రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, ఫిబ్రవరి 2021, గురువారం

1017 : రివ్యూ

        ల్లరి నరేష్ తాజా సక్సెస్ ఫుల్  నాంది వార్తల్లో వుండడానికి ఐపీసీ సెక్షన్ 211 గురించి ప్రప్రథమంగా తీయడం కారణం. తెలుగులోనే కాదు, దేశంలో ఇంకో భాషలో ఈ అంశంతో రాకపోవడం మరో కారణం. ఒక చట్టం గురించి ప్రప్రథమ సినిమా అంటే అది లోకల్ సినిమా అవదు, జాతీయ సినిమానే అవుతుంది. జాతీయ మార్కెట్ కూడా  వుంటుంది. పైగా వాస్తవిక సినిమా అవుతుంది. కానీ ఎంత వాస్తవికమని, ఎంత ప్రయోజనకరమని చూసినప్పుడు అది కేవలం మభ్యపెట్టే సినిమాగా తేలిపోకూడదు. కమర్షియల్ హిట్టవచ్చు, 211 గురించి ఏదో తీశారటన్న హైప్ తో పరుగులు తీసే ప్రేక్షకులతో తప్పక హిట్టే అవుతుంది. తీరా చూసి ఆ హైప్ సృష్టించిన చట్టం గురించి ఎలా ఫీలయ్యారన్నది అసలు విషయం.   

        హిందీలో సెక్షన్ 375, ఆర్టికల్ 15 వంటి లీగల్ థ్రిల్లర్ సినిమాల గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అవి ప్రాక్టికల్ గా, ప్రొసీజురల్ గా, ప్రొఫెషనల్ గా చట్టాల పట్ల సరైన అవగాహన కల్గించినందుకు. గైడెన్స్ ఇచ్చినందుకు. ఇలా ప్రత్యేకంగా ప్రస్తావించడానికి ఒక నాంది కూడా తగిన అర్హతలు సంపాదించుకుని వుండాలి. కానీ తీసుకున్న 211 కాన్సెప్ట్ తో ఈ అవకాశం రాలేదు. దేశంలో 211 చాలా రొటీన్ గా అమలవుతున్న చట్టమే. ఈ సినిమాతో ఇదే నాంది అవాలని చెప్పలేరు. ఇదేదో ప్రజలకి తెలియకుండా, వాళ్ళ హక్కుల్ని గుర్తు చేయకుండా మరుగున వుండిపోయిన చట్టం కాదు. మరీ ముఖ్యంగా, ఈ సినిమాలో చూపించినట్టు తప్పుడు కేసు పెట్టిన పోలీసుల మీద బాధితుడు ప్రయోగించగల బ్రహ్మాస్త్రం కూడా కాదు.

        ఎవర్నో ఇరికించి పోలీసులు కేసు పెడతారు. అతను నిర్దోషిగా విడుదలై వచ్చి, తన మీద తప్పుడు కేసు పెట్టారని పోలీసుల మీద సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టడం కుదరదు ఈ సినిమాలో చూపించినట్టుగా. చాలా చాలా అరుదైన పరిస్థితుల్లోనే ఇది జరిగింది. ఎందుకని తెలుసుకునేందుకు, కేరళ మాజీ డీజీపీ ఎన్ సి ఆస్థానా దీని మీద రాసిన సుదీర్ఘమైన ఆర్టికల్ వుంది.

        ఆస్థానా ప్రకారం, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య సెక్షన్ 211 కేసులు కోర్టులు అనుమతిస్తాయి. ఇలాటి కేసులు కోకొల్లలుగా వున్నాయి. ఒక వ్యక్తి పెట్టిన కేసులో ఇంకో వ్యక్తి మీద విచారణ సాగి నిర్దోషిగా విడుదలైతే, ఇతను ఆ కేసు పెట్టిన వ్యక్తి మీద తప్పుడు కేసులో ఇరికించాడని 211 పెట్టొచ్చు. ఇదే పని పోలీసులు చేస్తే పోలీసుల మీద ఈ కేసు పెట్టలేరు. పోలీసుల మీద డిపార్ట్ మెంటల్ చర్యలు తీసుకోవచ్చు. అసలు పోలీసులు తప్పుడు కేసులు పెడితే బాధ్యత పై స్థాయిలో ఐపీఎస్ అధికారులకే వుంటుందంటారు ఆస్థానా. కాబట్టి ఈ సినిమాని సీరియస్ గా తీసుకోకుండా, ఓ కాలక్షేప రివెంజి యాక్షన్ డ్రామాగా మాత్రమే చూసేస్తే సరిపోతుంది. మరి 211 చట్టంతో ఎలా తీసివుంటే ఇది గమనార్హమైన నేషనల్ సినిమా కూడా అయివుండేదో ఈ క్రింద తర్వాత చెప్పుకుందాం...

***

        2. సూర్య ప్రకాష్ (నరేష్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. తల్లి దండ్రులతో మధ్యతరగతి జీవితం. ఉద్యోగంలో చేరాడని మీనాక్షి (నవమి) తో సంబంధం చూస్తారు. మీనాక్షితో ఎంజాయ్ చేస్తూంటే, దీంతో సంబంధం లేకుండా ఓ పౌర హక్కుల నేత హత్య జరుగుతుంది. ఒక సీఐ కిషోర్ (హరీష్ ఉత్తమన్) వుంటాడు. హంతకుల్ని పట్టుకునేందుకు పైనుంచి వొత్తిడి పెరగడంతో కొన్ని సీసీ టీవీ ఫుటేజీలు పోగేసి సూర్య ప్రకాష్ ని అరెస్టు చేసి కేసు పెడతాడు. ఈ హత్య తను చేయలేదని గోల పెడుతూ బెయిలు కూడా రాక ఐదేళ్ళు జైల్లో మగ్గుతాడు సూర్య ప్రకాష్. ఈ లోగా అతడి తల్లిదండ్రులు న్యూసెన్స్ గా తయారయ్యారని వాళ్ళని చంపి, ఆత్మహత్యలుగా చిత్రిస్తాడు సీఐ. ఒక లాయర్ ఆద్య (వరలక్ష్మీ శరత్ కుమార్) వుంటుంది. ఈమె వచ్చి, 211 చట్టం గురించి సూర్యకి చెప్పి, అతడి మీద నడుపుతున్న కేసు బూటకమని తేల్చి, సీఐ మీద 211 కేసు పెట్టిస్తుంది. పెట్టాక ఈ కేసుతో ఎలా పోరాడారన్నది మిగతా కథ.

***

        3. ముందుగా, ఉన్న కథ ఎలా వుందో చూద్దాం. కథకి ఏది పాయింటు అనుకున్నారు - 211 చట్టం. చాలా సేపూ చూపించిన కథేమిటి - బెయిలు రాక ఏళ్ళ కేళ్ళు జైల్లో మగ్గడం. బెయిలు రాక ఏళ్ళకేళ్ళు జైల్లో మగ్గడం గురించి ఈ కథ కాదు. తప్పుడు కేసులోంచి బయటపడి, సీఐ మీద 211 కేసు పెట్టడం గురించి వెంటనే పాయింటు కొచ్చెయాల్సిన కథ. కనుక అరెస్టయిన వెంటనే తప్పుడు ఎఫ్ ఐ ఆర్ ని రద్దు చేయించుకుని బయట పడాలి. బయట పడి సీఐ మీద 211 తో న్యాయపోరాటం మొదలు పెట్టేయాలి. ఇంతకి మించి అతడి అరెస్టు గురించి కథకి అవసరం లేదు. కథ 211 గురించి కాబట్టి. ఇంకో నస కాదు, రీళ్ళకి రీళ్ళ జైల్లో మగ్గాల్సిన విషయం కాదు.

        స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ రీత్యా అతడి అరెస్టు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా ఉపయోగపడేది మాత్రమే కాబట్టి. శివ లో నాగార్జున జేడీని వీరబాదుడు బాదాడంటే అది భవానీతో పోరాటానికి దారి తీసేందుకే. అంతేగానీ కొత్త కొత్త సైకిల్ చెయిన్లు తెప్పించి జేడీని కొడుతూ కూర్చోడానికి కాదు. అప్పుడది శివ అయ్యేది కాదు, శవ్వ శవ్వ అయ్యేది -కోట శ్రీనివాసరావు నోరు కొట్టుకుంటే. నాంది లో కూడా ఆ దారి తీసిన సమస్య 211 తో పోరాటం కోసమే అవుతుంది కాబట్టి. దీంతో ప్లాట్ పాయింట్ వన్ ఫినిష్ అవుతుంది. ఇంకో నసలేదు. ఇక ఎఫ్ ఐఆర్ రద్దు చేయించుకుని బయటపడి, సీఐ మీద 211 తో పోరాటమే మిగిలిన కథ. 
 
        తప్పుడు హత్య కేసు పెట్టడమే జీవితానికి పెద్ద డ్యామేజీ. ఇంతకి మించిన  జీవితాన్ని పోగొట్టే డ్యామేజీ వుండదు. అరెస్టయినప్పుడు వ్యక్తిగతంగా, వృత్తి గతంగా జరిగిన డ్యామేజీని ఎన్ని కోణాల్లో, ఏ స్థాయిలో, ఎంత ఎమోషన్ బిల్డప్ చేసి చూపించినా నష్టం లేదు. ఇక పాయింటు మీద ఫోకస్ చేసి వెంటనే 211 కథ మొదలెట్టుకోవాలి.

        రెండోది, తల్లిదండ్రుల్ని సీఐ చంపడం. అలాంటప్పుడు 211 కథ ఎందుకు? తప్పుడు కేసులో ఇరికించిన సీఐ పేరెంట్స్ ని కూడా చంపిన రివెంజీ అంటే సరిపోతుందప్పుడు. ఇది కానప్పుడు అతను విడుదలై 211 కేసు పెట్టాడంటే ఎందుకు పెట్టాడు? తల్లిదండ్రుల్ని చంపిన కోపంతోనా, లేక తప్పుడు కేసులో ఇరికించిన అన్యాయానికా? ఏదనుకోవాలి? ఒక కథలో రెండు పాయింట్లు తలెత్తకూడదు. కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. కాబట్టి ఏళ్ళకేళ్ళు జైల్లో మగ్గిన కథలాగే, తల్లి దండ్రుల మరణం కూడా 211 పాయింటుని అప్రస్తుతం చేసేసింది, కథలోంచి పాయింటుని పక్కకు నెట్టేసింది. అసలీ పాయింటు అవసరమే లేదన్నట్టు తయారయ్యింది. ఇప్పుడే కనిపెట్టినట్టు హైప్ కోసం తప్ప.

***

        4. సరే, పాయింటుతో నడిపిన కథ చూద్దాం. పోలీసుల మీద 211 కేసేయడం లోని అసంబద్ధతని అలా వుంచుదాం. ఇది చూసి ప్రేక్షకులెవరైనా ఇదే పని చేస్తే భంగ పాటుకి గురవుతారు. కేవలం ఇక్కడున్న కథకి అప్లయి చేసి మాత్రమే చెప్పుకుంటున్నాం. పాయింటేమిటి? సీఐ వేసిన కేసు తప్పుడు కేసని నిరూపించి శ్క్షింప జేయడం. ఏ శిక్ష?  కేసు ఏదైతే ఆ కేసులో దోషికి పడే శిక్షతో సమాన శిక్ష అని 211 చెబుతుంది. అంటే, ఇక్కడ హత్య కేసులో ఇరికించాడు కాబట్టి శ్రీమాన్ సీఐ మహాశయులు గారికి యావజ్జీవ శిక్ష, లేదా మరణ శిక్ష కాకపోయినా, ఖాయంగా ఏడేళ్ళ శిక్షతో జనరంజకమైన ఘన సన్మానం. ఇదే ముగింపు. ఇంకో ముగింపు వుండదు ఈ కథకీ, పాయింటుకీ. ఈ ముగింపు లేదా తీర్పు ఒక హెచ్చరిక. ఎవరూ తప్పుడు కేసులు పెట్టేందుకు వెనుకాడేలా హెచ్చరిక! ఇంతటితో సినిమాకి శుభం పడాలి. ఇంకా అశుభాలు జరగడానికి వీల్లేదు.

        అశుభమే జరిగింది. హీరో అతడి లాయర్, ఈ పాయింటు వదిలేసి  అసలు హత్య చేసింది సీఐ ప్లస్ మంత్రి గింత్రి ఎట్సెట్రా బ్యాచి అని నిరూపించేంత పెద్ద పనికి పూనుకున్నారు, నిరూపించారు కూడా. హత్య కేసులో ఈ దోషులకి శిక్ష పడేలా చేశారు. కథకి ఇదే ముగింపు, మారిపోయిన  తప్పుడు ముగింపు అయింది. అసలు పాయింటు ఎగిరిపోయి కథకి అవసరంలేని తప్పుడు పాయింటుతో తప్పుగా ముగిసి, రివెంజీ కథకి న్యాయం  చేసింది తప్ప 211 కి కాదు. ఇది రివెంజీ కథ అని తేల్చేసింది.

        దీంతో తప్పుడు కేసులో ఇరికించినందుకు 211 ప్రకారం హెచ్చరికలా, సీఐకి మాత్రమే దానికి తగ్గ శిక్ష అనే ఉద్దేశిత పాయింటుకి ఇక్కడకూడా ప్రాధాన్యం లేకుండా చేశారు. ఇందుకే ఈ సినిమాలోని 211 చట్టాన్ని సీరియస్ గా తీసుకోకుండా, తమాషాగా ఓ రొటీన్ మూస రివెంజీ డ్రామాగా చూసేయాలని చెప్పుకునేది.

***

        5. ముందు అరెస్ట్ చేసి కేసు పెట్టేయ్, తర్వాత ఎవిడెన్స్ గివిడెన్స్ చూద్దాంలే అన్న వింత ధోరణిని పోలీసులు అనుసరిస్తూంటారు. ఇలాటి లవ్ జిహాద్ కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ లనే కొట్టేస్తూ పోయాయి కోర్టులు. ఇటీవల సంచలనం సృష్టించిన దిశారవి కేసులో బెయిలు మంజూరు చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది కోర్టు. అసలు అభియోగాన్ని నమ్మేందుకు సాక్ష్యాలే లేనప్పుడు కేసేమిటని మండి పడింది కోర్టు. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంటు అయింది ఇలా చేసే పోలీసులకి హెచ్చరికలా.   

        అయితే ఇదే బెయిల్ ఆర్డరులో పోలీసుల మీద చర్య తీసుకోమని కూడా కోర్టు ఉత్తర్వులిచ్చి వుండాల్సిందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇదే జరగడం లేదు. పోలీసులు పెట్టింది తప్పుడు కేసని తేలినా, తీర్పుల్లో పోలీసుల మీద చర్యకి జడ్జీలు ఆదేశించడం లేదు. విడుదలైన నిందితుడు ఏడుస్తూ ఇంటికి పోవాల్సిందే. న్యాయ నిపుణులు రిట్ పిటిషన్ వేయ వచ్చని అంటున్నారు. ఎవరు వేస్తారు.  

        నాంది లో జడ్జి పోలీసు విచారణ కోసం కేసుని వాయిదాల మీద వాయిదాలేస్తూ బెయిల్ ఇవ్వకుండానే వుంటాడు. నిందితుడు సూర్యప్రకాష్ లాయర్ ఎందుకుంటాడో ఏమీ చెయ్యడు. సీఐ పెట్టిన ఎఫ్ ఐ ఆర్లో మూడు మౌలిక లోపాలున్నాయి. నిందితుడు సూర్య ప్రకాష్ పౌర హక్కుల నేత వెనకాలే మూడు చోట్ల కనబడుతున్న మూడు సీసీ టీవీ ఫుటేజీలే వుంటాయి.

        అప్పుడు జడ్జీ ఏం చేయాలి  - మిస్టర్ సీఐ, ఇది ఎఫ్ ఐ ఆరేనా? ఈ ఫుటేజీలు కేవలం సర్కమ్ స్టేన్షియల్ ఎవిడెన్సు. నడిరోడ్డు మీద నిందితుడు హతుణ్ణి చంపుతున్నట్టు ఇలాటి ఫుటేజీలతో కూడిన ఫిజికల్ కాంటాక్ట్ ఎవిడెన్స్ ఏదీ? అసలు ఒక పౌర హక్కుల నేతని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎందుకు చంపాడో కారణం చూపే మోటివ్ ఏదీ? రంగయ్య పుల్లయ్యని చంపితే ఎందుకు చంపాడో  చెప్పనవసరం లేదా? ఆ సమయంలో నిందితుడు తను ఎక్కడున్నాడని చెప్పాడో ఎలిబీ ఏదీ? కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఈ ఎఫైయార్ చెల్లదని ప్రకటిస్తూ  రద్దుచేస్తున్నా -  అని కేసు ముగించేస్తే, కేసులోంచి బయట పడ్డ సూర్యప్రకాష్  సీఐ మీదికి పోవడానికి రూటు క్లియరై పోతుంది.

***

        6. 211 తో పోరాటమెలా చేయాలి? పౌరుల మీద ఈ చట్టం పనికొఛ్చినప్పుడు, పోలీసుల మీద ఎందుకు పనికి రాదు? జడ్జీలు ఎందుకొప్పుకోరు? ప్రభుత్వం ఎందుకొప్పుకోదు? రాజకీయ వ్యవస్థ ఎందుకొప్పుకోదు? ఈ పోరాటంలో గెలవాలనే లేదు, ఓడిపోయినా సరే, ఈ ప్రశ్న ఒక్కటి దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది, తట్టి లేపుతుంది. తెలుగు సినిమా వైరల్ అవుతుంది. జాతీయ అవార్డుకి పంపుకోవచ్చు. ఇందుకే మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్, క్రియేటివ్ యాస్పెక్ట్ కి తగ్గ మార్కెట్ యాస్పెక్ట్ వుండేలా చూసుకోవడం చాలా ముఖ్యమని ఈ బ్లాగులో పదేపదే గుర్తు చేసేది.

సికిందర్