రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Friday, October 22, 2021

1068 : రివ్యూ

రచన, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం : రేవంత్ కోరుకొండ‌
తారాగణం : సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌ తదితరులు
సంగీతం : శ్రవణ్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : రేవంత్ కోరుకొండ
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా క్రియెషన్స్
, నిశృంఖల ఫిలిమ్స్
నిర్మాతలు : దిల్ రాజు
, సంధ్యా రాజు
విడుదల : అక్టోబర్ 22
, 2021

***

        ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యా రాజు నటించిన నాట్యం దిల్ రాజు సహ నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొత్త దర్శకుడు రేవంత్ కోరుకొండ దీన్ని రూపొందించాడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు దీనికి చేసిన ప్రచారం ఓ యెత్తు. దీంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. మరి ఈ హైప్ కంతటికీ న్యాయం చేసేలా వుందా ఈ మూవీ? చూద్దాం...


 కథ
        నాట్యం అనే గ్రామంలో సితార (సంధ్యారాజు) కి నాట్యమంటే ప్రాణం. గురువు (ఆదిత్యా మీనన్) చెప్పిన కాదంబరి అనే నర్తకి కథ విని, అలా నాట్యం చేయాలని నేర్చుకుంటుంది. ఆ నాట్యం ద్వారా కాదంబరి కథ చెప్పాలని కలలు గంటుంది. ఇంతలో రోహిత్ (రోహిత్ బెహ‌ల్‌) అనే అతడితో వ్యవహారం ఆమెని వూళ్ళోంచి వెలి వేసేలా చేస్తుంది. అతడితో కలిసి సిటీకి చేరిన సితార తిరిగి వూళ్ళో ఎలాగైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సంకల్పిస్తుంది. మరి ఆ లక్ష్యం నెర వేరిందా, ఎలా నెర వేరిందనేది మిగతా కథ.

ఎలా వుంది కథ

   నాట్యకళ గురించి ఈ రోజుల్లో సినిమా తీయడం సాహసమే. ఇందుకు ముందు అభినందించాలి నిర్మాతల్ని, దర్శకుడ్ని. దర్శకుడు గతంలో దీన్ని షార్ట్ ఫిలిమ్ గా తీశాడు. తర్వాత ఇప్పుడు సినిమాగా తీశాడు. ఇందులో ప్రధాన పాత్ర సీతారగా నటించిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి సంధ్యారాజు, రాంకో ఇండస్ట్రీస్ ఛైర్మన్ పిఆర్ వెంకట్రామ రాజు కుమార్తె మాత్రమే గాకుండా, సత్యం రామలింగ రాజు కోడలు కావడం విశేషం. దీంతో సినిమాకి హైప్ వచ్చింది. ఆమె డా. వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెయ్యికి పైగా నాట్య ప్రదర్శన లిచ్చారు. నిశృంఖల పేరుతో నాట్యకళా శాల నిర్వహిస్తూ ఉచితంగా నాట్యం నేర్పుతున్నారు. అయితే ఇదే తను నటించిన మొదటి సినిమా కాదు. 2017 లో మలయాళ కేర్ఫుల్ (యూటర్న్ రీమేక్) లో నటించారు.

        నాట్యం కథ ద్వారా దేవాలయాల్లో గతించిన నాట్య ప్రదర్శనల సాంప్రదాయ ప్రాముఖ్యం గురించి చెప్పడం ఉద్దేశం. కానీ చెప్పిన విధానం ఈ మంచి ఉద్దేశానికి సహకరించలేదు. దీనికి ప్రస్తుత కాలంలో హీరోతో ప్రేమ కథ, ఇంకోవైపు గతం తాలూకు కాదంబరి ఫ్లాష్ బ్యాక్ కలిపి చేసిన ప్రయత్నం కలిసిరాలేదు. కాదంబరి కథతో నాట్యం చేస్తే చనిపోతారనే మూఢనమ్మకాన్ని తొలగించడం హీరోయిన్ లక్ష్యం. ఈ లక్ష్యం బాగానే వున్నా, కొత్త దర్శకుడి అనుభవ రాహిత్యంతో పూర్తిగా అభాసుపాలైంది. తను కె. విశ్వనాధ్ సినిమాల అభిమానినని చెప్పుకుంటూ, ఆ అభిమానాన్ని ఇలా చాటుకోవడం మాత్రం అమెచ్యూరిష్ గా వుంది. ఇంతకంటే దీని గురించి చెప్పుకోవడానికి లేదు.

నటనలు - సాంకేతికాలు


        నటిగా కంటే నాట్యకారిణిగా సంధ్యారాజు రాణించారు. ఆమె చేసిన నాట్యాలు వండర్ఫుల్. క్లయిమాక్స్ నాట్యం ఇంకా వండర్ఫుల్. నాట్యాలకి కి సంగీత దర్శకుడు, కొరియోగ్రాఫర్ లు కూడా ప్రాణం పోశారు. అయితే పాత్ర నటించడం మాత్రం ఆమెకి సాధ్యం కాలేదు. నాట్యకారిణికి నటన ఎందుకు రాదనేది పెద్ద ప్రశ్న. నాట్యంలో ప్రదర్శించే హావభావాలు నటనలో ఎందుకు ప్రదర్శించలేరు? ఈ విషయంలో ఎందుకో ఆమె పూర్తిగా విఫలమయ్యారు. పైగా హీరో గా నటించిన రోహిత్ బెహ‌ల్‌ తో రోమాన్స్ పెట్టారు. దర్శకుడి చేతిలో ఈ రోమాంటిక్ ట్రాక్ ఎంత సిల్లీగా వుందో, హీరోతో బాటు ఆమె నటనా అంత సిల్లీగా వుంది. హీరో నటన నేర్చుకోవడానికి ఈ సినిమాలో నటించినట్టు అనిపిస్తాడు. అదేం నటనో అర్ధంగాదు.  

        ఇక గురువుగా  ఆదిత్యామీనన్ చిన్న పాత్ర వేస్తే, భానుప్రియ, శుభలేఖ సుధాకర్ లు కూడా రెండు చిన్న పాత్రలేశారు. క్లయిమాక్స్ లో కమల్ కామరాజు నాట్యం బావుంది. ప్రొడక్షన్  రిచ్ గా అనిపించేలా ఖర్చు పెట్టారు గానీ, దర్శకుడే ఛాయాగ్రహణం, కూర్పు కూడా నిర్వహించడంతో టెక్నికల్ గా పూర్ గా వుంది.

        ఫస్టాఫ్ కథ ఎత్తుగడ బావుంది, ఓ ఇరవై నిమిషాల పాటు క్లయిమాక్స్ బావుంది. మధ్యలో కథాకథనాలు, నటనలు, దర్శకత్వం మాత్రం సహనాన్ని పరీక్షిస్తాయి. యువదర్శకుడు ఇంత పాత మోడల్లో ఎలా తీస్తాడా అన్పించేలా!

—సికిందర్