రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, ఆగస్టు 2017, గురువారం

493 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 9

(జులై 22 ఆర్టికల్ తరువాయి)
         
బ్లడ్ సింపుల్’ మీద విశ్లేషణలు రాసిన ఎందరెందరో పండితులు మనకి తెలిసి ఒక విలువైన స్క్రిప్టింగ్ టూల్ ని గుర్తించనట్టు కనపడతారు.  రైటర్స్ దృక్కోణంలో విశ్లేషించకపోవడం వల్ల కావొచ్చు, ఆ స్క్రిప్టింగ్ టూల్ ప్రాథాన్యాన్ని విస్మరించారు. ఇంతవరకూ మనం చూస్తూ వచ్చిన సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏ గోల్ ఏర్పడిందో ఆ గోల్ ప్రకారమే మిడిల్ నడుస్తుందనీ గమనిస్తూ వచ్చాం. ఆ గోల్ కొన్ని ఎలిమెంట్స్  తో కలిసి వుంటుందనీ, అవి కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక,  ఎమోషన్ గా వుంటాయనీ తెలిసిందే. ఈ నాలుగూ కాక మరొకటి వుంటే? అది రహస్య ఎజెండా అయితే? అప్పుడు కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక,  ఎమోషన్ లకి తోడూ రహస్య ఎజెండా కూడా కలిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడితే? కాకపోతే రహస్య ఎజెండా వుందని ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులకి తెలియదు. ఏర్పాటు చేసిన గోల్ ప్రకారమే మిడిల్ ని చూస్తూ వెళ్లి ఎక్కడో కంగారుపడతారు. అంటే ఏర్పాటు  చేసిన గోల్  అసలు గోల్ కాకుండా పోతుందన్న మాట. ఫేక్ గోల్ ని ఏర్పాటు చేయడమన్న మాట. ప్రేక్షకుల్ని కాసేపు భ్రమల్లో వుంచడానికి ఫేక్ సన్నివేశాల్ని సృష్టించడం కద్దు. కానీ  ఏకంగా గోల్ నే ఫేక్ గోల్ గా ఏర్పాటు చేయడం బహుశా ‘బ్లడ్ సింపుల్’ లోనే వుంది. ఇదెలా జరిగిందో చూద్దాం...

         
ప్లాట్ పాయింట్ వన్ లో  ఎబ్బీ, రేలని చంపే కాంట్రాక్టుని మార్టీ నుంచి విస్సర్ పొందాడని తెలుసుకున్నాం. ఇలా విస్సర్ గోల్ లో  పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్  వున్నాయని గమనించాం. అయితే జరిగిందేమిటి? 19 వ సీను (గతవ్యాసం) లో విస్సర్ మార్టీని చంపి సంచలనం సృష్టించాడు. కన్నింగ్ ఫెలో మార్టీ అని ముందే చెప్పుకున్నాం. తనని నమ్మిన వాళ్ళ గొంతు కోసి బాముకునే రకం. ఒకసారి చూసి రమ్మంటే ఫోటోలు తెచ్చి  బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డ విస్సర్ ని మళ్ళీ నమ్మి చంపే పని అప్పగించాడు మార్టీ. ఫలితం అనుభవించాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్ ని తలకిందులు చేసిందా? ప్లాట్ పాయింట్ వన్ ఇలా ఉల్టా పల్టా అవడం ఎక్కడైనా చూశామా? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏ  గోల్ ఏర్పడిందో ఆ గోల్ ని దృష్టిలో పెట్టుకునే మిడిల్ ని  నడపడం సర్వసాధారణం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎబ్బీ, రే లని చంపేందుకు మార్టీ నుంచి  కాంట్రాక్టు పొందాడు విస్సర్. ఆ ప్రకారం ఎబ్బీ, రేలని చంపిన ఫోటోలు మార్టీ కి చూపించాడు. మార్టీ దగ్గర రావాల్సిన డబ్బులు తీసుకుని మార్టీని చంపేశాడు. పైకి చూస్తే  ఇది ఎబ్బీ, రే ల హత్యలతో ముందుముందు తనకి మార్టీ తో సమస్యలు రాకూడదని మార్టీని కూడా అంతమొందించి నట్టు కన్పిస్తోంది.  మార్టీ  హత్యని ఎబ్బీ మీదికో, రే మీదికో తోసేయ్యడానికి ఎబ్బీ రివాల్వర్ని ఉపయోగించాడని కూడా అర్ధమవుతోంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో విస్సర్ గోల్ ఎబ్బీ, రేలని చంపడమే కదా, వాళ్ళని చంపాక దాని పరిణామాల్లో భాగంగానే మార్టీ ని కూడా చంపి వుండవచ్చని  అన్పించవచ్చు. అంటే ప్లాట్ పాయింట్ వన్ కి కొనసాగింపుగా మార్టీ హత్య తోచవచ్చు. ముందు ఎబ్బీ, రేలని చంపి, దానికి  సాక్షిగా వుండే  మార్టీ బతికి వుండకూడదని మార్టీని కూడా చంపినట్టు కన్పిం
చవచ్చు. 


         కానీ అసలు ఎబ్బీ, రే లనే విస్సర్ చంపి వుండకపోతే? చంప 
లేదు కూడా! చంపదల్చుకోలేదు. ప్లాట్ పాయింట్ వన్ లో మార్టీ ఆఫర్ ని స్వీకరించడం ఒక పెద్ద దగా.అలా నటించాడు. అప్పుడే ఎబ్బీ, రేలకి బదులుగా మార్టీ నే చంపి, ఈ హత్యని ఎబ్బీ, రేల మీదికి
తోసెయ్యదల్చు
కున్నాడు. పదివేల డాలర్లు అవసరమే. కాకపోతే రిస్కు తీసుకో తీసుకోదల్చుకోలేదు. తను ఏబీ, రేలని చంపేస్తే,  రేపొకవేళ మార్టీ దొరికిపోతే, తనని కూడా కేసులోకి లాగవచ్చు. మార్టీ నే చంపి ఎబ్బీ, రే ల మీదికి తోసేస్తే ప్రమాదం వుండదు- తను వాళ్ళకి తెలీదు గనుక. 


          ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే అతడికీ రహస్య ఎజెండా వుంది. ఇది మార్టీకీ, ప్రేక్షకులకీ తెలీదు. అందుకే ఇలా ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టు ఇచ్చాడు విస్సర్. ప్లాట్ ట్విస్టులుంటాయి, కానీ ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టే కొత్తది! ఈ ట్విస్టు పెట్టాలంటే పాత్రకి పైకి కన్పించే గోల్ కాక   లోలోపల రహస్య పథకం వుండాలి. ఇది అచ్చిబుచ్చి తెలుగు ప్రేమసినిమాల్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ అచ్చిబుచ్చి తెలుగు ప్రేమసినిమాల్లో అలిగి విడిపోవడాలు, ప్రేమదీపం మలిపేసుకుని ఈసురో మని మిగిలిపోవడాలూ ఇవే ప్లాట్ పాయింట్ వన్ లుగా గొప్పగా అన్పిస్తాయి రోమకామ ( రోమాంటిక్ కామెడీ)   రైటర్లకి.


          ఏ ఆధారాలతో విస్సర్ ప్లాట్ పాయింట్ ట్విస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది?  అతను ఎబ్బీ రివాల్వర్ తో మార్టీని చంపడమే ఆధారం. ఎబ్బీ, రేలని చంపి వచ్చి ఎబ్బీ రివాల్వర్ తో మార్టీని ఎలా చంపుతాడు అంత కన్నింగ్   డిటెక్టివ్? ఎబ్బీ, రేల మరణ సమయం, మార్టీ మరణ సమయం విభేదిస్తాయి. రేపు పోస్ట్ మార్టమ్స్ లో తెలిసే మరణ సమయాల ప్రకారం ముందు చనిపోయిన ఎబ్బీ,  రేలు తర్వాత వచ్చి మార్టీని ఎలా చంపుతారు? అంటే వాళ్ళిద్దరూ బతికే వున్నారన్నమాట. విస్సర్ చంపి రాలేదన్న మాట. అలా ఫేక్ చేసిన ఫోటోలు చూపించి మార్టీని మోసం చేసి, డబ్బులు వసూలు చేసుకుని ఎబ్బీ రివాల్వర్ తో చంపేసి  పోయాడన్న మాట. ఇప్పుడు పీకలదాకా ఎబ్బీ, రే లు ఇరుక్కోవడమే!

          ఈ ప్లాట్ పాయింట్ ట్విస్టుతో చాలా బలమైన పరిణామాన్ని సృష్టించాడు విస్సర్. ఇప్పుడు దీని తర్వాతి దృశ్యం చూద్దాం... ఎంత తెలివిగల డిటెక్టివ్ అయినా నేరస్థుల్ని  పట్టుకోగలడేమో గానీ, నేరం చేసి బయట పడలేడు. ఇప్పుడు తర్వాతి  సీను దగ్గర్నుంచే అతనూహించి నట్టుగాక, అనూహ్యంగా అతడి పతనావస్థకి ఎలా బీజం పడిందో చూద్దాం...

 (సశేషం )
- సికిందర్