రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

25, అక్టోబర్ 2018, గురువారం

697 : రైటర్స్ కార్నర్


సినిమా రచయిత్రిగా మారిన నవలా రచయిత్రి కణికా థిల్లాన్ ఇటీవల ‘మన్మర్జియా’తో బాగా పాపులరయ్యారు. తన ఈ సినీ యానంలో ఎన్నడూ తన నవలల్ని సినిమాలుగా మార్చాలనే ఆలోచనే చెయ్యని కణికా,  సాహిత్యమూ సినిమా వేర్వేరు జాతులంటారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన కణికా, 2008 లో షారుఖ్ ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ కి సహాయ దర్శకురాలిగా పనిచేయడంతో సినిమా వృత్తిని  ప్రారంభించారు. ఆ తర్వాత ఓ రెండు లో - బడ్జెట్ సినిమాలకి స్క్రిప్టు సూపర్ వైజర్ గా పనిచేశారు. 2012 లో షారుఖ్ ఖాన్  నిర్మించిన ‘రా. వన్’ కి స్క్రీన్ ప్లే, మాటలూ రాసి పూర్తి స్థాయి సినిమా రచయిత్రి అయ్యారు. ఆ తర్వాత 2015 లో తెలుగులో ‘సైజ్ జీరో’ కి స్క్రీన్ ప్లే రాశారు. దీని తర్వాత 2018 లో  హిట్టయిన ‘మన్మర్జియా’ కి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించి అరుదైన క్రియేటివ్ ప్రొడ్యూసర్ హోదా పొంది, రచయిత్రిగా తన  స్క్రిప్టు పై పూర్తి స్వాతంత్ర్యమూ, హక్కులూ సాధించారు. సలీం - జావేద్ ల తర్వాత కరువైపోయిన  ‘ఇది ఫలానా రచయిత సినిమా’ అనే బ్రాండింగ్ ని తను పొందారు. ఈ సందర్భంగా ‘మన్మర్జియా’ రచన గురించి ఆమె వెల్లడించిన  ఆసక్తికర విషయాలేమిటో చూద్దాం...

మన్మర్జియా మీ హృదయానికి ఎంత దగ్గరగా వుంది?
         
నేను అమృత్ సర్ లో పుట్టి పెరిగాను. మన్మర్జియా లోని పాత్రలు ఆ ప్రపంచంలో లోతుగా పాతుకుని వున్నాయి. ఇది పూర్తి స్థాయిలో నేనొక్క దాన్నే రాసిన మొదటి స్క్రిప్టు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు నేనే రాసుకున్నాను. ఈ స్క్రిప్టు రాయడానికి నా మూలాల్లోకి నేను వెళ్ళడం సరైన ఆలోచననుకున్నాను. అందుకని ఈ సినిమాలో నా కంఠ స్వరాన్నే ఫీలవుతారు మీరు.
మీరు దర్శకుడుగా అనురాగ్ కశ్యప్ నే బలంగా కోరుకున్నారు, ఎందుకని?
         
 స్క్రిప్టు రాస్తున్నప్పుడు అనురాగ్ కశ్యపే నా మనసులో మెదులుతున్నారు. ఆయనే రైటర్ - డైరెక్టర్ కదా అని కొందరన్నారు. ఇతరుల స్క్రిప్టులకి ఆయన దర్శకత్వం వహించరని చెప్పారు. అయినా సరే నా అదృష్టాన్ని పరీక్షించు కుందామనుకున్నాను. మన్మర్జియా సంక్లిష్ట ప్రేమ కథ. అందులో చెప్పాల్సింది నాన్ జడ్జి మెంటల్ గా, నిర్భయంగా చెప్పాను. అనురాగ్ ని ఒప్పించగలననే నమ్మకం నాకుండేది. ముందు నిర్మాత ఆనంద్ ఎల్ రాయ్ కి విన్పించాను. ఆయన వెంటనే దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. అప్పుడు అనురాగ్ పేరు చెప్పాను. అనురాగ్ అప్పుడు వేరే సినిమాతో బిజీగా వున్నారు. ఆనంద్ గారు అనురాగ్ చేస్తున్న సినిమాతో బాటు, నా స్క్రిప్టుని కూడా ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధమయ్యారు. అలా అనురాగ్ పిక్చర్ లోకి వచ్చారు. ఆనంద్ గారికి ఎన్నోఇబ్బందులెదురయ్యాయి. అయినా నా పక్షానే నిలిచారు. రైటర్స్ కి ఆయన చాలా మర్యాదా స్వేచ్ఛా ఇవ్వడం చూశాను.
తారాగణం ఎంపిక ఎలా జరిగింది?
          షార్ట్ టెంపర్ తో, అర్ధంకాకుండా ప్రవర్తించే నటులు ఈ కథకి అవసరమనుకున్నాం. దీనికి తాప్సీ, విక్కీలు సరిపోయారు. రాబీ పాత్రకి ఆనంద్ గారే ఆభిషేక్ బచ్చన్ పేరు సూచించారు. అభిషేక్ నటిస్తున్నప్పుడు చూస్తే, సరీగ్గా నా వూహల్లో వున్న పర్సనాలిటీనే ఆయన నటించారు.
కథ తాప్సీపాత్ర చుట్టే తిరుగుతుంది...
          తాప్సీకి ఇందులో నటించే అవసరం లేదు, ఎందుకంటే తనే రూమీ...రూమీ పాత్రని నేనెలా వూహించి రాశానో అచ్చం అలాగే వుంది తను - సూఫీ స్మూత్ నెస్ తో. అందుకని రూమీ అని పేరు పెట్టాను.
నవల రాయడానికీ, స్క్రీన్ ప్లే రాయడానికీ తేడా ఏమిటంటారు?
          నవల రాయడం వ్యక్తిగత అనుభవం. సినిమాకి రాయడం సమిష్టి కృషి. నవలలో ఎన్ని వాక్యాలతో ఎన్ని అద్భుత వర్ణన లైనా చేసుకోవచ్చు పేజీల కొద్దీ. కానీ సినిమాకి రాయాలంటే క్లుప్తత, విజువల్ అప్పీల్ చాలా అవసరం. నవలకీ సినిమాకీ వేర్వేరు స్కిల్స్ వుంటాయి.
మన్మర్జియా తర్వాత వెనువెంటనే మీ సినిమాలు రెండు రాబోతున్నాయి – కేదార్ నాథ్, మెంటల్ హైయ్ క్యా. మీకు దర్శకత్వం వహించాలని లేదా?
          తప్పకుండా వుంది. ప్రస్తుతానికి రాయడాన్నే ఎంజాయ్ చేస్తున్నాను. దర్శకత్వం వహించడానికి సరైన కథ దొరికినప్పుడు తప్పకుండా డైరెక్షన్ లోకి దూకుతాను.  
అనురాగ్ కశ్యప్ సెట్స్ మీద ఇంప్రూవ్ మెంట్లు చేస్తూంటారని ఒక ఫిర్యాదు వుంది. మీకేమైనా ఇబ్బందులు కలిగాయా?
          ప్రతీ రోజూ ఆయనతో నేను సెట్స్ లోనే వున్నాను. కొన్ని సీన్లు తీసేప్పుడు సుదీర్ఘంగా చర్చ చేసే వాళ్ళం. ఆ చర్చల్లో ఆయన నా విజన్ ని మార్చేస్తున్నారని నాకెప్పుడూ అన్పించలేదు. గుండె లోతుల్లోంచి ఆయన నా స్క్రిప్టుకి కనెక్ట్ అయిపోయారు. ఎప్పుడైనా వాదోపవాదాలు జరిగితే, ఆయన నన్ను ఒప్పించడమో, లేదా తనే నాతో ఒప్పుకోవడమో చేసేవారు. అదే ఆయనలో అద్భుతం. స్క్రిప్టు చదివి, తన వరకూ తను తీసిన ‘దేవ్ డీ’ ఎక్కడ ముగిసిందో, అక్కడ ‘మన్మర్జియా’ ప్రారంభమవుతోందని చెప్పారు. 

గత కొన్ని నెలలుగా మీరు ఒక సెట్ నుంచి ఇంకో సెట్ కి విశ్రాంతి లేకుండా తిరుగుతూ బాగా బిజీ అయినట్టున్నారు?
          చాలా హడావిడి. కానీ ఇదంతా నేనింత కాలం చేస్తూ వచ్చిన కృషికి  ఫలితంగా మీకన్పించొచ్చు గానీ - ఈ ప్రయాణాలూ, ఒక సినిమా సెట్స్ నుంచి ఇంకో సినిమా సెట్స్ కి తిరగడాలూ, నాకేమీ ఆసక్తికరంగా వుండవు. అయినా ఎంజాయ్ చేస్తున్నాను. దర్శకుడితో నా ఈక్వేషన్ మీద ఆధారపడుంటుంది. కథలకి నేనే సొంతదారు కాబట్టి నేను సెట్స్ లో వుండాలని దర్శకుడు కోరుకుంటే కాదనలేను.
దాదాపూ మీ మూడు స్క్రిప్టులూ ఒకేసారి ప్రొడక్షన్ లో కొచ్చి నట్టున్నాయి? ఇదెలా జరిగింది?
         
మన్మర్జియా కొంత కాలంగా నిర్మాణంలో వుంది. దీంతో బాటు కేదార్ నాథ్, మెంటల్ హై క్యా నిర్మాణంలో వున్నా, ఇవన్నీ నేనొకేసారి రాసినవి కావు. ఒకటి రాశానంటే మొత్తం నేనే రాసుకుని ఎవరికైనా ఇంట్రెస్టుందేమో వెళ్లి కలుస్తూంటాను. అలా రాసింది ఒకటి ఓకే అయ్యాకే మరోటి రాయడం మొదలెడతాను. అలా నేను రాసి ఓకే చేయించుకోవడంలో ఈ మూడిటి మధ్య ఎడం వున్నా, అవి నిర్మాణాలు ప్రారంభం కావడంలో జాప్యాల వల్ల, మూడూ వెంట వెంటనే విడుదల కొస్తున్నాయి.  
మన్మర్జియా మీకు మైలు రాయి. మీరు  రా. వన్ తో ప్రారంభమయ్యారు. అంతకి ముందు మీరు నవలా రచయిత్రి.  మరి మీకు సినిమా రైటర్ అవాలని ఎలా అన్పించింది?
          రా. వన్ కి రాసిన రచయితల్లో నేనొక రైటర్ని. సాంకేతికంగా రైటర్ గా నా మొదటి సినిమా మన్మర్జియా అవుతుంది. రా. వన్ నా ఇల్లు. షారుఖ్ ఖాన్ రెడ్ చిల్లీస్ సంస్థ నుంచి నేను మొదలయ్యా. అక్కడే అన్నీ నేర్చుకున్నాను. అక్కడే ట్రైనీ గా చేరి అసిస్టెంట్ డైరెక్టర్ ని అయ్యాను. మూవీ మేకింగ్ లో ప్రతీదీ అప్పుడే నేర్చుకున్నాను. ట్రైనీగా వుంటున్నప్పుడే మూడు నవలలు రాశాను. ‘డాన్స్ ఆఫ్ దుర్గా’ నవల రాస్తున్నపుడు వ్యక్తిగతంగా నేను బాగా లేను. నాన్న పోయారు. నా మానసిక శారీరకారోగ్యాలు చెడిపోయాయి. ఆ సమయంలో ఎక్కడో చదివాను – జీవితంలో నీ దుర్భర క్షణాల్ని డబ్బుగా మార్చే ప్రక్రియే రచన చేయడమని. కానీ నవలలు రాసే ఏకాంత వ్యాపకం నేను కోరుకోలేదు. ఆ ఏకాంతంలోకి, ఆ వొంటరి తనంలోకి వెళ్ళ వద్దని కొందరు వారించారు. అందుకని సినిమా స్క్రిప్టులు రాయడం ప్రారంభించాను. ఇదైతే నల్గురితో టీంవర్క్ ని డిమాండ్ చేస్తుంది కదా.
అనురాగ్ కశ్యప్ తానే రైటర్. ఆయన ఏంరాసి తీస్తున్నారో ఆఖరి క్షణాల వరకూ చెప్పరని యాక్టర్స్ అంటూంటారు. మీకూ ఇదే అనుభవమా?
          అలాటిదేమీ లేదు. ముందే చాలా చర్చించుకునే వాళ్ళం. ఎల్లవేళలా ఆయన సెట్స్ లో వుండమనే వారు. మన్మర్జియా పాత్ర ప్రధాన కథ. మంచి దర్శకుడైతేనే నటుల నుంచి ఈ పాత్రల్ని వెలికి తీయగలడు. పాత్రల్ని నటింప జేయడం కాదు, వాళ్ళని పాత్రలుగా మార్చేయగలడు. అనురాగ్ నటులతో నటింప జేయడం ఎలా వుంటుందంటే, వాళ్ళ  పర్సనాలిటీల్ని  పాత్రల్నుంచి అడ్డు తొలగించేస్తారు. అప్పుడా నటులు కేవలం వ్యక్తులుగా మిగులుతారు. ఇలా ఫిల్టర్ చేయడం చాలా కష్టమైన పని.  
రైటర్స్ కి ఫ్రెండ్లీ టీమ్స్ దొరకడం కష్టమే. అనురాగ్ తో మీ టీం వర్క్ అంత కష్టం కాలేదేమో...
         
ప్రతీ దర్శకుడిలో నేను అనురాగ్ లాంటి ప్రొఫెషనల్ ని కోరుకుంటాను. అనురాగ్ తానే రైటరైనా సాటి రైటర్స్ తో అభద్రత ఫీలవరు. పైగా స్నేహపూర్వకంగా వుంటారు. టాలెంట్ ని ప్రోత్సహించడంలో చాలా ముందుంటారు. తామొక్కరే వెలిగిపోవాలనుకోకుండా టాలెంటున్న ఇతరుల్ని ప్రోత్సహించే వాళ్ళు అతి తక్కువ మంది వుంటారు. అనురాగ్ నుంచి నేను నేర్చుకున్న గొప్ప విషయమేమింటే, మనతో పాటూ ఇతరులూ ఎదిగేలా చూడాలి, తొక్కేసి ముందుకెళ్ళి కూడదు...
కరణ్ జోహార్ తీస్తున్న ‘తఖ్త్’ పోస్టర్ లో రైటర్స్ పేర్లు వేశారు. రచయితలెంతో  ధన్యులైనట్టు ఫీలయారు. అనురాగ్ కూడా ఎప్పుడూ మన్మర్జియా కథ మీదేనని ప్రకటిస్తూ వచ్చారు. ఇది మీకు ఎంకరేజింగ్ గా వుందంటారా?
         
మేమెందుకు ధన్యులమనుకోవాలి? ఇలా రైటర్స్ ని గుర్తించాల్సిందే కదా. అనురాగ్ విషయానికొస్తే నా ఒక్కరి విషయంలోనే అలా చేయలేదు. చాలా మంది రైటర్స్ విషయంలో ఇవ్వాల్సిన క్రెడిట్ ఇచ్చారు. ఎవ్వరూ పాటించని సాంప్రదాయాన్ని ఆయన పాటిస్తున్నారు. ఇందుకు అభినందిస్తానే తప్ప, నేను రుణపడి వుండాలనుకోను. రైటర్స్ ని నమ్మి ఆదరించే మరొకరు ఆనంద్ గారు. సినిమా మీడియా అంటే కంటెంట్ క్రియేషన్ అనీ, అందుకని క్రియేటర్స్ ని చాపకింద తోసేయలేమనీ ఆయనకి తెలుసు. రైటర్స్ ని పోషించడం తమ అవసరమనీ కూడా ఆయనకి తెలుసు. మరలాంటప్పుడు రుణపడడం దేనికి? రైటర్ పేరు పోస్టర్ మీద వుండాల్సిందే. ఈ ట్రెండ్ ని కరణ్ జోహార్ ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. మన్మర్జియా కి నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్ ని. అనురాగ్, ఆనంద్ ఇద్దరూ రైటర్ గా నా పేరేయడమే గాక, ఓనర్ షిప్ కూడా నాకే ఇస్తున్నట్టు చెప్పారు. పోస్టర్ మీద పేరుకంటే నాకు ఇది ముఖ్యం.
***