రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

8, నవంబర్ 2021, సోమవారం

1078 : సందేహాలు- సమాధానాలు

Q :   నేనొక ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. అయితే మీరు తరచూ యాక్టివ్ క్యారక్టర్, పాసివ్ క్యారక్టర్ అని రాస్తుంటారు. యాక్టింగ్ కోర్సులో వీటి గురించి చెప్పడం లేదు. రేపు నాలాంటి నటులు పాత్రల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పాసివ్ క్యారక్టర్స్ తో సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని అంటారు. నాకు భయంగా వుంది. రేపు నేను నటిస్తే నా సినిమాలు కూడా ఫ్లాపవుతాయా? లేకపోతే నటుడిగా ఇదంతా నాకవసరం లేదంటారా? డైరెక్టర్ చెప్పినట్టు చేయాలంటారా? దయచేసి నా సందేహాలు తీర్చగలరు.
—ఆర్ జె పి
, యాక్టింగ్ విద్యార్థి
A :    ఇనిస్టిట్యూట్స్ లో యాక్టివ్, పాసివ్ పాత్రలు నేర్పుతారు. నేర్పకపోతే అడగండి. పాసివ్ పాత్రలెందుకంటే ట్రాజడీల కవసరం కాబట్టి. రియలిస్టిక్- అన్ రియలిస్టిక్ పాత్రల నటన కూడా నేర్పుతారు. అయితే థియరీ నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్ గా కథ వినేప్పుడు అది యాక్టివా పాసివా గుర్తించడం వేరు. ఏ ఏ లక్షణాలు యాక్టివ్ కుంటాయి, ఏ ఏ లక్షణాలు పాసివ్ కుంటాయి అదనంగా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివి తెలుసుకోండి. విరివిగా సినిమాలు చూసి గుర్తించండి. సినిమాల్లో ప్రధాన పాత్రల్నే కాదు, ఇతర పాత్రల్ని కూడా పరిశీలించండి. సహాయ పాత్రలు పాసివ్ గా కూడా వుండొచ్చు. నష్టం లేదు. సినిమా ప్రధాన పాత్రదే అవుతుంది కాబట్టి అది యాక్టివ్ గానే వుందా తెలుసుకోండి. కథ ట్రాజడీ అయితే పాసివ్ గా వుండడాన్ని గమనించండి. కమర్షియల్ సినిమా అన్నాక హీరోయిన్, విలన్ పాత్రలు కూడా యాక్టివ్ గానే వుండాల్సి వుంటుంది.

        మీరు భవిష్యత్తులో హీరో అయితే
, కథ వినేప్పుడు ట్రాజడీ కాకపోతే, యాక్టివ్ పాత్రేనా తెలియడం అవసరం. గీత గోవిందం లో హీరో పాసివ్ క్యారక్టరే కానీ స్క్రీన్ ప్లే వల్ల అది హిట్టయిందని ఒక ప్రముఖ ఇనిస్టిట్యూట్ సీనియర్ ప్రిన్సిపాల్ చెప్తూంటారు. ఇలా అన్నిసార్లూ జరగక పోవచ్చు. రిస్కు తీసుకోవాలనుకుంటే మీ ఇష్టం. అయితే ఇనిస్టిట్యూట్స్ లో 
ఏ పాత్ర ఎలా నటించాలో నేర్పుతారే తప్ప, ఏ పాత్ర ఒప్పుకుని సినిమాలో నటించాలో అది నటుల ఛాయిస్సే. పాసివ్ పాత్రల్ని తిరస్కరించమని ఇనిస్టిట్యూట్స్ లో చెప్పరు. అది మీ విచక్షణ.


    మీరు సహాయ పాత్రలు చేయాల్సి వస్తే యాక్టివా పాసివా ప్రశ్న వుండదు. హీరోనే అవాలనుకుంటే యాక్టివ్ పాత్ర చిత్రణల్ని బాగా స్టడీ చేసుకోండి. రియలిస్టిక్ సినిమాలు ఆర్ట్ సినిమాలకి దగ్గరగా వుంటాయి. ఆర్ట్ సినిమాల్లో హీరో సర్వసాధారణంగా పాసివే. కానీ ఈ రోజుల్లో కమర్షియల్ గా తీయాల్సిన రియలిస్టిక్ సినిమాల్లో యాక్టివ్ గా వుండాల్సిందే. మీరు యాక్టింగ్ కోర్సు చేస్తూనే, బయట కథలు వింటూండే ఏర్పాటు చేసుకుంటే ఇప్పట్నుంచే ప్రాక్టీసు అవుతుంది. కథలు వింటూ, కొత్తాపాతా సినిమాలు చూస్తూ అనుభవం సంపాదించుకోండి. ఈ సందర్భంగా ప్రసిద్ధ యాక్టింగ్ టీచర్ ఉటా హేగెన్ రాసిన 9 క్వశ్చన్స్ అన్న పుస్తకం మీకు పనికి రావచ్చు. కొని చదవండి. పీడీఎఫ్ కూడా అందుబాటులో వుంది. ఆల్ ది బెస్ట్.

Q :   రోమాంటిక్ కామెడీలు బలంగా వుండాలంటే ఏం చేయాలి? లవర్స్ విడిపోయి కలుసుకుంటే బలంగా వుండదా? రోమాంటిక్ కామెడీలు ఇప్పుడు వర్కౌట్ కావని మాత్రం నిరాశపర్చకండి. రోమాంటిక్ కామెడీలు బలంగా వుండాలంటే ఇంకేం చేయాలో చెప్పండి.
—ఏ టూ జెడ్
, దర్శకుడు.
A :   పేరు వద్దన్నారు కాబట్టి ఏ టూ జెడ్ గా మార్చాం. ఇక  వరుడు కావలెను సహా నిరాశ పరుస్తూనే వస్తున్నారుగా మీలాంటి వాళ్ళు. అపార్ధాలతో విడిపోవడాలు, లేకపోతే ప్రేమిస్తున్నట్టు పైకి చెప్పలేక పోవడాలు - ఈ చాదస్తాల చుట్టేగా రెండు దశాబ్దాలుగా చుట్టిందే చుట్టి చుట్ట చేసి చూపిస్తున్నారు. అసలు రోమాంటిక్ కామెడీ కర్ధం తెలుసుకోవాలి ముందు. జంధ్యాల తీసిన అహ నా పెళ్ళంట చూడండి. ఇందులో ప్రేమికులు విడిపోతారా? హాలీవుడ్ రోమాంటిక్ కామెడీల్లో విడిపోతారా? విడిపోవడాల్నీ, ప్రేమిస్తున్నట్టు పైకి చెప్పలేక పోవడాల్నీ రోమాంటిక్ డ్రామా లంటారు. ఇన్నేళ్ళుగా రోమాంటిక్ డ్రామాలు తీస్తూ, రోమాంటిక్ కామెడీలనుకుంటున్నారు. దీంతో రెండూ కాకుండా పోతున్నాయి.

        తీస్తున్నది రోమాంటిక్ కామెడీలు కాదూ డ్రామాలని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే అప్పుడు రోమాంటిక్ డ్రామాలైనా
మరోచరిత్ర లా అర్ధవంతంగా తీస్తారు. రోమాంటిక్ డ్రామా జానర్ మర్యాదలు వేరు, రోమాంటిక్ కామెడీల జానర్ మర్యాదలు వేరు. రోమాంటిక్ డ్రామాలు వీణ సినిమాలు, రోమాంటిక్ కామెడీలు గిటార్ సినిమాలు. యూత్ కి వీణ కావాలా, గిటార్ కావాలా? ఈ బ్లాగులోనే దీని గురించి వివరంగా వ్యాసం రాశాక మళ్ళీ  ఇక్కడ వివరించనవసరం లేదు. ఇక్కడ క్లిక్ చేసివ్యాసం చూడండి.

        ఇంకేం జరుగుతోందంటే
, తీస్తున్న రోమాంటిక్ కామెడీలనే, డ్రామాలనే లైటర్ వీన్ గా తీయడం. ఈ లైటర్ వీన్ అనే ఫ్యాషన్ కూడా ఇరవై ఏళ్ళ క్రితం అలవాటు చేసుకున్నదే. హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహమెలా వుంటుందంటే, లైట్ గా వుండే కథలకి కథనాన్నికాంప్లికేట్ చేసి తీస్తారు. అప్పుడు బాక్సాఫీసు దగ్గర స్ట్రాంగ్ గా నిలబడుతుంది. బిగ్ యాక్షన్ మూవీస్ లో కథని, కథనాన్నీ లైట్ గానే వుంచి, హెవీ యాక్షన్ సీన్స్ ని క్రియేట్ చేస్తారు. అప్పుడే బాక్సాఫీసు బద్ధలవుతుంది.  ఇలాటివి తెలుసుకోక పోతే ఇంకో ఇరవయ్యేళ్ళూ రోమాంటిక్ కామెడీలతో ఇంతే.

     ఈ మధ్య చూసిన ఒక హాలీవుడ్ ఉదాహరణ చూద్దాం : రోమాంటిక్ కామెడీలో కేవలం హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ నిలబెట్టలేదని ఏం చేశారో చూద్దాం. సినిమా పేరు క్రేజీ, స్టుపిడ్, లవ్ (2011). ఇందులో హీరో హీరోయిన్ల మధ్య కాన్ఫ్లిక్ట్ తో బాటు, కథనంలో తల్లిదండ్రుల మధ్య, ఇంకా తండ్రికీ కొడుక్కీ మధ్య, మరింకా తండ్రికీ కూతురికీ మధ్య, మరీమరీ ఇంకా బేబీ సిట్టర్ కీ తల్లికీ మధ్యా కాన్ఫ్లిక్ట్స్ పెట్టేసి, లైట్ కథని పైన చెప్పుకున్న హాలీవుడ్ మార్కెటింగ్ వ్యూహంతో, కాంప్లికేట్ చేశారు. 50 మిలియన్ డాలర్ల బడ్జెట్ కి, 145 మిలియన్ డాలర్లు బాక్సాఫీసు వచ్చింది.
Q :  వంశీ గారి ‘అన్వేషణ’ కధ కూడా ఎండ్ సస్పెన్స్ కాదా ? ‘అన్వేషణ’ సూపర్ సక్సెస్. మరి ‘అనుమానాస్పదం’ కథ కూడా ఇంచుమించుగా అలాగే వుంటుంది కానీ ఈ సినిమా ప్లాప్. వివరించగలరు.

—ఫణి కుమార్, దర్శకత్వ శాఖ

A :  ఎండ్ సస్పెన్స్ ప్రక్రియ పరిణామ క్రమం సందర్భాను సారం బ్లాగులో ఇస్తూనే వచ్చాం కదా? అన్వేషణ 1985 నాటికి హాలీవుడ్ లో ఎండ్ సస్పెన్స్ ప్రక్రియకి తెర పడుతూ వచ్చింది. హంతకుడెవరో ముగింపు వరకూ వెల్లడి కాని సస్పెన్స్ కథలకి సినిమాల్లో ప్రేక్షకాదరణ తగ్గిపోయింది. ఒక్కో తరహా కథలకి ఒక్కో కాలం వుంటుంది. మారుతున్న కాలానికి అభిరుచులు కూడా మారి, ఇక ఓపిగ్గా కూర్చుని నిదానంగా సాగే కథల్ని సినిమాలుగా చూసే తరం ప్రేక్షలులు తగ్గిపోతూ వచ్చారు. దీంతో హంతకుడెవరో ముందే తెలిసిపోయి, వాణ్ణి పట్టుకునే సీన్ టు సీన్ సస్పెన్స్ కథల్ని సినిమాల్లో ప్రవేశపెట్టింది హాలీవుడ్. ఇది మన దేశంలో వెంటనే అందుకోక పోయినా కొంత కాలం పట్టింది. అప్పట్నుంచీ ఎండ్ సస్పెన్స్ కథలతో వుండే సినిమాలు ఫ్లాపవుతూ వచ్చాయి. 2007 లో వంశీయే తీసిన అనుమానాస్పదం సహా. ఈ లింక్ క్లిక్ చేసి పూర్తి వివరాలుచూడండి.

—సికిందర్