రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జూన్ 2024, శనివారం

1439 : రివ్యూ

 

రచన - దర్శకత్వం : జ్ఞానసాగర్ ద్వారక
తారాగణం : సుధీర్ బాబు
, మాళవికా శర్మ, సునీల్, జయప్రకాష్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే, అర్జున్ గౌడ తదితరులు
సంగీతం :
చైతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : అరవింద్ విశ్వనాథన్  
బ్యానర్: శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
నిర్మాత:
 సుమంత్ జి నాయుడు
విడుదల :
 జూన్ 14, 202

***

        వ దళపతి (టైటిల్స్ లో ఇలాగే వేశారు) సుధీర్ బాబు ఒక పూర్తి స్థాయి మాస్ యాక్షన్ కి దిగాడు. చాలా ఇంటర్వ్యూలిచ్చి, ప్రమోట్ చేసి సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం బాధ్యత తీసుకున్నాడు. అయితే వరస పరాజయాలతో సతమతమవుతున్న సుధీర్ బాబుకి ఈ కొత్త నేపథ్యపు మాస్ యాక్షన్ ప్రేక్షకుల్లోకి ఎంతవరకు వెళ్తుంది? ఈ సారైనా పాస్ మార్కులు పడతాయా? ఇందులో ప్లస్ మైనస్ లేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

చిత్తూరు జిల్లా  కుప్పంలో తిమ్మారెడ్డి(లక్కీ లక్ష్మణ్ ), అతడి తమ్ముడు బసవ (రవి కాలే), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) అరాచకాలు చేస్తూంటారు. ప్రజల భూములు లాక్కుని చంపడం కూడా చేస్తూంటారు. ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యం (సుధీర్ బాబు) పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ లాబ్ అసిస్టెంట్ గా ఉద్యోగంలో చేరతాడు. ఈ కాలేజీలోనే టీచర్ (మాళవికా శర్మ) ని ప్రేమిస్తాడు. ఇక్కడే సస్పెండ్ అయిన హెడ్ కానిస్టేబుల్ పళని స్వామి (సునీల్) తో స్నేహం ఏర్పడుతుంది. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవపడి కొట్టడంతో సస్పెండ్ అవుతాడు సుబ్రహ్మణ్యం. ఉద్యోగం పోయి, ఇంటిదగ్గర తండ్రి (జయప్రకాష్) చేసిన అప్పులు మీద పడి ఏం చేయాలా అని ఆలోచిస్తూంటే, పళని స్వామి దగ్గర ఒక పిస్తోలు కనిపిస్తుంది. దాని డిజైన్ కూడా చూపిస్తాడు పళని స్వామి. ఇక వాటి సాయంతో సుబ్రహ్మణ్యం డబ్బు సంపాదనకి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం మొదలెడతాడు. వాటిని శరత్ రెడ్డికే అమ్ముతాడు. దీంతో అటు తమిళనాడు నుంచి గన్స్ సప్లై చేసే రాజ మాణిక్యంతో  గొడవలొస్తాయి. ఈ గొడవల్లో సుబ్రహ్మణ్యం తండ్రిని చంపబోయిన శరత్ రెడ్డిని సుబ్రహ్మణ్యం కొట్టడంతో అతను కోమాలోకి పోతాడు. దీంతో తిమ్మారెడ్డి సుబ్రహ్మణ్యం మీద పగబడతాడు.
       
ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఏం చేశాడు
? తిమ్మారెడ్డినీ, అతడి తమ్ముడ్నీ ఎలా ఎదుర్కొన్నాడు? ప్రజలంతా సుబ్రహ్మణ్యంని దేవుడుగా ఎందుకు కొలిచారు? ప్రజల కోసం సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

వూళ్ళో  అరాచక శక్తుల్ని అణిచే, ప్రజలంతా ఆ అరాచక శక్తుల్ని అణిచిన కథానాయకుడ్ని కొలిచే, వందల సార్లు వచ్చిన రొటీన్ కథకి గన్ కల్చర్ /స్మగ్లింగ్ ని జోడించి కొత్త కథగా తయారు చేశారు. ఈ అరాచక శక్తుల పాత్రల్ని కేజీఎఫ్ సినిమాల్లోంచి దిగుమతి చేసుకున్నారు. గన్ కల్చర్ నార్త్ ఇండియాకి చెందినదైనా, దీన్ని తెలుగు నేటివిటీలోకి  తీసుకురావడానికి కేజీఎఫ్, పుష్ప  సినిమాల ఛాయల్ని అద్దారు. ఫలితంగా ఇది ఈ మధ్య వచ్చి ఫ్లాపయిన రూరల్ యాక్షన్ సినిమాలకి భిన్నంగా తయారయ్యింది. రెండున్నర గంటలు సాగినా బోరుకొట్టకుండా పకడ్బందీ చిత్రీకరణతో రూపొందింది. బలమైన సన్నివేశాలు, డైలాగులూ ఆద్యంతం కళ్ళు తిప్పుకోనివ్వకుండా చేస్తాయి. అయితే కరువయ్యిందేమిటంటే ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలు. డ్రామాలో భావోద్వేగాలు, యాక్షన్ లో భావోద్వేగాలూ లోపించాయి. అలాగే సస్పెన్స్, టెన్షన్, థ్రిల్స్, కథలో మలుపులూ లేక- కేవలం ఒక నాన్ స్టాప్ యాక్షన్ సినిమాగా తయారయ్యింది. ఒక రొటీన్ ప్రతీకార కథకి గన్ కల్చర్, కేజీఎఫ్, పుష్పల హంగులు కూర్చి, భావోద్వేగాల పరమైన లోపాల్ని కవర్ చేస్తూ, అనుభవజ్ఞుడిలా తీర్చిదిద్దాడు దర్శకుడు.
       
ఫస్టాఫ్ పూర్తిగా కథని సెటప్ చేయడంతో సరిపోతుంది. పోలీస్ స్టేషన్లో సునీల్ పాత్ర చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభమవుతుంది. వూళ్ళో అరాచకాలు
, ఆ అరాచకాల మధ్య సుధీర్ బాబు పాత్ర దిగడం, పాలి టెక్నిక్ లాబ్ లో పనిచేస్తూ టీచర్ ని ప్రేమించడం, ఒకడ్ని కొట్టడం, దాంతో ఉద్యోగం పోవడం, ఇంటికెళ్ళి  పోయి అప్పులపాయిన తండ్రిని ఓదార్చి తిరిగి రావడం,  సునీల్ పాత్ర దగ్గర పిస్తోలు చూసి నాటు పిస్తోళ్ళు తయారు చేయడం వగైరా జరుగుతూ, అరాచక శక్తులతో గన్ బిజినెస్, దీంతో తమిళనాడు గన్ స్మగ్లర్ తో గొడవలు, తండ్రి మీద హత్యా ప్రయత్నం, ఆ తర్వాత విలన్ తమ్ముడ్ని కొట్టి కోమాలోకి పంపడం - ఇదంతా ఫస్టాఫ్ కథ.
       
ఈ ఫస్టాఫ్ కథలో లోపాలేమిటంటే
, గన్స్ తయారు చేసి వూళ్ళో అరాచక శక్తులకే అమ్మడం, దాంతో ఇంకింత రెచ్చిపోయి ఆ అరాచక శక్తులు అక్కడి జనాల్నే  కాల్చి చంపడం. ఇది సుధీర్ బాబు పాత్రని దెబ్బతీసే కథనం. అప్పుడైనా తప్పు తెలుసుకుని,  గన్స్ తయారీ ఆపేసి, అరాచక శక్తుల మీద పోరాటం ప్రకటించడు. డబ్బు కోసం ఇంకా భారీ యెత్తున గన్స్ తయారు చేసి ఇతరప్రాంతాలకి స్మగ్లింగ్ చేస్తూంటాడు. ఇక తమిళనాడు గన్ స్మగ్లర్ వచ్చి గొడవ పడడం దేనికో అర్ధం కాదు. సుధీర్ బాబు పాత్ర వూళ్ళోకి రాకముందు ఈ గన్ స్మగ్లర్ అరాచక శక్తులకి గన్స్ అమ్మకుండా ఏం చేస్తున్నాడు? ఇప్పుడెందుకొచ్చి గొడవ పడుతున్నాడు?
        
ఇక సెకండాఫ్ పూర్తిగా పగబట్టిన విలన్ కథ. ఈ కథలో సుధీర్ బాబు వూరికి విలన్ పీడా తొలగించి దేవుడవుతాడు. పాత కథే కాబట్టి సెకండాఫ్ ఏం జరుగుతుందో తెలిసిపోయే కథ. కాకపోతే పక్కదోవ  పట్టకుండా కథ చెప్పిన విధానం -దీని వేగం - హై ఓల్టేజ్ యాక్షన్ కూర్చోబెడుతాయి. సుధీర్ బాబు అన్ని  రకాల ఆయుధాలు ఎలా తయారు చేశాడో లాజిక్ అడగకూడదు. మిలిటరీ ఆయుధాలు కూడా అతడి చేతిలో వుంటాయి. క్లయిమాక్స్ యాక్షన్ సీన్లో ఇంకో భారీ ఆయుధం తీస్తాడు. ముగింపు మాస్ ప్రేక్షకులకి మాంచి కిక్.

నటనలు- సాంకేతికాలు

కొత్త లుక్ తో, చిత్తూరు భాషతో సాధారణ యువకుడి పాత్రని సుధీర్ బాబు బాగానే పోషించాడు. ఆ ఉగ్ర సుబ్రహ్మణ్యం పాత్ర పోరాటానికి తగిన భావోద్వేగాలు కూడా వుంటే నటన ఆకట్టుకునేది. ఇంటర్వెల్లో విలన్ తమ్ముడ్ని కొట్టి కాన్ఫ్లిక్ట్ ప్రారంభించినప్పుడు అది డొల్లగా వుంది. అప్పటికి ఒక లక్ష్యం, దేన్నైనా పణంగా పెట్టి తీసుకున్న రిస్క్ వంటి గోల్ ఎలిమెంట్స్ కాన్ఫ్లిక్ట్ లో లేకపోవడం వల్ల భావోద్వేగాలు పుట్టకుండా పోయాయి.
        
శివ లో స్టూడెంటైన నాగార్జున మాఫియా రఘువరన్ అనుచరుడు జేడీని కొట్టి కాన్ఫ్లిక్ట్ ని ప్రారంభించినప్పుడు- అందులో ఒక సామాన్య స్టూడెంట్  గా నేరుగా ఓ పెద్ద మాఫియాతో పెట్టుకుంటూ క్రియేట్ చేసిన ఆందోళన, దీంతో అన్న కుటుంబాన్ని పణంగా పెడుతున్న రిస్కు వగైరా వర్కౌటై భావోద్వేగాలు బలంగా పుట్టుకొచ్చాయి.
        
సుధీర్ బాబు విలన్ తమ్ముడ్ని కొట్టడంవల్ల తనకెదురవబోయే ఏ అపాయాల జాడా లేదు. అందువల్ల తర్వాత కథకి ఏ భావోద్వేగాలూ పుట్టకుండా కాన్ఫ్లిక్ట్ డొల్లగా తయార
య్యింది. కష్టపడి బాగా నటించాడు. అయితే జీవంకూడా వుండాలి.
       
హీరోయిన్ మాళవికా శర్మ టెంప్లెట్ పాత్ర నటించింది. ఫస్టాఫ్ లో హీరో ప్రేమకి పనికొచ్చేట్టు
, క్లయిమాక్స్ లో విలన్ కి పనికొచ్చేట్టు కన్పించింది.  సుధీర్ నేస్తం గా సునీల్ గుంభనంగా కన్పించే పాత్ర పోషించాడు సీరియస్ గా. సుధీర్ తండ్రి పాత్రలో జయప్రకాష్ బాధిత పాత్ర హింసాత్మక దృశ్యాలతో నటించాడు.  ఇక విలన్ పాత్రధారులు ముగ్గురూ కేజీఎఫ్ తరహా క్రౌర్యాన్ని ప్రదర్శించారు.
       
సినిమాకి ప్రధాన బలం సాంకేతికాలు.
చైతన్ భరద్వాజ్ సంగీతంగానీ, అరవింద్ విశ్వనాథన్ ఛాయాగ్రహణంగానీ టాప్ క్లాస్ గా వున్నాయి. ఆంజనేయులు సమకూర్చిన యాక్షన్ సీన్స్ ఇంకో ఆకర్షణ. జ్ఞాన సాగర్ దర్శకత్వం వీటికి తీసిపోకుండా వుంది. అయితే ఓపెనింగ్స్ చూశాక సినిమాని ఇంకా బలంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం కనపడుతోంది.

—సికిందర్