రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Thursday, December 17, 2015

వరల్డ్ మూవీ





కొన్ని గొప్ప సినిమాలు చాలా సింపుల్ గా వుంటాయి. భారీ బడ్జెట్లు కూడా అవసరం లేదు. కానీ భారీగా ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకుని చిరకాలం ఉండిపోతాయి. చర్చకి దారితీస్తాయి. ప్రపంచంలో- ఆ మాటకొస్తే దగ్గరి సమాజంలో ఒక కదలిక తెస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనిషి ఎలా వుండాలి, వుంటే ఎలా సమాజంలో కొంత చోటు లభిస్తుంది, అలా లేని మనిషికి  సమాజం ఏ విలువ ఇస్తుందీ ఇత్యాది అంశాలన్నీ ఇలాటి చిన్న చిన్న కథా చిత్రాలే దృశ్యం కట్టి చూపిస్తాయి. అలాటి  ఒక ఒంటరి స్త్రీ సంఘర్షణ ని  సమగ్రంగా  చిత్రించిందే కెనడాకి చెందిన మిలానీఅనే మూవీ. 1982 లో విడుదలైన ఈ  మూవీ ఎందరికో అభిమాన చలనచిత్రంగా ఇప్పటికీ ఇళ్లల్లో  చోటు సంపాదించుకుంటోంది డీవీడీ ల రూపంలో.

కెనడా కి చెందిన రెక్స్ బ్రామ్  ఫీల్డ్  టీవీ / మూవీ  రచయిత, దర్శకుడు. 1977 నుంచీ 2004 వరకూ లవ్ ఫస్ట్ సైట్’, ‘టులిప్స్’, ‘హోం ఈజ్ వేర్ ది హార్ట్ ఈజ్’, ‘కెఫే రోమియో’, ‘ది వైల్డ్ గయ్స్’ , ‘మిలానీఅనే ఏడు సినిమాలకి దర్శకత్వం వహించినా, ‘మిలానీతోనే గుర్తింపు పొందాడు. దీనికి ఉత్తమ దర్శకుడుగా ఒక అవార్డు కూడా పొందాడు. ఈయన సోదరులు వల్రీ బ్రామ్ ఫీల్డ్, లూయీస్ బ్రామ్ ఫీల్డ్ లు ప్రముఖ కమెడియన్లు.

ఐతే స్వయంగా రచయిత అయిన దర్శకుడు రెక్స్ బ్రామ్ ఫీల్డ్,  ‘మిలానీకి రచన చేయలేదు. మైకేల్ గ్రీన్ అనే స్క్రీన్ రైటర్ రాసిన కథ ఆకర్షించి  దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. స్క్రీన్ ప్లే కూడా తను రాయకుండా రచయితలు  రిచర్డ్ పలాక్- రాబర్ట్ గుజాలకి అప్పజెప్పాడు. ఈ కథలో ప్రధాన పాత్రలో గ్లిన్నిస్ ఓ కానర్ ని అనే నటీమణి ని తీసుకున్నాడు. ఈవిడ అమెరికన్ నటి. అతి తక్కువగా సినిమాల్లోనూ, ఎక్కువగా టీవీ సీరియల్స్ లోనూ నటించింది.  కెనడా సినిమా మిలానీలో నటించాకే పేరు సంపాదించుకుంది. మిలానీలో నటించేటప్పటికి ఈవిడ వయసు 26 ఏళ్ళు.

ఒక నిరక్షరాస్యురాలైన యువతి తన ఆరేళ్ళ కొడుకుని పొందడం కోసం పడే పాట్లే మిలానీ కథ. అవిద్య అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వుంది.  అమెరికాలోని ఆర్కాన్సాస్ లో జాస్పర్ అనే చిన్న గ్రామంలో కొడుకు టైలర్ తో నివసిస్తూ వుంటుంది మిలానీ. చదువు లేకపోవడం వల్ల భర్త సంపాదన మీద ఆధార పడుతుంది. ఆ భర్త కార్ల్ కాలిఫోర్నియాలో సైన్యం లో ఉంటాడు. అతడిదీ అంతంత మాత్రం చదువే. అతడికి కొడుకు భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆందోళన వుంటుంది. రెండేళ్లుగా అతను ఇంటికి రాలేదు. దురదృష్టవశాత్తూ తన వల్ల మిలానీ గర్భవతి కావడం వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది గానీ లేకపోతే చదువురాని ఈమెని  చేసుకునే వాడు కాదేమో. ఇప్పుడు కొడుకు ఆమెతోనే గనుక వుంటే ఆమెలాగానే నిరక్షర కుక్షి అవుతాడని భయపడుతూంటాడు. అందుకని ఒక రోజు ఇంటికి వచ్చి కొడుకుని తీసుకుని కాలిఫోర్నియా పారిపోతాడు.

చదువు లేకపోయినా మిలానీది ఎంతయినా మాతృ హృదయమే. ఆమె తల్లడిల్లి పోతుంది. కొడుకు లేకుండా క్షణం ఉండలేదు. జీవితంలో ఈ గ్రామం విడిచి ఎక్కడికీ తను వెళ్ళలేదు. వెళ్తే జనంలో కలిసి తిరిగితే ఎక్కడ తను అన్ ఎడ్యుకేటెడ్ అని తెలిసిపోతుందో నని భయం. ఇప్పుడు కొడుకు కోసం సాహసించి  ఏకంగా కాలిఫోర్నియాలాంటి అత్యాధునిక ప్రజలుండే మహానగరానికి ప్రయాణం కట్టక తప్పలేదు...

కాలిఫోర్నియాలో కష్టాలు
కాలిఫోర్నియా చేరుకున్న మిలానీ చిన్ననాటి స్నేహితురాలు రొండా ఇంటికి వెళ్తుంది. రొండా రాక్  సింగర్ అయిన రిక్ తో కలిసి ఉంటోంది. ఇతను తాగుబోతు. సింగర్ గా తన  స్థానం  కోల్పోయిన తను ఆ స్థానాన్ని తిరిగి పొందేందుకు స్ట్రగుల్ చేస్తూంటాడు. ఇతడికి వాల్టర్ అనే న్యాయవాది  సహాయ పడుతూంటాడు. మిలానీని రిక్ కి ఇతనే పరిచయం  చేస్తాడు. అదే సమయంలో ఆమె సమస్య విని సానుభూతితో సాయం చేసేందుకు ముందుకొస్తాడు. కొడుకుకోసం లీగల్  గా కోర్టులో పోరాడేందుకు సన్నాహాలు చేస్తాడు. అయితే కోర్టు నుంచి కొడుకు కస్టడీ పొందాలంటే మిలానీకి అక్షర జ్ఞానం  వుండాలని సలహా ఇస్తాడు. కొడుకుని పొందడం కోసం ఏమైనా చేయగల మిలానీ, చదువు నేర్చుకోవడం ప్రారం భిస్తుంది.

మిలానీని చూసి మొదట్లో  పల్లెటూరి బైతు అని పట్టించుకోడు రిక్. కానీ ఆమె చల్లని హృదయం చూసి దగ్గరవుతాడు. పరస్పరం తమ సమస్యల్లోంచి బయట పడేందుకు ఇద్దరూ సహకరించుకోవడం మొదలెడతారు. అక్షరాలు  నేర్చుకుని భర్త దగ్గర్నుంచి కొడుకు కస్టడీ పొందాలనుకున్న మిలానీ, ఇక అలాటి భర్త మీద ఆధారపడదాల్చుకోక,  తన కాళ్ళ మీద తను నిలబడి కెరీర్ డెవలప్ చేసుకోవాలని సమాయత్త మవుతుంది. రాయడం, చదవడం నేర్చుకుంటుంది.

ఇదే సమయంలో భర్తతో పొందలేకపోతున్న ప్రేమని రిక్ నుంచి పొందుతూ సంతృప్తిగా వుంటుంది. అయితే భర్త  కార్ల్ అనుకుంటున్నది వేరు. ఎట్టి పరిస్థితిలోనూ కొడుకుని వదులుకోకూడదన్న పట్టుదలతో ఉంటాడు. అవసరమైతే మిలానీ ని చంపెయ్యడానికీ దానికీ వెనుకాడ కూడదనుకుంటాడు. మిలానీ అందరి సహకారంతో భార్తమీద ఎలా న్యాయ పోరాటం చేసి కొడుకుని సంపాదించుకున్నదీ మిగతా కథ.

గ్లిన్నిస్  ది గ్రేట్
ఒక మాతృ హృదయపు బాధ, ఒక నిరక్షరాశ్యురాలి పోరాటం అనే రెండు పార్శ్వాలున్న మిలానీ పాత్రలో గ్లిన్నిస్ ఓ కానర్ మనల్ని చూస్తున్నంత సేపూ కదలకుండా కట్టిపడేస్తుంది. చదువు రాని వాళ్ళు  ప్రపంచంలో ఎక్కడైనా వుంటారు. మనమధ్య కూడా వుంటారు. అందువల్ల ఇది నేటివిటీ సమస్య ఉత్పన్నం కాని  సార్వజనీన పాత్ర అయ్యింది. చదువు ప్రాముఖ్యం గురించి అంతర్లీనంగా సందేశమిచ్చే దృశ్య మాధ్యమంగా కథ తోడ్పడింది.

ఈ పాత్రని అతిగా భావోద్రేక ప్రదర్శన చేస్తూ కాకుండా,  అతి సున్నిత ధోరణిలో నటించింది గిన్నిస్ ఓ కానర్. చదువురాని  స్త్రీల తత్త్వం,  ప్రవర్తనా  ఎలా ఉంటాయో కూలంకషంగా అధ్యయనం చేసినట్టే వుందామె నటన. అక్కడక్కడా కళ్ళు చెమర్చే సన్ని వేశాలతోబాటు, నవ్వించే ఘట్టాల్నీ  అలవోకగా నిర్వహించుకొచ్చింది.

ఈమె తర్వాత చెప్పుకోవాల్సింది సింగర్ గా నటించిన  బర్టన్ కమ్మింగ్స్ గురించి. అప్పట్లో ఇతను నిజజీవితంలో కెనడాలో సింగర్, కంపోజర్ కూడా. నటించిన సినిమా మాత్రం ఇదే. ఇతడి నిజ జీవిత అనుభవం ఈ సినిమాకి  బాగా ఉపయోగ పడింది. ఇందులో తను కంపోజ్ చేసి  పాడిన పాటలు కూడా వున్నాయి. పాత్ర పరంగా ఇవి అవసరమే.  చాలా వరకూ మాంటేజెస్ లో ఈ పాటలు వస్తాయి.  నటనకి కొత్తే అయినా అది బయట పడకుండా సంఘర్షణాత్మక పాత్రని పోషించాడు బర్టన్ కమ్మింగ్స్. క్లోజింగ్ టైటిల్స్ మీద  వచ్చే  యూ సేవ్డ్  మై సోల్’  అనే పాట బాగా గుర్తుండి పోతుంది మనకి.

లాయర్ వాల్టర్ గా పాల్ సాల్వినో అద్భుతంగా నటిస్తాడు. రొండా గా ట్రూడీ యంగ్ నటిస్తే, కొడుకుగా జేమీ డిక్, భర్తగా డాన్ జాన్సన్ నటించారు. అమెరికాలోని టొరంటోలో నిర్వహించే జినీ అవార్డ్స్ లో ఈ సినిమాకి  ఉత్తమ దర్శకుడి అవార్డు రెక్స్ బ్రామ్  ఫీల్డ్ పొందితే , ఉత్తమ విదేశీ నటి అవార్డు ని గ్లిన్నిస్ ఓ కానర్ సొంతం చేసుకుంది. అలాగే  ‘యూ సేవ్డ్  మై సోల్నే పాటకి ఉత్తమ గాయక- సంగీత దర్శకుడి అవార్డుని బర్టన్ కమ్మింగ్స్ పొందాడు. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్  ప్లే రచయితలుగా  రిచర్డ్ పలాక్- రాబర్ట్ గుజా అవార్డు పొందారు గానీ అది వెనక్కి వెళ్ళిపోయింది. అడాప్టెడ్ స్క్రీన్  ప్లే కి వీళ్ళు  తీసుకున్న మైకేల్ గ్రీన్ రాసిన కథ ప్రచురితం కాలేదు కాబట్టి, అవార్డుకి అర్హం కాదని కమిటీ వెనక్కి తీసుకుంది.

కేవలం నాల్గు మిలియన్ డాలర్ల బడ్జెట్ తో నిర్మించిన మిలానీ’  చిన్న సినిమాగా పెద్ద ప్రభావం చూపింది అప్పట్లో. చూస్తే ఇప్పటికీ దీనికి కాలదోషం పట్టలేదని తెలుస్తుంది.


-సికిందర్