రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Sunday, April 2, 2017

      తెలుగులో పౌరాణికాలు, జానపదాలు, కుటుంబ కథలు, ప్రేమ కథలు,  సామాజిక కథలు, భక్తి  కథలు, కామెడీ కథలు మొదలైనవి తప్పితే యాక్షన్, క్రైం, హార్రర్,  సైన్స్ ఫిక్షన్ కథలతో వచ్చిన సినిమాలు  హాలీవుడ్  నుంచి స్ఫూర్తి పొంది దిగుమతి చేసుకున్న కథా ప్రక్రియలే. అలా దిగుమతి చేసుకున్న యాక్షన్ విభాగంలో  జేమ్స్ బాండ్, కౌబాయ్ సినిమాలు కూడా 1970 లలో తెలుగులో ప్రారంభమయ్యాయి. 1960 లలో ప్రారంభమైన హార్రర్, సైన్స్ ఫిక్షన్ విభాగాలు కూడా నేటి దాకా కొనసాగుతూనే వున్నాయి. కానీ క్రైం విభాగం కూడా హాలీవుడ్ నుంచే దిగుమతి అయినా, అంతగా అభివృద్ధి చెందక వుండిపోయింది.  ఈ విభాగంలో మర్డర్ లేదా ఇంకేదైనా నేరంతో కూడిన మిస్టరీలు తెలుగులో తీయడం ఎప్పుడోగానీ జరగడం లేదు. 

          
హాలీవుడ్ లో టాకీలు ప్రారంభమైన వెంటనే,  1930 లలోనే క్రైం సినిమాలు తీయడం మొదలెట్టారు. వీటికి ముడి సరుకు ఆ డిటెక్టివ్ సాహిత్యమే. ప్రసిద్ధ డిటెక్టివ్  నవలా రచయిత రేమండ్ చాండ్లర్  సృష్టించిన ఫిలిప్ మార్లో అనే డిటెక్టివ్ పాత్రతో ఆనాడు అనేక క్రైం సినిమాలు తీశారు.  ది బిగ్ స్లీప్, టైం టు కిల్, ది లాంగ్ గుడ్ నైట్ ...ఇంకా ఎన్నో. అలాగే ఇంకో ప్రసిద్ధ రచయిత డెషిల్  హెమెట్ సృష్టించిన శామ్ స్పేడ్ డిటెక్టివ్ పాత్రతో మాల్టీజ్ ఫాల్కన్, ది లైఫ్ ఆఫ్ రిలే లాంటి క్రైం సినిమాలెన్నో  వచ్చాయి. ఇతర సినిమా రచయితలూ, దర్శకులూ కూడా వీటివైపు ఆకర్షితులై వందలాది సినిమాలతో ఒక ట్రెండ్ నే  సృష్టించారు. దాదాపు రెండు దశాబ్దాల కాలం పాటు ఇది మొదటి దశగా తెలుపు నలుపు సినిమాలతో కొనసాగింది. అప్పుడు ఈ క్రైం జానర్ కి ఫిలిం నోయర్ అని పేరు పెట్టారు. నోయర్ అంటే ఫ్రెంచి భాషలో డార్క్ అని అర్ధం. అంటే డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. డార్క్ ఫిలిమ్సే కదా అని ఈ క్రైం సినిమాలని ఎలాపడితే అలా తీసేవాళ్ళు కాదు. దీనికీ ఒక సైన్స్ వుండేది. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. 

          ఇదే ఫిలిం నోయర్ జానర్  కలర్ సినిమాలొచ్చాక, కొంచెం సైన్స్ ని కూడా మార్పు చేసుకుని,1960 ల నుంచీ నియో నోయర్ గా ప్రారంభమయ్యింది. నియో అంటే నూతనం. అంటే నూతనంగా మారిన  డార్క్ ఫిలిమ్స్ అన్నమాట. ఈ నియో నోయర్ దశ వచ్చేసి ఇప్పటికీ అరవై ఏళ్లుగా అప్రతిహతం
గా కొనసాగుతోంది హాలీవుడ్ లో. దీని సైన్స్ గురించి కూడా తర్వాత చెప్పుకుందాం.


రేమండ్ చాండ్లర్ 
         ఇదంతా ఇప్పుడెందుకంటే, కొంత కాలంగా తెలుగులో వస్తున్న లో- బడ్జెట్ సినిమాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఎక్కువ తీసేది ఇవే, ఎక్కువ మందికి ఉపాధి కల్పించేవీ ఇవే. ఐతే హార్రర్ కామెడీలు, కాకపోతే  రోమాంటిక్ కామెడీలూ  అనే బాక్సాఫీసు అప్పీల్ కోల్పో యిన ఇవే  సినిమాలు ఇంకా ఇంకా వందల సంఖ్యలో తీస్తూ (గత సంవత్సరం 117) గిలగిల కొట్టుకుంటున్నారు. హార్రర్ కామెడీల వైపు ఇప్పుడు దోమలు కూడా తిరిగి చూడడం లేదు. రోమాంటిక్ కామెడీలకి జనం రావాలంటే మినిమం రాజ్ తరుణ్  లాంటి క్రేజ్ వున్న హీరో వుండాలి. అంతకి తగ్గిన వాడుంటే, లేదా కొత్త వాడు వస్తే దోమలు కాదుకదా చీమలు కూడా దూరడానికి ససేమిరా అంటున్నాయి. పిచ్చిగా నచ్చావ్,  గట్టిగా గిచ్చావ్ అంటూ వచ్చే చిత్తకార్తె  రోమాంటిక్ కామెడీల్ని ఇక కట్టి పెట్టేసుకునే సమయమొచ్చేసింది. ఈ సినిమాలు తీసేవాళ్ళు గనుక మల్టీ ప్లెక్సుల్లో సినిమాలు చూడడం మానేసి, అన్ని వర్గాల ప్రేక్షకులూ వచ్చే సింగిల్ స్క్రీన్ థియేటర్లకి  వెళ్లి సినిమాలు చూస్తూంటే, సినిమా మార్కెట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఏసీ గదుల్లో కూర్చుని స్క్రిప్టు రాయలేరనేది పాత కొటేషన్, మల్టీ ప్లెక్సుల్లో చూస్తూ సినిమాలు తీయలేరనేది నేటి కొటేషన్. 


          విషయమేమిటంటే, హార్రర్ కామెడీలకీ, రోమాంటిక్ కామెడీలకీ ఇక  వుండని జనం-  అటు తమిళనాడు నుంచీ, ఇటు కేరళ నుంచీ  వచ్చే క్రైం సినిమాలకి వుంటున్నారు!  ఆ డబ్బింగుల్లో తెలీని మొహాలైనా,  కొత్త మొహాలైనా, పరమ చెత్త మొహాలైనా, ఎవరున్నా కూడా ఎగబడుతున్నారు జనం. ఈ మూడు నెలల్లో వచ్చిన కనుపాప, 16 డి, నగరం, మెట్రో అనే క్రైం జానర్ సినిమాలకి ప్రేక్షకులు వుంటున్నారంటే అలోచించాల్సిందే.  సర్వ సాధారణంగా స్టార్స్ వుంటే తప్ప తమిళ మలయాళ డబ్బింగులు ఆడవు. స్టార్స్ లేకపోయినా  ఈ క్రైం డబ్బింగుల హావాతో మార్కెట్ ఏం సూచన లిస్తోంది? ఇక హార్రర్ లూ రోమాన్సులూ కట్టిపెట్టేసి క్రైం వైపుకు  వెళ్ళమనేనా?

ఫిలిం నోయర్- ‘టచ్ ఆఫ్ ఈవిల్’ (1958)

     మార్చి 31 వరకూ విడుదలైన రోమాంటిక్ కామెడీలు చూస్తే, ఇంకేంటి నువ్వే చెప్పు, నంబర్ వన్ హీరో రాజేందర్ లవ్ స్టోరీ, పడమటి సంధ్యారాగం లండన్లో, ఏ రోజైతే చూశానో, ఇక సెలవ్, కేరాఫ్ గోదావరి, కన్నయ్య, నువ్వెవరో నేనెవరో, లవర్ బాయ్, ఓ పిల్లా నీవల్ల... అని ఈ మూడు నెలల కాలంలో కొత్త కొత్త హీరోలతో పదకొండుకి పదకొండూ గల్లంతయ్యాయి.  సూక్ష్మజీవులు కూడా వీటిని కన్నెత్తి చూడలేదు. ఇక - ఎవరో తానెవరో అనే హారర్, ఆకతాయి అనే పాత మసాలా, వజ్రాలు కావాలా నాయనా అనే కామెడీ అడ్రసు లేకుండా పోయాయి. 

          ఇవి చాలనట్టు ఏప్రిల్ మొదటి వారంలో-   ఎంతవరకు ఈ ప్రేమ?, చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే... అంటూ మరో రెండు కొత్త మొహాల మహాద్భుత  రోమాంటిక్ కామెడీలు! 

          ఇక నెలనెలా ఈ కోటా భర్తీ అవుతూనే వుంటుంది. ఎవరీ దర్శకులు? ఎవరీ నిర్మాతలు? ఎవరికోసం తీస్తున్నారు? ఏ మార్కెట్ కోసం తీస్తున్నారు? వీళ్ళనుకుంటున్న మార్కెట్ ఇప్పుడుందా?  వీళ్ళనుకుంటున్న ఈ రోమాంటిక్ కామెడీల మార్కెట్ ఇప్పుడు హోటల్లో క్లీనర్ చేతిలో వుంది, పాన్ షాపులో కుర్రాడి చేతిలో వుంది, కాలేజీలో స్టూడెంట్ చేతిలో వుంది... వాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ అనే  బెత్తెడు తెర వుంటే,  అందులో థియేటర్లలో పసలేని రోమాంటిక్ కామెడీలని మించిన రియలిస్టిక్ రోమాన్సుల షార్ట్ ఫిలిమ్స్ వుంటున్నాయి.. అవే  తెగ ఎంజాయ్ చేస్తున్నారు  పట్టణం నుంచీ పల్లె దాకా. పిల్లకాయ రోమాంటిక్,  హార్రర్ సినిమాల మార్కెట్ నంతా స్మార్ట్ ఫోన్స్ లో మెచ్యూర్డ్ షార్ట్ ఫిలిమ్స్ తన్నుకుపోయాయి! 


నియో నోయర్- ‘యూజువల్  సస్పెక్ట్స్’  (1995) 

          ఇలా చిన్న సినిమాల మార్కెట్ కి ఒక ఖాళీ అంటూ ఏర్పడితే, ఈ  ఖాళీని ముక్కూ మొహం తెలీని నటులతో క్రైం డబ్బింగులు భర్తీ చేస్తున్నాయి. ఇటీవలే ఒక కొత్త దర్శకుడు రోమాంటిక్ కామెడీ రాసుకుని ఒక కొత్త నిర్మాత దగ్గరికి పోయాడు. ఆ నిర్మాత ఓపిగ్గా విని- మర్డర్ మిస్టరీ కావాలన్నాడు. ‘దృశ్యం’ లాంటిది. ఆ కొత్త దర్శకుడు ఇంకో నిర్మాత దగ్గరికి పోయాడు. ఆయన కూడా  ‘క్షణం’ లాంటి థ్రిల్లర్ కావాలన్నాడు. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఇలా ఆలోచించే నిర్మాతలు పెరిగితే తప్పకుండా తెలుగు క్రైం సినిమాలతోనే ఈ ఖాళీ భర్తీ అవుతుంది. లేకపోతే పాతాళంలోకే  పోతూంటారు ప్రేమ సినిమాలతో. ప్రేమ సినిమాలు తీయాలనుకుంటే క్రేజ్ వున్న హీరోతో తీసుకోవచ్చు. పనిమాలా కొత్త మొహాలతో తీస్తే కృష్ణ బిలాలు సిద్ధంగా వుంటాయి మింగెయ్యడానికి.  ఇదే కొత్త మొహాలతో క్రైం జానర్ తీస్తే – పాచి ప్రేమలతో, పిచ్చి దెయ్యాలతో మొహం మొత్తిన ప్రేక్షకులకి ఆటవిడుపుగా వుంటుంది కనీసం కొంత కాలం పాటు. ఇద్దరు నిర్మాతల దగ్గర ప్రయత్నించిన ఆ  కొత్త దర్శకుడు ఒక నిర్మాతని ఖాయం చేసుకుని, ఆ రోమాంటిక్ కామెడీని మర్డర్ మిస్టరీగా మార్చడానికి ఈ వ్యాసకర్తని సంప్రదించాడు, అది వేరే విషయం. తెలుగులో చిన్న సినిమాలు తీసే, చిన్న సినిమాలతో పరిచయమయ్యే దర్శకులతో సమస్యే మిటంటే, మార్కెట్ యాస్పెక్ట్ తెలీడం లేదు. టాలీవుడ్ ని జయించడానికి ఏ అలెగ్జాండర్ వచ్చినా, అవే రోత  రోమాంటిక్ కామెడీలు, అవే పాత రోమాంటిక్ డ్రామాలు, అవే నికృష్ట హార్రర్ కామెడీలూ.... ఇవి తప్ప ఇంకో కథా ప్రపంచంతో పరిచయమే వుండడం లేదు.


          క్రైం జానర్ లేకుండాపోయి  ఒక ఖాళీయే కాదు, నిజానికి ఇంకోటి కూడా లేక ఇంకో ఖాళీ కూడా భర్తీ కాకుండానే,  దాదాపు మర్చిపోయేంత ప్రమాదంలో పడింది. అది కామెడీ జానర్. నాటి జంధ్యాల, వంశీ, ఇవివి సత్యనారాయణ, రేలంగి నరసింహా రావుల తర్వాత ఈ తరంలో ఒక్కరంటే ఒక్కరూ  కామెడీ దర్శకులుగా రాలేదు. కామెడీ హీరో అల్లరి నరేష్ పరిస్థితే  ఇందుకు అద్దం పడుతుంది. ఈ ఖాళీని భర్తీ చేసి చుక్కల్లో చంద్రుడులా ప్రకాశి ద్దామని ఎవరికీ ఆసక్తే లేదు. ఎందుకంటే,  పుట్టి పెరిగినప్పట్నించీ కామెడీ జానరే తెలీదు. 2000 నాటి నుంచీ మొదలైన ప్రేమ సినిమాలే చూస్తూ పెరిగిన తరం, ఇంకే భిన్న కథా ప్రపంచాన్ని వూహించగలదు గనుక.  ఇలా   క్రైం జానర్ గురించి కూడా తెలియకుండానే పోయింది. 

          ఇక్కడ చెప్ప కూడదనుకున్నా ఒకటి చెప్పేయాల్సి వస్తోంది- ఈ వ్యాసకర్తకి పరిచయమవుతున్న, దర్శకులవ్వాలని ప్రయత్నిస్తున్న వాళ్ళలో,  నూటికి 99 మంది మందికి -  క్రైం జానర్ గురించేమీ తెలీదు. కనీసం పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు. బెయిల్, రిమాండ్, చార్జి షీట్  నుంచీ మొదలు పెడితే ఫోరెన్సిక్ సైన్స్ దాకా ఏమీ తెలీదు! మరో వైపు అటు తమిళంలో '16 డి' తీసిన 21 ఏళ్ల యువదర్శకుడి క్రైం ఇన్వెస్టిగేషన్ పరిజ్ఞానం తలపండిన వాడి పనితనంగా ఆశ్చర్యపరుస్తోంది.   కొత్త వాళ్ళని పక్కన పెడదాం, ఎన్నాళ్ళ నించో  పనిచేస్తున్న కో- డైరెక్టర్స్ కి కూడా కొందరికి  పోలీసు, న్యాయ వ్యవస్థల పనితీరులు తెలీవు! ఇక కొందరు దర్శకులకైతే పోలీసులకీ ఏసీబీ అధికారులకీ  తేడాయే తెలీదు. సీఐ పరిధిలో వుండే హత్య కేసు దర్యాప్తులు వీళ్ళ సినిమాల్లో ఎస్సై లు చేసేస్తూంటారు!  

           ఈ పరిస్థితుల్లో బంగారు అవకాశంలా పొంచి వున్న-   చిన్న సినిమాల పరంగా మార్కెట్లో ఏర్పడ్డ శూన్యాన్ని,   క్రైం సినిమాలతో ఎవరు భర్తీ చేయగలరు? ఆల్రెడీ శేఖర్ సూరి వున్నాడనుకుంటే,  ఆయన హార్రర్ అనుకుంటూ ఎటోపోయాడు. రవిబాబు వున్నాడనుకుంటే, ఈయన కూడా తానేమిటో అర్ధం జేసుకోలేక ఇంకెటో పోతున్నాడు.

          ఇలాంటప్పుడు ఈ వ్యాసం ఎవరికోసం రాయాలి?
          ఇది రేపు తెలుసుకోవడానికి అన్నివిధాలా ప్రయత్నిద్దాం...


- సికిందర్