రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

14, మార్చి 2021, ఆదివారం

1024 : సందేహాలు -సమాధానాలు



Q : మీరు నాంది’, శ్రీకారం సినిమాలకి ఇచ్చిన విశ్లేషణలు చూశాను. రివ్యూల కంటే ఇదే బావుంది. మీరు రివ్యూలు మానేసి మంచి పనే చేశారు. కాన్సెప్ట్ ఎనాలిసిస్ చేస్తే చాలు. అంతా అర్ధమైపోతుంది. ఇదే ముఖ్యం. ఇలాగే కంటిన్యూ చేయండి.
ఎస్. ఎం, దర్శకుడు

A : అద్భుతమైన సినిమా ఏదైనా వస్తే పూర్తిస్థాయి రివ్యూ రాయక తప్పదు. మామూలుగా మీడియాలో వస్తున్న రివ్యూలు చాలు. కాన్సెప్ట్ ఎనాలిసిస్ కూడా అన్నిటికీ అవసరం లేదు. ఒక స్క్రిప్టు రాయడానికి పూనుకునే ముందు తీసుకున్న ఐడియా (కాన్సెప్ట్) ని నిర్మించుకోవాలని ప్రపంచంలో ఎక్కడా చెప్పలేదు. సినాప్సిస్ నుంచే మొదలు పెట్టి చెప్పారు. కానీ సినాప్సిస్ రాయడానికైనా ముందుగా ఐడియా సెట్ అవ్వాలి. నిర్దుష్టమైన ఐడియా లేకుండా సినాప్సిస్ రాస్తే అదేమంత బలంగా కూడా వుండదు. బలం సంగతి తర్వాత ఆర్డర్ వేసేప్పుడు చూసుకోవచ్చను కుంటారు. అది జరగదు. అలా ఏ దశలోనూ జరగదు. ఐడియా అనేది మొత్తం స్క్రీన్ ప్లేకి బలానికి బేస్ వంటిది. ఇది అర్ధమయ్యాక, ఈ బ్లాగులో  తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  అంటూ వ్యాసాలు రాస్తున్నప్పుడు, ముందుగా ఐడియా నుంచే ప్రారంభించాం. తెలుగుకి వ్యాసాలు డిఫరెంట్ గా వుండాలిగా.  
       
     ఐడియాని విశ్లేషించుకున్నప్పుడు
, అందులో మార్కెట్ యాస్పెక్ట్ వుందా లేదా తెలుస్తుంది. ఐడియాని విశ్లేషించు కున్నప్పుడు అందులో కథ వుందా, గాథ వుందా, కొంపదీసి డాక్యుమెంటరీ వుందా తెలుస్తుంది. ఐడియాలో స్ట్రక్చర్ని విశ్లేషించుకున్నప్పుడు,  అందులో త్రీయాక్ట్ స్ట్రక్చర్ వుందా, కొంపలు ముంచే మిడిల్ మాటాష్, సెకండాఫ్ సిండ్రోములు తిష్ట వేసి వున్నాయా తెలుస్తుంది. ఇలా చాలా తెలుస్తాయి. అన్నం ఉడికిందని చెప్పడానికి ఒక్క మెతుకు చాలన్నట్టు, ఐడియాని ఉతికి ఆరేస్తే స్క్రీన్ ప్లే బతికిందా లేదా తెలిసిపోతుంది. అందువల్ల సినిమాకి ముఖ్యంగా ఏది బేస్ గా వుంటుందో దాన్ని విశ్లేషిస్తే చాలన్నట్టు సమీక్షలు ఇస్తున్నాం, మీ సూచనలకి థాంక్స్.

Q : నాదొక ప్రశ్న. సరదా సరదాగా సాగిపోతున్న కథ, ఒక అనుకోని సంఘటనతో సీరియస్ క్రైమ్ లోకి టర్న్ అవ్వొచ్చా? ఇది జానర్ మర్యాదను ధిక్కరించినట్టు అవుతుందా? ఇలాంటి కథలు రాసేటప్పుడు (ఉదా : నా పేరు శివ) స్క్రీన్ ప్లే లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా? కథలోకి సడన్ గా క్రైమ్ ఎలిమెంట్ రావొచ్చా? లేక ముందు నుంచి రేఖా మాత్రంగా ప్రస్తావిస్తుండాలా? దీనికి రిఫరెన్స్ సినిమాలు ఏమైనా ఉన్నాయా?
అశోక్, అసోసియేట్

A : ఎంత సరదా సరదాగా సాగిపోతున్నా పీపీ వన్ వచ్చేసరికి అనుకున్న క్రైమ్ తో కథ ప్రారంభమవాల్సిందే. దీనికి జానర్ మర్యాదతో సంబంధం లేదు. స్ట్రక్చర్ తో సంబంధం. క్రైమ్ ముందు నుంచీ రేఖామాత్రంగా రావాలంటే బిగినింగ్ విభాగంలో సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా దీన్ని సెట్ చేసుకుంటూ రావాలి. కథని బట్టి వుంటుంది. కొన్ని కథలకి ఇది అవసరం లేదు. సరదా సరదాగా వెళ్ళి ఒక కారాపి ఎక్కితే, అందులో కిల్లర్ వుంటే, అదే పీపీ వన్ అవచ్చు. ఇలాటి సందర్భంలో ముందు నుంచి రేఖా మాత్రంగా ప్రస్తావించ నవసరం లేదు. కథలోకి సడన్ గా పీపీ 1 లో క్రైమ్ ఎలిమెంట్ లాగా రావచ్చు. రిఫరెన్సులు ఎన్ హెచ్ 10’, హాలాహల్ లాంటివి చాలా వుంటాయి. ఇవి కామన్.

Q : నేను మీ బ్లాగ్ ఫాలోవర్ ని. ఒక స్మాల్ డౌట్ రావడంతో ఈ మెసేజ్ చేస్తున్నా. సీనిక్ ఆర్డర్ అనేది లొకేషన్ ఛేంజ్, క్యారక్టర్స్ ఛేంజ్ బట్టి మనకి సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో క్లారిటీ ఇస్తూనే, షూటింగులో కూడా సీన్స్ తీస్తున్నప్పుడు ఈ సీనిక్ ఆర్డర్ కన్ఫ్యూజ్ పడనివ్వకుండా ఉపయోగపడుతుంది కదా. మరి ఒకే లొకేషన్ లో జరిగే మూవీస్ వస్తున్నాయి, డోంట్ బ్రీత్ లాంటివి. ఇలాటి మూవీస్ కి ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి అని సీనిక్ ఆర్డర్ ఎలా వేసుకోవాలి? ఈ డౌట్ ని కాస్త క్లారిఫై చేయండి.
రాజేష్ అసిస్టెంట్

A : ఏముంది సింపుల్. సింగిల్ లొకేషన్లో ఎన్ని స్పాట్స్ లో సీన్లుంటే ఆ స్పాట్స్ ని సబ్ సీన్లుగా పరిగణించి, సీన్ నంబర్ పక్కన స్పాట్స్ కి ఎబిసీడీలు ఇచ్చుకోవడమే. ఈ మధ్య ఇలాటి ఒక పూర్తి స్థాయి సింగిల్ లొకేషన్ స్క్రిప్టుకి, ఎబిసీడీలు కన్ఫ్యూజన్ గా తయారై, అన్నిటికీ సీన్ నంబర్లు ఇచ్చేశాం. బెడ్రూంకి సీన్ 1, హాలుకి సీన్ 2, కిచెన్ కి సీన్ 3 ఇలా... గోడవ వదిలిపోయింది. మీరు కూడా ఇలా చేయవచ్చు.

        ‘డోంట్ బ్రీత్  స్క్రీన్ ప్లేలో సీన్ నంబర్లు వుండవు. హాలీవుడ్ స్క్రీన్ ప్లేల్లో సీన్ నంబర్లు వేస్తే ఆ రైటర్ ఫ్రొఫెషనల్ కాదని తెలిసి పోతాడు. సీన్ నంబర్లు వేయకుండా ఒక నవలలాగా నిర్మాతలు చదవడానికి స్క్రీన్ ప్లే ఈజీగా వుండాలి. సీన్ నంబర్లు తర్వాత ప్రొడక్షన్ విభాగం వేస్తుంది- షెడ్యూలింగ్, క్యాస్టింగ్, ఎడిటింగ్ అవసరాల కోసం. దీన్ని షూటింగ్ స్క్రిప్టు అంటారు. అయితే దేర్ విల్ బి బ్లడ్ స్క్రీన్ ప్లే లో సీన్ నంబర్లే గాక, సబ్ సీన్స్ కి ఎబిసీడీలు కూడా వేశారు.

Q : దేర్ విల్ బి బ్లడ్ విశ్లేషణలో నాకు ఒకటి అర్ధం గాలేదు. ఎంతసేపూ బ్యాడ్ కర్మకి బ్యాడ్ జరుగుతున్నట్టే వుంది తప్ప, గుడ్ కర్మకి గుడ్ జరుగుతున్నట్టు ఎక్కడాలేదు. అంటే గుడ్ కర్మ అనేది లేదనా? కర్మ సిద్ధాంతం గురించి మీ అభిప్రాయమేంటి?
ఎస్. ఎల్. వి. ప్రకాష్, పాఠకుడు

A : నిజమే, ఇది మనకి తట్టనే లేదు. ఎంతసేపూ బ్యాడ్ కర్మ గురించే గాథ వుంది. అయితే శత్రువులైన డానీ, ఇలై ఇద్దరూ మంచి కర్మలు చేసే రకాలు కారు. ఒక్క మేరీతో గుడ్ కర్మగా వుంటున్న డానీ, చివరికి బ్యాడ్ కర్మే చేశాడు. అతను మతంలోకి మారినప్పుడు, మేరీ కూడా మతంలోకి మారి ఫ్యామిలీ అన్పించుకుంటే, కొడుకుని బాస్టర్డ్ అని చెప్పి వెళ్ళగొట్టి, కోడలైన మేరీని అవమానకర పొజిషన్లోకి నెట్టేశాడు.

చిన్నప్పుడు మేరీ తండ్రి ప్రార్ధన చేయట్లేదని కొట్టే వాడు. తర్వాత అదే తండ్రి వేరే కారణం చేత పెద్ద కొడుకు ఇలై చేతిలో ఘోరంగా తన్నులు తిన్నాడు. ఇంత దారుణంగా వుంటుంది బ్యాడ్ కర్మ ఫలితం. ఇలా ఎవర్నీ వదిలిపెట్టకుండా బ్యాడ్ కి బ్యాడ్ లాగే వుంది గాథ. దీంట్లో మళ్ళీ గుడ్ చూపిస్తే ఫీల్ చెడుతుందని (రస భంగమవుతుందని) కావచ్చు, గుడ్ కి గుడ్ చూపించలేదు.

కర్మ సిద్ధాంతం సైంటిఫిక్. యూనివర్సల్ ట్రూత్. ప్రకృతి నియమం. దీన్ని సింపుల్ గా వివరించే సంఘటన జరిగింది. చాలా ఏళ్ళ  క్రితం ప్రశాంతంగా వుండే మా కాలనీ ఆలయంలో విజయవాడ నుంచి ఒకావిడ ప్రవచనా లివ్వడానికొచ్చింది. తెల్లారి అయిదుగంటలకి ప్రవచనాలు విన్పిస్తూండేవి. ఒక రోజు వాకింగ్ చేస్తూ వింటూంటే ఆవిడ చెప్పుకొచ్చింది...మాకు మంచి రోజులు రావడం లేదు రావడం లేదని, గుళ్ళూ గోపురాలూ యాత్రలూ తిరుగుతూంటారు. మంచి రోజులెలా వస్తాయి? చేసిన చెడు కర్మల్ని మంచి కర్మలు మించినపుడు మంచి రోజులొస్తాయ్ అనేసింది. సింపుల్ గా సింగిల్ లైనులో పంచ్ డైలాగ్- చేసిన చెడు కర్మల్ని మంచి కర్మలు మించినపుడు మంచి రోజులొస్తాయ్  షీ ఈజ్ జెమ్. మాయచేసి భక్తుల్ని దండుకోవాలనుకోలేదు.
        
కనుక కష్టాలొచ్చాయని, రామా అల్లా ప్రభూ అంటూ సాగిలపడితే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. దేవుళ్ళు మనల్ని పుట్టించడమే ఎక్కువ, మోయడం కూడానా? మంచి రోజులు రావాలంటే మంచి పనులు చేయడమే. మొత్తానికి  దేర్ విల్ బి బ్లడ్ స్క్రీన్ ప్లే సంగతుల పుణ్యమాని చాలా ఫిలాసఫీ మాట్లాడుకున్నాం ఈ సినిమా బ్లాగులో. ఇక ఆపుదాం.

సికిందర్