రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, సెప్టెంబర్ 2015, గురువారం

నాటి సినిమా!ఎందరో దేవదాసులు- ఒక్కరే అక్కినేని నాగేశ్వర రావు. ఒక పురాతన
నవలా పాత్ర తరానికి నాల్గేసి సార్లు భిన్న రూపాల్లో వెండి తెరల కెక్కెతూ,
జన హృదయాల్ని దోచుకోవడం ఒక్క ‘దేవదాసు’ విషయంలోనే జరిగింది.
ఆ భిన్నరూపాలన్నీ ఒక్క అక్కినేనికే ఉపగ్రహాలయ్యాయని
ప్రపంచమే ఆయనకి  మోకరిల్లింది..


          క్కినేని నాటికి శరత్ బాబు జీవించి వుంటే, తన దేవదాసుకి అక్కినేని అభివ్యక్తికి సంభ్రమాశ్చర్యాలకి లోనై  నవలని పదేపదే తిరగరాసుకుందుకు విఫలయత్నాలు చేసి వుండేవాడేమో. పాత్రని సృష్టించిన తనకే అందని ఉన్నత శిఖరాలకి చేర్చిన అక్కినేని  అభినయ కౌశలానికి అస్త్ర సన్యాసం కూడా చేసి వుండే వాడేమో. నటన వచ్చేసి ఇలా సాహిత్యాన్ని శాసిస్తే ఆ నటనకే ఎనలేని గౌరవం. ఇందుకే దేవదాసు పాత్ర పోషణ మీద గుత్తాధి పత్యాన్నంతా ఒక్క మహానటుడు అక్కినేనికే కట్ట బెట్టేసి, జేజేలు పలుకుతోంది క్లాస్ మాస్ ప్రేక్షక లోకమంతా ఒక్కటై.

          ఒక నడిచే నరకం దేవదాసు. కొన్ని నగ్న సత్యాల్ని తెలుసుకోవాలంటే ఇలా జీవితాన్ని కాల్చుకోవాలేమో. నాటి మూకీల నుంచీ నేటి డీటీఎస్ ల దాకా, నాటి రేకుల టూరింగ్ టాకీసుల నుంచీ  నేటి ఏసీ మల్టీప్లెక్సుల దాకా, అన్ని పరిణామ దశల్లోనూ క్రమం తప్పకుండా వివిధ భాషల రీమేక్స్ ల రూపం లో ఉంటూ, ప్రచండ దేవదాసు వేస్తున్న దండోరా ఒక్కటే- పారాహుషార్ అంటూ ఒక్కో తరంలో ప్రేమించే హృదయాలకీ తస్మాత్ జాగ్రత్త చెబుతూ వస్తున్న దొక్కటే-  అది ఇప్పటి తరాని కొచ్చి - భగ్న ప్రేమంటే యాసిడ్ దాడి కాదురా బేవకూఫ్- నీ మందు సీసా! తను కాదన్నదని  పొడవడం కాదురా- నువ్వు చావడం! నరకమంతా నువ్వనుభవించడం- నీ స్వయంకృతం కదా!- అంటూ. 
ఇలా ముందింకెన్నో తరాలకీ కాలాన్ని బట్టి దండోరా వేస్తూనే ఉంటాడు దేవదాసు-  ది పాషనేట్ లవర్.

         
        జగమే మాయ బ్రతుకే మాయా - అన్నాడు...కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ - అని కూడా అన్నాడు దేవదాసు- ఇలా తెలుగు అక్కినేని దేవదాసు ఆధునిక యోగి వేమన అనడానికి ఇక సందేహించ నక్కర్లేదు. లేకపోతే తెలుగులో దీనికి సాటి రాగల తత్త్వాలు ఇంకే రీమేక్ లో పాడుకున్నాడు గనుక దేవదాసు. వేమన వైరాగ్యం వేరు- అతను  వ్యవస్థ బాధితుడు కాదు. దేవదాసుది వ్యవస్థ తెచ్చి నెత్తినేసిన వైరాగ్యం. తన ప్రేమకి సాంఘిక కట్టుబాట్లు అడ్డు గోడలైనప్పుడు, వాటిని ఎదుర్కోలేని బాధితు డతను. 1900 నాటి సాంఘిక వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది. కుల మత ప్రాంతీయ తత్వాలు, ధనిక పేద వర్గ విభేదాలూ ఇవన్నీ ఈ ప్రపంచమున్నంత కాలమూ ఎక్కడికీ పోవు. వీటిని ఆసరాగా చేసుకుని ఏదో ఒక రూపంలో ఆనర్ కిల్లింగ్స్ అంటూ ఒక తంతు యదేచ్ఛగా జరిగిపోతూ వుంటుంది. ఓ జంటని వెలివేయడం కూడా ఒకరకమైన ఆనర్ కిల్లింగే. అంతస్తుల తేడాలు చూపించి దేవదాసు తండ్రి చేసిందీ ఇలాటి ఆనర్ కిల్లింగే. కాకపోతే పెళ్ళే  చేసుకోకుండా చాలా అన్యాయంగా ఆ ఆనర్ కిల్లింగ్ కి బలయ్యాడు దేవదాసు. అమానుషమైనది. గుండెల్ని పిండేసే పెను విషాదమిది. ఇంత విషాదాన్ని భరించినందుకే అన్నికాలాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని వర్గాల్లో అంత ఆరాధ్యుడయ్యాడు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో సైతం రీమేక్స్ జరుపుకుని నివాళు లందుకున్నాడు.


        ఇలా ఒక విషాద గాథ చరిత్రయ్యింది. తెలుగులో కళా ఖండమయ్యింది. 1953 లో వినోదా సంస్థ నిర్మించింది. దేవదాసు తండ్రి హోదా కారణంగా ప్రేమించిన పార్వతికి దూరమై తాగుడు మరిగాడు. ముసలి జమీందారుని కట్టుకున్న పార్వతి వాడి గంపెడు సంతానంతో సతమత మవుతూ వుంది. దేవదాసు విషాదాన్ని తెలుసుకున్న పట్నపు చంద్రముఖి వేశ్యావృత్తి మానేసి అతడి సేవలో తరించింది. చెడ తాగుడు దేవదాసు ఆరోగ్యాన్ని తినేసి, పార్వతికిచ్చిన మాట ప్రకారం ఆఖరి ఘడియల్లో ఆమె వూరికి చేరుకున్నాడు. దిక్కు లేని శవంగా అతనక్కడ పడుంటే, చూద్దామని రివ్వుమని  పరిగెత్తుకొచ్చిన పార్వతి- ధడాలున మూసుకున్న జమీందారీ తలుపులు తగిలి పడిపోయింది. దేవదాసు కట్టె  చితిమంటలకి ఆహుతైపోయింది.


          చావెదురైనా మూఢాచారాలు మనిషి పట్ల ఎలాటి దయనూ  చూపనే చూపవని చెప్పే ఈ కథలో, దేవదాసు తండ్రిగా ఎస్వీ రంగారావు, మిత్రుడు భగవాన్ గా పేకేటి శివరాం కన్పిస్తారు. పార్వతిగా సావిత్రి, ఆమె తండ్రిగా దొరస్వామి, భర్తగా సీఎస్ఆర్ ఆంజనేయులూ కన్పిస్తారు. చంద్రముఖిగా లలిత నటించింది. మరణమో రామచంద్రా అంటూ ప్రవాహంలో కొట్టుకు పోవడమే తప్ప, ఒక్క  చిన్న గడ్డి పోచ పట్టుకోవాలన్న సంఘర్షణ జోలికే వెళ్ళని పాత్ర ప్రయాణంలో, అక్కినేని జీవం- ప్రాణం -లాంటి అశాశ్వత అంశాలు కాదు- శాశ్వతంగా నిలిచిపోయే ఆత్మనే పట్టి పోశారు. 


          సాత్వికాభినయానికి పెద్ద పీట వేశారు. అన్ని అభినయాల్లోనూ సాత్వికాభినయం ఉత్కృష్టమైనదని అంటారు. అదే సమయంలో కష్టసాధ్యమైనదని కూడా అంటారు. నటుడి మొహంలో హావభావాలే పలక్క పోతే ఏ మేకప్ మ్యానూ, ఇంకే ఛాయాగ్రాహకుడూ ఏమీ చేయలేరు. హావభావాల తో సాత్వికాభినయాన్ని వర్కౌట్ చేయాలంటే ముందు నటుడు మానసికంగా నిర్మలంగా వుండాలి. మామూలుగానే ఇది కష్టం. కరుణ రసంతో మరీ కష్టం. ముందుగా శుష్కించి పోయిన మొహం ఎఫెక్టు రాబట్టేందుకు, అక్కినేని ఏ డైటింగూ చేసి ఫిజిక్ ని చెడగొట్టుకోలేదు, అమెరికాలో ఏ లిపో సక్షన్ సర్జరీనో  చేయించుకుని, బక్కచిక్కి గ్లామర్ తగ్గిపోయి  రాలేదు. కేవంలం ఎన్నో నిద్రలేని రాత్రులు మాత్రమే గడిపి ఆ ఫలితాలు సాధించారు.  ‘జగమే మాయ’ పాట ఎఫెక్టు కోసం ఘంటసాల ఏకంగా 41 రోజులు ఉపవాసాలుండి నీరసించారు. అలాంటి ఘంటసాల విషాద గాత్ర విన్యాసానికి అతికిపోవాలంటే అక్కినేని ఎంత అతలాకుతలమైపోయి ఉంటారో ఊహించుకోవాల్సిందే. ఆ ఘంటసాల గాత్ర విన్యాసమూ, అక్కినేని భావప్రకటన సామర్ధ్యమూ చరిత్ర పుటల్లో నిల్చి పోయిన  విశేషాలు. తాగబోతుగా పలికించిన బాధతో కూడిన ప్రతి ఒక్క భావమూ ఆ నిర్మల స్థిరచిత్తంలోంచి  పెల్లుబికినవే. నటుల ప్రతిభకి సాత్వికాభినయమే గీటు రాయైతే, దేవదాసు పాత్రభినయంతో అక్కినేని నూటికి నూరు పాళ్ళూ మించిపోయి తానే ఒక గీటురాయి అయ్యారు. సాత్వికాభినయానికి పర్యాయ పదమయ్యారు. అందుకని దేవదాసూ అక్కినేనీ - ఒకే ఆత్మ రెండు శరీరాలు!


       దేవదాసు పాత్రలో జాలువారే కరుణరసం విజువల్. పైకి కన్పించిపోతుంది. సావిత్రి నటించిన పార్వతి పాత్రది సబ్ టెక్స్టు- అంటే ప్రేక్షకుల ఊహకి వదిలేసిన అమూర్త అంతర్మధనం. మౌన విలాపం. ముఖ కవళికలతోనే ప్రతిభావంతంగా దీన్ని పోషించారామె.
          ఇదే, ఇలాటి పరస్పర వైరుధ్యాలే కథకి వెన్నెముక అనదగిన ఈ సినిమా కథనానికి బలాన్ని చేకూర్చి పెట్టాయి. పైన చెప్పుకున్న దేవదాసు, పార్వతిల విజువల్ - నాన్ విజువల్ రస పోషణలతో బాటు; దేవదాసు, భగవాన్ పాత్రల పరస్పర విరుద్ధ దృక్పథాలు, దేవదాసుకి సేవకురాలిగా మిగిలిపోవాలన్న పార్వతి కోరిక తీరకుండా, ఆ భాగ్యానికి చంద్రముఖి నోచుకునే యాంటీ ప్లే.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైనమిక్స్. 

          పోతే, నిండు చంద్రుడికి మచ్చే తప్పనట్టు, నిఖిల ప్రేమాస్పదుడు దేవదాసూ కొన్ని నఖక్షతాల్ని మోస్తున్నాడు. దేవదాసు పిరికివాడని ముందే చెప్పేస్తే సరిపోయేది. బాల్యంలో ఏమాత్రం తండ్రి భయం లేని, చదువంటే కూడా ఏమీ పట్టని ఆకతాయిగా, చదువు చెప్పే పంతుల్ని ఏడ్పించే ఘటంగా, సాంప్రదాయాల వ్యతిరేకిగా చూపించుకొస్తూ, తీరా పార్వతిని చేపట్టాల్సి వచ్చేసరికి ఉత్త పిరికివాడిలా చిత్రించారు. అలాటి అతడి బాల్యపు ధిక్కార పార్టు అదే పళానా యవ్వనపు చాప్టర్లోకి బదలాయింపు కాకపోవడం వల్లే ఇలా జరిగింది. అసలు పాత్ర చిత్రణల్లో పార్వతీ దేవదాసుల బాల్యమే ఘోరంగా విఫలమయిందని ఎంవీ రమణారెడ్డి తను రాసిన పుస్తకంలో పేర్కొన్నారు.          ఇదలా ఉంచితే, ఆపదలో ఉన్న పార్వతి అర్ధరాత్రి పూట దేవదాసుని ఆశ్రయించి పెళ్ళడిగితే, దేవదాసు కంగారు పడిపోవడం, ఇంట్లో అడిగి చెప్తాననడం, ఇంకేవేవో పిరికి చేష్టలకి పోవడం, సరీగ్గా కథకి ఉద్దేశించిన పిరికి పాత్రనే తయారు చేశాయా- బాల్యం సంగతి పక్కన పెడితే?
          

           13 వ శతాబ్దపు సూఫీ మహాకవి, మేధావి జలాలుద్దీన్ రూమీ అన్నట్టు- ‘ప్రేమని పొందడం నీ కర్తవ్యం కాకూడదు, కేవలం ఆ ప్రేమకి వ్యతిరేకంగా నీకై నీవు కల్పించుకున్న మానసిక నిషేధాల్ని తెలుసుకోగలగడమే నీ కర్తవ్యం  కాగలగాలి- అన్నది దేవదాసుకి సరిగ్గానే సరిపోతుంది. ఇదొక్కటి చాలు తను పలాయనం చిత్తగించడానికి బహానాగా. అతడి మానసిక నిషేధం తండ్రే అయినప్పుడు ఈ ఒక్క స్పష్టతతో, ఆ ఒక్క కారణంతో వుంటే చాలు. తండ్రి నడిగి చెప్తానని చెప్పేసి- ఆ తండ్రితో చివాట్లు తిని, మళ్ళీ పార్వతికి కనపడకుండా పారిపోతే సరిపోతుంది. సమయం మించిపోయినప్పుడే పార్వతి కోసం తిరిగి వచ్చి, ఆమె పరాధీన అయిపోయిందని తెలుసుకుంటే చాలు. 


       ఇలా కాకుండా ఆలోచిస్తాననడం, ఎటూ తేల్చుకోలేక ఇంట్లో అడిగి చెప్తాననడం, తండ్రి నడిగి భంగపడి అప్పుడు పారిపోవడం, తననిక మర్చిపొమ్మని పార్వతికి లేఖ రాయడం, మిత్రుడు భగవాన్ కోప్పడితే మళ్ళీ పార్వతి కోసం రావడం, అప్పటికి సమయం మించిపోవడం...ఇదంతా పాత్రని మరీ పలచన చేసే డొంక తిరుగుడే అయింది. 

          ఎక్కడైతే కథనంలో లోపాలతో దొరికిపోతామని అన్పిస్తుందో- అక్కడే తెలివిగా ఏదో గిమ్మిక్కు చేసైనా తప్పించుకో గల్గాలి. ఇక్కడ ఇది జరగలేదు. నవల రాయడం ఒక్కోసారి ఎలా వుంటుందంటే-  దృశ్యాల్లో ఆ రాస్తున్న వాక్యాల్ని  విజువలైజ్ చేసి చూసుకుంటూ రాసుకుంటూ వెళ్ళకపోతే, దృశ్యాలు అసహజంగా తయారయ్యే ప్రమాదముంది. సినిమా దర్శకులు రచయిత చెప్తున్నదంతా విజువలైజ్ చేసుకుంటూ వింటూంటారు. విజువల్ గా సీను బావుండకపోతే వినడం ఆపేస్తారు. శరత్ బాబు ఈ సీన్ని ఇలాగే రాసేసి వుంటారు. దీన్నే కళ్ళకద్దుకుని పదేపదే రీమేక్ చేస్తూపోయారు. దేవదాసు కమర్షియల్ పాత్ర రూపంలో వున్న ఆర్టు సినిమా
( పాసివ్ )  పాత్ర మాత్రమే. ఇందులో తప్పు లేదు, ఇది ట్రాజడీ కాబట్టి. అయినంత మాత్రాన పాసివ్ పాత్ర నడకలో కూడా కథకుడు జోక్యం చేసుకోకూడదు. వేదాంతం రాఘవయ్య 
       పాత్రకి ఇలాటి నఖ క్షతాలతో వేదాంతం రాఘవయ్య  ( 1919-71) దర్శకత్వం సాగుతుంది. అయితే కూచిపూడి నర్తకుడూ, డాన్స్ మాస్టారూ కూడా అయిన రాఘవయ్య దర్శకత్వ ప్రతిభకి ఒక్క పార్వతిని దేవదాసు కొట్టే దృశ్యం చాలు. పార్వతి అన్న ఓ మాటకి దేవదాసు చిరుకోపంతో, అసంకల్పితంగా చిన్న కట్టె పుల్లతో చటుక్కున కొట్టేస్తాడు. అంతసేపూ చేతిలో కన్పించని ఆ కట్టెపుల్ల అకస్మాత్తుగా ఫ్రేము లోకొచ్చి, అంతపనీ చేసి పోతుంది- ప్రేక్షకుల మీద దీని షాక్ వేల్యూ అమోఘం!

          2002 సెప్టెంబర్ లో హైదరాబాద్ ఫిలిం క్లబ్ వారు నిర్వహించిన ‘దేవదాసు’ చలన చిత్రోత్సవంలో, 1935 నుంచీ  2002 దాకా వివిధ భాషల్లో తీసిన ‘దేవదాసు’ మొత్తం 12 రీమేకుల్ని ప్రదర్శించారు. వీటిలో ప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ హిందీలో దిలీప్ కుమార్ తో తీసిన ‘దేవదాసు’ లో,  పైన చెప్పుకున్న సీను వచ్చేసరికి- దిలీప్ కుమార్ ఇంతలావు కర్రుచ్చుకుని, ఫటేల్మని తనివితీరా వైజయంతీమాల మాడు పగలగొట్టేసి, టపటపా రెండుసార్లు దాంతో తొడమీద కొట్టుకుని, వీరోచితంగా రెండు ముక్కలుగా విరిచేసి అవతల పారేస్తాడు.  నవ్వొచ్చే ఓవర్ డ్రామా! ప్రేమిస్తున్నాడా, ప్రేమించిందని  ఇరగదీస్తున్నాడా? శరత్ బాబు ఏమైపోవాలో!బి ఎస్ రంగా 
         2002 లో మరో సుప్రసిద్ధ దర్శకుడు శక్తి సామంతా తీసిన బెంగాలీ ‘దేవదాసు’లో ప్రసేన్ జిత్ సేన్, అర్పితాపల్ ని కొట్టాలా వద్దా అని ముందూ వెనకలాడుతూ, ఎలాగో స్టామినా కూడదీసుకుని, కర్రెట్టి ఘోరంగా చావబాదేసి-  హమ్మయ్యా ఓపనై పోయింది అన్నట్టు చూస్తాడు. రేపు పెళ్లి చేసుకుంటే పరిస్థితి ఇదేనేమో! శరత్ కి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు. 

          ఇదంతా చాలా న్యూసెన్స్ రాఘవయ్య ప్రతిభ ముందు. 


          అలాగే తెలుగు ‘దేవదాసు’ లో తెలుగుదనం లేదనే వాళ్ళు ఇంకోటి తెలుసుకోవాలి. కేదార్ శర్మ డైలాగులు రాసిన, సైగల్ నటించిన- ‘దేవదాసు’
( 1936)  సినిమా సాంతం ఉర్దూ భాషలో ఏ మొఘలే ఆజమో  చూస్తున్నట్టు వుంటుంది. ఆఖరికి దేవదాసు పార్వతికి రాసే లేఖ కూడా ఉర్దూలోనే వుంటుంది.సి ఆర్ సుబ్బరామన్ 
       తెరవెనుక రాఘవయ్యతో బాటు వున్న సంగీత దర్శకుడు సీఆర్ సుబ్బరామన్ గురించి ఇంకా చెప్పేదేముంది. ఆయనిచ్చి పోయిన పాటల బొచ్చె, లోకంలో ప్రేమ బిచ్చగాళ్ళు వున్నంత కాలమూ వుంటుంది. ఇంతకంటే ఆయన వేసే భిక్ష ఇంకేం కావాలి? అలాగే బీఎస్ రంగా ఛాయాగ్రహణం. ఇక మాటలు, పాటలు రాసిన సముద్రాల రాఘవాచార్య సరేసరి. 

          మరోసారి రూమీని ఉటంకించుకుంటే
- ‘ధాతువుగా నశించి మొక్కనై పుట్టా, మొక్కనై గిట్టి జంతువై జనించా, జంతువుగా చాలించి మనిషినై అవతరించా. నాకెందుకూ మరణమంటే భయం? మరణం తో నేనేమీ నిమ్నస్థాయికి చేరుకోవడం లేదే?’          ఎస్, మరణాన్ని కోరి నిమ్నుడవలేదు దేవదాసు, అమరుడయ్యాడు.
          అక్కినేని అతడికి దేవుడి పటాన్నిచ్చారు.సికిందర్
(ఆగస్టు 2009, సాక్షి -‘ఆ ఒక్క సినిమా’ శీర్షిక)