రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Tuesday, August 23, 2016


     ‘రుస్తుం’ రీ- పోస్ట్ మార్టం బేతాళ కథల్లా సాగేట్టుంది... ఒక్కో శవాన్ని చెట్టుమీద నుంచి దించి భుజాన వేసుకు వెళ్తూండడమే... శవాల్లోని బేతాళుడు అడిగే ప్రశ్నలకి చచ్చినట్టూ సమాధానాలు చెప్పుకోవడమే. కొందరు కళాకారులు  ఎంతో తెలివిగా కళా సృష్టి గావిస్తారు. దాంట్లోని సంక్లిష్టతకి ఎన్ని వెబ్ పేజీలైనా చాలవు విశ్లేషణలకి. ‘రుస్తుం’ కి  1) అసలు నిజ కథ, 2) దీని ఆధారంగా దర్శకుడు రచయితల సొంత కథ, 3) మళ్ళీ ఈ సొంత కథలో a ) భార్య ద్రోహ కథ-  b) భర్త దేశభక్తి కథా, 4) ఇంకా వేరే  రెండు సినిమాల్లో వచ్చిన కథలూ  ముందేసుకుని, పీహెచ్ డీ పట్టాకోసం కృషి చేస్తున్నట్టు ఎంతకీ ముగియని  తులనాత్మక పరిశీలన చేయాల్సిందే...కళా పోషణ కరాళ నృత్యం చేస్తూంటే ఇంతే!!  

        ఇంకా మనం బిగినింగ్ విభాగం దగ్గరే వున్నాం. అసలు విక్రం అనేవాడు నేవీ అధికారులతో కలిసి స్కామ్ చేస్తూ, స్కామ్ కి లొంగదీయాలని  రుస్తుం మీద వొత్తిడి తెస్తున్నప్పుడు, ఈ సంగతి రుస్తుం తన భార్య సింథియాకి  చెప్పకుండా వుంటాడా? తామిద్దరికీ విక్రం,  అతడి చెల్లెలూ పరిచయస్థులే కదా? ఒకవేళ స్కామ్ విషయాలు సింథియాకి తెలియనివ్వ కూడదనుకుంటే- స్కామ్ మూలంగా తనతో సంబంధాలు చెడిన విక్రంనీ అతడి చెల్లెల్నీ ఇక కలవొద్దని మాత్రమైనా  రుస్తుం సింథియాకి చెప్పి వెళ్ళాలిగా? అలా చెప్పి వెళ్తే సింథియా విక్రం వలలో పడేది కాదుగా? పోనీ, తను డ్యూటీ నుంచి తిరిగి వచ్చాకైనా సింథియా  వ్యవహారం మీద నిలదీసినప్పుడు-  తను  తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశానని ఆమె చెప్పినప్పుడైనా తను  అప్రమత్తమై - స్కామ్ సంగతి నీకు తెలిసిపోయిందా? వాడేం చెప్పాడు? స్కామ్ కి నన్ను ఒప్పించమని నిన్ను బలవంత పెట్టాడా?-  అని అడగలిగా? స్కామ్ విషయంలో విక్రం తో ఆమె ఏదో కుమ్మక్కయినట్టూ, తనకేదో ద్రోహం చేస్తున్నట్టూ  అలా చూస్తాడేమిటి? 

        రెండోది- స్కామ్ కి సంబంధించి విక్రం మాట రుస్తుం వినలేదే అనుకుందాం, అలాంటప్పుడు ఓ  ప్లేయ్ బాయ్ లా సింథియాతో ఎందుకు ఎంజాయ్ చేస్తాడు విక్రం? మాట వినని  రుస్తుంకి ఇలా బుద్ధి చెప్ప వచ్చనా? ఇలా  రుస్తుం భార్యని వాడుకుని వదిలేస్తే,  జీవితాంతం రుస్తుం కుమిలి పోవాలనా? ఇదేనా అతడి ఉద్దేశం?  ఇది అతికినట్టు వుందా? ఇలాటి ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోవాలి విక్రం? రుస్తుం వల్ల ఇక స్కామ్ కి పూర్తిగా తెర పడి,  ఆశ వదులుకున్నప్పుడు కదా? స్కామ్ వ్యవహారం ఇంకా నలుగుతూండగానే సింథియాని వూరికే వాడుకుని వదిలెయ్యడంలో అర్ధముందా- తనతో ఫోటోలు తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడానికైతే ఆమెని ట్రాప్ చేయాలిగాని!  

        ఇంకొక సంగతేమిటంటే, ఫ్లాష్ బ్యాక్ లో చూపించే దాని ప్రకారం అసలు సింథియాని  విక్రం కి సెట్ చేసేది అతడి చెల్లెలు ప్రీతీనే. అప్పుడామె తన ప్లే బాయ్ అన్నకి అమ్మాయిల్ని సమకూర్చి పట్టే మనిషిలాగే అన్పిస్తుంది తప్ప, స్కామ్ లో ట్రాప్ చేయడానికి సింథియాని సెట్ చేస్తున్నట్టు అన్పించదు. 

        ఇలా ఏ పాత్ర ఉద్దేశాలూ లక్ష్యాలూ అక్కడ నెలకొన్న పరిస్థితిని బట్టి గాక, అనాలోచితంగా అడ్డగోలుగా  చిత్రణ చేశారు. కారణం- మామూలు భార్యా- భర్త- ప్రియుడు అనే కథకి  స్కామ్ ని తెచ్చి కలపడమే. సెకండాఫ్ లో స్కామ్ సంగతులు ఓపెన్ చేస్తూ పోయారే గానీ, అది రుస్తుం- సింథియా- విక్రం ల ట్రయాంగిల్లో   పొసగాలని ఆలోచించ లేదు.  

        కాబట్టి నేవీ స్కామ్ అనే ఫ్లాష్ బ్యాక్ తో కలిపి చూస్తే, ఈ బిగినింగ్ విభాగంలో కథ- ప్రాబ్లం సెటప్, తద్వారా ప్లాట్ పాయింట్ వన్ అన్నీ తప్పుల తడకగానే, తప్పుదోవ పట్టించడంగానే  తేలిపోతాయి.
***
    స్కామ్ కోణాన్ని పక్కన బెట్టి కాసేపు మామూలు భార్య- భర్త- మధ్యలో ప్రియుడు కథలా చూసినా కూడా ‘రుస్తుం’ లో చిత్రణ ఎంత అమెచ్యూరిష్ గా వుందో గత వ్యాసంలోనే చూశాం. రుస్తుం ఇంటికి వస్తే సింథియా రెండు రోజులుగా లేకపోవడం, ఆమె ఉత్తరాల వ్యవహారం, విక్రం బంగాళా కెళ్ళి రుస్తుం కేవలం వాళ్ళిద్దర్నీ చూసి రావడం, సింథియా వచ్చాక ఆమెని నిలదీయడం, అప్పుడు మాత్రమే వెళ్లి విక్రంని చంపడం అనే సీక్వెన్సు లో రుస్తుం వెళ్లి విక్రంని చంపడం అనే చర్య మినహా మిగతావన్నీ అర్ధం లేనివి. వీటిలో విక్రం బంగాళా కెళ్ళి విక్రంతో వున్న సింథియాని దీనంగా చూసి రావడమనే ఘట్టమైతే సహజ రియాక్షన్ కాదు. 

        నానావతి కేసు ఆధారంగానే  1973 లో గుల్జార్ తీసిన ‘అచానక్’ లో హీరో వినోద్ ఖన్నాది ఆర్మీ మేజర్ రంజిత్ పాత్ర. ఈ కథలో నాన్చుడు లేదు. మేజర్ రంజిత్  ఇంటికి తిరిగి రాగానే ప్రియుడితో భార్య కలిసి ఉండడాన్ని చూసి వాళ్ళిద్దర్నీ చంపేస్తాడు! డ్రామాలు, మెలోడ్రామాలు లేవు. 

        నానావతి కేసు ఆధారంగానే 1963లో ఆర్కే నయ్యర్ తీసిన   ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో సునీల్ దత్ ది  పైలట్ అనిల్ సహానీ పాత్ర. నానావతికి ముగ్గురు పిల్లలుంటే సహానీకి ఇద్దరు పిల్లలుంటారు. నానావతి లాగే అనిల్  ఇంటికి తిరిగి వస్తే, నానావతి భార్య సిల్వియాలాగే అనిల్  భార్య ఆశ (లీలా నాయుడు) కూడా ముభావంగా వుంటుంది. ఆమెని మూడ్ లోకి తెచ్చుకునేందుకు నానా కామెడీలు చేస్తాడు అనిల్. మధ్యలో ఫోన్ మోగుతుంది. అనిల్  తీస్తే అవతలి గొంతు పలకదు. పెద్దగా పట్టించుకోడు. 

        ఆశా కోసం తను తెచ్చిన  బహుమతి బొమ్మ తాజ్ మహల్ ఇవ్వబోతే తీసుకోదు. అలమారలో పెట్టబోతే అడ్డుపడి ఆ బహుమతి తీసేసుకుంటుంది. అతను పిల్లల దగ్గరికి వెళ్లి పోతే అలమార తెరుస్తుంది. అందులో అలాటిదే బహుమతి  ఇంకోటి వుంటుంది. దాన్ని తీసి కిటికీలోంచి పారేసి దీన్ని పెడుతుంది. మళ్ళీ ఫోన్ మోగితే తనే తీస్తుంది. ఇందాక ఫోన్ చేసిన ఆమె ప్రియుడే  (రెహమాన్) ఆమెతో మాట్లాడేస్తాడు. వింటూ వుండి పోతే, ఒక్కసారి పిల్లల అరుపులు  వినబడతాయి. ఫోన్ పక్కన పెట్టేసి పిల్లల దగ్గరికి వురుకుతుంది. అక్కడ బొమ్మ తుపాకీతో కూతురి మీద కొడుకు కాలుస్తాడు. కూతురు చచ్చిపోయినట్టు నటిస్తుంది- తల్లికి  కంప్లెయింట్ చేస్తుంది. ఇటు అనిల్ వచ్చి ఇంకా ఎంగేజ్ లో వున్న ఆ ఫోనెత్తి వినేస్తాడు ...ఆశా ప్రియుడి మాటలు...

      అప్పుడు దాదాపు ఆశా గొంతు నులిమి చంపినంత పనిచేస్తాడు అనిల్.  ‘వాణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా?వాడు నిన్ను ప్రేమిస్తున్నాడా?’  అనడిగితే,  ‘ముజే కుచ్ నహీ మాలూం’ (నాకేమీ తెలీదు) - అంటుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలని తండ్రిని అడుగుతాడు- పిల్లల కోసం కలిసి వుండమంటాడు తండ్రి. కానీ ఇంత  ద్రోహం చేసిన స్నేహితుణ్ణి సహించలేక వెళ్లి చంపేస్తాడు అనిల్. 

       
అచానక్ లో చూసిన దృశ్యానికి సహజ రియాక్షన్ తో తక్షణ చర్య తీసుకుని ఇద్దర్నీ చంపేస్తే, ‘యే రాస్తే హై  ప్యార్ కే’  లో- సహజ రియాక్షన్ గా భార్య గొంతు నులిమి  చంపబోతాడు, తర్వాత వెళ్లి ప్రియుణ్ణి చంపేస్తాడు. ‘రుస్తుం’ లో, సింథియా విక్రం తో కలిసి వుండగా చూసిన రుస్తుం   ఎలాటి సహజ రియాక్షనూ  లేక వెలవెల బోతాడు. సహజ రియాక్షన్ కి పాత్రకి అవకాశమీయక పోతే అలాటి పరిస్థితిలోకి నెట్టనే కూడదు. 

       ఇక ‘రుస్తుం’ లో సింథియా ఉత్తరాలూ, ‘యే రాస్తే హై ప్యార్ కే’  లో ఆశా బొమ్మ తాజ్ మహల్ బహుమతుల సంగతి చూస్తే-  సింథియా ఇంట్లో పెట్టకున్న బోల్డు ఉత్తరాలతో, బహుమానాలతో  సన్నివేశాలూ పాత్రలూ ఎంత అయోమయంగా తయారయ్యాయో క్రితం వ్యాసంలో చూశాం. కానీ ఆశాకి ప్రియుడి నుంచి అన్నేసి బహుమతులూ వగైరా అందుకున్నట్టు వుండదు. ఒక్క తాజ్ బొమ్మే ఆమె అందుకుంది. భర్త ఇంటికి వచ్చే ముందు పెళ్లి చేసుకోనన్న ప్రియుడితో ఘర్షణ కూడా పడి -నీ సంగతి చూస్తా - అని తెగతెంపులు చేసుకుని వచ్చింది.  

        ఈ నేపధ్యంలో భర్త ఇంటికి వచ్చినప్పుడు ప్రియుణ్ణి వదిలించుకుంది గనుక ఇక ఏమీ ఎరగనట్టు కాపురం చేసెయ్యొచ్చు భర్తతో. కానీ ఆమె అంతరాత్మ ఒప్పుకోలేదు. అందుకే భర్త ఇంటికి వచ్చినప్పుడు ఆ అపరాధ భావంతో  మధన పడింది. విషయం తెలీని  అతడెన్ని కామెడీలు చేసినా,  సరే జరిగిందేదో జరిగిపోయింది మనం కూడా భర్తతో కామెడీగా బతికేద్దా మనుకోలేదు. సింథియా లాగా డబుల్ గేమ్ ఆడదల్చుకోలేదు. సిల్వియాలాగా ఒక నీతితో వుంది. అలమార లోని ప్రియుడి బహుమతి తీసి పారేసి, భర్త బహుమతినే  పెట్టుకోవడంలో ఇది తేటతెల్ల మవుతోంది. అంటే నానావతి భార్య సిల్వియా ప్రియుడితోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పేస్తే, ఆశా భర్త తోనే ఫిక్స్ అయిపోయి భర్తకి చెప్పలేక మధనపడింది. ఆ ఫోన్ కాలే ఆమెని భర్తకి పట్టించింది. 

        ఇక్కడకూడా సన్నివేశ సృష్టిలో లోపముంది. ప్రియుడు మొదటి సారి కాల్ చేస్తే భర్త తీశాడు. రెండో సారి చేస్తే తనే తీసింది. భర్త ఇంట్లోవున్న అలాటి సమయంలో తను ప్రియుడి కాల్ అందుకో కూడదు  కదా? కట్ చేయాలి. పైగా అతడితో తెగతెంపులు చేసుకున్నాక  రెస్పాన్సే  ఇవ్వకూడదు. అతనేదో చెప్తూంటే వింటూ వుంటుంది. అంతలో పిల్లల కేకలు విన్పిస్తే ఫోన్ ని అలాగే వదిలేసి వెళ్ళిపోతుంది- ఇలా ఎవరైనా చేస్తారా? అంటే, పాత్ర బదులు ఇక్కడ కథకుడు ఎంటర్ అయ్యాడన్న మాట.  ఆమె చేత కావాలని ఇలా చేయించాడు- ఆమెని భర్తకి పట్టించడానికి ఇంతకంటే మార్గం తోచలేదు కాబోలు. 

      ఇక ఈ రెండు పాత హిందీ సినిమాల్లోనూ హీరో వెళ్లి చంపినప్పుడు,  ప్రియుడు టవల్ మీద వుండడు. ‘రుస్తుం’ లో మాత్రం నిజ ఘటనలాగే టవల్ మీద వుంటాడు. నానావతి ఎలా చంపాడో అలాగే చంపుతాడు. ఆతర్వాత పోలీసులకి లొంగిపోతాడు. 

         ఇక్కడ పాయింటేమిటంటే, ఆ రెండు పాత సినిమాల్లో హత్యకి మోటివ్ వివాహేతర  సంబంధమే. ఇంకెలాటి స్కాములూ వగైరాలతో తికమక లేని సూటి పాయింటే. నానావతి చంపడానికి కూడా మోటివ్ వివాహేతర  సంబంధం ఒక్కటే. 

        కానీ రుస్తుం విషయానికొస్తే,  అతడి మోటివ్ అనుమానాస్పదం.  వివాహేతర సంబంధమా, స్కామా? దేనికోసం చంపాడు? చంపినప్పుడు వెల్లడైన కథ వరకూ చూస్తే,  వివాహేతర  సంబంధమే కారణమన్పిస్తుంది. కానీ సెకండాఫ్ లో వెల్లడయ్యే  స్కామ్ రీత్యా చూస్తే మాత్రం స్కామ్ గురించి కూడా  చంపాడా అన్న కొత్త ప్రశ్న తలెత్తుతుంది. వివాహేతర సంబంధం- స్కామ్ రెండూ తోడై చంపాడనడం సరికాదు. ఒక కథకి రెండు పాయింట్లు, రెండు సమస్యలు వుండవు. కాబట్టి రెండు కారణాలూ తోడై చంపాడనడం ఎలాటి కథా  సూత్రాలకీ వ్యతిరేకం. 

        ఒకవేళ రెండు కారణాలూ తోడై చంపడం కూడా కథా సూత్రమే అనుకుంటే, దీనికి వ్యతిరేకంగా దొరికిపోయే చిత్రణ సన్నివేశంలోనే వుంది. నేవీ స్కామ్ కి సంబంధించి చంపితే దేశభక్తి కిందికి రావచ్చు. వివాహేతర  సంబంధం దృష్ట్యా చంపితే దేశభక్తి ఎలా అన్పించుకుంటుంది?  చివరికి దేశ భక్తుడి కలరిస్తూనే కథ ముగించారు. మొదటిది వృత్తిగతమైతే, రెండోది వ్యక్తిగతం. చంపడం నేవీ యూనీఫాం వేసుకెళ్ళి చంపాడు. వ్యక్తిగత కక్ష, అందునా వివాహేతర  సంబంధమనే కారణానికి యూనిఫాం వేసుకెళ్ళి చంపి -తన యూనిఫాంకి చెడ్డ పేరు తెచ్చుకోడు బాధ్యత గల అధికారి అయిన హీరో. విలన్ అయితే ఇలాటి పాడు పన్లు చేస్తాడు.  రుస్తుంకి  యూనిఫాం వేసుకెళ్ళి మరీ చంపాలనిపించిందంటే,   అతను భార్యా ద్రోహం కంటే కూడా విక్రం దేశద్రోహాన్నే ఎక్కువ ఫీలైనట్టని అర్ధం వస్తోంది. కాబట్టి రెండు కారణాలతోనూ చంపాడనే మాట నిలబడదు. 

        పోను పోనూ సెకండాఫ్ లో భార్యా ద్రోహమనే అసలు పాయింటు మరగున పడిపోయి-  విక్రం దేశద్రోహం తద్వారా రుస్తుం దేశభక్తీ అనే పాయింటే ఎలివేట్ అవుతుంది. సెకండాఫ్ లో రివీలయ్యే దాని ప్రకారం, చంపే ముందు ఢిల్లీ కి కాల్ చేసి విక్రంని వదలనని డిఫెన్స్ సెక్రెటరీతో అనడం, స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేయడం వగైరా చర్యలన్నీ వివాహేతర సంబంధానికి సంబంధించినవి కావుగా? ఇలా  మొదలెట్టిన భార్య వివాహేతర సంబంధం కథ కాస్తా భర్త దేశభక్తి కథగా మారి పోయిందన్న మాట! ఇది కూడా ఒక కథా సూత్రమే నంటే ఇక చెప్పేదేమీ వుండదు. 

        కాబట్టి కథకి కీలక మలుపు అనదగిన, అసలు కథ ప్రారంభ మయ్యే మజిలీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర – రెండు కారణాల్లో ఏదో ఒక్కటే ఎక్కువ ఫీలయ్యి చంపాడను కోవాలి-  అప్పుడది  దేశభక్తి. ఎందుకంటే యూనిఫాంలో వెళ్లి చంపాడు.
        అంటే విక్రంతో తన భార్య అలా తిరగడాన్ని రుస్తుం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదా?

                                         ***
         ప్పుడు మిడిల్ కొస్తే, సింథియా పాత్రని ఎలాగైనా బాధితురాల్ని చేసి బయటపడెయ్యాలని విఫల యత్నం చేశారు కథలో. ఏమంటే విక్రమే ఆమెని మాయమాటలతో లొంగదీసుకున్నాడని చిత్రీకరణలు. ఈ చిత్రీకరణలో వర్షపు రాత్రి కారులో అతను హద్దుమీరుతూంటే తను ప్రతిఘటించాలి సింథియా. కానీ అలా చెయ్యదు. శుభ్రంగా మైకం కమ్మి లొంగిపోతుంది. యే రాస్తే హై ప్యార్ కే లో మత్తు మందు ఇచ్చి లొంగ దీసుకుంటాడు. కాబట్టి ఆశా  తప్పేం కన్పించదు. బాధితురాలని చెప్పొచ్చు. సింథియా ఎలా బాధితురాలవుతుంది?

          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర రుస్తుం భార్య బాధితురాలనే ఫీలయ్యి వెళ్లి దేశభక్తితో విక్రం ని చంపివుంటే భార్యని క్షమిస్తున్నట్టే. కానీ అప్పట్నించీ ఆమెతో మాటలుండవు. మిడిల్ విభాగంలో ఆమె జైలు కొచ్చి కలిస్తే
ఈమెని నేను  రిసీవ్ చేసుకోలేననే బాడీ లాంగ్వేజ్ తో,  చేతులు వెనక కట్టుకుని బిగుసుకుపోయి నిలబడి ఉంటాడు. అప్పుడామె చెప్పే ఫ్లాష్ బ్యాక్ లో విక్రంతో ఆ వర్షపు రాత్రి ఏం జరిగిందో తెలుసుకుని గొప్ప సానుభూతితో, ప్రేమతో, చేతులు ముందుకు తెచ్చి అన్యాయ  మైపోయిన సింథియాని కావలించుకుంటాడు. ఇది సిల్లీగా అన్పించడం లేదూ - ఫ్లాష్ బ్యాక్ లో చూపించేది ఆమె ఏమాత్రం ప్రతిఘటించకుండా లొంగిపోవడం...నిజానికి అతణ్ణి నెట్టేసి కారు దిగిపోయి పరిగెత్తాలి వర్షం పడ్డా, పిడుగులు పడ్డా! కానీ అలా చెయ్యలేదు. తమకంతో శుభ్రంగా లొంగిపోయింది. దీనికి రుస్తుం ఈమె బాధితురాలని శుభ్రంగా నమ్మి ఫిక్స్ అయిపోయాడు- ఆమె చెప్పే కహానీలు ఇప్పుడెలా నమ్మాలన్పించిందో!

          మిడిల్ లో భార్యా భర్తల కథ ఇలా కొలిక్కి వచ్చి, అంతా స్కామ్ కథగానే సాగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్య మొదలై కొలిక్కి వచ్చే వరకూ ఇద్దరి మధ్యా దాని తాలూకు మానసిక సంఘర్షణే కన్పించదు.
యే రాస్తే హై ప్యార్ కే లో ప్రధాన కథ ఇదే. భార్యాభర్తల సంబంధం ఇప్పుడేమవుతుందన్నదే. వాళ్ళు తమ సంబంధాన్ని పునర్నిర్వచించుకునేందుకు పడే మానసిక సంఘర్షణే. ఇంతా చేసి ముగింపుని చెడిన ఆడదానికి స్థానం లేదనే అర్ధంలోనే పాత్రని తప్పించారు. కోర్టులో భర్త నిర్దోషి అని తేలడంతో, భార్య తను చేసిన మోసం తట్టుకోలేకో మరెందుకో గుండాగి చనిపోతుంది. 'చెత్త' అనుకుని ఊడ్చేశాడన్న మాట దర్శకుడు!

         
అచానక్ లో ప్రియుడితో సహా భార్యనీ చంపెయ్యడంలో కూడా ఇదే అర్ధం కన్పిస్తుంది- చెడిన ఆడదానికి స్థానం లేదని. చంపిన హీరోకి ఉరి శిక్ష వేస్తారు. కానీ దర్శకుడు గుల్జార్ సాబ్ మరీ ఇంత పురుషపక్షపాతి అంటే  లోకం నమ్మదు. కనుక కాస్త పురుషాధిక్య భావాన్ని సడలిస్తున్నట్టు- హతురాలైన భార్య పాత్రకి కొంచెం సెంటిమెంటు జోడించి తన ఇమేజిని బ్యాలెన్సు చేసుకున్నారు గుల్జార్ సాబ్. చనిపోతూ భార్య - ఈ పవిత్ర మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయమని చివరి కోరిక కోరుతుంది భర్తని. కాబట్టి ఇప్పడు ఉరి శిక్ష పడ్డ భర్త జైల్లోంచి తప్పించుకుని, మంగళ సూత్రాన్ని గంగానదిలో నిమజ్జనం చేయడానికి పారిపోతాడు. పోలీసులు వెంట పడతారు. ఇలా చట్టం- సెంటి మెంటు అనే బలమైన డ్రామాతో సినిమా హిట్టయ్యింది. 

         
రుస్తుం లో చెడిన ఆడదాన్ని శిక్షించలేదని, ఈ సినిమా మహిళల్ని ఆకట్టుకుంటుందనీ   హీరో అక్షయ్ కుమార్ సెలవిచ్చాడు. చాలా హిందీ సినిమాల్లో భర్త తప్పు చేస్తే భార్య క్షమిస్తుందనీ, కానీ ‘రుస్తుం’ లో తప్పు చేసిన భార్యని  భర్త క్షమిస్తాడనీ, ఇందుకే ఈ సినిమాని మహిళలు బాగా ఇష్టపడి మరొక్క సారీ చూస్తారనీ, కాపురాలు ముక్కలవకుండా, విడాకులకి దారితీయకుండా ఈ సినిమా పరిష్కారం చూపిస్తుందనీ స్టేట్ మెంట్ ఇచ్చి పారేశారు! దీనికి రకరకాల అర్ధాలు తీసి ఎంజాయ్ చేస్తున్నారు నెటిజనులు!

-సికిందర్ 
 (next : నేవీ స్కామ్ నడక) 
http://www.cinemabazaar.in