రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

29, జూన్ 2018, శుక్రవారం

659 :రివ్యూ!
రణ్బీర్ కపూర్, దియామీర్జా, అనూష్కా శర్మ, సోనమ్ కపూర్, పరేష్ రావల్, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్, జిమ్ శర్భ్, తదితరులు
రచన : అభిజాత్ జోషి, రాజ్ కుమార్ హిరానీ
సంగీతం : ఏఆర్ రెహమాన్, రోహన్ రోహాన్ తదితరులు, ఛాయాగ్రహణం : రవివర్మ
బ్యానర్స్ : వినోద్ చోప్రా ఫిలిమ్స్, రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్
నిర్మాతలు : విధు వినోద్ చోప్రా, రాజ్ కుమార్ హిరానీ  
విడుదల : జూన్ 29, 2018
***

           
హిందీలో ప్రస్తుతం బయోపిక్ సీజన్ నడుస్తోంది. స్టార్స్ కోసం ఫార్ములా పాత్రల సృష్టికి కాలం చెల్లిపోయినట్టుంది. మేఘనా గుల్జార్ అన్నట్టు, నిజ జీవితంలో హీరోలెందరో వున్నారు - వాళ్ళ నిజ కథలు చెబితే స్టార్స్ కి పాత్రల కొరత తీరిపోతుంది. జనరల్ మానెక్ షా జీవిత కథతో మేఘనా గుల్జార్ తీస్తున్న ఒక బయోపిక్, 1948 లో మొదటి ఒలింపిక్ మెడల్ గెల్చిన హాకీ టీము కథతో  ఇంకో బయోపిక్ గోల్డ్వంటి స్టార్ మూవీస్ విరివిగా తెరకెక్కుతున్నాయి. ఇదే కోవలో సంజయ్ దత్ జీవితం మీద జీవించి వున్నప్పుడే బయోపిక్ వచ్చింది. జీవించి వున్నప్పుడే బయోపిక్ అవసర మెందుకేర్పడిందంటే, తను మీడియా బాధితుడు కాబట్టి. తనకి తాను చేసుకున్న హాని కంటే,  మీడియా తనకి చేసిన అన్యాయమే ఎక్కువన్న ఆక్రందనతో ఈ బయోపిక్ ని ఉద్దేశించినట్టు కనబడుతోంది. చివర్లో మీడియామీద వ్యంగ్యాస్త్రాలు విసురుతూ, పాట కూడా పెట్టించాడు - ఛపీ జిస్ కీ ఖబర్, బనీ ఉస్ కీ ఖబర్ (ఎవడి మీద వార్త పడితే వాడికి సమాధే)!
          ‘పీకే’ సక్సెస్ తర్వాత రాజ్ కుమార్  హిరానీ తొలిసారి చేసిన ఈ బయోపిక్ ప్రయత్నం ఎలావుందో ఒకసారి ఈ కింద చూద్దాం...

కథ
       సుప్రసిద్ధ నటుడు, నిర్మాత, దర్శకుడు సునీల్ దత్ (పరేష్ రావల్), సుప్రసిద్ధ నటి నర్గీస్ (మనీషా కోయిరాలా) ల కుమారుడు సంజయ దత్ (రణబీర్ కపూర్) అలియాస్ సంజు. ఇతన్ని హీరోగా పరిచయం చేస్తూ ‘రాకీ’ అనే సినిమా ప్రారంభిస్తాడు సునీల్ దత్. దర్శకుడుగా తండ్రి కాఠిన్యానికి కుమిలి పోతూంటాడు సంజు. ఫ్రెండ్ జుబిన్ మిస్త్రీ (జిమ్ శర్భ్) సంజుని  వూరడిస్తూ డ్రగ్స్ అలవాటు చేస్తాడు. తల్లి క్యాన్సర్ తో మంచాన పడుతుంది. తల్లి దగ్గరున్నప్పుడు కూడా డ్రగ్స్ మత్తులోనే వుంటాడు. సినిమా విడుదలకి మూడ్రోజుల ముందు తల్లి చనిపోతుంది. అటు ప్రేమించిన రూబీ (సోనమ్ కపూర్) అతడి డ్రగ్స్ అలవాటు చూసి  దూరమైపోతుంది. పిచ్చి వాడైపోతాడు సంజు. దీంతో అమెరికాలో వున్న ఇంకో ఫ్రెండ్ కమలేశ్ (విక్కీ కౌశల్), ఇక సంజు తండ్రిని కలుసుకుని అతణ్ణి కాపాడుకోమని బతిమాలుకుంటాడు. అప్పుడు సునీల్ దత్, సంజుకి మాదకద్రవ్యాలని వదిలించినా. సంజు ఇంకో పెద్ద సమస్య తెచ్చుకుని జైలు పాలవుతాడు. ఇప్పుడు సునీల్ దత్, సంజుని రక్షించుకోవడానికి ఏ ప్రయత్నాలు చేశాడు, చివరికి  సంజూ ఏమయ్యాడూ అన్నది మిగతా కథ.

ఎలా వుంది కథ
       సాధారణంగా బయోపిక్స్  విజయగాథలతో వుంటాయి. సంజు బయోపిక్ పతనావస్థ గాథతో వుంది. ట్రాజడీ పాత్ర కాబట్టి ఇది కథా లక్షణాలతో గాక, గాథకి సరిపడే పాసివ్ పాత్ర కథనంతో వుంది. ప్రముఖ వ్యక్తికి చెందిన, తెలిసిన బయోపిక్కే కాబట్టి పాసివ్ పాత్రయినా ప్రేక్షకులు ఇబ్బంది పడరు. అదే ఇంకేదైనా కాల్పనికం అయితే ఎంత పెద్ద స్టార్ నటించినా  గాథగా అట్టర్ ఫ్లాపవుతున్న వైనాలు చూస్తున్నాం. ఈ బయోపిక్ ఉద్దేశం సంజు తనని మహోన్నతుడుగా చూపించుకోవడం కాదు. తనమీద మీడియా వేసిన టెర్రరిస్టు మచ్చని తొలగించుకునే క్రమంలో వాస్తవాలు వెల్లడించుకునే వాంగ్మూలం మాత్రమే. చివరికి కోర్టులో జడ్జి సైతం తీర్పు చెప్తూ - నువ్వు టెర్రరిస్టువి కావు - అని స్పష్టం చేస్తూ - అయితే అక్రమాయుధాల కేసు నిరూపణ అయింది గనుక ఆరేళ్ళు జైలు శిక్ష విధిస్తున్నానని ప్రకటించినా, టెర్రరిస్టు కాదనే అంశాన్ని  హెడ్డింగుల్లో ప్రధానం చేయకుండా - సంజయ్ కి ఆరేళ్ళు జైలుశిక్ష- అంటూ పాక్షిక, సెలెక్టివ్, నెగటివ్ హెడ్డింగులు పెట్టి అప్పుడు కూడా మీడియా అన్యాయం చేసిందన్న ఆక్రందనతో, సంజయ్ దత్ తన కథ రాజూ హిరానీకి రోజుల తరబడి చెప్పుకుని సినిమాగా తీయమన్నాడు. దీంతో కథా ప్రయోజనం కూడా నెరవేరింది  – యుక్త వయసులో తెలియక చేసేసే తప్పులు ఎలా మెడకి చుట్టుకుంటాయో నేటి యువతకి ఒక హెచ్చరికని పంపుతూ. 

ఎవరెలా చేశారు 
      బర్ఫీ, రాక్ స్టార్ లవంటి హిట్స్ లో నటించాక రణబీర్ కపూర్ అంటే ఏమిటో ఎప్పుడో రుజువైపోయింది. తాతగారు రాజ్ కపూర్ మృతితో బాటే ఆర్కే ఫిలిమ్స్ అంతరించిపోయిందని రణబీర్ అనడం నిజమే గానీ, వంశంలో నటులు అంతరించి పోలేదనడానికి తనే నిలువెత్తు సాక్ష్యం. తను నట రాక్షసుడు. ఇప్పుడు సంజయ్ దత్ అయి వచ్చాడు. సంజుబాబా తో పోలికలు కలవడం తనకి పెద్ద పెట్టుబడియే అయినా,  మిగతా సంజుబాబా హావభావాలూ శరీర భాషా సొంతం చేసుకోవడం అతి కష్టమైన పనే. దీన్ని సమున్నతంగా పోషించాడు. ఈసంకీర్ణ పాత్రకి హస్యముంది, ఆవేశముంది, ఆందోళన వుంది, ఏడుపూ వుంది. వీటన్నిటి అంతర్వాహినిగా బోల్డు కన్యూజన్ తో వుండే మనస్తత్వముంది. ఈ అయోమయపు మనస్తత్వానికి, జీవితంలో ఒక దశలో -  ఫస్టాఫ్ లో డ్రగ్స్ బానిస హద్దులున్నాయి. ఇంకో దశలో - సెకండాఫ్ లో గన్స్ తో స్వయం కృతాపరాధపు వ్యధ హద్దుగా వుంది. ఈ రెండు దశలకీ, మూల బిందువైన అయోమయపు మనస్తత్వాన్నీ స్థావరంగా  చేసుకుని, ఆయా అనుబంధ భావోద్వేగాల పాలన  చేశాడు. సినిమా విడుదల రోజు థియేటర్ మెట్ల మీద విచలితుడై తండ్రికి చెప్పుకునే సన్నివేశం జీవితపు మొదటి దశలో పతాక స్థాయి నటన. మొదట్నుంచీ సంజుబాబా జీవితంలో చేతులారా చేసుకున్న ట్రాజడీ తప్ప మరేమీ లేదు. ఈ విషాదాన్ని నమ్మించకుండా నమ్మిస్తూ, తను మాయమైపోయి – సాక్షాత్తూ  యంగ్ సంజయ్ దత్ నే చూస్తున్నామా అన్నంత మాయలోకి నెట్టేశాడు ప్రేక్షకుల్ని రణబీర్ కపూర్. 

      సునీల్ దత్ పాత్రకి, ఎత్తు విషయంలో కొంచెం ఇబ్బంది వున్నా పరేష్ రావల్ సాధ్యమైనంత న్యాయం చేశాడు. మొత్తం సంజయ్ దత్ కేసులో ఇరుక్కున్న కాలమంతా అతడి ఇంట్లో పరిస్థితి ఎలా వుండేదో బయటి ప్రపంచానికి తెలీదు. సంజుబాబా ఘనకార్యాలు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా మనకి తెలుస్తున్నవే. కానీ సంజు పెట్టే కష్టాలకి తండ్రి సునీల్ దత్ మనోభావాలేమిటి, ఎలా బిహేవ్ చేసేవాడు ఎవరికీ తెలీదు ఈ సినిమా చూసే దాకా. సునీల్ దత్ ఐదు సార్లు వాయువ్య ముంబాయి స్థానానికి ఎంపీగా వుంటూ,  కేంద్ర మంత్రిగా 2005  లో కన్ను మూశాడు. కానీ సినిమాలో అతణ్ణి రాజకీయ నాయకుడు అన్నట్టుగా ఎక్కడా చూపించలేదు. పార్టీ గుర్తులు, రంగులు కూడా వాడలేదు. కేవలం ఇంటిదగ్గర వుండే సాధారణ తండ్రిగా మాత్రమే చూపించారు. దీనివల్ల కష్టకాలంలో కుటుంబంలో ఆయన ఎలా వుండేవాడో ఫోకస్ చేయడానికి కుదిరింది. దేనికీ ఆవేశ పడకుండా, కుమిలిపోకుండా, కోప్పడకుండా, పల్లెత్తు మాటనకుండా, రాజకీయంగా ఎవర్నీ నిందించకుండా, పాతికేళ్ళూ కొడుకుని దారిని పెట్టే ప్రయత్నాల్లో ఎంతో ఓర్పు వహించి, హూందాగా ప్రవర్తించే సునీల్ దత్ నే చూస్తాం. కొడుకు జైల్లో కింద పడుకుంటాడు కాబట్టి తను కూడా కింద పడుకోవాలి, కొడుక్కి జైల్లో ఫ్యానుండదు కాబట్టి తనూ ఫ్యానేసుకోకూడదు –అన్న సెంటిమెంట్లతో మహోన్నతుడుగా కన్పిస్తాడు. అయితే కొడుకుని ఎంత ప్రేమించినా స్నేహితుడు కాలేకపోవడం కన్పిస్తుంది. ఇదంతా పరేష్ రావల్ డిగ్నిఫైడ్ గా పోషించి సునిల్ దత్ ని ప్రపంచానికి ఎరుకపర్చాడు.

         సునీల్ దత్ భార్య నర్గీస్ సంక్షిప్త పాత్రలో మనీషా కోయిరాలా కన్పిస్తుంది. బ్రెయిన్ ట్యూమర్ తో మరణించిన సంజయ్ మొదటి భార్య రిచా శర్మ, విడాకులు తీసుకున్న రెండో భార్య రియా పిళ్ళై, బావ బాలీవుడ్ స్టార్ కుమార్ గౌరవ్,  ఇద్దరు సోదరీ మణులు (పెద్ద సోదరి ప్రియా దత్, ఎంపీ) తదితరులు ఈ బయోపిక్ లో కనిపించరు. ఒకటి రెండు సీన్లలో నామమాత్రంగా  ప్రియా దత్ పాత్ర కనిపిస్తుంది. ఈ బయోపిక్ సంపూర్ణ సంజయ్ జీవిత కథా సరిత్సాగరం కాదు. అతను  ఎందుకు ప్రసిద్ధి చెందాడో ఆ రెండు విషయాల గురించే. వాటికి సంబంధించిన ప్రధాన పాత్రలతోనే. ఇలా సంజయ్ ప్రస్తుత భార్య మాన్యత (దిల్ నవాజ్ షేక్ అసలు పేరు), ఇద్దరు పిల్లలు ఈ బయోపిక్  లో కన్పిస్తారు. మాన్యతగా దియా మీర్జా నటించింది. పెద్దగా స్కోపున్న పాత్ర కాదు. 

          సంజయ్ ఫ్రెండ్స్ గా నటించిన జిమ్
శర్భ్, విక్కీ కౌశల్ ల పాత్రలు విరుద్ధ స్వభావాలతో వుంటాయి. ఫస్టాఫ్ డ్రగ్స్ కథలో సంజయ్ ని స్వార్ధానికి వాడుకుని చెడగొట్టే ద్రోహిగా జిమ్ శర్భ్ కన్పిస్తాడు. సెకండాఫ్ గన్స్ కథలో సంజయ్ బాగు కోరి కష్టపడే నిస్స్వార్ధ పరుడైన మిత్రుడిగా కన్పిస్తాడు. ఇతడికే ఎక్కువ మార్కులు పడతాయి. 

     ఈ మొత్తం బయోపిక్ ని సంజు జర్నలిస్టు చేత పుస్తకం రాయించాలనుకుంటాడు. ఈ జర్నలిస్టు విన్నీ డయాజ్ పాత్రలో అనూష్కా శర్మ కన్పిస్తుంది. సంజు ప్రేమించే రూబీ పాత్రలో సోనమ్ కపూర్, ఆమె తండ్రి పాత్రలో బొమన్ ఇరానీ కన్పిస్తారు. మాఫియా బండు దాదాగా సాయాజీ షిండే కన్పిస్తాడు. చివర రోలింగ్ టైటిల్స్ లో మీడియా మీద ‘బాబా బోల్తా హై బస్ హోగయా’ ( ఇక చాలంటున్నాడు బాబా ) పాటలో రణబీర్ కపూర్ తో సంజయ్ దత్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి మీడియాని ఆడుకుంటాడు - విశ్వసనీయ సమాచారం ప్రకారం ....అనే రక్షక  కవచం మాటున  రాసే సొంత అభిప్రాయాల  మీద అక్కసంతా తీర్చుకుంటాడు సంజయ్. దాదాపు ఐదు నిమిషాల ఈ క్రేజీ పాటని పునీత్ శర్మ, అభిజాత్ జోషీ, రోహన్ గోఖలేలు రాశారు – ‘చూడ చక్కని జీవితం సర్కస్ ఐపోయింది...బాబా బోల్తా హై  బస్ హోగయా!’ –పాటకి విక్రమ్ మంట్రోస్ సంగీతమిచ్చాడు. 

          రెహమాన్ సంగీతంలో ప్రేమపాట ‘రూబీ రూబీ’, మత్తులో స్వైరకల్పనల పాట ‘ముజే చాంద్ పే లేచలో’ వున్నాయి. రవివర్మ ఛాయాగ్రహణం సాధ్యమైనంత క్లాసిక్ లుక్ తీసుకురావడానికి ప్రయత్నించింది. 

          పట్టిందల్లా బంగారమయ్యే రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం ఈ సారీ క్వాలిటీ సినిమాని అందించింది. హాస్యంగా మొదలుపెట్టి భావోద్వేగాలతో ముగించే దృశ్యాలే ఎక్కువ. కామెడీకి చావు కూడా లోకువే అన్నట్టు రూబీ తండ్రి చనిపోయన సందర్భంగా హాస్పిటల్ దృశ్యాలున్నాయి. 

          రచనా పరంగా ఇదొక పాఠ్య గ్రంథమనొచ్చు. మూడు కాలాల గాథని  కుదుపుల్లే కుండా సాఫీగా సంక్రమణం చేసి ఏకత్వాన్ని సాధించడంలో రచయితలైన దర్శకుడు హిరానీ, అభిజాత్ జోషీలు సఫలమయ్యారు. 

          ఇంతా చేసి ఈ బయోపిక్ ని ప్రజలు అర్ధంజేసుకున్నారా అంటే, సోషల్ మీడియాలో సంజయ్ ని ఇంకా క్రిమినల్ గానే, టెర్రరిస్టుగానే దూషిస్తూ,  ఇలాటి వాడిమీద సినిమా తీయడమేంటని,  పనిలో పనిగా హిరానీని కూడా దుర్భాషలాడుతున్నారు. మీడియాకి జవాబు చెప్పాలనుకున్న సంజుబాబాకి - పుణ్యాని కొచ్చిన సోషల్ మీడియాలో వేలాడే నీతిమంతుల్ని కూడా పాటలో కలిపి చాకిరేవు పెట్టాలన్న ఆలోచన స్ఫురించలేదేమో!

సికిందర్
(స్క్రీన్ ప్లే సంగతులు రేపు)