రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, మే 2019, బుధవారం

814 : స్పెషల్ ఆర్టికల్


      బయోపిక్స్ పిచ్చి పీక్ కెళ్ళి బయోపిచ్చిగా మారింది. ఇక రూటు మార్చుకోవడమే కరెక్ట్ అనుకుంటున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ బయోపిక్స్ తీయడాన్ని కొత్త  ట్రెండ్ గా, ఓ భారీ వ్యాపారంగా మార్చుకుంది. నటీనటులు, రాజకీయ నేతలు, క్రీడా కారులు, చారిత్రక పురుషులు... ఇలా పాజిటివ్ వ్యక్తులపై బయోపిక్స్ తీస్తూ వచ్చింది. ఇలా అదేపనిగా బయోపిక్స్ తీసి ప్రేక్షకుల మీద పడేస్తూంటే, బయోపిక్స్ తో ఎవరెవరివో జీవిత పాఠాలు నేర్పుతున్నారని  ప్రేక్షకులకీ విసుగొచ్చేసింది. ఈ ప్రమాదాన్ని పసిగట్టారేమో, ఇలాకాదని నెగెటివ్ బయోపిక్ కి నడుం కట్టారు. అదే పనిగా పాజిటివ్ చరిత్రలు చూపిస్తూ ప్రేక్షకులకి ఇంకా బోరు కొట్టించడం కంటే, నెగెటివ్  చరిత్ర చూపిస్తే డిఫరెంట్ ఫీల్ వచ్చి, మళ్ళీ బయోపిక్స్ కి కొత్త వూపు వస్తుందనుకున్నట్టుంది- ఏకంగా సంచలన రేపుల బాబా ఆశారాం బాపూ మీద బయోపిక్ తీసి పడేస్తున్నారు!

         
షినార్ మజుందార్ అనే రచయిత ‘గాడ్ ఆఫ్ సిన్ : డౌన్ ఫాల్ ఆఫ్ ఆశారాం బాపు’ అనే నవల రాశాడు. దీన్ని అగ్రనిర్మాత సునీల్ బొహ్రా  బయోపిక్ గా  తీసేందుకు హక్కులు కొనేశాడు. నేరగాణ్ణి  గ్లామరైజ్ చేస్తున్నాడన్న మాట రాకుండా,  ఈ బయోపిక్ ఆశారాం మీద కాక ఆశారాంకి వ్యతిరేకంగా పనిచేసి బాధితురాళ్ళకి న్యాయం జరిగేలా చూసిన ఒక లాయర్, ఇద్దరు లేడీ పోలీసాఫీసర్ల విజయం మీద ఫోకస్ చేస్తున్నట్టు చెప్పాడు నిర్మాత బొహ్రా. ఇందులో ఎవరెవరు నటిస్తారనేది త్వరలో తెలియజేస్తానన్నాడు. ఈ బయోపిక్ కి అంతర్జాతీయ గుర్తింపు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.

         అటు నరేంద్ర మోడీ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ ఎన్నికల కోడ్ గుప్పిట ఇరుక్కుని విలవిల్లాడుతున్నాయి. ఈ రెండూ  బ్యాలెన్స్ వుండగా ఆశారాం బాపూ రాబోతున్నాడు. 2013 లో రేపుల కేసులో అరెస్టయి 2018 లో జీవిత ఖైదు పడ్డ ఆశారాం కథ -  ఇంతవరకూ వచ్చిన సాత్విక బయోపిక్స్ కంటే మసాలా బయోపిక్ గా ఇదే  ఎక్కువ హిట్ అవుతుందనేది వాస్తవం. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నేరాల మీద తీసిన బయోపిక్ ‘సంజు’ ఆరువందల కోట్లు వసూలు చేసిన ఎగ్జాంపుల్ వుండనే వుంది. ఏ శాఖాహార బయోపిక్ కూడా ఇంత వసూలు చేయ లేదు. వందకోట్లకి చేరడమే గగనమైంది. 

          ఇలావుండగా, మా నాన్న పోతే నేను లేనా అన్నట్టు రేప్ చేసిన ఆశారాం కొడుకు నారాయణ్ సాయికి మొన్న ఏప్రెల్ ఇరవై ఆరునే జీవిత ఖైదు పడింది. ఆశారాం బయోపిక్ లో ఇది కూడా తోడైతే  డబుల్ మసాలా అవుతుంది. ఇంకో పెద్ద మసాలా మాస్టర్ వున్నాడు – డేరా బాబా! గుర్మీత్ రాంరహీం సింగ్ జీ ఇన్సాన్.  ఇతను కూడా రేప్ కేసులో ఇరవై ఏళ్ళు శిక్ష పడి కటకటాల వెనుక సేద దీరుతున్నాడు. ఇంకా హత్య కేసులు కూడా వున్నాయి. కానీ ఇతను ఆల్రెడీ సూపార్ స్టార్ గా ఐదు యాక్షన్ సినిమాలు తీసేశాడు. బయోపిక్ కి ఇంకా ఎవరి దృష్టీ పడలేదు. 

       ఇక ఇటు టాలీవుడ్ కి  తాజా బయోపిక్ దొరికింది. ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న హాజీ పూర్ సీరియల్ రేపిస్టు  కిల్లర్ శ్రీనివాస రెడ్డి బయోపిక్ తీస్తే ఎలా వుంటుంది? – అన్న ఎంక్వైరీలు చేస్తున్నారు. ఇలా మసాలా బయోపిక్స్ తో మంచి మెసేజిలివ్వచ్చు. కలెక్షన్లు కూడా వస్తాయి. కానీ ఈ సందర్భంగా ఒక ఐడియా ఏమిటంటే, ఇలా నేరస్థులు దొరికాక వాళ్ళ గురించి తెలుసుకుని బయోపిక్స్ తీసేకంటే, అంతు చిక్కని నేరాలు జరిగినప్పుడే వాటి మీద ఇన్వెస్టిగేటివ్ కథనాలు చేసి తీస్తే,  శ్రీనివాసరెడ్డి లాంటి క్రిమినల్స్ ని పోలీసులు పట్టుకునేందుకు క్లూస్ ఇచ్చినట్టవుతుంది. అప్పుడు ‘ముందస్తు బయోపిక్’ గా మంచి పేరొస్తుంది.

సికిందర్


813 : రైటర్స్ కార్నర్



బాలీవుడ్ రచయిత్రి దేవికా భగత్ 



దేవికా భగత్...బాలీవుడ్ లో అతికొద్ది మంది రచయిత్రుల్లో ప్రత్యేకతలు గల రచయిత్రి.  రాసే కథలు, స్క్రీన్ ప్లేలూ, సంభాషణలూ ఒక సినిమాకీ ఇంకో సినిమాకీ పోలికే వుండదు. 2003 లో  సినిమా రంగ ప్రవేశం చేసి ‘డ్రీమింగ్ లాసా’ అనే  టిబెట్ సినిమాకీ,  హాలీవుడ్ హిట్ ‘బోర్న్ సుప్రమసీ’ కీ  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007 లో ఆమె జీవితం మలుపు తిరిగింది.   అభయ్ డియోల్ నటించిన ‘మనోరమ-  సిక్స్ ఫీట్ అండర్’  అనే  విజయవంతమైన మర్డర్ మిస్టరీకి కథ- స్క్రీన్ ప్లే- సంభాషణలూ సమకూర్చి రచయిత్రిగా మారారు. అటు తర్వాత రణబీర్ కపూర్ నటించిన  ‘బచ్ నా యే హసీనో’, షారుఖ్ ఖాన్ నటించిన  ‘జబ్ తక్ హై జాన్’ లకి స్క్రీన్ ప్లే రచయిత్రిగానూ,  సోనమ్ కపూర్ నటించిన ‘ఐషా’, రణవీర్ సింగ్ నటించిన ‘లేడీస్ వర్సెస్ రాకీ బహల్’,  జాన్ అబ్రహాం నటించిన ‘ఐ- మీ- ఔర్ మై’ లకు స్క్రీన్ ప్లే- సంభాషణల రచయిత్రిగానూ, తాజాగా 2014 లో అభయ్ డియోల్ నటించిన ‘ఒన్ బై టూ’ తో దర్శకురాలిగానూ మారిన ఈ ముప్ఫై ఆరేళ్ళ సక్సెస్ ఫుల్ లేడీ,  స్క్రీన్ ప్లే రైటింగ్- డైరెక్షన్ కోర్సుల్లో న్యూయార్క్ యూనివర్సిటీ పట్టభద్రురాలు. ‘ఉమెన్స్ వెబ్ డాట్ ఇన్’  కి ఈమె ఇచ్చిన ఇంటర్వూ పాఠం ఈ కింద చూద్దాం..

˜హిందీ సినిమాలకి మీరు స్క్రీన్ ప్లే రచయిత్రిగా ఎలామారారు?

         నేను న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి స్క్రీన్ ప్లే రైటింగ్- డైరెక్షన్ లలో డిగ్రీ తీసుకున్నాక ఇండియా తిరిగొచ్చాను. నా ఆలోచన ఏమిటంటే నా సొంత కథనల్ని ప్రమోట్ చేసుకోవాలన్నా, భవిష్యత్తులో డైరెక్టర్ గా మారాలాన్నా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తే ఆ ద్వారాలు తెర్చుకుంటాయని! కానీ రెండు మూడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే సరికి సృజనాత్మకంగా నేను కోల్పోతున్నదేమిటో తెలిసి వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చేస్తున్నదంతా షూటింగు స్పాట్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో రైటింగ్ తో సంబంధం లేని పనే. కానీ తప్పదు. అప్పుడు ఇంకో సినిమాకి అసిస్టెంట్ డైరక్టర్ గా అవకాశం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక స్క్రిప్టు రాసుకున్నాను. అప్పుడొక అద్భుతం జరిగింది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పెద్ద దర్శకుడు ఇంతియాజ్ అలీ ని కలుసుకోగలిగాను! ఆయన నా పట్ల ఆసక్తి కనబర్చి నేను రాసిన స్క్రిప్టు చదివారు. అది ట్రాష్ అని నాకూ తెలుసు. కానీ నాలో స్క్రీన్ ప్లే రైటర్ అయ్యే టాలెంట్ వుందని ఆయన పసిగట్టారు. తన తర్వాతి సినిమాకి నాకు వర్క్ ఆఫర్ చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ఆ సినిమా షూటింగ్ దశకే వెళ్ళలేదు. అయితే రైటింగ్ లో ఆ కొంత అనుభవమే  నాకు బోలెడు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఆతర్వాత దర్శకుడు నవదీప్ సింగ్ ని కలుసుకున్నాను. ఇక ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’ రూపు దాల్చడం మొదలయ్యింది..దీంతో నా అదృష్టం ఎలా మలుపు తిరిగిందో మీకు తెలిసిందే! 

    మీరు రాసే సినిమాలు డిఫరెంట్ జానర్స్ తో ఉంటున్నాయి. మీ రచనల మీద దేని ప్రభావం ఎక్కువ వుందంటారు?
        నావరకూ జానర్ అనేది నేను కావాలని కోరుకునేది కాదు. ముందు కథా, ఆ కథలో పాత్రలూ మాత్రమే నాకు ముఖ్యం, అవే నాకు ఏ తరహా సినిమా అవుతుందో దారి చూపుతాయి. నేనిష్ట పడేది ఎక్కువగా క్యారక్టర్స్ కథలే. నన్ను నా క్యారక్టర్సూ, వాటి కథా ప్రపంచమూ నడిపించాలని కోరుకుంటాను. నా కథల్ని మెయిన్ స్ట్రీం అనో, ఆఫ్ బీట్ అనో వర్గీకరించడం కూడా నా కిష్ట ముండదు. అయితే ప్రాజెక్టు కయ్యే బడ్జెట్టు స్క్రీన్ ప్లే లో ఏది ఉండాలో ఏది కూడదో నిర్ణయిస్తుంది కాబట్టి ఈ దృష్ట్యా స్క్రిప్టులు రాయక తప్పదు. 
˜   స్క్రీన్ రైటింగ్ ప్రాసెస్ లో అతి కష్టమైనది క్రియేటివ్ కంట్రోల్ ని కాపాడుకోవడం. కొన్నిసార్లు ఆ కంట్రోల్ ని వదులుకోవాల్సి వస్తుంది కూడా ఒక  రైటర్ గా. అలాటి మీకు అస్సలు ఇష్టంలేని మార్పుచేర్పులు స్క్రిప్టుల్లో చేయాల్సిన అగత్యం ఎప్పుడైనా ఎదురయ్యిందంటారా?
          
స్క్రిప్టు రైటరు దర్శకుల లేదా నిర్మాతల విజన్ ని సాకారం చేయాల్సి వుంటుంది. కథ నాదైనా వాళ్ళదైనా అది వర్కౌట్ అయ్యేలా చూస్తాను.  స్క్రిప్ట్ రైటర్ గా నాకు సొంత క్రియేటివ్ ఆలోచనల లుండొచ్చు, కానీ ఇక్కడ నేను మాత్రమే కాకుండా అవతల ఇంకా దర్శకుల, నిర్మాతల, అగోచరంగా వుండే ప్రేక్షక సమూహపు అభిలాషలూ వుంటాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయక తప్పదు. నిజమే, అప్పుడప్పుడు  స్క్రిప్టు మీటింగ్స్ లో క్రియేటివ్ పోరాటాలు జరుగుతాయి. కానీ స్క్రిప్టులో ఏదైనా మార్చాల్సి వస్తే నేనెప్పుడూ బ్యాడ్ ఫీలింగ్స్ పెట్టుకోను. బ్యాడ్ ఫీలింగ్స్ నన్ను చుట్టుముట్టినప్పుడు ఆ సినిమా నుంచే తప్పుకుంటాను. స్క్రిప్ట్ రైటింగ్ అనేది నిరంతర పరిణామ ప్రక్రియ. ఇందులో మడిగట్టుకుని ఏదీ వుండదు. 

   క్యారక్టర్ కథలిష్టమన్నారు. మీరు రాస్తున్నప్పుడు ఉద్భవించే క్యారక్టర్లు ఎంతవరకు తెరమీదికి వచ్చేసరికి జీవం పోసుకుంటున్నాయంటారు?
           నేనెప్పుడూ ఫలానా యాక్టర్ అని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాయలేదు. అది క్యారక్టర్లని ఓ చట్రంలో బిగించేస్తుంది. నేనొకసారి ఓ సినిమాకి స్క్రిప్టు రాస్తున్నప్పుడు ఆ నిర్మాత చాలా సార్లు హీరో జాన్ అబ్రహాం అంటూ చెప్పసాగారు. ఆయన చెప్పినప్పుడల్లా సీన్లు రాస్తున్నప్పుడు జాన్ అబ్రహాం ని షర్టు లేకుండా ఊహించుకుంటూ చాలా ఇబ్బంది పడేదాన్ని!
          అంతిమంగా నా ఊహాలోకంలోని పాత్రల్ని వెండితెరమీద ఏ ఏ తారలు నటిస్తున్నారనేది నాకెప్పుడూ ముఖ్యం కాదు. ఆ పాత్రలకి వాళ్ళెలా ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నదే ప్రధానం. కాగితాల మీద క్యారక్టర్లకి ప్రాణముండదు. ఆయా  తారలూ దర్శకుడూ కలిసి తెరమీద ప్రాణ ప్రతిష్ట చేయాల్సి వుంటుంది. తారల ఎంపిక సమయంలో నిర్మాతలు, దర్శకులు నా సూచనలు అడుగుతారు. అయితే అంతిమ నిర్ణయం వాళ్ళదే. రిహార్సల్స్ సమయంలో ఒక్కోసారి ఆ నటుడు లేదా నటికి సరిపోయేలా పాత్రల్లో మార్పులు చేయాల్సి వుంటుంది కూడా! 
˜   
ఏదైనా ఉదాహరణ చెప్తారా? 
      ‘మనోరమ- సిక్స్ ఫీట్ అండర్’  సినిమా విషయంలో జరిగింది...ఆ కథలో హీరో పాత్ర సత్యవీర్ నలభై ఐదేళ్ళ నడివయసు వ్యక్తి నిజానికి. కానీ ఆ పాత్రకి అభయ్ డియోల్ ని అనుకున్నాక వయస్సుని ముప్ఫై కి తగ్గిస్తూ పాత్రలో మార్పులు చేయాల్సి వచ్చింది- పాత్ర జీవితంతో సహా. అది మంచికే జరిగిందనుకుంటాను. ముప్ఫై యేళ్ళ హీరోకి ఈ కథ డిమాండ్ చేసే ఇన్వెస్టిగేషన్ కోణం పట్ల జిజ్ఞాస, కుశాగ్రబుద్ధీ ఎక్కువ వుంటాయి కదా?


మీరు చూడాలనుకుంటే ఎలాటి సినిమాలు ఇష్టపడతారు?
          ఫిలిం స్కూల్ కోర్సు చేస్తున్నప్పుడు వరల్డ్ సినిమా మాకు పరిచయం చేశారు. నా వరకూ మాత్రం హాంకాంగ్ దర్శకుడు వాంగ్ కార్ వాయ్, హాలీవుడ్ దర్శకులు కోయెన్ బ్రదర్స్ సినిమాల్ని ఇష్టంగా చూస్తాను. ఇంకా పాల్ థామస్, ఆండర్సన్, అలెగ్జాండర్ పైన్, వేస్ ఆండర్సన్, జేసన్ రీట్మన్, కెమెరాన్ క్రోవ్.. సినిమాలూ ఇష్టమే. ఈ పేర్ల వరస చూస్తూంటే  వీళ్ళు నా కెందుకిష్టమో మీకర్ధమయ్యే వుంటుంది- వీళ్ళందరివీ క్యారక్టర్ డ్రైవెన్ సినిమాలే! 
   
˜   మీరు బాగా ఇష్టపడి రాయాలని కోరుకుంటున్న కథ- కానీ దాన్ని ఇండియాలో తీయడం అసాధ్యంలే అన్పించిన కథ ఏదైనా ఉందా?
             ఉంది! ముగ్గురు నిర్మాతల దగ్గర ప్రయత్నించాను కూడా. ఎవరూ ముందుకు రాలేదు. వాళ్ళ దృష్టిలో అది చాలా డార్క్ మూవీ అవుతుంది. ఓ ఐదేళ్ళల్లో సాధ్యం  కావచ్చను కుంటున్నాను...

˜   హిందీ సినిమాలు పూర్తిగా నగరీ కరణ చెందాయని విమర్శలున్నాయి. పాత బాలీవుడ్ సినిమాల్లాగా అవి బి సెంటర్ ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోతున్నాయి..ఇది నిజమేనా? మీరే ప్రేక్షకుల కోసం రాయాలని కోరుకుంటారు?

          
మొత్తం పరిశ్రమ గురించి నేను కామెంట్ చేయలేను గానీ, నా వరకూ చెప్పగలను. నేను ఫలానా ప్రేక్షకులని మనసులో పెట్టుకుని రాయలేను. నాకు తెలిసింది, నాకు అనుభవమయ్యింది మాత్రమే రాయగలను. నాకు తెలీని ప్రపంచాల గురించి నేనేమీ రాయలేను. అది బూటకంగా వుంటుంది కూడా. ఇక హిందీ సినిమాలు నగరీకరణ చెందడం గురించి.. ‘మనోరమ -సిక్స్ ఫీట్ అండర్’ పల్లెటూళ్ళో జరిగే పల్లెటూరి కథే కదా? కాకపోతే సహజంగా తీశాం. బీ సెంటర్ ప్రేక్షకులకి వాళ్ళ సహజ కథలే వాళ్లకి నచ్చకపోతే ఏం చేస్తాం. నేనేం స్ఫూర్తి పొందానో అది రాయకుండా, వాళ్లకి కావాల్సిందేదో రాస్తూ పోతే చాలా గందరగోళంలో పడిపోతాను!

అమృతా రాజన్