రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, June 6, 2024

1437 : రివ్యూ!

 

రచన - దర్శకత్వం : ఉదయ్ శెట్టి
తారాగణం :  ఆనంద్ దేవరకొండ, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక, కరిష్మా, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ఇమ్మాన్యుయేల్  తదితరులు.
సంగీతం : చేతన్ భరద్వాజ్, ఛాయాగ్రహణం : ఆదిత్య జె.
బ్యానర్ : హై-లైఫ్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి
***
          2023 లో బేబీ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ క్రైమ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సమ్మర్ సినిమాతో వచ్చాడు. ఇటీవల వచ్చిన క్రైమ్ కామెడీ లేవీ నిలబడ లేదు. సస్పెన్స్ థ్రిల్లర్లు, క్రైమ్ కామెడీలు నిలబడేందుకు మొరాయించి మొండి చెయ్యి చూపిస్తున్నాయి. అలాటిది మరో కొత్త దర్శకుడు క్రైమ్ కామెడీతో తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. మరి దీంతో ఎంత నవ్వించాడు, ఎంత నిలబెట్టాడు అన్నవి ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతుకుతూ ముందుగా కథ లోకి వెళ్దాం...

కథ

గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ), శంకర్(ఇమ్మాన్యుయేల్‌) దొంగతనాలు చేసి జీవిస్తూంటారు. గణేష్‌కి శృతి (నయన్ సారిక) తో ప్రేమ వ్యవహారముంటుంది. ఆమె తాను పనిచేసే షాప్ ఓనర్ తో పెళ్ళికి సిద్ధమవడంతో, గణేష్ హర్ట్ అవుతాడు. ఆమె డబ్బుకోసం పెళ్ళికి సిద్ధపడితే ఈలోగా తానూ డబ్బు సంపాదించి కోటీశ్వరుడు అవుతానని సవాలు విసురుతాడు. ఓ నగల షాపులో 7 కోట్ల విలువైన వజ్రాన్ని కొట్టేసే ఆఫర్ రావడంతో ఆ వజ్రాన్ని కొట్టేసి అమ్ముకుందామని దాంతో పారిపోతాడు.
        
చెన్నై వెళ్తూండగా పోలీసులు చెకింగ్ చేస్తూండడంతో భయపడి వజ్రాన్ని అటుగా తీసికెళ్తున్న వినాయకుడి విగ్రహం తొండంలో పడేస్తాడు. నంద్యాల ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తున్న కిషోర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ముంబాయిలో తయారు చేయించి తీసుకొస్తూంటాడు. అయితే కిషోర్ రెడ్డి వూరికి వెళ్ళాల్సిన విగ్రహం ప్రత్యర్ధి వూరికి వెళ్తుంది. దీంతో ఆ విగ్రహం కోసం ప్రయత్నాలు మొదలవుతాయి.
       
విగ్రహం కిషోర్ రెడ్డికి ఎందుకు విలువైనది
? అందులో ఏం దాచి పెట్టి ముంబాయి నుంచి రప్పిస్తున్నాడు? విగ్రహం తొండంలో వజ్రాన్ని పడేసిన గణేష్ కది దక్కిందా లేదా? దాంతో కోటీశ్వరుడై శృతిని పెళ్ళి చేసుకున్నాడా లేదా?  ఇదీ మిగతా కథ.

ఎలావుంది కథ

ఇదే వారం విడుదలైన భజే వాయు వేగం లో తండ్రి ఆపరేషన్ కోసం హీరో కారు కొట్టేసి పారిపోతాడు. ప్రస్తుత సినిమాలో కోటీశ్వరుడవడం కోసం హీరో వజ్రాన్ని కొట్టేసి పారిపోతాడు. రెండూ ఒకే లాంటి కథలు. అయితే మొదటిది బరువైన సెంటిమెంటల్ డ్రామా, రెండోది క్రైమ్ కామెడీ. ఏదో విలువైనది ఎక్కడో మిస్ అవడం, దాని కోసం వివిధ గ్యాంగులు వేటలో పడ్డం కూడా కొత్త కథేమీ కాదు. అనగనగా ఒక రోజు’, స్వామి రారా వంటి హిట్స్ గతంలో వచ్చాయి. ప్రస్తుత సినిమాని కూడా అలాటి హిట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే సిల్లీ కథ వల్ల పాక్షికంగానే సఫలమయ్యారు.
          
ఫస్టాఫ్ పాయింటుకి రావడానికి లవ్ ట్రాకుతో చాలా సేపు సాగదీశారు. హీరోయిన్ తో సుదీర్ఘ లవ్ ట్రాకు పెట్టి, హీరో ఆమెకి సవాలు  చేసిన తర్వాత వజ్రాన్నిదొంగిలించి పారిపోవడం, దాన్ని వినాయకుడి విగ్రహంలో వేయడం, అది విలన్ ప్రత్యర్ధి వూరికి చేరడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇప్పుడా విగ్రహం ఇటు విలన్ కి, అటు హీరోకీ ఇద్దరికీ అవసరం.
        
ఇప్పుడు సెకండాఫ్ లో ఆ విగ్రహంకోసం ప్రయత్నాల్ని కామెడీగా మార్చి నడిపించారు. ఈ ప్రయత్నాలు సిల్లీగా వున్నా కామెడీ కాబట్టి సీరియస్ గా తీసుకోవద్దన్నట్టు నడిపించారు. కానీ హీరో విలన్ల మధ్య బలమైన ఎత్తుగడలు వుండుంటే ఆ కామెడీ లాజికల్ గా వర్కవుటై క్రియేటివిటీతో ఇంకా బావుండేది. ఈ కామెడీకి సారధి డాక్టర్ ఆర్గానిక్ డేవిడ్ గా నటించిన వెన్నెల కిషోర్. సెకండాఫ్ పూర్తిగా వెన్నెల కిషోర్ చేసే సిల్లీ కామెడీ మీద ఆధారపడింది. తన స్కిల్స్ తో అంతలా నవ్వించకపోతే సెకండాఫ్ ప్రమాదంలో పడేది.
       
కథలో క్లయిమాక్స్ ట్విస్టు ఒక్కటే ఉత్కంఠ రేపుతుంది. ఇక ముగింపుగా తుపాకులతో కాల్చుకోవడమన్నది
స్వామిరారా లాంటిదే. అయితే మధ్యలో హీరోకి సెకెండ్ హీరోయిన్ ప్రగతీ శ్రీవాస్తవతో ఇంకో లవ్ ట్రాక్ పెట్టడం వర్కౌట్ కాలేదు. అది కథని పక్కదోవ పట్టించింది. మొత్తానికి సిల్లీ కామెడీతో ఈ సాధారణ కథని గట్టెక్కించే ప్రయత్నం చేశారు.

నటనలు – సాంకేతికాలు

ఆనంద్ దేవరకొండ ఈసారి కామెడీ నటించడంలో కృషి చేశాడు. పరిమిత భావాలు పలికే మొహంలో కామెడీకి కావాల్సిన ఎక్స్ ప్రెషన్స్ శూన్యమైనా ప్రేక్షకుల్ని గతంలోలా ఇబ్బంది పెట్టకుండా కామెడీ నటించడం కోసం ఫర్వాలేదన్పించే స్థాయిలో కష్టపడ్డాడు. ఇక మిగతా రోమాన్స్, యాక్షన్ మామూలే. అయితే హీరోయిన్లిద్దరికీ పెద్దగా పాత్రల్లేవు. విలన్లుగా  రాజన్, కృష్ణ చైతన్య క్రూరత్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. వెన్నెల కిషోర్, ఇమ్మాన్యుయేల్ కామెడీలు మాత్రమే ఈ సినిమాకి హైలైట్.
        
చేతన్ భరద్వాజ్ సంగీతం, ఆదిత్య ఛాయాగ్రహణం, ఇతర సాంకేతిక హంగులు ఫర్వాలేదనిపించేలా వున్నాయి. కొత్త దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి కొత్తదనం కోసం ప్రయత్నించకుండా, రొటీన్ ఫార్ములా సేఫ్ జోన్ లోనే వుండిపోయాడు.

—సికిందర్