రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, ఏప్రిల్ 2019, శుక్రవారం

809 : టిప్స్


     పాఠకుల సౌకర్యార్థం స్క్రీన్ ప్లే టిప్స్ మరోసారి ఇస్తున్నాం. ఈ టిప్స్ గతంలో అప్పుడప్పుడు బ్లాగ్ సైడ్ బార్ లో పోస్ట్ చేసినవి. బ్లాగ్ సైడ్ బార్ లో పోస్ట్ చేసే కంటెంట్స్ బ్లాగులో సేవ్ కావు, డిలీట్ అయిపోతాయి. కాబట్టి ఆసక్తి వున్న వారు అప్పటికప్పుడు కాపీ పేస్ట్ చేసి భద్రపరచుకోవాలి. ఇలా చేయకపోవడం వల్ల చాలా మంది స్క్రీన్ ప్లే టిప్స్ బ్లాగులో ఎక్కడున్నాయని అడుగుతున్నారు. అవి వుండవు. మళ్ళీ సాఫ్ట్ కాపీ తీసి సైడ్ బార్లో కాకుండా,  ఇలా బ్లాగు మెయిన్ పేజీలో పోస్ట్ చేస్తేనే తిరిగి అందుబాటులోకి వస్తాయి. ఇప్పటికైనా కాపీ పేస్ట్ చేసుకోగలరు....

          1. మిస్టరీకీ, సస్పెన్స్ కీ తేడా ఏమిటంటే- ఉదాహరణకు-ఒక ప్రముఖ రాజకీయనాయకుడి హత్యోదంతాన్ని కథగా తీసుకుంటే, మిస్టరీలో అయితే రాజకీయనాయకుడి హత్య కథా ప్రారంభంలోనే జరిగిపోతుంది. ఆతర్వాత కథంతా హంతకుల్ని కనుగొనేందుకు దర్యాప్తు/పరిశోధనలతో సాగి, చివర్లో హంతకుల్ని పట్టేసుకుంటారు. అంతవరకూ హంతకులేవరనేది రహస్యంగా వుంటుంది. అందుకే అది మిస్టరీ. అదే సస్పెన్స్ థ్రిల్లర్ లోనైతే ప్రారంభంలో-ఫలానా రాజకీయనాయకుడ్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని సమాచారం అందుతుంది. కుట్రదారులెవరో ప్రేక్షకులకి/పాఠకులకి ముందే తెలిసిపోతుంది. పోలీసులకి కథాక్రమంలో తెలుస్తుంది. హత్యని ఆపేందుకు పోలీసులూ- హత్య చేసేందుకు కుట్ర దారులూ ఆడే ఓపెన్ గేమ్ గా కథనం వుంటుంది. అందుకే ఇది సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ జరగబోయే నేరాన్ని ఆపేందుకు ద్విముఖ డ్రామా ని సృష్టిస్తే, మిస్టరీ జరిగిపోయిన నేరాన్ని పరిష్కరించేందుకు ఏకోన్ముఖ సంఘర్షణని క్రియేట్ చేస్తుంది. మిస్టరీ ది ఎండ్ సస్పెన్స్ కథా ప్రక్రియ అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ ది సీన్-టు సీన్ సస్పెన్స్ కథా విన్యాసం. మిస్టరీది విలన్ కన్పించని ఏకపక్ష గొడవ అయితే, సస్పెన్స్ థ్రిల్లర్ ది విలన్ కూడా కన్పించే వైరిపక్షాల సిగపట్లు. చివరిదాకా విలన్ కన్పించని మిస్టరీసినిమా ప్రేక్షకులకి సహన పరీక్ష అని ఎప్పుడో హాలీవుడ్ తేల్చేసి, వాటి జోలికి పోకుండా వుంటే, ఇండియాలో ఇంకా పనిగట్టుకుని ఒక్కడు’, భద్రం’, ‘సామ్రాట్ అండ్ కోలాంటి మిస్టరీ లు తీస్తూ చేతులు కాల్చు కుంటున్నారు. మిస్టరీ నవలకి బావుంటుంది, సస్పెన్స్ సినిమాకి ప్లస్ అవుతుంది.
***
          2. ఎప్పుడైనా సినిమా కథ జాతకమైనా ప్లాట్ పాయింట్-1 అనే ఘట్టం సమగ్రత  మీదే ఆధారపడి వుంటుంది. ఎందుకంటే ఇక్కడ్నించీ కథని ముందుకు నడపడానికి ఉప్పందే ఘట్టం  ఇదే కాబట్టి. మరి ఇంత  ఆయువు పట్టులాంటి ఘట్టాన్ని డీలా చేసేస్తే చివరికి క్లయిమాక్స్ కూడా డీలా పడిపోతుంది.
          1- 
ప్లాట్  పాయింట్ -సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టుకు రాకపోతే హీరో పాసివ్ అయిపోతాడు.
          2-
సన్నివేశానికి లాజిక్ లేకపోయినా పాసివ్ అయిపోతాడు. ఎందుకంటే పాత్రా ఎట్టి పరిస్థితిలోనూ లాజిక్ ని ఎగెయ్యాలని చూడదు. లాజిక్ తో వున్న పాత్రని లొంగ దీసి లాజిక్ లేకుండా తన సౌలభ్యం కోసం నడిపించేది దర్శకుడే/ కథకుడే. ఎప్పుడైతే తానుగా నడిచే పాత్ర (యాక్టివ్) ని లొంగదీసి నడిపిస్తారో అప్పుడది పాసివ్ గా మారిపోతుంది.
          3-
హీరో ఏదైనా ఆశిస్తేనే సన్నివేశానికి తెరతీయగలడు.
          4-
సన్నివేశంలో హీరోకి గోల్ ఏర్పడకపోతే కథకి అర్ధమే లేదు, హీరోకి పనే లేదు, కథలో అంతా వూరికే చక్కర్లు కొడుతూ నిర్మాత ఇచ్చే డబ్బుని ఎంజాయ్ చేయడం తప్ప.
          5-
గోల్ లో ఎమోషన్ లేకపోతే  కిక్-2’ లోలాగే వుంటుంది పరిస్థితి.
          6-
సన్నివేశంలో హీరో పాల్పడిన చర్య తాలూకు పరిణామాల హెచ్చరిక లేకపోతే కథలోనూ - కథలో పాత్రల మధ్యా టెన్షన్ అనేది వుండదు. 
కాబట్టి కథకి కీలకమైన ప్లాట్ పాయింట్ -1 కి ప్రశ్నలు ప్రశ్నలు వేసుకుని చెక్ చేసుకోవాలి :   1. ప్లాట్ పాయింట్ -1 ఘట్టం కథనంలోంచి సహజంగా పుట్టుకొచ్చిందా?
          2-
సన్నివేశానికి కి లాజిక్ ఉందా?
          3-
సన్నివేశానికి హీరో ఏమాశించి తెరతీశాడు?
          4-
అప్పుడు హీరో కేమైనా గోల్ ఏర్పడిందా?
          5-
ఏర్పడితే గోల్ లో ఎమోషన్ ఉందా?
          6-
తను పాల్పడిన సన్నివేశం తాలూకు పరిణామాల హెచ్చరిక ఏమైనా ఉందా?
పై ప్రశ్నల్ని వివరించుకుంటే-
          1- 
ప్లాట్  పాయింట్ -సన్నివేశం నడుస్తున్న కథనంలోంచి సహజంగా పుట్టుకు రాకపోతే హీరో పాసివ్ అయిపోతాడు.
          2-
సన్నివేశానికి లాజిక్ లేకపోయినా పాసివ్ అయిపోతాడు. ఎందుకంటే పాత్రా ఎట్టి పరిస్థితిలోనూ లాజిక్ ని ఎగెయ్యాలని చూడదు. లాజిక్ తో వున్న పాత్రని లొంగ దీసి లాజిక్ లేకుండా తన సౌలభ్యం కోసం నడిపించేది దర్శకుడే/ కథకుడే. ఎప్పుడైతే తానుగా నడిచే పాత్ర (యాక్టివ్) ని లొంగదీసి నడిపిస్తారో అప్పుడది పాసివ్ గా మారిపోతుంది.
          3-
హీరో ఏదైనా ఆశిస్తేనే సన్నివేశానికి తెరతీయగలడు.
          4-
సన్నివేశంలో హీరోకి గోల్ ఏర్పడకపోతే కథకి అర్ధమే లేదు, హీరోకి పనే లేదు, కథలో అంతా వూరికే చక్కర్లు కొడుతూ నిర్మాత ఇచ్చే డబ్బుని ఎంజాయ్ చేయడం తప్ప.
          5-
గోల్ లో ఎమోషన్ లేకపోతే  కిక్-2’ లోలాగే వుంటుంది పరిస్థితి.
          6-
సన్నివేశంలో హీరో పాల్పడిన చర్య తాలూకు పరిణామాల హెచ్చరిక లేకపోతే కథలోనూ - కథలో పాత్రల మధ్యా టెన్షన్ అనేది వుండదు. 
***
          3. ఐడియా-జానర్- ట్రెండ్ మూడూ గల్లంతై మెజారిటీ సినిమాలు బోల్తా పడుతున్నాయి. ఒక ఐడియాని మార్కెట్ ట్రెండ్ ని బట్టి జానర్లో పెట్టి కథగా చెప్పాలన్న స్పష్టత లేక అసలు అలా చెప్పాల్సి ఉంటుందని కూడా తెలీకా చేతులు కాల్చుకుంటున్నారు. ఒక ఐడియా ప్రస్తుత ట్రెండ్ కి సరిపోతుందా, సరిపోతే జానర్ లో పెట్టి చెప్పాలన్న సమస్యకి సమాధానం ఐడియాలోనే వుంటుంది. పాతకాలపు సినిమా ఐడియాలు ఇప్పటి ట్రెండ్ కి పనికి రావనేది ఇట్టే తెలిసిపోతుంది. ఇక ట్రెండీ ఐడియాని జానర్ లో పెట్టి చెప్పాలన్నది కూడా ట్రెండీ ఐడియాలోనే వుంటుంది.  ‘కళ్యాణ వైభోగమేలో పెళ్ళంటూ గోల పెడుతున్న పెద్దవాళ్ళ బాధ తప్పాలంటే తామిద్దరూ పెళ్లి చేసుకుని వాళ్ళ కోరిక తీర్చి, ఆర్నెల్లయ్యాక విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయాలన్న ఆధునిక జంట ఐడియా మార్కెట్ ట్రెండ్ లో వుంది. పైగా ఇది రోమాంటిక్ కామెడీ జానర్. యువ జంటలు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకునే రోమాంటిక్ కామెడీ జానర్ లో పెద్ద వాళ్ళని దింపి పాత  క్లాసులు పీకించడంతో జానర్ ఎలా రసాభాస అయి సినిమా దెబ్బ తినిపోయిందో చూశాం. ‘రోజులు మారాయిలో కూడా ఐడియాకి- ట్రెండ్ కి  తగ్గ జానర్ మిస్సయ్యింది.  ఒక ఐడియా అనుకోగానే దానికి స్వాభావికంగా ఒకే జానర్ వుంటుంది. రుస్తుంలో భార్య ప్రేమికుణ్ణి  భర్త హత్య చేయడం ఐడియా. దీనికి హత్య చేసిన భర్త జైలుకి పోయి, భార్య పడిన ఇక్కట్లు  కథగా అనుకోవచ్చు. అప్పుడు దాన్ని మనం స్వర్గాని కెళ్ళి నప్పుడు మన తాతలకి చూపించుకుంటే మెచ్చుకుంటారు, భూమ్మీద ప్రేక్షకులు ట్రెండ్ లో లేదని తిప్పి కొడతారు!
***
          4. స్క్రీన్ ప్లేలో ప్రతిదానికీ రామాయణ మహాభారతాల ఉటంకింపులు అవసరంలేదు. స్వర్గీయ బాపు- రమణలు కూడా ఎంత రామ భక్తులై   రామాయణాన్నే మార్చి మార్చి ఎన్నిసార్లు సినిమాలు తీసినప్పటికీ ఎక్కడా రామాయణం లోంచి కొటేషన్లే    చెప్పలేదు. అది ప్రేక్షకులు ఫీలయ్యేట్టు సన్నివేశ కల్పన చేశారు. ప్రేక్షకులు తెలివితక్కువ   వాళ్ళనుకుని రాముడే మన్నాడో, సీత ఏమన్నదో ఇంకా పాఠాలు చెప్పలేదు. అది ప్రేక్షకులు ఫీలయ్యే సబ్ టెక్స్ట్ అనే సృజనాత్మక అంగం వున్న క్లాస్ క్రియేషన్. ఇలాకాకుండా  సబ్ టెక్స్ట్ మిగల్చని, ప్రేక్షకుల్ని విసిగించే నీతిసూత్రాలతో ఉండేవే మెట్టు దిగిన బిగ్రేడ్ అన్పించుకునే మూవీ రచనలు.
***
      5. ఏ సినిమా కథకైనా- అదెంత సిగ్రేడ్ సినిమా అయినా సరే, దాని బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాల రచన ఎలా వున్నాకూడా - స్క్రీన్ ప్లేలో అప్రయత్నంగా ఎనిమిది సీక్వెన్సు లూ వచ్చి పడిపోతాయి! సాధారణంగా స్క్రీన్ ప్లేలలో బిగినింగ్-మిడిల్- ఎండ్ అనే మూడు విభాగాలూవాటిలో ఎనిమిది సీక్వెన్సులూ వుంటాయి. కథనానికుపయోగ పడేవి ఈ ఎనిమిది సీక్వెన్సులే. ఇవి బిగినింగ్ లో రెండుమిడిల్ లో నాల్గుఎండ్ లో రెండు చొప్పున 1 : 2 : 1 నిష్పత్తిలో వుంటాయి.
         
కాలపరీక్షకు తట్టుకు నిలబడింది ఈ ఎనిమిది సీక్వెన్సుల కథనమే. ఈ సీక్వెన్సుల పధ్ధతి రీళ్ల నుంచి వచ్చింది. పూర్వకాలంలో హాలీవుడ్ లో కొన్ని సాంకేతిక పరమైన సమస్యల కారణంగా సినిమా రచయితలు  కథనాన్ని  రీళ్ళుగా విడగొట్టి రాయాల్సి వచ్చేది. ఒక రీలు నిడివి పది నిమిషాలు. ఆ పది నిమిషాల్లో కథనంలో ఒక ఎపిసోడ్ ముగిసేట్టు చూసుకునే వాళ్ళు. సినిమా ఎన్ని రీళ్ళుంటే అన్ని ఎపిసోడ్లు. ఈ రీళ్లే, ఎపిసోడ్లే, తర్వాత సీక్వెన్సులుగా మారాయి. రీళ్ల నిడివితో నిమిత్తం లేకుండా ఒక్కో సీక్వెన్స్ పది నుంచి పదిహేను నిమిషాలు చొప్పున ఎనిమిది సీక్వెన్సుల కథనాన్ని అమల్లోకి తెచ్చారు. ఇదీ కాలపరీక్షకు తట్టుకుంది. మన సినిమాల్ని విశ్లేషించి చూసినా ఇదే క్రమం కనపడుతుంది- ఎనిమిది సీక్వె న్సులతో కథ! ఒక్కో సీక్వెన్సు ఒక్కో మినీ మూవీ లా వుంటుంది. అంటే ప్రతీ సీక్వెన్సులోనూ మళ్ళీ బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు తప్పని సరిగా వుంటాయి, అది సరయిన స్క్రీన్ ప్లే అయితే! మహేష్ మంజ్రేకర్ సంజయ్ దత్ తో తీసిన సినిమా వాస్తవ్లో నైతే, సీక్వెన్సులే కాదు- ప్రతీ సీను కూడా ఓ మినీ మూవీయే! ప్రతీ సీనులో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ ఉంటాయి.
***
      6. స్క్రీన్ ప్లేలో వుండే ఎనిమిది సీక్వెన్సుల్లో ప్రతీ సీక్వెన్స్ ముగింపూ తర్వాతి సీక్వెన్స్ ప్రారంభానికి నాందిగా వుంటుంది. ఇలా సీక్వెన్సులన్నీ కలిసి ఒక గొలుసు కట్టులా తయారవుతాయి. బిగినింగ్ లో రెండు సీక్వెన్సుల్లో పాత్రల పరిచయాలు, కథా నేపధ్యం, సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనా, సమస్య స్థాపనా జరిగిపోతే చప్పున అరగంట- ముప్పావు గంట లోపల కథ పాయింటు కొచ్చే అవకాశం వుంటుంది. అక్కడ్నుంచీ ఆ సమస్యతో పోరాటంగా  మిడిల్ ప్రారంభమై, అది నాల్గు సీక్వెన్సుల్ని కలుపుకుని సంఘర్షణాత్మకంగా ముందుకు దౌడు తీస్తే, వెళ్లి ఎండ్ విభాగపు చివరి రెండు సీక్వెన్సుల్లో పడి  క్లయిమాక్స్ కొస్తుంది కథ! ఇదీ మామూలుగా జరగాల్సిన తంతు!
***
          7. ఒక అమాయకుణ్ణి నేరస్తుడిగా తీర్పు చేసి శిక్ష విధించడం, అసలు నేరస్తుణ్ణి  విడిచెయ్యడం; స్త్రీకి కూడా ఆస్తిలో భాగం ఏర్పడ్డాక, చెల్లెలు అన్న పట్ల కనబరిచే వైఖరీ - దాని ఫలితంగా జరిగిన హత్యాకాండ, ఆత్మహత్యా కాండ, ఇవి సమాజంలో మనం అప్పుడప్పుడు చూస్తున్నవే. వీటిని అరికట్టాలని, ఆదర్శజీవి అయిన రచయిత ఉబలాట పడొచ్చు. కథ ద్వారా ఇందుకు పూనుకోవచ్చు. దీనికి ఈ ఉదంతాల పుట్టు పూర్వోత్తరాలు బాగా చదివి  తెలుసుకోవాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ క్షుణ్ణంగా చదవాలి. ఆస్తి చట్టం వల్లె వేయాలి. ప్లీడర్లతోను, పోలీసు అధికార్లతోను చర్చించి, పద్ధతులు తెలుసుకోవాలి. తర్వాత వీటి  చుట్టూ ఏవొక వ్యక్తినీ, సంస్థనీ ఉద్దేశించకుండా, కథ అల్లాలి. తను వొక ఆదర్శాన్నీ నైతిక విలువనీ పాఠకుడి నెత్తిన రుద్దుతున్నట్టు కనిపించకుండా రచన సాగాలి.  వినోదం, కాలక్షేపం - కాస్త వికాసం తో కూడుకున్న సంతృప్తి- ఇవి సమకూర్చగల రచయితా ధన్యుడు. సంఘసంస్కారం అతని పనికాదు. వ్రాసెయ్యడంతో కార్యరంగంలో రచయిత పని పూర్తయినట్టే.
-బుచ్చిబాబు (
ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు టిప్స్  సినిమా రచనకీ వర్తిస్తాయి).
***
          8. బేసిక్ గా చెప్పుకోవాలంటే హీరో విలన్ల మధ్య కొట్లాట ఎందుకు వస్తుందంటే- హీరో కథ కావాలంటాడు, విలన్ కథ వద్దంటాడు. హీరోకి కథంటే ప్రేమ, విలన్ కి ద్వేషం. కథా నాయకుడుగా హీరోకి తన కథ చెప్పుకోవాలని వుంటుంది, వీడెవడు తన కథ చెప్పుకుని హీరో అవడానికని ప్రతినాయకుడుగా విలన్ కి మంటెక్కుతుంది. తన ఆశయాలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మీద బూటు  విసరడం లాంటిదన్నమాట. కథా ద్వేషి అయిన విలన్ ఎప్పుడూ బూటు పట్టుకుని తిరుగుతాడు. హీరో ఎక్కడ కథ చెపితే అక్కడ ద్వేషంతో బూటు  విసురుతాడు. అప్పుడు మనకెలా వుంటుంది? వీణ్ణి తన్ని ఓమూల కూర్చోబెట్టి,  హీరో చెప్పబోయే  కథేమిటో సాంతం  తెలుసుకోవాలన్పిస్తుంది. టీవీ లో ఆర్నాబ్ గోస్వామి ప్రశ్న అడిగి, సమాధానం చెబుతూంటే చెప్పనివ్వకుండా అరుపులు అరిచి అపేస్తూంటే మనకెలా వుంటుంది. ఆర్నాబ్ నోర్మూయించి, ఆ  బాధిత ప్రముఖుడి అభిప్రాయమేమిటో  సాంతం తెలుసుకోవాలన్నంత ఆవేశం వచ్చేస్తుంది. అలా సినిమా చూస్తున్న ప్రేక్షకులూ ఆవేశపడాలి. హీరో కథని ఎంత ప్రేమిస్తాడో, విలన్ అంత ద్వేషించాలి. కథ మీద హీరో ప్రేమ కన్నా విలన్ ద్వేషం ఎక్కువ మోతాదులో డామినేట్ చేస్తూండాలి. కథ వద్దనే వాడి గోలెక్కువ వుండాలి, అప్పుడే ప్రేక్షకులు కథకోసం దిల్ మాంగే మోర్ అని అర్రులు చాస్తారు. అయితే హీరో దగ్గరున్న కథలో అంత దమ్ముకూడా వుండాలి. రచయిత విలన్ వైపు వుండి, అసలు కథే వద్దనే దృక్కోణంలోంచి రాస్తే తప్ప హీరో- విలన్ల మధ్య కొట్లాట బేసిక్స్ కి పూర్తిగా న్యాయం చేయలేరు. రచయిత ఎంత విలన్ వైపు వుంటే, ప్రేక్షకులకి అంత హీరో వైపుండాలన్న కోరిక పెరుగుతుంది.
***
      9. క్రియేటివిటీ కి కూడా కామన్ సెన్స్ వుంటుంది. స్ట్రక్చర్ తర్వాతే క్రియేటివిటీ. స్ట్రక్చర్ ని భంగపరుస్తూ క్రియేటివిటీని ప్రదర్శిస్తే ఎలా వుంటుందంటే, ఫ్లాష్ బ్యాక్ మీద ఇంటర్వెల్ వేసినట్టు వుంటుంది. ఫ్లాష్ బ్యాక్ మీద ఇంటర్వెల్ వేయవచ్చు. అదెప్పుడంటే, మొత్తం కథని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పుకుంటూ వచ్చినప్పుడు. కానీ ఫస్టాఫ్ లో ఓ సమయంలో ఓ సందర్భాన్ని పురస్కరించుకుని ఫ్లాష్ బ్యాక్ మొదలెడితే, దాన్ని ఇంటర్వెల్ లోపే ముగించి, ప్రధాన కథ మీద ఇంటర్వెల్ వేయాలి. ఇది క్రియేటివిటీ కాదు, స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ని పక్కకు నెట్టి సబ్ ప్లాట్ కి వేస్తున్న ఫ్లాష్ బ్యాక్ ని ఇంటర్వెల్ మీదుగా పొడిగించడం క్రియేటివిటీ అన్పించుకోదు. క్రియేటివ్ స్వేచ్చ కి కూడా హద్దులున్నాయి. అతిక్రమిస్తే అష్టావక్ర స్క్రీన్ ప్లేలు పుట్టుకొస్తాయి. ఏది క్రియేటివిటీ, ఏది స్ట్రక్చర్ అనేది తెలియడం ప్రాథమిక జ్ఞానం. కొందరు బిగినింగ్ విభాగంలోనే పాత్ర గురించి ఏదో విషయం తెలియజేయడానికి ఫ్లాష్ బ్యాక్ మొదలెడుతున్నారు. ఇది స్ట్రక్చర్ ని భంగ పర్చడం. అలాగే  బిగినింగ్ లో హీరో హీరోయిన్ల తల్లి దండ్రుల ప్రేమల నాటి ఫ్లాష్ బ్యాక్ వేయడం కూడా స్ట్రక్చర్ కే కాదు, బాక్సాఫీసు అప్పీల్ కి కూడా అన్యాయం చేయడమే. శుభమా అంటూ కథ ప్రారంభించి ముసలివాళ్ళ ప్రేమలు చెప్పడమేమిటి? కామన్ సెన్సు, ప్రాథమిక జ్ఞానం లోపించడం కూడా క్రియేటివిటీకి అర్హత కాదు, శాపం అన్పించుకుంటుంది.
***
          10. స్క్రీన్ ప్లే లో సీన్లకి రెండే ఉద్దేశాలుంటాయి. కథని ముందుకు నడిపించడం, లేదా ఒక పాత్ర గురించి కొత్త విషయం తెలియజేయడం. ఈ  రెండిటికి కూడా బిగినింగ్- మిడిల్ -ఎండ్ అనే స్ట్రక్చర్ వుంటుంది. ఆనంద్ రూములోకి వచ్చి అనిల్ ని పలకరించి పిచ్చా పాటీ మాట్లాడడం బిగినింగ్. పిచ్చాపాటీలోంచి ఆనంద్ వచ్చిన పని తాలూకు విషయమ్మీద చర్చ మళ్లి వేడెక్కడం మిడిల్. చర్చ ముగియడం ఎండ్.
         
సీన్ల ఉద్దేశం డైలాగులతో కథ నడపడం కూడా కాదు. అది స్టేజి నాటకాల పని. సినిమా సీన్ల ఉద్దేశం యాక్షన్ తో కథ చెప్పడం. ఆనంద్ పిసినారి అని చెప్పడానికి ‘వాడు పిసినారిరా’  అని డైలాగుతో చెప్పడం కాదు, పిసినారిగా ఆనంద్ ఎలాటి పన్లు చేస్తాడో అది చూపించాలి. ఆయా పాత్రల యాక్షన్ (చర్యల) ద్వారానే ఆ పాత్ర అయినా,  కథ అయినా అర్ధమవ్వాలి. ఓ నాల్గు సినిమాల సీన్ల నడక మీద పట్టు సాధిస్తే ఈ కళ అబ్బుతుంది. ఆ నాల్గు సినిమాలు : ముత్యాల ముగ్గు, శంకరాభరణం, సితార, మేఘ సందేశం.
***
          11. పాత సినిమాల్లోని భావోద్వేగాలు (ఎమోషన్స్ ) నిస్సందేహంగా కాలదోషం పట్టనివే. ఇందులో సందేహం లేదు. భావోద్వేగాలు ఎప్పుడైనా ఎక్కడైనా ఒకలాగే వుంటాయి. వుండనివేమిటంటే ఆయా కాలాలకి  చెందిన అభిరుచులే (టేస్ట్స్). అభిరుచులు ఎప్పటికప్పుడు మారిపోతూంటాయి. ముందు ట్రెండ్ లో వున్న ప్రేక్షకాభిరుచుల్ని ఎష్టాబ్లిష్ చేసుకుంటే- వాటిని అడ్డంపెట్టుకుని ఇష్టమైన పాత సినిమాల్లోని  ఎమోషన్స్ ని ఎంతైనా  ప్రదర్శించుకోవచ్చు. కానీ  పాత సినిమాల్లోని ఎమోషన్స్ ని ఆనాటి అభిరుచులతో సహా ఎత్తేసి పెట్టుకుంటే మాత్రం మొత్తం సినిమా కాలంచెల్లిన లుక్ తో ఒక  ‘రభస’లాగా వుంటుంది. కానీ  ’రన్ రాజా రన్’ లో చూస్తే,  ముందు ట్రెండ్ లో వున్న అభిరుచుల్ని హైలైట్ చేస్తూ, విలన్లూ -పోలీసుల మూస తరహా భావోద్వేగాలతోనే నింపేసి అలరించారు. ఏమిటా ట్రెండ్ లో వున్న అభిరుచులూ అంటే, మేకింగ్ లో యూత్ అప్పీల్.
***
          12. నిజానికి స్ట్రక్చర్ పరిమితుల్లో- దాని చట్రంలో కథ చెయ్యడం నరకయాతనే. ముఖ్యంగా బిగినింగ్ విభాగాన్ని సెటప్ చేయడం.  ఎందుకంటే కథలన్నీ ఒకే పోతలో పోసినట్టు వస్తాయి. ఈ దృష్ట్యా కథకుడి సృజనాత్మకతకి  అడ్డొచ్చే ఈ  స్ట్రక్చర్ శృంఖలాల్ని తెంచి పారెయ్యడం ఒక్క హీరో పాత్ర వల్లే సాధ్యమవుతుందని ఇలా ‘భలేభలే మగాడివోయ్’ లో నాని పాత్ర చిత్రణ నిరూపిస్తోంది. 
***
          13. వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమాల  టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ ఉండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే (అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు.

***
          14. యుగాలుగా పాటిస్తూ వస్తున్న సాంప్రదాయబద్ధమైన నియమ నిబంధనలు బ్లాగులో పదేపదే చెప్పుకోవడం బోరుగానే ఉండొచ్చు. బిగినింగ్ రూల్ ఏమిటంటే, దాని చివర్న సాధించాల్సిన సమస్యని ఏర్పాటు చేయడం. మిడిల్ రూల్ ఏమిటంటే, సమస్య ని సాధించడానికి సంఘర్షించడం, ఎండ్ రూల్ ఏమిటంటే, సమస్యకి సముచితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనడం.
         
ఒక నిర్ణీత సమస్య, నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- ఇవి పరస్పరాధారభూతాలు. వీటిని ఒకదాన్నుంచి ఇంకోటి విడగొట్టలేం. ఏర్పాటు చేసిన నిర్ణీత సమస్యని వదిలిపెట్టి, ఇంకో సమస్య ఎత్తుకుని సమస్యని పరిష్కరించడం కథ కాదు. రోగి ఒక రోగం పేరు చెప్పాక, వైద్యుడు దానికి మందులు రాస్తూంటే, మళ్ళీ రోగి రోగం అది కాదనీ, ఫలానా ఇదీ అని ప్లేటు ఫిరాయిస్తే, వైద్యుడు చీటీ చించి పారేసి, ఇంకో చీటీ మీద వేరే మందులు రాస్తాడనుకోం పటపటా నాల్గు పీకవచ్చు రోగిని పట్టుకుని!
***
        15. స్ట్రెయిట్ నేరేషన్ ( బిగినింగ్ - మిడిల్- ఎండ్ వరుసలో) కథ చప్పగా ఉంటుందని అనడానికి ఏ ఆధారాలూ లేవు. మొదలెట్టింది లగాయత్తూ చివరంటా ఏకబిగిన కూర్చో బెట్టగల్గే కథనం చేయలేని వాళ్ళే ఫ్లాష్ బ్యాక్స్ తో ముందుకీ వెనక్కీ కథని తిప్పుతూ కాలక్షేపం చేస్తారు. రాం గోపాల్ వర్మ ఫ్లాష్ బ్యాకులు పెట్టి సినిమా ఎప్పుడూ తీయలేదు. 2007 లో ప్రదీప్ సర్కార్ తీసిన ‘లగా చున్రీమే దాగ్’ (చున్నీ మైలపడింది) లో, ఏ ఫ్లాష్ బ్యాక్ ఉందని క్లయిమాక్స్ అంతలా అలజడి రేపుతుంది? కథా వస్తువు పాత మూసే కావొచ్చు- ఆ  స్ట్రెయిట్ నేరేషన్ కిచ్చిన కథనం  ఊహించని ముగింపుకి దారి తీసి థ్రిల్ చేస్తుంది.
       
ఈ కథ మిడిల్లో ఒక సమస్యతో వుండే రాణీ ముఖర్జీ, చెల్లెలు కొంకణా సేన్ శర్మ పెళ్లి చేయడానికి బయల్దేరుతుంది. ఇక్కడ మనకేమనిపిస్తుందంటే, గతంలో  ఎ. కోదండ రామిరెడ్డి తీసిన ‘సంధ్య’ లో లాగా రాణీ ముఖర్జీ చెల్లెలి పెళ్లి చేసేసి త్యాగమయిగా మిగిలిపోతుంది కాబోలన్పిస్తుంది. కానీ ఎక్కడ్నించో కథలో మనం  మర్చిపోయిన అభిషేక్ బచ్చన్ వూడిపడతాడు!
          ఇతను ఫస్టాఫ్ లో రాణీ ముఖర్జీ ప్రేమకోసం రెండుసార్లు విఫలయత్నాలు చేసి వెళ్ళిపోయుంటాడు. ఈ పాత్ర ఇక ముగిసి పోయినట్టేనన్న అభిప్రాయం కల్గేలా కథనం చేశాడు దర్శకుడు. కానీ అనూహ్యంగా మళ్ళీ అతన్నే రప్పించడంతో, క్లయిమాక్స్ ఊహించని మలుపుతో ఎక్కడికో వెళ్ళిపోతుంది.
          కథని ఫాలో అవడానికి స్ట్రెయిట్ నేరేషన్ సులభసాధ్యంగా ఉండడమే గాక, టెంపో బ్రేకవకుండా ఏకబిగిన ఒక వరుసక్రమంలో జరిగే సంఘటనలు కదలకుండా కూర్చోబెడతాయి.
***
          16. నిత్యం కుప్పలు తెప్పలుగా యూ ట్యూబ్ లో అప్ లోడ్ అవుతున్న తెలుగు షార్ట్ ఫిలిమ్స్ ని చూస్తే ఇప్పటి యువత  ఆలోచనా ధోరణి తెలుస్తుంది. వాళ్ళు ఇంకా మూసలో వస్తున్న తెలుగు సినిమాల కథా కమామీషుల్ని దాటుకుని చాలా ముందు కెళ్ళి పోయారు. సినిమా ప్రేమలకి నిరసనగా అన్నట్టుగా  ఇప్పటి తమ ప్రేమలు అసలెలా వున్నాయో వాస్తవికంగా, ఆధునికంగా  చూపించేస్తున్నారు. వీళ్ళ ముందు మన సినిమా దర్శకులు వెలవెల బోతున్నారు. ‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్’, ‘క్యాంపస్ సెలెక్షన్’, ‘అద్వైత’ ..ఇలా ఎన్నెన్నో ‘షార్ట్స్’ రచనలో, డెప్త్ లో, దర్శకత్వంలో సినిమాలకే పాఠాలు నేర్పే స్థితికి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. యూత్ నాడిని ఇవి పట్టుకున్నంతగా సోకాల్డ్ ప్రేమ సినిమాలు పట్టుకోవడంలేదు. ఇది చెప్పినా అర్ధం చేసుకునే స్థితిలో లేరు. ప్రమాద ఘంటికలు మాత్రం మోగుతున్నాయి. ఈ షార్ట్స్ ని ఎంతమంది యూట్యూబ్ లో చూస్తారని కొట్టిపారేస్తే కూడా కాదు. విలేజి కుర్రాడు సెల్ ఫోన్లో చూసుకోవడానికి కొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. గంట కూర్చుని వరుసగా మూడు నాల్గు ఇలాటి అప్డేట్  అయిన ప్రేమలతో షా ర్ట్స్ చూసిన కుర్రాడికి ఇంకే ప్రేమ సినిమాకి  వెళ్ళ బుద్ధవుతుంది?

(మరికొన్ని మరోసారి)
సికిందర్