రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, June 20, 2023

1347 : మినీ కాన్ఫ్లిక్ట్ సంగతులు


థియేటర్లు వుండాలా,మూతబడాలా? ప్రేక్షకులు థియేటర్లకి కి రావాలా, ఓటీటీలకి అంకితమైపోవాలా? మేకర్లు థియేటర్ సినిమాలు తీయాలా, వెబ్ సిరీస్ - మూవీస్ తో సరిపెట్టుకోవాలా? మేకర్లు మూవీ మేకర్లుగా కొనసాగాలా, మూవీ కిల్లర్స్ గా అవతార మెత్తాలా? వంద సినిమాల కాలం పోయి 250 సినిమాలు తీస్తున్నప్పుడు, విజయాల శాతం అదే 8% వుండాలా, పెరగాలా? ఈ ప్రశ్నలు వేసుకోవాలా, ప్రశ్నల్ని తొక్కేసి అవే స్క్రిప్టులు అలాగే రాసుకుంటూ పోవాలా? ఏం చేయాలి? ఇవన్నీ కాదు, సినిమాల పట్ల చాలా సిన్సియర్ గానే వున్నా, మార్పు కోసం ఇంకేం చేయాలో అర్ధంగావడం లేదా?


అంటే రాయాలనుకుంటున్న కథలో ప్లాట్ పాయింట్ వన్ ఆలస్యమవుతోందా?  ఎక్కువ సినిమాల్లో వస్తున్నట్టు ఫస్టాఫ్ కామెడీ, సెకండాఫ్ కథ అనే శ్రమ లేని మూస పద్ధతే తప్పడం లేదనుకుంటున్నారా? ప్రతీ క్షణం విలువైనదిగా కొలిచే సోషల్ మీడియా కాలంలో కూడా, ప్లాట్ పాయింట్ వన్ ని ఆలస్యం చేసి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించక తప్పడం లేదా? లేదా ప్లాట్ పాయింట్ వన్ నిర్ధారిత కాలావధి పట్ల సిన్సియర్ గా వుంటూనే కథ చేస్తూంటే, సెటప్ కి సంబంధించి వివిధ కారణాల వల్ల నిడివి  చేయి దాటిపోతోందా? ఇలాంటప్పుడు ఏం చేయ వచ్చో గత ఆర్టికల్లో తెలుసుకున్నాం (కథలేని ఫస్టాఫ్ లో కథ ఎలా?’- ఆర్టికల్ 1312, మార్చి 14.20 23). ప్లాట్ పాయింట్ వన్ కాలావధిని అరగంట దాటి ముప్పావుగంట, గంట, ఆపైన ఇంటర్వెల్ వరకూ సాగదీయడమంటే అప్పటి వరకూ కథ ప్రారంభించకపోవడమే. అంటే ప్రేక్షకుల టైము, నిర్మాతల బడ్జెట్ వృధా చేయడమే.

హిందీ సినిమాల్లో కొత్తగా రాయగల, తీయగల టాలెంట్  అంతా వెబ్ సిరీస్ కి తరలిపోవడంతో బాలీవుడ్ లో సృజనాత్మక క్షామం ఏర్పడింది. ఏం రాస్తున్నారో, ఏం తీస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. మార్చి వరకూ విడుదలైన 24 చిన్నా పెద్ద సినిమాల్లో ఏదీ హిట్ కాలేదు పఠాన్ తప్ప. దీంతో మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూత పడే పరిస్థితి ఏర్పడింది. తెలుగులో ఈ పరిస్థితి రాదనుకోవడం పొరపాటు. కేరళలో ఈ పరిస్థితితో సినిమాల ప్రదర్శనలకే వ్యతిరేకంగా వున్నారు ఎగ్జిబిటర్లు.
                                   
ఒకవైపు స్వదేశీ ఓటీటీలతో బాటు, గ్లోబల్ ఓటీటీ దిగ్గజాలైన కంపెనీలు అగ్రశ్రేణి కంటెంట్‌ ని ఉత్పత్తి చేయడంలో, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో భారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎక్కువ మార్కెట్ వాటా కోసం తీవ్రంగా పోటీ పడుతున్న వేళ-టాలీవుడ్ లో అగ్రశ్రేణి కంటెంట్ అన్న మాటే మరచి, ప్రేక్షకుల్ని పెంచుకోవడం గురించి, అట్టర్ ఫ్లాపు సినిమాలతో థియేటర్లు మూతబడకుండా చూడడం గురించీ, ఎలాటి సర్వేలూ అధ్యయనాలూ బాదరాబందీ లేకుండా, కాలం వెళ్ళబుచ్చగలననుకోవడం తీవ్ర పొరపాటే అవుతుంది.

మాస్టర్ క్రియేటర్లు

అహింస అనే ఫ్లాప్ సినిమా తీసిన దర్శకుడు తేజతో తను నటిస్తున్న సినిమాకి బాలీవుడ్ రచయితల సహకారం తీసుకోవాలని రానా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇందుకే వచ్చింది. తెలంగాణా సినిమా అంటూ తెలంగాణా దర్శకులు తీస్తున్న సినిమాలు తెలంగాణానే  వెక్కిరిస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలు వదిలించుకున్న యూత్ సినిమాల ఫార్ములాల్నే తిరిగి తెలంగాణా సినిమాల్లోకి దించేసి సంబరపడే పరిస్థితి.

ఈ పరిస్థితుల మధ్య 
కామన్ సెన్స్  స్క్రిప్టు తయారీపై దృష్టి పెట్టి తీవ్ర కృషి చేయకపోతే, స్క్రిప్టుల సామర్ధ్యానికి కొత్త మార్గాలు అన్వేషించకపోతే, తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లు మూతబడే కాలం ఎంతో దూరంలో లేదు. స్క్రిప్టు ఆరోగ్యం = థియేటర్ల ఆరోగ్యం. అయితే  ఎంత త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో పద్ధతిగా కథ చేసినా దానికి ఈ రోజుల్లో గ్యారంటీ లేదనేది కూడా వాస్తవం.

ప్లాట్ పాయింట్ వన్ వరకూ ఫస్ట్ యాక్ట్, ఆ ఫస్ట్ యాక్ట్ లో  లొడబిడ మంటూ కొన్ని పాత్రలూ, రణగొణ ధ్వనులు చేస్తూ కొంత కామెడీ, ఓ రెండు పాటలూ అయ్యాక,  అప్పుడు ప్లాట్ పాయింట్ ఘట్టం వేసి, ఎదుటి పాత్రతో సంఘర్షణ ప్రారంభిస్తూ హీరోకో గోల్ పెట్టి, సెకండ్ యాక్ట్ ప్రారంభించడమూ; సెకండ్ యాక్ట్ లో హీరోకి ఎదుటి పాత్రతో గోల్ తాలూకు సంఘర్షణ సాగదీసి సాగదీసి, ప్లాట్ పాయింట్ టూ తో సెకండ్ యాక్ట్ ని ముగించడం; ఆ ప్లాట్ పాయింట్ టూ దగ్గర్నుంచీ క్లయిమాక్స్ తంతుతో థర్డ్ యాక్ట్ ముగించి, హీరో గోల్ సక్సెస్ చేయడమూ- వంటి ఒకే పోతలో పోసిన ఒకే సాంప్రదాయ నమూనా కథలు ఇంకెన్నాళ్ళూ వర్కౌట్ కావని గుర్తించాలి.


త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ అంటే ఓ మూడు అరలు పెట్టుకుని, ఏ అరకి సంబందించిన సీన్లు ఆ అరలో వడియాల పిండి పడేసినట్టు పడేస్తూ చేతులు దులుపుకోవడం ఇకపైన చెల్లక పోవచ్చు. ప్రేక్షకులు అరచేతిలో రకరకాల గ్లోబల్ సినిమాలు చూస్తున్నారు. చూడడమే కాదు, వాటిని సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. వాళ్ళకిప్పుడు ఏదో మేత పడేసే పరిస్థితుల్లేవు, తాము వెచ్చిస్తున్న సమయానికి తగిన మేధ పడేసే చేతులు కావాలి. క్రియేటివిటీ అంటే వున్న త్రీయాక్ట్స్ స్ట్రక్చర్లో సీన్ల ఓపెనింగులు, రన్నింగులు, ముగింపులులో తేడా గల రాత, తీత చూపించడం ఇంకెంత మాత్రం కాదు. ఇప్పుడు క్రియేటివిటీ అంటే అసలు త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ తోనే క్రియేటివిటీకి పాల్పడడం. స్ట్రక్చర్లో సవరణలు తీసుకు రావడం. కాబట్టి ముందసలు ఎవరి క్రియేటివిటీ యేంటో స్ట్రక్చర్ తో చేసి చూపించగలిగితే అప్పుడు వాళ్ళని మాస్టర్ క్రియేటర్లుగా ఒప్పుకోవచ్చు.

యూట్యూబ్ షార్ట్స్

ఫస్ట్ యాక్ట్ ని అరగంట పరిమితికి మించి ఇంటర్వెల్ వరకూ సాగదీయాల్సి వస్తే- థియేటర్లు మూతబడకుండా కాపాడే 12 స్క్రీన్ ప్లే టిప్స్ గురించి ఆర్టికల్ 1312 లో తెలుసుకున్నాం. అంతదాకా ఎందుకు, అసలు 30 నిమిషాల పరిమితి తీసుకోవడం కూడా సోషల్ మీడియాల కాలంలో, యూట్యూబ్ షార్ట్స్ కి నవతరం అలవాటు పడిన కొత్త సన్నివేశంలో- ఫస్ట్ యాక్ట్ నే సెల్యూలాయిడ్ షార్ట్స్ గా ఎందుకు మార్చేయ కూడదు? సెల్యూలాయిడ్ వచ్చేసి సృజనాత్మకంగా సోషల్ మీడియాతో యుద్ధానికి దిగకపోతే ఇక సెల్ ఫోన్లే మిగిలి, థియేటర్లు మూతబడతాయి.

స్టార్లు థియేటర్లని నిలబెడతారనేది ఒట్టి మాట. ప్రేక్షకులు థియేటర్లకి రావాలంటే మామూలు హీరోల సినిమాలు సరిపోవడం లేదు. ఓ మోస్తరు స్టార్ సినిమాలు కూడా చాలడం లేదు. బిగ్ స్టార్ సినిమాలుంటేనే ప్రేక్షకులు థియేటర్లకి కదులుతున్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి’, నాని నటించిన దసరా’- ఈ మూడు సినిమాలకే ఈ ఆరునెలల్లో ప్రేక్షకులు పోటెత్తారు. ఇవ్వాళ ప్రభాస్ తో ఆదిపురుష్ కలుపుకుంటే నాలుగు.

ఇక ఎంతో బావుందని టాక్ వస్తేనే చిన్న హీరోల సినిమాలకి వస్తున్నారు. సాయిధరం తేజ్ విరూపాక్ష’, సుహాస్ రైటర్ పద్మభూషణ్’, ప్రియదర్శి బలగంసినిమాలకి అలా థియేటర్లు నిండాయి. కానీ గోపీచంద్, అల్లరి నరేష్, నాగశౌర్య, విశ్వక్ సేన్, సంతోష్ శోభన్, కిరణ్ అబ్బవరం తదితర  హీరోల కొత్త సినిమాలకైతే జనమే లేరు. ఇలాటి సినిమాలే ఎక్కువున్నాయి. దీంతో గరిష్ట కాలం థియేటర్లు బోసి పోయి వుంటున్నాయి. ఇక థియేటర్ల లోపల పార్కింగులు, పాన్ షాపులు, తినుబండారాల స్టాల్సు మనుగడ సంగతి చెప్పక్కర్లేదు.

దేశం మొత్తం మీద ఏప్రెల్‌లో థియేటర్లలో ఆక్యుపెన్సీ కేవలం 16-19 శాతం వుందని, జూన్‌లో దాదాపు 20-25 శాతం మధ్య వుండొచ్చనీ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల పరిస్థితి ఇలాగే వుంది కానీ మీడియాలో వార్తలు రావడం లేదు. థియేటర్ల పరిస్థితి బాగు పడాలంటే, ఎక్కువ సంఖ్యలో విడుదలై థియేటర్లకి ఫీడింగ్ నిస్తున్న చిన్న హీరోల సినిమాల క్వాలిటీ పెరగాల్సిందే.

ఎలా పెరుగుతుంది? ముందు కాగితం మీద పెరగాలి. అంటే హై క్వాలిటీ పాలీక్రోమ్ కొరియన్ పేపర్లు కొనుక్కుని వాటి మీద గుండ్రటి అక్షరాలు తీర్చి దిద్ది రాయడం కాదు. పైన 30 నిమిషాల ఫస్ట్ యాక్ట్ లోనే యూట్యూబ్ షార్ట్స్ లాగా ఎందుకు క్రియేట్ చేయకూడదనుకున్నాం. అంటే ప్రేక్షకులు కథ ప్రారంభమవడానికి అరగంట వరకూ కూడా ఓపిక పట్టకుండా, ఆ అరగంటలో ఇంకో బిజినెస్ ప్రారంభించి దృష్టి మరల్చడం. అంటే కథ ప్రారంభించడానికి ముందు ఇంకో కథని ఫస్ట్ యాక్ట్ లోనే సర్దడం. అలా అరగంట ఫస్ట్ యాక్ట్ ని కూడా విషయం తో టైట్ గా వుంచడం. ఇదెలా?

మినీ కాన్ఫ్లిక్ట్

జాగ్రత్తగా గమనిస్తే త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ ఫస్ట్ యాక్ట్ లో హీరో పాసివ్ గానే వుంటాడు. తర్వాత సెకండ్ యాక్ట్, థర్డ్ యాక్టులలో యాక్షన్లో వుండే సరికి హీరో యాక్టివ్ క్యారక్టర్ గా వున్నాడని తృప్తి పడతాం. దీన్నే మొత్తం సినిమాకీ వర్తింపజేసి, ఈ సినిమాలో హీరో యాక్టివ్ క్యారక్టరనేసి సర్టిఫికేట్ ఇచ్చేస్తాం. కానీ అతను ఫస్ట్ యాక్ట్ లో పాసివ్ గానే వుంటాడు. కథేమిటో తెలియకపోతే యాక్టివ్ గా ఎలా మారగలడు? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర మాత్రమే కాన్ఫ్లిక్ట్ తో కథేమిటో తెలిసి ఆ కథలో పుట్టిన సమస్యని సాధించడానికి ఒక గోల్ ని ఏర్పర్చుకుని సంఘర్షణ ప్రారంభిస్తాడు.  ఈ కాన్ఫ్లిక్ట్ తో  యాక్టివ్ క్యారక్టర్ గా మారతాడు.

ఫస్ట్ యాక్ట్ బిజినెస్ అయిన కథా నేపత్యథ్యపు ర్పాటు, పాత్రల పరిచయం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన, సమస్య ఏర్పాటు ( కాన్ఫ్లిక్ట్- ప్లాట్ పాయింట్ వన్) ఇదంతా ప్రారంభం కాబోయే కథకి ఉపోద్ఘాతమే కాబట్టి హీరో పాసివ్ గా లేదా న్యూట్రల్ గా వుంటాడు. ఈ ఉపోద్ఘాతం ఎంత నిడివి పెరిగితే అంతసేపు న్యూట్రల్ గానే వుంటాడు ఏమీ చేయకుండా. మనం ఫస్ట్ యాక్ట్ అరగంట నిడివి గురించే మాట్లాడుకుందాం. ఈ అరగంట నిడివి కూడా హీరో న్యూట్రల్ గా వుంటూ బోరు కొట్టించకుండా వుండాలంటే, లేదా ప్రేక్షకుల సమయం తినేయకుండా వుండాలంటే ఏం చేయాలి? 

మినీ కాన్ఫ్లిక్ట్ ని సృష్టించాలి. ప్లాట్ పాయింట్ వన్ తో వచ్చే కాన్ఫ్లిక్ట్ కంటే ముందు మినీ కాన్ఫ్లిక్ట్ ని సృష్టిస్తే హీరో ఫస్ట్ యాక్ట్ అంతా పాసివ్ కాకుండా, న్యూట్రల్ గాకుండా యాక్టివ్ గా వుంటాడు. ప్లాట్ పాయింట్ వన్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ తో ఇంకా బలమైన యాక్టివ్ క్యారక్టర్ గా మారతాడు. ఇలా సినిమా మొత్తం అన్ని యాక్ట్స్ లో హీరో యాక్టివ్ గా ఆకట్టుకుంటాడు.

మినీ కాన్ఫ్లిక్ట్ ఎలా? ఫస్ట్ యాక్ట్ లో మినీ కాన్ఫ్లిక్ట్ లో కూడా హీరోకి సాధించాల్సిన సమస్య వుంటుంది, గోల్ వుంటుంది, ఆటంకాలుంటాయు, సంఘర్షణా వుంటుంది. మినీ కాన్ఫ్లిక్ట్ ప్రధాన కథకి సంబంధించి వుండొచ్చు, వుండకపోవచ్చు. కానీ ప్రేక్షకులకి సినిమా ప్రారంభమైన వెంటనే ఎంగేజ్ చేసినట్టు వుంటుంది.

ఉదాహరణకి- యశోద లోలాంటి హాస్పిటల్ వుందనుకుందాం. అక్కడ విలన్ డాక్టర్లు రోగుల మీద ఏవో ప్రమాదకర ప్రయోగాలు చేస్తున్నారనుకుందాం. ఈ రోగుల్ని కాపా  డాలంటే హీరో డాక్టర్ల కుట్ర రట్టు చేయాలి. అంటే ఆ హీరో ఆ హాస్పిటల్లో జాబ్ చేస్తూండాలి. ఇదంతా రెగ్యులర్ గా వుండే ఫస్ట్ యాక్ట్. ఇలా అరగంటకి హీరో కుట్ర రట్టు చేసి ప్లాట్ పాయింట్ వన్ ని సృష్టిస్తాడు. ఈ అరగంట సేపూ న్యూట్రల్ గానే వుంటాడు.

ఇలాకాకుండా, హీరో వేరే చోట వేరే పని చేసుకుంటూ వుంటాడనుకుందాం. అప్పుడు మదర్ కి గుండె నొప్పి వస్తుంది. తీసుకుని హాస్పిటల్ కి పరిగెడతాడు. హాస్పిటల్లో ట్రీట్ మెంట్ ఇప్పించి వచ్చి పోతూ వుంటాడు. మదర్ కి సీరియస్ గానే వుంటుంది. వుంటుందా, పోతుందా అన్న సస్పెన్స్, సంఘర్షణ, బతికించుకోవాలన్న గోల్ హీరోకి వుంతాయి. ఇలా ప్రారంభం నుంచే సినిమా ఆసక్తిని పెంచుతుంది.

ఈ ఫస్ట్ యాక్ట్ మొదటి అరగంట ఏదో ఒక సమయంలో, మెయిన్ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించిన క్లూలు వేసుకుంటూ పోవచ్చు. అక్కడి రోగులతో డాక్టర్ల వ్యవహారం హీరోకి అనుమానాలు రేకెత్తించ వచ్చు. ఇంతలో మదర్ కి విజయవంతంగా సర్జరీ పూర్తవుతుంది. తీసుకుని బయల్దేరుతూంటే, అకస్మాత్తుగా రోగుల కుటుంబాల ఏడ్పులు వినిపిస్తాయి. ఏమిటా అని చూస్తే, హాస్పిటల్లో జరుగుతున్న మరణాలు మీడియాకి  అందితే మన ఉద్యోగాలు గల్లంతంటూ నర్సుల మాటలు విన్పిస్తాయి. అంతే, హీరో మదర్ ని వదిలేసి పూర్తయిన మినీ కాన్ఫ్లిక్ట్ లోంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్ లోకి ఒక్క దూకు దూకి, దుష్ట డాక్టర్ల పీకలు పుచ్చుకుంటాడు. ఫస్ట్ యాక్ట్ పూర్తయి హీరోకి అసలు సమస్యతో సంఘర్షణగా కథ ప్రారంభమై పోతుంది. ఈ మోడల్ ని ఏ జానర్ కథకైనా దానికి సంబంధించిన మినీ కాన్ఫ్లిక్ట్ ని  మెయిన్ కాన్ఫ్లిక్ట్ తో నుసంధానించ వచ్చు. ప్రయత్నించి చూడండి, ప్రయోజనం మీకే తెలుస్తుంది కథకి ముందు కథతో.

—సికిందర్