రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, ఆగస్టు 2023, బుధవారం

1361 : స్క్రీన్ ప్లే సంగతులు!


 

         “The multi level, the conscious and the unconscious, is natural when I write scripts… when I come up with ideas and stories.”

— Bong Joon-Ho


        ‘జైలర్’ స్క్రీన్ ప్లే బిగినింగ్ విభాగం చూస్తే- కుటుంబంతో ముత్తువేల్ సాధారణ జీవితం కనిపిస్తుంది (కథా నేపథ్యం ఏర్పాటు). రిటైరయిన ముత్తువేల్ తో బాటు భార్య, కొడుకు, కోడలు, మనవడు, టాక్సీ డ్రైవర్ ల స్వభావాలతో; కుటుంబంతో, టాక్సీ డ్రైవర్ తో ముత్తు వేల్ సంబంధాలతో సాగుతుంది (పాజిటివ్ పాత్రల పరిచయం). మరోవైపు విగ్రహాల స్మగ్లర్ వర్మ స్వభావం, కార్యకలాపాలు, అతడి అనుచరుడు శీను వ్యవహారం వుంటాయి (నెగెటివ్ పాత్రల పరిచయం). ఇప్పుడు ముత్తువేల్ కొడుకు ఏసీపీ అర్జున్ ఒక విగ్రహం దొంగతనం కేసులో శీనుని దర్యాప్తు చేసే క్రమం ప్రారంభమవుతుంది (సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన). శీనుని దర్యాప్తు చేస్తున్న అర్జున్ ఉన్నట్టుండి మాయమైపోతాడు (సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో తీవ్రత). తర్వాత అర్జున్ చనిపోయాడని తెలుసుకున్న ముత్తువేల్ తో బాటు కుటుంబం విషాదంలో మునిగిపోతారు (సమస్య ఏర్పాటు- ప్లాట్ పాయింట్ వన్).


        పై బిగినింగ్ విభాగం వరకూ చూస్తే, ఇది ముత్తువేల్ సాధారణ జీవితంతో ప్రారంభమై, ఆ సాధారణ జీవితం చెదిరిపోయిన పరిస్థితితో ముగుస్తోంది. సాధారణంగా కథతో వుండే త్రీయాక్ట్స్ స్ట్రక్చర్ నమూనానే ఇది కలిగివుంది. ఇందులో విషయం నడపడానికి తోడ్పడ్డ 4 టూల్స్ ( 1. కథానేపథ్యం ఏర్పాటు, 2. పాత్రల పరిచయం, 3. సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన, 4. సమస్య ఏర్పాటు ) కూడా త్రీ యాక్ట్స్ స్ట్రక్చర్ కి చెందిన టూల్సే అవడాన్ని గమనించ వచ్చు.  
       
అయితే ఈ స్ట్రక్చర్ లోపల చేసిన కథనమే స్టార్ సినిమాల రెగ్యులర్ కథనంతో విభేదిస్తోంది. ఇదెక్కడ్నుంచి వచ్చింది
? మార్కెట్ యాస్పెక్ట్ నుంచి వచ్చింది. స్టోరీ ఐడియాకి ముందు మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించుకుంటే, దాన్ని బట్టి క్రియేటివ్ యాస్పెక్ట్ తో తగిన కథనం వస్తుంది. దీని మార్కెట్ యాస్పెక్ట్ ఏమిటి? ఈ సినిమాని రియలిస్టిక్ జానర్ లో మార్కెట్లో నిలబెట్టడం. స్టార్ సినిమాకి రియలిస్టిక్ జానరా? యంగ్ స్టార్ కాదు, వయసు పైబడిన సీనియర్ స్టార్. కబాలి, కాలా, పేట, దర్బార్ లతో రజనీకాంత్ సినిమాలు రియలిస్టిక్ జానర్లోనే వర్కౌట్ అయ్యాయి. జైలర్ ని కూడా అదే రియలిస్టిక్ పాత్రచిత్రణతో వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేశారు. కొత్త తరం దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రియస్టిక్ స్కూల్ కి చెందిన వాడే. కాబట్టి రియలిస్టిక్ జానర్ లోనే తీయాలని మార్కెట్ యాస్పెక్ట్ నిర్ణయించి అందుకు తగ్గ క్రియేటివ్ యాస్పెక్ట్ తో కథనం చేశారు. చేసినప్పుడు రజనీకాంత్ పాత్ర చిత్రణకి ప్రేక్షకుల్ని మెప్పించే రెగ్యులర్ రజనీ మార్కు కమర్షియల్ ఎంట్రీ సీను దగ్గర్నుంచి మ్యానరిజమ్స్, పంచ్ డైలాగ్స్, రోమాన్స్, పాటలు, ఫైట్లు వరకూ సమస్తం సినిమా నుంచి తొలగి పోయాయి. ఒక కుటుంబ పెద్ద పాత్రగా అతనుండి పోయాడు.

2. మార్కెట్ యాస్పెక్ట్ ఏది?

అంటే మార్కెట్ యాస్పెక్ట్ ని రజనీతో వర్కౌటయ్యే రియలిస్టిక్ జానర్ గా నిర్ణయిస్తే, ఆ రియలిస్టిక్ జానర్ డిమాండ్ చేసే సహజ పాత్రచిత్రణ కారణంగా క్రియేటివ్ యాస్పెక్ట్ ఏర్పాటయింది. అంటే సహజంగా అన్పించే కథనం. అంటే మార్కెట్ యాస్పెక్ట్ ఈ రియలిస్టిక్ క్రియేటివ్ యాస్పెక్ట్ ని నిర్ణయిస్తే, ఈ రియలిస్టిక్ క్రియేటివ్ యాస్పెక్ట్ తో రియలిస్టిక్ కుటుంబ పెద్ద పాత్ర పుట్టింది. అప్పుడీ రియలిస్టిక్ కుటుంబ పెద్ద పాత్ర రియలిస్టిక్ గానే ప్రవర్తిస్తూ, రియలిస్టిక్ కథనమే చేసుకుపోతోంది. కథ పాత్రది. పాత్ర ఎలా వుంటే అలాటి కథనమే చేసుకుంటుంది. ఇందులో రైటర్ చేతులు పెట్టేదేమీ వుండదు. జానర్ మర్యాద పాత్ర చేతిలో వుంటుంది. రైటర్ కి అర్ధమవాల్సింది పాత్రే. అప్పుడే పాత్ర చేసుకుంటున్న కథనం అర్ధమవుతుంది. ఈ పాత్ర మధ్య తరగతి కుటుంబ పెద్ద పాత్ర. దీని మనస్తత్వం ప్రకారమే కథనం వుంటుంది, రైటర్ మనస్తత్వం ప్రకారం కాదు. ఇదంతా రజనీ నటనని చూస్తే తెలిసిపోతోంది.

రైటర్ దృక్కోణంలో ఈ బిగినింగ్ విభాగంలో విషయం చూస్తే
, ఇది కథకి ఇన్స్ పిరేషన్. దీని తర్వాత ప్రారంభమయ్యే మిడిల్ విభాగంలో విషయం క్రాఫ్ట్. దీని తర్వాత ప్రారంభమయ్యే ఎండ్ విభాగం ఫిలాసఫీ. అంటే బిగినింగ్ లో జరిగింది ఇన్స్ పిరేషన్ గా తీసుకుని, మిడిల్ లో జరిగే కథని చెక్కాలి. మిడిల్ లో చెక్కిన కథతో ఉత్పన్నమయ్యే సారంతో ఎండ్ విభాగంలో ఫిలాసఫీ చెప్పి ముగించాలి.
       
పై బిగినింగ్ విభాగంలో రణానికి పాజిటివ్
, నెగెటివ్ పాత్రల స్థాపన పూర్తయింది.  స్మగ్లర్ వర్మ, అతడి గ్యాంగ్ నెగెటివ్ పాత్రల చర్యల వల్ల కొడుకు చనిపోయాడని తెలుసుకున్న ముత్తువేల్ కుటుంబంతో విషాదంలో మునిగిపోవడంతో సమస్య ఏర్పాటై ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడింది. స్ట్రక్చర్ సూత్రాల ప్రకారం ఈ మొదటి మలుపు దగ్గర పాత్రకి గోల్ ఏర్పడి, సమస్యతో సంఘర్షణ ప్రారంభమవుతుంది. అంటే కథ ప్రారంభమవుతుంది. ఈ గోల్ అనే టూల్ లో 4 ఎలిమెంట్స్ వుంటాయి. వీటిని గోల్ ఎలిమెంట్స్ అంటారు. ఇవి 1. కోరిక, 2.పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. భావోద్వేగం.

3. రణ రంగం సిద్ధం

ఇప్పుడు 1. ముత్తువేల్ కోరిక ఏమిటి? కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం. 2. దీనికోసం దేన్ని పణంగా పెడుతున్నాడు? కుటుంబ క్షేమాన్ని. 3. ఇందువల్ల మున్ముందు ఏ పరిణామాలు ఎదురవొచ్చు? దీనికోసం బిగినింగ్ విభాగంలో జరిగింది చూడాలి. ముత్తువేల్ కుటుంబాన్ని చూపించారంటే ఆ కుటుంబం నెగెటివ్ పాత్రలతో ప్రమాదంలో పడుతుందని అర్ధం. శివ లో నాగార్జున అన్న కూతురితో అనుబంధాన్ని చూపించారంటే ఆ అన్న కూతురు ప్రమాదంలో పడుతుందని అర్ధం. అంటే సంఘర్షణకి దిగాలని ప్రధాన పాత్ర తీసుకుంటున్న నిర్ణయం ఎలాటి పరిణామాలకి దారితీయవచ్చో తెలిపి ప్రేక్షకుల్లో ఆందోళన, దాంతో భావోద్వేగాలు సృష్టించడం ఈ మూడో ఎలిమెంట్ ఉద్దేశం. ఈ మూడు ఎలిమెంట్స్ కలిసి ముత్తువేల్ పాత్రకి 4వ ఎలిమెంట్ భావోద్వేగాలు ఏర్పడుతున్నాయి.
       
ఇలా మిడిల్ విభాగానికి రణరంగం సిద్ధమైంది. అంటే సినిమా చూస్తున్న ప్రేక్షకుల మానసిక లోకం
, వెండి తెర మీద కథలో ప్రతిబింబిస్తే, ఆ సినిమా బలంగా కనెక్ట్ అవుతుందన్న నియమాన్ని పరిగణనలోకి తీసుకుంటే- ఏమిటా ప్రేక్షకుల (మనుషుల) మానసిక లోకం? కాన్షస్ మైండ్, సబ్ కాన్షస్ మైండ్, మధ్యలో ఇగో. కాన్షస్ మైండ్ ఏ ధర్మాలతో వుంటుందో, వెండితెర మీద బిగినింగ్ విభాగం అలా కన్పించడం. సబ్ కాన్షస్ మైండ్ ఏ ధర్మాలతో వుంటుందో, వెండితెర మీద మిడిల్ విభాగం అలా కన్పించడం. ఇక  ఇగో ప్రధాన పాత్ర. కాన్షస్ మైండ్ తో వుండే ఇగో, సబ్ కాన్షస్ మైండ్ లోకి ప్రవేశించి సమస్యని పరిష్కరించడం. మరి ఎండ్ విభాగం సైకలాజికల్ గా ఏది? సమస్యని పరిష్కరించుకున్న ఇగో, మెచ్యూర్డ్ ఇగోగా మార్పు చెంది మానసికంగా తృప్తి కల్గించడం.

4. గోల్ ఎలా పని చేస్తుంది?

ఇప్పుడు గోల్ ఏర్పాటుకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ తీసుకుందాం. ఏదైనా ఒక గోల్ పెట్టుకుని అది సాధించడానికి ప్రయత్నిస్తారు మనుషులు. ఎలా సాధిస్తారు?  సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు తీసుకుని సాధిస్తారు. సబ్ కాన్షస్ మైండ్ తోడ్పాటు ఎలా తీసుకుంటారు? సబ్ కాన్షస్ మైండ్ ని యాక్టివేట్ చేసి తోడ్పడేలా చేసుకుంటారు. ఎలా యాక్టివేట్ చేస్తారు?
       
ఇక్కడే రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ (ఆర్ ఏ ఎస్) అనే మెదడులో అంగం రంగప్రవేశం చేస్తుంది. జీవితంలో ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ ని సాధించాలని రాత్రింబవళ్ళు కష్టపడితే
, కష్టపడగా కష్టపడగా, ఎన్నాళ్ళకో సాధించవచ్చు. లేదా సాధించక పోవచ్చు. ఎందుకు? ఇది శాస్త్రం తెలీక కష్టపడడం కాబట్టి. ఏదైనా సాధించాలన్న మాటలతో, థాట్స్ తో సబ్ కాన్షస్ మైండ్ యాక్టివేట్ కాదు. దానికి దృశ్యం చూపించాలి. దృశ్య భాషే దానికి బాగా అర్ధమవుతుంది. ఫలానా ఒక జాబ్ కావాలని కోరుకుంటే ఆ జాబ్ లో ఆల్రెడీ చేరిపోయినట్టు, హాయిగా జాబ్ చేస్తున్నట్టు, ఆ ఆఫీసు వాతావరణంతో, కొలీగ్స్ తో, బాస్ తో హేపీగా కలిసి పనిచేస్తున్నట్టూ- డిటెయిల్డ్ గా వూహించుచుకుంటూ, ఆ వూహా రూపానికి మ్యూజిక్, ఇతర సౌండ్స్, ఎమోషన్స్, రంగులు  జోడిస్తే- ఈ సజీవ దృశ్య భాష సబ్ కాన్షస్ మైండ్ కి బాగా అర్ధమై వెంటనే యాక్టివేట్ అయి- అనుకున్న గోల్ నిజం చేసి పెడుతుంది. దృశ్య భాష భారీ సెట్టింగులతో, అవసరమైతే సీజీ ఎఫెక్ట్స్ తో, అట్మాస్ సౌండ్ సిస్టంతో కూడా ఎంత వూహించుకుంటే, అంత ఈజీగా గోల్ ని క్యారీ చేస్తుంది సబ్ కాన్షస్ మైండ్. ఈ దృశ్య భాషని సబ్ కాన్షస్ మైండ్ కి అందించేదే పైన చెప్పుకున్న ఆర్ ఏ ఎస్.  
        
గోల్ గురించిన ఇమేజి ( దృశ్యం) ని పైన చెప్పినట్టు పదేపదే మననం చేసుకుంటూ వుంటే, ఆ ఇమేజిని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అందుకుని, సబ్ కాన్షస్ మైండ్ కి బొమ్మ వేసి చూపిస్తుంది. ఈ ప్రకృతి ఏర్పాటు స్క్రీన్ ప్లే విషయానికొస్తే, ప్లాట్ పాయింట్ వన్ తో బిగినింగ్ ముగించుకుని, గోల్ తో మిడిల్ కి వెళ్తున్న క్యారక్టర్, గోల్ ని విజువలైజ్ చేసుకుని సంఘర్షణకి దిగితే, ఆ పోరాటం కరెక్టుగా వుంటుంది. పాత్ర మిడిల్ కి వెళ్ళడమంటే సబ్ కాన్షస్ మైండ్ లోకి ప్రవేశించడమే.
        
ఇప్పుడు ముత్తువేల్ గోల్ ని విజువలైజ్ చేసుకుని మిడిల్ పోరాటం ఎలా మొదలెట్టాడో, సబ్ కాన్షస్ మైండ్ ఎలా సహకరించిందో మిడిల్ విభాగంలో చూద్దాం.
(ఇంకా వుంది)
—సికిందర్


29, ఆగస్టు 2023, మంగళవారం

1360 : థియేటర్ న్యూస్!

 సాయంత్రం : జైలర్ స్క్రీన్ ప్లే సంగతులు!


     సినిమా ప్రకటనలు నిర్మాతలు విడుదల చేస్తారు. అవి చూసి ప్రేక్షకులు థియేటర్లకి వెళ్ళి సినిమా చూస్తారు. ఇది ఎక్కడైనా అమలయ్యే విధానం. కానీ సినిమా థియేటరే సినిమాలకి రారండని ప్రేక్షకులకి గుర్తు చేసే ప్రకటనలు విడుదల చేస్తే? ఈ అవసరం ఎందుకొస్తుంది? ప్రేక్షకులు మరీ బొత్తిగా సినిమాలు చూడాలన్న ధ్యాసే లేకుండా ఇంకేవో పార్టీలు పబ్బాలు, పిక్నిక్ లు, షాపింగులు, ఎంజాయ్ మెంట్లలో మునిగి తేలిపోతూంటే థియేటర్లు ఏమైపోవాలి? అందుకని నిర్మాతలతో సమానంగా థియేటర్ల యజమానులు కూడా ప్రకటనలివ్వడం అమెరికాల్లో జరుగుతోంది. అమెరికాలో 450 థియేటర్లతో నడిచే ప్రసిద్ధ రీగల్ సినిమాస్ గ్రూపు ఈ పనే చేసి మూడు యాడ్స్ విడుదల చేసింది. ఈ స్పూఫ్ వీడియోలతో ప్రేక్షకుల్ని తన థియేటర్లకి పరుగులు పెట్టేలా చేస్తోంది.

        టీటీలు, వీకెండ్ పార్టీలు, ఎంటర్ టైంమెంట్ పార్కులు... ఇలా వినోద సాధనాలు పెరిగిపోవడంతో థియేటర్ల మనుగడ కోసం కొత్త కొత్త చిట్కాలు ప్రయోగించక తప్పడం లేదు. మూడు ఫోమో వీడియోలతో ఈ ప్రచార కార్యక్రమం ఛేపట్టింది రీగల్ గ్రూపు. చికాగోకి చెందిన క్రియేటివ్ ఏజెన్సీ క్వాలిటీ మీట్స్ ఈ ఫోమో వీడియోల్ని విడుదల చేసింది. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన ఈవెంట్ ని మిస్ అవుతున్నామనే భావోద్వేగ ప్రతిస్పందనని జనాల్లో రేకెత్తించడం. పార్టీల్లోనో, ఇంకెందులోనో మునిగి తేలుతున్నప్పుడు హఠాత్తుగా టీవీలో ఫోమో యాడ్ వస్తే, అది చూసి ఆ ఈవెంట్ వైపు పరుగెత్తేలా చేస్తాయి ఈ ఫోమో యాడ్స్.
       
రీగల్ గ్రూపు
పూల్, బీబీక్యూ, ఐస్-క్రీం అనే మూడు ఫోమో స్ఫూఫ్ యాడ్స్ ని విడుదల చేసింది. ఇవి 1973 నాటి హార్రర్ క్లాసిక్ ది ఎక్సార్సిస్ట్  నుంచి తీసుకుని చేసిన ఫన్నీ హార్రర్ సీనుతో ఒకటి చేసింది. ఏదో కార్యక్రమంలో వున్న ప్రేక్షకులు బుర్ర గోక్కుని థియేటర్స్ కి వెళ్ళేలా  చేసేంత హాస్యాస్పదంగా ఈ స్ఫూఫ్స్ వున్నాయి. పాత్రలు ఇవి చూస్తున్న స్పాట్స్ లోని వ్యక్తులకి సినిమా చూడడం కూడా ఓ ముఖ్యమైన దినచర్య అని గుర్తు చేస్తున్నాయి. ఈ నెలలోనే ఈ ప్రచార కార్యక్రమం మొదలెట్టింది. టీవీల్లోనే గాక సోషల్ మీడియాలోనూ ఈ యాడ్స్ ని గుప్పిస్తూ ప్రేక్షకుల్ని రాబట్టుకుంటోంది రీగల్ గ్రూపు.
       
అసలు కోవిడ్ మహమ్మారి దెబ్బకి అప్పుల్లో కూరుకుపోయి దివాలా ప్రకటించిన రీగల్ గ్రూపు జులై చివరి వారంలో
ఒపెన్ హైమర్, బార్బీ సినిమాలు రెండిటి సూపర్ సక్సెస్ తో బయటపడింది. బయటపడడంతో ఆగకుండా ప్రేక్షకుల్ని తన థియేటర్లకి తరిలించుకు పోవడానికి పెద్ద యెత్తున ఫోమో యాడ్స్ గుప్పించింది. గత సెప్టెంబర్ లో దివాలా ప్రకటించినప్పుడు బిలియన్ల కొద్దీ అప్పులున్నాయి. అదిప్పుడు 4.53 బిలియన్‌ డాలర్ల మేర తగ్గించుకున్నామని ప్రకటించింది. కొత్త ఈక్విటీ మూలధనంలో 800 మిలియన్‌ డాలర్లు సేకరించామని, 1.71 బిలియన్‌ డాలర్ల డెట్‌ ఫైనాన్సింగ్‌ ని పొందామనీ గ్రూపు ఛైర్మన్ ఎరిక్ ఫాస్ పేరుతో ఒక ప్రకటన వెలువడింది.
       
కోవిడ్
మహమ్మారి సమయంలో గ్రూపు చాలా థియేటర్లని మూసి వేయవలసి వచ్చింది. దీంతో 2020, 2021 లలో 3.3 బిలియన్ డాలర్లకి పైగా నష్టాల్ని చవిచూసింది. ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ లో 51 థియేటర్లు మూసివేసే వున్నాయి.
       
రీగల్ సినిమాస్ గ్రూపు
సినిమాలని త్రీడీలో చూపించే రియల్ త్రీడీ కంపెనీలో భాగ స్వామి. రీగల్ ప్రీమియం థియేటర్స్ లో పెద్ద ఫార్మాట్ లో, డాల్బీ అట్మాస్ సౌండ్, బట్‌ కిక్కర్ మోషన్ సీట్లు, ఉన్నతీ కరించిన  స్క్రీన్‌పై 4కే లేజర్ ప్రొజెక్షన్‌ ని అందిస్తోంది. ఇవిగాక మొత్తం అమెరికాలో 94 ఐమాక్స్ థియేటర్లని నిర్వహిస్తోంది. 4డీ ఎక్స్ : సీజీవీ పేరుతో 4 డీ ఎక్స్ చోదిత మెరుగైన సీట్లతో గల థియేటర్స్ ని నిర్వహిస్తోంది. ఇందులో గాలి, స్ట్రోబ్ లైట్లు, నీరు, పేలుళ్ళు, లెగ్ టిక్లర్‌లు, వైబ్రేషన్‌లు, వర్షపు తుఫాను, పొగ, సువాసన వంటి ఎఫెక్ట్స్ తో ప్రేక్షకుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇలాటి థియేటర్లు 32 వున్నాయి.
       
ఇక స్క్రీన్ ఎక్స్ పేరుతో
 270-డిగ్రీల వీక్షణ కోసం గోడల మీద రెండు అదనపు స్క్రీన్‌లతో సినిమాల్ని ప్రదర్శిస్తోంది. 2021 నాటికి ఈ థియేటటర్లు 34 వున్నాయి. ఫోమో యాడ్ ని ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు.

—సికిందర్

ఫోమో యాడ్

28, ఆగస్టు 2023, సోమవారం

1359 : స్పెషల్ ఆర్టికల్

 

   ఢిల్లీలో పివిఆర్ లక్స్ ప్రైమ్‌ మల్టీప్లెక్స్ లో టిక్కెట్టు ధర రూ. 1,300.  దీంతో ఐస్ కోల్డ్ వాటర్, అవసరముంటే దుప్పటి ఉచితం. ప్రేక్షకులకి సౌకర్యంగా వుండేలాసిబ్బంది ప్రతిదీ చేస్తారు. విలాసవంతమైన లెదర్ సోఫాలు, సోఫాల మధ్య ప్రైవసీ కోసం చాలా ఖాళీ స్థలమూ వుంటాయి. ఇంటి సుఖమంతా ఇక్కడ అనుభవించ వచ్చు. బెల్ నొక్కితే వెయిటర్ హాజర్! ఫైవ్ స్టార్ మర్యాదలు.

        సినిమా చూసే విధం సంవత్సరాలుగా సమూలంగా రూపాంతరం చెందుతూ వచ్చింది. చరిత్రలోకి వెళ్తే ఇంతకి ముందు సౌండ్ లేని సినిమాలుండేవి. తర్వాత మోనో సౌండ్, స్టీరియో, సరౌండ్ సౌండ్, ఐమాక్స్, ఐమాక్స్ కొత్త తరం టెక్నాలజీ వచ్చాయి. ఆలాగే సెల్యులాయిడ్, తర్వాత అనలాగ్, జినాన్, లేజర్ ప్రొజెక్షన్లు వచ్చాయి. సినీప్లెక్స్ లొచ్చాయి. ఇప్పుడు మల్టీప్లెక్సుల యుగం.  ఒకే కాంప్లెక్స్ లో బహుళ స్క్రీన్‌లతో కూడిన సినిమా థియేటర్ కాంప్లెక్స్, కొన్ని చోట్ల ఐదు నుంచి  ఏడు నుంచి పద్నాలుగు స్క్రీన్‌లతో కూడా మల్టీప్లెక్సులు ఏర్పడ్డాయి.
       
ఈ నేపథ్యంలో
సినిమా థియేటర్లకి  జనాలు ఎలా తరలి వస్తున్నారో, పెద్ద స్క్రీన్‌ మీద వున్న ఆకర్షణ ఇప్పటికీ ప్రేక్షకుల్ని ఎలా ప్రభావితం చేస్తోందో ఇటీవలి ట్రెండ్‌లు చూపిస్తున్నాయి. గదర్ 2 ఆల్ ఇండియా నెట్ వసూళ్ళు 400 కోట్లు దాటాయి.  ఓ మై గాడ్ 2, 120 కోట్లు, జైలర్ ఇండియా నెట్  292 కోట్లు, పెన్‌ హైమర్ 129 కోట్లూ వసూలు చేశాయి.
       
అంటే పోటీగా ఓటీటీ
ప్లాట్ ఫామ్ లున్నా కూడా మల్టీప్లెక్సుల పట్ల ప్రేక్షకుల విధేయత తగ్గలేదు. నాలుగు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా అని ఆగలేదు. మల్టీప్లెక్సులకే వెళ్ళి ఈ సినిమాల్ని చూస్తున్నారు. మల్టీప్లెక్స్ లో సినిమా చూడడం ద్వారా పొందే అనుభవాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలనుకుంటున్నారు. ఓటీటీ లో మజా పొందడానికి ప్రతి ఒక్కరికీ హోమ్ థియేటర్ వుండదు. మొబైల్‌లో చూస్తున్నప్పుడు నిర్మాణ విలువల్ని, సంగీతపు ధ్వనిని, కళ్ళు చెదిరే దృశ్య వైభవాన్నీ ఆనందించలేరు. కాకపోతే ప్రేక్షకులు మల్టీప్లెక్సులకి పరుగు దీయాలంటే తీసే సినిమాలు ఆ స్థాయిలో వుండాలి.

క్వాలిటీకి డిమాండ్

చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా, తీసే సినిమాల క్వాలిటీ ఆ స్థాయిలో లేకపోతే లగ్జరీ థియేటర్లలో ఖరీదైన లెదర్ సీటింగ్, ప్రత్యేక జంట సోఫా సీట్లు, ఎంచుకోవడానికి మెనూల శ్రేణి, పార్కింగ్ లో సహాయం, ఆధునిక ప్రొజెక్షన్‌తో పాటు సౌండ్ టెక్నాలజీ - ఎన్ని వున్నా వృథాయే.
       
ఇంకా చెప్పాలంటే కొన్ని పెద్ద నగరాల్లో
డ్రైవ్ ఇన్ థియేటర్లు, రూఫ్ టాప్ థియేటర్లు, బీచ్ సైడ్ లేదా బార్ వ్యూయింగ్ యాంఫీ థియేటర్ల ఫార్మాట్స్ లో వీక్షణానుభవం శైలి పెద్ద ముందడుగే వేసింది. దేని కోసం? సినిమాల కోసమే. మరి నిర్మాతలు తీసే సినిమాలు ఎలా వుంటున్నాయి? గాండీవధారి అర్జున లాంటి సోది సినిమాలు తీసి థియేటర్లు అందిస్తున్న అభివృద్ధికి దూరంగా వుండిపోతున్నాయి. ఇలాటి సినిమాలు తీస్తే ఎంత, తీయకపోతే ఎంత.   
       
పీవీఆర్ -ఐనాక్స్
మల్టీప్లెక్స్ థియేటర్ చైన్, ఇటీవలే దక్షిణ ఢిల్లీలో ప్రియా సినిమా పేరుతో ఒక స్వతంత్ర ఐమాక్స్ స్క్రీన్ థియేటర్‌ని ప్రారంభించింది.  దీనికి ప్రేక్షకులు వెల్లువెత్తుతున్నారు. దేశంలో 100 రూపాయలకి సినిమా చూసే ప్రేక్షకులూ వున్నారు, 1500 పెట్టి సినిమాలు చూసే ప్రేక్షకులూ వున్నారు. ఈ అన్ని సెగ్మెంట్ల ప్రేక్షకుల ముంగిటకీ  మల్టీప్లెక్సుల్ని తీసికెళ్ళే ప్రణాళికలతో వుంది పీవీఆర్- ఐనాక్స్. మరి ఈ అవకాశాల్ని అందుకోవడానికి ఏ ప్రణాళికలతో వున్నారు నిర్మాతలు?
         
సినిమాకి వెళ్ళడం చాలా ఖరీదైన వ్యవహారంగా మారిందని ప్రేక్షకులు అంటున్నారనడంలో ఎలాటి నిజమూ లేదని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ప్రేక్షకులు ఏ రకమైన ఫార్మాట్‌కి వెళుతున్నారో దానిపై మాత్రమే ఆధారపడి వుంటుందనీ, ఐమాక్స్  లేదా రిక్లయినర్లు మాత్రమే వున్న స్క్రీన్‌కి వెళుతున్నారా, లేదా సాధారణ స్క్రీన్‌ కి వెళ్తున్నారా అన్న దాన్ని బట్టి ఖరీదు మారుతూ వుంటుందనీ  అంటోంది.
       
కన్పించే దృశ్యం చూస్తే
, టికెట్ ధర ఏమైనప్పటికీ ప్రీమియం సినిమా థియేటర్లు మంచి ఆక్యుపెన్సీని పొందుతున్నాయి. ప్రీమియం కేటగిరీలలోని సగటు టిక్కెట్ ధరలు బేస్ టికెట్ ధర కంటే 2 నుంచి 10 రేట్లు ఎక్కువుండొచ్చు. బేస్ టికెట్ ధర 100 వుంటే, ప్రీమియం కేటగిరీ 1000 వుండొచ్చు. ఇందువల్లే క్వాలిటీ సినిమాలకి 400, 500 కోట్లు వసూలవుతున్నాయి. 

ఎడ్యుకేట్స్ గమనిస్తున్నారు

మల్టీప్లెక్స్ ప్రేక్షకులు ఎడ్యుకేట్స్ అయి వుంటారు. గుడ్డిగా సినిమాల్ని చూసేయరు. తమ అభిరుచికి తగ్గ సినిమాలే సెలెక్టివ్ గా చూస్తారు. అప్పుడు టికెట్ ధర ఎంతైనా పెడతారు. ఏ రకమైన సినిమాని చూడాలన్న దానిపై స్పష్టత  వుంటుంది. ఏ జానర్ ఎక్కువగా ఉత్తేజపరుస్తుందో తెలుసు.  అది యాక్షన్ లేదా అడ్వెంచర్, కామెడీ లేదా డ్రామా, ఫాంటసీ లేదా హర్రర్, మ్యూజికల్స్ లేదా మిస్టరీ, రోమాన్స్ లేదా సైన్స్ ఫిక్షన్ లేదా థ్రిల్లర్ -ఏదైనా కావచ్చు. తాము లగ్జరీ థియేటర్‌లలో చూసే సినిమాలు తప్పనిసరిగా త అభిరుచికి అనుగుణంగా వుండాలి. చాలా మంది రివ్యూలు చూసే వెళ్తారు. ఇంకొంతమంది ఆ సినిమాకి స్క్రిప్ట్ రైటర్లు ఎవరని కూడా ఆరా తీస్తున్నారు. ప్రేక్షకులు సినిమాల్ని ఎంపిక చేసుకునే విధానమిలా వుంటే, ఎంత మంది నిర్మాతలు ఇది తెలుసుకుంటున్నారు?
        
సినిమాని ఎంచుకున్న తర్వాత అప్పుడు బడ్జెట్ విషయం వస్తుంది- సగటు టిక్కెట్ ధర రూ. 250 అయితే, మెరుగైన వీక్షణానుభవం కోసం రూ. 1,100 నుంచి 1,200, లేదా డైరెక్టర్స్ కట్ రూ. 900 నుంచి  2,000, ఐమాక్స్ రూ. 600, స్క్రీన్ ఎక్స్, ఎన్4డిఎక్స్ రూ. 400 వంటి ఫార్మాట్‌లు వున్నాయి ఎంపిక చేసుకోవడానికి.
        
ఇంకా విలాసవంతమైన ఇంటీరియర్స్, టచ్-స్క్రీన్ ఆపరేటెడ్ రిక్లయినర్లు, లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌లతో కూడిన ఐనాక్స్ ఇన్సిగ్నియా థియేటర్లు; త్రీడీ13, పీవీఆర్ డైరెక్టర్స్ కట్ లతో లగ్జరీ గొలుసు థియేటర్లూ సిద్ధంగా వున్నాయి. ఇవి వినోదంతో పాటు అగ్రశ్రేణి ఆతిథ్య సేవల్ని అందిస్తాయి. పిల్లల కోసం కూడా, సీటుపై రంగులు, అదనపు బొమ్మలు, క్యాండీ బార్, స్లయిడ్‌లు మొదలైన వాటితో నిండిన ప్లేహౌస్ కిడిల్స్ వంటి ప్రత్యేక ప్రీమియం కిడ్ సినిమాస్ వున్నాయి. ఎంత మంది నిర్మాతలు వీటిని దృష్టిలో పెట్టుకుని వీటికి తగ్గ క్వాలిటీ సినిమాలు తీస్తున్నారు?

వాళ్ళు ప్రొఫెషనల్స్

      పీవీఆర్ - ఐనాక్స్ ప్రతినిధి ప్రకారంమొదట టికెట్ ధరపై ప్రీమియం ఎందుకు వుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం- సాంకేతికాలతో నడిచే ప్రీమియం ఫార్మాట్ లేదా ఇన్‌సిగ్నియా లేదా డైరెక్టర్స్ కట్ వంటి వాటికి చాలా పెట్టుబడి అవుతుంది. సీటుకార్పెట్ టెక్నాలజీ అమెరికన్ కంపెనీతో ఖరీదైనవి. ఈ టెక్నాలజీ నిజ వాతావరణాన్ని కూడా సృష్టిస్తుంది. ఉదాహరణకి, ఇది యుద్ధ సన్నివేశం అయితేసైడ్‌వాల్స్ నుంచి పొగ వస్తుంది; అది డేటింగ్ సన్నివేశం అయితే సీట్ హ్యాండిల్స్ నుంచి కాఫీ వాసన వస్తుంది!

ఇక లగ్జరీ థియేటర్‌లో ఆహారం, పానీయాల మెనూ వేరే సెక్షన్. పాప్ కార్న్ లు, కోలా, కేఫ్ కౌంటర్‌లతో కూడిన సాధారణ మిఠాయి కౌంటర్లు, ఇంకా బఫే కౌంటర్లు కూడా తక్కువేం లేవు. సినిమా చూస్తున్న ప్రేక్షకులకి ఆహారాన్ని ఎలా అందించాలో, లైటింగ్ చీకటిగా వున్నందున, సర్వర్ ప్రేక్షకులకి అడ్డు పడకుండా ఎంత వంగి వుండాలి - అన్నదానిపై శిక్షణ కూడా పొంది వుంటారు.
       
ఇదీ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని రప్పించేందుకు అప్డేట్ అవడానికి పాట్లు పడుతూ వుండే ఎగ్జిబిటింగ్ సెక్టార్ ముఖ చిత్రం. ఇంత ప్రొఫెషనల్ గా థియేటర్లు మారుతోంటే
- చుట్టండ్రా సినిమా, అది కాలుతోంటే చుట్ట వెల్గించుకుందాం చందాన సినిమాలు తీస్తూంటే అది నేరపూరిత నిర్లక్ష్యం కాక ఏమవుతుంది? అసలెందుకు సినిమాలు తీయాలి?
—సికిందర్

 

27, ఆగస్టు 2023, ఆదివారం

1358 : రివ్యూ!


రచన - దర్శకత్వం : క్లాక్స్
తారాగణం : కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్,  రాజ్ కుమార్ కసిరెడ్డి, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం : మణిశర్మ, ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్,  సన్నీ కూరపాటి
సమర్పణ : సి. యువరాజు, నిర్మాత : రవీంద్ర బెనర్జీ
విడుదల : ఆగస్టు 25, 2023
***

రెక్స్ 100  హీరో కార్తికేయ ఆరు వరస ఫ్లాపుల తర్వాత 2022 లో తమిళంలో అజిత్ తో వాలిమై లో విలన్ గా నటించి పేరు తెచ్చుకుని, తిరిగి తెలుగులో బెదురులంక 2012 లో నటించాడు. తెలుగులో అతడికో హిట్ అవసరమున్నా లేకున్నా చేతినిండా అవకాశాలతో బిజీగా వున్నాడు. ఈసారి క్లాక్స్ అనే కొత్త దర్శకుడితో ప్రయత్నించాడు. క్లాక్స్ అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లో కొచ్చి పనిచేస్తూ ఈ సినిమా తీశాడు. ట్రైలర్స్ లో సోషల్ సెటైర్ లాగా అనిపిస్తున్న ఈ మూవీ దేని గురించనేది ఆసక్తి రేపింది. గ్రామీణ వాతావరణంలో కామెడీగా తీసిన ఈ మూవీ అసలు దేని గురించి? ఇది తెలుసుకుందాం... 

కథ

2012 లో గోదావరి జిల్లాలో బెదురులంక అనే వూరు. ఆ వూళ్ళో 2012 డిసెంబర్ లో యుగాంతం సంభవిస్తుందని వస్తున్న వార్తలు భయాందోళనల్ని సృష్టిస్తాయి. దీన్ని సొమ్ము చేసుకోవాలని వూరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ), బావమరిది భూషణం (అజయ్ ఘోష్), ఓ దొంగబాబా బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ డానియేల్ (రాం ప్రసాద్) ఓ పథక మేస్తారు. దాని ప్రకారం వూళ్ళో జనాలందరూ తమ దగ్గరున్న బంగారమిచ్చేయాలనీ, ఆ బంగారాన్ని కరిగించి సువర్ణ మహా శివలింగాన్ని తయారు చేయించి, గోదావరికి ఆర్పిస్తే యుగాంతం ముప్పు తప్పుతుందనీ నమ్మిస్తారు. అలాగే చర్చి ఫాదర్ క్రైస్తవులందరూ బంగారమిచ్చేస్తే  దాంతో మహా శిలువ తయారు చేయించి గోదావరికి అంకితమిస్తాననీ నమ్మిస్తాడు. భయంతో వున్న జనాలు బంగారమంతా ఇచ్చేస్తారు.
       
ఇలావుండగా
, నగరంలో  గ్రాఫిక్స్ సంస్థలో ఉద్యోగం మానేసి వచ్చి వూళ్ళో వుంటున్న శివ (కార్తికేయ) ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహాశెట్టి) ని ప్రేమిస్తూంటాడు. అయితే వూళ్ళో అందరూ బంగారమిచ్చినా అతను ఉంగర మివ్వడానికి ఒప్పుకోడు. ఇవి మూఢ నమ్మకాలని వ్యతిరేకిస్తాడు. దీంతో ప్రెసిండెంట్ అతడ్ని వూర్నుంచి బహిష్కరిస్తాడు.
       
ఇప్పుడు వూళ్ళోంచి వెళ్ళిపోయిన శివ ఏంచేశాడు
? వూళ్ళో జరుగుతున్న మోసాన్ని ఎలా ఎదుర్కొన్నాడు? కూతురు చిత్రకి వేరే పెళ్ళి చేస్తున్న ప్రెసిడెంట్ ని ఎలా ఎదుర్కొని చిత్రని చేపట్టాడన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

మయాన్ క్యాలెండర్ ఆధారంగా 2012 లో యుగాంతం సంభవిస్తుందనీ వచ్చిన వార్తలు ప్రపంచ వ్యాప్తంగా కల్లోల పర్చిన సంగతి తెలిసిందే. దీన్నిఆధారంగా చేసుకుని 2009 లో 2012 అనే హాలీవుడ్ డిజాస్టర్ మూవీ కూడా సంచలనం సృష్టించింది. ఇది తెలుగులో ‘2012 యుగాంతం పేరుతో డబ్బింగ్ కూడా అయింది. ఇది చూశాక ఇందులోని దృశ్యాలకి కొన్ని రోజులు వైరాగ్యంతో గడిపాం.
       
ఇప్పుడు ఇదే యుగాంతం కథ తీసుకుని
బెదురులంక 2012 తీశాడు కొత్త దర్శకుడు. తను ‘’
2012’ హాలీవుడ్ సినిమా, అకిరా కురోసావా తీసిన సెవెన్ సమురాయ్‌ లో భయం, రేపటి గురించి ఆందోళనా లేకపోతే ప్రజల ప్రవర్తన ఎలా వుంటుందో చెప్పే ఒక డైలాగుతో బాటు, ఐన్ ర్యాండ్ ది ఫౌంటెన్ హెడ్ నవల అందించిన స్ఫూర్తితో ఈ సినిమా తీశానని చెప్పాడు. సినిమా లొకేషన్ ఎదురులంక అయితే, కథలో అక్కడి ప్రజలు యుగాంతం భయంతో జీవిస్తున్నారు కాబట్టి బెదురులంకగా మార్చానని చెప్పాడు.

కథకి తీసుకున్న విషయం బాగానే వుంది గానీ
, తెరకెక్కించడం అంతంత మాత్రంగా వుంది. ఏదైనా ఒక అపాయాన్ని అడ్డు పెట్టుకుని మతాల పేరుతో చేసే మోసాల కథలతో సినిమాలు వచ్చాయి. 1984 లో కోడి రామకృష్ణ తీసిన అదిగో అల్లదిగో ఇలాటి మూఢనమ్మకాల మీద తీసిన బలమైన కథ. ఆస్తికుడైన తండ్రికి నాస్తికుడైన కొడుకుగా చంద్రమోహన్ పాత్రతో ఈ కథ నడుస్తుంది. కానీ ప్రస్తుత కథలో హీరో కార్తికేయతో కాక చుట్టూ వున్న పాత్రలతో కథ నడుస్తుంది. దీంతో ఫస్టాఫ్ లో అంతంత మాత్రం కనిపించే కార్తికేయ సెకండాఫ్ లోనే కథలో కొస్తాడు. అయితే విలన్ల మోసాలు బయటపెట్టాల్సిన కథ కాస్తా క్లయిమాక్స్ లో వేరే మలుపు తీసుకుని, వేరే పాత్రతో ఒక మెసేజితో ముగిసి పోతుంది.

సెకెండాఫ్ లో సత్య
, వెన్నెల కిషోయర్ లు ప్రవేశించి నడిపే కామెడీ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా వుంటుంది.  

నటనలు- సాంకేతికాలు

దర్శకుడు కార్తికేయని సరిగా ఉపయోగించుకోలేక పోయాడు. కొత్త కాన్సెప్ట్ కాబట్టి కాస్త ఆసక్తికరంగా వుంది గానీ, వేరే సినిమా అయితే ఇలాటి పాత్రతో కార్తికేయకి ఫ్లాప్ అయ్యేది. ఉన్న సన్నివేశాలు నటించడంలో మనసు పెట్టనట్టు కనిపిస్తాడు. తను హీరోనా, అతిధి పాత్రా అన్నట్టు  వుంటాడు.

హీరోయిన్ నేహా శెట్టికి హీరోని ప్రేమించడంవరకే పని. ప్రారంభ సన్నివేశాల్లో తను ప్రెసిడెంట్ కూతురు బోసి మెడతో ఎందుకుంటుందో అర్ధం గాదు. ప్రెసిడెంట్ ఒక గొలుసు కొనివ్వలేదా? ఇక వూరంతా బంగారం ఇచ్చేస్తే తను చెవి రింగులతో అలాగే వుంటుంది. ఉంగరం దానం చేసేయమని హీరోని డిమాండ్ చేస్తూందే తప్ప, తను చెవి రింగులతో వున్నానని తెలుసుకోదు. ఇలాటి లోపాలున్నాయి దర్శకత్వంలో.   

గోపరాజు రమణ
, అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్, రాం ప్రసాద్ లాంటి హేమాహేమీలు కుట్ర స్వాములుగా నటించడం ఈ సినిమాకి ప్లస్ ఆయింది. పాత సినిమాల్లో రావుగోపాల రావు- అల్లు రామలింగయ్య- నూతన్ ప్రసాద్ లు వేసిన దుష్ట త్రయం పాత్రల్లాగే వుంటారు. సినిమాకి వాడిన గోదావరి జిల్లా భాష కలిసి వచ్చింది.

ఇక మణిశర్మ సంగీతంలో రెండు పాటలు ఫర్వాలేదు. గోదావరి నది మీద
, ఇతర గ్రామీణ పరిసరాల్లో కెమెరా వర్క్ ఆకర్షణీయంగా వుంది. కాసేపు నవ్వుకోవడానికైతే ఫర్వాలేదు ఈ సినిమా.

—సికిందర్

 

25, ఆగస్టు 2023, శుక్రవారం

1357 :రివ్యూ!

 


రచన - దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు
తారాగణం :  వరుణ్ తేజ్, సాక్షీ వైద్య, విమలా రామన్, నాజర్, వినయ్ రాయ్, అభినవ్ గోమఠం, రవివర్మ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్ ఛాయాగ్రహణం : ముఖేష్ జీ
బ్యానర్ : శ్రీ వేంకటేశ్వర సినీచిత్ర, నిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్
విడుదల : ఆగస్టు 25, 2023

          2017 లో రాజశేఖర్ తో గరుడవేగ అనే హిట్టయిన యాక్షన్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు, 2022 లో అక్కినేని నాగార్జునతో ది ఘోస్ట్ అనే ప్లాపైన మరో యాక్షన్ థ్రిల్లర్ తీసి, ప్రస్తుతం యంగ్ హీరో వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున అనే స్పై యాక్షన్ ని  తెలుగు ప్రేక్షకులకి అందించాడు. గత సంవత్సరం గని అనే ఫ్లాపైన స్పోర్ట్స్ డ్రామాలో నటించిన వరుణ్ తేజ్, ఇప్పుడు గూఢచారి వేషధారణతో విచ్చేశాడు. ఈ సంవత్సరం గూఢచారి వేషాలు వేసిన యంగ్ స్టార్స్ అక్కినేని అఖిల్, నిఖిల్ లు (ఏజెంట్, స్పై) ఫ్లాపులతో సరిపెట్టుకుని తెలుగు స్పై సినిమాలింతే అని తేల్చారు. మరి వరుణ్ తేజ్ సక్సెస్ అవడానికి చూపించిన తేడా ఏమిటి? ప్రవీణ్ సత్తారు దీన్ని నిలబెట్టడానికి చేసిన కృషి ఏమిటి? అసలు కృషి ఏమైనా జరిగిందా, లేక ఖుషీ కోసం ఈ సినిమా తీశారా? దీనికీ తమిళంలో సూర్య నటించిన సింగం 3 కీ సంబంధమేమిటి? ఇవి తెలుసుకుందాం...

కథ

కేంద్రమంత్రి  ఆదిత్యా రాజ్ బహదూర్ (నాజర్) పర్యావరణ సదస్సులో పాల్గొడానికి లండన్ వెళ్తాడు.  అతడికి ఓ పెన్ డ్రైవ్ అందించాలని అక్కడున్న శృతి (రోషిణీ ప్రకాష్) ప్రయత్నిస్తుంది. అప్పుడు రాజ్ బహదూర్ మీద దాడి జరుగుతుంది. అతడి  సెక్యూరిటీ చీఫ్ గాయపడి, లండన్ లోనే వున్న ఫ్రెండ్ అర్జున్ వర్మ (వరుణ్ తేజ్) కి రాజ్ బహదూర్ ని కాపాడే బాధ్యత అప్పగిస్తాడు. రాజ్ బహదూర్ పర్సనల్ సెక్రటరీ అయిన ఐఏఎస్ అధికారిణి ఐరా (సాక్షీ వైద్య), అర్జున్ వర్మ గతంలో ప్రేమికులు. వీళ్ళ గతం ఏమిటి? రాజ్ బహదూర్ ని చంపాలని చూస్తున్నదెవరు? అర్జున్ వర్మ ఎలా కాపాడేడు? విదేశాల నుంచి ఇండియాకి తరలిస్తున్న మెడికల్ వ్యర్ధాల డంప్ కీ, కి రాజ్ బహదూర్  మీద హత్యా ప్రయత్నాలకీ సంబంధమేమిటి? రణవీర్ (వినయ్ రాయ్) అనే అతను ఎవరు? ఇవి తెలుసుకోవాలంటే మిగతా కథ వెండితెరపై చూడాలి.

ఎలావుంది కథ

2017 లో తమిళంలో హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం 3 లో కథ పర్యావరణానికి సంబంధించిందే. సమస్త జీవులకీ, పర్యావరణానికీ ప్రాణాంతకమైన, భూమిలో కలిసిపోయే గుణం లేని బయోమెడికల్ వ్యర్ధాలు, ఈ- వ్యర్ధాలూప్రత్యేక ప్లాంట్లలో నిర్వీర్యం చేయకుండా, ఆసియా దేశాలకి తరలించి డంప్ చేస్తున్న అంతర్జాతీయ పరిశ్రమల కుట్రని భగ్నం చేసే కథ. సింగం సిరీస్ సినిమాల్లో ఇది కూడా హిట్టయింది.
         
అయితే ఆ నాన్ బయో డీగ్రేడబుల్ వేస్ట్స్ తో అంతర్జాతీయ కుట్ర ఇక్కడ స్థానికంగా  ఎంతమంది స్కూలు పిల్లల్ని బలిగొందో చెబుతూ వచ్చిన ఆ దయనీయ కథని  అలాగే కొనసాగిస్తూ
, దాంతో ముడిపెట్టి బాధిత కుటుంబాల సమక్షంలో విలన్స్  ని శిక్షించాల్సింది పోయి- ఎత్తుకున్న ఈ పాయింటుని వదిలేసి రొటీన్ హీరో- విలన్ యాక్షన్ కథగా చూపించి వదిలేశారు.
        
ప్రవీణ్ సత్తారు సినిమాలో కూడా ఇదే జరిగింది. పేరుకే వ్యర్ధాలతో అంతర్జాయ కుట్ర కథ
, చూపించిందంతా కేంద్రమంత్రిని గాండీవధారి అర్జున కాపాడడం గురించే. చేతిలో ధరించిన గాండీవానికే విషయం లేదు. దీంతో విషయం లేక డొల్లగా, ఫ్లాట్ గా సాగుతుంది సినిమా. పర్యావరణ సమస్యతో బాధితుల్ని చూపించి అందులోంచి హీరో రియాక్టయి వుంటే కథ భావోద్వేగాలతో కూడి వుండేది. కేవలం కేంద్ర మంత్రిని కాపాడే చర్యల్లో ఎమోషన్స్ లేవు. ఇలా ఎమోషనల్ అప్పీల్ లేకుండా ఎన్ని యాక్షన్ సీన్లు- అదీ విదేశాల్లో భారీ యెత్తున స్టయిలిష్  యాక్షన్ సీన్లు తీసినా - అదంతా వ్యర్ధమే. నిజానికి తీసిన ఈ వ్యర్ధాన్నే ప్రేక్షకుల మీద డంప్ చేశారు. ఉదయం నుంచీ ప్రేక్షకులు ఎక్స్ అనే ట్విట్టర్ లో హాహాకారాలు చేస్తున్నారు.
        
ఇందులో వరుణ్ తేజ్ సహా ఎవరి పాత్రకీ లాజిక్ లేదు. లావ్ ట్రాక్ సాగదీయడమే తప్ప ఓ పట్టాన కొలిక్కి రాదు. యాక్షన్ సీన్సు తప్ప టాకీ పార్టు సీన్సు ఔట్ డేటెడ్ గా వున్నాయి. ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ నత్తనడకతో వుంటుంది ఈ యాక్షన్ కథ. సెకండాఫ్ లో మరీ పతనావస్థకి చేరుకుంటుంది కథ. కేంద్ర మంత్రిని కాపాడే ట్రాకే సాగి సాగీ
, హీరోకీ- విలన్ కీ మధ్య అవే పోరాటాలు రిపీటవుతూ సెకండాఫ్ కుప్పకూలింది. ఈ యాక్షన్ కథ ఎక్కడా సస్పెన్స్, ట్విస్టులు, థ్రిల్స్ వంటివి లేకుండా పేలవంగా సాగి, చివరికి పర్యావరణం గురించి మెసేజ్ ఇస్తుంది!

నటనలు - సాంకేతికాలు

స్పై హీరో వేషం తప్ప, విషయంలేని క్యారక్టర్ పోషించాడు వరుణ్ తేజ్. ఫ్లాపైన స్పై హీరోలు అఖిల్, నిఖిల్ ల సరసన చేరాడు. కథలో బలం లేక పోవడంతో కాదు, అసలు కథే లేకపోవడంతో పాత్ర కాని పాత్రతో, యాక్టింగ్ కాని యాక్టింగ్ చేసి వదిలేశాడు.
        
హీరోయిన్ సాక్షీ వైద్య గ్లామరు ప్రదర్శనతో సినిమా సాంతం కన్పిస్తుందిగానీ
, పాత్రకి పనిలేక పోతే ఎందుకు కనిపిస్తోందో అర్ధం గాదు. కమెడియన్ అభినవ్ గోమఠం స్పై లో చేసిన కుదరని కామెడీ లాంటిదే ఇప్పుడు కూడా చూశాడు. కేంద్రమంత్రిగా నాజర్, విలన్ గా విమల్ రాయ్ పాత్రల్లో పసలేక పోయినా ఎంతోకొంత నటించారు.
        
మిక్కీ జె మేయర్ సంగీతమే కాస్త ఊరట. ముఖేష్ కెమెరా వర్క్ కూడా అగ్రనిర్మాత నుంచి మంచి బడ్జెట్ లభించడంతో బడ్జెట్ కి తగ్గ కృషి చేశాడు. యాక్షన్ డైరెక్టర్స్
, మిగతా సాంకేతిక శాఖల నిపుణులూ అంతే కృషి చేశారు. కానీ అంత బడ్జెట్ అందిస్తున్న నిర్మాతకి తగ్గట్టు మేకింగ్ చేసే పని మాత్రం చేయలేదు దర్శకుడు. ముందు దర్శకుడుగా తాను అప్డేట్ అవ్వాల్సిన అవసరం చాలా కన్పిస్తోంది.
—సికిందర్