రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మే 2017, మంగళవారం


        డార్క్ మూవీస్ లో రెండు రకాల స్త్రీ పాత్ర లుంటాయి . ఒకటి సామాన్యమైన హీరోయిన్ పాత్ర,  ఇంకొకటి అసామాన్యమైన వాంప్ పాత్ర.  హీరోయిన్,  వాంప్ ఇద్దరూ హీరోకి ఒకరు ఉపగ్రహంలా, ఇంకొకరు గ్రహశకలంలా వుంటారు. హీరోయిన్ కక్ష్యలో వున్న ఉపగ్రహంలా వుంటే, వాంప్ వినాశాన్ని సృష్టించే గ్రహశకలంలా దూసు కొస్తుంది. హీరోయిన్ ధనికురాలై వుండాలని లేదు, మధ్యతరగతికి చెందినదై కూడా వుండొచ్చు. ఆమె వస్త్రధారణ సామాన్యంగా వుంటుంది. భారీ మేకప్, లిప్ స్టిక్ వాడదు. హీరో కేసు పరిశోధిస్తున్న ఎస్సై అయినా, లేదా కేసులో ఇరుక్కున్న నిందితుడైనా హీరోయిన్ అతణ్ణి ప్రేమిస్తుంది. ఆమె నిజాయితీతో వుంటుంది. అయితే  కేవలం ప్రేమ కోసం, పాటలకోసం అన్నట్టుగా కాక  ఈమెకో సంబంధిత వృత్తి నిచ్చి హీరోకి సహాయకారిగా చేస్తే, పాత్రకి ఆకర్షణ పెరుగుతుంది. హీరో  ఎస్సై అయితే తను రిపోర్టర్, హీరో క్రైం రిపోర్టర్ అయితే తను సహ రిపోర్టర్, హీరో క్రిమినల్ లాయర్ అయితే తను అసిస్టెంట్... ఇలా ప్రొఫెషనల్ పాత్రని సృష్టించవచ్చు.

         
డార్క్ మూవీస్ జానర్ కో నియమిత మూడ్ వుంటుంది. ఈ మూడ్ ని చెడగొట్టే విధంగా హీరోయిన్ పాత్రని సృష్టించకూడదు. అంటే టీచర్, అనాధలని ఆదుకునే మదర్  థెరిస్సా, కాలేజీ స్టూడెంట్, డాన్స్ స్కూల్ నడిపే దొడ్డమ్మ లాంటి పాత మూస ఫార్ములా పాత్రల్ని సృష్టించ కూడదు. ఉదాహరణకి ‘స్వామి  రారా’  యాక్షన్ కామెడీ జానర్ లో హీరోయిన్ కలర్స్ స్వాతిది టీచర్ పాత్ర. ఈ పాత్రకి  డార్క్ మూవీస్ లో స్థానం లేదు. యాక్షన్ కామెడీ వేరు, డార్క్ మూవీ వేరు. అలాగని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అంటే కూడా కుదరదు. ఈ డార్క్ మూవీ జానర్ ప్రధానంగా మర్డర్ మిస్టరీ గురించి వుంటుంది. ఈ మిస్టరీని ఛేదించడానికి తోడ్పడే పైన చెప్పుకున్న రిపోర్టర్, లాయర్ అసిస్టెంట్ వంటి పాత్రలు ఆ కథా ప్రపంచంలో ఇమిడిపోతాయి. 

          డార్క్ మూవీ మర్డర్ మిస్టరీగా కాక, ‘నగరం’ లాంటి క్రైం డ్రామాగా వున్నప్పుడు హీరోయిన్ పాత్రతో స్వేచ్ఛ తీసుకోవచ్చు, ‘నగరం’ లో హీరోయిన్ రేజీనా కసాండ్రా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అయినట్టు. క్రైం డ్రామా మర్డర్ ఇన్వెస్టిగేషన్ తో కాక, ఒక విపత్కర పరిస్థితి లోంచి బయట పడే కథతో వుంటుంది. కనుక హీరోయిన్ పాత్రలకి పరిమితులుండవు. అలాగని పైన చెప్పుకున్న పాత  మూస ఫార్ములా పాత్రలు పనికిరావు. 

         ‘పింక్’ లాంటి క్రైం ఇన్వెస్టిగేషన్ ఆధారిత డార్క్ మూవీలో హీరోయినే బాధితురాలు. హీరోయిన్ బాధితురాలైనప్పుడు ఏ వృత్తిలో నైనా వుండవచ్చు. అయితే డార్క్ మూవీస్ అంటే రిచ్ పీపుల్ కథలే కాబట్టి, హీరోయిన్ బాధితురాలై  వున్నా ఆధునిక జీవితానికి అలవాటుపడ్డ టాప్ ప్రొఫెషనల్ అయివుండక తప్పదు- ‘పింక్’ లో హీరోయిన్ తాప్సీ లాగా. 

          డార్క్ మూవీ హీరోయిన్ నిందితురాలై కూడా వుండవచ్చు-  ‘కహానీ -2’  లో విద్యాబాలన్ లాగా. విద్యా బాలన్ ఒక సంపన్నుల పిల్లలు చదివే స్కూల్లో క్లర్కు గా పనిచేస్తూంటుంది. పిల్లల్లో ఒక బాలికని వాళ్ళ సంపన్న కుటుంబపు అరాచకం నుంచి కాపాడడానికి ప్రయత్నించిన ఫలితంగా నేరస్థురాలిగా ముద్రపడి బాలికతో పారిపోతుంది. ఇలా డార్క్ మూవీ ఇన్వెస్టిగేషన్ అయినా, క్రైం డ్రామా అయినా హీరోయిన్ నింది తురాలైనప్పుడు కూడా హై ఫై గానే వుంటుంది తప్ప – బస్తీలో పొట్టేలు పున్నమ్మలా వుండదు. 

          హీరోయిన్ సంఘటనకి సాక్షి అయినప్పుడు విలన్ పంజరంలో చిక్కుకుంటుంది- ‘నేనూ మనిషినే’ లో కాంచన లాగా. హీరోయిన్ సంపన్నురాలై వుంటే విశృంఖలత్వంతో  వుంటుంది- ‘బిగ్ స్లీప్’ లో మార్తా వికెట్స్ లాగా. ఈమె గాంబ్లింగ్ కి అలవాటుపడి బ్లాక్ మెయిల్ లో ఇరుక్కుంటుంది. 

          డార్క్ మూవీ హీరోయిన్ సంపన్నురాలైనా, ప్రొఫెషనల్ అయినా, సాక్షి అయినా, బాధితురాలైనా, నిందితురాలైనా మనసులో కుళ్ళు వుంచుకుని ప్రవర్తించదు. నీతీనిజాయితీ లుంటాయి. ఇక్కడ ఇలా ఈమెని వేరు చేస్తూ అడుగు మందం అడ్డ గీత గీయాల్సిందే. ఈ గీత కావల వుంటుంది సకల దుర్బుద్ధుల వాంప్.

‘ది బిగ్ స్లీప్’ లో  ఈ కళాత్మక షాట్ ఏం చెప్తోంది?
      హీరోయిన్ లో  ఏమేం వుంటాయో అవేవీ వాంప్ లో వుండవు. ఆఖరికి కట్టుకునే బట్టలు కూడా. ఈమె మాయలేడి, మాటకారి. భారీ మేకప్ తో అట్టహాసంగా కాస్ట్యూమ్స్ వేసుకుని గుంభనంగా మూవ్ అవుతూంటుంది. స్మోక్ చేస్తుంది, డ్రింక్ చేస్తుంది. హీరోని వల్లో వేసుకుని చెడ్డ పనుల వైపుకి లాగుతుంది. అడ్డంగా ఇరికించి చల్లగా జారుకుంటుంది. ఆ హీరో ఎస్సై అయినా సరే, నిందితుడైనా సరే- తనపని తాను చేసుకుపోతుంది. ఈమె దగా చేసే రకమని ప్రేక్షకులకి తెలుస్తూన్నా హీరోగారికే తెలీదు. ఈమె విలన్ కి వుంపుడుగత్తెగా వుండొచ్చు, లేదా   పోటీ విలన్ గానూ వుండవచ్చు. ఇంకా లేదా నీరా రాడియాలాగా గూఢచర్యం చేసి ‘రాడియా టేప్స్’ సృష్టించవచ్చు. ఈమె సంపన్నులతో సంబంధ బాంధవ్యాలు కలిగి వుంటుంది. చివరికి ఈమెకి విజయం వుండదు. 

          డార్క్ మూవీస్ లో ఈ రెండు రకాల స్త్రీ పాత్రలు కాక సహాయ పాత్రలు  ఎన్నైనా వుండవచ్చు. అవన్నీ ఈ జానర్ డిమాండ్ చేసే మూడ్ ని క్రియేట్ చేసేవిగానే వుండాల్సి వుంటుంది. ఎందుకు మూడ్ కి  తగ్గ పాత్ర లుండాలని  పదే పదే నొక్కి చెప్తున్నామంటే, డార్క్ మూవీస్ అనేవి ఇతర జానర్స్ కంటే కూడా ఓ ప్రత్యేక కళతో కూడుకుని వుంటాయి. విషయపరంగానే గాక, చిత్రీకరణ పరంగానూ ఇవి భిన్నంగా  వుంటాయి. నేరాలతో మనిషిలోని, సమాజంలోని చీకటి కోణాల్ని వెల్లడి చేయడమనే ప్రధాన ఎజెండాతో ఇవి  రూపొందుతాయి. ఇంత కాలం తెలుగు సినిమాలు ఈ బలమైన జానర్ ని పట్టించుకోక వెనుక బడిపోయాయి. కళాత్మకత, సృజనాత్మకత అనేవి ప్రేమ సినిమాల్లోనూ, దెయ్యం సినిమాల్లోనూ ఏనాడో కనుమరుగైపోయాయి. కానీ డార్క్ మూవీస్ కళాత్మకత, సృజనాత్మకత ఏనాడూ చచ్చిపోయేవి కావు. ఇవిలేక డార్క్ మూవీస్ లేవు. వీటిని రుచి మరిగిన ప్రేక్షకులు వీటిని విడిచి పెట్టనూ లేరు.



- సికిందర్