రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, జనవరి 2018, సోమవారం

578 : స్పెషల్ ఆర్టికల్

2017 లో వైవిధ్యం మూస మయమైన తెలుగు సినిమాలని కొత్త పుంతలు తొక్కించింది. కనీసం  పదిశాతం పెద్ద సినిమాలు నాన్ రెగ్యులర్ జానర్ కొకటి చొప్పున హిట్టయ్యాయంటే ప్రేక్షకులు మార్పుని ఆహ్వానిస్తున్నారనడానికి సంకేతం. జానపద ఫాంటసీ, చారిత్రాత్మకం, యుద్ధం, రాజకీయం, క్రీడలు, రోమాంటిక్ కామెడీ  మొదలైన ఆరు విభిన్న జానర్స్ తో వచ్చిన బిగ్ కమర్షియల్స్ ని హిట్ చేశారు ప్రేక్షకులు. 2017 ఇంకో ప్రత్యేకాకర్షణేమిటంటే, ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి మెగాస్టార్ గా మళ్ళీ తన  స్థానాన్ని కైవసం చేసుకోవడం, చాలా కాలం తర్వాత తిరిగి రాజశేఖర్ హీరోగా విజయం సాధించడం. అలాగే అగ్రనిర్మాత దిల్ రాజు రికార్డు స్థాయిలో ఆరు బిగ్ కమర్షియల్స్ నిర్మించి ఐదు విజయాలు సాధించడం. స్టార్లు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులు ఈ సంవత్సరంకూడా ఫ్లాపుల బాధనుంచి కోలుకోలేకపోవడం  ఇంకో ఆకర్షణ. అలాగే చిరంజీవితో బాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సీనియర్ స్టార్లు నల్గురూ తమ హవా కొనసాగించుకోవడం, తాజా స్టార్ అక్కినేని అఖిల్ రీ రన్ కోసం రావడంలాంటి చమత్కారాలు కూడా జరిగాయి. అయితే ఫ్లాపుల మాటేమిటి? మొత్తం 43 మంది స్టార్లు, హీరోలు కలిసి ఎన్ని హిట్లు ఇచ్చారు? ఎన్ని ఫ్లాపులిచ్చారు?  అసలే హిట్టివ్వలేని వాళ్ళెందరు? అన్నీ హిట్లిచ్చిన వాళ్ళెవరు? ... ఒకసారి వివరాల్లోకి వెళ్లి చూద్దాం...

స్టార్లు / హీరోలు  : హిట్లు ఫ్లాపులు
         
1. చిరంజీవి:  ఖైదీ నెం -150 (హిట్), 2. బాలకృష్ణ : గౌతమీ పుత్ర శాతకర్ణి (హిట్), పైసా వసూల్ (ఫ్లాప్), 3. నాగార్జున : ఓం నమో వెంకటేశాయ (ఫ్లాప్),  రాజు గారి గది -2 (ఏవరేజ్), 4. వెంకటేష్ : గురు (హిట్), 5. రాజశేఖర్ : గరుడవేగ, (ఏవరేజ్),6. జగపతి బాబు : పటేల్ సర్ (ఫ్లాప్), 7. పవన్ కళ్యాణ్ : కాటమరాజు (ఫ్లాప్), 8. మహేష్ బాబు :  స్పైడర్ (ఫ్లాప్), 9. ఎన్టీఆర్ :  జై లవకుశ (హిట్), 10. రవితేజ :  రాజా ది  గ్రేట్ (హిట్), 11. ప్రభాస్ : బాహుబలి -2  (హిట్), 12. అల్లు అర్జున్ :  దువ్వాడ జగన్నాధం (హిట్), 

        13. గోపీచంద్ : గౌతమ్ నందా (ఫ్లాప్), ఆక్సిజన్(ఫ్లాప్), 14. నితిన్ : లై (ఫ్లాప్), 15. నరేష్ : మేడ మీద అబ్బాయి (ఫ్లాప్),  16. నాని : నేను లోకల్ (హిట్), నిన్న కోరి (హిట్), ఎం సి ఏ (హిట్), 17. శర్వానంద్ : రాధ (ఫ్లాప్), శతమానం భవతి (హిట్), మహానుభావుడు (హిట్), 18. రానా : ఘాజీ (హిట్ ),  నేనే రాజు నేనే మంత్రి, (హిట్),  19. సాయి ధరమ్ తేజ్ :  విన్నర్ (ఫ్లాప్), జవాన్ (ఫ్లాప్),  20. నాగ చైతన్య : రారండోయ్ వేడుక చూద్దాం (హిట్),  యుద్ధం శరణం (ఫ్లాప్), 21. అఖిల్ :  హలో (ఏవరేజ్),  22. రామ్ : ఉన్నది ఒకటే జీవితం (ఏవరేజ్), 12. విజయ్ దేవరకొండ : ద్వారక (ఫ్లాప్), అర్జున్ రెడ్డి (హిట్), 24. సందీప్ కిషన్ : కేరాఫ్ సూర్య (ఫ్లాప్),  25. రాజ్ తరుణ్ : అంధగాడు (ఏవరేజ్), కిట్టు ఉన్నాడు జాగ్రత్త (ఏవరేజ్), 

         26. అవసరాల శ్రీనివాస్ : బాబు బాగా బిజీ (ఫ్లాప్), అమీతుమీ (హిట్), 27. నారా రోహిత్ : కథలో రాజకుమారి (ఫ్లాప్) బాలకృష్ణుడు (ఫ్లాప్),  28. విష్ణు : మా అబ్బాయి (ఫ్లాప్) , మెంటల్ మదిలో(ఫ్లాప్), 29. మంచు విష్ణు : లక్కున్నోడు (ఫ్లాప్),  30. మంచు మనోజ్ : గుంటూరోడు (ఫ్లాప్), ఒక్కడు మిగిలాడు (ఫ్లాప్), 31. వరుణ్ తేజ్ : మిస్టర్ (ఫ్లాప్),  ఫిదా (హిట్), 32. ఆది : నెక్స్ట్ నువ్వే (ఫ్లాప్), 33. బెల్లంకొండ శ్రీనివాస్ : జయజానకీ నాయక (ఏవరేజ్), 34. సుమంత్ :  మళ్ళీరావా (ఏవరేజ్), 35. సుమంత్ అశ్విన్ : ఫ్యాషన్ డిజైనర్ (ఫ్లాప్), 36. సాయి రాం శంకర్ : నేనోరకం (ఫ్లాప్),  37. నందమూరి తారక రత్న : రాజా మీరు కేక (ఫ్లాప్), 38. సునీల్ : ఉంగరాల రాంబాబు (ఫ్లాప్)  2 కంట్రీస్ (ఫ్లాప్),  39. సప్తగిరి : సప్తగిరి ఎల్ఎల్బీ (ఫ్లాప్), 40. నిఖిల్ : కేశవ (ఎవరేజ్). 41. నారాయణమూర్తి :  హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య (ఫ్లాప్) 

          1. సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్ : నక్షత్రం (ఫ్లాప్), 2. సందీప్ కిషన్ : నారా రోహిత్, సుధీర్ బాబు, ఆది : శమంతక మణి (ఫ్లాప్) , 3. అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ : ఒక్క క్షణం (ఏవరేజ్)

          మొత్తం 43 మంది స్టార్లు / గుర్తింపు వున్న హీరోలు  62 సినిమాలు నటించారు. వీటిలో 17  హిట్టయ్యాయి, 9 ఎవరేజిగా , 36 ఫ్లాపులుగా తేలాయి. అంటే 27 శాతం హిట్టయ్యాయి. ఎవరేజిల శాతం 15 వుంటే, అపజయాల శాతం 58 వుంది. అంటే సగానికి పైగా ఫ్లాపయ్యాయి. ఇతర చిన్నా చితకా లోబడ్జెట్ సినిమాలు 94 వరకూ విడుదలయ్యాయి. ఇవి నూటికి నూరు శాతమూ అట్టర్ ఫ్లాపయ్యాయి. ఈ ఫ్లాపులు కాక పూరీ జగన్నాథ్, జయంత్ సి. పరాన్జీ, బి. జయ, సునీల్ కుమార్ రెడ్డి, విజయేంద్ర ప్రసాద్ లు ఇతరులతో తీసిన ఇంకో ఐదు సినిమాలున్నాయి. మొత్తం అందరి సినిమాలూ  కలుపుకుంటే, 161 విడుదలయ్యాయి. ఈ మొత్తంలో 17 మాత్రమే హిట్స్ అంటే 10. 5 శాతం మాత్రమే విజయం. ప్రతీ ఏటా మొత్తం నిర్మించిన సినిమాల్లో విజయాల శాతం 10 కి  అటు ఇటుగా వుంటున్నది తెలిసిందే.  ఈ యేడూ ఇదే కొనసాగింది తప్ప మార్పులేదు.  హిట్స్ అయినా, ఎవరేజీలైనా స్టార్లు / గుర్తింపు వున్న హీరోలు నటించిన సినిమాలకే దక్కాయి. ఈ కేటగిరీలో చిన్న సినిమలెక్కడాలేవు. 

          చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్, రవితేజ, ప్రభాస్, అల్లు అర్జున్ లు ఒక్కొక్కరు ఒక్కో  సినిమా నటిస్తే ఆ ఒక్కటీ హిట్టయింది. నాని మూడు నటిస్తే మూడూ హిట్టయ్యాయి. శర్వానంద్ మూడు నటిస్తే రెండు హిట్స్, ఒక ఫ్లాప్ వచ్చాయి. నటించిన ఒకటి హిట్టయి, ఒకటి ఫ్లాపయిన వాళ్ళల్లో బాలకృష్ణ, నాగచైతన్య, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, అవసరాల శ్రీనివాస్ వున్నారు. రాజశేఖర్, రామ్, నిఖిల్, అఖిల్, సుమంత్  లు ఒక్కటి నటిస్తే ఎవరేజి అయ్యాయి. నటించిన రెండూ ఎవరేజి అయిన హీరో రాజ్ తరుణ్. నటించిన ఒక్కటీ ఫ్లాపయిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్, జగపతి బాబు, నరేష్, సందీప్ కిషన్, ఆది, సప్తగిరి, సుమంత్ అశ్విన్, సాయి రాం శంకర్, తారక రత్న, నారాయణ మూర్తి వున్నారు.  

          రెండు నటించి రెండూ హిట్టయిన ఏకైక హీరో రానా వుంటే, రెండు నటించి రెండూ ఫ్లాపయిన హీరోల్లో  గోపీచంద్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, సునీల్ వున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, నారా రోహిత్, ఆది, సుధీర్ బాబులు నటించిన ‘మల్టీ స్టారర్స్’ రెండూ ఫ్లాపయ్యాయి. ఇంకో అల్లు శిరీష్, అవసరాల శ్రీనివాస్ ల  ‘మల్టీ స్టారర్’ –‘ఒక్క క్షణం’ ఎవరేజి అన్పించుకుంది.
***
          హిట్టయిన 17 లో ఐదు రెగ్యులర్ కమర్షియల్స్ ని ఆదరించారు ప్రేక్షకులు (ఖైదీ నెం -150, జై లవకుశ, రాజా ది గ్రేట్, దువ్వాడ జగన్నాథం, నేను లోకల్, ఎంసీఏ). ఒక జానపద ఫాంటసీ (బాహుబలి -2), ఒక చారిత్రాత్మకం (గౌతమీపుత్ర శాతకర్ణి), ఒక రాజకీయం (నేనే రాజు నేనే మంత్రి), ఒక యుద్ధం (ఘాజీ), ఒక క్రీడలు (గురు), రెండు ఫ్యామిలీలు (శతమానం భవతి, రారండోయ్ వేడుక చూద్దాం), మూడు రోమాంటిక్ డ్రామాలు (నిన్నుకోరి, ఫిదా, అర్జున్ రెడ్డి, మహానుభావుడు), ఒక రోమాంటిక్ కామెడీ (అమీతుమీ) వగైరాలని కూడా ఇష్టపడ్డారు. 

          ఫ్లాపయిన 36 లో 13  రెగ్యులర్ కమర్షియల్స్ వున్నాయి : పైసా వసూల్, కాటమ రాయుడు, మిస్టర్, గౌతమ్ నందా, ఆక్సిజన్, రాధ, జవాన్, విన్నర్, యుద్ధం, బాల కృష్ణుడు, మా అబ్బాయి, లక్కున్నోడు, గుంటూరోడు మొదలైనవి. మరి ఇలాటివే టెంప్లెట్స్ అయిన ఐదింటినీ  (ఖైదీ నెం -150, జై లవకుశ, రాజా ది గ్రేట్, దువ్వాడ జగన్నాథం, నేను లోకల్, ఎంసీఏ) హిట్ చేశారు ప్రేక్షకులు. మొత్తం 18 టెంప్లెట్స్  విడుదలైతే వాటిలో ఐదింటినే ఇష్టపడ్డారు ప్రేక్షకులు ఎంత హంగామా చేసినా. ఇవి ఆగుతాయా? ఆగవు, 2018 లో ఇంకా జూలు విదిలిస్తూనే వుంటాయి. 

          హిట్టయిన 17 లో జానపద ఫాంటసీ, చారిత్రాత్మకం,  రాజకీయం, యుద్ధం, క్రీడలు, రోమాంటిక్ కామెడీ – ఇవి జానర్ కొకటి చొప్పున ఆరు వచ్చినా ఆరింటినీ  హిట్ చేశారు ప్రేక్షకులు. ఇంకో రెండు కుటుంబాలు, మూడు రోమాంటిక్ డ్రామాలు ప్రేక్షకులకి నచ్చాయి. ఇలా 6 వైవిధ్య భరిత జానర్స్,  5  రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్స్, 3 మూడు రోమాంటిక్ డ్రామాలు, 2 కుటుంబాలు.... ఇంతే  2017 లో ప్రేక్షకులు సెలెక్టు చేసుకున్నా మని చెప్తున్న ఎంటర్ టైన్మెంట్ ప్యాకేజీ. 

          ఏవరేజిగా స్కోర్ చేసిన తొమ్మిదిలో మూడు యాక్షన్లు (గరుడ వేగ,  కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు, కేశవ),  మూడు  రోమాంటిక్ డ్రామాలు (హలో, ఉన్నది ఒకటే జీవితం, మళ్ళీ రావా), ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ (జయజానకీ నాయక),  ఒక హార్రర్ డ్రామా (రాజుగారి గది -2) వున్నాయి. టెంప్లెట్ ని వదిలేస్తే, మిగిలిన వాటిని జానర్ మర్యాదలో పెట్టి హిట్ చేసుకుని వుండొచ్చు. జానర్ మర్యాద లోపించడం వీటిని ఎవరేజీ దగ్గరాపేసింది. హలో, మళ్ళీ రావాల్లో పిల్లల కథ ఎక్కువైపోయింది. 

          36 ఫ్లాపుల్లో పైసా వసూల్, కాటమ రాయుడు, మిస్టర్, గౌతమ్ నందా, ఆక్సిజన్, రాధ, జవాన్, విన్నర్, యుద్ధం, బాల కృష్ణుడు, మా అబ్బాయి, లక్కున్నోడు, గుంటూరోడు మొదలైన 13 రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్సే గాకుండా, ఒక భక్తి  (ఓం నమో వెంకటేశాయ), ఒక సైకో (స్పైడర్), ఒక స్పై (లై), ఒక హార్రర్ కామెడీ (నెక్స్ట్ నువ్వే), మూడు యాక్షన్లు ( పటేల్ సర్, నేనోరకం, రాజా మీరు కేక), మూడు రోమాంటిక్ కామెడీ / డ్రామాలు (ద్వారక, కేరాఫ్ సూర్య, కథలో రాజకుమారి, మెంటల్ మదిలో), ఆరు కామెడీలు (ఫ్యాషన్ డిజైనర్, మేడమీద అబ్బాయి, ఉంగరాల రాంబాబు, 2 కంట్రీస్, సప్తగిరి ఎల్ఎల్బీ), రెండు ‘మల్టీ స్టారర్’ లు (నక్షత్రం, శమంతకమణి), ఒక సామాజికం( హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య) వున్నాయి. 

          మొత్తం 62 లో 9 రీమేకులున్నాయి : ఖైదీ నెం -150 (తమిళం), కాటమరాయుడు (తమిళం), గురు (తమిళం), రాజుగారి గది -2 (తమిళం),  ఒక్కడు మిగిలాడు (తమిళం), నెక్స్ట్ నువ్వే (తమిళం), మేడమీద అబ్బాయి (మలయాళం),  2 కంట్రీస్ (మలయాళం), బాబు బాగా బిజీ (హిందీ), సప్తగిరి ఎల్ ఎల్బీ (హిందీ). వీటిలో చిరంజీవి, వెంకటేష్ ల ఖైదీ నెం -150, గురు మాత్రమే హిట్టయి, నాగార్జున  నటించిన రాజుగారి గది -2 మాత్రమే ఎవరేజ్ అయింది. మిగిలిన ఆరూ అట్టర్ ఫ్లాపయ్యాయి. తెలుగులో టాలెంట్ లేదనుకుని పక్క భాషల కేసి చూడ్డం, తెచ్చుకుని ఫ్లాప్ చేసుకోవడం. డిఫరెన్స్ ఏమిటి? తెలుగులో వున్న టాలెంటునే వాడుకుంటే రీమేక్ హక్కుల డబ్బులు మిగిలి చవకలో నష్టపోవచ్చుగా? 2017 నుంచి కూడా ఇది తెలుసుకోకపోతే 2018 దండగ!

          ద్విభాషా చిత్రంగా కేరాఫ్ సూర్య ఒకటే వచ్చి, అది ఆడకపోతే ఆ దర్శకుడు మార్పుచేర్పులు చేసి,  అయినా  ఆడకపోతే మళ్ళీ మార్పుచేర్పులు చేసి, మళ్ళీ విడుదల చేస్తానని ప్రకటించాడు. ఇలాటి దర్శకుణ్ణి ఎక్కడా చూడలేదు. యంగ్  స్టార్స్ తో మూడు ‘మల్టీ స్టారర్లు’ వస్తే ఒకటే ఎవరేజి అన్పించుకుంది, రెండు ఫ్లాపయ్యాయి. 

          అన్నిరకాల సినిమాలూ తీశారు. అయితే ఆరు నాన్ రెగ్యులర్  జానర్స్ లో తీసినవే ఫ్లాప్ కాలేదు. నాన్ రెగ్యులర్ జానర్స్ లో రెగ్యులర్ జానర్ అయిన రోమాంటిక్ కామెడీని చేర్చడమెందుకంటే, ఎన్నడూ లేనివిధంగా – దాదాపు ‘ఆహనాపెళ్ళంట’  నాటినుంచీ - ఎరుగని అచ్చమైన జానర్ మర్యాదతో కూడిన రోమాంటిక్ కామెడీగా  ‘అమీతుమీ’ మాత్రమే వచ్చింది కాబట్టి. మిగిలిన వాటిలో  రెగ్యులర్ టెంప్లెట్స్ , రోమాంటిక్ కామెడీలు / డ్రామాలు, యాక్షన్లూ  మొదలైన ఎప్పుడూ వచ్చి పడుతూ వుండే కమర్షియల్స్ లోనే హిట్లు తక్కువ, ఫ్లాపులెక్కువగా వున్నాయి. వీటికి దూరంగా నాన్ రెగ్యులర్ జానర్స్  తీస్తే ఢోకా వుండదని తేలుతోంది.  
(రేపు స్టార్ల సంగతులు)

-సికిందర్