రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Monday, June 5, 2017





    
    బడ్జెట్ మూవీస్ ఎక్కువసృజనాత్మకతని కోరుతాయి. బడ్జెట్  పరిమితుల రీత్యా ఈ సృజనాత్మకత  స్క్రిప్టు పరంగానే గాక, ప్రొడక్షన్ పరంగానూ అవసరం. ఇతర అన్ని రకాల  స్క్రిప్టుల కంటే బడ్జెట్ మూవీ స్క్రిప్టు రాయడమే కష్టమైన పని.  అనేక యాక్షన్ సీన్లు, ఫారిన్ సీన్లు, బోలెడు పాత్రలతో హంగామా, ఆరేసి పాటలూ వగైరా బడ్జెట్ స్క్రిప్టులో కుదరదు. బడ్జెట్ స్క్రిప్టు అంతా కేవలం పాత్రల మధ్య బలమైన కథ తోనే రాణిస్తుంది. ఈ బలమైన కథని  తక్కువ పాత్రలతో, తక్కువ లొకేషన్స్ లో, తక్కువ రోజుల్లో  షూట్ చేసేటట్టు రూపొందాల్సిందే. 


          క్కబడ్జెట్ మూవీ రచనకీ, బిగ్ కమర్షియల్ రచనకీ తేడా తెలుసుకోవడం అవసరం. బిగ్ కమర్షియల్స్ కి కథల్లో, పాత్ర చిత్రణల్లో ఎన్ని లోపాలున్నా ఇతర భారీ హంగూ  ఆర్భాటాలతో, స్టార్ ఇమేజితో  కవరై పోవచ్చు. బిగ్ కమర్షియల్ కి ఒక టెంప్లెట్ లో రచన వుంటుంది. అదిలా వుంటుంది-   ముందుగా ఒక యాక్షన్ సీనుతో హీరో ఎంట్రీఒక గ్రూప్ సాంగ్ఆతర్వాత హీరోయిన్ని పడేసే కామెడీ లవ్ ట్రాక్ఆమెతో ఒక టీజింగ్ సాంగ్హీరోయిన్ లవ్ లో పడ్డాకడ్యూయెట్అప్పుడు విలన్ ఎంట్రీ, దాంతో ఇంటర్వెల్. సెకండాఫ్  లో హీరోయిన్ అదృశ్యమై విలన్ తో కథ మొదలుఅప్పుడప్పుడు హీరోయిన్ తో సాంగ్స్, అప్పుడప్పుడు విలన్ ఎటాక్స్చివరికి హీరోయిన్ తో ఒక ఫోక్ సాంగ్ఇక విలన్ తో క్లయిమాక్స్ముగింపూ. 

          ఈ టెంప్లెట్ బడ్జెట్ మూవీస్ కి పనిచేయదు. ఈ టెంప్లెట్ ని పట్టుకుని చాలా బడ్జెట్ మూవీస్ వచ్చాయి. ఫలితంగా అవి బిగ్ కమర్షియల్స్ కి చవకబారు నకళ్ళుగా తేలిపోయాయి. ఈ టెంప్లెట్ లో  మొత్తం సినిమాని బిగ్ కమర్షియల్స్ బాగా రిచ్ గా చూపిస్తూంటే, చవకబారు  అనుకరణలు ప్రేక్షకులకి దేనికి? బడ్జెట్ మూవీస్ కి దాని కథే వ్యక్తిత్వాన్నిస్తుంది. కథని నమ్ముకున్న బడ్జెట్ మూవీ చెడిపోలేదు. కాకపోతే ఏడాదంతా ‘క్షణం’ అనీ,  ‘పెళ్లిచూపులు’ అనీ రెండో మూడో వస్తాయి. చిన్న సినిమాకి కథే  బలం అంటూంటారు. దీన్ని ఇంకాస్త విడమర్చి చెప్పుకుంటే, చిన్న సినిమాకి ‘కథలో పుట్టే సమస్య-
ఆ సమస్యని పట్టుకుని నటీనటుల నటన’ ఇవే బలం. ఇది మొదటి సూత్రం. 

          బడ్జెట్ మూవీని టెంప్లెట్ లో కథ నవ్వులపాలు చేస్తుంది. అదే స్ట్రక్చర్ లో కథ ప్రేక్షకులని కట్టి పడేస్తుంది. ఒక బిగినింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ వున్న కథ సాలిడ్ గా వుంటుంది.  60 – 70 సీన్లకి మించకుండా వుంటే పకడ్బందీగా వుంటుంది. ఒక్కో సీను రెండు మూడు పేజీలకి మించకుండా వుంటే కథ వేగం పెరుగుతుంది. వేగం పెరిగినప్పుడు బోరు తొలగి ప్రేక్షకుల ఇన్వాల్వ్ మెంట్ పెరుగుతుంది. ముఖ్య పాత్రలు కూడా నాల్గుకి మించకుండా వుంటే డ్రామా పదునెక్కుతుంది. మైనర్ పాత్రలతో సబ్ ప్లాట్స్ మూడుకి మించకూడదు. ముఖ్య పాత్రలతో కామెడీ సీన్లయినా ఆచితూచి పొదుపుగా డైలాగులు వాడాలి. స్క్రిప్టంతా డైలాగులతో నిండిపోయి వుండకూడదు. ఎడిటింగ్, డబ్బింగ్, ఆర్ ఆర్ బిల్లులు వాచిపోతాయి. అంతే కాదు, దీనివల్ల సెట్ లో ఒక్కోసీను ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది. బాల నటులు, ఒకసీను నటులూ లేకుండా కూడా చూసుకోవాలి. బంధు మిత్రులకి అస్సలు వేషాలివ్వకూడదు. నిర్మాత అస్సలు నటించకూడదు. జంతువులకి కూడా స్క్రిప్టులో స్థానం కల్పించకూడదు. క్రౌడ్ సీన్లు అస్సలు రాయకూడదు. సెక్స్ సీన్లూ, ఎక్స్ పోజింగులూ, డబుల్ మీనింగులు,  ఐటెం సాంగులూ పెట్టకూడదు. బడ్జెట్ మూవీ ఎంత క్లీన్ గా వుంటే అంత వ్యక్తిత్వంతో అన్నివర్గాలనీ ఆకట్టుకుంటుంది. లేకపోతే ‘బి’ గ్రేడ్ కి దిగజారి నష్టపోతుంది. ఒకప్పుడు ‘ఏ’ సర్టిఫికేట్ తో ‘బి’ గ్రేడ్ ‘సి’ గ్రేడ్ సినిమాలు కూడా ఆడేవి. ఇప్పుడా కంటెంట్ ని పోర్న్ సైట్స్ లో  ఇంకాబాగా చూసేస్తున్నప్పుడు బడ్జెట్ మూవీస్ లో చొరబెట్టడం అమాయకత్వమే.  

          బడ్జెట్ మూవీస్ కి మూస కథలని బిగ్ కమర్షియల్స్ సొంతం చేసుకున్నాయి. బడ్జెట్ మూవీస్ కి సెక్స్ కంటెంట్ ని పోర్న్ సైట్స్ హైజాక్ చేశాయి. ఇక బడ్జెట్ మూవీస్ కి మిగిలింది మానమర్యాదలతో కూడిన క్వాలిటీ కంటెంటే. 

          మూడు లైన్లకి మించకుండా ఒక్కో డైలాగు, సీనులో మూడుకి మించకుండా పాత్రలు, మూడు పేజీలకి మించకుండా సీను- ప్లాన్ చేసుకుంటే కథ క్వాలిటీ పెరగడమే గాక, చాలా సొమ్ములు ఆదా అవుతాయి. 

          ‘శాతకర్ణి’, ‘బాజీరావ్ మస్తానీ’ బిగ్ కమర్షియల్స్ అని తెలిసిందే. ఇవి సైతం రెండు మూడు పాత్రల మధ్య పుట్టే బలమైన డ్రామా మీదే ఆధారపడ్డాన్ని గమనించ వచ్చు.  ‘శాతకర్ణి’ లో బాలకృష్ణ- శ్రియల మధ్య; ‘బాజీరావ్ మస్తానీ’ లో రణవీర్ సింగ్- ప్రియాంకా చోప్రా – దీపికా పడుకొనెల మధ్య బలమైన డ్రామా కేంద్రంగా ఇవి వుంటాయి. ఇంత భారీ సినిమాలై వుండి కూడా, ఎన్నో ఇతర పాత్రలుండీ కూడా,  ఈ రెండు మూడు పాత్రల మధ్య డ్రామా మీదే ఆధారపడి నిర్మాణం జరుపుకున్నాయంటే, బడ్జెట్ మూవీస్ కి ఎందుకు సాధ్యంకాదు?  ఈ రెండు బిగ్ కమర్షియల్స్ లో వున్న రోమాంటిక్ డ్రామాలు కట్టి పడేసే విధం చూస్తూంటే- తెలుగులో ఇలాంటి బలమైన రోమాంటిక్ డ్రామాల్ని బడ్జెట్ మూవీస్ గా తీస్తే ఈ రోజుల్లో కూడా ఎందుకు ఆడవనిపిస్తుంది. బడ్జెట్ మూవీస్ కి కావాల్సింది తక్కువ పాత్రలతో బలమైన డ్రామా సృష్టించడమొక్కటే. ఈ డ్రామా ప్రేమ కావొచ్చు, కామెడీ కావొచ్చు, యాక్షన్ కావొచ్చు, ఇంకే జానరైనా కావొచ్చు. 

పాత్ర చిత్రణలు
          బలమైన డ్రామాకి పాత్ర చిత్రణలే  ముఖ్యం. ప్లాస్టిక్ పాత్రలు మొదటి పావుగంట ఇరవై నిమిషాల్లోనే బడ్జెట్ మూవీలో విషయం లేదని తేల్చేస్తాయి. బిగ్ కమర్షియల్స్ లో పెద్ద హీరోల పాత్రల రూపురేఖల్లో బడ్జెట్ మూవీ పాత్రల్ని సృష్టించకూడదు. పాత్రలు నిజజీవితంలో మనుషులకి ఎంత దగ్గరగా అనిపిస్తే అంత  క్లిక్ అవుతాయి. అవి సహజంగా మాట్లాడితే ఇంకా బాగా క్లిక్ అవుతాయి. ‘పెళ్లి చూపులు’ విజయరహస్యమిదే. మాస్ కూడా తమలాగే మాట్లాడుతున్న ఆ పాత్రల్ని చూసి కనెక్ట్ అయ్యారు. 1989 లో ‘శివ’ బడ్జెట్ మూవీ కానప్పటికీ దానిలోని సహజ పాత్రలతో, సహజ సంభాషణలతో ఇలాగే  కనెక్ట్ అయ్యారు అన్ని వర్గాల ప్రేక్షకులూ.    

 డిఫరెంటే  హిట్!     
          బడ్జెట్ మూవీస్ డిఫరెంట్ గా వుండే కథలతోనే హిట్టవుతున్నాయి.  గతంలోకి వెళ్తే,  బడ్జెట్ మూవీస్ మూస కథలతో ఒక్కటీ హిట్ కాలేదు. కారణం మూసకథలకి బిగ్ కమర్షియల్స్ తో రాజీపడ్డారు ప్రేక్షకులు. అక్కడ అంత ఆర్బాటంగా  మూస కథల్ని అందిస్తూంటే ఇక్కడ చిన్న సినిమాల్లో కొత్త మొహాలతో చీప్ నమూనాలు చూడ్డమెందుకు? 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే, బిగ్ కమర్షియల్స్ కి దూరంగా  డిఫరెంట్ గా వున్న బడ్జెట్ మూవీసే హిట్టయ్యాయి. చిత్రం, గమ్యం, వినాయకుడు, ఐతే, అనుకోకుండా ఒకరోజు, ఎ ఫిలిం బై అరవింద్, మంత్ర మొదలైనవి. అయితే ఈ పదిహేడేళ్ళ కాలంలో ఇవి ఓ పదిహేను కూడా లేకపోవడం వెనుకబాటు తనమే. 

          ఇక్కడ గమనార్హమేమిటంటే, ఇవి విడుదలైన సంవత్సరాల్లో ఇంకే మూస బడ్జెట్ మూవీ హిట్ కాలేదు. అన్నీ ఫ్లాప్సే. నువ్వే కావాలి, జయం, ఉయ్యాల జంపాల, హేపీడేస్, పెళ్లి చూపులు, క్షణం, ఈరోజుల్లో, స్వామి రారా  లాంటి కొన్ని మాత్రమే రెగ్యులర్ కథలతో బాగా తీసినవి హిట్టయ్యాయి. గత సంవత్సరం మొత్తం 117 బడ్జెట్ మూవీస్ లో క్షణం, పెళ్లి చూపులు రెండే హిట్టయ్యాయి. మిగతావి ఎందుకు హిట్ కావడం లేదంటే అవి పెద్ద సినిమాలకి మూస నకళ్ళు కావడం వల్ల. బడ్జెట్ మూవీ డిఫరెంట్ గా వుంటేనే మనుగడలో  వుంటుందని గ్రహించక పోవడం వల్ల. 2000 సంవత్సరం నుంచీ ఈ పరమ సత్యాన్ని గుర్తించక పోవడం వల్ల.  

          కనుక మూసకి  బడ్జెట్ మూవీస్ దూరంగా వుండాల్సిందే. అయితే వూహల్లోంచి కథల్ని సృష్టించబోతే చూసిన బిగ్ కమర్షియల్ సినిమాల్లోని మూసలే మెదులుతాయి. చుట్టూ ప్రపంచంలోకి చూస్తే మాత్రం కొత్త   కథలు పుడతాయి.  వివిధ టాపిక్స్ మీద ఎక్కువ ఆర్టికల్స్ చదవడం వల్ల  కూడా కొత్త పాయింట్లు దొరుకుతాయి. వీటిని బడ్జెట్ మూవీ పరిమితుల్లో సినిమాటిక్ గా మల్చుకోవచ్చు. కొత్త దనం కోసం ప్రయత్నిస్తే నిర్మాతలు దొరకరన్న అనుమానం అవసరం లేదు. ఆ కొత్త దనంలో కన్పించాల్సింది కాసుల గలగలలే. కొత్తదనమున్న  కథ చెప్తూంటే అందులో డబ్బులు కన్పిస్తూంటే వదులుకోవడాని ఏ నిర్మాతా ఇష్టపడరు. ఆ డబ్బులు కన్పించేలా కొత్తదనాన్ని తీర్చి దిద్దడానికే అసలు క్రియేటివిటీ అంతా వుపయోగించాలి. 

ఆ ఐదు ఎలిమెంట్స్
          డిఫరెంట్ గా వుంటూ  హిట్టయిన బడ్జెట్ మూవీస్ ని పరిశీలిస్తే, వాటిలో కామన్ గా ఈ ఐదు ఎలిమెంట్స్ కనిపిస్తాయి. 1. హీరోకి స్పష్టమైన లక్ష్యం వుండి  యాక్టివ్ పాత్ర అయివుండడం, 2. నేపధ్య వాతావరణం మిస్టీరియస్ గా వుండడం, 3. సబ్ ప్లాట్స్ లేకుండా ప్రధాన కథ మాత్రమే వుండడం, 4. ఏ జానర్ అయితే ఆ జానర్ మర్యాద కాపాడ్డం, 5. డైలాగులు రియలిస్టిక్ గా వుండడం. 

          ఈ ఐదు ఎలిమెంట్స్ ని కలిపి కథ అల్లితే డిఫరెంట్ గా వున్న బడ్జెట్ మూవీస్ హిట్టయ్యాయి. ఇక ఏ జానర్ కథలు తీసుకోవాలంటే, అప్పటి మార్కెట్లో అమ్ముడుబోయే  ఏ జానరైనా తీసుకోవచ్చు. ఏ జానర్ ని తీసుకున్నా ఆ జానర్ మర్యాదని కాపాడాలి. గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. చిన్న దైనా పెద్ద దైనా జానర్ మర్యాదని కాపాడిన సినిమాలనే హిట్ చేశారు (జానర్ మర్యాద గురించి ఇదే బ్లాగులో వ్యాసాలున్నాయి చదువుకోవచ్చు). కాబట్టి వొళ్ళు దగ్గర పెట్టుకుని జానర్ మర్యాదకి కట్టుబడాలి. నిర్మాత పైత్యమో, నిర్మాత బావమరిది పైత్యమో చొరబెడితే ఇంతే సంగతులు. వాళ్ళూ వుండరు, దర్శకుడూ వుండడు. ఇది గ్యారంటీ. 

          బడ్జెట్ మూవీకి కంటెంటే కీలకం. ఇంతే కీలకంగా  నటీనటుల నటన కూడా అవసరం. ‘
కథలో పుట్టే సమస్య- ఆ సమస్యని పట్టుకుని నటీనటుల నటన’  ఇదే బడ్జెట్ మూవీ బాక్సాఫీసు రహస్యం. కాబట్టి నటీనటుల్ని చూసి ఎంపిక చేసుకోవాలి. అన్ని సినిమాల్లో ఒకేలా నటించి, డైలాగులు చెప్పేసే నటీనటుల్ని నివారించాలి. పాత్రని అర్ధం జేసుకుని భిన్న పార్శ్వాలని ప్రదర్శించే రావురమేష్ లాంటి వాళ్ళు బడ్జెట్ మూవీస్ ని కాపాడగలరు తప్ప,  కృత్రిమ ఫార్ములా పాత్రలకి అలవాటు పడిన నటులు కాదు. 

          ఈ వ్యాసం ప్రారంభంలో స్క్రిప్టు పరమైన  సృజనాత్మకత గురించి ప్రస్తావించుకున్నాం. ‘శివ’ బడ్జెట్ మూవీ కాకపోయినా అదిప్పుడు బడ్జెట్ మూవీస్ కి ఒక భరోసా. దీని సార్వజనీన స్ట్రక్చర్ ని ఫాలో అయివుంటే ఎన్నో బిగ్ కమర్షియల్స్ ఫ్లాప్ అవకుండా వుండేవి. బిగ్ కమర్షియల్స్ దీన్ని వదిలేసినా బడ్జెట్ మూవీస్ దీంతో బాముకోవచ్చు. ‘శివ’  స్క్రీన్ ప్లే  ఆధారంగా ‘తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్’  శీర్షికన ఈ బ్లాగులోనే రాసిన పదిహేడు వ్యాసాలూ ఒకసారి చదువుకుంటే,  బడ్జెట్ మూవీస్ కి పకడ్బందీ స్క్రీన్ ప్లే, పాత్రచిత్రణలూ సమూలంగా తెలుస్తాయి.  

          ఇక ప్రొడక్షన్ పరంగా బడ్జెట్ మూవీ సృజనాత్మకత ఏమిటో వచ్చే వ్యాసంలో చూద్దాం.


-సికిందర్