రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, November 23, 2021

1091 : హాలీవుడ్ రివ్యూ

 

మార్వెల్ స్టూడియోస్ సరికొత్త ప్రపంచ కానుకగా షాంగ్ చీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది 10 రింగ్స్ తో ప్రేక్షకుల్ని అలరించేందుకు వచ్చేసింది. బాక్సాఫీసుకి పట్టిన కోవిడ్ దుమ్ము దులుపుతోంది. వుషూ, కైనెటిక్, వుక్సియా మొదలైన డిఫరెంట్ ఫైటింగ్ స్టయిల్స్ తో అద్భుతాలు చేస్తోంది. ముఖ్యంగా ఏడాది పాటు ప్లాన్ చేసిన బస్సు యాక్షన్ సీనుతో వైరల్ అవుతోంది. హీరో ప్లస్ స్టంట్ మాన్ సిము లియూ షాంగ్ చీ గా కొత్త సూపర్ మాన్ గా అవతరించాడు. సిము లియూతో బాటు నటవర్గమంతా చైనీయులతో నిండిపోయిన ఈ సూపర్ మెగా ఫాంటసీ అడ్వెంచర్ ఓ హోమ్లీ ఎంటర్ టైనర్. వికృత జీవులతో పోరాటంతో బాటు, విడిపోయిన ఫ్యామిలీ కథ కూడా చూపించే ఈ టెన్ రింగ్స్ కున్న అద్భుత శక్తులేమిటి? ఒక షార్ట్ ఫిలిమ్ తో బాటు, మరో మూడు ఛోటా మోటా సినిమాలు మాత్రమే తీసిన ఆసియన్ మూలాలున్న దర్శకుడు డెస్టిన్ డానియేల్ క్రెటన్, ఇంత భారీ హాలీవుడ్ ప్రాజెక్టుని ఎలా నిర్వహించాడు? ఇవి చూద్దాం...

కథ
        వెన్వూకి అధికార దాహం ఎక్కువ. టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్ అనే దాన్ని స్థాపించి, ప్రభుత్వాల్ని పడగొడుతూ, రాజ్యాల మీద రాజ్యాలు జయిస్తూ వుంటాడు. వెయ్యేళ్ళుగా అతను ఈ దండయాత్రలు చేస్తూ వుంటాడు. అతడి చేతిలో తిరుగు లేని టెన్ రింగ్స్ అనే దైవిక ఆయుధముంది. దాంతో దైవిక శక్తులూ అమరత్వమూ అతడి సొంత మయ్యాయి. ఈ క్రమంలో 1996 లో చైనీస్ పురాణ మృగాలున్న టాలో అనే గ్రామాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తే, రక్షక భటురాలు ఇంగ్ లీ అడ్డుకుని ఓడిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. గ్రామస్థులు వెన్వూని వ్యతిరేకించినా అతడితోనే వెళ్ళిపోతుంది ఇంగ్ లీ. వాళ్ళకి పెళ్ళయి షాంగ్ చీ అనే కొడుకు, జియాలింగ్ అనే కూతురు పుడతారు. ఇక ఆర్గనైజేషన్ని మూసేసి, 10 రింగ్స్ ని  పక్కన పెట్టేస్తాడు వెన్వూ.

        కొడుకు షాంగ్ చీ పెరుగుతున్నప్పుడు తల్లిని ఐరన్ గ్యాంగ్ అనే వెన్వూ శత్రువులు చంపేస్తారు. దీంతో షాంగ్ చీకి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇప్పించి, ఐరన్ గ్యాంగ్ నాయకుణ్ణి చంపేయమని పంపుతాడు వెన్వూ. ఆ నాయకుణ్ణి కొడుకు షాంగ్ చీ చంపేశాక, తండ్రి గురించి ఒక నిజం తెలిసి, శాన్ ఫ్రాన్సిస్కో పారిపోతాడు. అక్కడ షాన్ అని పేరు మార్చుకుంటాడు. 

  ప్రస్తుతానికొస్తే, షాన్ ఒక స్టార్ హోటల్లో కేటీ అనే యువతితో కలిసి పని చేస్తూంటాడు. తన పుట్టుపూర్వోత్తరాలు రహస్యంగా వుంచుతాడు. మరో వైపు చెల్లెలు జియాంగ్ లీ కూడా ఇంట్లోంచి పారిపోయి, ఇప్పుడు మకావూలో అండర్ గ్రౌండ్ ఫైట్ క్లబ్ నడుపుతూంటుంది. షాంగ్ చీ మెడలో చిన్నప్పుడు తల్లి ఇచ్చిన లాకెట్ వుంటుంది. దాని కోసం షాంగ్ చీ మీద 10 రింగ్స్ గ్యాంగ్ వచ్చేసి దాడి చేస్తారు. ఆ దాడిని తిప్పి కొట్టి, చెల్లెలి మీద కూడా లాకెట్ కోసం జరిగిన అలాటి దాడిని తిప్పికొడతాడు షాంగ్ చీ. ఇప్పుడు అక్కడికి తండ్రి వెన్వూ వచ్చేస్తాడు.

        ఇప్పుడు దేనికి వచ్చాడు వెన్వూ? ఈ తండ్రి అధికార కాంక్ష, హింసాత్మక చరిత్ర  పడక దూరమైన షాంగ్ చీ ఇప్పుడేం చేశాడు? ఇద్దరి మధ్య వైరం ఎక్కడికి దారి తీసింది? వెన్వూ కోరిన కోరికేమిటి? అది షాంగ్ చీ తీర్చాడా? ఇందులో టెన్ రింగ్స్ దైవిక ఆయుధం పోషించిన పాత్రేమిటి? ఇదీ మిగతా కథ.

కామిక్ బుక్ ఫాంటసీ

1973 లో మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ కి పోటీగా, సాంస్కృతిక వారసుడిగా, షాంగ్ చీ అనే అమెరికన్ సూపర్ హీరో కామిక్ బుక్ పాత్ర సృష్టించి, బొమ్మల కథలు చెప్పారు రచయిత స్టీవ్ ఇంగిల్ హార్ట్, చిత్రకారుడు జిమ్ స్టార్లిన్. డిస్నీ కామిక్స్ కి ఇదొక పాపులర్ సిరీస్. మార్వెల్ స్టూడియోస్ రూపొందిస్తున్న కామిక్ సిరీస్ లో భాగంగా, 25 వ మూవీగా షాంగ్ చీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ పేరుతో దీన్ని తెర కెక్కించారు.

        
ఇది చైనీస్ వీర గాథ. అందుకని నటీనటులందరూ చైనీసే కన్పిస్తారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం కథకి వేదిక. అమెరికాలోని చైనీస్ సమాజం తప్ప మరొకటి ఇందులో కన్పించదు. కోవిడ్ సమయంలోనే నిర్మాణం జరుపుకుంటున్నా, కోవిడ్ కి చైనా కారణమనే బలపడిన అభిప్రాయాలకి, విమర్శలకీ సినిమాలో తావివ్వకుండా; రాజకీయాలకీ, వివక్షకీ దూరంగా చైనీయుల అందమైన కథ అమెరికాలో చూపించారు అమెరికన్ నిర్మాతలు. మన అక్షయ్ కుమారేమో ఒక మత వర్గానికి వ్యతిరేకంగా సూర్యవంశీ తీసి ఆనందించాడు. జేబులు నింపుకున్నాడు. ఏదైనా కుల వర్గానికి వ్యతిరేకంగా కూడా ఒకటి తీసి వుంటే తెలిసేది ఏం జరిగేదో.      


  చైనా కథని చైనీయులతోనే తీయాలనుకుని రచయితనీ (డేవిడ్ కాలహామ్),  దర్శకుడినీ (డెస్టిన్ డానియేల్ క్రెటన్) కూడా చైనీస్ - అమెరికన్లనే తీసుకున్నారు. ప్రధానంగా ఈ కథ చెదిరిపోయిన కుటుంబం గురించి. కుటుంబం చెల్లాచెదురవడానికి కుటుంబ పెద్ద వెన్వూ దుష్టత్వం కారణమైతే, కుటుంబం కలవకుండా అడ్డుకునేది డ్వెల్లర్- ఇన్- డార్క్ నెస్ అనే చైనీస్ పురాణ వికృత దుష్ట జీవి. షాంగ్ చీ తండ్రి తోనూ, డ్వెల్లర్-ఇన్- డార్క్ నెస్ తోనూ పోరాడతాడు. దివ్య శక్తులున్న 10 రింగ్స్ ని అస్త్రాలుగా ధరించిన తండ్రిని ఓడించడం అతడికి తెలిసిన ఏ విద్యతోనూ సాధ్యం కాదు గానీ, అదే 10 రింగ్స్ ని తను చేపట్టాక వికృత దుష్ట జీవిని అంతమొందించి విజయం సాధించ గల్గుతాడు. మోచేతులకి ధరించే ఈ రింగ్స్ మరేమీటో కాదు, విష్ణువు చేతిలో సుదర్శన చక్రానికి ప్రతి రూపాలే అనుకోవాలి. ఇలా దైవ శక్తి (మతం) తో దుష్ట శిక్షణ చేయాల్సింది పోయి, రాజకీయాలకి వాడుకుని మనుషుల్ని చంపుతున్నాడు వెన్వూ. టెన్ రింగ్స్ తో తనే దశ కంఠుడుగా మారిపోయాడు. ఇలాటి వాళ్ళకి శిక్ష డ్వెల్లర్-ఇన్- డార్క్ నెస్ లాంటి దైవాన్ని ఎదిరించే ఇంకో దుష్ట శక్తి చేతిలోనే వుంటుందని చెప్పే కథ. దీనికి యాక్షన్ కథగా సాగే కుటుంబ కథగా షుగర్ కోటింగ్ ఇచ్చి నిలబెట్టారు.

హింసలేని అద్భుత రసం

అద్భుత రసపు కథల్లో హింస వుండదు. జేమ్స్ బాండ్ సినిమాల్లో హింస వుండదు, యాక్షన్ వుంటుంది. హింస బీభత్స రసపు తరగతి. అద్భుత రసంతో ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎక్కడా రక్తం చిందించకుండా, జుగుప్స లేకుండా హోమ్లీగా వుంటుంది. తెలుగు సినిమాల్లో లాగా అరుచుకుని ఖడ్గాలతో ఉరుకురికి తెగ నరుక్కుని, మురికి రక్తాలు పారించే లాంటి సోకాల్డ్ ఫ్యామిలీ స్టోరీ కాదిది. ఈ ఫ్యామిలీ పూర్వ కథ కొంత మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ లో వస్తుంది. తల్లితో చిన్నప్పుడు షాంగ్ చీ, అతడి చెల్లెలి అనుబంధం సహా. సున్నిత కథగా చెప్పే చిన్నప్పటి మాంటేజెస్ అన్నీ డబుల్ హోమ్లీగా వుంటాయి- టాలో చైనీస్ గ్రామంలో. గ్రామం సెట్ వొక అందమైన ఫోటో ఆల్బమ్.

శాన్ ఫ్రాన్సిస్కో సీన్స్ ఆధునిక సెటప్. ఇక్కడ ఆధునిక కమర్షియల్ పాత్రలుంటాయి హీరో హీరోయిన్లు సహా. హీరోహీరోయిన్ల మధ్య తర్వాత ప్రేమకి దారితీసే స్నేహం సరదాగా వుంటుంది. తన స్కిల్స్ నీ, గతాన్నీ ఆమెనుంచి దాస్తూంటాడు. పబ్లిక్ బస్సులో టెన్ రింగ్స్ గ్యాంగ్ తో యాక్షన్ సీనులో అతడి విశ్వరూపం చూసి హూ ఆ ర్యూ?’ అంటుంది అనుమానంగా. తర్వాత తండ్రి వచ్చి ఒక కోరిక కోరాక, కథ చైనీస్ టాలో గ్రామానికి మారుతుంది. తల్లి ఇంగ్ లీ చనిపోలేదనీ, ఈ గ్రామంలోనే బంధించి వుందనీ అనుమానం తండ్రికి. ఈ గ్రామానికి పెద్ద పీడలా వుంటుంది డ్వెల్లర్- ఇన్- డార్క్ నెస్ అనే చైనీస్ పురాణ వికృత దుష్ట జీవి.

        చాలాసార్లు చెప్పుకున్నట్టు హాలీవుడ్ హై కాన్సెప్ట్ సినిమాలు  సింపుల్ కథ- భారీ యాక్షన్ గా వుంటాయి. ఇది కూడా అంతే. ఈ సింపుల్ కథ వల్ల సెకండాఫ్ కొంత సేపు డల్ గా వుండడం గమనించ వచ్చు. మొదట తండ్రీ కొడుకుల మధ్య సంఘర్షణ, తర్వాత దుష్ట జీవితో సంఘర్షణగా వుంటుంది ఈ ఫాంటసీ కథ.

హాలీవుడ్ తో చైనీస్ నట వర్గం

మొదటే చెప్పుకున్నట్టు ఈ చైనీస్ కథలో నటులందరూ చైనీయులే. కని పించేదంతా అమెరికాలో చైనీస్ సమాజమే, సంస్కృతే. నట వర్గంలో కొత్త మార్వెల్ హీరో షాంగ్ చీ పాత్రలో సిము లియూ, స్టంట్ మాన్ కూడా కావడంతో సీజీ తోడ్పాటుతో యాక్షన్ సీన్స్ థ్రిల్ చేస్తాయి. అతడి పాత్ర ద్విముఖాలుగా వుంటుంది. పైకి యాక్షన్ తో బలంగా వున్నా, లోపల చిన్నప్పట్నుంచీ మోస్తున్న కుటుంబ ట్రాజడీతో బలహీనంగా వుంటాడు. ఈ కుటుంబ ట్రాజడీ అతణ్ణి చివరిదాకా వెన్నాడు తూంటుంది.  

        తల్లి హత్యకి గురయింది, చెల్లెలు ఏమైందో తెలీదు, తండ్రి అలా వున్నాడు... నువ్వు గతాన్నుంచి తప్పించుకు పారిపోలేవు  అంటాడు పెద్దయ్యాక తండ్రి. నీ గుండెల్లో చీకటి వెలుగుల్ని చూడు. నిన్ను నీవు తెలుసుకోవాలంటే చీకటి వెలుగులు రెండిటినీ ఎదుర్కోవాలి  అంటుంది చిన్నప్పుడు తల్లి. అతడి అంతర్సంఘర్షణ తండ్రితో దూరాల్నే పెంచుతుంది- నువ్వు నాకు తోడుగా వుండాల్సిన సమయమిది అంటాడు తండ్రి. అది జరిగే పని కాదంటాడు షాంగ్ చీ - నువ్వు మనుషుల్ని చంపే క్రిమినల్ వి అంటాడు. ఇది వెళ్ళి వెళ్ళి ఇద్దరూ కొట్టుకునే దాకా పోతుంది. తల్లి నేర్పిన పోరాట విద్యనే తండ్రి మీద ప్రయోగిస్తాడు. చివరికేమయ్యాడు తండ్రనేది వెండి తెరమీదే చూడాలి. 

అతడి మీద కొరియోగ్రాఫ్ చేసిన యాక్షన్ సీన్స్ కూడా పాత్ర ప్రయాణంతో బాటే తీవ్రత- ఉష్ణోగ్రత పెంచుకుంటూ పోతాయి. వుషూ స్టయిల్ ఒక రేంజి అయితే, కైనెటిక్ స్టయిల్ పై రేంజి, వుక్సియా స్టయిల్ ఇంకా పై రేంజి - ఇలా...ఏడు డిఫరెంట్ స్టయిల్స్ కథలో అతడి పాత్ర ఎదుగుదల క్రమాన్ని చాటుతూంటాయి సూక్ష్మంగా గమనిస్తే. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో ఏదైనా ఒక అర్ధంతోనే వుంటుంది. ఇక్కడ వివిధ స్టయిల్స్ తో హీరో యాక్షన్ జర్నీ, పాత్ర ఎదుగుదలని తెలిపే అద్భుత విజువల్ స్టోరీ టెల్లింగ్ అనొచ్చు.

        ఇక ఏడాది పాటు ప్లాన్ చేశామని చెప్తున్న మేజర్ పబ్లిక్ బస్సు యాక్షన్ సీను, డ్రైవింగ్ రాని హీరోయిన్ చేసే పిచ్చి డ్రైవింగ్ తో ఫన్నీగా వుంటూనే, సబ్ కాన్షస్ మైండ్ కి కనెక్ట్ అవుతుంది -కారణం, ఈ యాక్షన్ సీన్ త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ లో వుండడమే.

సినిమా స్క్రీన్ ప్లేకి త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ ఎలాగో, అలా కన్పిస్తుందీ యాక్షన్ సీను పరిశీలనగా చూస్తూంటే. బిగినింగ్, మిడిల్, ఎండ్ - మధ్య రెండు ప్లాట్ పాయింట్లు. ముందు చిల్లరగాళ్ళతో ఫన్నీ ఫైట్ అయ్యాక (బిగినింగ్), చేతికి మండే కత్తిని కట్టుకున్న రేజర్ ఫిస్ట్ అనే వాడు, వాడి హై గ్రేడ్ గ్యాంగూ దిగుతారు (ప్లాట్ పాయింట్ వన్), ఇక వీళ్ళని చితగ్గొట్టే గోల్ తో విజృంభిస్తాడు షాంగ్ చీ (మిడిల్), ఇది ఉష్ణోగ్రత పెరిగి పెరిగి బస్సులోంచి బయట పడిపోతాడు షాంగ్ చీ (ప్లాట్ పాయింట్ టూ), ఇక మళ్ళీ బస్సు లోకొచ్చి మరింత హై టెన్షన్ యాక్షన్ తో ముగించేస్తాడు (ఎండ్). ఈ సీను వైరల్ అవడానికి ఇలా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్లో కొరియోగ్రాఫ్ చేయడమే కారణం కావొచ్చు.

            గర్ల్ ఫ్రెండ్ కేటీగా ఆక్వాఫినా ఫన్నీ క్యారక్టర్ నటించింది. స్టార్ సినిమాల్లో తెలుగు హీరోయిన్ లాగే పెద్దగా పాత్ర లేదీమెకు గానీ, క్లయిమాక్స్ లో హీరోని కాపాడేందుకు మంచి యాక్షన్లోకి దిగుతుంది.

చెల్లెలు జియాంగ్ లీగా మెంగర్ ఝాంగ్ స్టేజి నటి. ఇదే తొలి మూవీ ఈమెకి. ఇంత పెద్ద తొలి మూవీ. స్టేజి నటనకీ, కెమెరా ముందు నటనకీ తేడాల వల్ల ఇబ్బందులు పడుతూనే నటించింది. అండర్ గ్రౌండ్ ఫైట్ క్లబ్ నడిపే పాత్రగా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందింది. పాత్రగా తన  కుటుంబ విచ్ఛిన్నంతో రెబెల్ ఆసియన్ గర్ల్ గా మారే ఈమె క్యారక్టర్, ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించి పెట్టింది కూడా అప్పుడే. తనని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళి పోయాడని అన్నమీద కోపం. షాంగ్ చీకి తండ్రితో బాటు, ఇటు చెల్లెలితో టెన్షన్. ఫైట్ క్లబ్ లో విరగదీసి కొట్టే ఈమెతో మ్యాచ్ గెలవలేక పోతాడు. ఐతే ఇలా కొట్టి ఓడించడం ద్వారా, తన భవిష్యత్ పోరాటంలో బెస్ట్ రైట్ హేండ్ నేనే నని తెలియజెప్పడమే ఈమె ఉద్దేశమని తర్వాత గ్రహిస్తాడు. ఉద్దేశాలు డైలాగులతో కాకుండా ఇలా యాక్షన్ రూపంలో బయటపడే విజువల్ రైటింగ్- స్టోరీ మేకింగిక్కడ!

        తల్లి పాత్రలో ఫలా చెన్ నటించింది. గ్రామ రక్షక భటురాలిగా ఒక యాక్షన్ సీన్ తో బాటు, పిల్లలతో కుటుంబ సెంటిమెంటు సీన్లతో కథకి లంగరు వేసింది. ఈమె కేంద్రంగానే మొత్తం కథ ఉద్భవించింది.   

        ఇప్పుడు హాంకాంగ్ మూవీ లెజెండ్ టోనీ లియాంగ్ గురించి చెప్పుకోవాలి.  వెయ్యేళ్ళుగా బ్రతుకుతున్న రాజకీయ కర్కశుడుగా, వినాశకుడుగా యాక్షన్ ఓరియెంటెడ్ తండ్రి పాత్రలో (వెన్వూ) ఎపిక్ సీన్స్ నటించాడు. టెన్ రింగ్స్ మహాత్మ్యంతో నిత్య యౌవనుడుగా పాత్రలో నటన ఒక అరుదైన అవకాశం, ఛాలెంజి. మరణం లేని నిత్య యౌవనుడు కాబట్టి కొడుకు వయసులోనే కనపడతాడు అరవై ఏళ్ళ టోనీ లియాంగ్!

    ప్రారంభంలో టాలో గ్రామం మీదికి దండెత్తి నప్పుడు రక్షక భటురాలిగా వుండే ఇంగ్ లీతో మార్షల్ ఆర్ట్స్ ఫైట్ ఒక కీలక దశలో రోమాంటిక్ టెన్షన్ క్రియేటవుతుంది కొన్ని క్షణాలు. దాంతో ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ షాట్ చాలా సెన్సిటివ్ గా, బ్యూటీఫుల్ గా తీశాడు దర్శకుడు. పెళ్ళి చేసుకున్న ఇంగ్ లీ మీద ఎంత ఫ్రేమంటే, ఆమె మరణించిందన్న మాటే నమ్మడు. టాలో గ్రామంలో బంధించి వుందనే నమ్ముతాడు. రావణ లంక లాంటి ఆ గ్రామం నుంచి సీత లాంటి భార్యని విడిపించుకోవడమే లక్ష్యంగా కొడుకు మీద వొత్తిడి తెస్తాడు. లియాంగ్ కొడుక్కి టెన్ రింగ్స్ ని అప్పజెప్పే సీనుని  కూడా లాండ్ మార్క్ సీనుగా చేసిపెట్టాడు. అతను హాంకాంగ్ మూవీ లెజెండ్, అంతే. ప్రతీ సన్నివేశమూ అతడి నటనకి సలాము చేయాల్సిందే.

మెయిన్ విలన్, చైనీస్ పురాణ దుష్టజీవి డ్వెల్లర్- ఇన్- డార్క్ నెస్ మనుషుల ఆత్మల్ని భక్షించే రాక్షసి. దీన్ని వెయ్యేళ్ళుగా టాలో గ్రామంలో బంధించి వుంచారు. ఇది చనిపోయిన వెన్వూ భార్య ఇంగ్ లీ లాగా నటిస్తూంటుంది. టెన్ రింగ్స్ నుపయోగించి తనని విడిపించమని వెన్వూని బతిమాలుకుంటుంది. ఇది తన భార్యే అనుకుని విడిపిస్తే వెన్వూ మీద పడి అతడి పని బడుతుంది. దీనికి యాంటీగా గ్రేట్ ప్రొటెక్టర్ అనే ఫ్రెండ్లీ చైనీస్ డ్రాగన్ వుంటుంది. ఇది షాంగ్ చీకి హెల్ప్ చేస్తుంది క్లయిమాక్స్ దృశ్యాల్లో. ఇంకా చాలా వింత జీవులున్నాయి. ఇవన్నీ డ్వెల్లర్- ఇన్- డార్క్ నెస్ సహా, సీజీ సృష్టులే. వీటి విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత రిచ్ గా వున్నాయి.

చివరికేమిటి
ఓ రెండు గంటలు క్లీన్ అండ్ గ్రీన్ ఎంటర్ టైనర్. అయితే ఏదో కాలక్షేపానికే అన్నట్టు గాకుండా, అంతరార్ధాలతో స్పిరిచ్యువల్ జర్నీగా ప్రేక్షకుల ఆత్మిక దాహాన్ని తీరుస్తుంది. అంటే సబ్ కాన్షస్ తో కనెక్ట్ అవుతుంది. వివిధ హాలీవుడ్ సూపర్ మాన్ సినిమాలన్నీ స్పిరిచ్యువల్ జర్నీలే ముసుగేసిన పురాణ పాత్రలతో. ఇలాటి కామిక్ బుక్స్ కూడా ఇంతే. దీన్ని దర్శకుడు క్రెటన్ మనోహరంగా విజువలైజ్ చేశాడు తెరమీద మార్వెల్ ప్రమాణాలతో. ఒక చైనీస్ మాయా ప్రపంచాన్ని సృష్టించాడు. చైనా, కొరియా, జపాన్, ఇంకా ఇతర ఆసియన్ దేశాల సినిమాల విజువల్ ఇన్స్పిరేషన్ తో షాంగ్ చీ ని చిత్రిక పట్టాడు. జీవితంలో బాధ, డ్రామా, హాస్యం మొదలైన వాటిని దృశ్యమానం చేయడానికి పై ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు.

        మార్వెల్ స్టూడియో ఓ ఇరవై ఏళ్ళ క్రితం స్క్రిప్టు ప్రారంభించి వుండొచ్చు, క్రెటన్ మాత్రం ఏళ్ళకి ఏళ్ళు స్క్రిప్టు మీద పని చేయలేదు. కేవలం మొన్న 2019 లోనే దర్శకుడిగా నియమితుడై ఇంత సినిమా తీసి ఇచ్చేశాడు. ప్రాచీన చైనా, ఆధునిక అమెరికా రెండిటి కలగలుపుగా, హాలీవుడ్  విజన్ లో చూపిట్టిన చైనీస్ -అమెరికన్ దర్శకుడు క్రెటన్, పిల్లలు కూడా ఎంజాయ్ చేసే హానికరం కాని క్రియేషన్ని ప్రపంచం ముందుంచాడు.


—సికిందర్