రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, March 11, 2025

1370 : సందేహాలు- సమాధానాలు

 

Q:  నేను గత నాలుగు నెలలు కష్టపడి స్క్రిప్టు రాసుకున్నాను. ఇది నాకు ఫ్రెష్ గా వచ్చిన ఒరిజినల్ ఐడియానే  తప్ప ఎక్కడ్నుంచీ లిఫ్ట్ చేయలేదు. దీన్ని పిచింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నాను. ఇంతలో నా కథ లాంటిదే కథతో ఒక భాషలో ఇటీవల హిట్ సినిమా వచ్చిందని తెలిసింది. ఆ సినిమా చూశాను. రెండూ ఒకటే. ఇప్పుడేం చేయాలో పాలుపోవడం లేదు. పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్ళీ ఇంకో కథ ఆలోచించే మూడ్ లో లేను. పిచింగ్ చేయడానికి ఒక ముఖ్యమైన అపాయింట్ మెంట్ కోసం ట్రై చేస్తున్న సమయంలో ఇలా జరగడం భరించలేక పోతున్నాను. మళ్ళీ కొత్త కథ ఎప్పుడు రాసుకోవాలి, ఎప్పుడు పిచింగ్ చేయాలి నాకేం  అర్ధం గాలేదు. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాను. నేను త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో మీరు చెప్పే జాగ్రత్తలన్నీ తీసుకుని స్క్రిప్టు రాశాను.
ఎల్ కె ఆర్, అసోసియేట్
A: మొదటిది : ముందుగా కేక్ కట్ చేసి తినేయండి. ఎందుకంటే మీరు సాధీంచింది చిన్న విషయమేమీ కాదు. ఒక భాషలోవచ్చి హిట్టయిన కథే మీకు తెలియకుండా మీరు రాశారంటే మీకు హిట్ స్క్రిప్టులు రాసే టాలెంట్ వున్నట్టే. మీరనుకుంటున్న ఈ కష్ట సమయంలో దీన్ని సిల్వర్ లైనింగ్ గా తీసుకోండి. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మీలోని రైటర్ ని చిన్నబుచ్చుకోకండి. వాడు మీరూహించని ఎత్తుకెదిగాడు. ఇక అన్నీ పక్కనబెట్టి వాడికో కేక్ కట్ చేసి తినిపించి ఎంజాయ్ చేయండి. ఇది చాలా ముఖ్యం ఇనుమడించిన ఉత్సాహంతో  ముందుకు సాగేందుకు.

రెండోది :  మీ కథ అచ్చం ఇంకో సినిమా కథలా ఎన్నటికీ వుండదు. ఎక్కడో తేడా వుంటుంది. ఆ తేడా పట్టుకుని కొత్త సీన్లు రాసుకుంటే పోలికే వుండదు. ఒకే లాంటి కథతో రెండు సినిమాలొచ్చిన చాలా సందర్భాలున్నాయి.
భరత్ అనే నేను’ - ‘లీడర్’,  ‘ఎక్స్ మెన్’ - ‘స్కై హైమొదలైనవి. ఇలాటి రెండు సినిమాల కథల్ని మూడు వాక్యాల లాగ్ లైన్లు గా రాసి చూడండి- ఎక్కడ డిఫరెంట్ గా వున్నాయి? అలాగే మీరు చెప్తున్న సినిమా (ఈ సినిమా పేరు మీరు రాయలేదు, రాయకూడదు కూడా), మీ కథ -  ఈ రెండిటి లాగ్ లైన్లు రాసి ఎక్కడ తేడాగా వున్నాయో గుర్తించండి. 

(సరీగ్గా పై పేరా పూర్తి చేయగానే పారిశ్రామిక రంగంలో ఓ ప్రముఖుడి నుంచి కాల్ వచ్చింది... మాట్లాడుతూ ఆయన లీడర్అన్నారు, కాసేపటి తర్వాత భరత్ అనే నేనుఅన్నారు. బుర్ర తిరిగిపోయింది ఈ కోయిన్సిడెన్స్ కి. టెలిపతీ అన్నమాట. అంటే సరైన వైబ్రేషన్స్ తోనే యూనివర్స్ తో కనెక్ట్ అయి వున్నామన్న మాటే!).

లాగ్ లైన్ లో ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్ ని చూడండి. అది ఒకేలా వుంటే అందులో హీరో ఎదుర్కొనే సమస్యని మార్చండి. కథ మారిపోతుంది. ఈ కాన్ఫ్లిక్ట్ కి మీరిచ్చే ట్రీట్ మెంట్ మార్చెయ్యండి. డాకూ మహరాజ్ఎన్నోసార్లు వచ్చిన పాత కథే. కానీ స్టయిలిష్ ట్రీట్ మెంట్ వల్ల డిఫరెంట్ గా మారింది. మీ కథకి నేపథ్యం కూడా మార్చవచ్చు. ఎక్స్ మెన్సీరియస్ కథయితే, ‘స్కై హైసున్నిత హాస్యంతో కూడిన అలాటిదే కథ. అలాగే మీ ప్లాట్ పాయింట్స్ తో పోలిక వుంటే వాటినీ మార్చవచ్చు. అలాగే గోల్ ని సాధించే మీ హీరో బలాల్ని, బలహీనతల్ని హైలైట్ చేయొచ్చు. పైన చెప్పినట్టు అన్ని  సీన్లూ మార్చేయండి. ముఖ్యంగా ఎమోషనల్ ట్రాకుని పవర్ఫుల్ గా మార్చండి. దీనికోసం ఏవైనా సినిమాలు చూడండి- ఖైదీఅయినా సరే. ఇకపోతే, మీ కథ తెర కెక్కితే -ఎక్కాలంటే- కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అప్పటికి పోలికలు గీలికలు చూస్తూ ఎవరూ కూర్చోరు.

Q: స్క్రిప్టు లో సీన్లు రొటీన్ గా కట్ అని రాసి ఇంకో సీను  మొదలుపెట్టే విధానం తప్ప మరొకటి లేదంటారా? ఇలా వుంటే తర్వాత ఎడిటర్ కి ఉత్సాహముంటుందా?
—జెఆర్ఎస్, అసోసియేట్  

A: ట్రాన్సిషన్స్ అన్నవి ఎడిటింగ్ లో చాలా ముఖ్యం. ఎడిటర్ కి ఉత్సాహాన్నివ్వాలి ట్రాన్సిషన్స్. ఇవి స్క్రిప్టు లోనే రాసుకుంటే ముందు స్క్రిప్టు చదువుతున్నపుడే కథ మూడ్ అంతా క్రియేటయి పోతుంది. కంటెంట్ కొక బ్యూటీ వస్తుంది. అవసరమైన ప్రత్యేక సందర్భాల్లో సౌండ్ కూడా రాసుకుంటే ఆట్మాస్ఫియరంతా క్రియేటై పోతుంది. స్క్రిప్టు అంటే కేవలం డైలాగులతో నింపే పేజీలు కాదు, అది హృదయాల్ని కుదిపే అర్టు.

ఈ మధ్య ఒక డైలాగు వెర్షన్ చూడాల్సి వచ్చినప్పుడు- అందులో అన్నిసీన్లకీ కింద -cut to- అని రాసి వుంది. దీన్ని బట్టి కథనం ఎలా వచ్చి వుంటుందో వూహించొచ్చు. ఒక సీను ముక్కకి ఇంకో సీను ముక్క వరుసగా అతికించుకుంటూ పోవడమే దీని కథనం అన్నమాట. దీనికి ఎడిటింగ్ ఏముంటుంది. చాలా పూర్వం ఎడిటర్ కెవి కృష్ణా రెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు-  డిజాల్వ్, ఫేడిన్, ఫేడవుట్, ఫ్రీజ్, స్ప్లిట్ స్క్రీ న్ వంటి ట్రాన్సిషన్స్ లేదా ఎడిటింగ్ టెక్నిక్స్, లేదా ఆప్టికల్ ఎఫెక్ట్స్ అన్నీ ఎడిటర్ దగ్గరే వుంటున్నాయన్నారు సాఫ్ట్ వేర్స్ రూపంలో. వీటితో  కథా స్వభావాన్ని సమన్వయం  చేసుకుంటూ కథాగమనం లో ఇమిడిపోయేట్టు వాడుకునే అవకాశం లేకుండా సీన్లు షూట్ చేస్తున్నారన్నారు. ఇప్పుడైతే  స్క్రిప్టు రాసేటప్పుడే -cut to- -cut to--cut to- అనేస్తున్నారు కత్తి పట్టుకుని!

-cut to- రాయకూడదని కాదు. నిజానికి ఇవే ఎక్కువుంటాయి. అయితే కథనంలో కొన్ని కీలక ఘట్టాల్లో మిగతా ఎఫెక్ట్స్ కూడా అవసరమే. అప్పుడే సినిమా వీక్షణానుభవం గొప్పగా వుంటుంది. నిజానికి వీటిని స్క్రీన్ ప్లే ట్రాన్సిషన్స్ అన్నారు, ఎడిటింగ్ ట్రాన్సిషన్స్ అనలేదు. ఈ స్క్రీన్ ప్లే ట్రాన్సిషన్స్ ని స్టోరీ టెల్లింగ్ టూల్స్ అని కూడా అన్నారు. ఇవి మొత్తం 12 విధాలుగా వుంటాయి. వీటి వాడకం గురించి  5C’s బుక్ లో తెలుసుకోవచ్చు- లేదా గూగుల్ చేస్తే లభిస్తాయి.

Q:  అల్లరి నరేష్ బచ్చలమల్లి ఆ స్థాయిలో విఫలమవడానికి కారణం ఏంటి? ఆ కథ మీరు తరచూ చెప్పే గాథ అవ్వడమా? లేక హీరో మీద ఆడియన్స్ కి ఎంపతీ కలగకపోవడమా? లేక మరేదైనా కారణమా? కొంచెం వివరంగా చెప్పండి.
—ఏపీ, అసోసియేట్

A: మీరు చెప్పిన వాటిలో మొదటి ప్రశ్న, రెండో ప్రశ్న రెండూ కరెక్టే. ముఖ్యంగా దీన్ని గాథగా గుర్తించ గల్గినందుకు మీకు అవార్డు. ఎందుకంటే గాథని గుర్తించే మేకర్లు చాలా కొద్ది మంది. ఆ కొద్ది మందిలో మీరొకరు.  బచ్చల మల్లి దర్శకుడు తీసింది గాథ లాంటి ఆర్ట్ సినిమా. ఇలా అనుకుని తీసినా బావుండేది. తీస్తున్నది కమర్షియల్ సినిమాతో కథ అనుకుని పొరబడి తీయడంతో అంతా తారుమారైంది. ఇది మామూలు గాథ కూడా కాదు, కమర్షియల్ విలువలు ఏ కోశానా లేని ట్రాజడీ గాథ.
       
గాథకి తగ్గట్టు ఇందులో కాన్ఫ్లిక్ట్ లేదు. ఉన్న కొద్ది కాన్ఫ్లిక్ట్ తో హీరోకి పరిష్కార దిశగా గోల్ లేదు. ఇక మూర్ఖుడైన హీరో ఎవరిపట్లా ఎంపతీ లేకుండా మూర్ఖుడు గానే గాథ ముగించుకుంటే -చచ్చిపోతే- ఎవరికి సింపతీ
.  ఫస్టాఫ్ లో హీరోయిన్ తో ప్రేమలో పడ్డాక మారతాడు. ఎంపతీతో మారిన వాడిని కొందరు చూడలేక తిరిగి మూర్ఖుడిగానే మార్చేసి బలి తీసుకుంటే ఎంత సింపతీ అయినా కలుగుతుంది ప్రేక్షకులకి.
       
ఇలాటి క్యారక్టర్ తో రాజశేఖర్ నటించిన
రౌడీయిజం నశించాలి (మలయాళం లో మోహన్ లాల్ నటించిన కిరీడం కి రీమేక్) మంచి ఉదాహరణ. స్థానిక మార్కెట్ మీద జులుం చెలాయిస్తున్న గ్యాంగ్ లీడర్ ఒకరోజు తన తండ్రిని కొట్టడం చూడలేక వాణ్ణి చిత్తుగా తంతాడు రాజేశేఖర్.  దాంతో మార్కెట్ లోని వ్యాపారులు అతడ్ని తమ హీరోగా చేసేసి అందలం ఎక్కించేస్తారు. అతడికి అందరి పట్లా ఎంతో ఎంపతీ. ఆ ఎంపతీతో రౌడీయిజంలోకి ప్రవేశంచిన రాజశేఖర్, చివరికి అందులోంచి బయట పడదామన్నా పడలేక అదే రౌడీయిజానికి బలై పోతాడు. బోలెడు సానుభూతి పాత్రకి. ఇది గాథ కాదు, కథ. పాసివ్ పాత్ర కాదు, యాక్టివ్ పాత్ర.
       
బచ్చల మల్లి ఇలాకాదు
, మల్లి చిన్నప్పుడు తండ్రి వేరు కాపురం పెట్టినప్పుడు,  ఎవరు కావాలో తేల్చుకోమన్నప్పుడు, అతను మల్లి తల్లిని వదిలేసి, అప్పటికే తన వల్ల బిడ్డ తల్లిగా వున్న పెళ్ళి కానామెతో వెళ్ళిపోతాడు. ఈ ఇన్సైటింగ్ ఇన్సిడెంటే - తండ్రి మీద పుట్టిన ద్వేషమే మల్లి మూర్ఖుడుగా మారడానికి, చెడిపోవడానికి కారణంగా చూపించారు. కానీ భర్త పోతే పోయాడు, కొడుక్కి మంచీ చెడులు చెప్పైనా దారిలో పెట్టుకోవాలన్న ఏ ప్రయత్నమూ చేయదు అతడి తల్లి. అంతా అయిపోయాక గాథ చివర్లో మూర్ఖత్వం గురించి పాఠాలు చెబుతుంది!
       
ఇక్కడ విశేషమేమిటంటే
, మల్లి మీద కంటే అతడి తండ్రి మీదే సానుభూతి కలుగుతుంది. తండ్రిని మల్లి అర్ధం జేసుకునే ప్రయత్నం చేయడు. రెండో ఆమెతో తండ్రి వెళ్ళి పోయాడంటే, ఆమెకి భార్య అనే హోదా నివ్వడానికే, ఆమెతో కన్న కొడుక్కి తండ్రిగా గుర్తింపు నివ్వడానికే. అంతేగానీ ఆమె మీద మోజుతో కాదు. ఈ తండ్రికి  కొడుకుగా తల్లితో సేఫ్ జోన్లోనే వున్నాడు మల్లి. త్రిశూల్ లో తండ్రి మోసం చేసి వెళ్ళి పోతే పెళ్ళికాని తల్లితో సేఫ్ జోన్లో లేడు అమితాబ్ బచ్చన్. ఇదే పుష్ప లో హీరో పరిస్థితీ కూడా. హీరోకి జరిగిన అన్యాయాన్ని చూపించే పద్ధతి ఇదీ. అప్పుడే సింపతీ.
       
ఇక గాథలు ఎంత మోసం చేస్తాయంటే
, అది కథ అనుకుని ప్లాట్ పాయింట్ వన్ కోసం, కాన్ఫ్లిక్ట్ కోసం, హీరో గోల్ కోసం ఎదురు చూస్తూంటాం. ఇవి ఎంతకీ రావు, ఇంటర్వెల్ కి కూడా. అయితే సెకండాఫ్ మధ్యలో వచ్చే కాన్ఫ్లిక్ట్ ఏమో- అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కావచ్చేమో నని ఇంకా ఓపిక పట్టి- ఎదురు చూస్తూంటే- ఇది కూడా కాక జారుకుంటూ వెళ్ళి ముగిసిపోయే సరికి - అప్పుడు తెలుస్తుంది ఈ చూసిందంతా గాథ అనీ, ఇలా మోసపోయి టైమ్ వేస్ట్ చేసుకున్నామనీ. కాబట్టి డియర్ మేకర్స్, ముందు వొళ్ళు దగ్గరెట్టుకుని కథ చెప్పడం నేర్చుకోండి ఇక నైనా- పనికి రాని సోది గాథలు కాదు!  
       
ఫస్టాఫ్ ముప్పావు గంటకి మల్లి హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ ఇంటర్వెల్ కి కూడా కాన్ఫ్లిక్ట్ రాదు. సెకండాఫ్ అరగంట గడిచాకే వస్తుంది- పెళ్ళిని ఆమె తండ్రి నిరాకరించడంతో. పెళ్ళి పత్రిక మీద నీ తండ్రి పేరుండాలని అనడంతో రెచ్చిపోయి కొట్టేందుకు దిగుతాడు. ఇక మళ్ళీ తాగేసి తిరిగేసి
, ఆమె వేరే పెళ్ళి చేసుకుంటోంటే వెళ్ళి రచ్చ చేసేసి, ఆమె చావు చూసి- తను చచ్చిపోతాడు!  ఇదీ మూర్ఖుడి గాథ. పాత్ర ఎక్కడ పుట్టింది? తండ్రి రెండో ఆమెతో వెళ్ళి పోవడం దగ్గర పుట్టింది. ఆ పుట్టుకే తప్పు. కాబట్టి పాత్ర నడక అంతా తప్పు తప్పు.

—సికిందర్