రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, May 9, 2020

940: స్క్రీన్ ప్లే సంగతులు


     విషయం 6. షీలా కి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలంటాడు విక్రం. పర్మిషన్స్ కి చాలా టైం పట్టేస్తుందంటాడు రోహిత్. జడ్జి లక్ష్మణ రావు దగ్గరి కెళ్ళి ప్రీతి కేసు ఎక్స్ ప్లెయిన్ చేసి, పర్సనల్ హెల్ప్ అడిగానని చెప్పమంటాడు విక్రం. షీలా రెండో కారు మీద ఎవిడెన్స్ ట్రేస్ చేయించమంటాడు. దీని తర్వాత నేహా గుర్తొచ్చి ప్రేమ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటాడు. తర్వాత షీలా మీద నార్కో టెస్ట్ మొదలెడతాడు. ప్రీతిని నువ్వు కిడ్నాప్ చేశావా? - అనడిగితే, ఆమె నేహా అంటూ కలవరిస్తుంది. అంతే, బరస్ట్ అయిపోతాడు. చెప్పు చెప్పూ నేహా గురించి చెప్పమని నానా రభస చేస్తాడు. మెంటల్ బ్యాలెన్స్ తప్పి కల్లోలం సృష్టిస్తాడు. రోహిత్ బయటికి లాక్కెళ్ళి పోతాడు. ఇలా చేస్తే బావుండదని హెచ్చరించి వెళ్ళిపోతాడు టెక్నీషియన్. 

        వివరణ: ఈ టెస్టు షీలాకా, విక్రంకా? టెస్టులో షీలాయేమో బాగానే వుంది , విక్రం పిచ్చెత్తిపోయాడు ఆమె నేహా పేరెత్తే సరికి. ఇంజెక్షన్ వల్ల హిప్నాటిక్ ట్రాన్స్ లో వున్న షీలాతో ఇలాగే బిహేవ్ చేస్తాడా? ఈ బిహేవియర్లోంచి కథకుడేం ఆశించాడు? విక్రం ఇంతకి ముందే నేహాతో ప్రేమ ఫ్లాష్ బ్యాకేసుకుని ఫీలైపోయి వచ్చాడు కాబట్టి, ఇప్పుడు నేహా పేరు వినేసరికి అతడిలో గూడుకట్టుకున్న ప్రేమ తాలూకు ప్రగాఢమైన విషాదం అగ్నిపర్వతంలా బద్ధలవడం చూసి - అయ్యోపాపం, అయ్యో రామా, ఎంత కష్టం వచ్చిందిరా నాయనా - అని ప్రేక్షకులు కూడా తల్లడిల్లి పోవాలనుకున్నాడా? ఇది ప్రేమ గురించి సీనా? నార్కో టెస్టు సీనా? ప్రేక్షకులకేం కావాలి? 


     చెప్పు చెప్పూ అని మీద పడితే నేహా గురించి షీలా మాత్రమేం చెప్తుంది? అసలు ఈ టెస్టునంతా తప్పించుకోవడానికే అలా తెలివిగా నేహా పేరు కలవరించిందేమో? ఆమె అనుకున్నట్టే ఆమె ట్రాప్ లో విక్రం పడి, నేహా గురించి నానా రభస చేసి టెస్టు చెడగొట్టుకుని వెళ్ళిపోయాడేమో. వెల్ డన్ షీలా, నువ్విలాగే ఆడుకో! ఈ ఆటలో నువ్వే షైనింగ్ స్టార్ వి. అసలు నేహా ఏమైందో నేహా చేసిన ‘సూది ఇన్వెస్టిగేషన్’ బయటికి లాగితే తెలిసిపోయేదానికి, షీలా మీద పడి వేధించడమేమిటి? 

        అసలీ టెస్టుకి కూడా షీలా ఒప్పుకుందా? విక్రం రోహిత్ ని జడ్జి లక్ష్మణరావు దగ్గరికి పంపితే, ఆయన షీలా పరోక్షంలో టెస్టుకి రాసిచ్చేసి ‘పర్సనల్ హెల్ప్’ చేసేశాడా? ఐతే జడ్జి సహా విక్రం జైలుకి పోతాడు. ఈ నార్కో టెస్టులో కూడా షీలా లాయర్ లేడు. ప్రశ్నావళి లేదు. అసలు అంత క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రీతి కేసుని ఫాలో అవకుండా వుండదు షీలా. అప్పుడు - మీకు దూదీ సూదీ దొరికాక నన్నెందుకు వేధిస్తారని ఎదురు తిరగాలి. ఆ దూదీ సూదీ ఏం చేశారు? అవి మాయం చేసి అమాయకుల్ని ఇరికించే కుట్ర చేస్తున్నారా? - అని ప్రశ్నించాలి. గెస్ట్ హౌస్ దగ్గర శవమే దొరక్కపోతే గెస్ట్ హౌస్ కెళ్ళినట్టు ఆధారాల కోసం నా కారుని చెక్ చేయడమేమిటి? నా బ్లూ కారు చెకింగ్ కి ఆర్డరేశారుగా, అదేమైంది? ఆ కారు సర్వీసింగ్ కిచ్చి వాష్ చేయించి పారేశాను. క్లూస్ నాశనం చేశాను కాబట్టి నేనే కిడ్నాపర్ అని కేసు పెట్టరే? ఏదిపడితే అది ఆధారాలు పోగేసుకోవడమేనా వాటి ఎనాలిసిస్ కూడా చేసుకునేదేమైనా వుందా? మీరు బోలెడన్ని సాక్ష్యాధారాలు సేకరించడమే గానీ అవి కథ కుపయోగపడవా? మరి కథ దేనికి?

      ముందు హోం వర్క్ చేసుకోండి సార్. అసలు గెస్ట్ హౌస్ నిర్వాహకుల్ని ప్రశ్నించారా? నా పిచ్చి లెటర్ పట్టుకుని ఇంత  ఫూలిష్ గా ప్రవర్తిస్తున్నారే, నేను గెస్ట్ హౌస్ వైపు వెళ్ళానేమో నా గూగుల్ మ్యాప్ టైంలైన్ చెక్ చేసుకోండి. ప్రీతి ఎక్కిన ఆ బ్లూ కారు నాదే అయితే, నా కారులో ప్రీతి తొంగి ఎందుకు మాట్లాడుతుంది? నా క్లోజ్ ఫ్రెండ్ గా కారెక్కి కూర్చుంటుంది. ఆమెమీద నాకు దూదీ సూదీ వాడే అవసరమే రాదు. నవ్వుతూ తీసికెళ్ళి గొంతు కోసేసేదాన్ని. ఆమెని చంపేసేంత ఉద్రిక్త పరిస్థితే వుంటే, మాకు చెడి వుంటే, ఆమె నా కారు వైపు వస్తుందా? తొంగి చూస్తుందా? నాతో మాట్లాడుతుందా? ఆమె బాయ్ ఫ్రెండ్ అజయ్ వున్నాడని తెలుసా? కాలేజీలో మీరు ప్రశ్నించారు కూడా. ఇంటర్వెల్ లో మీరు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమానికి వచ్చాడు కూడా. వాణ్ణెందుకు పట్టుకోరు మీరు? ఏం సార్ మీరు... ఆ పని చెయ్యక, తమాషా లెటర్ పట్టుకుని చనిపోయింది ప్రీతియా, నేహానా అని ఒకటే ఓవరాక్షన్ చేస్తూ ఫేక్ సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. మీరింత వీక్ మైండెడ్ అనుకోలేదు. నన్ను బొమ్మలేసే ఆర్టిస్టుగా మీరు చూశారు. ప్రీతి కిడ్నాప్ కేసులో నా అవసరం మీకు రాకపోదు. నేనేమిటో అప్పుడు మీరే తెలుసుకుంటారు... అంటూ షీలా లాంగ్ లెక్చరివ్వడం కాదు, మనకి ఇలాగే  అన్పిస్తుంది ఆమె పరిస్థితి చూస్తూంటే. 


        ఒక సింపుల్ గా చెప్పాల్సిన కథని గజిబిజి చేశాడు కథకుడు. ఎక్కడికక్కడ కథనంలో, సీన్స్ లో లాజిక్ అనే పదార్ధమే పెట్టుకోవడం లేదు. నార్కో టెస్టు పెట్టాలని అప్పుడు పాలీగ్రాఫ్ టెస్టులో కేసు గురించి ఏమీ తేల్చలేదు. ఇప్పుడు నార్కో టెస్టులో ఏం తేల్చాలో కూడా స్పష్టత లేదు. ‘నువ్వు లెటర్ పబ్లిసిటీ కోసం రాయలేదు, నిజమేనా? అని కంట్రోల్ క్వశ్చన్ అడగాల్సింది ఇక్కడా అడగలేదు. అడిగితే పబ్లిసిటీ కోసమే రాశానని హిప్నాటిక్ ట్రాన్స్ లో మనసులో వున్నదే  బయట పెట్టేస్తుంది. అలా జరక్కూడదు. జరిగితే ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అవుతుంది. అందుకని ఈ సీను అర్ధాంతరంగా ముగించెయ్యడం కోసం, దీనికి ముందు విక్రం ప్రేమ ఫ్లాష్ బ్యాకు లీడ్ గా వేసి, ఈ సీనులో షీలా చేత అసందర్భంగా నేహా అంటూ పలికించి, ప్రేమ డ్రామా వైపు తిప్పేశాడు సీనుని. కథకుడి అంతరంగమిలా వుంటే కథేం బాగుపడుతుంది. 
        విషయం 7. విక్రం ని కేబిన్లోకి తీసికెళ్ళి, తలుపు పెట్టి చెడామడా తిడతాడు చీఫ్. నాకు చెప్పకుండా నార్కో టెస్ట్ పెడతావా? ఇంకోసారి చెప్పకుండా ఇలా చేస్తే పాతేస్తా- అని అరుస్తాడు. బయటికొచ్చిన విక్రంతో రోహిత్ అంటాడు, తను చూసిన బ్లూ కారు, షీలా కారు ఒకటి కాదని ఇబ్రహీం చెప్పాడని. మళ్ళీ ఫోరెన్సిక్స్ నుంచి కాల్ వచ్చిందనీ, షీలా బ్లూ కారులో ప్రీతికి సంబంధించిన ట్రేస్ ఎవిడెన్స్ ఏదీ దొరకలేదనీ అంటాడు. ఇంతలోనే ఫోరెన్సిక్స్ నుంచి ఇంకో కాల్ వస్తుంది రోహిత్ కి. విక్రం వైపు చూసి, గెస్ట్ హౌస్ వెనుక కుళ్ళిపోయిన శవం దొరికిందనీ అంటాడు (ప్లాట్ పాయింట్ టూ). 
       వివరణ: విక్రంని కేబిన్లో తలుపు పెట్టి బాగానే వాయించాడు చీఫ్. చెప్పకుండా నార్కో టెస్టు పెట్టాడని. ఇంకోసారి చెప్పకుండా ఇలా చేస్తే పాతేస్తానని. చెప్తే మాత్రం పీకేదేముంది చీఫ్. అసలు కేసేమిటో, కేసులో ఏం జరుగుతోందో తెలుసుకునే పాపాన పోయాడా? అప్పుడప్పుడు ఫుల్ యూనీఫాంలో వరండాలో ఎదురుపడి, యూనిఫాంలో లేని, సిగరెట్ దమ్ముకొడుతున్న విక్రంని డిప్లమటిగ్గా విష్ చేసి, హేపీగా వెళ్లి పోవడమేగా? టెస్టు పెట్టాడని కాక, టెస్టులో లవ్ డ్రామా మిక్స్ చేశాడని తిడితే ఒక అందం చందం. నేహా కావాల్రా నీకూ? నిన్నటి దాకా నీ చెల్లెలి ఫ్లాష్ బ్యాకుని భరించా. ఇప్పుడు నేహాతో ఫ్రెష్ టీజరా? పాతేస్తా నేహా సునేహా అన్నావంటే! - అని కౌంటర్ ఇచ్చుకుని వుంటే బావుండేది. ఈ ‘హిట్’ ఇంటి కొట్లాటలేమిటో మనకి అర్ధం గావన్నది వేరే విషయం.

        ఇక తను చూసిన బ్లూ కారు, షీలా బ్లూ కారు ఒకటి కాదని ఇబ్రహీం చెప్పాడని రోహిత్ చెప్పడం. ఇబ్రహీం అప్పుడు కారులో పోతూ, ఓఆర్ఆర్ అవతలి లేనులో అంత దూరం లో ఆగివున్న బ్లూ కారులో ఏం తేడా గమనించగల్గాడని ఒకటి కాదని చెప్పాడు? ప్రీతి కేసులో అనుమానించి అతణ్ణి సస్పెండ్ చేశారు. అనుమానంతోనే విక్రం అతడి ఇంటికెళ్ళి ఆధారాలు సేకరించుకుని వచ్చాడు. నువ్వు ప్రీతిని కిడ్నాప్ చేసిన కారు ఇదేనా అని అతన్నే అడిగితే కాదనే చెప్తాడు. ఇలా అన్నాడని రోహిత్ అనేసరికి విక్రం ఏమీ అనలేక పోయాడు. అసలు ఇబ్రహీం దగ్గర ఏంతో టెక్నిక్ తో సేకరించుకొచ్చిన అతడి వేలిముద్రలు, డీఎన్ఏ ఏమయ్యాయి? అవికూడా కథకుపయోగ పడలేదా?  
      ఇక షీలా బ్లూ కారులో ప్రీతికి సంబంధించిన ట్రేస్ ఎవిడెన్స్ ఏదీ దొరకలేదనీ కూడా రోహిత్ అనడం. ఈ విక్రం, రోహిత్ లు ప్రేక్షకుల్ని ఏమనుకుంటున్నారు? షీలా ఆ కారుని సర్వీసింగ్ కి ఇచ్చానని అంటే ఇంకా దాని మీద టెస్టింగ్ ఏమిటి? ఇంతలోనే మరొక కాల్. వెంటవెంటనే లాబ్ నుంచి కాల్స్. ఈసారి - గెస్ట్ హౌస్ వెనుక కుళ్ళిపోయిన శవం దొరికిందనీ లాబ్ వాళ్ళు చెప్పడం. లాబ్ వాళ్ళకి శవం దొరకడమేమిటి, పోలీసులకి దొరకాలి గానీ...

         ఇంకా ఈ శవం నేహాదై వుంటుందని అనుమానం వస్తుందా? రాదు, ప్రీతిదే ఆ శవమని చెప్పేస్తాం ఇంతసేపూ కథనం చూశాక. అంటే శవం ప్రీతిదా, నేహాదా అన్న ప్రతిపాదిత సస్పెన్స్ ఈ కథనంలో ఎప్పుడో ఆవిరై పోయిందన్న మాట.
 
        ప్లాట్ పాయింట్ వన్ లో కిడ్నాపైన ప్రీతి, ప్లాట్ పాయింట్ టూలో శవమై దొరకడంతో ఈ మిడిల్ కథనం పూర్తయ్యింది. ఈ మిడిల్ కథనమంతా ఎలా వుందో మొత్తం చూశాం. ఇంటర్వెల్లో ప్రారంభమైన షీలా ఫేక్ లెటర్ తో డ్రామా ప్లాట్ పాయింట్ టూ వరకూ ఇరవై నిమిషాలూ సాగింది. ఈ డ్రామాలో, మొత్తం మిడిల్ లో వున్న ఉచితానుచితాలూ పాత్రౌచిత్యాలూ అన్నీ చూశాం. విశ్లేషణ రాయడానికి ఇంత చిక్కుల మేళంగా వున్న కథ ఇదే. గందరగోళపు  సోకాల్డ్ ఇన్వెస్టిగేషన్ కథ. ఇక సోమవారం క్లయిమాక్స్ ఏమిటో చూద్దాం.
సికిందర్