని వివరించాలంటే కొత్త కుస్తీపట్లు పట్టాల్సి వస్తోంది. స్ట్రక్చర్ జ్ఞానం లేని కథకులు మామూలోళ్ళు కాదు, ఏ కథలో ఏ కొత్త చిక్కుముళ్ళు పెట్టి ముప్పు తిప్పలు పెడతారో తెలీదు. కథకుడ్ని పడుకోబెట్టి కోసి చూసినా, ఏం రాతకోతలు చేసి కథనలా తగులబెట్టాడో అంతుబట్టదు. వీటి విశ్లేషణలు రాయాలంటే ఇలాటి కథకుల మీద భారీ పెనాల్టీలు విధించాల్సిందే.
రెండూ ఫస్టాఫులే
      రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ మూవీ ఇన్వెస్టిగేషన్ జానర్ కథగా వుండాలని ఎవరూ కోరుకోరు. యాక్షన్ కథగానే వుండాలనుకుంటారు. కానీ ఈ ‘దర్బార్’ లో ఫస్టాఫ్ యాక్షన్ కథగా వుంటూ, సెకండాఫ్ కొత్త విలన్ చోప్రా ఎవరనే తెలుసుకునే ఇన్వెస్టిగేషన్ కథనంగా మార్చేశారు. అసలే కథలో కొత్త విలన్ తో సెకండాఫ్ మళ్ళీ బిగినింగ్ కే వచ్చిందనుకుంటే, దీన్నికూడా  యాక్షన్ జానర్లోనే పెట్టక, తీరుబడిగా చేసుకునే ఇన్వెస్టిగేషన్ కథగా చేసి, ఎక్కడేసిన గొంగళి చేశారు కథని.
        ఇంకోటేమిటంటే, ఫస్టాఫ్ లో ప్రారంభమైన ఫ్లాష్ బ్యాక్ సెకండాఫ్ లో ఇంకా చివరి అరగంట వరకూ కొనసాగడం. పైగా ఇందులో ఇన్వెస్టిగేషన్ మొదలెట్టడంతో మళ్ళీ ఆదిత్యకి కొత్త విలన్ తో ఎటాచ్ మెంట్ ఇవ్వడానికి ఆ సమయమంతా పట్టడం. ఇలా ఈ కథనం కూడా బిగినింగ్ విభాగపు కథనంలాగే తయారయ్యింది. బిగినింగ్ విభాగంలో వుండేది కథకాదు, మిడిల్లో ప్రారంభమవబోయే కథకి ఉపోద్ఘాతం మాత్రమే.  అందువల్ల ఇక్కడ సెకండాఫ్ లో మళ్ళీ ఉపోద్ఘాతమే మొదలుయ్యింది. దీంతో సెకండాఫ్ విషయం లేక బోరు కొట్టడానికి కారణమైంది. అసలీ సెకండాఫ్ లో వుండాల్సింది ప్రారంభం నుంచీ హీరో విలన్ల మధ్య సంఘర్షణతో కూడిన మిడిల్ విభాగపు బిజినెస్సే.
        విలనెవరో ప్రేక్షకులకి తెలుస్తూ ఇంకా హీరోకి తెలియకపోవడం, హీరో తెలుసుకోవడం ఫస్టాఫ్ లోపు జరిగిపోవడం కథాన్యాయం. అంటే ఫస్టాఫ్ లో జరిగిపోవాల్సిన డైనమిక్స్, సస్పెన్స్, థ్రిల్ ఏదైతే అది. ఇలా ఫస్టాఫ్ కల్లా హీరో విలన్లు ముఖాముఖీ అయిపోవాలి. ఇంకా హీరో విలన్ తో దాపరికాలుండకూడదు. దీన్ని ఎత్తి సెకండాఫ్ లో పెడితే, అప్పటికి విలన్ తో ముఖా ముఖీ యాక్షన్లో వుండాల్సిన హీరో, ప్రేక్షకులకంటే చాలా వెనుకబడిపోయి బోరు కొట్టిస్తాడు.  
        సెకండ్ విలన్ చోప్రాతో తో సెకండాఫ్ లో రివీలయ్యే అతడి పూర్వ కథ కూడా పెట్టారు. ముప్ఫై ఏళ్ల క్రితం పోలీస్ స్టేషన్ తగులబెట్టి పోలీసుల్ని చంపి పారిపోయిన గతం. ఇదిప్పుడెవరికవసరం. ఇప్పుడు ఆదిత్య కూతుర్ని చోప్రా చంపిన కథా కథానాలే అవసరం. హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు సింపుల్ లైను కథమీద భారీ యాక్షన్ తో వుంటాయి. ఎందుకలా వుంటాయి? భారీ యాక్షన్ కి, కథ కూడా భారీగా, రకరకాలుగా వుంటే చూసే ప్రేక్షకులు మానసిక అలసటకి గురై ఇటు కథనీ, అటు యాక్షన్నీ దీన్నీసరీగ్గా ఎంజాయ్ చేయలేరు గనుక. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. అయినా స్క్రీన్ ప్లే రచనలో ఆడియెన్స్ సైకాలజీ ఒక ముఖ్య భాగమన్న విషయం మనకి పట్టడం లేదు.
        ‘దర్బార్’ కథ సింపుల్ గా చెప్పుకుంటే, చోప్రా మహాశయుడి ముప్పై ఏళ్ల నాటి ఘనకార్యం ఓపెనింగ్ టీజర్ వేసేసి, ఆదిత్యతో ఎన్ కౌంటర్లు చేయిస్తూ, అజయ్ ని చంపి, మల్హోత్రా మీదికిపోయినప్పుడు, చోప్రా వచ్చేసి ఆదిత్యకి తెర వెనుక అసలు విలన్ బయటపడితే, సెకండాఫ్ విలనీ విరిగిపోదు. కథ విరిగి అతికించుకునే పనుండదు. ఇన్వెస్టిగేషన్ అగత్యముండదు. పూర్తి స్థాయి యాక్షన్లోనే వుంటుంది కథ.
        ఈ యాక్షన్లో రెండు బలమైన పిల్లర్ సన్నివేశాలున్నాయి. ఫస్టాఫ్ లో జైల్లో అజయ్ బదులు డూప్లికేట్ వున్నప్పటి డ్రామా, సెకండాఫ్ లో ఆదిత్య కూతురు చనిపోయినప్పటి భావోద్వేగం. ఈ స్క్రీన్ ప్లే బలానికి మురుగ దాస్ ఏవైనా కనిపెడితే ఈ రెండు పిల్లర్లే కనిపెట్టాడు. ప్రమాదంలో ఆదిత్య స్పృహ కోల్పోయి ఐదు గంటలవరకూ కోలుకోని స్థితి, స్పృహలోనే వున్న కూతురు మెదడులో రక్త స్రావంతో రెండు గంటల్లో మరణించే విషాదం. అయితే కూతురి పాత్రచిత్రణ మొదట్నుంచీ అల్లాటప్పాగానే వుంది. ఎప్పుడు చూసినా పనీపాటా లేనట్టు తండ్రితోనే వుంటుంది. తండ్రితోనే తిరుగుతూంటుంది. ఈ మూస ఫార్ములాలోంచి నేటి కెరీర్ వుమన్ గా బయటికి తెచ్చే చిత్రణ చేయలేదు. మురుగదాస్ చేసింది ఎప్పటివో రజనీకాంత్ సినిమాల తీరుతెన్నుల్నే మళ్ళీ తిరగేయడం. పనీపాటా లేకపోయినా కూతురికో ఆశయమంటూ వుంది, తండ్రి పెళ్లి చేయాలని. ఈ ఆశయం తీరకుండానే చనిపోయింది. అయితే చనిపోయేప్పుడు దీని వూసే వుండదు. దీని తాలూకు తపనే వుండదు. తను చనిపోబోయే రెండు గంటల్లోగా లిల్లీని పిలిచి కమిట్ చేయించి చనిపోవచ్చు. ఆమెకి మురుగదాస్ ప్రయోజనంలేని మరణమే ఆమెకి కరెక్ట్ అనుకుని శిక్షించినట్టుంది.
***
         ‘డెత్ విష్’ అనే సంచలనాత్మకంలో ఛార్లెస్ బ్రాన్సన్ కూతురి మీద అఘాయిత్యం చేసిందెవరో తెలీక, రాత్రి పూట సంచరిస్తూ కనపడిన అసాంఘీక శక్తుల నల్లా ట్రాప్ చేసి కాల్చి చంపుతాడు. ‘దర్బార్’ లో రజనీకాంత్ కూతుర్ని చంపిందెవరో తెలీక మానియక్ లా మారి ఎన్ కౌంటర్లు చేస్తూంటాడు. ఈ పోలికలతో  మొదటిది సీక్వెల్స్ కి దారితీసింది. రెండోది వున్న దాంట్లోనే ఎపిసోడ్స్ కి దారితీసింది. ఎపిసోడ్లు సినిమా అవదు, సీక్వెన్సులు సినిమా అవుతాయి. ఒకే కథని అల్లుకుంటూ పోతాయి. స్ట్రక్చర్ ఎన్నో అల్లికల్ని దారిలో పెడుతుంది.
సికిందర్