రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

1, నవంబర్ 2020, ఆదివారం

992 : స్క్రీన్ ప్లే సంగతులు

      రణరంగం రెండు రకాలు. అంతరంగ ప్రధానం, బహిరంగ ప్రధానం. అంతరంగంలో మానసికం, బహిరంగం భౌతికం. నాక్టర్న్ లో మానసిక రణరంగం. ఇందులో ప్రధాన పాత్ర జూల్స్, తన ప్రత్యర్ధి అయిన వివి మీద పైచేయి కోసం మానసికంగా రణరంగాన్ని రగిలించుకుంటుంది. పర్యవసానంగా కవల సోదరి వివి భౌతికంగా బయట వివిధ పరిణామాలెదుర్కొంటుంది. కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్ సృష్టికర్త గోథే. 1796 లో సుప్రసిద్ధ జర్మన్ రచయిత అయిన జే డబ్ల్యూవ్ గోథే రాసిన విల్ హమ్ మిస్టర్స్ అప్రెంటీస్ షిప్అన్న నవల కమింగ్ ఆఫ్ ఏజ్ కథల జానర్ ఎలిమెంట్స్ ని స్థాపించింది. ఇదే ఇలాటి నవలలకైనా, సినిమాలకైనా గైడ్ లా వుంటూ వస్తోంది. ట్వెంటీ ప్లస్ లోకి అడుగుపెట్టే ముందు టీనేజర్ల మానసిక స్థితి ఎలా వుంటుందన్న దానికి శాస్త్రీయ విశ్లేషణతో కూడిన ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఇదేదో కమర్షియల్ సినిమాలకి పనికిరానిదేమో అనుకుంటే కాదు. పనికి రానిది హాలీవుడ్ తీసుకోదు. పనికి రానిది ఈ బ్లాగులో కూడా రాయం. గోథే ఎలిమెంట్స్ ఈనాటికీ అర్ధవంతమైన కమింగ్ ఆఫ్ ఏజ్ కమర్షియల్ కథనపు మసాలా దినుసులే.    

     తే స్ట్రక్చర్ లేకుండా దినుసులు పడవు. స్క్రీన్ ప్లేకి స్ట్రక్చర్ అనేది చట్రం. దినుసులనేవి అందులో కుదురుకునే క్రియేటివ్ యాస్పెక్ట్. ఏ జానర్ కథకా జానర్ సంబంధ మసాలా దినుసులుంటాయి. వీటిని ఏర్చి కూర్చి చట్రంలో అమర్చడమే క్రియేటివ్ యాస్పెక్ట్. ఈ క్రియేటివ్ యాస్పెక్ట్ కి ఫ్రేము కట్టినట్టు చట్రంలా వుంటూ స్ట్రక్చర్ కాపాడుతూంటుంది. దీన్నే త్రీయాక్ట్ స్ట్రక్చర్ అంటారు. 

    ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనే చట్రంలో 'నాక్టర్న్' కథ ఎలా ఇమిడిందో చూద్దాం. ముందుగా ఈ కథలో ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇది ఫాస్టియన్ బార్గెయిన్ అన్న పాయింటు ఆధారంగా సాగే కథ. ఫాస్టియన్ బార్గెయిన్ అంటే దుష్ట సాంగత్యం. మనం విలువల్ని పక్కన పెట్టేసి డబ్బు కోసమో, మరేవో సుఖాల కోసమో దుష్టుడితో చేతులు కలిపామనుకోండి, దాన్నిఫాస్టియన్ బార్గెయిన్ అంటారు. దాన్తర్వాత దానికి తగ్గ పరిహారం చెల్లించుకోవాల్సిందే, అది వేరే విషయం.

2

        'ది ట్రాజికల్ హిస్టరీ ఆఫ్ డాక్టర్ ఫాస్టస్' అనేది ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధ నాటకం. దీన్ని ఇంగ్లాండుకి చెందిన క్రిస్టఫర్ మార్లో (1564-1593రచించాడు. దేవుడిని తెలుసుకోకుండా ఈ లోకపు ఆకర్షణలకి లోనై, దుష్టశక్తులని ఆశ్రయించిన డాక్టర్ ఫాస్టస్ అనే జర్మన్ తత్వవేత్త ఎలా పతనమయ్యాడనేది దీని ఇతివృత్తం.

    డాక్టర్ ఫాస్టస్, మెఫిస్టోఫిలిస్ అనే దుష్ట ఆత్మ (దెయ్యం) తో ఒప్పందం చేసుకుంటాడు. దాని ప్రకారం మెఫిస్టోఫిలిస్ తనకి డబ్బూ, హోదా, అధికారం, స్త్రీ సుఖమూ వంటి సర్వసౌఖ్యాలూ కల్పిస్తే, తను మెఫిస్టోఫిలిస్ కి తన ఆత్మని ఇచ్చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఇలా దెయ్యంతో ఒప్పందం చేసుకుని నరకం అనుభవిస్తాడు డాక్టర్ ఫాస్టస్, దారుణ మరణం పొందుతాడు. ఇదే పాయింటుతో 'నాక్టర్న్' కథలో సోదరి వివి మీద పైచేయి కోసం, జూల్స్ ఈ ఫాస్టియన్ బార్గెయిన్నే చేసుకున్న ఫలితంగా ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది...

3

        బిగినింగ్ (17 నిమిషాలు) : ఒక ఆత్మహత్యా దృశ్యం. శాస్త్రీయ సంగీత కారుడు టర్టినీ బాణీ డెవిల్స్ ట్రిల్ సోనాటా ని వయొలిన్ మీద మీటుతున్న జూల్స్, గడియారం ఆరుగంటలు కొట్టడంతో ఆపుతుంది. నింపాదిగా వెళ్ళి భవనం మీంచి సూర్యుడి కభిముఖంగా దూకి ఆత్మహత్య చేసుకుంటుంది... 

    కవలల జననం. పొత్తిళ్లలో పూలగుత్తుల్లా ముద్దుముద్దుగా వుంటారు. నెలల శిశువులుగానే పియానో అడ్డదిడ్డంగా మీటేస్తారు. పెరుగుతూ ఇంకా మీటి పారేస్తారు. ఎదిగి నోట్స్ ఆధారంగా ఇంకా పీకేస్తారు. టీనేజర్స్ గా ఫాస్టెస్ట్ పియానిస్టులుగా మారిపోతారు. ఇదంతా 1.13 నిమిషాల్లో కలయో మాయో అన్నట్టుగా మెరుపు వేగంతో ముగిసిపోతుంది.    

కథలో కొస్తే, పేరెంట్స్ కేసీ, డేవిడ్ ల పరిచయం, వాళ్ళ మిత్రుడు కూడా వుంటాడు. ఇప్పటికి వివి లిండ్బర్గ్ అకాడెమీలో చేరిపోయి వుంటుంది. జూల్స్ కేమీ తోచక గడుపు తూంటుంది. వివి వచ్చే సంవత్సరం జులియర్డ్స్ కెళ్ళాలి కాబట్టి  ముందుగా ప్రిపేర్ అవుతోందని, రెండు నిమిషాలు వెనుక పుట్టిన దానివి నువ్వు కాస్తాగొచ్చనీ అంటాడు డేవిడ్. మిత్రుడు అందుకుని, భూమ్మీద 8 బిలియన్ల జనాభా వుందనీ, ప్రతీ వొక్కరూ స్పాట్ లైట్ లోకి వచ్చెయ్యాలనుకుంటారనీ, కానీ ఇన్ స్టా గ్రామ్ జనరేషన్ తెలుసుకోవాల్సిందేమిటంటే, లాంగ్ టర్మ్ కెరియర్ ఆప్షన్స్ గురించి ఆలోచించడమనీ అంటాడు. జూల్స్ విన్పించుకోదు. సరే, ఆకాడెమీలో చేరుదువు గానిలే అంటాడు డేవిడ్. డేవిడ్, కేసీలు యూరప్ టూర్ వెళ్ళే ఆలోచనతో వుంటారు. 

జూల్స్ ని అకాడెమీలో చేర్పిస్తాడు డేవిడ్. కారులో వస్తున్నప్పుడు జూల్స్ విచారంగా వుంటుంది. దూరంగా కొండలు కన్పిస్తాయి, దగ్గర్లో ఇళ్ళు కన్పిస్తాయి. క్యాంపస్ చేరుకుంటారు. అక్కడ వీళ్ళని చూసుకోకుండా వివి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ మాక్స్ ని హగ్ చేసుకుంటుంది. ఇది చూసి డేవిడ్ - ఈ యంగ్ లవ్ ఫాదర్స్ కి పగలే పీడకలలురా బాబూ అనుకుంటాడు. జూల్స్ కి ఆత్మవిశ్వాసం కల్పిస్తూ ధైర్య వచనాలు చెప్తాడు. 

                              4

        ఇక్కడ్నుంచీ జూల్స్ అకాడెమీ జీవితం ప్రారంభమవుతుంది. వివి సాదరంగా చూస్తుంది. అకాడెమీలో ఆరువారాల క్రితం ఆత్మహత్య చేసుకున్న మోయిరా అనే స్టూడెంట్ స్మృత్యర్ధం సభ జరుగుతుంది. మోయిరాకి నివాళిగా జులియర్డ్స్ కన్సర్ట్ లో మనం గెలుపొందాలని హెడ్ ప్రసంగిస్తుంది. క్లాసులు జరుగుతాయి. క్లోక్ రూంలో కింద ఎవరో నోట్ బుక్ పడేసి పోతూంటే జూల్స్ తీసి చూస్తుంది. మాడిపోయిన వికృత సూర్యుడి బొమ్మ వేసిన పుస్తకం. అది మోయిరా షెల్ఫ్ లోంచి పడేసి వెళ్ళాడని అర్ధమవుతుంది. ఆ నోట్ బుక్ తెచ్చుకుని తన రూమ్ లో పెట్టుకుంటుంది. రూమ్ తలుపు మూసుకుని చీకటవుతుంది.      

    వివికి కస్క్, జూల్స్ కి రోజర్ టీచర్లుగా వుంటారు. ఈ డ్రగ్స్, డ్రింక్స్ జమానాలో కూడా నువ్వు నీ వర్క్ తో కమిటెడ్ గా వున్నావని ప్రశంసిస్తాడు రోజర్. కస్క్ దగ్గర పియానో ప్లే చేస్తున్నప్పుడు వివి వక్షస్థలాన్ని ఎక్స్ ఫోజ్ చేస్తూ వుంటుంది. జూల్స్ ని చూసి, పీస్ ఎందుకు ఛేంజ్ చేశావని అడుగుతాడు రోజర్. ఆమె సెయింట్ సీన్స్ 2 పీస్ ప్లే చేస్తూంటుంది. అది వివి ట్రై చేస్తున్న పీస్, అంత కష్టం కాదంటాడు. వివికి కస్క్ దీన్నే నేర్పుతున్నాడని అంటుంది. హెర్ హెమెడస్ కి కమిట్ కా, నీకు హెర్ హెమెడస్ ఆశీర్వచనాలందుతాయని అంటాడు రోజర్. 

    వివితో ఎడ మొహం పెడ మొహం గా వుంటుంది జూల్స్. వివి సెయింట్ సీన్స్ 2 పీస్ మీదే వుంటుంది. ఆమె అత్యంత స్పీడుగా ప్లే చేస్తూంటే రహస్యంగా గమనిస్తున్న జూల్స్ కి గుండె దడదడ కొట్టుకుంటుంది. వెళ్ళిపోయి తను కూడా అదే స్పీడుని ప్రయత్నిస్తుంది. 

    ప్లాట్ పాయింట్ 1 : ఎక్కడో డెవిల్స్ ట్రిల్ సోనాటా వాయిస్తున్నశబ్దం. దాని సృష్టికర్త టర్టినీ చిత్రపటాన్నే చూస్తుంది జూల్స్. టిక్ టిక్ టిక్ మని గడియారం ముళ్ళ శబ్దం. రూమ్ లోకి వచ్చి కిటికీ మూస్తుంది జూల్స్. నోట్ బుక్ తీస్తుంది. మొదటి పేజీలో వాక్యాల్ని చదువుతుంది - అంధకారంలో నన్ను వెతుక్కునే వాళ్ళకి అమరమైన ఖ్యాతి లభిస్తుంది - అని వుంటుంది. అనుసరించాల్సిన మార్గం ఈ పుస్తకంలో వుంది…1,2,3,4,5,6… అని వుంటుంది. మొదటి పాఠం ముందు పెట్టుకుని పియానో మీటుతూంటుంది. వివి టీచర్ కస్క్ ఇది గమనిస్తాడు. వివి పీస్ నే ప్లే చేస్తున్నావ్ కదూ అంటాడు. వివికి చెప్పొద్దు, చెప్తే నన్ను చంపేస్తుందని అంటుంది. నీ కాళ్ళు విరగ్గొడుతుందని అంటాడు కస్క్ (బిగినింగ్ సమాప్తం).

బిగినింగ్ వర్క్ షీట్ చూద్దాం : 

     టీనేజి పాత్రల ఎదుగుదల’ కి సంబంధించిన చిత్రణలకి స్క్రీన్ ప్లే త్రీ యాక్ట్ స్ట్రక్చర్లో నాల్గు క్రియేటివ్ యాస్పెక్టులున్నాయి. మూమెంట్ ఇన్ టైం, లాంగ్ హాల్, బిగ్ ఈవెంట్, పెట్రి డిష్ అన్నవి. లాంగ్ హాల్ - అంటే సాగలాగే పద్ధతిలో - టీనేజి పాత్ర పరిణతి చెందే దిశగా చేసే ప్రయాణాన్నిసాగలాగుతూకొన్నేళ్ళ స్పాన్ లో చూపిస్తూ పోతారు. అంటే బాల్యం నుంచీ టీనేజీ మీదుగా ఇరవయ్యో పడిలోకి. నాక్టర్న్ ఈ లాంగ్ హాల్ కోవకి చెందుతుంది.

    ఎదుగుదల, స్వేచ్ఛ అనేవి గోథే ప్రతిపాదించిన టీనేజీ సమస్యలు. అంటే ఎలిమెంట్స్ లేదా మసాలా దినుసులు. టీనేజర్స్ ఎదుగుదల దృక్పథంతో వుంటే స్వేచ్ఛని వదులు కుంటారు. ఎదుగుదల కోసం ఏ వ్యాపకాన్ని కోరుకుంటారో దాని మీద వుంటారు. ఇది పాజిటివిజం. స్వేచ్ఛని కోరుకుంటే ఇక దేనీ మీదా మనసు లగ్నం చేయక, ఎదుగుదలని వదిలేసి, దొరికిన సొమ్ములతోనో, పేరెంట్స్ మీద ఆధారపడో బతికేస్తూంటారు. ఇది నెగెటివిజం. ఎదుగుదల కోరుకుంటే లాంగ్ హాల్గా నిరంతర ప్రయాణంగా వుంటుంది. నాక్టర్న్ లో ఇది జూల్స్ పాత్రకి వర్తిస్తుంది. 

        పైన గమనించిన దీని బిగినింగ్ విభాగపు కథనంలో, బిగినింగ్ విభాగపు ప్రత్యేక బిజినెస్ అంతా కూడా వుంది నాల్గు టూల్స్ తో. 1. కథానేపథ్యపు ఏర్పాటు : ఇది వివితో పోటీపడుతున్న జూల్స్ మనస్తత్వం రూపంలో ఆవరించి వుంది. పుట్టినప్పుడు ఇద్దరూ కళాకారిణులు గానే పుట్టారు. పుట్టినపుడు అందరూ సమానంగానే పుడతారు. పెరుగుతున్నప్పుడు కొందరు వెనుకబడిపోతారు. దీనికి ఇంకొకరితో పోల్చి చూసుకోవడమే కారణం. పోల్చుకోవడమంటే తాము ఒకవేళ తక్కువేమోనని చెక్ చేసుకోవడం. చెక్ చేసుకోవడమంటే స్లిప్ అవడమే. ఒకసారి మనసు ఇక్కడ ఇలా స్లిప్ అయిందా, ఇక జీవితాంతం విజయం కోసం తంటాలే, పోరాటాలే.

జూల్స్ వూహ తెలిసే వయసుకొచ్చేటప్పటికి ఎక్కడో వివితో తనని పోల్చుకుని స్లిప్ అయి వుంటుంది. మనమిక్కడ తల్లిదండ్రుల పెంపకం జోలికి పోవడం లేదు. కథ ఇంకా క్లిష్టంగా మారుతుంది. ఇక అలా స్లిప్ అయి జారుడుబల్ల మీద జారిపోతూనే టీనేజి కొచ్చింది జూలు విదుల్చుకుని జూల్స్. అంటే కథలో చూపిస్తున్న పదిహేడేళ్ళ వయసుకి.      

(ఇద్దరూ కళాకారిణులుగా పుట్టినప్పుడు, కవలలైనప్పుడు, ఇద్దరూ కూడబలుక్కుని, ఒకే గోల్ పెట్టుకుని, ఆ గోల్ ని స్టేజి మీద ప్రదర్శిస్తూ, ఇద్దరూ విడివిడి పియానోల మీద, ఇద్దరూ ఒకే వేగంతో, వరస తప్పకుండా జుగల్ బందీగా, ఒకే పీస్ ప్రదర్శించి, సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతూ, కవలలకే వన్నెఎందుకు తేకూడదు? కవలలుగా పుట్టినందుకు జన్మ రుణం తీర్చుకోవాలిగా? ఇదొక నీతి, నాక్టర్న్ నుంచి పుట్టే ఇంకో కథ రీతి).

1

      1 వ టూల్ కథా నేపథ్యపు ఏర్పాటు పై విధంగా జరిగాక, 2 వ టూల్ పాత్రల పరిచయాలు : కవలలుగా జన్మించడం. పుడుతూనే ఇద్దరూ పియానో మీద పడడం, పెరుగుతూ రాణించడం, టీనేజర్లుగా పియానో సాధకులవడం. పుట్టుక నుంచీ టీనేజీ వరకూ ఈ చిత్రణ ఒక అద్భుత దృశ్య మాలిక. దర్శకురాలు సోది చెప్పలేదు. ఒకదానివెంట ఒకటి కవలల సంగీత కాంక్ష తోనే వేగంగా మాంటెజెస్ వేసింది. ఇందులో తల్లిని చూపించలేదు, తండ్రినీ చూపించలేదు. మా అమ్మలు కదే, మా బొమ్మలు కదే అని మెచ్చుకుని ముద్దాడే పాత మూస చాదస్తాల్లేవ్. పాటేసుకుని పావుగంట సేపు చైల్డ్ హుడ్ బోరు నాన్సెన్స్ లేదు. కేవలం 1.13 నిమిషాల్లో కలయో మాయో అన్నంత వేగంగా సమ్మోహనపరుస్తూ ఒక పూల బాణం విసరడం. కవిత్వం తెలిస్తేనే ఇలాటి చిత్రీకరణలు సాధ్యమవుతాయి. అన్నట్టు కవిత్వం బిందువులో అనంతం చూపిస్తుంది. కొత్త దర్శకురాలు లిప్తపాటు కాలం పోయెటిక్ మాంటెజెస్ లో అనంతమే చూపించింది.

2

        తల్లిదండ్రులతో వాళ్ళ మిత్రుడితో బాటు జూల్స్ ని చూపిస్తూ, ఇప్పటి జూల్స్ ని పరిచయం చేశారు. ఇప్పుడామె చాలా మూడీగానూ విచారంగానూ వుంది. అకాడెమీలో చేరిపోయి రేపు జులియర్డ్స్ కెళ్ళబోతున్న వివి పట్ల అసహనంగానూ వుంది. అది బయటికి కనిపించని అసహనం. కథ చివరంటా సాగే తన అంతరంగాన్ని బయటపడనివ్వని పాత్రచిత్రణకి, ఇక్కడే ప్రారంభం జరిగింది. జరగాలి కూడా. అకాడెమీకి వెళ్లడానికి తొందరపాటు కూడదని తండ్రి మందలించడం, లాంగ్ టర్మ్ కెరియర్ ఆప్షన్ గురించి మిత్రుడు చెప్పడం. ఈ సీన్లో వివి అదృష్టం పట్ల జూల్స్ జెలసీతో వుందని ఎస్టాబ్లిష్ అయింది. గోథే ఎలిమెంట్స్ ప్రకారం, ప్రధాన పాత్ర పరిచయ ప్రక్రియలో, జీవితం పట్ల అస్థిర టీనేజీ మనస్తత్వ చిత్రణ ఈ బిగినింగ్ విభాగంలోనే జరగాలి. ఈ జానర్ మర్యాదలననుసారం టీనేజీ పాత్ర మానసికంగా అస్తిరత్వం లోంచి స్థిరత్వం లోకి ప్రయాణిస్తుంది కాబట్టి, ఈ కథా ప్రయాణాన్ని ఇక్కడ్నుంచే చూపించాలి. ఇదే ఇక్కడ జరిగింది. ఇక ఆమెని అకాడెమీలో చేర్పించడానికే నిర్ణయం తీసుకుంటూ సీను ముగుస్తుంది. 

    ఇలా ఒక్క సీన్లో పాత్రల పరిచయాల్నీ, వాటి స్థితి గతుల్నీ చూపించేశాక, ఇంకేవో కాలక్షేప సీన్లతో సాగదీయలేదు. అకాడెమీలో చేర్పించడానికి నిర్ణయించాక, కథనాన్ని లాజికల్ గా ముందుకి తీసికెళ్తూ, 3 వ టూల్ తీసుకుని ఇక అకాడెమీకి ప్రయాణమే. 3 వ టూల్ వచ్చేసి ఇక సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన గురించి వుంటుంది. అంటే ప్లాట్ పాయింట్ వన్లో వచ్చే కీలక ఘట్టానికి దారితీసే సిట్యుయేషన్స్ ని కల్పించడం.

ఇప్పుడు సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన మొదలు పెడుతున్నప్పుడు, పైన స్థాపించిన మానసిక స్థితితో ముందుకెళ్లాలి. ముందు కెళ్ళి నప్పుడు మానసిక ప్రపంచానికి భౌతిక ప్రపంచం చెక్ పెడుతూండాలి. ఎందుకు చెక్ పెట్టాలి? అజ్ఞానాన్ని, అపరిపక్వతని భౌతిక ప్రపంచం తిరస్కరిస్తుంది కాబట్టి. ఇంటర్వూలో వంకర సమాధానాలు చెప్తే లేచెళ్లి పొమ్మంటాడు కదా ఆఫీసర్? మానసిక ప్రపంచం స్పిరిచ్యువల్, భౌతిక ప్రపంచం మెటీరియల్. మెటీరియల్ గా ఏదైనా ఉనికిలోకి రావాలంటే ముందు ఆలోచన శుభ్రంగా వుండాలి. జూల్స్ కీదే లోపించించింది.

3

        జూల్స్ ఇలా అస్థిర మానసిక స్థితితో అకాడెమీకి ప్రయాణం కట్టినప్పుడు, దూరంగా కొండలు కన్పిస్తాయి, దగ్గర్లో ఇళ్ళు కన్పిస్తాయి. ఈ షాట్స్ ఎందుకు వేసిందా దర్శకురాలని ఆలోచిస్తే, ఒకటే అన్పిస్తుంది : మనమేం కోరుకుంటున్నా అది మనలోనే వుంటుంది, బయట ఎక్కడో వెతుక్కోనవసరం లేదు. దీనికి సింబాలిజంగానే ఇళ్ళు చూపించడం. ఇల్లనేది అన్నీ మనలోనే వున్న మన మానసిక లోకం. ఇల్లొదిలేసి అనవసరంగా దూరపు కొండల నునుపు చూసి పరుగులు పెడుతూంటాం. దీనికి సింబాలిజంగానే కొండల్ని చూపించడం. జూల్స్ కిదే వర్తిస్తోంది... ఇలాకాక ఎవరికైనా ఇంకేదైనా అర్ధమైతే మాకు తెలియజేయవచ్చు.

        ఈ సీనులో ఇంకోటుంటుంది. జూల్స్ కిటికీలోంచి చూస్తూ ప్రయాణిస్తూంటే ఎవరు డ్రైవ్ చేస్తున్నారో దర్శకురాలు చూపించదు. కారులో తండ్రి వుండొచ్చు, కానీ డ్రైవ్ చేస్తున్న అతణ్ణి చూపించదు. ఈ సీను జూల్స్ ఒక్కరిది. ఆమె భావసంచలనాలూ, అవతల చూపిస్తున్న దూరపు కొండలూ, దగ్గరి ఇళ్ళ సింబాలిజాలూ ప్రేక్షకులకి సింక్ అవాలంటే, తండ్రిని కూడా చూపిస్తూ, మాటలు పలికిస్తూ, సీనుని కలుషితం చేయకూడదని తెలుస్తోంది.

4

        జూల్స్ ని అకాడెమీ చేరుకున్నాక క్యాంపస్ లో ఇంకో డైనమిక్స్ చూపిస్తుంది దర్శకురాలు. జూల్స్ కారులో వెళ్తున్నప్పుడు కట్ చేసి, క్యాంపస్ బ్యాక్ డ్రాప్ లో ఆగివున్న కారు డోర్ తీసుకుని ఆమె హుషారుగా పరుగెట్టడాన్ని చూపిస్తుంది. ఇదేంటి, అంత డల్ గా వస్తున్న జూల్స్, ఇప్పుడింత హుషారుగా కారుదిగి పరుగెడుతోందేమిటని ఉలికిపాటుతో మనం చూస్తాం. పరుగెత్తడమే కాదు, అక్కడున్న స్టూడెంట్ ని గభాల్న వాటేసుకుంటుంది. వార్నీయబ్బ ఇదేంట్రా అని మాస్ ప్రేక్షకుడు అనుకుంటాడు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడే వున్న తండ్రి డేవిడ్ ని, జూల్స్ నీ చూపిస్తుంది దర్శకురాలు. ఇప్పుడు డేవిడ్ పాయింటాఫ్ వ్యూలో బాయ్ ఫ్రెండ్ ని హగ్ చేసుకుంటున్న వివిని చూపిస్తుంది దర్శకురాలు...థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్. డైనమిక్స్ అంటే తారుమారు చేసి చూపించడం. క్రియేటివిటీ అంటే సమయస్ఫూర్తితో కూడిన డైనమిక్స్. సీనంటే కథకి చైతన్యం. సీనంటే ప్రశ్న రేకెత్తించి జవాబు చూపించడం. సీనంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి రాయడం కాదు, తదేక ధ్యానంతో చూసేలా చేయడం. సీనంటే సోది చెప్పడం కాదు, నాల్గు సీన్లలో చూపించే విషయాన్ని ఒక్క సీనులో చూపించెయ్యడం. సీనంటే బడ్జెట్ ని ఆదా చేయడం. సీనంటే పాత్రల గురించి కొత్త సమాచారమివ్వడం లేదా కథని ముందుకి తీసికెళ్లే కొత్త పాయింటుని ప్రేక్షకులకి అందించడం. ఈ సీనులో ఆల్రెడీ అకాడెమీలో వున్న వివి, బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణంలో వుందని పాత్ర గురించి కొత్త విషయం  చెప్పేసింది దర్శకురాలు. ఇది మన మేకర్లకి వివరిస్తే అర్ధమవుతుందా? ఎవ్వరికీ అర్ధం కాదు. వాళ్ళ మైండ్ లో వుండేదే అర్ధమవుతుంది. కానీ మాస్ ప్రేక్షకులకి  అర్ధమైపోతుంది. కళాత్మకత అంటే అద్భుత కళాఖండాల్లో వుండేదే కాదు, ఇలాటి రెగ్యులర్ సినిమాల్లోనూ సింపుల్ గా వుంటుంది. ఈ సింప్లిసిటీని కూడా ఫాలో కాకపోతే మేకింగులు వృధా.

5

        ఈ 3 వ టూల్ తో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కొనసాగుతోంది... రిజర్వుడు గా వుంటున్న జూల్స్ అకాడెమీ జీవితం చూపిస్తూ, వివికి ఆమె పట్ల వున్న సుహృద్భావాన్ని ఒక సీన్లో చూపిస్తుంది. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనకి ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ మోయిరా గురించి అవసరం. ఈమె గురించిన సభతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈమెకి నివాళిగా జులియర్డ్స్ లో గెలుపొందాలన్న ప్రతిపాదన, జూల్స్ గోల్ కి ఒక గమ్యాన్ని అందించినట్టయ్యింది, ఇప్పుడు దీన్నెలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న రేకెత్తిస్తూ.  

        ఇక క్లోక్ రూంలో జూల్స్ కి మోయిరా నోట్ బుక్ దొరకడంతో కథ లోతుల్లోకి వెళ్లింది. ప్రశ్నకి సమాధానమిక్కడ దొరికింది. ఇప్పుడు ఏమిటా నోట్ బుక్ క్లాసిక్ హార్రర్ లా అన్న మిస్టీరియస్ వాతావరణమేర్పడింది. దాన్ని రూంలోకి తెచ్చి పెట్టుకున్నప్పుడు తలుపు మూసుకుని చీకటవుతుంది. జూల్స్ తెలియకుండానే ఏదో అధో జగత్తులోకి అడుగు పెట్టినట్టు సింబాలిజంగా. కథ ముందుకెళ్తోంది. 

 వివికి కస్క్ ని, జూల్స్ కి రోజర్ ని టీచర్లుగా చూపిస్తున్నప్పుడు వివి ఎజెండా కూడా ఓపెనైంది. డ్రగ్స్ ని, డ్రింక్స్ ని దూరం పెట్టి కమిటెడ్ గా వున్నావని రోజర్, జూల్స్ కి కితాబునివ్వడం, జూల్స్ ఎదుగుదలకి అడ్డుపడే స్వేచ్ఛ ని  త్యాగం చేసుకున్నఆమె గోథే మార్గంలో పాత్ర చిత్రణకి అద్దం పడుతోంది. మరొవైపు వివిని చూస్తే, టాలెంటెడ్ అయిన వివి జులియర్డ్స్ కి ఎంపికవడానికి  కస్క్ కి వక్షస్థలాన్నిచూపిస్తూ ఎర వేస్తోందని తెలుస్తోంది. ఇలా జూల్సే కాదు, వివి కూడా ఒక వ్యూహంతో ముందుకెళ్తోందని విజువల్ గా చెప్పడం.

        ఇక వివి శిక్షణ పొందుతున్న సెయింట్ సీన్స్ 2 పీస్ ని జూల్స్ ప్లే ట్రై చేస్తూండడం, వివితో ఎడ మొహం పెడ మొహం గా వుండడం, వివి సెయింట్ సీన్స్ 2 పీస్ ని అత్యంత స్పీడుగా ప్లే చేస్తూంటే, రహస్యంగా గమనిస్తున్న జూల్స్ కి గుండె దడదడ కొట్టుకోవడం, వెళ్ళిపోయి తను కూడా అదే స్పీడుని ప్రయత్నించడం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగాలే. ఇలా 3 వ టూల్ నిర్వహించాక, ఇక 4 వ టూల్- ఇవన్నీ, అంటే మొదటి మూడు టూల్స్ కి దోహదం చేసిన సీన్లని కూడేసి సమస్యని స్థాపించడం. ఈ సమస్య పరిష్కారానికొక గోల్ నివ్వడం. ఇదే ప్లాట్ పాయింట్ వన్ కీలక ఘట్టం.
ప్లాట్ పాయింట్ 1 : 

        డెవిల్స్ ట్రిల్ సోనాటా వినబడుతున్న నేపథ్యంలో జూల్స్, టర్టినీ చిత్రపటాన్నే చూడడం తీసుకోబోతున్న నిర్ణయానికి మొదటి మెట్టు. ఇప్పుడు టిక్ టిక్ టిక్ మంటున్న గడియారం ముళ్ళ శబ్దం. ఈ గడియారం శబ్దం ఈ కథలో ప్లాట్ డివైస్. ఇక్కడ్నించీ ఇది ప్లే అవడం మొదలవుతుంది. దీంతో జూల్స్ కి దొరికిన మోయీరా నోట్ బుక్ తో సంబంధముంటుంది. అదేమిటో తర్వాత తెలుస్తుంది. జూల్స్ రూంలో కొచ్చినప్పుడు సన్నగా గాలి వీస్తున్న సవ్వడి. ఏం చేస్తోందో ఆమెకే తెలీదు. అన్ కాన్షస్ గా కిటికీ మూసేస్తుంది. అలా చేసి మాయగాలిని తనతో బాటు గదిలో బంధించేసింది. ఆ మాయ నోట్ బుక్ తీస్తుంది. నల్లగా మాడిన సూర్యుడి వికృత రూపం అట్ట మీద. పేజీ తిప్పినప్పుడు కన్పించే వాక్యాలు -అంధకారంలో నన్ను వెతుక్కునే వాళ్ళకి అమరమైన ఖ్యాతి లభిస్తుంది - అని వుండడం ఎంతైనా ఆమె మెంటాలిటీని ఆకర్షించేదే. అనుసరించాల్సిన మార్గాన్ని సూచించే పాఠాలు 1,2,3,4,5,6 గా వుంటాయి. ఇక్కడాపి, ప్రారంభంలో జూల్స్ ఆత్మహత్యా దృశ్యాని కెళ్దాం -

1

ఒక ఆత్మహత్యా దృశ్యం. శాస్త్రీయ సంగీత కారుడు టర్టినీ బాణీ డెవిల్స్ ట్రిల్ సోనాటా ని వయొలిన్ మీద మీటుతున్న జూల్స్, గడియారం ఆరుగంటలు కొట్టడంతో ఆపుతుంది. నింపాదిగా వెళ్ళి భవనం మీంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది... 

        ఇక్కడ డెవిల్స్ ట్రిల్ సోనాటా వినపడిందా? ఎందుకు వినిపించిందో ఇప్పుడు ప్లాట్ పాయింట్ వన్ సీనులో లో అర్ధమైందా? గడియారం ఆరు కొట్టగానే ఆమె ఆత్మహత్య చేసుకుందా? నోట్ బుక్ లో 1,2,3,4,5,6 పాఠాలకీ, ఆత్మహత్య చేసుకున్న ఆరు గంటలకీ ఏదో సంబంధముందని సందేహం వచ్చిందా? ఈ సందేహం ప్లాట్ పాయింట్ 2 దగ్గర తీరుతుంది. అప్పటి వరకూ ఓపిక పట్టాలి. ఈ నోట్ బుక్ తో తానెంత మోసపోయానో తెలుసుకున్న జూల్స్, ఇక ఆత్మహత్యే శరణ్య మనుకుందా? అంతేకదా, దెయ్యాన్ని నమ్మిన డాక్టర్ ఫాస్టస్ కి మరణమే కదా ప్రాప్తించింది? అలాటి మాయ నోట్ బుక్ తో జూల్స్ చేసుకున్నది ఫాస్టియన్ బార్గెయినే కదా? ఇక గడియారం ముళ్ళ శబ్దమెందుకో ఇప్పుడు తెలిసిపోయింది- ప్రారంభ ఆత్మహత్యా దృశ్యంతో తులనాత్మకంగా చూసుకున్నాక. ఆ ముళ్ళ శబ్దం ఆమె అంతిమ ఘడియలకి కౌంట్ డౌన్ అన్నమాట ...

2

      ఎప్పుడైనా కమింగ్ ఆఫ్ ఏజ్ జానర్లో పాత్ర తీసుకునే గోల్ మూర్ఖంగానే వుంటుంది. ఆ వయసులో జీవితమంటే ఏమిటో తెలీదు కాబట్టి. అందుకని పొరపాటున కూడా పాజిటివ్ గోల్ తీసుకోదు. అస్థిరత్వం లోంచి స్థిరత్వం వైపుకి అపరిపక్వ పాత్ర ప్రయాణం కాబట్టి.

ఈ ప్లాట్ పాయింట్ వన్లో నోట్ బుక్ ముందు పెట్టుకుని ప్రాక్టీసు ప్రారంభించేసింది. సమస్యకిదే పరిష్కారమని గోల్ తీసేసుకుంది. ఇక ప్లాట్ పాయింట్ వన్ కి చేరేటప్పటికి పాత్ర తీసుకునే గోల్ బలంగా వుండేందుకు నాల్గు గోల్ ఎలిమెంట్స్ వుంటాయి. 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్. ఈ నాల్గూ వుంటే కథ బలంగా ముందుకెళ్ళడానికి భరోసా. 

జూల్స్ గోల్ లో 1. కోరిక : వివిమీద పైచేయి సాధించడం, 2. పణం : జీవితాన్నెప్పుడో పణంగా పెట్టేసింది, 3. పరిణామాల హెచ్చరిక : ఆ మాయ నోట్ బుక్ తో పరిణామాలెలా వుంటాయో తెలుస్తూనే వుంది, 4. ఎమోషన్ : జీవితాన్నేపణంగా పెట్టి, వివి మీద గెలుపుకోసం తెగించి, మాయ నోట్ బుక్ తో మనసులో రగిలించుకున్న ప్రమాదకర రణరంగంతో - గోల్ కొట్టి తీరాల్సిందే, వెనుకడుగు వేసేది లేదు!

        ఇలా బిగినింగ్ విభాగం వర్క్ షీట్ పూర్తయింది. బిగినింగ్ విభాగం ముందు కథకి ఇంధనం లాంటిది. దీని సెటప్ లోపాలమయంగా వుంటే ముందు కథంతా బలహీనమే అవుతుంది. బిగినింగ్ విభాగాన్ని సెటప్ చేయడమే మిగతా కథకంటే కష్టమైన ప్రక్రియ. 4 టూల్సుల అల్లికతో సృజనాత్మక ప్రక్రియ.

( next : మిడిల్, ఎండ్ విభాగాలు)

 సికిందర్