రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, March 23, 2019

802 : స్క్రీన్ ప్లే సంగతులు


హాలీవుడ్ లో ఒక ఎకానమీ బడ్జెట్ (34 మిలియన్ డాలర్లు) తో నిర్మించిన థ్రిల్లర్  మెగా బాక్సాఫీస్ విజయాన్నిసాధిస్తే (226 మిలియన్ డాలర్లు), అది మూడు ఆస్కార్ అవార్డులకి కూడా నామినేట్ అయి, ఇరవై వివిధ ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుంటే, ఆలోచించాల్సిన విషయమే. తారాగణ బలం లేని స్మాల్ మూవీస్ కి కథాబలమొక్కటే ప్రాణమవుతుందా? ఇలా అనుకుని ‘బేబీ డ్రైవర్’ తీసివుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవి కావు. ఇది కథాపరంగా బలమైనది కూడా కాదు, పైగా పాత రొటీన్ ఫార్ములా కథే. అయినా పెద్ద హిట్టయ్యింది. కనుక స్మాల్ మూవీస్ కి ఎంత కథాబలమున్నా, లేకపోయినా ఒకటి మాత్రం అత్యవసరం - విజువల్ స్క్రిప్టు. విజువల్ గా లేని స్క్రిప్టుతో  తారాగణ బలం లేని ఎంత బలమైన స్మాల్ మూవీ కథ రాసుకున్నా - నేటి విజువల్ ప్రపంచంలో విజిబిలిటీ లేక అంతర్ధానమైపోవడమే. నాన్ విజువల్ స్క్రిప్టు స్మాల్ మూవీకి శాపం. స్మాల్ మూవీ స్క్రిప్టు ద్విగుణీకృతమవాలంటే విజువల్ అప్పీల్ నిచ్చే ప్రొడక్షన్ డిజైన్ సమకూడాల్సిందే. ఆ ప్రొడక్షన్ డిజైన్ పాత్ర చిత్రణల బట్టి, కథాకథనాల బట్టి సాగాల్సిందే.  అంతేకాదు, కథకి స్ట్రక్చర్ తో క్రియేటివిటీకి కూడా పాల్పడాల్సిందే!

          ‘బేబీ డ్రైవర్’ అనే స్మాల్ మూవీ స్ట్రక్చర్ కి క్రియేటివిటీ తో బాటు, కంటెంట్ కి ప్రొడక్షన్ డిజైనింగ్ ని కూడా కలుపుకుని ఇంత ప్రపంచ దృష్టి నాకర్షించగల్గింది. విజువల్ అప్పీలే సాధారణ కథని అసాధారణ మూవీగా మార్చేసింది. విజువల్ అప్పీలంటే బ్రహ్మాండమైన కెమెరా వర్క్ ఒక్కటే కాదు, ఇంకా చాలా... కాస్ట్యూమ్స్ దగ్గర్నుంచీ సౌండ్ వరకూ చాలా. కాస్ట్యూమ్స్ బ్రహ్మాండంగా వుంటే కూడా విజువల్ అప్పీల్ కాదు. పాత్రల మనస్తత్వాల్ని వెల్లడించినప్పుడే విజువల్ అప్పీల్. అంతే కాదు, కథనంలో ప్రతీ కదలికకీ ముందే నిర్ణయించిన మ్యూజిక్. ఈ థ్రిల్లర్ ఆసాంతం సౌండ్ మేనేజ్ మెంటే. సౌండ్ మేనేజిమెంట్ కే ఆస్కార్ నామినేషన్లు, ఇతర అవార్డులూ... 

          దీని ప్రొడక్షన్ విజిబిలిటీ అంశాల్లోకి వెళ్లేముందు, కథనపరంగా ఎలా విజువల్ స్క్రిప్టు అయిందో స్క్రీన్ ప్లే సంగతులు తెలుసుకుందాం...స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగపు క్రియేటివిటీ గురించి, దాంతో మారిపోయే ప్లాట్ పాయింట్ వన్ స్వరూప స్వభావాల
 గురించీ  గత వ్యాసాల్లో కొన్ని సినిమాలు చెప్పుకున్నాం.ఇక్కడ క్లిక్ చేయండి. ప్లాట్ పాయింట్ వన్ అంటే పాత్ర సమస్యలో పడడం, అక్కడో గోల్ ఏర్పడడం అనే రొటీన్ తో సర్వ సాధారణంగా సినిమాలు వస్తూంటాయి. శాస్త్రం శాస్త్రమే చెప్తుంది, క్రియేటివిటీ చెప్పదు. కథానేపథ్యం ఏర్పాటు చేసుకుని, పాత్రల్ని పరిచయం చేసి, సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసుకుంటూ వెళ్లి, సమస్య ఏర్పాటు చేసి, అక్కడో గోల్ ని కల్పిస్తే అది ప్లాట్ పాయింట్ వన్ అవుతుందని మాత్రమే శాస్త్రం చెప్తుంది. దీన్ని పట్టుకుని ఇలాగే చేసుకుంటూ పోతున్నందుకే సినిమాలన్నీ ఒకే పోతలో పోసిన బిగినింగ్ కథనంతో వుంటున్నాయి. అప్పుడప్పుడు ఒకటీ అరా మాత్రమే చెప్పిన శాస్త్రానికి కొంచెం క్రియేటివిటీ తాలింపుతో  లేటెస్ట్ ఘుమఘుమలు సృష్టించేసరికి - స్క్రిప్టు తేజోవంతమై విజువల్ స్క్రిప్టు అవుతోంది. ఇట్సె వండర్ఫుల్ లైఫ్, బ్రిక్, ది మేయర్, దొంగరాముడు, అదుగో - ఇలాటివే....ఇక్కడ క్లిక్ చేయండి.

          ఇప్పుడు దీనికి ‘ది డ్రైవర్’ తోడయ్యింది. 2017 మార్చిలో విడుదలైన ఈ థ్రిల్లర్ కి రచయిత, దర్శకుడు ఎడ్గార్ రైట్. ముఖ్య పాత్రలు, పాత్రధారులు బేబీ (‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ హీరో ఆన్సెల్ ఎల్గార్ట్), డెబొరా (లిల్లీ జేమ్స్), డాక్ (కెవిన్ స్పెసీ). సంగీతం ‘గ్రావిటీ’ కి ఆస్కార్ పొందిన స్టీవెన్ ప్రైస్, ఛాయాగ్రహణం ‘మాట్రిక్స్’ ఫేం బిల్ పోప్.

          ఇందులో బిగినింగ్ కథనం, ప్లాట్ పాయింట్ వన్ రెండూ ఎలా భిన్నమైనవో ఇక చూద్దాం...
రేపు!