రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, June 6, 2024

1435 :స్పెషల్ ఆర్టికల్


కవైపు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలు ఈ వేసవిలో శూన్య ప్రదర్శన చేస్తూండగా, మరో వైపు మలయాళ సినిమాలు స్లంప్ లేకుండా సమ్మర్ లో బాక్సాఫీసు విజయాలు సాధిస్తున్న వైనం కళ్ళముందుంది. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలల్లో తెలుగు తమిళ కన్నడ భాషల్లో పెద్ద సినిమాలు విడుదల కాలేదు. ఎండలు, క్రికెట్, ఎన్నికలు కారణంగా చూపి నిర్మాతలు పెద్ద సినిమాల విడుదలల్ని వాయిదా వేశారు. దీంతో ధియేటర్లు నడపలేక మూసివేసే పరిస్థితి ఎదురైంది ఎగ్జిబిటర్లకి. థియేటర్ చైన్ 'జికె  సినిమాస్' యజమాని రూబన్ మతివానన్ 2024 సవత్సరం తమిళ, తెలుగు సినిమాలకు ఆందోళనకర సంవత్సరమని కామెంట్ చేశారు. ఈ దశాబ్దంలోనే  2024 ని అత్యంత చెత్త సంవత్సరంగా పేర్కొన్నారు.

        చాలా మంది లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వంటివి పెద్ద సినిమాలు లేకపోవడానికి కారణాలుగా చెబుతూ వచ్చారు. కానీ, ఇవి కుంటి సాకులు మాత్రమే. వేసవి అనేది సాధారణంగా పెద్ద సినిమాలకు ఉత్తమ సీజన్ గా వుంటూ వస్తోంది. 2023 వేసవిలోనే తెలుగులో రావణాసుర’, ఏజెంట్’, విరూపాక్ష’, శాకుంతలం’, ఉగ్రం’, కస్టడీ వంటి పెద్ద సినిమాలు 6 విడుదలయ్యాయి. 2024 వేసవిలో మాత్రం ఫ్యామిలీ స్టార్’, ఆ ఒక్కటీ అడక్కు’, ‘’గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూడే పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. ఈ మూడూ ఫ్లాపయ్యాయి. చిన్న చిన్న సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. ఇవి ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలు వల్ల ఫ్లాపయ్యాయా?
        
లోక్ సభ ఎన్నికలు వేసవిలోనే జరుగుతున్నాయి, ఐపీఎల్ వేసవిలోనే వస్తోంది, ఎండలు వేసవిలోనే మండి పోతున్నాయి, పరీక్షలూ వేసవిలోనే వస్తున్నాయి, జనం వేసవిలోనే టూర్లు వేస్తున్నారు, కూల్ డ్రింకులు, కూలర్లు వేసవిలోనే అమ్ముడుబోతున్నాయిఅలాగే చల్లటి ఏసీ పట్టున కమ్మగా కూర్చుని వేసవిలో సినిమాలు కూడా చూస్తూ వచ్చారు జనాలు. మరి ఇప్పుడెందుకు చూడడం లేదు? చూసేందుకు లోక్‌సభ ఎన్నికలు, పరీక్షలు, ఎండలు, ఐపీఎల్ వగైరా ఇప్పుడెందుకు అడ్డొస్తున్నాయి?
       
అడ్డు రావడం లేదు.
కేరళలో యధావిధిగా సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. చూసి హిట్ కూడా చేస్తున్నారు. 2024 ఏప్రిల్లో విడుదలైన పెద్ద సినిమా ఆవేశం కి రూ. 155 కోట్ల బాక్సాఫీసు నిచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా వర్షం గక్కుశేషం కి రూ. 80 కోట్లు ఇచ్చారు. ఏప్రిల్లోనే విడుదలైన చిన్న సినిమా జై గణేష్ కి రూ. 83 కోట్లు ఇచ్చారు. మే లో విడుదలైన చిన్న సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియాకి రూ. 18 కోట్లు ఇచ్చారు. మరో చిన్న సినిమా గురువాయూర్ అంబలనాదయిల్ కి రూ. 85 కోట్లు ఇచ్చారు. పెద్ద సినిమా  టర్బో కి రూ. 70 కోట్లు ఇచ్చారు. ఇంకో చిన్న సినిమా తలవన్ కి 10 వ రోజు కల్లా రూ. 15 కోట్లూ కలెక్షన్లిచ్చారు.
       
అంతే కాదు
, తమిళంలో కూడా స్లంప్ అంటున్న మే నెలలోనే విడుదలైన  
అరణ్మనై 4’ అనే హార్రర్ రూ.100 కోట్ల మార్కుని దాటేసింది. తమన్నా భాటియా, రాశీ ఖన్నా, దర్శకుడు సుందర్ సి నటించిన ఇదే మూవీ తెలుగులో బాక్ గా విడుదలై ఫ్లాపయ్యింది. ఈ వేసవిలో తమిళంలో పెద్ద సినిమాల కొరతని భర్తీ చేసేందుకు ఒక మార్గం కనిపెట్టారు. పాత హిట్స్ ని రీ రిలీజ్ చేయడం మొదలెట్టారు. దళపతి విజయ్ 'గిల్లి', ధనుష్ '3', సూర్య 'వారణం ఆయిరం'  పాత సినిమాల్ని రీ రిలీజ్ చేస్తే మళ్ళీ హిట్టయ్యాయి. ఎందుకు హిట్టయ్యాయి? ఎండలు, ఎన్నికలు, పరీక్షలు, ఐపీఎల్ వుంటే ఎలా వచ్చారు ప్రేక్షకులు?
       
కాబట్టి నాణ్యత ప్రధాన పాత్ర వహిస్తోంది ఎలాటి పరిస్థితుల్లోనైనా హిట్టవడానికి. ఈ నాణ్యత మలయాళంలో ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు (చెన్నై)  లో వున్నప్పుడు అక్కడ అన్ని భాషల దర్శకులతో
, టెక్నీషియన్లతో పనిచేసిన తెలుగు అసిస్టెంట్లకి మంచి నైపుణ్యం అబ్బేది. పరిశ్రమ హైదరాబాద్ వచ్చేశాక అసిస్టెంట్లకి ఆ ఇంటరాక్షన్ లేక ఒంటరి వాళ్ళై పోయి నేర్చుకోవడం వదిలేసి దర్శకులై పోతున్నారు. అందుకే సినిమాలిలా తయారవుతున్నాయి. ఇది పాత దర్శకులు చెప్పే మాటే. కాబట్టి ఇప్పుడు అసిస్టెంట్లు  ఇక్కడే అసిస్టెంట్లుగా చేరడం మాని, కొన్నాళ్ళు మాలీవుడ్ వెళ్ళి  ఎన్నికల్లో, ఎండల్లో, ఐపీఎల్లో, పరీక్షల్లో కూడా సినిమాలు తీసి హిట్ చేస్తున్న మలయాళ దర్శకుల మంత్రమేమిటో వాళ్ళ దగ్గర పనిలో చేరి నేర్చుకుంటే మంచిది. అప్పుడు ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్, పరీక్షలూ అంటూ కుంటి సాకులు చెప్పే అవసరం రాదు.

***